ఆదాము హవ్వలు దేవుని స్వరూపంలో లేదా దేవుని పోలికలో సృష్టించబడ్డారని బైబులు చెప్తూవుంది. అసలు దేవుని పోలిక అంటే? ఏ పోలికలో ఆదాము హవ్వలు సృష్టింపబడియున్నారు వాళ్ళు దానిని ఎలా పోగొట్టుకొని యున్నారు?
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అను ఆదికాండము 1:1 దేవుని గురించి ఏయే విషయాలు చెప్తూవుందో ఆలోచించండి. 1. ఆదిలో దేవుడు మాత్రమే ఉన్నాడని, (ఆయన ప్రమాదవశాత్తు ఉద్భవించిన వాడు కాడని; ఆయన ఉనికికి మూలము లేదని; ఆయన స్వయం అస్తిత్వం ఉన్నవాడని; ఆయన సంపూర్ణ స్వయం సమృద్ధి గలవాడని; సంపూర్ణ స్థిరత్వం ఉన్నవాడని; ఆయనకి జీవనోపాధి అవసరం లేదని; ఆయన అదృశ్యుడని); 2. ఆయన పులింగమని త్రిత్వమని, ఇక్కడ దేవుడు అనే మాటకు, హీబ్రూ బైబిలులో ఎలోహిం అనే పదం వాడ బడింది. అది దేవుడు అనే మాట బహువచనమని, పులింగమని తెలియజేస్తూ ఆయన అవిభాజ్యుడని చెప్తూవుంది; 3. ఆయన సర్వశక్తిమంతుడని, (ఒక ప్రదేశానికే పరిమితం కాకుండా ప్రతి ప్రదేశంలో ప్రత్యక్షంగా వున్నవాడని; ఆయన అనంతుడని; ఆయన ఏ రూపాన్ని అయినా తీసుకో గలడని; ఆయన నిత్యుడని; ఆయనను సమయం లేదా స్థలం బంధించ లేదని; ఆయనను కొలవలేమని; ఆయన సద్గుణాలలో, సమర్థతలో, దృష్టి జ్ఞానంలో మరియు శక్తిలో మాత్రమే కాకుండా, ఆయన తన భగవద్ద్దతమైన అంతస్త త్త్వములో మరియు వ్యక్తిగత స్వభావములో కూడా అనంతము; అపారము; మరియు పరిపూర్ణుడై యున్నాడని); 4. శూన్యము నుండి ఇప్పుడు మనం చూస్తున్న సమస్తమును ఆయన సృజించియున్నాడని, (ఆయన సృష్టికర్తయై యున్నాడని); 5. ఆయన సృజించిన వాటిలో ఉన్న వాటి సంక్లిష్టతను బట్టి ఆయన మహాజ్ఞానుడని; 6. ఆయన జీవమునకు మూలమని చెప్తూవుంది; దేవుని ఈ గుణగణాలను బట్టి ఆయన అసాధారణమైనవాడు అని అర్ధమవుతూవుంది. అసాధారణమైన ఆ దేవుని రూపమేలా ఉంటుంది అనే ప్రశ్న మనకు సహజముగా రావొచ్చు. దీనికి జవాబు, యోహాను 4:24 చెప్తూ, దేవుడు ఆత్మయై యున్నాడని తెలియజేస్తూవుంది. అంటే భగవంతునికి శరీరం లేదని ఆయన పదార్థంకాడని; పదార్ధ సమ్మిళితమైన వాడు కాడని; భాగాలతో కూడుకొన్నవాడు కాడని; ఈ విషయాన్నేయిర్మీయా 23:24 చెప్తూ, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా– నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు అని తెలియజేస్తూవుంది.
యోబు 12:13 జ్ఞానశౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు అని చెప్తూ ఉంది. లేఖనాలు ముఖ్యంగా దేవుని జ్ఞానాన్ని a) ప్రకృతి ప్రభావితరంగానికి (సృష్టి మరియు సంరక్షణకు) ఆపాదిస్తున్నాయి. కీర్తన 104:24 యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది. b) కృప ప్రభావితరంగానికి ఆపాదిస్తున్నాయి. 1 కొరింథీ 2:6-9 పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించు చున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండిన యెడల మహిమాస్వరూపి యగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మన కున్నపరిమితిలో, పరిమిత జ్ఞానములో, అపరిమితమైన దేవుని స్వభావాన్ని అర్ధంచేసుకోవడం అంటే నదిలో నీటిలో కొట్టుకుపోతూ ఉన్నపుడు నీటిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలాంటిది.
ఆదికాండము 1: 26-27, దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము అని పలికి తన స్వరూపమందు నరుని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని చెప్తూవున్నాయి.
ఆదికాండము 2:7 “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను” అని చెప్తూవుంది. అంటే మానవునికి అతని శరీరంతో పాటు రెండవ భాగం ఉందని ఈ మాటలు సూచిస్తూ వున్నాయి. అదే మనిషి యొక్క ఆత్మ. ఆ ఆత్మే మనకు స్వీయ స్పృహను, ఇతర విశేషమైన లక్షణాలను ఇస్తూ ఉంది. ఈ విషయాన్నే యోబు 32:8 తెలియజేస్తూ, అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును అని చెప్తూవుంది. ఈ మాటలు, దేవుడు తన భగవద్ద్దతమైన పదార్ధములో తన స్వంత స్వభావంను బట్టి జీవమైయున్నాడని, జీవమును కలిగియున్నాడని తెలియజేస్తూవున్నాయి.
మానవ ఆత్మలో తెలివి, భావోద్వేగాలు, భయాలు, అభిరుచులు మరియు సృజనాత్మకత కలసి ఉన్నాయి. ఈ ఆత్మే మనకు ప్రత్యేకముగా అవగాహన మరియు అర్థం చేసుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని ఇస్తూ ఉంది. దేవుడు మనిషికి ఏ జంతువుకు లేనట్టి గొప్ప మేధోసామర్థ్యాలను ఇచ్చాడు. ఆదికాండము 2:19,20, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతనియొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరుపెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్తపశువులకును ఆకాశపక్షులకును సమస్తభూజంతువులకును పేరులుపెట్టెను. అయినను ఆదాము నకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. ఇక్కడ, దేవుడు ఆదాముకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఆదాము దేవునిమాటలను విని, గుర్తించి, అర్థంచేసుకొని తిరిగి జవాబు చెప్పడం అనేది భాషను గురించి తెలియజేస్తూవుంది తప్ప సంజ్జ్యలు తరువాత గురుతుల ద్వారా పరిణామములోనికి వచ్చిన భాషను గురించి ఇది చెప్పటం లేదు. ఎక్సర్సైజ్ అనేది (నామ వాచకం)_ నిర్దిష్టప్రయోజనం కోసమైన మెంటల్ ఎక్సర్సైజ్; నైపుణ్యాన్ని ప్రాక్టీస్ చేయడానికి లేదా పరీక్షించడానికి ఇవ్వబడిన టాస్క్. (నైపుణ్యాన్ని ప్రదర్శించే రోజు). నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడం; (క్రియ)_ సామర్ధ్యాలను తగిన రీతిగా ఉపయోగించడం లేదా వర్తింపజేయటం, విభిన్నమైన ఆలోచనలతో ఆలోచించటం గురించి తెలియజేస్తూ ఉంది.
దేవుడు ఆదాముకు తన సామర్థ్యాలను బయటపెట్టడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆదాముకు స్వేచ్ఛ ఇవ్వబడింది. అతడు పేరులు పెట్టాడు. ఈ అభ్యాసములో అతడు జంతువుల రకాలను చూశాడు మరియు గుర్తించాడు. వాటిని తరగతి వారిగా గుర్తుంచుకున్నాడు. వాటిని తరగతులుగా సహచరులుగా విభజించాడు. ప్రతి దానికి తగిన పేరు పెట్టాడు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అతడు తన పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. కాబట్టి జ్ఞానం అనేది లక్షణము యొక్క శ్రేణి లేదా దశ కాదు కాని అది దేవుని బహుమానమై యున్నది. అందువల్లే, మనిషి ఆలోచించగల, ఆస్వాదించగల, ప్రేమించగల, రూపకల్పన చేయగల, సృజించగల సామర్ధ్యమును సంగీతం, హాస్యం మరియు కళలను అనుభూతి చెందగల సామర్ధ్యమును కలిగియున్నాడు. మానవ ఆత్మ కారణంగా భూమిపై మరే ఇతర జీవికి లేని “స్వేచ్ఛా సంకల్పం” మనకు ఉంది. మనిషి యొక్క మేధోపరమైన తలాంతులను వస్తువుల రూపకల్పన మరియు వాటిని తయారు చేయడం, వ్రాయడం, పెద్ద సంఖ్యలో లెక్కించడం మరియు గణితశాస్త్రం చేయడం, తన స్వంత ప్రయోజనం కోసం శక్తిని నియంత్రించడం మరియు ఉపయోగించడం, నిర్వహించడం, తర్కించడం, నిర్ణయాలు తీసుకోవడంలో మనం చూడగలం.
ఆదికాండము 1: 28-30, దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు– ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చియున్నాను; అవి మీ కాహారమగును. భూమిమీదనుండు జంతువులన్ని టికిని ఆకాశపక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆప్రకారమాయెను. మరి దేవుడు మనిషిని ఈ పోలికలు లక్షణాలతో సృజించి యున్నాడా??
దేవుడు పరిశుద్ధుడు అంటే a) పరిశుద్ధత అనేది దేవుని అత్యున్నత మహిమను సూచిస్తుంది మరియు అతని ఇతర లక్షణాలన్నింటినీ కలిగి ఉంటుంది. యెషయా 6:3 వారు–సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. b) ఆయన పరిశుద్ధతకు కర్త మరియు పాపానికి వ్యతిరేకి, 1 పేతురు 1:16, నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి. c) దేవుడు ధర్మశాస్త్రము క్రింద సృష్టించబడలేదు, కాని మనిషికి అనుసరించడానికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది పండు తినకూడదని. d) రోమా 3:26,27, ఆయన తానే నీతి న్యాయములైయున్నాడు. e) యోహాను 14:6,7, దేవుడు సత్యమై యున్నాడు. దేవుడు ఆదాము హవ్వలకు సత్యంనే చెప్పాడు. f) 1 దినవృత్తాంతములు 16:34, యెహోవా దయాళుడు, ఆదికాండము 1:31, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. జీవులు దేవుని చేతి పనిగా మాత్రమే అవి మంచివిగా వున్నాయి. జీవులన్నిటి కంటే పైగా సామర్థ్యంలో మనిషికి ఇవ్వబడియున్న ఆధిక్యత, ముఖ్యంగా మనిషి దేవునిని గురించి తెలివి కలిగి ఉండటానికి మరియు ఆరాధించడానికి అవసరమైన ఉన్నతమైన హేతుబద్ధతను మరియు ఆధ్యాత్మికతను మనిషికి ఇచ్చింది. దేవుడు మంచివాడు. మరి దేవుడు మనిషిని ఈ పోలికలు లక్షణాలతో సృజించి యున్నాడా?
ఆదాము మంటితో సృజింపబడ్డాడు, శరీర భాగాలను కలిగియున్నాడు. ఒక రూపంలో పదార్ధం, పదార్థం యొక్క సమ్మేళనంతో సృజింపబడ్డాడు. ఆదాములో ద్వితీయ మూలకం ఉంది. అదే దేవుని శ్వాస, ఆత్మ, స్పృహ. ఆదాము ప్రమాదవశాత్తు సృజింపబడలేదు మరియు దేవునికి లోబడి ఉండే వానిగా, జీవనోపాధితో సృజింపబడియున్నాడు మరియు బాధ్యతలు కూడా కలిగి ఉన్నాడు. ఆదాము సమయం మరియు స్థలానికి కట్టుబడి ఉన్నాడు మరియు కొలవవచ్చు. ఆదాము ఒక చోటకే పరిమితమై, తన రూపాన్ని మార్చుకోలేని వానిగా సృజింపబడియున్నాడు. ఆదాము భూమి పై సృజింపబడి యున్నాడు మరియు దేవుడు పరలోకమునకు చెందినవాడు. ఆదాము విభజించదగిన వాడు. ఆదాము దృశ్యుడు. ఆదాము జీవి. ఆదాము దేవుని స్వరూపములో దేవునిచే సృజింపబడ్డాడు. ఆదాము అధిక హేతుబద్ధత మరియు ఆధ్యాత్మికతలో సృజింపబడ్డాడు. దేవుణ్ణి తెలుసుకునే మరియు దేవుణ్ణి ఆరాధించే సామర్థ్యంతో సృజింపబడ్డాడు. ఆదాము నిర్దోషిగా సృజింపబడ్డాడు. ఆదాము తన జ్ఞానం మరియు శక్తిలో పరిమితంగా ఉన్నాడు, (ఆదాముకు దేవుని విమోచనా కార్యమును గురించి ఏమీ తెలియదు. ఆదాముకు పరలోకానికి మరియు భూమికి మధ్య వచ్చే వెళ్ళే సామర్థ్యం లేదు). ఆదాము జ్ఞానం దేవుని బహుమతి. దేవుడు ఆదాముకు మేధో సామర్థ్యాన్ని ప్రసాదించాడు. ఆదాము నిర్దోషిగా సృష్టించబడ్డాడు కాబట్టి అతడు నీతిమంతుడు మరియు పవిత్రుడు. దేవుడు తన అత్యున్నత జీవి అనుకోకుండా కాకుండా ఎంపిక ద్వారా పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు. ఆదాముకు సృష్టించబడిన అమాయకత్వం నుండి చేతన పవిత్రతకు పురోగమించే అవకాశం ఇవ్వబడింది. ఆదాముకు తన విధేయతను చూపించమని చెప్పబడింది. విధేయతకు బహుమతి నిత్యజీవము, అవిధేయతకు బహుమతి మరణం. ఆదాము మంచితనాన్ని మరియు పరిపూర్ణతను కలిగి ఉన్నాడు ఎందుకంటే అవి దేవుని చేతి పని. ఆదాము ఒక లబ్ధిదారుడు. ఆశీర్వాదాలు పొందాడు. ఆదాము, ఏ విధంగానూ దేవునితో సమానం కాదు. దేవుడు ఆదాముకు స్వేచ్ఛా సంకల్పాన్ని ప్రసాదించాడు మరియు ఆ స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించు కోవడానికి అతనికి అనుమతినిచ్చాడు. ఆదాము శారీరకంగా పరిపూర్ణునిగా మరియు బలమైనవానిగా సృజింపబడ్డాడు. మానసికంగా పరిపూర్ణునిగా మరియు బలమైన వానిగా సృజింప బడ్డాడు. నైతికంగా పరిపూర్ణునిగా మరియు బలమైన వానిగా సృజింపబడ్డాడు. ఆధ్యాత్మికంగా పరిపూర్ణునిగా మరియు బలమైన వానిగా సృజింపబడ్డాడు.
అప్పుడు, “దేవుని పోలిక” అంటే ఆదాము హవ్వలను మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవునిచే ఇవ్వబడిన మొదటి స్థితి.
ఆదాము హవ్వలు నిర్దోషులుగా (అంటే పాపం లేకుండా), నీతిలో పరిపూర్ణులుగా మరియు పవిత్రంగా సృష్టించబడ్డారు. ఆదికాండము 1:31, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు (మనిషితో సహా) అది చాలమంచిదిగ నుండెను అని ధృవీకరిస్తూవుంది, మనిషి అసంపూర్ణంగా ఉంటే అది నిజం కాదు. ఎఫెసీయులకు 4:24 నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొన వలెను అను మాటలనుబట్టి మానవుడు సృష్టించబడినప్పుడు, అతడు నీతిమంతుడని ఇది రుజువు చేస్తూ ఉంది; మనిషి మొదటి స్థితిలో మనిషి యొక్క అసలైన జ్ఞానం, నీతి మరియు పవిత్రత “సూపర్ నేచురల్” బహుమతులు కాదు, అతని అసలు స్థితిని సంపూర్ణంగా మరియు పరిపూర్ణంగా అందించడానికి అతనికి జోడించ బడ్డాయి. మనిషిలోని దేవుని పోలిక యొక్క తక్షణ ఫలితం a) అమరత్వం b) సార్వభౌమాధికారము.
ఆదాము హవ్వలు దేవునిని గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నారు. యోబు 32: 8, అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.
ఆదాము హవ్వలు సృష్టించబడ్డారని వారికి తెలుసు. దేవుడు తమ సృష్టికర్త అని మరియు వారు ఆయన సృష్టి అని ఆదాము హవ్వలకు తెలుసు. (వారు గౌరవంతో భయంతో ఆయనకు విధేయత చూపారు). ఆది కాండము 2: 22,23, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామునుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను– నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. అతడు నిద్రపోతున్నప్పటికీ, ఆమె ఎక్కడ నుండి వచ్చిందో మరియు అతనితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటో అతనికి అర్థమైంది. ఇక్కడ తనకు అన్ని విధాలుగా సరిపోయే సహాయకురాలు ఉన్నదని ఆదాము దేవునితో సమ్మతించాడు. ఆదాము ఆమెను తన భార్యగా స్వీకరించాడు.
దేవుడే అన్ని జీవులకు కారణమని, మూలమనే సంగతి ఆదాము హవ్వలకు తెలుసు. అపొస్తలుల కార్యములు 17:28, మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము.
ఆదాము హవ్వలకు తమ దేవుడు ఎవరో ఖచ్చితంగా తెలుసు. ఆదాము హవ్వలు మాత్రమే దేవుణ్ణి వ్యక్తిగతంగా చూశారు. ఆదాము హవ్వలు దేవునితో సంభాషించుటకు ప్రత్యేకమైన సామర్ధ్యమును కలిగి ఉన్నారు. దేవుణ్ణి అర్థం చేసుకొన్నారు. ఆదాము హవ్వలు మాత్రమే భౌతికంగా దేవునితో మాట్లాడారు. మాట్లాడటానికి ఇరువురికి వారి వారి పేర్లు తెలిసుండాలి. వారు దేవుణ్ణి ఆయన స్వరం ద్వారా గుర్తించారు. వారి మధ్య భాష ఉంది. ఆదాము హవ్వలు దేవునితో నడిచారు_ ఒకరితో ఒకరు, సమాధానము కలిగి మాట్లాడుకొంటూ నడిచారు. ఇది ప్రేమకు గురుతు, ఇది ఆయన వారిని గురించి శ్రద్ధ తీసుకొను చున్నాడని మరియు వారు తనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడని తెలియజేస్తూవుంది. వారి మధ్య సంపూర్ణమైన సమాధానము ఉంది. ఆదాము హవ్వలు ఎటువంటి గందరగోళం లేకుండా దేవునితో సహవాసం మరియు సాంగత్యాన్ని ఆనందించారు.
ఆదాము హవ్వలకు తాము భూమిపై ఉన్నామని దేవునిది పరలోకమనే (విభిన్నమైన లోకమనే) సంగతి తెలుసు.
ఆదాము హవ్వలు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని కలిగియున్నారు. దేవుడు అనుగ్రహించిన జ్ఞానము ద్వారా ఆయన పనులను అర్థం చేసుకోవడం ద్వారా దేవుని సర్వశక్తిని గురించి ఆదాము హవ్వలకు తెలుసు. ఆదాము హవ్వలకు దేవుని సంరక్షణను గురించి తెలుసు. ఆదాము హవ్వల జీవిత స్థితి అత్యంత ధన్యమైనది. వారికి బాధాకరమైన శ్రమలు నాశనకరమైన తెగ్గుళ్ళు లేవు. వారి పరిస్థితి పరమ సంతోషం. వారి నివాస స్థితి చాలా ఆహ్లాదకరం. దేవుని మంచితనాన్ని శాశ్వతంగా ఆస్వాదిస్తూ నివసించడానికి దేవుడే వారిని ఆనందాల తోటలో ఉంచాడు.
దేవుణ్ణి ఏవి సంతోషపెట్టగలవో ఆదాము హవ్వలకు తెలుసు. దేవుని Yes మరియు No. ఆదాము హవ్వలు జీవించడానికి ఏమి చేయాలో (నిత్య జీవితానికి) వారికి తెలుసు. వారి బాధ్యతలు కూడా వారికి తెలుసు. ఆదాము హవ్వలకు దేవుని గుణలక్షణాలు తెలుసు. ఆదాము హవ్వలకు దేవుని పట్ల భక్తిని చూపించాలని తెలుసు ఎందుకంటే ఆయన పవిత్రత వారిని కదిలించింది.
ఆదాము హవ్వలు నగ్నంగా ఉన్నారు, వారికి సిగ్గు తెలియదు. ఆదాము హవ్వలలో చెడు కోరికలు లేవు.
ఆదాము హవ్వలకు వారి పరిమితులు హద్దులు కూడా తెలుసు. దేవుడు ఆదాము హవ్వల పట్ల నమ్మశక్యం కాని విధంగా ఉదారంగా ప్రవర్తించాడు, కాని ఆయన వారికి ఇవ్వని ఒక విషయం ఉంది- తనతో సమానత్వం. వారు దేవుళ్లు కాదు. దేవుడు వారిని తన ప్రక్కన కాకుండా తన క్రింద జీవించేలా రూపొందించాడు. ఆదాము హవ్వలకు తమ పరిమితులు తెలుసు, వారు దేవుణ్ణి ద్వేషించలేదు, దేవునిపై కోపం చూపించలేదు. విమోచనను గురించి వారికేమి తెలియదు.
ఆదాము హవ్వలు దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు: ఆదాము హవ్వలు నిజమైన దేవునిపై నిజమైన విశ్వాసం మరియు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు మరియు వారి హృదయాలు ఏకైక నిజమైన దేవునిపై స్థిరపడ్డాయి కాబట్టి మరొకరిని దేవునిగా అనుకోవడానికి వారి దగ్గర ఎటువంటి కారణంగాని లేదా అవకాశంగాని లేదా ఎంపికగాని లేదు. ఆదాము హవ్వలు దేవుని సంరక్షణ యొక్క సంతృప్తితో జీవించారు కాబట్టి నిజమైన దేవుణ్ణి తప్ప మరొకరిని దేవునిగా అనుకోవడానికి వారిదగ్గర ఎటువంటి కారణంగాని లేదా అవకాశంగాని లేదా ఎంపికగాని లేదు.
ఆదాము హవ్వలు దేవుని పట్ల పరిపూర్ణమైన భయమును ప్రేమను కలిగి ఉన్నారు: ఆదాము హవ్వలు మరెవ్వరికిలేని గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారు, వారి నిజమైన దేవునిలో వారి నిజమైన విశ్రాంతిని కలిగి ఉండటం అంటే దేవుని నుండి దేవుని మాటలను సంతోషముతో వినడం మరియు పరిపూర్ణమైన నీతిలో పరిశుద్ధతలో పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండటం నిజముగా ధన్యతే.
దేవుని మాటలు ఆయన చిత్తానుసారం ఆదాము హవ్వల యొక్క చర్యలను మరియు జీవితాన్ని నిర్దేశించాయి.
ఆదాము హవ్వలు ఒకరినొకరు గౌరవించుకున్నారు మరియు వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారు దేవుణ్ణి ప్రేమించి, పరిపూర్ణమైన ప్రేమతో ఆయనకు భయపడ్డారు. ఆదాము హవ్వలకు దేవుని గురించి అజ్ఞానం లేదు. వారు దేవుణ్ణి ధిక్కరించ లేదు. వారు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించారు. వారికి దేవుణ్ణి ప్రేమించే సామర్థ్యం ఉంది. సాన్నిహిత్యం, అనుబంధం, స్నేహం. ఆయనను చాల ప్రియమైన వానిగా పట్టుకొన్నారు, ఆరాధించారు, పూజించారు. ఆదాము హవ్వలు ఈ అనుభూతులను బయటికి చూపించే సామర్ధ్యమును కలిగియున్నారు. వారికి స్వేచ్ఛా సంకల్పం ఉంది: దేవుడు ఆదాము హవ్వలకు వారి స్వంత ఇష్టానుసారం దేవునికి లోబడే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు తన అత్యున్నత జీవి ఎంపిక ద్వారా పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు. తినకూడదని ఆదాముకు ఆజ్ఞ ఇవ్వడం ద్వారా, దేవుడు అతనికి సృష్టింపబడిన అమాయకత్వం నుండి స్పృహతో కూడిన పవిత్రతకు పురోగమించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఆ స్వేచ్ఛాసంకల్పాన్ని ఉపయోగించాలని దేవుడు కోరుకున్నాడు.
ఆదాము హవ్వలు అవినీతి లేని స్వభావం కలిగి ఉన్నారు. ఎఫెసీ 5:9 వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కొలస్సి 3:10 జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు. ఇది చాలా స్పష్టంగా ఉంది, దైవికమైన పోలిక అంటే అవినీతిలేని వ్యక్తియొక్క స్వభావానికి లేదా చెడిపోని మానవ స్వభావానికి చెందినదని అర్ధం.
వాళ్ళు దానిని ఎలా పోగొట్టుకొని యున్నారు?
ఆదికాండము 2:16,17 మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తిన వచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
ఆదికాండము 2:17 దేవుడు ఆదాముతో, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించాడు. ఈ వచనంలో దేవుడు పాలకునిగా మరియు శాసనకర్తగా (lawgiver) కనిపించుచున్నాడు. ఆదాము తన శక్తి మేరకు దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవను మాటలకు, వాటిని తిను దినమున ఆదాము తాను కలిగియున్న అన్ని ఆనందాలను కోల్పోతాడని మరియు అతని భౌతిక శరీరం యొక్క మరణానికి బాధ్యత వహించవల్సి ఉంటుందని, అమరత్వాన్ని కోల్పోయి మర్త్యుడు అవుతాడని అట్లే వాటితో పాటు వచ్చే అన్ని కష్టాలకు అతడు బాధ్యత వహించవలసి ఉంటుందని; మరియు అతడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతాడని, దేవునికి మరియు దైవిక విషయాలకు చచ్చిన వారివలె అయిపోతారని, దేవునితో ఐక్యతను మరియు నిత్య జీవితాన్ని రెండింటిని కోల్పోతాడని ఆ బెదిరింపు తెలియజేస్తూవుంది.
అయితే ఇక్కడ కొందరు, మరణం అంటే ఏమిటో ఆదాము ఎలా అర్థం చేసుకున్నాడు? పాపానికి ముందు ఏదెనులో మరణం ఉందా? ఆదాము మునుపెన్నడూ మరణాన్ని చూడకపోతే మరణం అంటే ఏమిటో ఆదాముకు ఎలా అర్ధం అయ్యింది? అని ప్రశ్నించొచ్చు. ఆదాముకు మరణం అంటే ఏమిటో తెలియకపోతే ఆదికాండము 2:17లోని దేవుని హెచ్చరిక ఆదాముకు అర్థంలేనిది.
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెనని, ఆదికాండము 1:31 అట్లే దేవుని స్వరూపములో ఆదాము హవ్వలు సృజింపబడియున్నారని ఆదికాండము 1:27 ద్వారా ప్రకటించియున్నాడు. ఆదికాండము 2:19లో దేవుడైన యెహోవా జంతువులకు పేర్లు పెట్టమని ఆదాముని అడిగారని మనం చదువుతాము. ఆదాము ఈ పనిని ఇంతకు ముందెన్నడూ చేయలేదు, కాని అతడు ఆ ఆదేశాన్ని అర్థం చేసుకున్నాడు, సమస్యలు లేకుండా విజయం సాధించాడు. దేవుడు అతనిలో భాషను మాత్రమే కాకుండా, భాషను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కూడా ఉంచియున్నాడు. అతడు దేవునిలా ఉన్నాడు, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. ఆదాము జంతువులకు పేరు పెట్టడం “మొదటిసారి”, కాని అతడు దానిని చేయగలిగాడు. ఆదాము కొత్త పదజాలాన్ని కూడా అర్థం చేసుకున్నాడు, దీనిని అతడు ఇంతకు ముందు చూడని విషయాలకు లేదా చేయని విషయాలకు వర్తింపజేసాడు.
ఆదికాండము 2:16లో, మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అని చెప్పాడు. అంటే ఆదాము “ప్రతి వృక్షమును గురించి” ప్రతి వృక్షము అంటే ఏమిటో తెలుసుకోవాలి (అలాగే “మొక్కలు” అంటే ఏమిటి; “జలచరములు” అంటే ఏమిటి; “ఉభయచరాలు” అంటే ఏమిటి; “భూ జంతువులు” అంటే ఏమిటి; “పక్షులు” అంటే ఏమిటి? మరియు “తినుట” అంటే ఏమిటి; మరియు ‘ఫలం’ అంటే ఏమిటి, అన్నింటిని గురించి.)