
యేసు ఆ సంగతి విని అంటే ఏ సంగతి అని మీరు అనుకుంటున్నారు? యేసు బేత్సయిదా అను ఊరికి వెళ్లడంలో ప్రాధమిక ఉదేశ్యము ఏంటి? ప్రజలు యేసుని ఎందుకని వెంబడించారు? వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడటం అంటే ఏంటి? ఫిలిప్పు ద్వారా శిష్యుల ద్వారా ఆయన మనకు నేర్పిస్తూవున్న పాఠము ఏంటి? ఈ అద్భుతము కధా లేక వాస్తవ సంఘటనా?
అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలు
మత్తయి 14: 13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6: 5-13
మత్తయి 14:13-21_ యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, ఆ సంగతి విని సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలి నడకను పరుగెత్తి వారి కంటె ముందుగా వచ్చిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, ఆయన వారిని చేర్చుకొని వారు కాపరిలేని గొఱ్ఱెల వలె ఉన్నందున వారిమీద కనికరపడి, యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండి దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, అనేక సంగతులను భోదించడమే కాకుండా వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.
యేసు కన్నులెత్తి జనులను చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని ఆయన యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దు గుంకుచున్నది, ఈ జనులు గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి.
అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ –ఇక్కడ ఉన్న యొక చిన్న వాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలును తప్ప మరేమియు లేదని యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పిరి.
అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని తన శిష్యులతో చెప్పగా, ఆ చోట చాల పచ్చికయుండెను గనుక వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీర్చి అందరిని కూర్చుండబెట్టిరి. లెక్కకు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు కూర్చుండిరి. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి యేసు కూడా ఆ రొట్టెలు పట్టుకొని కూర్చున్న వారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారి కిష్టమైనంత మట్టుకు వడ్డించెను.
వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచు మించు అయిదు వేలమంది పురుషులు.
ఆ మనుష్యులు యేసు చేసిన సూచకక్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొన బోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లిపోయెను.
- యేసు ఆ సంగతి విని, అంటే ఏ సంగతి విని?
- దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా ఎందుకని వెళ్ళాడు?
- వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా ఆయన వెళ్లిన చోటుకు చేరుకోవాల్సిన అవసమేముంది?
- వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, అను మాటలకు అర్ధమేమి?
- దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, అనేక సంగతులను భోదించడమే కాకుండా వారిలో రోగులైన వారిని ఆయన ఎందుకని స్వస్థపర్చాడు?
- వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పునే యేసు ఎందుకని అడిగాడు?
- అందుకు ఫిలిప్పు ఇచ్చిన జవాబు ఏంటి?
- మీరే వారికి భోజనము పెట్టుడని ఆయన శిష్యులతో ఎందుకని చెప్పాడు?
- మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని ఆయన వారితో ఎందుకని చెప్పాడు?
- పచ్చికమీద అందరిని పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని ఆయన ఎందుకని చెప్పాడు?
- ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను?
- వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పటంలో ఆయన ఉద్దేశ్యము ఏంటి?
ఇది, ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేలమందికి యేసు అద్భుతకరమైన రీతిగా ఆహారం పెట్టడం అనే సూచక క్రియ. నాలుగు సువార్తలలో నమోదు చేయబడిన ఏకైక అద్భుతం, మత్తయి 14:13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:5-13.
ఈ భాగము మత్తయి 14:13లో “యేసు ఆ సంగతి విని” అని ప్రారంభమవుతూ ఉంది. ఏ సంగతి? ఈ భాగమునకు పై భాగము బాప్తిస్మమిచ్చు యోహాను మరణాన్ని గురించి చెప్తుంది కాబట్టి యేసు బాప్తిస్మమిచ్చు యోహాను మరణ వార్త విని బాప్తిస్మమిచ్చు యోహానును చంపిన హేరోదు ఆంటిపాస్ తనను కూడా ఎక్కడ చంపేస్తాడేమోనని అతడు పాలిస్తూ ఉన్న భూభాగాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయాడా? ఆయన భయపడ్డడా? బాప్తిస్మమిచ్చు యోహాను మరణానికి కొద్ది రోజుల ముందే యేసు ఆ ప్రాంతము నుండి వెళ్ళి పోయి ఉండొచ్చు కదా? యోహాను శిష్యులు వచ్చి యోహాను చనిపోయాడని చెప్పే వరకు ఈ సంగతి యేసుకు తెలియదా? చనిపోయిన యోహాను పరలోకమందు తండ్రితో ఉండి ఉండటాన్ని ఎరిగియున్న యేసు యోహాను బరియల్ కి వెళ్లడం ఎందుకులే అనుకోని అక్కడి నుండి వెళ్లిపోయాడా? సమాధి కార్యక్రమానికి వెళ్తే ఏమి జరుగుతుంది? గొడవలు, యోహాను పక్షమున నిలబడాల్సి వస్తుంది. తిరుగుబాటు, అరెస్ట్ అవ్వడం, చెరలోనికి పోవడం ఇదంతా ఇబ్బందని యేసు అక్కడి నుండి వెళ్లిపోయాడా? లేదా చనిపోయిన యోహానును గురించి విలపించడానికి యేసు అక్కడి నుండి వెళ్లిపోయాడా? యేసు, యోహాను మరణ వార్తను విని, వెంటనే దోనె యెక్కి, అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు వెళ్లిపోయాడని తెలుసుకొని స్పందించకుండా అలా ఎలా వెళ్ళి పోతాడు అని అడగడానికి సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలినడకను పరుగెత్తి వారి కంటె ముందుగా వచ్చారా? యేసూ, ప్రవక్తగా లేదా మెస్సయ్యా గా బాప్తిస్మమిచ్చు యోహాను మరణ విషయములో మీరెలా స్పందిస్తారు? మమ్మల్ని ఎలా స్పందించమంటారు అని తేల్చుకొని, యేసు సారధ్యములో ఉద్యమించడానికా?
మన పాఠానికి వధ్ధాం. హేరోదు ది గ్రేట్ తన రాజ్యాన్ని తన ముగ్గురు కుమారులకు విడిచిపెట్టాడు. వీరిలో మన పాఠములోని ఈ “హేరోదు ఆంటిపాస్” ఒకడు. అతడు గలిలీ, పెరియాలను పరిపాలించాడు (మత్తయి 2:15). అతడు నైతికత లేని వ్యక్తి, ప్రజల వ్యవహారాలపై తక్కువ శ్రద్ధ చూపేవాడని గుర్తుంచుకోవాలి. వ్యభిచారాన్ని బట్టి యోహానుచే మందలింపబడిన హేరోదు ఆంటిపాస్ బాప్తిస్మమిచ్చు యోహానును ఖైదు చేసి దుర్మార్గంగా చంపించాడు. మన పాఠములో, యేసు చేస్తూ ఉన్న అద్భుతాలను గురించి హేరోదు ఆంటిపాస్ విని తాను చంపించిన బాప్తిస్మమిచ్చు యోహాను తప్ప మరెవరూ అలాంటి అద్భుతాలు చేయలేరని అనుకొని అతడు మళ్ళీ మృతులలో నుండి లేచియున్నాడనే నిర్ధారణకు వచ్చాడు.
యేసుని కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి, మార్కు 6:14-15. చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను, లూకా 9:7. అప్పుడు హేరోదు–నేను యోహానును తల గొట్టించితిని గదా, లూకా 9:9; నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలో నుండి లేచియున్నాడని అతడు తన సభికులకు చెప్పాడు, మార్కు 6:16. యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను, లూకా 9:9.
బాప్తిస్మమిచ్చు యోహాను హేరోదును మందలించడానికి కారణం హేరోదు వ్యభిచారం. అనైతిక సంబంధాలను ధర్మశాస్త్రము నిషేధించి ఉండటాన్ని బట్టి (లేవీయ 18:16) నిషేధించబడిన ఆ పాపములో కొనసాగుతూ దేవుని ప్రజలను పరిపాలిస్తూ ఉండుటను బట్టి దేవుని ప్రవక్తయైన యోహాను హేరోదును మందలించాడు, మత్తయి 14:3,4. హేరోదు బాప్తిస్మమిచ్చు యోహానుకు భయపడ్డాడు. హేరోదు భయం అతని స్వంత అపరాధ మనస్సాక్షి నుండి పెరిగి ఉండొచ్చు. సంపద లేదా భూసంబంధమైన విషయాలు మనస్సాక్షిని నిశ్శబ్దం చేయలేవు. అపరాధ మనస్సాక్షి నిజమైన సమస్యలతో మాత్రమే కలత చెందుతుంది. అపరాధ మనస్సాక్షి ఒక పాపిని తన సంశయవాదంతో బాధపెడుతుంది. బైబిలేతర మూలంగా, యూదు చరిత్రకారుడైన జోసీఫస్ కూడా హేరోదు ఆంటిపాస్ యోహానును ఖైదు చేసి చంపాడని, హేరోదు అలా చేయడానికి అసలు కారణం యోహాను ప్రజలపై చూపిన గొప్ప ప్రభావం (తిరుగుబాటును లేవనెత్తడానికి యోహాను పిలుపునిస్తే చాలు ఏదైనా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న కారణాన్న) అని పేర్కొన్నాడు. కాబట్టే హేరోదు అతన్ని చంపడం ఉత్తమమని భావించాడు. ఈ సందర్భములో మత్తయి బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క విషాద మరణం అసలు ఎలా జరిగిందో, మత్తయి 14:1-12; మార్కు 6:14-29 కోట్ చేసాడు.
ఆ సంగతి విని, అంటే యేసు హేరోదు తనను గురించి కలవరపడుతున్నాడని విని ఆయన ఆ ప్రాంతము నుండి వెళ్ళి పోయాడు. అతడు యేసును బాప్తిస్మమిచ్చు యోహానుగా ఎంచి రెండవసారి చంపడానికి ప్రయత్నించే అవకాశముంది. హేరోదు నుండి తనను తాను రక్షించుకునే దైవిక శక్తి యేసుకు ఉన్నప్పటికీ, ఆయన ఘడియ యింకను రాలేదు కాబట్టి యేసు అనవసరంగా తనను తాను ప్రమాదానికి అప్పగించు కోదలచుకోలేదు. అనవసరంగా ఆయన తనను తాను ఎప్పుడూ ప్రమాదంలోకి నెట్టుకోలేదు. ఆయన చనిపోవడానికి నిర్ణీత ఘడియ వచ్చే వరకు తన జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడం సరైనది. కాబట్టే యేసు అక్కడి నుండి బయలుదేరి హేరోదు భూభాగాన్ని విడిచిపెట్టి, గలిలీ సముద్రానికి తూర్పు వైపుకు, హేరోదు ఫిలిప్ భూభాగంలోకి వెళ్లిపోయాడని మత్తయి మనకు తెలియజేస్తున్నాడు. మత్తయిని బట్టి బాప్తిస్మమిచ్చు యోహాను మరణించిన కొన్ని రోజులు తరువాత మన పాఠము ప్రారంభమవుతుంది.
మార్కు 6:30; లూకా 9:10 అంతట అపొస్తలులు యేసు నొద్దకు తిరిగి వచ్చి (తమ మొదటి మిషనరీ పర్యటన నుండి తిరిగి వచ్చి) తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియజేయగా, అంటే వారు తిరిగి రావడానికి యేసు ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించాడు. ఆ సందర్భములోనే, ఆ సమయములోనే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి వారి రిపోర్టును ఆయనకు నివేదించారు. అప్పుడాయన – మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను, మార్కు 6:31. కాబట్టి ఆయన శిష్యులకు కొంత రిఫ్రెష్మెంట్ మరియు విశ్రాంతి సరైనదని అనుకొని ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి వెళ్ళాడు. గలిలీ సముద్రం మీదుగా తూర్పు తీరానికి ప్రయాణించడంలో యేసుని ప్రాథమిక ఉద్దేశ్యం వారి మిషన్ నుండి తిరిగి వచ్చిన తన శిష్యులతో యేసు ఆ మిషన్ వర్క్ గురించి వారితో వివరంగా మాట్లాడాలనుకోవడం, అలాగే వారికి కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వడం, తాను రెస్ట్ తీసుకోవడం అని మార్కు, లూకా మనకు చెప్తున్నారు. వారికి కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వడంలో యేసుని ఉద్దేశ్యం శిష్యులు యోహాను మరణాన్ని బట్టి నిరుత్సాహపడకుండా వారిని బలపర్చాల్సి ఉండటం కాబట్టే వారి భద్రత కోసం ఆయన వారిని వెంట బెట్టుకొని తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి బేత్సయిదా అను ఊరికి వెళ్ళాడు.
యేసు వివిధ కారణాలను బట్టి అక్కడనుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ కష్ట సమయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు. యోహాను యేసుకు స్నేహితుడు, బంధువు కూడా కాబట్టి యోహాను మరణం ఆయనకు చాలా బాధ కలిగించి ఉండొచ్చు. ఆ భాధ కనికరాన్ని చూపేందుకు కారణమయ్యింది. ఆయన పరిచర్యను ఆయన కొనసాగించాల్సి ఉన్నాడు, తప్ప భాధపడుతూ ఆగిపోకూడదు. ఆయనను విశ్వసించే ప్రతి హృదయానికి చెయ్యడానికి చాలా పని ఉంది, అందులో ఉపశమనం లభిస్తుంది.
యోహాను మరణం ప్రజలలో సంక్షోభాన్ని తెచ్చి ఉండొచ్చు. వారు వెళ్లుచుండగా జనులు చూచి, (ఆయన నిష్క్రమణ మరియు ఆయన పడవ యొక్క దిశ గమనించబడింది. వార్త వ్యాప్తి చెందింది) అనేకులాయనను గుర్తెరిగి, ఆ సంగతి విని సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలినడకను గలిలయ సముద్రపు ఉత్తర తీరం చుట్టూ ఎనిమిది మైళ్లు లేదా అంతకంటే ఎక్కువ మైళ్లు నడిచి పరుగెత్తి వారికంటె ముందుగా బేత్సయిదాకు రావడమే కాకుండా (లూకా 9:10) తమతో పాటు వారు యేసు స్వస్థపరచడానికి అనేకమంది రోగులను తమ వెంట తీసుకురావడం ఆశ్చర్యం.
బేత్సయిదా అంటే “హౌస్ అఫ్ ఫిషింగ్” అని అర్ధం. ఇది గలిలీ సముద్రం యొక్క ఈశాన్య ఒడ్డున ఉంది. అపొస్తలులైన ఫిలిప్పు, పేతురు, అంద్రెయ ఈ పట్టణం నుండే వచ్చారు (యోహాను 1:44). ఈ ప్రాంతాన్ని గూర్చిన యేసుని ప్రవచనము లూకా 10:13,14లో ఉంది – అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. అయినను విమర్శకాలము నందు మీ గతికంటె తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండును.
ఆయనను వెంబడించి వచ్చిన ఆ గొప్ప జనసమూహము, స్త్రీలు పిల్లలు కాకుండా దాదాపు ఐదు వేల మంది పురుషులుతో ఉన్న ఒక పెద్ద జనసమూహము. ఇంతమంది ఆయనను వెంబడించడానికి కారణాన్ని యోహాను తెలియజేస్తూ, రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించారని, యోహాను 6:2 రక్షణ సువార్త కోసం మాత్రం కాదని చెప్పాడు.
జనసమూహం నుండి తప్పించుకోవడానికి యేసు తన శిష్యులతో కలిసి దూర ప్రదేశానికి వెళ్ళాడు కాని ఆయనకు విశ్రాంతి దొరకలేదు. అక్కడికి ప్రజలు అనేకమంది రోగులను తమ వెంట తీసుకొని వచ్చి ఉండటం చూచి యేసు నిరాశ చెందలేదు లేదా చికాకుపడలేదు. ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను, లూకా 9:11. సహాయం కోసం వచ్చిన వారి నుండి తప్పించుకోకూడదనే పాఠాన్ని అపొస్తలులు నేర్చుకొన్నారు.
వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన వారిని తృణీకరింపక, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున ఆయన వారి మీద కనికరపడ్డాడు అని మార్కు 6:34 చెప్తుంది.
గొర్రెల కాపరి అంటే మందను చూసుకునేవాడు. దానిని పోషించడం అతని విధి. తోడేళ్ళు ఇతర క్రూర మృగాల నుండి వాటిని అతడు రక్షించాల్సి ఉన్నాడు. అలాగే మందలోని పిల్లలు, యవ్వనమైనవి, బలహీనమైన వాటి పట్ల అతడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉన్నాడు. పచ్చని పచ్చిక బయళ్ళుకు శాంతికరమైన జలముల యొద్దకు అతడు వాటిని నడిపించాల్సి ఉన్నాడు, కీర్తన 23:1-6. గొర్రెలకు కాపరి లేకపోతే వాటికి సరైన మార్గదర్శకత్వం, సంరక్షణ ఉండదు. అవి మంద నుండి తప్పిపోవొచ్చు, దూరముగా పోవచ్చు, మందను చేరుకోవడానికి మార్గాన్ని కనుగొనలేక నిస్సహాయ జీవులుగా గాయపడి రోగగ్రస్త మవ్వటమే కాకుండా పోషకాహార లోపంతో బలహీనపడి మరణించే ప్రమాదములో ఉంటాయి. అట్లే భద్రత లేని కారణంగా అవి క్రూర మృగాల బారిన పడి వాటికి వేటగా మారొచ్చు కూడా.
ఇక్కడ, ప్రజలు కాపరి లేని గొఱ్ఱెలవలె ఉన్నందున అనే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకుడు అనే ఒక కాపరి వ్యవస్థే ఉంది. మరి ప్రజలు కాపరి లేని గొఱ్ఱెలవలె ఉన్నారని యేసు ఎందుకని అన్నాడు? ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని క్రీస్తు చెప్పినప్పుడు, వారి గురువులు, మార్గదర్శకులు, వారిని పట్టించుకునే వారు వారికి బోధించడానికి శ్రమ పడుతున్నారని అర్థం. ఆ వ్యవస్థ ఫెయిల్ అయ్యిందని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. వారి కాపరులు ప్రజలను పట్టించుకోకుండా వారిని నిర్లక్ష్యం చేస్తూ వారి బోధల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా వారి స్వార్ధ ప్రయోజనాలను బట్టి పేదలకు సువార్తను దూరము చేసారు. కాబట్టే బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది వెళ్లి బాప్తిస్మమిచ్చు యోహానుతో చెప్పుడి అని యోహాను శిష్యులతో యేసు చెప్పటం మనం లూకా 7:22లో చూడొచ్చు. ప్రజలు ఆత్మీయ పోషకాహార లోపంతో రోగగ్రస్తమవటమే కాకుండా బలహీనపడి మరణించే ప్రమాదములో ఉండడాన్ని బట్టి ఆయన వారి మీద కనికరపడ్డాడు.
వారి ప్రార్థనా మందిరాల్లో, వారికి అవసరమైన ఆధ్యాత్మిక ఆహారం ఇవ్వబడలేదు. వాళ్ళు వాగ్దానం చేయబడిన మెస్సీయ వైపు మళ్ళించబడలేదు అంటే వారి సోకాల్డ్ కాపరులు, నాయకులు, ప్రజలను దేవుని వాక్యమనెడి పచ్చిక బయళ్లకు నడిపించకుండా మనుష్య సిద్ధాంతాలు బోధల ద్వారా దేవుని వాక్యమనెడి పచ్చిక బయళ్లకు దూరం చేసే వారిగా ఉండడాన్ని బట్టి, ప్రజలు నిస్సహాయంగా దేవుని మందకు తిరిగి వెళ్ళే మార్గాన్ని కనుగొనలేని వారి దయనీయమైన పరిస్థితిని బట్టి ఆయన వారి మీద కనికరపడ్డాడు. వారికి కావాల్సిన వాటిని అందించడానికి వచ్చిన మంచి కాపరియైన క్రీస్తు, వారు ఎంతగానో కోరుకొంటున్న ఆహారాన్ని వారికి సమృద్ధిగా అందించడానికిగాను కనికరపడ్డాడు.
తప్పిపోయిన గొర్రెలు మందకు ఎలా తిరిగి రావాలో చెప్పడానికి ఆయనకు అక్కడ ఒక మంచి అవకాశము ఉంది. అందుకే విశ్రాంతి తీసుకొందామనుకొన్న ఆయన ఆ విశ్రాంతిని ప్రక్కన పెట్టి ఆయన వారి మీద కనికరపడి, దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, అంటే వారిని దేవుని రాజ్యములోనికి తిరిగి తెచ్చు మెస్సయ్యను గురించి వారికి తెలియజేస్తూ, వివరిస్తూ అనేక సంగతులను భోదించడమే కాకుండా వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచాడు.
పరిచర్యలో భాగముగా సమయం వేగముగా అయిపోతూ ప్రొద్దు గుంకడం మొదలయ్యింది. యేసు కన్నులెత్తి జనులను చూచి వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని ఆయన యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుట కైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను, యోహాను 6:4-7.
రెండువందల దేనారముల రొట్టెలు చాలవను మాటల ద్వారా ఫిలిప్పు వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు తప్ప అవిశ్వాసిగా లేడు. ఇంతమందికి భోజనము ఎక్కడి నుండి సమకూర్చగలం అనే విషయాన్ని విస్మరించి, అది దొరికినను ఇంతమందికి దానిని వాళ్ళు కొనలేరని వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుట కైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని, వీరి ఆకలిని మనం తీర్చలేమని యేసుకు సలహా చెప్తున్నాడు.
యేసు ఫిలిప్పునే ఈ ప్రశ్న ఎందుకని అడిగాడు? ఆయన యేమి చేయనైయుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెనని మన పాఠము చెప్తుంది. ఇక్కడ ప్రభువు ఫిలిప్పుకు పరీక్ష పెట్టాడు. ఫిలిప్పును ప్రభువు యందలి విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో బలపర్చడానికే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మర్చిపోకండి. యేసు నందు అతనికున్న నమ్మకానికి, విశ్వాసానికి ఇది పరీక్ష.
ఆ పరీక్షలో ఫిలిప్పు ఆహారాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ప్రభువా –వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పటం, అతడు ప్రతి దానిని ఈ లోక సంబంధమైన వాటితో ముడిపెట్టి లెక్కలు వేసుకొనే వాడని తెలియజేస్తుంది. ఈ లోక సంబంధమైన వాటికంటే సర్వ సమృద్ధి దేవునిలో ఉన్నదనే విషయాన్ని శిష్యునిగా అతడు తెలుసుకోవాలని సరిద్దుకోవాలనే యేసు ఫిలిప్పును ఈ ప్రశ్న అడిగాడు.
అపొస్తలులను పరిచర్యలోనికి పంపుతున్నప్పుడు, వారి అవసరాలు వారికే విధముగా సమకూర్చబడతాయో నిశ్చయతను ఆయన వారికిచ్చి పంపించాడు లూకా 9:2-6. వారి మిషన్ టూర్లో ఆ విషయాన్ని వారు నేర్చుకున్నారో లేదో పరీక్షించడానికి ఆయన ఈ విధముగా అడిగాడు. ఫిలిప్పు దానిని అనుభవపూర్వకంగా రుచి చూచి ఉన్నప్పటికిని దానిని గురించి అతడు మర్చిపోయాడు. అట్లే అప్పటి వరకు ఎన్నో రోగాలను నోటి మాట చేత స్వస్థపరుస్తూ ఉన్న యేసును చూస్తూ ఉన్న ఫిలిప్పు “తండ్రి ఏమి చెయ్యమంటారు చెప్పండి” అని అనాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదనే విషయం ఫిలిప్పుకు ఇంకా అర్ధం అయ్యినట్లు లేదు. ఈ పరీక్షలో ఫిలిప్పు ఫెయిల్ అయ్యాడు.
ఈ సంభాషణను ఫిలిప్పు ఇతర శిష్యులతో కూడా చెప్పాడు, వాళ్ళు ఒకరితో ఒకరు ఈ ప్రశ్నను గురించి చర్చించుకొని ఉండొచ్చు. బోధకుడు ఇలా అన్నాడా? ఆయన ఉద్దేశ్యం అర్ధమవుతున్నట్లుగానే ఉంది కాని ఇది ఎలా సాధ్యం? ఇంత గొప్ప సమూహానికి భోజనమా? వాళ్ళు ఎన్నో మార్గాలను గురించి ఆలోచించి ఉండొచ్చు. ఒకవేళ బోధకుడు మనల్నే వెళ్లి ఇంత మందికి భోజనము కొనమంటే మనం ఎక్కడ కొందాం? ఇంత మందికి సరిపోయే భోజనం ఒక్క దగ్గరే దొరకదు. ఎలా కోఆర్డినేట్ చేధ్ధాం. ఈ నిర్జన్య ప్రాంతములో ఇంత మందికి భోజనము సిద్ధపర్చడం అందుకు కావలసిన వాటిని సమకూర్చడం సాధ్యం అయ్యే పని కాదు, ఏమి చేధ్ధాం? భోజనము కొనడానికి డబ్బు వారి దగ్గర ఉందొ లేదో మనకు తెలియదు. దానిని ఎలా సమకూర్చు కొంటారో చెప్పబడలేదు, శిష్యులు ఎంతో తర్జనభర్జన పడి ఉండొచ్చు. శిష్యులును, యేసు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. వారు యేసును ఇతరులకు అందించువారిగా ఉండటానికి పిలువబడి ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి “అధిగమించలేని” అడ్డంకుల పై దృష్టి పెట్టారు. యేసును ఇతరులకు అందించే అవకాశాలు ఎన్నో ఉన్నా మనం కూడా శిష్యుల వలె అడ్డంకులను గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాం.
అట్లే ఈ పరీక్ష ఆయన చెయ్యబోయే అద్భుతం కోసం శిష్యులను సిద్ధం చేయడంలో సహాయపడింది. సాయంత్రమైపోతూ ఉంది, వాళ్లకి ఒకటే సొల్యూషన్ కనిపించింది. ఏమయితే అయ్యింది మనం యేసు దగ్గరకు వెళ్లి మాట్లాడదాం అనుకొని పండ్రెండుగురు శిష్యులు యేసుని సమీపించి, –మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి, లూకా 9:12. అప్పుడు యేసు–వారు వెళ్లనక్కరలేదు, వెళ్లాల్సిన అవసరం లేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, అపొస్తలులు నిర్గాంతపోయి ఉండొచ్చు.
శరీరధారియైయున్న దేవుని సన్నిధానంలో ఉండి వాళ్ళ సజీవిమైన నేత్రాలతో అప్పటి వరకు యేసు చేసిన ప్రతి స్వస్థతకు సాక్షులై ఉంటూ కూడా, ప్రభువా ఏమి చెయ్యమంటారో చెప్పండి అని అనకుండా మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడగటం ఆశ్చర్యం. వారి దగ్గర ప్రజలందరికి ఆహారము కొనేందుకు తగినంత డబ్బు లేదు అట్లే తగినంత ఆహారం కూడా వారికి అందుబాటులో లేదు. పరిస్థితి నిస్సహాయంగా కనిపిస్తూ ఉంది.
అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. ఆ సందర్భములో వనరులుగా, దేవుడు వారికి ఏమి అందించాడో తెలుసుకొమ్మని ఆయన తన శిష్యులను ప్రజల మధ్యకు పంపించాడు. 5000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు లెక్కవెయ్యలేదు. అందరిని కలిపితే ఇంచుమించు 15000 మంది అని అంచనా. 14999 మంది దగ్గర తినడానికి ఏమీ లేదు. ఈ ఎంక్వయిరీలో శిష్యులు ప్రజల దృష్టిని ఆకర్షించారు. యేసు రొట్టెలడిగాడా? యేసుకా లేక ఆ రొట్టెలతో ఆయన ఏమైనా చేయబోతున్నాడా? ఇప్పుడు యేసు ఏమి చేయబోతున్నాడని ప్రజలు శిష్యులను అడిగి ఉండొచ్చు. అందుకు శిష్యులు యేసుకు వారికి మధ్య జరిగిన సంభాషణను గురించి తెలియజేసి ఉండొచ్చు. ఏంటి? ఏం జరుగుతుంది? ఏదో జరగబోతూ ఉంది ఏంటది? శిష్యులకు తెలియదు, ప్రజలకును తెలియదు.
వారు చూచి తెలిసికొని ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ –ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలును తప్ప మరేమియు లేదని యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పిరి.
ఆనాటి కాలములో పేద వర్గాల ప్రజలు మాత్రమే బార్లీ రొట్టెలను, పొగబెట్టి ఎండిపోజేసిన చేపలను తినేవాళ్లు. బాలుడి సమర్పణ పెద్దది కాదు. ఇద్దరు వ్యక్తులకు సరిపోనిది. ఇది పేదవాడైన ఒక చిన్న పిల్లవాని సంపూర్ణ సమర్పణ. కాని ఐదు వేల మంది పురుషులు అక్కడవున్న స్త్రీలకు పిల్లలకు అవి ఏమాత్రమును సరిపోవు.
అద్భుతానికై దేవుడు వారికి అందించినవి యింత మందికి ఇవి ఏమాత్రమని (శిష్యులు) ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని తన శిష్యులతో చెప్పగా, ఆ చోట చాల పచ్చికయుండెను గనుక వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీర్చి అందరిని కూర్చుండబెట్టిరి. లెక్కకు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు కూర్చుండిరి.
ద్రాక్షారసం కొరత ఉన్నప్పుడు కానాలో జరిగిన పెళ్లిలో చేసినట్లే యేసు ఇప్పుడు సమస్యను తన చేతులలోనికి తీసుకొన్నాడు. పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని తన శిష్యులతో చెప్పగా, ఆ చోట చాల పచ్చికయుండెను గనుక వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీర్చి అందరిని కూర్చుండ బెట్టిరి (మార్కు 6:40). వారు 5,000 మంది పురుషులను లెక్కించారు (స్త్రీలు మరియు పిల్లలు ఎక్స్ట్రా), మత్తయి 14:21. అందరిని కలుపుకొంటే ఇంచుమించు 15,000 మంది భోజనము చేయడానికి పంక్తులలో కూర్చున్నారు. భోజనము కొరకు త్రొక్కిసలాట జరగకూడదని, ఏ ఒక్కరు ఈ సందర్భములో గాయపడకూడదని, బహుశా పంపిణీని మరింత క్రమబద్ధంగా చేయడానికి మరియు ఎవరూ తప్పిపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరికి సమృద్ధిగా వాళ్ళు తిన్నంత భోజనాన్ని వాళ్లకు అందించడానికిగాను వారు క్రమములో అందరిని కూర్చుండబెట్టారు. ఆ జనసమూహము ఈ అభ్యర్థనకు విధేయత చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి కన్ను ఆశ్చర్యంతో, ఆ క్షణాలను మిస్ కాకూడదని ఆశ్చర్యంగా యేసునే చూస్తూ ఉండొచ్చు.
అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి యేసు కూడా ఆ రొట్టెలు పట్టుకొని కూర్చున్న వారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారి కిష్టమైనంత మట్టుకు వడ్డించెను.
ఆకాశమువైపు కన్నులెత్తి_ తండ్రితో సంబంధాన్ని, తండ్రి మద్దతును తెలియజేస్తుంది. కృతజ్ఞతా స్తుతులు _ అక్కడ కూడుకొనియున్న ప్రజల కొరకై తండ్రి ఏర్పాటు చేసిన బహుమానాన్ని బట్టి తండ్రికి ధన్యవాదాలు తెలియజేసి, ఆశీర్వదించి_ అందరికి సరిపోయేలా ఆయన వాటిని దీవించాడు.
సమూహానికి గొప్ప ధైర్యం అవసరం. ఇదేమి మేజిక్ కాదు. ప్రజలు తినడానికి మొదట భయపడి ఉండొచ్చు. వారు వాటిని పట్టుకొన్నారు, వాసన చూసారు, రుచి చూసారు, తిన్నారు. అందరికి ఆహారాన్ని అందిస్తున్న శిష్యులకు కూడా విశ్వాసం మరియు ధైర్యం అవసరం.
ప్రజలకు వడ్డించే పని శిష్యులది. గంపలో తరగని రొట్టెలు/ తరగని చేపలు, ప్రజలందరూ తినడానికి “సరిపోయినంత” వరకు సరఫరా ఆగిపోలేదు. వారు ఇతరులకు ఆహరం పంచిపెడుతూ ఉంటే ఆహరం ఇంకా ఎక్కువైన సంగతి గమనించండి. ప్రభువు ఆహారాన్ని ఇచ్చినపుడు శిష్యులు ప్రజలకు సులభముగా పంచిపెట్టగలిగారు, పంచిపెట్టారు.
మన శరీరానికి మరియు ఆత్మకు కావలసినదంతా దేవుని నుండి వచ్చినదని గుర్తించి, మనం కూడా మన జీవనాధారమైన ఆహారం తినడానికి కూర్చున్న ప్రతిసారీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి.
కొందరు వాటిని తమ ఇండ్లకు తీసుకొని వెళ్లి ఉండొచ్చు. పరిసయ్యులు సద్దూకయ్యులు శాస్త్రులు మొదలైన వారు కూడా వీటిని చూసి ఉండొచ్చు తాకి ఉండొచ్చు, రుచి చూసి ఉండొచ్చు. అవి రెండు మూడు రోజులైనను సాధారణ రొట్టెలువలే ఉన్నాయి తప్ప మాయమై పోలేదు.
ఈ అద్భుతం క్రీస్తు గురించి మనకు ఏమి బోధిస్తుంది? ఆయన కేవలం మనిషి కంటే ఎక్కువ అని స్పష్టంగా తెలుస్తుంది. నిజ దేవునిగా నిజ మానవునిగా ఆయన బల ప్రభావాలే కాకుండా ఆయన కనికరము కూడా ఇక్కడ వెల్లడయ్యింది. ఆయన దేవుడు ఆయన ఇక్కడ చేసినది దైవికమైన కార్యము.
యేసు చేసిన అద్భుతం ప్రజలపై చూపిన ప్రభావాన్ని గురించి యోహాను 6:14,15 తెలియజేస్తుంది. వారు ఆయన చర్యలో పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పును చూశారు. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అయితే, వారు తమ పాత నిబంధనను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ద్వితీ. కాం 18:16లో మోషే వాగ్దానం చేసిన ఆ గొప్ప ప్రవక్త తమ మధ్యకు వచ్చాడనడానికి ఇది సూచన అని ప్రజలు అనుకొన్నారు. ఇది నిజమే, యేసు ఆ ప్రవక్తే. అయితే ఆయన ఉద్దేశ్యం, ఆయన నెరవేర్చవలసిన కార్యము గురించి వారికెలాంటి అవగాహనగాని గ్రహింపుగాని లేదు.
ఈ అద్భుతం తర్వాత ప్రజలు ఆయనను బలవంతంగా రాజుగా చేయాలని కోరుకున్నారు. తమ పూర్వీకులు అరణ్యంలో మోషే కింద నీరు, మన్నా మరియు పిట్టలను ఎలా పొందారో వారు గుర్తుచేసుకొని ఉండొచ్చు. మోషేలానే ఈ ప్రవక్త కూడా తమకు ఆహారం ఇవ్వాలని వారు కోరుకున్నారు. భూసంబంధమైన అధికారము అనే శోధనతో వాళ్ళు యేసును శోధించారు. సాతాను కూడా యేసుకు భూసంబంధమైన అధికారము ఇస్తానని శోధించాడు (మత్తయి 4:8,9). వారికి దేవుని కుమారుడిగా ఆయనలో నమ్మకం లేదు. తమ దేశములో నుండి రోమ్ పరిపాలనను తొలగించి శాంతి సౌభాగ్యాలను తెచ్చే ఇహలోక రాజ్యం గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ ను జనసమూహము సాధారణమైనదిగా తీసుకోవడం దిగ్బ్రాంతి కలుగజేస్తుంది. వారంతా తిని, తృప్తి చెంది, తమ దారిన వెళ్లిపోయారు. అద్భుతం జరిగిందని ప్రేక్షకుల నుండి ఏమాత్రమును స్పందన లేదు, గుర్తింపు లేదు. కానాలోని పెళ్లిలో విందు యజమాని వలె, ఆహారం ఎక్కడ నుండి వచ్చిందో గుంపుకు తెలియదు. కాని శిష్యులకు తెలుసు! ఇది శిష్యులకు ఒక అద్భుతం, దేవుని రాజ్య రహస్యాలలో ఒకటి (లూకా 8:10 ఆయన– దేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి).
వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.
12 గంపలు మిగిలాయి_ ఈ కథని నేను నా సండే స్కూల్లో చెప్పిన తరువాత 12 గంపలు మిగిలాయి కదా ఎందుకని అని అడిగితే, ఒక పిల్లోడు లేచి, పాస్టర్ గారు, 12 మంది శిష్యులు రొట్టెలు చేపలు అంతమందికి పంచి పెట్టారు కదండి, వారి సేవను బట్టి ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక గంప చొప్పున వారి కొరకు మిగిలేలా యేసు చేసాడు అని చెప్పాడు, మీరేమంటారు?
పంపిణీతో అద్భుతం అయ్యిపోలేదు. అక్కడ మిగిలిపోయినవి, ప్రతి శిష్యుడికి ఒకటి చొప్పున, జరిగిన అద్భుతానికి సాక్ష్యముగా, 12 బుట్టలలో సరిపడా బార్లీ రొట్టెలు, చేపలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన విషయాలలో కూడా శిష్యులు చేయగలిగినది ఇదే. లోకమంతటి అవసరాలను తీర్చేందుకు చాలినంత ఆహరం క్రీస్తు సువార్తలో ఉంది. దేవునికి పంచిపెట్టే వాళ్ళు కావాలి. ఇది వాళ్ళు జీవపు రొట్టెతో దేశాలను పోషించే ఆధిక్యత కలిగి ఉన్నారనడానికి ఇది సాదృశ్యముగా ఉంది. అలాగే వారికి అక్కడ ఉపయోగార్ధముగా కూడా ఉంది. అది సంతృప్తినిచ్చే ఆహరం, జీవాహారము కూడా. ప్రభువు అందజేసాడు.
ఇది యేసులో నిజ మానవుడు నిజ దేవుడు ఉన్నాడని రుజువు చేస్తూ ధ్రువీకరించింది. మన ప్రభువు శిష్యులను తన అనుగ్రహాన్ని పంచేవారుగా నియమించుకున్నాడు. యేసుక్రీస్తు ఆయనే నిజమైన రొట్టె. ఈ పంపిణీలో క్రైస్తవ పరిచారకుల కార్యాలయం గురించి మరియు వారి పనిని గురించి నేర్చుకోండి. అవిశ్వాస లోకానికి రక్షకుని పరిచయం చెయ్యండి. యేసు సర్వశక్తి మంతుడు. మన పేద వనరులను, సరిపోని వనరులను అనేకులకు దీవెనగాను మనకు ఆశీర్వాదకరముగాను ఉండులాగున క్రీస్తు వద్దకు తీసుకొని వెళదాం.
యేసు ఐదు రొట్టెలతో 12 బుట్టలను మాత్రమే నింపగలిగితే, ఆయన ఒక అద్భుతం చేశాడు, కాని 15వేల మంది తిన్న తర్వాత మిగిలిపోయాయి మరి దీనిని ఏమందాం?
యేసు చేసిన అద్భుతంలోని నిజమైన సత్యాన్ని ప్రజలు అర్ధంచేసుకోలేకపోయారు. వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి దేవునిచే పంపబడిన వాగ్దానం చేయబడిన క్రీస్తు ఆయన. వాళ్ళు ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా అనుకొన్నారు తప్ప తమ మెస్సయ్యగా ఆయనను గుర్తించలేక పోయారు. వారి ఆలోచనలను తెలుసుకున్న యేసు, అక్కడినుండి వెళ్లిపోయాడు.
ఈ పాఠము మన ఏయే బలహీనతలను ప్రభువు ముందు ఒప్పుకోమంటుంది?
1. శిష్యులు మొదట్లో ఈ జనసమూహానికి ఎలా ఆహారం పెట్టగలమని సందేహించారు. యేసుకు ఈ సమస్యను తీర్చగల సామర్థ్యం ఉన్నదని శిష్యులు గుర్తించలేకపోయారు. దేవుని శక్తిని లేదా ఏర్పాటును గురించి తెలుసుకోలేకపోయారు.
2. మనం మన వనరులను దాచుకొంటూ దాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడకపోతే, మనకు ఏదైనా అవసరం కనిపించినప్పుడు కూడా, మనం స్వార్థాన్ని ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ బాలుడు తన చిన్న భోజనాన్ని యేసుకు అర్పించడానికి ఇష్టపడటం దేవునికి ఇష్టమైన నిస్వార్థ వైఖరిని చూపిస్తుంది.
3. మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మరియు ఏర్పాటును గుర్తించడంలో విఫలమైనప్పుడు, మనం కృతజ్ఞత లేనివారమవుతాం. మనకు ఉన్నదానితో కృతజ్ఞతతో ఉండాలని మరియు చిన్న విషయాలను కూడా దేవుడు అద్భుత మార్గాల్లో ఉపయోగించుకోగలడని గుర్తించాలని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది.
4. అసాధ్యమైన పరిస్థితులలో మనం ఆయన శక్తి మరియు ఏర్పాటుపై ఆధారపడాలి.
5. భోజనం తర్వాత మిగిలిపోయిన ముక్కలను సేకరించమని యేసు ఇచ్చిన సూచన, దేవుని దయచేసిన ఆహారాన్ని వృధా చేయకూడదనే ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. దీనిని ఆహారానికి మాత్రమే కాకుండా అన్ని వనరులపై మన నిర్వహణకు అన్వయించొచ్చు.
ఈ పాఠములోని దేవుని ప్రేమ
1. యేసు ప్రజల పట్ల కరుణను చూపించాడు. ఆయన వారి శారీరక అవసరాలను తీర్చాడు, రోగులకు సహాయపడ్డాడు. మానవాళి అందరి పట్ల తన ప్రేమను చూపించాడు (ఆయనే స్వయంగా రక్షణ వాక్యాన్ని వారికి బోధించాడు).
2. పరిమిత వనరులు ఉన్నప్పటికీ యేసు జనసమూహం యొక్క అవసరాలను తీర్చాడు. ఆయన సామర్థ్యం దేవుని దాతృత్వాన్ని అంచనాలకు మించి అందించే సామర్థ్యాన్ని సూచిస్తుంది.
3. ఆయన తనను నమ్మేవారికి ఆధ్యాత్మిక పోషణ మరియు నిత్యజీవాన్ని అందిస్తాడు.
4. విశ్వాసంతో పరిమిత వనరులు ఆయన వద్దకు తీసుకువచ్చినప్పుడు, ఆయన అద్భుతాలు చేయగలడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని శక్తిపై ఆధారపడటాన్ని ఇది బోధిస్తుంది.
5. దేవుడు ఇతరులను ఆశీర్వదించడానికి ప్రజలను ఉపయోగించుకొంటాడు. ఇతరుల అవసరాలను తీర్చడానికి అందుబాటులో ఉన్న వాటిని పంచుకోవడం ద్వారా దేవుని పనిలో పాల్గొనడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
6. దేవునికి ఏ అడ్డంకి పెద్దది కాదనే సందేశాన్ని బలపరుస్తుంది.
ఈ పాఠము మనకేమి నేర్పిస్తుంది?
1. ఆ బాలుడి చిన్న భోజనం వేలాది మందికి ఆహారం ఇవ్వడానికి సరిపోయింది. యేసు దానిని అద్భుతంగా ఉపయోగించాడు. దేవుడు మన చిన్న కానుకలను తీసుకొని ఇతరుల గొప్ప అవసరాలను తీర్చడానికి వాటిని ఉపయోగిస్తాడు.
2. శిష్యులు మొదట్లో జన సమూహానికి ఆహారం పెట్టడం గురించి ఆందోళన చెందారు, కాని దేవుని ఏర్పాటుపై వారు నమ్మకం ఉంచవచ్చని యేసు వారికి చూపించాడు. మన అవసరాలు అధికంగా అనిపించినా, దేవుడు వాటిని తీరుస్తాడని నమ్మమని ఈ కథ మనల్ని ప్రోత్సహిస్తుంది.
3. ఆ బాలుడి అర్పణ చిన్నది, కాని యేసు చేతుల్లో ఉంచినప్పుడు అత్యద్భుత మయ్యింది.
4. ఈ కథలో హీరో ఒక చిన్న పిల్లవాడు. యేసు అద్భుతం చేయడానికి ఉపయోగించిన ఆహారాన్ని అందించిన వాడు. దేవుడు ఎవరినైనా వారి నేపథ్యం లేదా హోదాతో సంబంధం లేకుండా ఉపయోగించుకొంటాడని ఇది మనకు బోధిస్తుంది. మీ జీవితంలోని అనేక సంఘటనలలో మీ చుట్టూ ఉన్న వారి కొరకు దేవుడు మిమ్మల్ని హీరో గా ఎన్నుకొన్నాడేమో, ఆ విషయాన్ని మీరు గుర్తించలేదేమో.
5. ఈ కథ జనసమూహానికి శారీరక పోషణపై దృష్టి సారించినప్పటికీ, ఇది యేసు అందించే ఆధ్యాత్మిక పోషణను కూడా సూచిస్తుంది. ఈ అద్భుతం యేసు శారీరక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే శక్తిని ప్రదర్శిస్తుంది.
6. ఆ బాలుడు తన భోజనం పంచుకోవడానికి ఇష్టపడటం మరియు శిష్యులు ఆహారాన్ని పంచడానికి ఇష్టపడటం దాతృత్వం మరియు సేవ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి. ఈ కథ మన వనరులతో ఉదారంగా ఉండాలని మరియు ఇతరులకు సేవ చేయడానికి మన బహుమతులను ఉపయోగించాలని ప్రోత్సహిస్తుంది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
Great article! I found your perspective on this topic both enlightening and thought-provoking. The way you break down complex ideas into understandable insights is truly commendable. It’s interesting to see how these developments could shape our future. I’m particularly intrigued by your point about potential challenges and would love to dive deeper into that.
For those who are interested in exploring this topic further, I recommend checking out this resource for more detailed information: comprehensive guide. It offers additional insights that complement what’s discussed here.
Looking forward to hearing others’ thoughts and continuing this discussion. Thanks for sharing such valuable information!
Great article! I appreciate the clear and insightful perspective you’ve shared. It’s fascinating to see how this topic is developing. For those interested in diving deeper, I found an excellent resource that expands on these ideas: check it out here. Looking forward to hearing others’ thoughts and continuing the discussion!