
డిసెంబర్ 31st ప్రసంగము బి సిరీస్
పరిశుద్దాత్మ ద్వారా ప్రేరేపింపబడిన బిడ్డలుగా మీ పరిశుద్ధ గ్రంధములను తెరచి, ఈ సంవంత్సరాంతములో మన కొరకు ఏర్పాటు చేయబడిన మన పాఠంగా 1 పేతురు 1:22-25 చదువుకొందాం: 22-23మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా 24సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే, ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచునని పేతురు మనకు జ్ఞాపకము చేస్తూవున్నాడు.
క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ చర్చిలో మనమందరం కూడుకొన్నాం. పాత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకొంటూ మన జీవితాలలో అదెలా ఉందొ, మన దేవుని సంరక్షణను బట్టి మనమేలా దానిని దాటుకొని వచ్చామో, దానిని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకు, అలాగే ఈ సంవత్సరములో మనమెలాంటి తప్పులు/ పొరపాట్లు చేసామో, మన పొరపాటులను బట్టి ఎంతలా నష్టపోయమో, మన అలవాట్లు/ మన చుట్టూవున్నవి మన ఈ జీవితాన్ని నిర్ధేశించడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాయో, చూసుకొని దేవుని సహాయముతో సరిచేసుకొనుటకు వాటిని విడిచి సరిక్రొత్త దృక్పధముతో ఈ క్రొత్త సంవత్సరం మన జీవితాలలో దీవెనకరముగా ఉండాలని కోరుకొంటూ ఆయన కృపలో ఆయనే మనకు సహాయపడవలెనని ప్రాధేయపడుతూ ఇక్కడ కూడుకొన్నాం.
క్రొత్త సవంత్సరానికై పవిత్రపరచుకొందాం
- సత్యానికి విధేయులమవుదాం 22,23
- ఎల్లప్పుడూ నిలుచు వాక్యానికి ప్రాధాన్యమిద్దాం 24
1
గతించిపోతున్న ఈ సంవత్సరం మన అందరి జీవితాలలో, లోకంలో ఎంతో మార్పును తెచ్చింది. కాలక్రమేణా కలిగే మార్పులను గూర్చి పేతురు ఆలోచిస్తూ, యెషయా గ్రంథము నుండి యెషయా 40:6–8 మాటలను తీసుకొని, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును అని ఉటంకిస్తున్నాడు. అతడు మన అందరికి తెలిసిన ఒక వాస్తవాన్ని, మనకు జ్ఞాపకం చేస్తూ, ప్రతి దానికీ జీవిత కాలం ఉంటుందని, గడ్డి, పువ్వులు చాలా కాలం ఉండవని చెప్తూవున్నాడు. దీనిలో ఉన్న వాస్తవాన్ని మనకు అన్వయించుకొన్నప్పుడు, రోజు రోజుకు మన గొప్పతనం మన బలం మసక బారుతూ మన ఆయుష్షు తరిగిపోతూ ఉందనే కదా పేతురు చెప్తుంటా.
నిజం చెప్పాలంటే ఈ క్రొత్త సంవత్సరం మన జీవితాలలో ఎలా ఉండబోతూ ఉందొ మనకు తెలియదు? మన జీవితాల లోనికి ఏమి తేబోతూ ఉందొ మనకు తెలియదు? ఎలాంటి మార్పులు మన జీవితాలలో చోటు చేసుకోబోతున్నాయో మనకు తెలియదు?.
ఉదాహరణకు, ఈ సంవత్సరం ప్రజలందరి జీవితాలలో పెను మార్పుకు కారణం మనకు తెలుసు, పాపం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరిని ప్రభావితము చేసిన మానవుని తప్పిదం_ కరోనా అని అందరం చెప్తాము. ఎంతమంది దీని బారిన పడ్డారో కదా, ఎంత మంది మరణించారో కదా, మనకు ప్రియులైన వారు, ధనవంతులు, ప్రభావశీలురు, ఎందరో కడచూపుకు కూడా నోచుకోకుండా దిక్కులేని వారివలె మరణించటం మనం చూసాం. ఒకరిద్దరి తప్పిదము (కొందరు చెప్తున్నట్లుగా ఉదేశ్యపూర్వకమైన కొందరి అలక్ష్యము) మానవాళి మీదికి పెను ఉపద్రవమును తెచ్చింది. ఎక్కడో ఎవరో చేసిన తప్పిదం మరి ఎక్కడో ఉన్న ఎందరినో బలిగొంది. కుటుంబాలను విచ్చిన్నం చేసింది. దేశాల ఆర్ధిక వ్యవస్థలను కుప్పకూల్చింది. ఈ పాపము సర్వశరీరులు గడ్డిని పోలియున్నారు అని ఎంత స్పష్టముగా తెలియజేసిందో మనం చూసాం.
మరి మీ పాపము మాటేమిటి? మీ వ్యసనాల మాటేమిటి? అది మీ ఆత్మీయ జీవితమునే కాక ఎందరిపై ఎంతగా ప్రభావితము చూపుతున్నదో మీకు తెలుసా? మీ పొరపాట్లు/ మీ తప్పులను బట్టి మీ కుటుంబసభ్యులు, ఇతరులు ఎంతగా వారి జీవితాలలో ప్రభావితమై కూలియున్నారో/క్రుంగియున్నారో/కూలిపోవుటకు సిద్ధముగా ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ క్షణం ఒక్కసారి ఆలోచించండి.
సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును అను మాటలు వాస్తవమైన మరొక విషయాన్నీ మనకు జ్ఞపకం చేస్తున్నాయి, ఏంటో తెలుసా_ మనమెంతటి దుర్భలులమో, క్షయమై పోయేవారమో, బలహీనులమో తెలియజేస్తున్నాయి.
ఈ దుర్భలత, క్షయత, బలహీనత సూపర్ పవర్ అని చెప్పుకొంటూ అణ్వయుధాలను కలిగి ఉండి సుశిక్షితులైన సైన్యాన్ని కలిగి ఎంతగానో అభివృద్ధి చెందిన జీవిగా వర్ణించుకొంటూ డంబాలు కొట్టుకొంటూ వైజ్ఞానికులం అనుకొంటున్న మనుష్యులను _ఒక చిన్న వైరస్_ మన డొల్లతనాన్ని బయటపెట్టి తరిమితే నిస్సహాయముగా మరణము ముంగిటిలో నిలబడ్డాం. ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? క్షయతను క్షీణతను స్వతంత్రించుకొనియున్నామని ఒప్పుకోవడంలో సిగ్గెందుకు? ఈ క్షయత క్షీణత నుండి ఏవి మనలను తప్పించగలవు?
పౌలు ఈ విషయాన్నే మన పాఠములో మనకు జ్ఞాపకం చేస్తూ ఈ సృష్టి _ చెట్లు, పువ్వులు, పండ్లు, జంతువులు, మనుష్యులు, భూమి, ఈ విశ్వం అన్నింటి- వయస్సు ఉడిగిపోతుందని తెలియజేస్తూవున్నాడు. దీనిలో అంతర్లీనంగా మరొక విషయముంది గమనించారా _ పాపము యొక్క ప్రభావము శాశ్వతముగా సృష్టిపై ఉండకూడదనే ఇవన్నీ వయస్సును ధరించుకొని క్షయతను కలిగి ఉన్నాయనే విషయాన్నీ మరచిపోకండి.
సర్వశరీరులు గడ్డిని పోలి యున్నారు అనే వాస్తవంలో, సృష్టి అనేది క్షయత యొక్క దాస్యములో ఉన్నదనే విషయాన్నీ స్పష్టముగా తెలియజేస్తూవుంది. దీని నుంచి ఒక మంచి పాఠాన్ని మనము నేర్చుకోవచ్చండి _ అశాశ్వతమైన వాటి మీద మనము ద్రుష్టి ఉంచకూడదని ఇది మనకు చెప్తూవుంది. అంతేనా_ జీవితమంటే ఇదేనని మనం అనుకోకూడదని ఇక్కడ జీవితం ముగిసిన తరువాత మరొక జీవితం ఉన్నదని దాని కొరకు మనం సిద్ధపడాలని_ క్షయత నుండి అక్షయతను ధరించుకొనేందుకు సిద్ధపడాలని దేవుడు ఈ క్షయత ద్వారా మనకు జ్ఞపకం చేస్తూవున్నాడు.
దేవుని పరిపూర్ణమైన సృష్టిని ఆదాము హవ్వలు ఎలా పాడుచేశారో ఆలకిస్తాం తప్ప మన మీద మనం ద్రుష్టి పెట్టం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును అను మాటలు మనం పరిపూర్ణతకు దూరముగా ఉన్నామని, పాపపు స్వభావమును స్వతంత్రించుకొనియున్నామని తెలియజేస్తూవున్నాయి. ఈ మాటల కఠినత్వమును బట్టి కొందరు దేవునిని చేరుకోవడానికి సిఫార్సులు అవసరం అని అనుకొంటున్నారు. అందుకనే సత్వరమైన ఇతర మార్గాలను ఎన్నుకొంటున్నారు.
అన్వయింపులో భాగముగా, మనమందరము దుర్భలులమని, క్షయమైపోయేవారమని, బలహీనులమని జ్ఞాపకముంచుకొందాం. అశాశ్వతమైన వాటి మీద ద్రుష్టి ఉంచక, క్షయత నుండి అక్షయతకు మారేందుకు అవసరమైన వాటిని ధరించుకొంటూ సిద్ధపడదాం. దేవునిని చేరుటకు సత్వర ఇతర మార్గములను కోరుకోకుండా దేవునికి సమయమును ఇద్దాం. ఆయనతో మన సంబంధాన్ని ఈ క్రొత్త సంవత్సరములో బలపరచుకొందాం.
ఒకసారి యేసు నీకొదేముతో మాట్లాడుతూ, అతనితో, మీరు శరీర మూలముగా జన్మించారు అంటే మీరు క్షయమగు శరీరము యొక్క ఫలితమైయున్నారని చెప్తూ, పాపం వల్ల కలిగిన ఈ మార్పును క్షీణతను అధిగమించడానికి మీకు రెండవ పుట్టుక, ఆధ్యాత్మిక పుట్టుక, అవసరం అని చెప్పాడు జ్ఞాపకముందా? ఈ విషయాన్నే పేతురు మరల చెప్తూ, 23మీరు క్షయబీజము నుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్య మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు, అనే విషయాన్నీ ఈ క్రొత్త సంవత్సరములో జ్ఞాపకముంచుకోండి అని మనలను ప్రోత్సహిస్తున్నాడు.
అక్షయ బీజము అంటే శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమేనండి. గడ్డి వాడిపోతుంది, మరియు పువ్వు పడిపోతుంది, కాని ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలిచే ఉంటుంది అంటే ప్రభువు వాక్యము తప్ప మిగతావన్నీ మార్పు క్షీణతకు లోబడి ఉంటాయి అని అర్ధం.
దేవుని మాటలు నిజం. దేవుని మాటలు ఎప్పటికీ మారవు. దేవుని మాటలు కాలంతో మారవు. దేవుని మాటలు ఎల్లప్పుడూ నమ్మదగినవి, సజీవమైనవి, బలమైనవి. పాపం వలన క్షీణిస్తున్న శరీరము కొరకు, మానవాళి కొరకు శుభవార్తను ఈ దేవుని మాటలు ప్రకటిస్తూవున్నాయి. దేవుని రక్షణ ప్రణాళికలో భాగముగా _నీతి కొరకు ధర్మశాస్త్రము కోరుకొంటున్న వాటిని నెరవేర్చడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ధర్మశాస్త్రము క్రింద ఉంచాడని, మన పాపముల కొరకు మనము పొందవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకొని శ్రమపడి మరణించడానికి దేవుడు తన కుమారుని పంపాడని, ఆ దేవుని కుమారుడైన యేసు పాపమును మరణమును గెల్చాడని, అపవాది అధికారము నుండి విడిపించాడని, ఆ యేసులోనే క్షమాపణ నిత్యజీవము ఉందని ప్రభువు వాక్యము ప్రకటిస్తూ ఉంది. కాబట్టే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నదని పేతురు తెలియజేస్తూవున్నాడు.
2
ఇప్పుడు మనము వెనుకకు తిరిగి మనము దాటి వచ్చిన్న ఈ సంవత్సరాన్ని, అది మనకు కలుగజేసిన మార్పులను, గతించిపోతున్న మన వయస్సును జ్ఞాపకం చేసుకొందాం. అది మనకు కొద్దిగా నిరుత్సాహాన్ని కలిగించొచ్చు. కాని సజీవమైన దేవుని వాక్యము మీకు ప్రకటింపబడియున్నదనే విషయాన్ని మరచిపోకండి. మీకు ప్రకటింపబడియున్న ఆ సజీవమైన దేవుని వాక్యము మీ దైనందిన జీవితంపై కూడా ప్రభావం చూపెడుతుందని పేతురు మనకు గుర్తుచేస్తున్నాడు.
పాపము మరణము అపవాది యొక్క అధికారము అనెడి క్షీణత యొక్క దాస్యము నుండి యేసు మాత్రమే విడిపించగలడని నమ్ముతూ, కృపాసత్య సంపూర్ణుడైన ఆయనకు విధేయత చూపడానికి పరిశుద్దాత్ముడు మనకు సామర్ధ్యాన్ని కలుగజేసాడు. మీ క్రొత్త విశ్వాస హృదయము మీపట్ల దేవునికున్న ప్రేమను రుచి చూసియున్నది గనుక ఆ దేవుని ప్రేమనే ఈ రాబోతున్న క్రొత్త సంవత్సరములో మన సంబంధాలన్నిటిలో మనము వ్యక్తపరచాలని మన పాఠము మనకు తెలియజేస్తూవుంది.
ఆదిమ సంఘ క్రైస్తవులు దేవుని ప్రేమయందును సోదర ప్రేమ యందును బలపడుటకు కారణం వాళ్ళు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ఉపదేశాన్ని, బోధనలను స్వీకరించడానికి, విశ్వాసంలో బలోపేతం కావడానికి వాళ్ళు దేవుని చుట్టూ ప్రతిరోజూ కలుసుకున్నారు. సమాధానముగా ఉండటానికి ప్రయత్నించారు. సంబంధాలకు విలువనిచ్చారు. వారిలో నిరుపేదలు లేరని నిర్ధారించుకున్నారు. వారి మార్పును చుట్టుపక్కల వారు గుర్తించారు. ఆ మార్పు ప్రజలను దేవుని వైపు ఆకర్షించింది. సువార్తను ప్రకటించడానికి అది వారికీ ఎన్నో అవకాశాలను కలిగించింది_ సజీవమైన బలమైన దేవుని వాక్యంతో వాళ్ళు తమను కట్టుకోవడమే కాకుండా తమ కుటుంబాలను కూడా కట్టుకున్నారు. దాని ఫలితముగా దేవుడు అనేకులను తన సంఘానికి చేర్చుకొన్నాడు.
ద్వేషముతో నిండిన ప్రపంచములో, ఇతరుల మాటలను క్రియలను పట్టించుకోని ఈ లోకములో క్షమాపణ ఎలా చెప్పాలో, ఎలా క్షమించాలి అనే వాటికీ ప్రాముఖ్యమివ్వని ఈ లోకములో మీరు వ్యక్తపరిచే దేవుని ప్రేమ మీ సమాజముపై కుటుంబము పై ఎంతటి ప్రభావము చూపుతుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యంతో ప్రేమతో మనలను మనం కట్టుకొందాం. మన కుటుంబాలను కట్టుకొందాం. క్రొత్తదైనా సమాజాన్ని దేవుని ప్రేమతో నిర్మిద్దాం. ఇతరులను క్షమిద్దాం. క్షమాపణ చెప్దాం. నిస్స్వార్ధమైన ప్రేమను చూపిధ్ధాం. దానిని ఆభరణముగా ధరిద్దాం. ఇతరులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
పేతురు మాటలు నూతన సంవత్సరానికి కొన్ని ముఖ్యమైన తీర్మానాలను సూచిస్తున్నాయి. ప్రపంచం మరియు మనతో సహా దానిలోని ప్రతిదీ చనిపోతున్నాయని ప్రతిరోజూ గుర్తు చేసుకొందాం. దేవుని శాశ్వతమగు జీవముగల వాక్యాన్ని ప్రతి రోజు ఉపయోగించుకొందాం. మనమందరం అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారం, కాబట్టి ప్రతిదీ నశించిపోయే సమయానికి సిద్ధంగా ఉండటానికి విశ్వాసములో బలపడుదాం. దేవుడు మీ కొరకు ఏమి చేసియున్నాడో, చేస్తూ ఉన్నాడో, యేసులో ఏవి మీకోసం సిద్ధపరుస్తూ ఉన్నాడో ప్రతిరోజూ గుర్తుకు తెచ్చుకోండి. తద్వారా మీ పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ ఇతరులపై చిత్తశుద్ధిని చూపించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీకు దగ్గరగా ఉన్నవారితో మొదలై మీ శత్రువులను కూడా స్నేహితులుగా మార్చివేస్తుంది .
నిస్సందేహంగా మీరు గత సంవత్సరంలో చాలా మార్పులను ఎదుర్కొన్నారు. రాబోయే సంవత్సరంలో మీరు చాలా ఎక్కువ మార్పులను ఎదుర్కొంటారు. మీరు మార్పులను ఎదుర్కొనబోవుచుండగా, యేసులో దేవుడు ఎల్లప్పుడూ నిలిచి యుండే వాగ్దానాలను మీకు ఇచ్చియున్నాడని మాత్రమే గుర్తుంచుకోండి. వాటితో మాత్రమే మీ ప్రయాణాన్ని కొనసాగించండి. దేవుడు ఈ క్రొత్త సంవత్సరాన్ని మీకు దీవెనకరముగా ఉండులాగున చేయును గాక. ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl