
పరలోకానికి వెళ్లాలంటే శిశువు బాప్తిస్మం పుచ్చుకోవాలా?
చాలా సంవత్సరాలుగా చాలా మంది నిజాయితీపరులైన క్రైస్తవులను తీవ్రంగా బాధపెడుతున్న ఒక ప్రశ్న ఉంది. అది దేవుడు శిశువులకు పిల్లలకు బాప్తిస్మం ఇవ్వాలని కోరుకుంటున్నాడా అనే ప్రశ్న. బహుశా ఈ ప్రశ్న రావడానికి కారణం, దేవుడు బైబిల్లో ఎక్కడా “శిశువులకు బాప్తిస్మం ఇవ్వండని” లేదా “శిశువులకు బాప్తిస్మం ఇవ్వకండని” చెప్పలేదు కదా అని ఇబ్బందిపడుతుంటారు. ఈ ప్రశ్నకు వర్తించే లేఖనాలలోని ఇతర వచనాలను కూడా పరిశీలించి, వాటి ఆధారంగా దేవుడు మనం ఏమి చేయాలని కోరుకుంటున్నాడో ఒక తీర్మానానికి వధ్ధాం.
I. పిల్లలు పాపులు.
శిశు బాప్టిజంను వ్యతిరేకించే వారి ప్రాథమిక వాదనలలో ఒకటి ఏమిటంటే, పిల్లలకు బాప్టిజం అవసరం లేదని వాళ్ళు అన్ని పాపాల నుండి నిర్దోషులు అని వారు వాదిస్తారు. వారిలో చాలామందికి, నిజానికి, పిల్లలు కూడా పాపులని వాక్యంలో ఒకే ఒక దగ్గర చెప్పడం వల్ల ఆ విషయాన్ని అర్ధం చేసుకోలేక ఆ వచనం దీనికి సంబంధించినది కాదని తప్పుగా అనుకొంటున్నారు. కాబట్టే వారు పిల్లలు జవాబుదారీతనం వయస్సు అని పిలువబడే నిర్దిష్ట వయస్సు వచ్చే వరకు వారు దోషులు కాదని చెప్తారు. పిల్లలకు ఏది సరైనది మరియు ఏది తప్పు అని అర్థం చేసుకునేంత వయస్సు వచ్చే వరకు వారు పాపం చేయరని వారు వాదిస్తారు.
కాని బైబిలుకు అలాంటిదేమీ తెలియదు. పాపం యొక్క అపరాధం నుండి పాపాన్ని వేరు చేయడం అసాధ్యం. ఒకరు పాపి అయితే, అతడు పాపం యొక్క అపరాధాన్ని బట్టి దోషే. తాను దోషినని అతనికి తెలియకపోవచ్చు, కాని అతడు దోషే. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని గురించి గాని లేదా నిషేధించిన వాటిని గురించి గాని వారికి తెలియకపోవడం వల్ల పిల్లలకు గాని ఇతరులకు గాని బైబిల్ ఎక్కడా మినహాయింపు ఇవ్వలేదు.
ప్రతిఒక్కరు పుట్టుకతోనే తల్లిదండ్రుల నుండి పాప స్వభావాన్ని వారసత్వంగా పొందుతారని బైబిల్ చెప్తూవుంది. “శరీర మూలముగా జన్మించినది శరీరమని“, యోహాను 3:6 యేసు చెప్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, పాపులైన తల్లిదండ్రుల నుండి పుట్టిన వారు కూడా పాపులు అవుతారు. మన తల్లిదండ్రుల నుండి ముక్కు, కళ్ళు, చెవులు మొదలైన ఇతర లక్షణాలను వారసత్వంగా పొందినట్లే, మన తల్లిదండ్రుల నుండి కూడా ఈ పాప స్వభావాన్ని వారసత్వంగా పొందుతాం. అది మన గర్భంలో దాల్చబడిన క్షణం నుండే మనలో ఉంది. కీర్తన 51:5లో, “ఇదిగో, నేను పాపంలో రూపుదిద్దుకున్నాను; నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించింది” అని మనకు చెప్పబడింది. మనం గర్భం దాల్చిన క్షణం నుండే పాపులమని అది స్పష్టంగా చెబుతుంది. దీని అర్థం లైంగిక చర్య పాపం అని కాదు, ఎందుకంటే వివాహంలో లైంగిక సంబంధం దేవుని దృష్టిలో గౌరవప్రదమైనది, హెబ్రీ. 13:4; ఆదికాండము 2:28. ఈ వచనం జన్మించే ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రుల నుండి పాపాన్ని వారసత్వంగా పొందుతారని నిస్సందేహంగా చెప్తూవుంది.
ఈ వారసత్వ పాపం ఆదాము హవ్వల నుండి ప్రారంభమైందని బైబిల్ మనకు చెప్తూవుంది. కాబట్టి, ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి ఈ వారసత్వ పాపంతో జన్మించాడు. షేతు ఆదాము హవ్వల వలె (దేవుని స్వరూపంలో) పవిత్రంగా సృష్టించబడలేదని, కాని అతడు ఆదాము స్వరూపంలో జన్మించాడని బైబిల్ చెప్తూవుంది. ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను, ఆదికాండము 5:3. షేతు పాపంలో (పతనమైన ఆదాము స్థితిలో) జన్మించాడని అది మనకు చెప్తూవుంది. అట్లే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదని కూడా ఆదికాండము 8:21 చెప్తూవుంది. స్పష్టంగా, పాత నిబంధన మనిషి పాపిగా జన్మించాడని మనకు చెప్తూవుంది.
మానవుని పాప స్వభావం అతని పూర్వీకుడైన ఆదాము నుండి వారసత్వంగా పొందిందని చెప్పే అనేక భాగాలు కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. రోమా 5:18, కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఈ వచనం ఒక వ్యక్తి చేసిన అపరాధం (ఆదాము పాపం) ద్వారా అందరూ అంటే మానవాళి అంతా ఖండించబడ్డారని చెప్తూవుంది. ఇది పిల్లలను మినహాయించలేదు. వారు జవాబుదారీ వయస్సు వచ్చే వరకు వారు మినహాయించబడ్డారని చెప్పటం లేదు. ప్రతి ఒక్కరూ ఖండించబడ్డారు. ప్రతి ఒక్కరికి మోక్షం అవసరం, పిల్లలకు కూడా.
శిశువులు పాపం యొక్క అపరాధాన్ని బట్టి దోషులే అని నిరూపించడానికి మరొక ఆధారం, వారు చనిపోతారు. ఒక శిశువు చనిపోవచ్చు అనే వాస్తవం. ఆ బిడ్డ పాపం యొక్క అపరాధాన్ని బట్టి దోషి అని రుజువు చేస్తుంది. ఎందుకంటే మరణం పాపం యొక్క ఫలితం. పిల్లలు పవిత్రులైతే వాళ్ళు చనిపోకూడదు. ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను, రోమా. 5:12. ఎవరైనా చనిపోయినప్పుడల్లా, అతడు ఆ ఒక్క మనిషి నుండి, అంటే ఆదాము నుండి పాపాన్ని వారసత్వంగా పొందాడనే వాస్తవానికి ఇది రుజువు అని ఈ వచనం స్పష్టంగా చెప్తూవుంది. మరొక వచనం కూడా అదే ఆలోచనను వ్యక్తపరుస్తుంది. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు, 1 కొరింథీ 15:22. మనమందరం ఆదాము నుండి పాపాన్ని వారసత్వంగా పొందాము. అందులో శిశువులు కూడా ఉన్నారు. వారు చనిపోగలరనే వాస్తవం దీనిని రుజువు చేస్తుంది.
ఈ వేర్వేరు భాగాలన్నీ పిల్లలు పాపులని చెప్తున్నాయి. కాబట్టి, వారికి బాప్తిసం అవసరం. చాలా మంది చెప్పుకుంటున్నట్లుగా వారు నిర్దోషులు కాదు. బైబిల్ ఎల్లప్పుడూ మనిషిని పాపి అని అతడు తిరిగి జన్మించే వరకు పూర్తిగా అనీతిపరుడని చెప్తూవుంది. కాబట్టి శిశువులకు బాప్తిసం ఇవ్వాలి ఎందుకంటే వారు కూడా ఇతరుల మాదిరిగానే వారి పాపాలను కడిగివేయాలి.
II. పిల్లలు నమ్మగలరు.
మనం పిల్లలకు బాప్తిస్మం ఇవ్వడానికి మరొక కారణం ఏమిటంటే వారు యేసును నమ్మగలరు. చాలా మంది ఈ మాటలతో విభేదించొచ్చు. వాళ్ళు పిల్లలు నమ్మగలరని అనుకోరు, కాబట్టి పిల్లలు బాప్తిస్మం తీసుకోకూడదని అంటారు. పిల్లలు నమ్మడానికి చాలా తక్కువ అని… పిల్లలకు నమ్మేంత తెలివితేటలు లేవని వాళ్ళు నమ్మడానికి ముందు అర్థం చేసుకునే వయస్సుకు చేరుకోవాలని వారు అంటున్నారు. కానీ పిల్లలు నమ్మగలరని బైబిల్ చెప్తూవుంది.
మనం అర్థం చేసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే విశ్వాసం తెలివితేటలకు పర్యాయపదం కాదు. అవి రెండు అస్సలు ఒకేలా ఉండవు. విశ్వాసం లేకుండా తెలివితేటలు ఉండొచ్చు. బైబిల్ తెలిసినా, దానిని నమ్మని వ్యక్తుల గురించి మనందరికీ తెలుసు. విశ్వాసం మరియు తెలివితేటలు పర్యాయపదాలు కావు. అవి ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి. నిజానికి, మనిషి సహజ తెలివితేటలు వాస్తవానికి విశ్వాసానికి వ్యతిరేకం. క్రైస్తవ మతం మూర్ఖత్వం అని మనిషి తర్కం ఒకనికి చెప్పొచ్చు. యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు, 1 కొరింథీ 1:22-24. త్రిత్వాన్నిగాని లేదా యేసుక్రీస్తునుగాని, లేదా పరలోకాన్నిగాని విశ్వసించడం తెలివైన పని కాదని ఒకనికి వాని తెలివితేటలు చెప్తుండొచ్చు. ఆ విషయాలు పూర్తిగా విశ్వాసానికి సంబంధించినవి. వాటికి మనిషి తెలివితేటలతో సంబంధం లేదు. కాబట్టి, విశ్వాసం మరియు మానవ సహజ తెలివితేటలు నిజంగా ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని బైబిల్ చెప్తూవుంది.
విశ్వాసం అంటే నమ్మకం అని కూడా చెప్పొచ్చు. మనం ఆ విధంగా ఆలోచిస్తే, ఒక బిడ్డ తన తల్లిదండ్రులను చాలా చిన్నగా ఉన్నప్పటికీ నమ్ముతుందని మనకు తెలుసు. మనం సాధారణంగా తెలివితేటలు అని అనుకునేది లేకపోయినా, దేవుడు ఆ బిడ్డను తనపై ఆ రకమైన పూర్తి నమ్మకాన్ని ఎలా కలిగించగలడో చూడటం కష్టం కాదు.
దానిని అర్థం చేసుకుంటే, దేవుని కృప నిజంగా మన తెలివితేటలకు మించినదని మనం గ్రహిస్తాం. ఆయన కృపను గ్రహించడం ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ నుండి ఒక ప్రత్యేక ప్రత్యక్షత అవసరం. కేవలం తెలివితేటలు సరిపోవు. ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు, 1 కొరింథీ 2:9-10,14. దేవుని కృప మన చిన్న తెలివితేటలకు మించినది. విశ్వాసం కలిగి ఉండటానికి తెలివితేటల కంటే చాలా ఎక్కువ అవసరం. దేవుడు మన హృదయాలలో ఒక అద్భుతం చేయాలంటే అది అవసరం. దేవుడు ఆ అద్భుతాన్ని ఒక పెద్దవారి హృదయంలో ఎలా చేయగలడో, శిశువు హృదయంలో కూడా అలాగే చేయగలడు.
విశ్వాసం మరియు తెలివితేటలు పర్యాయపదాలు కాదనే వాస్తవాన్ని మరొక విధంగా ఉదహరించొచ్చు. పెద్దలు నిద్రపోతున్నప్పుడు విశ్వాసం కలిగి ఉంటారు. వారు స్పృహలో ఉండకపోవచ్చు మరియు వారి తెలివితేటలను అస్సలు ఉపయోగించకపోవచ్చు, అయినప్పటికీ వారు నిద్రపోతున్నప్పుడు విశ్వాసం కలిగి ఉండొచ్చు. మనం మన తార్కిక శక్తులను ఉపయోగించనప్పుడు కూడా విశ్వాసం ఉండొచ్చు మరియు ఉంటుంది. శిశువుల విషయంలో కూడా అంతే.
పిల్లలు నమ్మగలరా లేదా అనే దాని గురించి మాట్లాడేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే, నమ్మని ఎవరైనా శాశ్వతంగా తప్పిపోతారని బైబిల్ చెప్తూవుంది. పిల్లలు క్రీస్తును నమ్మలేరని ప్రజలు చెబితే, నమ్మని పిల్లలు చనిపోతే తప్పిపోతారని కదా బైబులు చెప్తూవుంది. బైబిల్‌కు ఈ రెండు విషయాలను గురించి మాత్రమే తెలుసు. ఒకరు క్రీస్తును విశ్వసిస్తే, అతడు రక్షింపబడతాడు. నమ్మకపోతే, అతడు నష్టపోతాడు. ఇది మనకు మార్కు 16:16లో చాలా స్పష్టంగా చెప్పబడింది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. బైబిల్ తటస్థ స్థానం గురించి చెప్పటంలేదు. నమ్మని ఎవరైనా అవిశ్వాసి క్రిందే లెక్క. విశ్వాసం లేకపోవడం అవిశ్వాసం. పిల్లలు నమ్మలేరని చాలా గట్టిగా చెప్పే ముందు ఒక్కసారి ఈ విషయాన్ని గురించి ఆలోచించండి.
విశ్వాసమే రక్షణకు ఏకైక మార్గమని బైబులులోని ఎన్నో వచనాలు చెప్తూవున్నాయి. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను, యోహాను 3:18. cf. 14-16,36, యోహాను 8:24, I యోహాను 5:1. దేవుడు మనకు వాగ్దానం చేసిన శాశ్వత బహుమతులను పొందే ఏకైక మార్గం విశ్వాసం ద్వారానే అని ఈ భాగాలు మనకు పదే పదే చెబుతున్నాయి. అవి పిల్లలకు ఎక్కడా మినహాయింపు ఇవ్వలేదు. వారు రక్షింపబడటానికి వేరే మార్గం గురించి బైబిల్ మాట్లాడటం లేదు. అందరిలాగే వారు కూడా క్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షించబడతారు. పిల్లలు నమ్మొచ్చు.
ఆ ఆలోచన బైబిల్ అంతటా అనేక విధాలుగా సూచించబడింది. దేవుని రాజ్యంలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని మనకు ఖచ్చితంగా తెలుసు. యేసు ఆ ఆలోచనను అనేక సందర్భాలలో వ్యక్తపరిచాడు, ముఖ్యంగా చిన్న పిల్లలను యేసు వద్దకు తీసుకువచ్చిన వారిని శిష్యులు అభ్యంతరపర్చినప్పుడు, అక్కడ ఆయన వారితో, చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటి వారిదే అని అన్నాడు, మార్కు 10:14. దేవుని రాజ్యంలో ఖచ్చితంగా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ సంఘటనలోని పిల్లలను లూకా ప్రత్యేకంగా శిశువులు అని చెప్తున్నాడు. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసికొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి– చిన్నబిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటి వారిది, లూకా 18:15,16.
పిల్లలు శిశువులని ఈ వచనం చెప్తూవుంది. అయినప్పటికీ, యేసు వారిని చూసి వారిని ఆశీర్వదించడం ముఖ్యమని భావించాడు. చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను, లూకా 18:17. పెద్దల విశ్వాసం కంటే ఆ చిన్నపిల్లల విశ్వాసం గొప్పదని ఆయన ప్రశంసించాడు. చిన్నపిల్లలు నమ్మడం అసాధ్యమని యేసు చెప్పలేదు. మత్తయి 18:6లో నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అని చెప్పాడు. చిన్నపిల్లలు నమ్మగలరా? ఖచ్చితంగా.
లేఖనంలోని మరొక భాగం శిశువులు నమ్మడం సాధ్యమేనని స్పష్టంగా చెప్తూవుంది. అదే I యోహాను 2:13,14, తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్న పిల్లలు తెలివైనవారు కాకపోయినా, వారు దేవుని వాక్యాన్ని అధ్యాయనం చేయకపోయినా, వారు దేవుణ్ణి తెలుసుకుని ఆయనను నమ్మగలరు.
విశ్వాసం పరిశుద్ధాత్మ ద్వారా జరిగే అద్భుతం. ఇది దేవుడు మన హృదయాలలో చేసేది. దేవుడిని పరిమితం చేసి, శిశువు హృదయంలో ఆయన విశ్వాసాన్ని కలిగించలేడని మనం ఎవరండీ చెప్పడానికి? ముఖ్యంగా ఆయన అలా చేస్తానని చెప్పినప్పుడు? క్రైస్తవ మతం మూర్ఖత్వం అని మన అవగాహన మరియు తెలివితేటలు చెప్తూవున్న పెద్దవారి హృదయంలో విశ్వాసాన్ని కలిగించడం కంటే ఆయనకు శిశువు హృదయంలో విశ్వాసాన్ని కలిగించడం “సులభం” కావొచ్చేమో. బాప్తిస్మమిచ్చు యోహాను తన తల్లి గర్భములో ఉండగా పరిశుద్ధాత్మ శిశువు హృదయంలో పనిచేయగలడనడానికి చివరి రుజువు. ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై …. ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను, లూకా 1:41 & 44. ఆ వాక్యభాగం పరిశుద్ధాత్మ శిశువు పుట్టకముందే అతని హృదయంలో పనిచేయగలదని అది మనకు చెప్తూవుంది. కాబట్టి దేవుడు శిశువుల హృదయంలో విశ్వాసాన్ని కలిగించగలనని చెప్పినప్పుడు, ఆయన మాటను ఎందుకు నమ్మకూడదు. శిశువులు నమ్మగలరు.
పైన పేర్కొన్న వచనాలలో ఏదీ బాప్తిస్మము గురించి ప్రత్యేకంగా మాట్లాడటం లేదని కొందరు అభ్యంతరం చెప్పొచ్చు. అవి అలా చేయవు. అయినప్పటికీ, శిశువుల బాప్తిస్మము చర్చకు అవి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే శిశువులు నమ్మలేరని మరియు అందువల్ల బాప్తిస్మము పొందకూడదని చెప్పే వారి వాదనలను అవి బద్దలు కొడతాయి. శిశువులు నమ్మగలరు.
III. బాప్తిస్మము అనేది దేవుని రక్షణ చర్య… మనుషుల విధేయత చర్య కాదు.
బాప్తిస్మము విషయంలో మనం నిరంతరం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే, బాప్తిస్మము అనేది దేవుడు మన కోసం చేసేది, మనం దేవుని కోసం చేసేది కాదు. శిశు బాప్తిస్మము విషయంలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే బాప్తిస్మము మనం దేవుని కోసం చేసేది అయితే, అది ఒక పిల్లవాడు చేయాలనుకునే విధేయత యొక్క ఉద్దేశపూర్వక చర్య అవుతుంది. అందుకు బాప్తిస్మము అభ్యర్థించేంత వయస్సు ఉండాలి. కాని బాప్తిస్మములో, రక్షణ సువార్త విషయంలో, మనిషి కేవలం గ్రహీత మాత్రమే. మనం దేవునికి ఏమి ఇవ్వడం లేదు, కాని బాప్తిస్మములో పొందుతున్నాం. మనం బాప్తిస్మములో పొందుతున్న కారణం ఏమిటంటే, మన సహజ స్థితిలో, మనం పాపంలో చనిపోయాము. శారీరకంగా చనిపోయిన వ్యక్తిని బయటి నుండి బ్రతికించాలి. ఉదాహరణకు, రోడ్డు వెంట చనిపోయిన జంతువును తీసుకోండి. ఆ జంతువు సజీవంగా ఉండటానికి ఏమాత్రమును కోరుకోలేదు. మనం స్వభావంలో అలాగే ఉన్నాము. మనం ఆధ్యాత్మికంగా చనిపోయాం. మనం సజీవంగా ఉండాలని ఏమాత్రమును కోరుకోలేం. కాని అప్పుడు దేవుడు బయటి నుండి వచ్చి సువార్త ద్వారా బాప్తిస్మము ద్వారా మనల్ని జీవంలోకి తీసుకువస్తాడు. అందుకే బాప్తిస్మము తరచుగా కొత్త జన్మ అని చెప్పబడుతుంది. మనం పునర్జన్మించబడ్డాం. మనం ఒకప్పుడు శారీరకంగా జన్మించాం, శారీరకంగా జీవించి ఉన్నాం. రెండవసారి జన్మించేంత వరకు మనం ఆధ్యాత్మికంగా మరణించి ఉన్నాం.
యోహాను 3:3-5లో యేసు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. అందుకు నీకొదేము – ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బాప్తిస్మము ద్వారా మనం తిరిగి జన్మించాం. దేవుడు మనల్ని ఆధ్యాత్మిక మరణం నుండి ఆధ్యాత్మిక జీవితానికి తీసుకు వచ్చాడు. ఇది దేవుడు మన కోసం చేసేది, మనం ఆయన కోసం చేసిన చర్య కాదు.
బాప్తిస్మము అనేది దేవుడు మనలో పనిచేసేది అని మనకు చాలా స్పష్టంగా చూపించే మరొక భాగం, తీతు. 3:5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. బాప్తిస్మము అనేది మనం చేసే మంచి పని కాదు. ఇది మనం దేవుని నుండి ఏదో పొందే చర్య. మనం పూర్తిగా గ్రహీతలమే. మనం బాప్తిస్మములో కేవలం పుచ్చుకొంటాం కాబట్టి, శిశువులు కూడా దానిలో పాల్గొనొచ్చు. వారు విశ్వాసం ద్వారా బాప్టిజం యొక్క ఆశీర్వాదాలను కూడా పొందొచ్చు.
బాప్తిస్మములో మనం పుచ్చుకొనే ఆశీర్వాదాలు పాప క్షమాపణ మరియు నిత్యజీవం. అవి శిశువులకు కూడా అందరిలాగే అవసరం. ఈ ఆశీర్వాదాలు బైబిల్లో అనేక ప్రదేశాలలో వివరించబడ్డాయి, అక్కడ బైబిల్ బాప్తిస్మమును గురించి మాట్లాడుతోంది. పెంతెకొస్తు రోజున, పేతురు కొత్తగా సువార్తను ఆలకించిన వారితో, మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అపొ. కార్య. 2:38 అని చెప్పాడు. లేదా పౌలు తన మతమార్పిడి గురించి చెబుతున్నప్పుడు, అననీయ తనతో, బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పాడని చెప్పాడు, అపొ. కార్య. 22:16. బాప్తిస్మము ద్వారా, మన పాపాలు కడిగివేయబడగలవు. బాప్తిస్మము యొక్క రక్షణ శక్తిని అందంగా వ్యక్తపరిచే మరొక భాగం I పేతురు. 3:21, బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది (cf. ఎఫెసీ 5:26, రోమా 6:3, I కొరింథీ. 6:11). ఈ భాగాలన్నీ బాప్తిస్మము ద్వారా పొందే ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాయి. చిన్న పిల్లలకు పెద్దలకు అందరికీ ఇవి అవసరమైన ఆశీర్వాదాలు. ఈ భాగాలలో ఏదీ బాప్తిస్మమును విధేయత చర్యగా లేదా మనం దేవుని కోసం చేస్తున్నదిగా చెప్పటంలేదు. అవన్నీ దేవుడు మన కోసం ఇలా చేస్తున్నాడని చెబుతున్నాయి. మనం గ్రహీతల కంటే మరేమీ కాదు. విశ్వాసియైన ఎవరైనా బాప్తిస్మము ద్వారా ఈ ఆశీర్వాదాలను పుచ్చుకోవచ్చు.
ఇప్పటివరకు, శిశువులకు బాప్తిస్మం ఇవ్వకూడదని చెప్పే వారి అభ్యంతరాలకు ఎక్కువగా జవాబులను పరిశీలించాం. శిశువులకు బాప్తిస్మం ఇవ్వకపోవడానికి గల కారణాలు చెల్లుబాటు అయ్యే లేఖనాలపై ఆధారపడిన కారణాలు కాదని అర్ధం చేసుకొనేందుకు ప్రయత్నించాం. “వారు ఎందుకు తప్పు” అని చూపించడానికి సమయాన్ని ఎక్కువగా గడిపాము. ఇప్పుడు “మనం సరైనవాళ్ళం” అని చూపించడానికి కొంత సమయాన్ని వెచ్చిద్దాం.
IV. బైబిల్లో మొత్తం కుటుంబాలు బాప్తిస్మం పొందాయి
విభిన్న సందర్భాలలో మొత్తం కుటుంబాలు ఒకేసారి బాప్తిస్మం పొందాయని బైబులు చెప్తూవుంది. ఉదాహరణకు, లూదియ క్రైస్తవ మతంలోకి మారినప్పుడు, ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందారు, అపొ. కార్య. 16:15 అని చెప్తూవుంది. నిజమే, ఆ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నారో, వారు ఎంత వయస్సు గలవారో మనకు చెప్పబడలేదు, కాని ఆ ప్రకటన పిల్లలు ఉన్నారని చెబుతున్నట్లు అనిపిస్తుంది. అపొ. కార్య. 16:33లో ఫిలిప్పీలోని చెరసాల అధికారి విషయములో కూడా అంతే, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. స్తెఫను కుటుంబం గురించి మనకు అదే విషయం చెప్పబడింది, I కొరింథీ 1:16, స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని. ఈ ఇళ్లలో ఏ ఒక్కదానిలోనూ ఆయా కుటుంబ సభ్యులు ఎంతమంది? వారి వయస్సులు ఎంత అనే విషయం చెప్పబడలేదు. అయినప్పటికీ ఈ మూడు ఇళ్లలో కొంతమంది చిన్న పిల్లలు లేరు అని చెప్పటం చాలా అసంభవం అనిపిస్తుంది. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు నివసించేవారని, ఆ ఇళ్లలో తరచుగా సేవకులు మరియు వారి కుటుంబాలు కూడా ఉంటారని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇది ప్రత్యేకంగా నిజం. ఆ భాగాల ఆధారంగా మాత్రమే శిశు బాప్టిజంను నిరూపించడానికి ప్రయత్నించటం లేదు. కాని వాటిని ఇతర ఆధారాలకు జోడించినప్పుడు అవి బలమైన మద్దతు ఇచ్చే ఆధారాలను అందిస్తున్నాయి.
V. బాప్తిస్మము సున్నతి స్థానంలోకి వచ్చింది
బాప్తిస్మము పాత నిబంధన సున్నతిని భర్తీ చేసిందనే వాస్తవం శిశు బాప్తిస్మముకు బలమైన మద్దతు. పాత నిబంధనను పరిశీలించినప్పుడు, దేవుడు తన ప్రజలకు మొదట సున్నతిని ఆజ్ఞాపించినప్పుడు, శిశువు సున్నతి చేయబడినప్పుడు అతనికి ఎంత వయస్సు ఉండాలో ఆయన వారికి చెప్పాడు. మీలో ఎనిమిది రోజుల వయస్సు ఉన్నవాడు సున్నతి చేయబడాలి, ఆది. 17:12. ఆ ఆచారం క్రీస్తు కాలం వరకు కొనసాగింది. ఎనిమిదవ రోజున క్రీస్తు స్వయంగా సున్నతి చేయబడ్డాడు, శిశువుకు సున్నతి చేయడానికి ఎనిమిది రోజులు పూర్తయినప్పుడు, అతనికి యేసు అని పేరు పెట్టారు, లూకా 2:21. శిశువుకు ఎనిమిది రోజుల వయస్సు ఉన్నప్పుడు సున్నతి జరిగింది. కానీ క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన సున్నతిని రద్దు చేసాడు. ఆ ఆచారాన్ని ఆయన తొలగించడం అంటే ఆయన ఇక్కడ ఉన్నాడని మరియు సున్నతి కోసం సూచించిన ప్రతి దాన్ని నెరవేర్చాడని సూచించడమే. బాప్తిస్మమును యేసు దాని స్థానంలో స్థాపించాడు. ఇది మనకు కొలొస్సయులు 2:11-12లో చెప్పబడింది. క్రీస్తు సున్నతి ద్వారా శరీరము యొక్క పాపాలను తీసివేసి (క్రీస్తు ఆజ్ఞాపించిన “సున్నతి”, అంటే బాప్తిసం); బాప్తిసంలో ఆయనతో పాటు పాతిపెట్టబడినందున, ఆయనలో మీరు చేతులు లేకుండా చేసిన సున్నతి (బాప్టిజం) ద్వారా సున్నతి పొందారు. ఈ వచనాలు క్రీస్తు ఆజ్ఞాపించిన కొత్త రకం “సున్నతి” గురించి మాట్లాడుతున్నాయి. ఇది పాత నిబంధన భౌతిక సున్నతి కాదు. క్రొత్తనిబంధనలో మరికొన్ని భాగాలలో కూడా సున్నతి పూర్తిగా రద్దు చేయబడిందని మనకు గట్టిగా చెప్పబడింది (cf. గలతి 2:3, 5:6, I కొరిం. 7:18-19). యేసు రద్దు చేసిన సున్నతి స్థానంలో, పైన పేర్కొన్న లేఖన భాగాల ప్రకారం, ఆయన బాప్టిజంను ఆదేశించాడు. యేసు సున్నతిని బాప్తిస్మముతో భర్తీ చేశాడు. ఇప్పుడు బాప్తిస్మము సున్నతిని భర్తీ చేస్తే, బిడ్డకు ఎన్ని రోజుల వయసులో బాప్తిస్మము ఇవ్వాలి. పిల్లలు బాప్తిస్మము కోరేంత పెద్దయ్యే వరకు మనం వేచి ఉండాలనే వాదన లేదా పిల్లలు నమ్మలేరు కాబట్టి బాప్టిజం పొందకూడదనే వాదన లేదా పిల్లలు నిర్దోషులు వారికి బాప్టిజం అవసరం లేదనే వాదనలు ఏ విషయాన్ని చెప్తూవున్నాయి. ఈ వాదనలన్నీ తప్పు అని అనిపించటం లేదా? దేవుడు శిశువులకు సున్నతి చేయించుకోవాలని ఆజ్ఞాపించాడు. శిశు సున్నతి శిశు బాప్టిజం గురించి మనకు ఏది చెప్పటం లేదు అని తప్పించుకొందామా?
VI. పిల్లలు “అన్ని దేశాలలో” ఒక భాగం.
మనం శిశువులకు బాప్తిస్మం ఇవ్వడానికి మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే, యేసు “అన్ని దేశాలకు” బాప్తిస్మం ఇవ్వమని మనకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి, మత్తయి 28:20. పిల్లలు ఖచ్చితంగా “అన్ని దేశాలలో” ఒక భాగం. యేసు మనకు అన్ని దేశాలకు బోధించమని మరియు బాప్తిస్మం ఇవ్వమని ఆజ్ఞాపించినప్పుడు, ఆయన ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఆయన పిల్లలను మినహాయించలేదు. పరిశుద్ధ మార్కు నమోదు చేసిన, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును (మార్కు 16:16) అనే మాటలలో అతడు ఇచ్చిన మినహాయింపుల గురించి మనకు ఏమి చెప్పబడలేదు. యేసు బాప్తిస్మం ఎంత ముఖ్యమైనదని భావించాడో గమనించండి. ఆయన దానిని విశ్వాసంతో సమానంగా ఉంచాడు. ఆయన పిల్లలను మినహాయించలేదని కూడా గమనించండి. వాస్తవానికి, బైబిల్లో ఎక్కడా పిల్లలను బాప్తిస్మం నుండి మినహాయించమని మనకు ఆజ్ఞాపించబడలేదు. పిల్లలకు బాప్తిస్మం ఇవ్వడానికి ధైర్యం చేయమని చెప్పే వారు బైబిల్ దానిని నిషేధించే ఏ లేఖన భాగాన్ని సూచించలేరు. ఈ రుజువుల భారాన్ని మీ భుజాలపై వేస్తున్నాను. శిశు బాప్టిజంకు అనుకూలంగా ఉన్న అన్ని ఆధారాలతో సహా, రుజువుల భారం అక్కడే ఉండాలి.
VII. ప్రారంభ క్రైస్తవ సంఘములో శిశు బాప్టిజం సాధారణమని సంఘ చరిత్ర చూపిస్తుంది
శిశువుల బాప్టిజం గురించి బైబిల్ బోధించిన వాటిని ప్రారంభ చర్చి ఫాదర్లు ఎలా అర్థం చేసుకున్నారో అధ్యయనం చేయడం విలువైనది.
క్రీ.శ. 250 వరకు శిశు బాప్టిజం విస్తృతంగా ఆచరించబడిందనేది దాదాపు ఎవరూ ప్రశ్నించని దృఢమైన వాస్తవం. ఆ తేదీకి ముందు దీనికి సంబంధించిన అనేకమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇవి మొదటి మరియు రెండవ శతాబ్దాలలో శిశు బాప్టిజం సాధారణమని స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి.
వీరిలో ఒకరు చర్చి ఫాదర్ ఇరేనియస్. ఇతడు బాప్టిజం గురించి ప్రస్తావిస్తూ, ఆయన (ప్రభువు తన ద్వారా అందరిని రక్షించడానికి వచ్చాడు; ఆయన ద్వారా దేవునిలో తిరిగి జన్మించిన వారందరూ, శిశువులు, చిన్న పిల్లలు, బాలురు, పెద్దలు మరియు వృద్ధులు అని రాసాడు. ఇరేనియస్ తన మరణానికి కొంతకాలం ముందు, అంటే దాదాపు క్రీ.శ. 200లో ఆ ప్రకటన రాశాడు. అతని ప్రకటన నుండి, అప్పట్లో శిశు బాప్టిజం సాధారణంగా ఆచరించబడిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇరేనియస్ అపొస్తలుడైన యోహాను విద్యార్థి అయిన పాలికార్ప్ యొక్క విద్యార్థి మరియు సన్నిహిత స్నేహితుడు అనే వాస్తవం గమనించదగినది. యోహాను కాలం మరియు ఇరేనియస్ కాలం మధ్య వంద సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉంది. ఇంకా, ఇరేనియస్ ఒక వేదాంతవేత్తగా పరిగణించబడ్డాడు మరియు అతని కాలంలో సిద్ధాంతపరంగా సరైనవారిలో అతడు ఒకడు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl