అడ్వెంట్  1                   సిరీస్ B  (పాత నిబంధన ప్రసంఘములు)

పాత నిబంధన పాఠము: యెషయా  64:1-8; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 1:3-9; సువార్త పాఠము: మార్కు 13:32-37; కీర్తన 24.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠమును చదువుకొందాం: యెషయా 64:1-8

యెషయా 641-8, గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడ లేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రులవంటి వారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను నీ నామమును బట్టి మొఱ్ఱపెట్టు వాడొకడును లేకపోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొను వాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషముల చేత నీవు మమ్మును కరిగించి యున్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

నేటి మన పాఠము విడుదల కొరకు చేసిన ప్రార్ధనలో (యెషయా 63:7-64:12లో) ఒక భాగమై ఉంది. యెషయా మరణించిన చాలా సంవత్సరాలకు బాబిలోనియన్లు యెరూషలేమును గెల్చి యూదులను బందీలుగా తీసుకువెళ్లడం జరిగింది. అప్పుడు 63:18లో, 64:10,11లో చెప్పబడివున్నట్లుగా, శత్రువులు పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. వారి ధాటికి, పరిశుద్ధ పట్టణము బీటిభూములాయెను. సీయోను బీడాయెను, యెరూషలేము పాడాయెను. వారి పితరులు కీర్తించుచుండిన పరిశుద్ధ మందిరము అగ్నిపాలాయెను, వారికి మనోహరములైనవన్నియు నాశనమైపోయాయి. యెహోవాను ఆయన వాగ్దానాలను గురించి తెలియని వ్యక్తులు ఆయన ఆలయాన్ని తొక్కడానికి దేవుడు ఎందుకు వారిని అనుమతించాడని, వాళ్ళు యెరూషలేముకు మరియు ఆలయానికి దూరంగా ఎందుకని బహిష్కరించబడ్డారని ప్రవాసంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపడుతూ ఉండొచ్చు. ప్రభువును ఎరుగని వారు వాగ్దాన దేశాన్ని నాశనం చేసారు. దేవుడు మమ్మును, మాకిచ్చిన వాగ్దానాలన్నింటినీ విడిచిపెట్టేసాడా అని వాళ్ళు మధనపడుతూ ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు దేవుని మంచితనం శక్తిపై వారి విశ్వాసాన్ని సవాలు చేస్తూవున్నాయి. కాని ఈ ప్రార్థన చేసిన ప్రవక్త ఆ స్థితిలో నిరాశకు గురికాలేదు. బదులుగా, అతడు దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకున్నాడు, “యెహోవా తిరిగి రమ్ము” (17వ వచనం) అని ప్రార్థించాడు.

ప్రవక్త ఇలా ప్రార్ధించడానికి కారణం, యెషయా కాలములో ప్రజల జీవితాలు, దురాశ, అసూయ, గర్వం, ఆవేశం, మద్యపానం, లైంగిక అనైతికత, విగ్రహారాధనతో నిండివున్నాయి. ఇశ్రాయేలు నా జనులని ప్రేమచేతను తాలిమి చేతను యెహోవా వారిని విమోచించెను గాని వారు తిరుగుబాటు చేయగా ఆయన వారికి విరోధియై తానే వారితో యుద్ధము చేసెనని వారియెడల ఆయనకున్న జాలి, వాత్సల్యత అణగిపోయెనని వారిపైకి భయంకరమైన శ్రమ రాబోతుందని ఆయన పరిపాలననెన్నడును ఎరుగని వారివలె, ఆయన పేరెన్నడును పెట్టబడని వారివలె (వాళ్ళు) ఉండాల్సి వస్తుందని 63:10,15,19 ప్రవక్త ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తుండటం నిజముగా విచారకరం.

బబులోనులో ఇశ్రాయేలీయులు ఎదుర్కొనే పరిస్థితికి ఖచ్చితంగా ఈ ప్రార్థన సరిపోతుంది, ఈ అంత్యదినములలో లోకమునకు సంభవింపబోయే శ్రమలను బట్టి లోకములో ఉన్న మనము కూడా ప్రభావితులం అవుతాం. దాని ఫలితాలను మనము కూడా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈ నూతన సంఘ సంవత్సరపు మొదటి ఆదివారమున ఈ ప్రార్ధనను మన ప్రార్ధనగా చేసుకొని ఆయన కనికరము మన అందరిపై ఉండునట్లు ప్రార్థిస్తూ ప్రవక్తతో ఏకీభవిస్తూ వాక్యము ద్వారా ఆయన వైపు మళ్ళుకొందాం.

అంశము: కనికరము కొరకైన  విజ్ఞప్తి
1. ప్రభువా మేము నీపై ఆధారపడునట్లు మమ్మును నూతనపరచుము 1-3
2. ప్రభువా మమ్మును శిక్షింపకుము 4-5
3. ప్రభువా మేము ఘోర పాపులమై యున్నాము మమ్మును క్షమించుము 6-8

1

ప్రభువా, 1గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక అను మాటల ద్వారా ప్రవక్త, ఇశ్రాయేలుకు గతాన్ని గుర్తుచేస్తూ, వారికి మరొకసారి జరిగిన వాస్తవాన్ని గుర్తుచేస్తూ ఉన్నాడు.

ప్రవక్త వారికి గుర్తుచేస్తూవున్న వాస్తవమేమిటంటే, మీరు ఐగుప్తు దాస్యమునుండి విడిపింపబడి వాగ్దాన దేశమునకు ప్రయాణమై వెళ్తున్నపుడు, మార్గములో, సీనాయి అరణ్యమునకు వచ్చి అక్కడ ఆ పర్వతము ఎదుట దిగారు. అక్కడ, నిర్గమ 19:4-8,18లో చెప్పబడియున్నట్లుగా, ఆయన ఇశ్రాయేలీయులైన మీతో నిబంధన చేసికొనుటకు గగనమును చీల్చుకొని దిగి వచ్చియున్నాడు. అక్కడ యెహోవా మీతో మాట్లాడుతూ, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూశారు. ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. (ఇక్కడ “యెడల” అను మాట (కండీషనల్ క్లాజ్) ఇశ్రాయేలీయులందరితో యెహోవా నిబంధనను చేసుకొంటూ ఉన్నాడని ఆ ఒడంబడిక షరతులతో కూడుకున్నదని తెలియజేస్తూవుంది). మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పినప్పుడు 8అందుకు మీరందరు –యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చియున్నారు. అప్పుడు 18యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను అను జరిగిన వాస్తవ సంఘటనను వారికి మరొకసారి గుర్తుచేస్తూ ఉన్నాడు.

మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా అంటే శ్రమతో సంపాదించిన ఖరీదైన ఆస్తిగా, జాగ్రత్తగా కాపాడబడు ఆస్తిగా ఉంటారని దేవుడు వారితో చేసిన వాగ్ధానాన్ని ప్రవక్త వారికి గుర్తుచెయ్యడానికి కారణమేమై ఉండొచ్చు?

మొదటిగా, ఇశ్రాయేలు ఇప్పుడు దేవునితో కలిగియున్న ప్రత్యేకమైన సంబంధములో, వాళ్ళు ఐగుప్తు దాస్యము నుండి బయటకు తీయబడ్డారు, దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డారు, ఆయన వారిగా, వారికి ప్రత్యేకమైన హక్కులు, ప్రయోజనాలు, సంరక్షణ నిర్ణయింపబడింది, వారి విధులకు అవే పునాది. అప్పటివరకు టాస్క్‌మాస్టర్ కొరడా దెబ్బలకు భయపడి బలవంతంగా విధేయత చూపటమే వారికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు సంపూర్ణమైన స్వేచ్ఛలో స్వచ్చంధమైన విధేయతతో ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన నిబంధన అనుసరించి నడుస్తూ వాళ్ళు యెహోవా స్వంత ప్రజలనే విషయాన్ని సమస్త దేశ జనులకు స్పష్టముగా చూపించాలని ఆయన కోరుకున్నప్పుడు అందుకు మీరందరు స్వచ్చంధముగా సంపూర్ణ స్వేచ్ఛలో అంగీకరించియున్నారు కదా అనే విషయాన్ని ప్రవక్త వారికి గుర్తు చేస్తూవున్నాడు.

రెండవదిగా, మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పటం నిజముగా వారికి ఇవ్వబడిన ధన్యత. ఒక రాజుచే పరిపాలించబడు దానిని రాజ్యము అని అంటారు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందురని చెప్పటంలో దేవుని ఉదేశ్యము? ఇశ్రాయేలు ఇప్పటినుండి ఒక రాజ్యముగా దేవునికి అనుకూలములగు భౌతికమైన, ఆత్మసంబంధమైన ఆరాధనలను బలులను అర్పించుటకు యాజకరూపమైన రాజ్యముగా ఉందురని ఆ రాజ్యమునకు ఆయనే రాజునని, దేవుడనని, పూజార్హుడనని దేవుడు చెప్తూవున్నాడు. దేవుడు వారికిచ్చిన గొప్ప ఆధిక్యతయైన ధన్యతను గురించి (యాజకత్వము) ప్రవక్త వారికి గుర్తు చేస్తూవున్నాడు.

మూడవదిగా, మీరు నాకు పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పటంలో దేవుని ఉదేశ్యము? ద్వితీయోప 7:6; 26:19; 28:9లో ఉంది చూడండి: నీ దేవుడైన యెహోవా భూమిమీద తాను సృజించిన సమస్త జనముల కంటె నిన్ను ఎక్కువగా ఎంచి నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను, దేవుడు తన కృపలో ఈ ధన్యతను వారికి యిచ్చియున్న విషయాన్ని ప్రవక్త వారికి గుర్తు చేస్తూవున్నాడు.

యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండటానికి ఈ భూమిపై ఉన్న అన్ని దేశాల నుండి ప్రభువు ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడని, తద్వారా ఆయన ప్రజలందరి రక్షణ కోసం తన ప్రణాళికను నెరవేర్చబోతూ ఉన్నాడని ఆయన ఈ మాటల ద్వారా తెలియజేస్తూవున్నాడు. వారు రక్షణ యొక్క వాగ్దానాన్ని దానికి సంబందించిన ప్రభువు వాగ్దానాలన్నింటిని పుచ్చుకోవలసి ఉన్నారు. దేవుని దయలో ఈ బహుమతులను ముందుకు తీసుకు వెళ్ళవలసియున్నారు, దేవుని వాగ్దానాల నెరవేర్పులో ఒదిగిపోవలసియున్నారు. నిజదేవునిని గురించి ఆయన విమోచనను గురించి వారు అన్ని ఇతర దేశాలకు సాక్ష్యమివ్వవలసి యున్నారు. అందుకుగాను వాళ్ళు ఈ లోకములోని భక్తిహీనుల నుండి వేరుగా ప్రత్యేకింప బడినవారుగా ఉండవలసి యున్నారు.

అన్వయింపు: 1 పేతురు 2:9,10, అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి.

అందుకు మీరందరు స్వచ్చందముగా సంపూర్ణ స్వేచ్ఛలో యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తర మిచ్చియున్నారు కదా అనే విషయాన్ని ప్రవక్త వారికి గుర్తు చేస్తూ, వారి తిరుగుబాటును గద్దిస్తూ, ఇశ్రాయేలు నీ గతములో దేవుడు నీ పట్ల చేసిన అద్భుతాలను ఇచ్చిన ఆధిక్యతను గుర్తుచేసుకో అని హెచ్చరిస్తూ ఉండటం నిజముగా విచారకరం. దేవుడు ఏర్పరచుకొనిన వారిగా ఆయనకు లోబడివుంటామని ఒప్పుకున్నారు కదా? ఆయననే దేవునిగా సేవించుదుమని మీ సమ్మతిని తెలియజేసియున్నారు కదా? ఆయన మాటలను అనుసరించుదుమని అంగీకరించియున్నారు కదా? విశ్వాసముతో లోబడుదుమని మాట ఇచ్చియున్నారు కదా? ఇప్పుడు, సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?

ఎందుకంటే విశ్వాసి జీవితములో విధేయత అనేది హృదయము నుండి రావాలి: మీరు పాపమునకు దాసులైయుంటిరిగాని యే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారు కారు (రోమా 6:17). మీరు శాశ్వతుడగు జీవముగల దేవునిమాట మూలముగా పుట్టింపబడిన వారు గనుక నిష్కపటముగా మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై యుండవలసి యున్నారు యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమింపవలసి యున్నారు (1పేతురు 1:22). అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను దేవునిని గూర్చి సంపూర్ణముగా సాక్ష్యమివ్వవలసియున్నారు, ప్రకటించవలసియున్నారు (రోమా 15:18,19). మీ అంతఃకరణము మరి యెక్కువ గా మీ యెడల ఉన్నది. (మీరు స్వార్ధపరులైయున్నారు) (2 కొరింథీ 7:15) తప్పితే దేవునిమీద మీ హృదయము లేదు అనే విషయాన్ని వారికి గుర్తుచేస్తూ ప్రవక్త వారిని గద్దిస్తున్నాడు.

ఒకవేళ ప్రవక్త హెచ్చరికను చెవినిపెట్టకపోతే ఏమి జరుగుతుందో చెప్పేందుకు ఉదాహరణగా ఎన్నో దృష్టాంతములు బైబిలులో ఉన్నాయి: 1 సమూయేలు 15:20-26 అందుకు సమూయేలు–తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటె మాట వినుటయు శ్రేష్ఠము. తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను మీరు విసర్జింతిరి గనుక ఆయన మిమ్మును విసర్జించబోవుచున్నాడు. మీరు దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచినట్లుగా మీరు కూడా అంతే (2 రాజులు 18:11,12). దేవుని హెచ్చరికలను చెవిని పెట్టుమని ప్రవక్త వారిని హెచ్చరిస్తున్నాడు.

2నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు, వారి యోచన వారి బలమును వట్టిమాటలేనని తేలిపోయాయి. ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా ఉనికి ఎంతో బలమైన పర్వతాలనే కాల్చివేసి నీళ్లను పొంగజేయు రీతిగా దిగివచ్చిన సంగతిని మర్చిపోయి నీ బలమును నీ యోచనను నీవు ఆశ్రయించిన యెడల జరిగేది ఇదే, పశ్చాత్తాపపడు. ప్రభువా మేము నీపై ఆధారపడునట్లు మమ్మును నూతనపరచుము అని ప్రార్దించుమని ప్రవక్త వారిని ప్రోత్సహిస్తున్నాడు.

విశ్వాసం ప్రార్థనలో ప్రభువు వైపుకు తిరుగుతుంది. విశ్వాసం ప్రార్థిస్తుంది, పశ్చాత్తాపపడుతుంది, గోజాడుతుంది, దేవుని ఎదుట తగ్గించుకొంటుంది, దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు విశ్వాసములో స్టాండ్ తీసుకొంటుంది. హిజ్కియా రాజు ఉదాహరణనే పరిశీలించండి: (యెషయా 36) అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొన్నాడు. యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనను పంపాడు. యెరూషలేము నాశనం అనివార్యంగా కనిపించింది. యెరూషలేము గోడల ముందు తన అహంకారపూరిత ప్రసంగంలో, అష్షూరు కమాండర్ హిజ్కియాను మరియు యెరూషలేము ప్రజలను దూషించాడు. హిజ్కియా ఇది విన్నప్పుడు, అతడు తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని యెహోవా మందిరానికి వెళ్ళాడు, యెషయా 37:1. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొఱ్ఱపెట్టగా యెహోవా ఒక దూతను పంపాడు, అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగివెళ్లిపోయాడని, 2 దినవృత్తాంతములు 32:20,21 చెప్తూవుంది.

[యెహోవా] 3జరుగునని మేమనుకొనని అద్భుతమైన పనులను మీరు చేసినప్పుడు అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక అని ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రవక్త దేవుడు గతంలో తన ప్రజలపై చూపిన కృపను గుర్తుచేసుకొంటూ, ఐగుప్తు దాస్యములో ఉన్న మనం దాస్యము నుండి విడిపింపబడతామని అసలు ఊహించనే ఊహించలేదు. దేవుడు మన పక్షాన్న మనలను విమోచించుటకు ఐగుప్తుతో పోరాడుతుండగా నిర్ఘాంతపోవటం తప్ప ఇశ్రాయేలీయులు మనం చేసినదేమన్న ఉందా? యెహోవా పరాక్రమ శౌర్యమును బట్టి అన్యజనులును కలవరపడ లేదా? ఆయన నీతో నిబంధన చేసుకొనుటకు దిగి వచ్చినప్పుడు ఎంతో గొప్పవైన పర్వతములు తత్తరిల్లి యుండలేదా? యుద్ద్దశూరుడైన ఆ యెహోవా మీదనే తిరుగుబాటా? నీ స్థితిని పరిస్థితిని మార్చి ధన్యతలను ఇచ్చిన దేవుని మీదే తిరుగుబాటా? ఇశ్రాయేలు ఆలోచించుకో, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిస్తేనే, అను దేవుని హెచ్చరికను ఈ వచనాల ద్వారా ప్రవక్త వారికి గుర్తుచేస్తూ ఉన్నాడు.

2

4తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచి యుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు 5అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. దేవునికొరకు కనిపెట్టువాడు అంటే, నాకు సహాయము చేస్తాడని ఆయనయందే నమ్మకముంచే వాళ్ళు. వారిపట్ల దేవుడు స్నేహితునిగాను కృపచూపువానిగాను వారికి సహాయము చేయువానిగాను ఉంటాడని ప్రవక్త చెప్తూ, ఆయన వారిని ఏవిధముగా దాస్యము నుండి విడిపించి పరిశుద్ధమైన జనముగా చేసియున్నాడో, వారి స్థితిని, పరిస్థితిని మార్చియున్నాడో జ్జ్యపాకము చేస్తూ, ఇంతటి ధన్యత, దీవెనలను రక్షణకు సంబంధించిన అనేక రుజువులను అనుగ్రహించిన దేవుడు ఎవరన్నా ఉన్నారా? అని అడుగుతున్నాడు. యెహోవా వంటి దేవుడిని ఏ కన్ను చూడలేదు. తనపై నమ్మకం ఉంచిన వారిని విడువని దేవుడు ఆయన అని, నిస్సహాయతను యెరిగి దేవుని జోక్యాన్ని కోరుకొంటూ రక్షణకు నీతికి ఆయనపై ఆధారపడమని ఈ మాటల ద్వారా ప్రవక్త వారిని ప్రోత్సహిస్తున్నాడు.

ఇదే విషయాన్ని కీర్తనలు కూడా తెలియజేస్తూ, కీర్తనలు 25:3, 5,21 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను. నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. కీర్తనలు 27:14 యెహోవా కొరకు కనిపెట్టు కొనియుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. కీర్తనలు 37:9 యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. కీర్తనలు 130:5 యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను అను సుపరిచితమైన మాటలను వారికి జ్జ్యపాకం చేస్తూ దేవుని వైపు మళ్లుకొనుమని రాబోతున్న ఉపద్రవాన్ని తప్పించుకొనుమని ప్రవక్త వారిని హెచ్చరిస్తూవున్నాడు.

నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతిననుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన మార్గాలలో ఆనందం పొందేవారిని, ఆయన సంరక్షణను బట్టి కృతజ్జ్యతతో జీవించే వారితో ఆయన సహవాసంలో ఉంటాడని వారిని బట్టి ఆయన సంతోషిస్తు ఉంటాడని ఆయన వారిని తన క్షమాపణతో దర్శించునని, చేర్చుకొనునని, సమకూర్చునని, దీవించునని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. ఆయన మార్గములనుబట్టి ఆయనను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతిననుసరించు వారిని ఆయన సిగ్గునొందనీయడు. వారికి రక్షణకర్తయై ఉంటాడు. ఆయన యథార్థతయు నిర్దోషత్వమును వారిని సంరక్షించును. ఆయన ప్రతి విషయములో వారికి ధైర్యమునిచ్చి వారి హృదయమును నిబ్బరముగా ఉంచును. వారు ఆయన వాగ్దానములను స్వతంత్రించుకొందురు. ఆయన మాటమీద ఆశపెట్టుకొనుము, అని ప్రవక్త వారిని ప్రోత్సహిస్తున్నాడు.

1 కొరింథీయులకు 2:9,10 ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు.

చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపములలో పడియున్నాము. రక్షణ మాకు కలుగునా? దేవుడు దయతో తన ప్రజలకు దాస్యము నుండి విడుదలను అందించడానికి పనిచేశాడు. దేవుడు ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాలి? ఇదిగో వీరు లోబడనొల్లని ప్రజలు అని యెహోవా వారిని ఎన్నోసార్లు గద్దించడం, శిక్షించడం మనకు తెలుసు. యెషయా తిరుగుబాటుదారులు, పాపులలో తనను తాను చేర్చుకొని  ప్రభువా మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపములలో పడియున్నాము అని ఒప్పుకొంటూ అందరి తరుపున దేవుని క్షమాపణ కొరకై మొరపెడుతూ ఉండటం, నిజముగా వారిని సిగ్గుపర్చేదిగా ఉంది.

తిరుగుబాటు కారణంగా ఆయన కోపంగా ఉన్నాడు, న్యాయమే. అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి దేవుని దృష్టిలో మనమందరం పాపులుగా ఉన్నాము. ఏ హక్కు ద్వారా మనలో ఎవరైనా దేవుని సహాయాన్ని ఆశించొచ్చు? ఆయన మళ్లీ ఎందుకని జోక్యం చేసుకోవాలి? ఎందుకని మనలను రక్షించాలి? ప్రతి పాపం పాపిని, అంచెలంచెలుగా, దేవునికి దూరంగా శ్రమలకు, తీర్పుకు దగ్గరగా తీసుకు వెళుతుంది. పాపులు తమ పాపాల పరిణామాల నుండి తమను తాము రక్షించుకోలేరు అనే విషయాన్ని ప్రవక్త వారికి గుర్తుచేస్తున్నాడు. 

3

6మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు మెచ్చుకోరు సరి కదా ద్వేషిస్తారు. ఇక్కడ ఈ మాటలు చెప్తున్నది ప్రజలకు దేవునికి మధ్యన మధ్యవర్తిగా ఉంటున్న ప్రవక్త, ప్రజలను గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం నిజముగా శోచనీయం. ప్రజలు ఎలా జీవిస్తున్నారో దానినే ప్రవక్త ఒప్పుకొంటున్నాడు.

అపవిత్రులము” అనే మాట బైబిలులో ఒక కుష్ఠురోగి యొక్క స్థితిని తెలియజేసేందుకు వాడబడింది. పాత నిబంధన కాలములో కుష్టువ్యాధి ఒకని ప్రాపంచిక పాపాలకు శాపంగా దైవికశిక్షగా పరిగణించబడేది. వ్యాధి లక్షణాలు కుష్టువ్యాధి బాధితులు పూర్తిగా పాపంలో చిక్కుకున్నారని రుజువుగా తీసుకోబడ్డాయి. కాబట్టి కుష్ఠురోగిని నడుస్తున్న శవంగా వాళ్ళు చూసేవాళ్ళు. ఆ కాలములో దాని బాధితులు మరణించినట్లుగా పరిగణించేవాళ్ళు. వ్యాధితో జీవిస్తున్న వారిని సమాజానికి “చనిపోయినట్లు” ప్రకటించడానికి వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించే వాళ్ళు. బంధువులు వారి ఆస్తులను పొందేందుకు అనుమతించబడ్డారు. వారి స్వాస్థ్యము సమాజము నుండి కొట్టి వేయబడేది. అతని కుళ్ళి పోతున్న మాంసపు వాసన ఆ కుష్ఠును దాచుకోవడానికి అతడు కట్టుకొన్న పీలికలు కారుతున్న రక్తము, చీము వాసన కాళ్ళు చేతుల వేళ్ళు లేకుండా నడవడానికి అతడు పడే ఇబ్బంది నొప్పిని బట్టి వచ్చే అతని మూలుగు ఇవ్వన్ని అతడు కనబడక మునుపే అతని అపవిత్రతను చాల దూరము వరకు తెలియజేస్తూ అతనిని సమాజానికి అంటరాని వ్యక్తిగా అపవిత్రునిగా ఉంచేవి. ఇది మానవ శరీరాలను నెమ్మది నెమ్మదిగా తినేస్తూ వారి అనుదిన జీవితాలను దుర్లభము చేస్తూ నిస్సహాయతలో కఠిన పరిస్థితుల మధ్య అతడు చనిపోయేటట్లు చేసేవి కాబట్టి దీనిని దైవికశిక్షగా భావించేవాళ్లు.

కుష్టువ్యాధి భౌతికంగా ఒకరిని ఎలా పాడు చేస్తుందో పాపం కూడా ఒకరిని ఆధ్యాత్మికంగా అలానే పాడు చేస్తుంది అని చెప్పడానికే ఈ మాట బైబిలులో వాడబడింది. పాపం ఖచ్చితంగా కుష్ఠువ్యాధే. ఎవరూ దానికి అతీతులు కారు. కుష్ఠువ్యాధిలో బయటికి కనబడే పుండ్లు ఇతర సమస్యలు వ్యాధి లక్షణాలు మాత్రమే. వ్యాధికి అసలు కారణం శరీరం లోపల ఉంటుంది. మనం పాపం చేయడం వల్ల మనం పాపులం కాదు, మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నాము. పాపం యొక్క మూలం మన లోపల ఉంది. దీనిని గూర్చి బైబులు చెప్తూ, దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును అని మత్తయి 15:19లో చెప్తూవుంది. పాపపు హృదయం నుండే పాపం పుడుతుంది.

కుష్ఠువ్యాధి ఒకనిలో బయటపడక మునుపు, ఇతరులు అతనిని కుష్ఠు రోగిగా గుర్తించకమునుపు, అతనిలో కుష్ఠు వ్యాధి లేదని అనగలమా? లేదు, ఆ రోగము అతనిలో రహస్యముగా ఉంది, అతనిని పాడుచేస్తూనే ఉంది. అట్లే ప్రతిఒక్కరు స్వాభావికంగా పాపులుగా ఉన్నారు, తలంపులు మాటలు క్రియల ద్వారా పాపమును చేస్తు ఉన్నారు. అవి మనలను అంతర్గతముగా ఆధ్యాత్మికంగా పాడుచేస్తూ ఉన్నాయి.

ఇశ్రాయేలీయులు ఏమనుకొంటున్నారంటే, దేవుడు మమ్మును యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ప్రకటించియున్నాడు మేము పరిశుద్దులము ఆయనకు కావలసిన బలులను క్రియలను మేము చేస్తూవున్నాం, సరిపోతుంది అని అనుకొంటూవున్నారు. యెషయా 1:11,12 యెహోవా సెలవిచ్చిన మాట ఇదే –విస్తారమైన మీ బలులు నాకేల? దహన బలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటె మాట వినుటయు శ్రేష్ఠము. తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము 1 సమూయేలు 15:20-26.

అట్లే మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డల వంటివి అని ప్రవక్త అంటూవున్నాడు. ఆ కాలములో స్త్రీ యొక్క బహిష్టుగుడ్డలను మురికిగుడ్డలు అని అనే వాళ్ళు. ఈ మాట మనకు చాలా కోపము తెప్పిస్తూ ఉండొచ్చు. లేవీయకాండములో చెప్పబడియున్న ప్రకారము ఇవి అపవిత్రమైనవి, ఒకడు అపవిత్రమైన వాటిని తెలిసి తాకినను తెలియక తాకినను వాడు అపవిత్రుడై అపరాధియగును అని లేవి 1:2; 15:19-33 చెప్తూవుంది. అట్లే ద్వితీయో 14:19లో అపవిత్రకు మారుగా హేయము అనే మాట కూడా వాడబడియున్నది. కలుషితము అని కూడా అర్ధమిస్తూ ఉన్నాయి.

జన్మ కర్మ పాపములను బట్టి ప్రతిఒక్కరం సంపూర్ణముగా పాపులమే, శాపగ్రస్తులమే. స్వాభావికమైన మన పాపమును బట్టి మన అనుదిన తలంపులు క్రియలు మాటలను బట్టి మనము దేవుని దృష్టిలో అపవిత్రులుగా, అపరాధులుగా, హేయమైన వారిగా, కలుషితము చెయ్యబడిన వారముగా ఉన్నాము. ఆ రోజులలో కుష్టురోగులు కుష్ఠు వచ్చిన భాగాలను మూర్ఖముగా నరుక్కునే వాళ్ళు లేదా ఆ భాగాలను కాల్చుకొనేవాళ్ళు, రోగాన్ని తప్పించుకోవడానికి. ఆ రోగమును తప్పించుకోవడానికి వాళ్ళు చేసే ప్రతిపని నిష్ప్రజనమైనదే. ఇలాంటి స్థితిలో మనము చేసే సత్క్రియలు పరివర్తన పశ్చాత్తాపము లేని మన జీవితాలను, మార్చుకొనుటకు ఏమాత్రము ఇష్టపడని మన బ్రతుకులను మన గర్వాన్ని అతిశయాన్ని స్వార్ధాన్ని ప్రస్ఫుటముగా తెలియజేస్తూ ఉండగా, మన నీతి క్రియలన్నీ పుణ్యకార్యములు అని ఎలా అనుకోగలం, అవి మురికి గుడ్డలే. కొందరు మేము సత్క్రియలు చేస్తూ ఉన్నాం సత్క్రియల ద్వారా పుణ్యమును సంపాదించుకొంటున్నాం అనే భావనలో ఉంటారు. మనకు పుణ్యమును సంపాదించి పెడతాయి అని మనమనుకొంటున్న మన నీతి క్రియలు మురికి గుడ్డలవంటివి అని ప్రవక్త అంటూవున్నాడు. కాబట్టే యెషయా 1:16లో దేవుడు మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి అని చెప్తూవున్నాడు.

పాపము ఎంత ఘోరమైనదో చెప్పేందుకే యెషయా ఇంత కఠినముగా మాట్లాడుతున్నాడు. పాదములో చిన్న వేలుకు కుష్ఠు రోగము వచ్చింది కాబట్టి నేను సంపూర్ణముగా కుష్ఠురోగిని కాదు అని చెప్పలేం. కుష్ఠురోగి ఖచ్చితముగా కుష్ఠు రోగే. అట్టివాడు పాక్షికంగా అపవిత్రుడు కాదు గాని సంపూర్ణముగా అపవిత్రుడే, బ్రతికివున్న శవమే. నేను 100% పుణ్యాత్ముడనే అని గుండెల మీద చెయ్యి వేసుకొని ఎవరన్నా చెప్పగలరా?

యాకోబు 3:6,8 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే అని చెప్తూ ఉంది. క్రైస్తవులమైన మనము కొన్నిసార్లు చిన్న అబద్దమే కదండి, నా భార్య నా భర్త నా పిల్లలే కోపం వచ్చింది ఇష్టమొచ్చినట్లు తిట్టేసాను, ఫర్వాలేదు ఇది చిన్న విషయమే అని అనుకొందామా? ఇది చిన్న పాపమే అని మనలను మనము సమర్ధించుకొంటూ ఉంటాం, యాకోబు 3:6,8 అదే చెప్తూవుందా? పరివర్తనలేని జీవితాలను వేషధారణతో కప్పిపెట్టుకొంటున్నాం. పాపమనే కుష్ఠువ్యాధి అసహ్యకరమైనది, భరించలేని దుర్వాసనగలది. ఇది దాచబడదు. హృదయమును అంతరింద్రియమును పరిశీలించగల నీతిగల దేవుని ఎదుట మన స్థితిని దాచిపెట్టగలమా?  కుష్టువ్యాధి దిగ్బంధంలో ఉంచుతుంది, ప్రియమైన వారి నుండి వేరు చేయడమే కాకుండా, దేవునిసన్నిధి నుండి వేరు చేసింది. వారు అపవిత్రులుగా పరిగణించబడ్డారు, అంటే వారు ఆరాధించడానికి ఆలయానికి వెళ్లలేక పోయారు. పాపం అదే చేస్తుంది. అది మనలను దేవునితో శత్రుత్వంలో ఉంచుతుంది, ఆయనతో మనకున్న సంబంధాన్ని తెంచి మన వినాశనానికి నడిపిస్తుంది. లోకము పాపమును అందమైనదిగా చేసియున్నప్పటికి పాపము అసహ్యకరమైనది జుగుప్పాసకరమైనది మరియు మరణకరమైనది.             

ఈ విషయం మనకు అర్ధమయ్యేలా చెప్పేందుకు ప్రవక్త, ఒక ఉదాహరణను ఇస్తూ, మేమందరము ఆకువలె వాడి పోతిమి. గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను అని అంటున్నాడు. పచ్చని ఆకును ఎండిన ఆకును చూడండి. ఎండిన ఆకు చచ్చి చెట్టు నుండి రాలినది. దానిలో జీవము లేదు. అది చెట్టుతో జత చెయ్యబడిలేదు. ఎండిన ఆకు తనకు తానుగా ఏంచేసినా తిరిగి చెట్టుతో జతపడి జీవముతో పచ్చగా ఉండలేదు. మనం జిగురుతో అంటించినను ప్రయోజనముండదు. పాపము మనకు జీవమైన దేవుని నుండి దూరపర్చటమే దాని లక్ష్యం. ఆత్మీయముగా మనలను మరణింపజేయటమే దాని గమ్యం. ఎండిన ఆకులను తగలపెట్టేస్తారు, లేదా భూమి క్షయపరుస్తుంది, లేదా గాలి చెదరగొట్టేస్తుంది. అట్లే దేవునికి విరోధముగా పాపము చేయు ప్రతివాడు ఎండిన ఆకుల వలే ఉన్నారని దేవుని శిక్షకును ఉగ్రతకును పాత్రులైయున్నారని ప్రవక్త ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు.

7నీ నామమును బట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేకపోయెను అంటే జనులు ప్రార్ధన చెయ్యలేనంతగా దేవునికి సమయమును కేటాయించలేనంతగా ఈ లోక విషయాలలో బిజీగా వున్నారని, ప్రజలలో అవినీతి పెరిగి పోవటాన్ని చిత్తశుద్ధి లోపించటాన్ని మొఱ్ఱపెట్టలేని మన నిస్సత్తువను ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి. నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు అంటే దేవునిని ఆధారము చేసుకొనుట ప్రజలకు ప్రాముఖ్యముగా లేదని, ప్రోత్సాహపర్చుకోవడం అను మాటకు వాళ్ళ బలహీనతలను అధిగమించేటట్లు వారిని వాళ్ళు ప్రోత్సహించుకోవడం, అందుకు అవసరమైన వాటి మీద దృష్టిపెట్టడం, లోపాలను సరిదిద్దుకోవడం, పద్దతిని మార్చుకోవడం చిత్తశుద్ధితో మెలగటం, అలుపెరుగక లక్ష్యాన్ని చేరుకోవటం. ఇశ్రాయేలీయులకు దేవుడెవరో తెలుసు, ఆయన వారికొరకు ఏమేమి చేసియున్నాడో తెలుసు, ఆయనను ఏ విధముగా సేవించవలసియున్నారో సంతోషపెట్టవలసియున్నారో తెలుసు ఆయన వారికి ఇచ్చిన ధన్యత వాగ్దానాలు అన్ని తెలిసి ఆధ్యాతికముగా వారిలో చిత్తశుద్ధి లోపించడం నిజముగా బాధాకరం. వాస్తవమే కదండి, నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి అంటే వారిపట్ల ఉన్న అనుగ్రహాన్ని ప్రేమను దేవుడు ఉపసంహరించుకోవడాన్ని తెలియజేస్తూవున్నాయి. కీర్తన 27:9 కోపమును బట్టి దేవుడు ముఖమును దాచుకొంటాడు అని చెప్తూవుంది. ముఖము అనేది ప్రత్యక్షతగా పిలువబడుతూవుంది (పేస్ అఫ్ ఏ హౌస్; పేస్ అఫ్ ఏ ట్రీ). దేవుని ముఖం అనేది ఆయన వాక్యము లేదా వాగ్దానం మరియు సంస్కారములలో దేవుని ఉనికి. ఇక్కడ దేవుని ఆలోచన మన మనస్సాక్షి ముందు ఉంచబడుతుంది. మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు అంటే దేవుడు వారితో లేకపోవడాన్ని బట్టి శత్రువుల ఎదుట వారి ధైర్యము కరిగిపోతుంది, వారు సామర్ధ్యమును కోల్పోయిన వారివలె నిస్సత్తువుగా పట్టబడతారు. అవమానము నిందలు శ్రమలు ఆయన పరిపాలననెన్నడును ఎరుగనివారివలె, ఆయన పేరెన్నడును పెట్టబడని వారివలె ఉండాల్సి వస్తుందని ప్రవక్త చెప్తూవున్నాడు.

8యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పనియై యున్నాము. దేవునిని కుమ్మరివానిగా మనలను మట్టిగా ప్రవక్త పోలుస్తూవున్నాడు. దేవుడు కుమ్మరి అనే వర్ణన దేవుని ప్రజల చరిత్రకు ఖచ్చితంగా సరిపోతుంది. ఆయన అబ్రహామును పిలిచాడు  అతని వారసులను ఒక దేశంగా తీర్చిదిద్దాడు. దేవుడు ప్రతివిశ్వాసిని రూపుదిద్దుతూవున్నాడు. ఆయన మహిమార్థమై మనలను మలుస్తూవున్నాడు. మీరు ఆయన చేతుల పని. కాబట్టి ఎవడును అతిశయింప కూడదు అని ప్రవక్త వారికి జ్జ్యపాకం చేస్తూవున్నాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతుండగా, నొచ్చుకొక, ప్రభువా పాపులం మమ్మును క్షమించుము జీవములేనివారము మమ్మును రూపించుము, మమ్ములను చేర్చుకొనుము అని ప్రార్థిస్తూ పశ్చాత్తాపముతో దేవుని వైపు మళ్లుకొనుమని ప్రవక్త వారిని ప్రోత్సహిస్తూవున్నాడు.   

ముగింపు: మత్తయి 8:1-3లో యేసు కుష్టురోగిని తాకడం మనం చూస్తాము. యేసు కుష్ఠురోగిని తాకిన విషయం ఆశ్చర్యకరమైనది, ఎందుకంటే ఎవరైనా కుష్టురోగిని తాకితే వాళ్ళు అపవిత్రులవుతారు. కాని ఇక్కడ యేసు, కుష్ఠురోగిని తాకినప్పుడు, దానికి విరుద్ధంగా కుష్ఠురోగి పరిశుద్ధుడయ్యాడు.

యేసు దగ్గరికి రావడానికి ఈ వ్యక్తికి చాలా ధైర్యం కావాలి. తాను శాపము క్రింద దైవశిక్ష క్రింద ఉన్నానని అతనికి తెలుసు. మరెవరూ అతనికి సహాయం చేయలేరని యేసు మాత్రమే చేయగలడని అతను నమ్మాడు. ఆయనకు తన స్వరము వినబడేంత దగ్గరగా వచ్చి –ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అతడు ప్రభువైన యేసుపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. యేసు చిత్తానికి లోబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కోరుకుంటే యేసు తనను స్వస్థపరచగలడని అతనికి తెలుసు, కాని యేసు తన ప్రార్థనకు ఎలా జవాబిస్తాడో ప్రతిస్పందిస్తాడో అతనికి ఏమాత్రము తెలియదు. ఒకవేళ యేసు ప్రతిస్పందన “నో” అయితే తీసుకోడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. యేసు అతడి విన్నపాన్ని విని చెయ్యి చాపి వాని ముట్టి–నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధియాయెను. ఆ శక్తివంతమైన మాటలు వానిని వెంటనే పూర్తిగా స్వస్థపరిచాయి. మనం ఆయన ముందుకు తెచ్చే ఏ అభ్యర్థననైనా ఆయన ఆమోదించగలడు శాపమును తొలగించి శిక్షనుండి విడిపించగలడు.

మన వాస్తవ స్థితిని మనము గుర్తించి, పశ్చాత్తాపముతో ఆయన వద్దకు వస్తే, “ప్రభువా నేను పాపిని. నన్ను కరుణించుము” అని మనం ప్రార్దించినట్లైతే “నీవు శుద్ధుడవు కమ్మని” యేసు చెప్తాడు. ఆయన ప్రేమగల దేవుడు, సమస్త లోకపాములను మోసుకొనిపోయిన దేవుని గొర్రెపిల్ల. మన శిక్ష క్రీస్తుపై ఉంచబడింది. ఆయన తన పరిశుద్ధ రక్తమును మనకొరకు క్రయధనముగా చెల్లించి మనకొరకు రక్షణను విమోచనను గెల్చి యున్నాడు. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును అని చెప్తూవుంది. మన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపముతో దేవుని వైపుకు మళ్ళుకొందాం. ఆమేన్.

ఈ మాటల్ని బట్టి ఈ రోజులలో కొందరు యెషయా ఈ మాటలను వ్రాయలేదని యెషయా మరణించిన చాలా సంవత్సరాలకు బాబిలోనియన్లు యెరూషలేమును గెల్చి యూదులను ప్రవాసమునకు పంపివేయగా వీటన్నింటికి సాక్షియై చెరలోవున్న వేరేవరన్నా ఈ మాటలను వ్రాసి ఉండొచ్చని చెప్తూ బైబిలుకున్న ప్రామాణికతను తగ్గిస్తువున్నారు.

దేవుని కుమారుడైన మెస్సీయ రావడానికి ఏడు వందల సంవత్సరాల ముందు చాలా స్పష్టంగా ఆయనను గురించి యెషయా వ్రాసాడు, అవునా? మరి నిశ్చయంగా యెషయా రాబోతూవున్న ఈ శ్రమలను గురించి ప్రభువు ఆత్మ యొక్క శక్తితో ఇశ్రాయేలును హెచ్చరించడానికి ప్రవచించియున్నాడని ఎందుకని నమ్మరు?

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl