అరిమతీయాకు చెందిన యేసేపు అంటే ఎవరు?

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యేసు పుట్టకముందే, ఆయన యేసేపు అనే వ్యక్తికి అప్పగించబడ్డాడు, అతని గురించి మనకు చాలా తక్కువ తెలుసు. అలాగే యేసు తన జీవితం చివరలో యేసేపు అనే మరొక వ్యక్తికి అప్పగింపబడ్డాడు. ఇద్దరూ అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించారండి. మొదటి యేసేపు పరిశుద్ధాత్మ వలన గర్భవతియైన మరియను ఇంటికి తీసుకెళ్లినప్పుడు, నజరేతులో ఎందరో హేళనగా మాట్లాడి ఉండొచ్చు. రెండవ యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసుదేహాన్ని కోరినప్పుడు, మహాసభలోని ఇతర సభ్యులు ఇంకా ఘోరముగా మాట్లాడి ఉండొచ్చు. అరిమతీయాకు చెందిన యేసేపు పాత్ర బైబిలులో ప్రస్తావించబడింది కాబట్టి ఇతనిని గురించి బైబులు ఏయే విషయాలు తెలియజేస్తూ ఉందో తెలుసుకొందాం.

నిజానికి అరిమతియా అనే ఊరు యొక్క ఖచ్చితమైన లొకేషన్ ఎక్కడ ఉండేదో తెలియదు. యూదయలో పేరుతో చాలా ఊర్లు ఉన్నాయి. లూకా 23:50 లో అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అను మాటలనుబట్టి ఇది “యూదుల పట్టణం” అని చెప్పొచ్చు. అలాగే ఇది బెంజమిన్ గోత్రానికి చెందినధై ఉండొచ్చని యెరూషలేము చుట్టుప్రక్కలే ఉండొచ్చని, యెరూషలేముకు వాయువ్యంగా 20 మైళ్ల దూరంలో ఉన్న ఎఫ్రాయిమ్ కొండ ప్రాంతంలో ఉన్న ఒక గ్రామమై ఉండొచ్చని చెప్తారు. అట్లే అరిమతయియ యోసేపు యెరూషలేములో నివాసముండే వాడు.

అరిమతీయాకు చెందిన యేసేపు యేసుక్రీస్తును బరియల్ చెయ్యడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి. అరిమతీయాకు చెందిన యేసేపును గురించి బైబిల్లో ఎక్కువ సమాచారంలేనప్పటికి, అరిమతీయా అనే గ్రామమునకు చెందిన యోసేపు అనబడే ఒకడు ధనవంతుడని, సజ్జనుడని నీతిమంతుడని, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడని, ఘనతవహించిన యూదుల సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడని, యేసుని సిలువ వెయ్యవలెనను యూదా మతపెద్దల ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపలేదని, కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడని, యేసుకు రహస్య అనుచరుడని, యేసు శిలువపై మరణించిన తర్వాత, ఇతడు తెగించి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగగా పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెనని దానిని వారు క్రిందికి దించి, యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాదచొప్పున సుగంధద్రవ్యములు దానికి పూసి శుభ్రమైన నారబట్టలు చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెనను వివరాలను మత్తయి 27:57–60; మార్కు 15:42–46; లూకా 23:50–53; యోహాను 19:38-42 తెలియజేస్తున్నాయి.

యోహాను 19:38 యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు అని అతనిని గురించి చెప్తూవుంది కదా. మాటలు అరిమతయియ యోసేపు యేసుని మెస్సయ్యాగా విశ్వసించి యున్నాడనే కదా చెప్తుంటా. అయితే అతడు రహస్యముగా ఉండటానికి గల కారణం యూదులు యేసును మెస్సయ్య గా ప్రకటించి అలా ట్రీట్ చేస్తారని అప్పుడు తానును తన విశ్వాసాన్ని బహిరంగముగా తెలియజేధ్ధామని అనుకొని ఉండొచ్చు.

కాని  పరిస్థితులు భిన్నముగా మారిపోయాయి. బదులుగా అతడు తన విశ్వాసాన్ని బహిరంగముగా ఒప్పుకోవాల్సిన క్షణమొచ్చింది. దానిని నిరూపించుకోవాల్సిన క్షణమొచ్చింది. శిష్యులు చెదరిపోతారని దేవునికి తెలుసు, కాబట్టే దేవుడు తన కుమారుని బరియల్ కొరకు అరిమతయియ యోసేపును తన కృపలో ఎన్నుకున్నాడు.

ద్వితీయోపదేశకాండము 21:22,23 ప్రకారం మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసిన యెడల అతని శవము రాత్రివేళ మ్రానుమీద నిలువకూడదు. అగత్యముగా దినమునే వానిని పాతిపెట్టవలెను అను యూదుల చట్టం ప్రకారము ఎవరు కూడా యేసుని క్లెయిమ్ చెయ్యకపోతే యేసుకు ఏమవుతుందో ఎప్పుడన్నా ఆలోచించారా? ఆయనను “ఆ రాత్రి” 2 దొంగలతో పాటు పారవేసేవాళ్ళు, అది దేవుని నిర్ణయము కాదే. యేసు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడుతుందని ధనవంతుని యొద్ద అతడు ఉంచబడతాడను యెషయా ప్రవచనమైన యెషయా 53:9 దేవుని నిర్ణయాన్ని తెలియజేస్తుంది. అది నెరవేర్చబడాలి కదా అందుకనే దేవుడు అరిమతయియ యోసేపును తన కృపలో ఎన్నుకున్నాడు. సాహసోపేతమైన చర్యకు పిరికి వానిని ఎన్నుకోవడం దేవుని చిత్తాన్ని తెలియజేస్తూ ఉండటం విశేషం.

యేసు శిలువపై మరణించిన తర్వాత, ఇతడు తెగించి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడిగాడు. యేసేపు చర్య సాహసోపేతమైన చర్య. మేజిస్ట్రేట్ అయిన పిలాతు అధికారం ద్వారా తప్ప సిలువపై ఉన్న యేసుని మృతదేహాన్ని తొలగించే హక్కు ఎవరికీ లేదు. సిలువ దగ్గర సైనికులున్నారు. పిలాతు అనుమతి పొందడం తప్పని సరి. మరి ఇక్కడ తెగించి అనే మాట అరిమతయియ యోసేపు రక్షకుని పట్ల తనకున్న ప్రేమను విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి ఎంతో ధైర్యం చేసాడని చెప్తూవుంది. అతని తెగింపు వెనుక ఉన్న రహస్యం క్రీస్తుపై అతనికున్న ప్రేమే. సిలువ వేయబడిన క్రీస్తును గూర్చి అతడు సిగ్గుపడలేదు. యూదుల అసంతృప్తిని కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని అతనికి తెలుసు. అందుకు అతడు ఎంతగానో చెల్లించాల్సి ఉంటుందని కూడా అతనికి తెలుసు. అయినను యేసుని స్వంతం చేసుకోవడానికి అతడు భయపడలేదు. యేసుని పక్షముగా బహిరంగంగా నిలబడటానికి కూడా అతడు భయపడలేదు.

అతడు ధైర్యంగా పిలాతు వద్దకు వెళ్లి యేసు శరీరాన్ని అడిగాడు. ఇలా చెయ్యడానికి ఎంతో ధైర్యము కావాలి. ఎందుకంటే యేసు మరణానికి ఖండించబడిన ఒక వ్యక్తి, కొరడాలతో శిక్షింపబడిన వ్యక్తి, అపహాస్యం చేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, సిలువవేయబడ్డాడు. ఒక దోషిలా మరణించి సిలువపై ఉన్న వ్యక్తి. ఇప్పుడు అతనితో అనుబంధాన్ని వ్యక్తం చెయ్యడం ఎంతో రిస్క్. కాని యేసుని పట్ల అతనికున్న ప్రేమ, విశ్వాసము బహిరంగంగా అతనితో అనుబంధాన్ని వ్యక్తము చెయ్యడానికి దృఢముగా నిలబడింది. అరిమతయియ యోసేపు తనకున్న ప్రతిదానిని క్రీస్తు కొరకు పణముగా పెట్టాడు. ప్రజల ఆగ్రహం అతని విశ్వాసాన్ని ఏమాత్రము  ప్రభావితం చెయ్యలేకపోయింది.

అరిమతయియ యోసేపు పిలాతును యేసు దేహమును అడిగిన వెంటనే పిలాతు ఒప్పుకోవడం దేవుని నిర్ణయం తప్ప పిలాతుకు యేసుపై ఉన్న సదాభిప్రాయము కాదు లేదా పిలాతు భార్యను బట్టి కాదు.

ఆనాడు రోమీయులు గోల్గోతా అనెడి కొండ పై దోషులను శిక్షించేవాళ్ళు వాళ్ళను అక్కడే ఖననం చేసేవాళ్ళు. సిలువ వేయబడిన నేరస్థుల శవాలను తరచుగా ఖననం చేయకుండా సిలువపైనే వదిలి వేసేవాళ్ళు లేదా గౌరవం లేకుండా సామూహిక సమాధిలోకి విసిరి వేసేవాళ్ళు. దేవుని కుమారుడు ఎక్కడ బరియల్ చెయ్యబడాలనేది దేవుని నిర్ణయం తప్ప మనుష్యుల నిర్ణయం కాదు. అరిమతయియ యోసేపు పిలాతును యేసుని దేహమును అడగకుండా ఉంటే అవమానకరమైన రీతిలో ఆయన దేహము యూదులచే పారవేయబడి ఉండేది. కాని దేవుడు తన శత్రువులకు అవకాశమును ఇవ్వలేదు. దీనికి యూదా మతాధికారులు ఎలాంటి అభ్యంతరము చెప్పకపోవడం ప్రతిదీ దేవుని కంట్రోల్ లోనే ఉందనే విషయాన్ని ప్రతిదీ ఆయన చిత్తమును బట్టే జరుగుతూ ఉందనే విషయాన్ని చెప్తూవుంది.

యోసేపు తాను క్రొత్తగా రాతిలో తొలిపించుకొనిన సమాధిలో యేసును ఉంచాలని నిర్ణయించుకోవడం అతని నిర్ణయమా? యేసు మరణానికి వందల సంవత్సరాల ముందే ధనవంతుని యొద్ద అతడు ఉంచబడతాడను యెషయా ప్రవచనమైన యెషయా 53:9 కారణం. అరిమతయియ యోసేపును గురించి వందల సంవత్సరాల ముందే దేవుని నిర్ణయాన్ని ప్రవచనము తెలియజేస్తూవుంది. మెస్సీయగా దేవుని కుమారుడిగా యేసు గుర్తింపును ధృవీకరించిన అనేక ప్రవచనాలలో ఇది కూడా ఒకటి.

తన విశ్వాసమును యేసు పట్ల తనకున్న ప్రేమను అరిమతయియ యేసేపు బహిరంగా ఎలా వ్యక్తపరచి ఉంటాడు అనే ప్రశ్నకు అతడు సరియైన సహాయముతో మర్యాదపూర్వకంగా యేసుని దేహాన్ని సిలువ పై నుండి క్రిందికి దింపి ఉంటాడు, యూదుల మర్యాద చొప్పుననే యేసుని దేహాన్ని సమాధి యొద్దకు తరలించి ఉంటారు. యేసు సిలువ వేయబడిన స్థలము నుండి సమాధి దగ్గరకు సుమారు 600 మీటర్ల (2,000 అడుగులు) దూరం ఉంటుంది. యూదుల మర్యాద చొప్పుననే ఆయనను బరియల్ చేసాడు, ఎవరేమనుకున్నను సరే, ఏది ఏమైనను సరే.

క్రొత్త సమాధిలోనే (అంటే కలుషితము చేయబడని సమాధిలోనే) యేసుని బరియల్ చెయ్యబడాలనే దేవుని నిర్ణయం వెనుక ఉన్న కారణం, సమాధిలో ఉంచబడిన యేసు ఒక్కడే పునరుత్థానుడైయున్నాడని నిర్ధారించుటకే. యేసును “క్రొత్త సమాధి”లో బరియల్ చెయ్యడం రాజుగా ఆయనకు ఇవ్వబడిన మర్యాదను గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది. యేసు దేహాన్ని సమాధిలో ఉంచి సమాధి ద్వారమును వాళ్ళు ఒక పెద్ద రాతితో మూసివేశారు.

తరువాత పునరుత్థానం యొక్క గొప్ప సత్యాన్ని తప్పుదారి పట్టించడానికి సాతాను ఒక పెద్ద డ్రామా చేసింది. మనకందరికి తెలిసినదే. సమాధికి సీల్ వెయ్యడం, కాపలా పెట్టడం. యేసు మరణమును గెల్చి లేస్తాడని సాతానుకు తెలియదా, తెలుసు, కాని మనుష్యులు నమ్మకుండా తన కుయుక్తితో మనలను తప్పు దారి పట్టించడానికి అది చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఎందుకో మరొక ఆర్టికల్ లో వివరిస్తాను.

కాలక్రమేణా చరిత్రలో అరిమతయియ యేసేపుకు సంబంధించి అనేకమైన నకిలీ కథలు ఇతిహాసాలు పుట్టుకొచ్చాయి. అందులో భాగముగా అరిమతయియ యేసేపు యేసు తల్లియైన మరియకు మేనమామ అని కొందరు చెప్తారు.

మరికొందరు తరువాత రోజుల్లో అరిమతయియ యేసేపు వాణిజ్యం కోసం బ్రిటన్కు అనేక పర్యటనలు చేసాడని దేశానికి సువార్తను తీసుకు వచ్చాడని చెప్తుంటారు. కాని యేసు సమాధి తర్వాత అరిమతయియ యేసేపు గురించి బైబిల్ మౌనంగా ఉంది, కాబట్టి అతనిని గురించి ఏమి తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్పేది నిరాధారమైనదని చెప్పొచ్చు.

అరిమతయియ యేసేపు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు: ప్రజల ఆగ్రహం అరిమతయియ యేసేపు విశ్వాసాన్ని ప్రభావితం చేయలేదు. అతడు తన విశ్వాసంలో స్థిరంగా ధైర్యంగా మేజిస్ట్రేట్ అయిన పిలాతు దగ్గరకు వెళ్లి యేసు పక్షముగా యేసు దేహమును గురించి అభ్యర్దించాడు. ఎంత స్ట్రాంగ్ గా యేసుకొరకు ఆనాటి వారి గ్రేట్ సన్హేడ్రిన్ సభను ఎదిరించి యేసును యూదుల మర్యాద చొప్పున బరియల్ చెయ్యటానికి నిలబడ్డాడో చూడండి.

అరిమతయియ యేసేపు ప్రవర్తనలో నైతిక ధైర్యము క్రీస్తుపై అతనికున్న అపరిమతమైన ప్రేమ అతని కండక్ట్ లో కనిపిస్తూవుంది. క్రిస్టియన్ క్యారెక్టర్ ప్రతిబింబిస్తూ ఉంది. ఎందుకంటే సిలువ వేయబడిన వ్యక్తికి అనుకూలంగా స్టాండ్ తీసుకోవడమంటే వ్యక్తిగతముగా తన పేరును ప్రతిష్టను ఐశ్వర్యాన్ని సంబంధాలను ప్రతిదానిని పణముగా పెట్టడమే, అయినా అతడు వెరవలేదు. అతని ధైర్యము దేవునిపై అతనికున్న ప్రేమే.

అన్వయింపుగా, అంత్య దినాలలో క్లిష్ట పరిస్థితులలో ఏ ఒక్కటి మన విశ్వాసాన్ని ప్రభావితం చెయ్యకుండా ప్రతిఒక్కరం విశ్వాసంలో స్థిరంగా ధైర్యంగా నిలబడదాం. మన ప్రవర్తనలో నైతిక ధైర్యాన్ని క్రీస్తుపట్ల మనకున్న ప్రేమను మన క్రిస్టియన్ క్యారెక్టర్లో ప్రతిబింబిద్దామ్. క్రీస్తుపట్ల మనకున్న అనుబంధాన్ని చూపించడానికి మనలో ప్రతి ఒక్కరికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని గుర్తిధ్ధాం ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు జీవిధ్ధాం.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl