
త్రిత్వ దేవుడు
క్రైస్తవులుగా, మనం ఒకే దేవున్ని అనుసరిస్తాము, ఆరాధిస్తాము – ఆయన త్రియేక దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుధ్ధాత్మునిగా బయలుపర్చుకొన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక్కనిగా, ఒక్కడు ముగ్గురిగా ఉన్నాడు. ఈ నమ్మకం క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైనది మరియు త్రిత్వ సిద్ధాంతంలో ఎన్ క్యాప్సూలేటెడ్ గా ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులలోని దేవుడు ఒక్కడే అని త్రిత్వ సిధ్ధాంతము బోధిస్తుంది. త్రిత్వములోని ప్రతి వ్యక్తి విభిన్నమై యున్నప్పటికీ సంపూర్ణముగా దేవుడై యున్నాడు. త్రిత్వములోని ప్రతి వ్యక్తికి ప్రత్యేక పాత్రలు మరియు విధులు ఉన్నప్పటికీ, వారందరూ సంపూర్తిగా ఒకే దేవునిగా, ఒకే దైవిక సారాంశం, గుణాలు మరియు స్వభావాన్ని కలిగియున్నారు. తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, వీరు ముగ్గురు దేవుళ్లు కాదు, ఒక్కరే.
త్రిత్వ సిధ్ధాంతము దేవుని స్వభావానికి సంబంధించిన ప్రధాన సిద్ధాంతం. త్రిత్వము బైబిల్లో వెల్లడి చేయబడిన దేవుని స్వభావం మరియు సృష్టి, విమోచన మరియు పవిత్రీకరణ పనిలో ముగ్గురు వ్యక్తుల ఐక్యతను, సామరస్యాన్ని ఉద్దేశ్యాన్ని వక్కాణిస్తూ, వారి మధ్యన ఉన్న వారి వ్యత్యాసాన్ని విడదీయరాని వారి ఐక్యతను వ్యక్తపరుస్తూ ఉంది. ఇందులో ప్రతి వ్యక్తి త్రిత్వంలో వారికున్న ప్రత్యేకమైన లక్షణాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ సిధ్ధాంతము లేఖనాల యొక్క బోధనలలో వ్యక్తపర్చబడుతూ ఉండటమే కాకుండా నీకేయ విశ్వాస ప్రమాణము, అతనేసియన్ విశ్వాస ప్రమాణము వంటి వాటి ద్వారా ఆదిమ క్రైస్తవ సంఘము ద్వారా ధృవీకరించబడింది. ఇది బైబిల్లో వెల్లడి చేయబడిన దేవుని స్వభావం యొక్క రహస్యాన్ని, సంక్లిష్టతను ప్రతిబింబిస్తూ వారి ఉద్దేశ్యం, సంకల్పం మరియు సారాంశంలో త్రిత్వ ఐక్యతను హైలైట్ చేస్తూ ఉంది.
తండ్రి, కుమారుడు పరిశుధ్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులలో ఉన్న ఏక నిజ దేవునిని అనుసరించడం క్రైస్తవ మతం యొక్క ఫౌండేషనల్ బిలీఫ్. ఇది దేవుని స్వభావాన్ని, ఆయనకు మానవాళితో ఉన్న సంబంధాన్ని మరియు యేసుక్రీస్తు ద్వారా సాధించబడిన విమోచన మరియు రక్షణకు సంబంధించిన మన అవగాహనను రూపొందిస్తూ ఉంది. క్రైస్తవులు త్రియేక దేవున్ని ఆరాధిస్తారు.
పరిశుద్ధ లేఖనాల ఆధారంగా పరిశుద్ధ త్రిత్వమును నేను నమ్ముతున్నాను. ఏక దేవుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా, ముగ్గురు ఒక్కరిగా ఒకే ఒక దైవికమైన అంతఃస్తత్వమును (essence) కలిగియున్నారని, ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదను కొలొస్సయులకు 2:9 లేఖనమును బట్టి శక్తిలో, నిత్యత్వములో, మహిమలో మిగిలిన గుణలక్షణాలలో వీరు సమానులని, వీరిలో ప్రతి వ్యక్తి ఒకే దైవికమైన అంతఃస్తత్వమును సంపూర్ణముగా కలిగియున్నారని గనుకనే ఆయన త్రిత్వ దేవునిగా పిలువబడుతూ ఉన్నాడని నమ్ముతున్నాను.
త్రిత్వ భావన బైబిలులో ఉందా? పాత నిబంధనలో ఉన్న త్రిత్వ సిధ్ధాంతమును గురించి కొన్ని కొటేషన్స్ చూధ్ధాం. ఆదికాండము 1:1, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అను వచనంలో దేవుడు అనే మాటకు అక్కడ హీబ్రూలో “ఎలోహిం” అనే మాట వాడబడింది. ఈ మాట 1st పర్సన్ బహువచనం, పులింగము. అట్లే ఆదికాండము సృష్టి కథనంలో, ప్రత్యేకంగా ఆదికాండము 1:26–27 మరియు ఆదికాండము 3:22లోని 1st పర్సన్ బహువచన సర్వనామాలు వాడబడి ఉండుటను గమనించండి. అట్లే, దానియేలు 7:13,14, రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్టములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు.
పాత నిబంధన పదజాలాన్ని తరచుగా ఉపయోగించే క్రీస్తు, తనను తాను “మనుష్య కుమారునిగా” పేర్కొన్నాడని కొత్త నిబంధన నుండి మనకు తెలుసు. “మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని” యేసు చెప్పుటను, మార్కు 14:62 చెప్తూవుంది. “అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెనని”, ఫిలిప్పీయులు 2:10,11 చెప్తూవుంది. యేసుని బాప్తిస్మములో త్రిత్వమును చూడగలం. ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు–నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను, మత్తయి 3:16,17 లూకా 3:21,22. కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలలో త్రిత్వమునకు సంబందించిన సిద్ధాంతం స్పష్టంగా లేనప్పటికీ, మత్తయి 28:19, 2 కొరింథీయులు 13:14, ఎఫెసీయులు 4:4–6, 1 పేతురు 1:1,2 సహా అనేక త్రిత్వ సూచనలు ఉన్నాయి. అట్లే కీర్తన 33:6లో యెహోవా వాక్కు అని, యెషయా 61:1లో ప్రభువగు యెహోవా ఆత్మ అని పేర్కొనబడి ఉండుటను చూడండి. ఈ విభిన్న ప్రస్తావనలు త్రిత్వ భావనను ఏర్పరచాయి- ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు ఒకటిగా. ఇద్దరు లేదా ముగ్గురు దేవుళ్లను ఆరాధించకుండా చర్చిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి త్రిత్వ భావన ఉపయోగించబడింది.
త్రిత్వ సిద్ధాంతంలో, దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉంటాడు కాని ఒకే ఒక దైవిక స్వభావాన్ని కలిగి ఉంటాడు. త్రిత్వములోని సభ్యులు అన్నింటిలో సమానులుగా మరియు సహ-శాశ్వతులుగా, ఒకే పదార్ధముగా, స్వభావంలో, శక్తిలో, క్రియలలో మరియు చిత్తములో ఉన్నారు. అతనేషియస్ విశ్వాస ప్రమాణములో చెప్పబడినట్లుగా, తండ్రి సృష్టించబడలేదు, కుమారుడు సృష్టించబడలేదు, మరియు పరిశుధ్ధాత్ముడు సృష్టించబడలేదు. ముగ్గురూ ప్రారంభం లేకుండా శాశ్వతులుగా ఉన్నారు. “తండ్రి మరియు కుమారుడు మరియు పరిశుధ్ధాత్ముడు” అనేవి దేవుని యొక్క వివిధ భాగాల పేర్లు కాదు, కాని దేవునికున్న ఏకైక పేరు ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తిగా దేవునిలో ఉన్నారు. వారు ఒకరికొకరు వేరుగా ఉండరు. ముగ్గురు వ్యక్తులలో ప్రతి ఒక్కరు వాస్తవం.
మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అను ద్వితీయోపదేశ కాండము 6:4 లేఖనమును బట్టి మరియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుమను 1 కొరింథీయులకు 8:4 లేఖనమును బట్టి, పరిశుద్ధ లేఖనాల ఆధారముగా పరిశుద్ధ త్రిత్వమును నేను నమ్ముచున్నాను.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను అను యోహాను 3:16-18 లేఖనమును బట్టి మరియు ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అను 1 కొరింథీయులకు 12:3 లేఖనమును బట్టి త్రిత్వ దేవుడు మానవుని పట్ల కనికరము చూపు దేవుడై యున్నాడని మరియు దేవుడే మన సృష్టికర్త, విమోచకుడు, మనలను పరిశుద్ధపరచు వాడునై యున్నాడని నేను నమ్ము చున్నాను.
కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొను వాడు తండ్రిని అంగీకరించు వాడు అను 1 యోహాను 2:23 లేఖనమును బట్టి మరియు యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు అను యోహాను 14:6 లేఖనమును బట్టి వీరిలో ఏఒక్కరిని కాదన్నను లక్ష్యపెట్టక పోయినను ముగ్గురిని తిరస్కరించినట్లే. త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించు వారిని క్రైస్తవ సంఘానికి బయటనున్న వారిగా పరిగణిస్తాను. యునిటేరియనిజంను నేను నమ్మను. ఇది మన దేశములో అనేక శాఖల లోనికి చొచ్చుకెళ్లి ప్రబలంగా వ్యాపిస్తూ అనేకులను ప్రభావితము చేస్తూ ఉంది.
పతనము మొదలుకొని, దేవుని నిత్య కుమారుని నమ్మితే తప్ప, దేవునిలో ఉన్న”తండ్రియైన దేవుణ్ణి” ఎవరు నమ్మలేడు. ఆ నిత్య దేవుని కుమారుడు శరీరధారియై మనకు ప్రతిగా తండ్రియైన దేవునిని సంపూర్ణముగా సంతృప్తిపరచుట ద్వారా మనలను తండ్రియైన దేవునితో సమాధానపరచియున్నాడు. 1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు అని తెలియజేస్తూవుంది. రోమా 15:13, కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణగల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక.
టెర్టులియన్ (155-200 CE) లాటిన్ పదం ‘ట్రినిటీ’ని ఉపయోగించిన మొదటి వ్యక్తి. ఇది ట్రినిటీ యొక్క కాంపాక్ట్ రేఖాచిత్రం, దీనిని ” షీల్డ్ ఆఫ్ ట్రినిటీ ” అని పిలుస్తారు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl