
మత్తోధ్ధారణ/ దిద్దుబాటు కొరకైన అవసరత
పురాతన కాలం
యేసు పరిచర్య ప్రారంభం నుండి క్రీ.శ. 27 నుండి క్రీ.శ. 325 వరకు విస్తరించిన ఆదిమ సంఘము, ప్రధానంగా భౌగోళిక ఆధారంగా విభజించబడింది. వివిధ ప్రాంతీయ సంస్కృతులు ఆచారాల ఆధారంగా యేసు బోధనల యొక్క ఆరాధన శైలులు మరియు వివరణలు మారుతూ ఉండేవి. ఈ సమయంలో క్రైస్తవ వేదాంతశాస్త్రంలో విభేదాలు కూడా ఉన్నాయి.
గ్రేట్ కమిషన్‌లోని భాగమైన మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి దాని ఆధారంగా అపొస్తలుల విశ్వాస ప్రమాణము ఉద్భవించింది. అపొస్తలుల విశ్వాస ప్రమాణముగా మారిన దాని ప్రారంభ వెర్షన్, “ఓల్డ్ రోమన్ విశ్వాస ప్రమాణముగా” అని పిలువబడింది. క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రకటనగా అపొస్తలుల విశ్వాస ప్రమాణము, రోమన్ చర్చిలోని ప్రారంభ బాప్తిస్మపు ఒప్పుకోలు మరియు ప్రారంభ చర్చి బోధనల నుండి ఉద్భవించిందని విస్తృతంగా నమ్ముతారు. అపొస్తలుల విశ్వాస ప్రమాణమనేది బాప్తిస్మము కోసం సిద్ధమవుతున్న వారు వారి విశ్వాసం గురించి ప్రశ్నించే పద్ధతి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇది రెండవ శతాబ్దం ప్రారంభంలోనే వాడుకలో ఉంది, (కెల్లీ, క్రీడ్స్, 101). ఈ విశ్వాసం యొక్క తొలి లిఖిత రూపం అన్సైరాకు చెందిన మార్సెల్లస్ క్రీ.శ. 341లో రోమ్ బిషప్ జూలియస్‌కు గ్రీకులో రాసిన లేఖలో ఇది కనుగొనబడింది. దాదాపు 50 సంవత్సరాల తరువాత, టైరానియస్ రూఫినస్ ఈ విశ్వాస ప్రమాణము పై లాటిన్‌లో వ్యాఖ్యానం రాశాడు (కామెంటారియస్ ఇన్ సింబోలమ్ అపొస్టోలోరం). అందులో, పెంతెకొస్తు తర్వాత, యెరూషలేము నుండి ప్రకటించడానికి బయలుదేరే ముందు అపొస్తలులు కలిసి ఈ విశ్వాస ప్రమాణాన్ని వ్రాసారనే దృక్కోణాన్ని ఆయన వివరించాడు. “అపొస్తలుల విశ్వాస ప్రమాణము” అనే శీర్షికను క్రీ.శ. 390లో అంబ్రోస్ ప్రస్తావించాడు. ఈ విశ్వాస ప్రమాణాన్ని వివరించే కథనం ఇది అపొస్తలులచే సంయుక్తంగా సృష్టించబడిందని, పన్నెండు మందిలో ప్రతి ఒక్కరూ పన్నెండు స్టేట్మెంట్స్ లలో ఒక దానిని అందించారని చెప్తుంది. అపొస్తలులు ఆదిమ సంఘము తాము నమ్ముతున్న విశ్వాసాన్ని ఈ విధముగా ప్రకటిస్తూ కొనసాగారు. ఇది సుమారు క్రీ.శ. 180 నాటికే వ్రాత రూపంలో ఉందని వాదించబడింది.
విశ్వాస ప్రమాణము
భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను.
ఆయన ఏక కుమారుడును, మన ప్రభువైన, యేసుక్రీస్తు, పరిశుద్దాత్మ వలన గర్భమున ధరింపబడి, కన్యయైన మరియ యందు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడెను. ఆయన నరకములోనికి దిగెను. చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున ఆయన తిరిగి లేచెను. ఆయన పరలోకమునకెక్కి, సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతివైపున కూర్చుండియున్నాడు. సజీవులకును, మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి ఆయన వచ్చునని నేను నమ్ముచున్నాను.
పరిశుద్దాత్మను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్దుల ఐక్యమును, పాపక్షమాపణయు; శరీర పునరుత్థాన మును నిత్య జీవమును ఉన్నవని నేను నమ్ముచున్నాను. ఆమేన్.
క్రీ.శ. 1వ శతాబ్దములో సంఘములో క్రైస్తవులుగా మారిన యూదులుని “జుడాయిజర్స్” అని పిలిచేవాళ్ళు. వీళ్ళు అన్యులు క్రైస్తవులుగా మారుటకు ముందు వాళ్ళు యూదా మతములోనికి మారాలని మరియు ప్రతి ఒక్క క్రైస్థవునికి సున్నతి తప్పనిసరి అని భోదించారు. వాళ్ళు సున్నతిని అబ్రహమిక్ ఒడంబడిక సభ్యత్వానికి చిహ్నంగా పరిగణించి క్రైస్తవులుగా మారిన అన్యులు కూడా సున్నతి చేయించుకోవాలని పట్టుబట్టారు. అన్యులైన క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలనేది ప్రారంభ చర్చిలోని కొంతమంది యూదు క్రైస్తవుల భావన. పాత నిబంధనలోని లేవీయుల ధర్మశాస్త్రము క్రైస్తవులందరికీ వర్తిస్తుందని వాళ్ళు భావించారు. ఈ కన్వెర్ట్ అయ్యిన యూదులు, రక్షణకు క్రీస్తు యొక్క విమోచన ఒక్కటే సరిపోదని, అదనంగా ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చవల్సియున్నారని భోదించారు. ఈ అంశంపై పౌలు అతని యూదు వ్యతిరేకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. అపొస్తలుల కార్యములు 15 మరియు గలతీయులు 2 రెండూ యేసు అనుచరులుగా మారడానికి మతం మారుతున్న పురుష అన్యులు సున్నతి చేయించుకోవాలా వద్దా అనే దానిపై చర్చించడానికి యెరూషలేం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయబడిందని సూచిస్తున్నాయి. క్రైస్తవ మతంలోకి మారిన అన్యులు రక్షింపబడటానికి సున్నతి చేయించుకొవల్సిన అవసరం లేదని యెరూషలేం కౌన్సిల్ నిర్ణయించింది. యెరూషలేం కౌన్సిల్ సాధారణంగా క్రీ.శ. 48-50 నాటిది అంటే యేసు సిలువ వేయబడిన దాదాపు 15 నుండి 25 సంవత్సరాల తర్వాత నాటిది. యేసు క్రీ.శ. 26- 33 మధ్య మరణించాడు. గలతీయులకు 2:3-10, 15-16; గలతీయులకు 3,4,5,6 అధ్యయాలు చదవండి. జుడాయిజర్స్ త్రిత్వమును అంగీకరించ లేదు. యేసును 100% నిజదేవునిగా (దేవునికుమారునిగా) ఒప్పుకోలేదు. యేసుని మానవత్వమును మాత్రమే ఒప్పుకొన్నారు.
క్రీ.శ. మొదటి రెండు శతాబ్దాములలో ఉనికిలో ఉన్న మరొక యూదు క్రైస్తవ శాఖ “ఎబియోనైట్స్”. ఎబియోనైట్లు సన్యాసం, పవిత్ర స్వచ్ఛంద పేదరికంలో జీవించే వాళ్ళు వారి జీవనశైలి పద్ధతులు భిన్నంగా ఉండేవి. వీళ్ళు మతపరమైన శాఖాహారులు, ఆచార వాషింగ్ని ప్రతిరోజు ఆచరించే వాళ్ళు. వీళ్ళు తోరాను ఫాలో అయ్యేవాళ్ళు. యెరూషలేమును పరిశుద్ధ పట్టణముగా గౌరవించారు. ఏకైక దేవుణ్ణి విశ్వసించారు. యేసును మెస్సీయ అని ద్వితీయోపదేశ కాండము 18:16లో ప్రస్తావించ బడిన నిజమైన “ప్రవక్త” అని నమ్మారు (నీ దేవుడైన యెహోవా నీమధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను). వీళ్ళు ఆయన వర్జిన్ బర్త్ ని మరియు ఆయన శాశ్వతమైన పూర్వ ఉనికిని (దైవత్వాన్ని) తిరస్కరించారు. క్రీస్తు ఒక దేవుని దూత అని యేసులో అవతరించాడని, యేసు తన బాప్తిస్మములో దేవుని కుమారుడిగా దేవుని చేత “దత్తత తీసుకోబడిన వ్యక్తి” (అడాప్షనిజం) మాత్రమే అని అభిప్రాయపడ్డారు. కుమారుడు ఇతర దేవదూతలను మరియు ఈ ప్రపంచంలోని జీవులను పరిపాలించే ప్రధాన దేవదూతలలో ఒకరిగా సృష్టించబడ్డాడని ఈ స్వర్గపు ప్రధాన దేవదూత మానవుడైన యేసుపైకి దిగివచ్చాడని, భూమిపైకి రావడంలో ఆయన ప్రాథమిక లక్ష్యం పాత నిబంధన యాజకత్వాన్ని ముగించడం అని నమ్మారు. “యేసు మరియు క్రీస్తు ఇద్దరు వేర్వేరు జీవులని”, క్రీస్తు దేవుని దూత అని అతడు బాప్టిజం సమయంలో దేవుని కుమారుడిగా స్వీకరించబడినప్పుడు యేసులో అవతరించాడని నమ్మారు. వారు యేసు యొక్క దైవత్వం, పూర్వ ఉనికి, కన్యకు జన్మించుట మరియు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం వంటి క్రైస్తవ విశ్వాసాలను తిరస్కరించారు. యేసు యేసేపు మరియలకు జీవసంబంధమైన కుమారుడిగా యేసు యొక్క మానవత్వాన్ని నొక్కిచెప్పారు. యేసు తన ప్రవచనాత్మక ప్రకటన ద్వారా జంతుబలుల రద్దును ప్రకటించడానికి వచ్చాడని మరియు ఇతరులకు ప్రత్యామ్నాయంగా కాకుండా ఒక అమరవీరుడుగా మరణించాడని నమ్మే వాళ్ళు. యేసు యూదుల ధర్మశాస్త్రాన్ని పాటించినందున ఆయన మెస్సీయ అయ్యాడని ఎబియోనైట్స్ నమ్మారు. అతడు ధర్మశాస్త్రంలోని కొన్ని భాగాలను (వాడుకలో లేనివి) అవినీతిగా భావించి తిరస్కరించాడని, జంతుబలిని వ్యతిరేకించాడని నమ్మే వాళ్ళు. యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా క్రీస్తు అనే పేరును సంపాదించాడని, ధర్మశాస్త్రమే రక్షణకు నిజమైన మార్గమని యేసు కాదని భోదించేవాళ్ళు. యేసు వాగ్దానం చేయబడిన యూదు మెస్సీయ అని కాని దైవికం కాదని వారు విశ్వసించారు. జంతుబలిని వ్యతిరేకించారు. ఎబియోనైట్‌లు పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను వక్కాణించారు. హతసాక్షిగా యేసు మరణం, మెస్సియానిక్ యుగంలో ప్రామాణికంగా దేవుని ఎదుట నీతితో (అంతరంగములో, బయటి ప్రవర్తనలో) జీవించుమని ఇశ్రాయేలీయులందరినీ పశ్చాత్తాపపడేలా కదిలిస్తూ ఉందని కాబట్టి, నీతిమంతులుగా మారడానికి, భూమిపై ఉన్న దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మరియు వినాశనం నుండి రక్షింపబడటానికి, యూదులు మరియు యూదు మతంలోకి మారిన విశ్వాసులైన అన్యులు ఇద్దరూ పశ్చాత్తాపం చెందాలని, వ్రాతపూర్వక ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించాలని (జంతుబలి తప్ప) ఎబియోనైట్‌లు పట్టుబట్టారు. వీళ్ళు దయతో కూడిన పనులను గూర్చిన యేసు బోధలను అనుసరించారు. వాళ్ళు యేసు సోదరుడైన యాకోబును యేసు యొక్క నిజమైన వారసుడిగా (పేతురు కాకుండా) గౌరవించారు, అదే సమయంలో పౌలును తప్పుడు అపొస్తలుడిగా మరియు ధర్మశాస్త్రం నుండి మతభ్రష్టుడిగా తిరస్కరించారు. పౌలు పత్రికలను తిరస్కరించారు. జుడాయిజంలోకి మారిన అన్యులకు మాత్రమే టేబుల్ ఫెలోషిప్ పరిమితం చేసారు. వీళ్ళు హీబ్రూ బైబిల్‌కు (పాత నిబంధనకు) అదనపు గ్రంథంగా మత్తయి సువార్తలో మొదటి రెండు అధ్యాయములను తీసివేసి 3-28 అధ్యాయాలను మాత్రమే ఉపయోగించారు. క్రిస్టియన్ సైన్స్ మరియు మోర్మన్స్ నేటి ఎబియోనైట్స్. వీళ్ళు త్రిత్వమును అంగీకరించ లేదు. యేసును 100% నిజదేవునిగా (దేవునికుమారునిగా) ఒప్పుకోలేదు. యేసుని మానవత్వమును మాత్రమే ఒప్పుకొన్నారు.
క్రీ.శ. మొదటి రెండు శతాబ్దాములలో ఉనికిలో ఉన్న మరొక క్రైస్తవ శాఖ నీకొలాయితులు అనే వాళ్ళు క్రొత్తనిబంధనలోని ప్రకటన గ్రంధములో రెండుసార్లు ప్రస్తావించబడిన ప్రారంభ క్రైస్తవ విభాగం, ప్రకటన 2:6,14-16. నీకొలాయితులు “బిలాము సిద్ధాంతాన్ని” కలిగి ఉన్న సమూహంలో భాగమయ్యారు, “బిలాము సిధ్ధాంతము”, అంటే సంఖ్యాకాండము 25:1-3, “విగ్రహాలకు అర్పించిన ఆహారం తినడం మరియు లైంగిక అనైతికత”. బిలాము సిధ్ధాంతము రాజీ సిధ్ధాంతము, క్రైస్తవ మతం మరియు అన్యమతముల మధ్య పూర్తి విభజన అవసరం లేదని సూచించటం. వ్యభిచరింప వద్దు అనే ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రములో భాగమని నికోలాయిటన్లు విశ్వసించారని (దీని నుండి వారు యేసుక్రీస్తు ద్వారా విముక్తి పొందారని నమ్మేవారని) వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచారు. బిలాము (సంఖ్యాకాండము 22–25,31) ఒక తాంత్రికుడు, అతని ద్వారా మాట్లాడడానికి ప్రభువు అతనిని ఎంచుకున్నాడు (సంఖ్యాకాండము 22:8,9 యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను దేవుడు బిలాము నొద్దకు వచ్చి– నీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా). ఇశ్రాయేలీయులను శపించడానికి బిలాముకు మోయాబు రాజు చాల సంపదను ఇచ్చాడు. కాని బిలాము నోటి నుండి ఆశీర్వాదాలు మాత్రమే రావడానికి ప్రభువు అనుమతించాడు, కాని బిలాముకు ఇంకా డబ్బు కావాలి. అందుకు అతడు ఇశ్రాయేలీయులపై విపత్తును తీసుకురావడానికి తెలివిగా మరో మార్గాన్ని సూచించాడు. మిద్యానీయుల స్త్రీలను ఇశ్రాయేలీయుల పురుషులతో వ్యభిచారం చేయమని ప్రలోభపెట్టి, ఆపై ఆ లైంగిక ఆకర్షణను ఉపయోగించి ఇశ్రాయేలీయులను విగ్రహారాధనకు నడిపించాడు. (ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి, సంఖ్యాకాండము 25:1,16 మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై యున్నారు). దేవుని తీర్పు బిలాముపై కూడా పడింది. అతడు కత్తితో చంపబడ్డాడు (సంఖ్యాకాండము 31:8 బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి). దురదృష్టవశాత్తూ, బిలాము పాపం బిలాముతో పోలేదు. సంఘ చరిత్రలో వారి స్థానాన్ని వాడుకొని డబ్బు దోచుకొనిన వారి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. (తమకు కావాలనుకున్న దాని విషయములో దురాశ).
ఆదిమ క్రైస్తవులు అన్యమత సంస్కృతిలో నివసించారు. వారి చుట్టూ అక్కడ అన్యమత ఆరాధనలలో, దేవాలయాలలో ఆచార వ్యభిచారం చేసే సంస్కృతి ఉంది. వాటిలో మత్తు పదార్థాలు మరియు సామాజిక పరిమితులను తొలగించడానికి ఇతర ట్రాన్స్-ప్రేరేపిత పద్ధతులను ఉపయోగించే వారు. డయోనిసియన్ మిస్టరీలు కూడా ఉన్నాయి. వీటి ప్రభావాన్ని సంఘము లోనికి విభిన్న విధములుగా ప్రవేశపెట్టడానికి సాతాను ప్రయత్నాన్ని గమనించండి.
ప్రారంభ శతాబ్దాలలో ఉనికిలో ఉన్న మరొక అబద్దపు బోధ “గ్నోస్టిసిజం”. గ్నోస్టిసిజంకి బిబ్లికల్ రెఫరెన్సు 1 తిమోతికి 6:20, ఓ తిమోతీ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టిమాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. గ్నోస్టిక్స్ మేజిక్ మరియు ఆచారాల ద్వారా రహస్యముగా దాగివున్న జ్ఞానం కోసం శోధించారు. గ్నోస్టిసిజం ఒక పదునైన విశ్వ సంబంధమైన ద్వంద్వ వాదం గురించి బోధించింది. గ్నోస్టిసిజం యొక్క ప్రధాన ఆలోచనలలో ఒకటి “పదార్థం”. మనం చూడగలిగే మరియు తాకగలిగే భౌతిక ప్రపంచంలోని విషయాలన్ని చెడ్డవని, ఆత్మ మాత్రమే స్వచ్ఛమైనదని మంచిదని నమ్మే వాళ్ళు. దేవునికి పదార్థంతో సంబంధం లేదు కాబట్టి, ఆయన మానవ శరీరాన్ని తీసుకోలేడని వారు నిర్ధారించారు. వాళ్ళు భౌతిక ప్రపంచం చెడ్డదని విశ్వసించినందున, వారు యేసు శరీరధారి ఆయెనని నమ్మడానికి నిరాకరించారు. క్రీస్తు యొక్క శరీరం మానవ శరీరము కాదని అది ఒక భ్రాంతి కావొచ్చని లేదా అది నిజమైన ఖగోళ పదార్ధంకు సంబంధించిన శరీరమై ఉండొచ్చని కాబట్టే ఆయన శ్రమలు అంత స్పష్టంగా ఉన్నాయి అని నమ్మేవాళ్ళు. అట్లే ఆయనను జ్ఞానాన్ని భూమిపైకి తీసుకురావడానికి అవతారమెత్తిన సర్వోన్నత జీవి యొక్క స్వరూపంగా గుర్తించారు. మరికొందరు సర్వోన్నత జీవి శరీరంలో వచ్చాడనే విషయాన్ని మొండిగా ఖండిస్తు, యేసు కేవలం జ్ఞానోదయం ద్వారా జ్ఞానోదయం పొందిన మానవుడని పేర్కొన్నారు. ఆయన ఈ ఉనికి నుండి తీసుకోబడిన భౌతిక రూపాన్ని మాత్రమే కలిగి ఉన్నాడని అందువలన ఆయన నిజంగా చనిపోలేదని నమ్ముతు యేసు యొక్క దైవిక స్వభావాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన శిలువ మరణాన్ని తిరస్కరించారు. ఆయనకు శరీరం లేదు కాబట్టి పునరుత్థానం లేదని పేర్కొన్నారు. ఆ విధంగా, గ్నోస్టిసిజం సువార్త ప్రధానాంశముపై దాడి చేసింది. గ్నోస్టిక్స్ ప్రకారం, రక్షణ అనేది రహస్య జ్ఞానం ద్వారా ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రలోభాల నుండి, శరీరం నుండి విముక్తి పొందడం. శరీరం చెడ్డది కాబట్టి, దాని ప్రయోజనాలు కొద్దిగా మాత్రమే ఉన్నందున, దానిని కఠినంగా ట్రీట్ చెయ్యమని భోదించారు (అన్ని విషయాలలో కఠినమైన సన్యాసం). గ్నోస్టిక్స్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది దేవుళ్లను పూజించారు, అజ్ఞాన నిర్మూలనపై వారు దృష్టి సారించారు.
క్రీ.శ. రెండు మూడు శతాబ్దాములలో ఉన్న మరొక అబద్దపు బోధ “మోడలిస్టిక్ మోనార్కియనిజం”, ఇది దేవుడు ఒక వ్యక్తే, దేవునిలో విభిన్న వ్యక్తులు లేరు కాని ఏకైక దేవుడే విభిన్న పాత్రలలో (తండ్రి, కుమారుడు మరియు పవిత్రాత్మగా) వ్యక్తపరచుకొన్నాడు అని చెప్పే సిద్ధాంతం. ఇది దేవుని ఏకవ్యక్తి ఏకత్వాన్ని నొక్కి చెబుతుంది మరియు భగవంతునిలోని బహుళ వ్యక్తులకు వ్యతిరేకంగా వాదిస్తుంది. ఇది దేవుడిని ఒక అవిభాజ్య జీవిగా నొక్కి చెప్పే సిద్ధాంతం. ఇది త్రిత్వవాదాన్ని వ్యతిరేకిస్తుంది. కుమారుడు తండ్రితో సహ-శాశ్వతుడు కాదని మరియు యేసుక్రీస్తు దేవుని ప్రణాళికల కోసం మరియు అతని స్వంత పరిపూర్ణ జీవితం మరియు పనుల కోసం తప్పనిసరిగా దైవత్వం (దత్తత) పొందాడని ఇది పేర్కొంది. దేవుడు ఒక్కడే అయితే ఆయన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనే విభిన్న “మోడ్స్” ద్వారా ప్రత్యక్షమై పనిచేస్తాడని నమ్మేవాళ్ళు. ఈ దృక్పథాన్ని అనుసరించి, దైవత్వమంతా అవతారం నుండి యేసు వ్యక్తిత్వంలో నివసిస్తుందని అర్థం అవుతుంది. “తండ్రి” మరియు “కుమారుడు” అనే పదాలు దేవుని అతీంద్రియత్వం మరియు అవతారం మధ్య వ్యత్యాసాన్ని వివరించడానికి ఉపయోగించబడతాయి. చివరగా, యోహాను సువార్త సందర్భంలో దేవుడిని ఆత్మగా అర్థం చేసుకున్నందున, పరిశుద్ధాత్మను ఒక ప్రత్యేక అస్తిత్వంగా అర్థం చేసుకోకూడదని, దేవుని చర్య యొక్క కేవలం వర్ణనగా అర్థం చేసుకోవాలని చెప్పేవాళ్ళు.
క్రీ.శ. రెండు మూడు శతాబ్దాములలో ఉన్న మరొక అబద్దపు బోధ “డైనమిక్ మోనార్కియనిజం”, యేసు తండ్రితో సహ-శాశ్వతంగా ఉండటానికి బదులుగా, దైవిక శక్తి మరియు జ్ఞానం ద్వారా దేవుని కుమారుడిగా మారిన వ్యక్తి అనే తప్పుడు బోధ. యేసు కేవలం మానవుడని, అద్భుతంగా గర్భం దాల్చాడని, దైవిక శక్తి (డైనమిస్) ద్వారా దేవుని కుమారుడు అయ్యాడని పేర్కొంది. ఇతర అబద్ద బోధల మాదిరిగానే, ఇది కూడా దేవుని ఏకత్వమును నొక్కి చెబుతుంది, విభిన్నమైన, సహ-సమాన వ్యక్తులతో కూడిన త్రిత్వ భావనను తిరస్కరిస్తుంది. “దత్తత” అనే పదాన్ని తరచుగా డైనమిక్ మోనార్కియనిజంకు పర్యాయపదంగా ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది యేసును దేవుడు తన కుమారుడిగా “దత్తత తీసుకున్నాడు” లేదా “ఎంచుకున్నాడు” అని సూచిస్తుంది. దత్తతవాదం క్రీస్తు యొక్క శాశ్వతమైన పూర్వ ఉనికిని తిరస్కరిస్తుంది. ఇది యేసు బాప్టిజం, పునరుత్థానం లేదా ఆరోహణ సమయంలో దేవుని కుమారుడిగా స్వీకరించబడ్డాడని చెబుతుంది.
క్రీ.శ. రెండు మూడు శతాబ్దాములలో ఉన్న మరొక అబద్దపు బోధ ఆరిజెన్ యొక్క తప్పుడు బోధనలు. ఇతడు ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో క్రీ.శ. 185లో జన్మించిన ఆరిజెన్, ఒక ప్రముఖ ప్రారంభ క్రైస్తవ పండితుడు, వేదాంత వేత్త మరియు సన్యాసి, కొన్ని క్రైస్తవ సమూహాలచే చర్చి ఫాదర్‌గా పరిగణించబడ్డాడు. ఆరిజెన్ బోధనలలో కొన్ని, ఆత్మల పూర్వ ఉనికి మరియు చివరికి దేవునితో అన్ని జీవుల సయోధ్య (అపోకాటాస్టాసిస్) పై అతని అభిప్రాయాలు వివాదాస్పదమయ్యాయి. ఆరిజెన్ యేసు “సర్వ సృష్టికి ఆది సంతానం” అని రాశాడు. యేసుకు మానవ ఆత్మ ఉందని అతడు గట్టిగా నమ్మాడు.
అత్యంత ముఖ్యమైన ప్రారంభ విభేదాలలో ఒకటి, 3 శతాబ్దం ప్రారంభంలో “ఏరియన్ వివాదం”, ఇది దేవునితో యేసు యొక్క సంబంధంపై చర్చిని విభజించింది. ఈజిప్టు లోని అలెగ్జాండ్రియాకు చెందిన ప్రీస్ట్ ఏరియన్స్, యేసు “జన్మించబడ్డాడు” లేదా “దేవునిచే తీసుకురాబడినందున”, అతడు దేవుని కంటే తక్కువ దైవత్వం ఉన్నవాడు అని చెప్పాడు. ఇది త్రిత్వ భావనను తిరస్కరిస్తుంది. యేసును దేవుని సృష్టిగా భావిస్తుంది. దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుని ద్వారా జన్మించాడని, నిత్యత్వములో ఒకానొక టైములో ఆయన ఉనికిలో లేడని కాలానికి ముందు తండ్రి అయిన దేవుని ద్వారా జన్మించాడు/తయారు చేయబడ్డాడు కాబట్టి, యేసు తండ్రి అయిన దేవునితో సమానుడు కాదనే బోధ. ఇది కుమారుడు మరియు తండ్రి మధ్య పూర్తి అసమానతను నొక్కి చెబుతుంది. కుమారుడు తండ్రి నుండి భిన్నంగా ఉంటాడని మరియు అందువల్ల అతనికి లోబడి ఉంటాడని అరియనిజం భావిస్తుంది. దేవుడు మాత్రమే తన ఉనికి నుండి స్వతంత్రుడు అనేది అరియస్ ప్రాథమిక సూత్రం. కుమారుడు ఆధారపడినవాడు కాబట్టి, అతన్ని ఒక జీవి అని చెప్పాడు. అరియన్లు తమ వాదన కోసం ఒక ప్రశ్నను ముందుకు తెచ్చారు: “దేవుడు యేసును ఇష్టపూర్వకంగా కన్నాడా లేదా ఇష్టం లేకుండా కన్నాడా?” దేవుడు కోరుకొని నందున మాత్రమే యేసు ఉన్నాడు కాబట్టి యేసు తన ఉనికి కోసం ఆధారపడి ఉన్నాడని వాదించడానికి ఈ ప్రశ్న ఉపయోగించబడింది. అందుకు వాళ్ళు సామెతలు 8:22,23, పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని, చూపెడతారు. అందువల్ల, కుమారుడు దేవుని జీవులలో మొట్టమొదటివాడని అత్యంత పరిపూర్ణుడని, మరియు ఆయన తండ్రి అనుమతి మరియు శక్తి ద్వారా మాత్రమే “దేవుడు” అని పిలువబడ్డాడని వారు వాదించారు. లోగోస్ అనేది ప్రపంచ సృష్టికి ముందు తండ్రి అయిన దేవుడు సృష్టించిన దైవిక జీవి అని, సృష్టికి మాధ్యమంగా పనిచేస్తుందని మరియు దేవుని కుమారుడు తండ్రికి అధీనంలో ఉన్నాడని అరియనిజం బోధించింది. లోగోస్ అనే భావన జ్ఞానంతో ముడిపడి ఉన్న దేవుని అంతర్గత లక్షణాన్ని సూచిస్తుందని, దేవుని స్వభావం యొక్క ఈ అంతర్గత అంశానికి సారూప్యత ఉన్నందున యేసును లోగోస్‌గా గుర్తించారు. అరియన్లు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మరు. పరిశుద్ధాత్మ, దేవుని ప్రకాశించే మరియు పవిత్రం చేసే శక్తి అని చెప్పారు.
అయితే అలెగ్జాండ్రియన్ వేదాంతవేత్త అయిన అతనేసియస్, అతనిని ఖండిస్తూ యేసు “దేవుడు శరీరధారి అగుట” అని చెప్పాడు. ప్రధానంగా, త్రిత్వవాదం మరియు ఆరియనిజం మధ్య వివాదం రెండు ప్రశ్నలకు సంబంధించినది: కుమారుడు ఎల్లప్పుడూ తండ్రితో శాశ్వతంగా ఉన్నాడా? లేదా కుమారుడు గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జన్మించాడా? కుమారుడు తండ్రితో సమానమా లేక తండ్రికి లోబడి ఉంటాడా? కాన్స్టాంటైన్ కి, ఇవి సామ్రాజ్యాన్ని ఏకం చేయడానికి అడ్డుగా నిలిచిన చిన్న వేదాంత అంశాలు, కాని వేదాంతవేత్తలకు, ఇవి చాలా ముఖ్యమైనవి. వారికి, ఇది మోక్షానికి సంబంధించిన విషయం. ఇది రోమన్ సామ్రాజ్యంలో పెద్ద తిరుగుబాటుకు కారణమైంది. ఇది రోమన్ సామ్రాజ్యంలోని క్రైస్తవులను రెండు భాగాలుగా విభజించింది. క్రీ.శ. 321లో, అలెగ్జాండ్రియాలోని ఒక సినోడ్ ద్వారా అరియస్, తండ్రి అయిన దేవునితో యేసుకు ఉన్న సంబంధం గురించి భిన్నమైన దృక్పథాన్ని బోధించినందుకు ఖండించబడ్డాడు. క్రీ.శ. 325 నాటికి, ఈ వివాదం చాలా ముఖ్యమైనదిగా మారింది, కాన్స్టాంటైన్ చక్రవర్తి బిషప్‌ల సమావేశాన్ని, మొదటి కౌన్సిల్ ఆఫ్ నైసియాను పిలిచాడు, కౌన్సిల్ ఆఫ్ నైసియా – క్రీ.శ. 325లో కాన్స్టాంటైన్ I చక్రవర్తి సారధ్యములో కూడుకొన్న వేదాంతవేత్తలు మరియు పండితుల సమూహం – చివరికి ఏరియన్స్ కు వ్యతిరేకంగా నిలిచింది, ఏరియన్ సిద్ధాంతాన్ని ఖండించింది మరియు నైసీన్ క్రీడ్‌ను (క్రీ.శ. 325లో) రూపొందించింది. ఏరియన్ బిషప్ కానందున, అతను కౌన్సిల్‌లో కూర్చోవడానికి అనుమతించబడలేదు. అతని తరపున మాట్లాడినది నికోమీడియాకు చెందిన యూసేబియస్. నైసియా కౌన్సిల్‌లో హాజరైన దాదాపు 300 మంది బిషప్‌లలో , ఇద్దరు బిషప్‌లు ఏరియనిజాన్ని ఖండించిన నిసీన్ క్రీడ్‌పై సంతకం చేయలేదు. ఇది రోమన్ సామ్రాజ్యంలో పెద్ద తిరుగుబాటుకు కారణమైంది. ఇది రోమన్ సామ్రాజ్యంలోని క్రైస్తవులను రెండు భాగాలుగా విభజించింది. చర్చి యొక్క ఈ అధికారిక అభిప్రాయంను ఏకీభవించని క్రైస్తవులు ఈ అంశంపై విభజించబడ్డారు. ఈ బోధనతో అనుసంధానించబడిన ఆధునిక ప్రధాన స్రవంతి తెగలలో యెహోవా సాక్షులు, చర్చిస్ అఫ్ క్రైస్ట్ లలోని కొన్ని వ్యక్తిగత చర్చిలు అలాగే కొంతమంది హిబ్రూ రూట్స్ క్రైస్తవులు మరియు మెస్సియానిక్ యూదులు ఇప్పటికి ఉన్నారు.
నీకేయ విశ్వాస ప్రమాణము
భూమ్యాకాశములను, దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తిగల, తండ్రియైన, ఏక దేవుని మేము నమ్ముచున్నాము.
దేవుని ఏక కుమారుడును, ఏక ప్రభువైన, యేసుక్రీస్తు, నిత్యత్వమందు తండ్రి కనిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక, తండ్రి కనిన వాడును, తండ్రితో ఏకత్వముగల వాడునై యున్నాడు. ఆయన ద్వారా సమస్తమును కలుగజేయబడి యున్నది. మన కొరకును మన రక్షణ కొరకును, ఆయన పరలోకము నుండి దిగి, కన్యయగు మరియ నుండి పరిశుధ్ధాత్మ వలన శరీరధారియై, పరిపూర్ణ మనుష్యుడాయెను. ఆయన పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడెను. ఆయన శ్రమపడి మరణించి సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన తిరిగి లేచెను. ఆయన పరలోకమున కెక్కి తండ్రి యొక్క కుడిచేతివైపున కూర్చుండియున్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు మహిమలో తిరిగి వచ్చును, మరియు ఆయన రాజ్యమునకు అంతము లేదని మేము నమ్ముచున్నాము. ఆమేన్.
తండ్రి నుండియు కుమారుని నుండియు బయలు వెడలుచు, తండ్రితోను మరియు కుమారునితోను ఏకముగా ఆరాధించబడుచూ మరియు మహిమపరచబడుచూ, ప్రవక్తల ద్వారా మాట్లాడినవాడును, జీవమునకు దాతయు, ప్రభువగు, పరిశుధ్ధాత్మని మేము నమ్ముచున్నాము. పరిశుద్ధ క్రైస్తవ అపొస్తలుల ఏక సంఘమును మేము నమ్ముచున్నాము. పాప పరిహారమునకై ఒకే బాప్తిస్మమును మేము ఒప్పుకొనుచున్నాము. మృతుల పునరుత్థానము కొరకును మరియు రాబోవు లోకములో జీవించు బ్రతుకు కొరకును మేము నిరీక్షించుచున్నాము.
క్రీ.శ. 325లో జరిగిన మొదటి నైసియా కౌన్సిల్‌లో త్రిత్వము ( తండ్రి కుమార పరిశుద్దాత్మ) గుర్తించబడ్డారు, కాని దాని అర్థం ఏమిటనే దానిపై చర్చ కొనసాగింది.
అపోలినేరియనిజం, లావోడిసియాకు చెందిన అపోలినారిస్ సిరియాలోని లావోడిసియా బిషప్. అతడు ఏరియన్ నిజం యొక్క ప్రముఖ ప్రత్యర్థిగా ప్రసిద్ధి చెందాడు. యేసు దైవత్వాన్ని ఆయన మానవత్వము యొక్క ఐక్యతను నొక్కి చెప్పడానికి అపోలినారిస్ క్రీస్తు మానవ స్వభావంలో హేతుబద్ధమైన మానవ ఆత్మ ఉనికిని తిరస్కరించాడు అంటే క్రీస్తు యొక్క నిష్కళంకతను మరియు విమోచన యొక్క అనంతమైన విలువను కాపాడటానికి యేసు మానవత్వం నుండి మానవ ఆత్మను తొలగించాడు. అపోలినేరియనిజం, యేసుకు మానవ శరీరం మరియు సున్నితమైన ఆత్మ ఉందని, కాని మానవ హేతుబద్ధమైన మనస్సుకు బదులుగా దైవిక మనస్సు ఉందని ప్రతిపాదించింది. తద్వారా క్రీస్తు యొక్క పూర్తి మానవత్వాన్ని తిరస్కరించింది. ఈ దృక్పథాన్ని అపోలినారిజం అని పిలుస్తారు. దీనిని క్రీ.శ. 381లో మొదటి కాన్స్టాంటినోపుల్ కౌన్సిల్ ఖండించింది.
పెలాజియనిజం: బ్రిటిష్ దీవులకు చెందిన సన్యాసి మరియు తత్వవేత్త పెలాజియస్ (క్రీ.శ. 355-418) బోధలను పెలాజియనిజం అంటారు. దేవుడు విశ్వాసులను అసాధ్యమైన వాటిని చేయమని ఆజ్ఞాపించలేడని, అందువల్ల అన్ని దైవిక ఆజ్ఞలను నెరవేర్చడం సాధ్యమని బోధించాడు. ఒక వ్యక్తిని మరొకరి పాపాలకు శిక్షించడం అన్యాయమని కూడా అతను బోధించాడు. శిశువులు నిందారహితంగా పుడతారని బోధించాడు. పెలాజియస్ మానవులు తమ స్వంత సంకల్పం ద్వారా దేవునికి పరిపూర్ణంగా విధేయత చూపగలరని వాదించాడు.
ఆదాము సృష్టించబడినట్లే మానవులు కూడా అమాయకత్వంలోనే జన్మిస్తారని, ఆదాము హవ్వలు చేసిన పాపం మానవ స్వభావాన్ని కళంకం చేయలేదని లేదా అతని వారసులకు సంక్రమించలేదని ఆదాము పాపం తనను మాత్రమే ప్రభావితం చేసిందని, ఆదాము పాపం ద్వారా మానవాళి అంతా ప్రభావితం కాలేదని పాపం అంటే మీరు చేసేది మాత్రమేనని, సంక్రమించింది కాదని వారసత్వంగా పొందినది కాదని పెలాజియస్ బోధించాడు. కాబట్టి, జన్మ పాపాన్ని తిరస్కరించాడు. పెలాజియనిజం మానవులు మంచి చెడులను ఎంచుకునే సామర్థ్యాన్ని కలిగియున్నారని వారి స్వంత స్వేచ్ఛా సంకల్పం మరియు కృషి ద్వారా నైతిక జీవితాన్ని గడపగల సామర్థ్యాన్ని కలిగియున్నారని నొక్కి చెబుతుంది. మానవులు నైతికంగా తటస్థంగా జన్మిస్తున్నారు కాబట్టి, మానవులు తమ స్వేచ్ఛా సంకల్పం ద్వారా, దైవిక కృప అవసరం లేకుండానే మంచిని ఎంచుకోగలరని, నైతికంగా జీవించగలరని (పాపం లేకుండా జీవించగలరని) మరియు మోక్షాన్ని సాధించగలరని దేవుని కృప అవసరం లేకుండానే, మానవులు నీతిని సాధించడానికి మరియు పాపాన్ని నివారించడానికి సహజ సామర్థ్యాలను కలిగి ఉంటారని పెలాజియస్ నమ్మాడు. క్రైస్తవులు బాధ్యతగలిగి నీతివంతమైన జీవితాన్ని గడపడానికి వారి సామర్థ్యాన్ని నొక్కి చెప్పడం ద్వారా వారి నైతిక ప్రమాణాలను మెరుగుపరచడం పెలాజియస్ బోధనల ఉద్దేశ్యం.
ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను, (రోమా 5:12). పాపం ఆదాము ద్వారా ప్రపంచంలోకి ప్రవేశించి మానవాళి మొత్తాన్ని ప్రభావితం చేస్తుందనే బైబిల్ బోధనకు “నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను” (కీర్తన 51:5), అనే బైబిల్ బోధనకు ఇది విరుద్ధంగా ఉంది. ఈ దృక్పథాన్ని కార్తేజ్ కౌన్సిల్ (క్రీ.శ. 418) తరువాత ఎఫెసస్ కౌన్సిల్ (క్రీ.శ. 431) అబద్దపు బోధగా ఖండించింది.
సెమీ-పెలాజియనిజం: సెమీ-పెలాజియనిజం అనేది పెలాజియనిజం మరియు అగస్టీనిజం మధ్య వచ్చే ఒక వేదాంత దృక్పథం, ముఖ్యంగా మోక్షంలో మానవ సంకల్పం మరియు కృప పాత్ర గురించి. మానవులు పాపం ద్వారా ప్రభావితమైనప్పటికీ, మోక్ష ప్రక్రియను ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని మరియు దేవుని కృపతో సహకరించగలరని, అదే సమయంలో మోక్షానికి కృప యొక్క అవసరాన్ని కూడా అంగీకరిస్తారని ఇది నొక్కి చెబుతుంది. ముఖ్యంగా, ఇది మానవ సంకల్పం మరియు దైవిక కృప మధ్య ఉమ్మడి ప్రయత్నాన్ని సూచిస్తుంది, ఇక్కడ మానవులు దేవుని వైపు మొదటి అడుగు వేస్తారు మరియు కృప ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయపడుతుందనేది వారి భోధన.
మానవులు పాపం వల్ల ప్రభావితులని, కాని దేవుని కృపతో పూర్తిగా సహకరించలేనంతగా కాదని సెమీ-పెలాజియన్లు నమ్ముతారు. దైవిక జోక్యం లేకుండానే మానవులు దేవుని వైపు తొలి అడుగు వేయగలరని, ఆపై కృప వారిని మరింత శక్తివంతం చేస్తుందని వారు వాదిస్తున్నారు. కృప అనేది మార్పుకు ఏకైక ఏజెంట్ లేదా నమ్మకానికి ఏకైక కారణం కాకుండా, మోక్ష ప్రక్రియలో అవసరమైన సహాయంగా పరిగణించబడుతుంది. సెమీ-పెలాజియనిజం దేవుని కృపతో పాటు, మోక్షానికి సంబంధించిన ప్రారంభ దశలలో మానవ స్వేచ్ఛా సంకల్పం పాత్రను నొక్కి చెబుతుంది.
పెలాజియనిజం యొక్క అనుచరులు ప్రజలు పాపం ద్వారా కళంకం లేకుండా జన్మిస్తారని మరియు వారు పాపం చేయాలనుకుంటే తప్ప వారికి మోక్షం అవసరం లేదని నమ్ముతారు, ఈ నమ్మకాన్ని అబద్దపు బోధగా తోసిపుచ్చారు. దీనికి విరుద్ధంగా, దేవుని కృప లేకుండా ప్రజలు దేవుని వద్దకు రాలేరని అగస్టీన్ బోధించాడు. పెలాజియనిజం వలె, ఇప్పుడు సెమీ-పెలాజియనిజం అని పిలువబడే దానిని క్రీ.శ. 529లో రెండవ కౌన్సిల్ ఆఫ్ ఆరెంజ్‌లో వెస్ట్రన్ చర్చి అబద్దపు బోధగా ముద్ర వేసింది.
యుటిచియనిజం అనేది కాన్స్టాంటినోపుల్‌కు చెందిన యూటిచెస్ (క్రీ.శ. 380 – క్రీ.శ. 456) ఆలోచనల నుండి ఉద్భవించిన ఒక క్రైస్తవ బోధ. దీనిని మోనోఫిజిటిజం అని కూడా పిలుస్తారు. మోనోఫిసిటిజం యేసుక్రీస్తు ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నాడని, ఆయన మానవ స్వభావం ఆయన దైవత్వంలో కలిసిపోయిందని చెబుతుంది. వివిధ సమయాల్లో, క్రీస్తు మానవ స్వభావాన్ని దైవికం అధిగమించిందని లేదా క్రీస్తుకు మానవ స్వభావం ఉందని, కాని అది మిగిలిన మానవాళికి భిన్నంగా ఉందని యూటిచెస్ బోధించాడు. యూటిచెనిజం క్రీస్తు స్వభావం యొక్క ఐక్యతను ఎంతగా నొక్కి చెప్పిందంటే, సముద్రం వెనిగర్ చుక్కను తినేసిన విధంగా క్రీస్తు దైవత్వం ఆయన మానవత్వాన్ని తినేసింది. క్రీస్తు రెండు స్వభావాలు కలిగి ఉన్నాడు కాని ఆయన రెండు స్వభావాలలో లేడని యూటిచెస్ వాదించాడు : ప్రత్యేక దైవిక మరియు మానవ స్వభావాలు ఐక్యమై మిళితమయ్యాయి, యేసు తండ్రితో ఒకటిగా ఉన్నప్పటికీ, ఆయన క్రీస్తు మానవత్వముతో ఒకటిగా లేడని చెప్పాడు. వీళ్ళు క్రీస్తు దైవత్వాన్ని హత్తుకొన్నారు ఆయన మానవత్వాన్ని తృణీకరించారు. క్రీ.శ. 451లో చాల్సెడాన్ కౌన్సిల్‌లో ఇది అబద్దపు భోధగా ఖండించబడింది.
కాన్స్టాంటినోపుల్‌కు చెందిన నెస్టోరియస్ ఒక క్రైస్తవ మతాధికారి, అతను 10 ఏప్రిల్ క్రీ.శ. 428 నుండి 11 జూలై క్రీ.శ. 431 వరకు కాన్స్టాంటినోపుల్ ఆర్చ్ బిషప్‌గా పనిచేశాడు. ఆంటియోక్‌లోని కాటెకెటికల్ స్కూల్ నుండి వచ్చిన క్రైస్తవ వేదాంతి, క్రిస్టాలజీ మరియు మారియాలజీ రంగాలలో ఆయన చేసిన అనేక బోధనలు వివాదాస్పదంగా పరిగణించబడ్డాయి పెద్ద వివాదాలకు కారణమయ్యాయి. నెస్టోరియస్ బోధనలను నెస్టోరియనిజం అని అంటారు. ఇతడు క్రైస్తవ వేదాంతశాస్త్రంలో ఒక ప్రధాన సిద్ధాంతమైన హైపోస్టాటిక్ యూనియన్ను తృణీకరిస్తూ (ఒకేవ్యక్తి అయిన యేసుక్రీస్తులో దైవ మానవ స్వభావాలు రెండు ఐక్యంగా ఉన్నాయనే సిధ్ధాంతాన్ని తృణీకరిస్తూ), యేసుక్రీస్తును రెండు విభిన్న వ్యక్తులుగా, (డివైన్ అండ్ హ్యూమన్ గా చెప్తూ వీరిద్దరూ యేసుక్రీస్తులో సంపూర్ణముగా ఐక్యపర్చబడలేదని) చెప్పాడు. “ఒక వ్యక్తిలో హైపోస్టాటిక్ యూనియన్” మరియు “ఒక వ్యక్తిలో రెండు స్వభావాలు” మధ్య వ్యత్యాసం ఉంది. అట్లే మరియ మానవ క్రీస్తుకు తల్లి మాత్రమే అని పేర్కొన్నాడు. ఇతడు త్రిత్వమును తృణీకరించాడు. క్రీస్తు దైవత్వమును తృణీకరించాడు. క్రీస్తు మానవత్వమును మాత్రమే ఒప్పుకున్నాడు. నెస్టోరియస్ మరియు అతని బోధలు క్రీ.శ. 431లో ఎఫెసస్ కౌన్సిల్‌లో మరియు క్రీ.శ. 451లో మళ్ళీ చాల్సెడాన్ కౌన్సిల్‌లో అబద్దపు భోధలుగా ఖండించబడ్డాయి.
క్రీ.శ. మొదటి 500 సంవత్సరముల వరకు క్రైస్తవ సంఘము శ్రమలు మరియు అబద్దబోధకుల దాడులకు బదులుగా ప్రబలుచు వ్యాపించుచుండెను.
అతనేషియన్ విశ్వాస ప్రమాణం, ఇది ట్రినిటేరియన్ సిద్ధాంతం మరియు క్రిస్టాలజీపై దృష్టి సారించిన క్రైస్తవ విశ్వాస ప్రకటన. ఆరవ శతాబ్దం ప్రారంభం నుండి క్రైస్తవ చర్చిలు ఉపయోగిస్తున్నాయి, ఇది త్రిత్వములోని ముగ్గురి హైపోస్టేసెస్ యొక్క సమానత్వాన్ని స్పష్టంగా పేర్కొన్న మొదటి విశ్వాస ప్రమాణము. మూడు క్రైస్తవ విశ్వాస ప్రమాణాలలో చివరిది. దీనిని అతనేషియన్ వ్రాయలేదు. రచయిత లేదా అది వ్రాయబడిన ఖచ్చితమైన తేదీ తెలియదు. అన్ని అవకాశాలను పరిశీలిస్తే, ఇది బహుశా 5వ శతాబ్దం మధ్యలో లేదా 6వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ ఫ్రాన్స్‌లో ఉద్భవించి ఉండొచ్చని నమ్ముతారు. మనకు తెలిసిన పురాతన లిఖిత కాపీ క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందినది. ఈ విశ్వాస ప్రమాణం యొక్క అసలు ఉద్దేశ్యం బోధనాత్మకమైనది. 7వ శతాబ్దం నాటికి, పాశ్చాత్య చర్చిలో మతాధికారులు విశ్వాస ప్రమాణాన్ని కంఠస్థం చేసి, ప్రజలకు బోధించారు, ఇది సంగీతానికి కూడా జోడించబడింది మరియు ఆరాధనలో భాగమైంది. లూథరన్ సంస్కరణ ఈ విశ్వాస ప్రమాణాన్ని అపొస్తలుల మరియు నైసియన్ విశ్వాస ప్రమాణాలతో కలిపి నిలుపుకుంది మరియు దానిని బుక్ ఆఫ్ కాంకర్డ్‌లో చేర్చింది. లూథర్ అతనేషియన్ విశ్వాస ప్రమాణం గురించి చెప్తూ, “అపొస్తలుల కాలం నుండి కొత్త నిబంధన చర్చికి దీనంత ముఖ్యమైన రచన ఉందో లేదో నాకు తెలియదని” చెప్పాడు.
దేవుని కుమారుడు పరిశుద్దాత్ముడు ఒకే అంశము లేక దైవత్వములో తండ్రితో ఒక్కటి కాదన్న అసత్యాన్ని సంఘము ఎదుర్కోవడానికి, అలాగే యేసుక్రీస్తు అను ఒక వ్యక్తి నిజమైన దేవుడును, నిజమైన మానవుడై లేడు అనే అసత్యాన్ని సంఘము ఎదుర్కోవడానికి ఇది ఏర్పాటు చెయ్యబడింది. త్రిత్వ సిధ్ధాంతాన్ని, క్రీస్తును గురించిన సిధ్ధాంతాన్ని తిరస్కరించిన వాడు రక్షించు విశ్వాసము లేని వాడై యున్నాడని అతనేషియన్ విశ్వాస ప్రమాణము ప్రకటిస్తూ ఉంది.
అతనేసియన్ విశ్వాస ప్రమాణం
(1) అన్నిటికి మించి, రక్షింపబడుటకు కోరుకొనిన వాడు, నిజ క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉండాలి:
(2) ఎవరైతే ఈ విశ్వాసమును పరిశుద్ధముగా అన్ని విషయాలలో ఉంచుకొనడో: అట్టివాడు నిశ్చయముగా శాశ్వతముగా నశించిపోతాడు.
(3) ఇదే నిజమైన విశ్వాసము: మనము ఏక దేవునిని ముగ్గురు వ్యక్తులలోను మరియు ముగ్గురు వ్యక్తులు ఏక దేవునిలో ఉన్నారని ఆరాధిధ్ధాం,
(4) వ్యక్తులను మిళితము చేయక లేక దేవునిని విభజింపక ఉందాం.
(5) ప్రతి వ్యక్తి విషయములో – తండ్రి కుమారుడు పరిశుద్దాత్మ – వేరువేరుగా ఉన్నారు,
(6) కాని తండ్రి కుమార పరిశుద్దాత్ములు ఒకే దైవత్వమును కలిగియున్నారు. మహిమయందు ఏకత్వమును, మహాత్యమునందు శాశ్వతముగా కలసియున్న వారై ఉన్నారు.
(7) తండ్రి ఏమై యున్నాడో, కుమారుడు పరిశుద్దాత్ముడు కూడా అదేయై ఉన్నారు.
(8) తండ్రి సృజింపబడని వాడును, కుమారుడు సృజింపబడని వాడును, పరిశుద్దాత్ముడు సృజింపబడని వాడునై ఉన్నాడు;
(9) తండ్రి అనంతుడు, కుమారుడు అనంతుడు, పరిశుద్దాత్ముడు అనంతుడై ఉన్నాడు;
(10) తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్దాత్ముడు నిత్యుడై ఉన్నాడు;
(11) అయినను నిత్యత్వము నుండి ఉన్నవారు ముగ్గురుగా ఉండక, నిత్యత్వము నుండి ఉన్నవారు ఒక్కడై ఉన్నాడు.
(12) సృజింపబడని వారు ముగ్గురుగా ఉండక ఒక్కడై ఉన్నాడు. అనంతమైన వారు ముగ్గురుగా ఉండక ఒక్కడై ఉన్నాడు.
(13) అదే రీతిగా తండ్రి సర్వశక్తుడై ఉన్నాడు, కుమారుడు సర్వశక్తుడై ఉన్నాడు, పరిశుద్దాత్ముడు సర్వశక్తుడై ఉన్నాడు.
(14) అయినను సర్వశక్తులైన వారు ముగ్గురుగా గాక ఒక్కడిగా ఉన్నాడు.
(15) కనుక తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్దాత్ముడు దేవుడై ఉన్నాడు;
(16) అయినను వారు ముగ్గురు దేవుళ్లుగా గాక, ఏక దేవునిగా ఉన్నాడు.
(17) కనుక తండ్రి ప్రభువును, కుమారుడు ప్రభువును, పరిశుద్దాత్ముడు ప్రభువునై ఉన్నాడు;
(18) కాని వారు ముగ్గురు ప్రభువులుగ గాక ఏక ప్రభువుగా ఉన్నాడు.
(19) త్రిత్వములోని ప్రతి వ్యక్తిని వ్యక్తిగతముగా దేవునిగాను, ప్రభువునిగాను ఒప్పుకొనవలెనని క్రైస్తవ సత్యము మనలను బలవంతము చేయుచున్నది.
(20) కనుకనే నిజ క్రైస్తవ విశ్వాసము ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు ప్రభువులని చెప్పుటను నిషేధిస్తూ ఉంది.
(21) తండ్రి ఎవనిచేత చేయబడక, సృజింపబడక లేక కలుగక ఉన్నాడు.
(22) కుమారుడును చేయబడక సృజింపబడక తండ్రి నుండి మాత్రమే కలిగియున్నాడు.
(23) పరిశుద్దాత్ముడును చేయబడక లేక సృజింపబడక లేక కలుగక, తండ్రి నుండియు కుమారుని నుండియు బయలు వెళ్ళును.
(24) కనుక తండ్రి ఒక్కడై ఉన్నాడు, ముగ్గురు తండ్రులు కాదు; కుమారుడు ఒక్కడై ఉన్నాడు, ముగ్గురు కుమారులు కాదు; పరిశుద్దాత్ముడు ఒక్కడై ఉన్నాడు, ముగ్గురు పరిశుద్దాత్ములు కాదు.
(25) ఈ త్రిత్వము నందు ఒకరు ముందు మరొకరు వెనుకగాక, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ గాక,
(26) ముగ్గురు వ్యక్తులను సమానముగను, నిత్యత్వమునందు నిత్యులుగను ఉన్నారు.
(27) కనుక అన్ని విధములుగా, ముందు చెప్పబడినట్లు, ముగ్గురు వ్యక్తులు ఏక దేవునిగను మరియు ఏక దేవుడు ముగ్గురు వ్యక్తులుగను ఆరాధింపబడవలెను.
(28) రక్షింపబడ ఉద్దేశించిన వారు త్రిత్వము గూర్చి ఈ నిశ్చయత కలిగి ఉండవలెను.
(29) మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారియాయెనని నిజముగా నమ్ముట శాశ్వత రక్షణకు అవసరమై ఉన్నది.
(30) ఇదే నిజమైన విశ్వాసము: దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు, దేవుడును మానవుడునై ఉన్నాడని మనము విశ్వసించి ఒప్పుకొనుచున్నాము.
(31) ఆయన దేవుడై తండ్రి స్వభావము నుండి నిత్యత్వమందు కలిగిన వాడుగాను మరియు కాలములో తన తల్లి స్వభావమునుండి పుట్టిన మానవునిగాను,
(32) సంపూర్ణమైన దేవునిగను సంపూర్ణమైన మానవునిగను, సయుక్తికమైన ఆత్మతోను మానవశరీరముతో;
(33) దైవతమునందు తండ్రితో సమానునిగను మానవత్వములో తండ్రికన్న తక్కువగాను ఉండెను.
(34) ఆయన దేవుడు మరియు మానవునిగా ఉన్నప్పటికి, క్రీస్తు ఇద్దరు వ్యక్తులుగా కాక ఏక వ్యక్తిగా ఉన్నాడు.
(35) దైవత్వమును శరీరమునకు మార్చువానిగా ఉండక, మానవత్వమును దైవత్వములోనికి తీసుకొనిపోవు ఒకనిగా ఉన్నాడు.
(36) ఒక్కడై, నిశ్చయముగా, స్వభావములను సమ్మిళతము చేయక, ఒకే వ్యక్తిలో ఐక్యమై ఉన్నాడు; సంయుక్తికమైన ఆత్మ, శరీరము ఒక మానవునియందు ఎలాగూ ఉండునో,
(37) అదేవిధముగా ఒక క్రీస్తులో దేవుడు మరియు మానవుడు ఒక్కటై ఉన్నాడు.
(38) ఆయన మన రక్షణ కొరకు శ్రమపడి, నరకములోనికి దిగి, చనిపోయిన వారిలోనుండి మూడవ దినమున లేచెను.
(39) ఆయన పరలోకమునకెక్కి, సర్వశక్తుడైన తండ్రి కుడిచేతివైపున కూర్చుండియున్నాడు,
(40) మరియు అక్కడినుండి సజీవులకును, మృతులకును తీర్పు చేయుటకు వచ్చును.
(41) ఆయన రాకడ సమయమున వారి వ్యక్తిగత క్రియలకు జవాబిచ్చుటకు సమస్త ప్రజలు వారి స్వశరీరములతో లేపబడుదురు.
(42) మేలు చేసిన వారు నిత్యజీవము లోనికి ప్రవేశించుదురు. కీడు చేసిన వారు నితాగ్ని లోనికి ప్రవేశించుదురు.
(43) ఇదే నిజమైన విశ్వాసము, ఎవరైతే దీనిని విశ్వాసముతో దృఢముగా నమ్మారో వారు రక్షింపబడరు.
మధ్య యుగం
క్రైస్తవ సంఘమునకు హానికరమైన రెండు విషయములు క్రీ.శ. రమారమి 600 సంవత్సరములలో సంభవించాయి: అందు మొదటిది మహమ్మదీయ దండయాత్ర, రెండవది రోమ్ నందలి బిషప్ స్థానము యొక్క ఆధిక్యత హెచ్చగుట. ఈ దండయాత్రలో మహమ్మదీయ సేనలు ఉత్తర ఆఫ్రికా, పాలస్తీనా, సిరియా, ఆసియా మైనరు ప్రాంతాలను జయించి ఆ ప్రాంతాలలోనున్న క్రైస్తవ సంఘాలన్నిటిని నాశనము చేశాయి.
7వ శతాబ్దపు క్రిస్టోలాజికల్ సిద్ధాంతమైన మోనోథెలిటిజం, యేసుక్రీస్తుకు రెండు చిత్తాలు (wills) (దైవిక మరియు మానవ) కాకుండా ఒకే చిత్తమును (దైవిక చిత్తము) ఉందని వాదించింది, ఈ అభిప్రాయాన్ని క్రీ.శ. 680-681లో ఆరవ ఎక్యుమెనికల్ కౌన్సిల్ తిరస్కరించింది.
పశ్చిమ ఐరోపాలో రోమ్ నందలి బిషప్ క్రైస్తవ సంఘమునకు నాయకుడయ్యాడు. అతడు స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మరియు ఇటలీ దేశములందున్న సంఘమునకు నాయకుడయ్యాడు. అతడు పోపుగా గుర్తింపబడి, రాజులతో కూడా ప్రతి ఒక్కరిని ఏలుటకు క్రీస్తుచే నియమింపబడితినని చెప్పుకొన్నాడు. క్రీస్తును సేవించుటకు పోపు తన అధికారమును వినియోగించక అందుకు బదులుగా, క్రీస్తుకు వ్యతిరేకమగు సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు. అందు ఒకటి పర్గెటరి అనేది, మరొకటి రక్షణ విశ్వాసము వలన మాత్రమే గాక సత్క్రియల ద్వారా కూడా అని చెప్పడం. వాటికీ జతగా దేవుని కృప తన ద్వారాను తాను నియమించిన బిషప్ లు మరియు ప్రీస్ట్ లు ద్వారానే కలుగునని నమ్ముటకు అతడు ప్రజలను నడిపించాడు. కొందరు మనుష్యులు పోపు బోధించుచున్న భోదలు బైబులు ప్రకారము తప్పు అని చూపగా, తన అనుమతి లేనిదే బైబులును చదివిన యెడల వారు శిక్షార్హులగుదురని అతడు ఆజ్ఞను జారీ చేసాడు.
తర్వాత, క్రీ.శ. 1054లో, తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవులు పాశ్చాత్య రోమన్ కాథలిక్కుల నుండి విడిపోయారు. మతకర్మలను తీసుకోవడంపై రెండు సమూహాలు విభేదించాయి (great schism)- మతపరమైన చిహ్నాలు నమ్మిన వారికి దైవిక కృపను తరలిస్తాయని నమ్మడం పై మరియు ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవులు, ప్రిస్ట్స్ బ్రహ్మచారిగా ఉండాలనే నియమాన్ని మరియు తూర్పు చర్చి పై రోమన్ పోప్‌కు అధికారం ఉందనే విషయముపై వారిరువురు విభేదించారు.
రోమ్ మరియు అవిగ్నాన్‌లో నివసించే బిషప్‌లు ముగ్గురూ ఒకేసారి తామే నిజమైన పాపల్ వారసులమని పేర్కొనుటను బట్టి క్రీ.శ. 1378లో కాథలిక్ చర్చిలోనే వెస్ట్రన్ స్కిజం అని పిలువబడే తాత్కాలిక విభేదం పుట్టింది. ఇది కాథలిక్ చర్చిలో 20 సెప్టెంబర్ క్రీ.శ. 1378 నుండి 11 నవంబర్ క్రీ.శ. 1417 వరకు కొనసాగింది. ఈ విభజన దాదాపు 40 సంవత్సరాలు కొనసాగింది. క్రీ.శ. 1417లో ఈ సమస్య పరిష్కరించబడే సమయానికి, ప్రత్యర్థి పోప్‌లు పాపల్ కార్యాలయం యొక్క ప్రతిష్టను గణనీయంగా దెబ్బతీశారు.
ఈ కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, హెరెటిక్స్ పై సైనిక చర్యలను, శిక్షలను అమలుచేయుట ద్వారా కాథలిక్ చర్చి ఇతర సంభావ్య క్రైస్తవ శాఖలను విజయవంతంగా అణిచివేసింది. ప్రజల విశ్వాసాన్ని పరీక్షించుటకు క్రాస్ ఎక్సమినేషన్ (విచారణలు) అనే కొత్త వ్యవస్థను కాథలిక్ చర్చి ప్రవేశపెట్టింది. లౌకిక పాలకుల మద్దతుతో, హెరెటిక్స్ అగ్నికి ఆహుతి చేయబడవచ్చు లేదా వారి నమ్మకాలను తిరస్కరించి చర్చిలో తిరిగి చేరడానికి అవకాశమిచ్చారు.
మహమ్మదీయ దండయాత్ర ఫలితముగాను మరియు పోపు అధికారము పెరుగుటచేతను సువార్త సత్యము దాదాపుగా అదృశ్యమయ్యింది. రక్షణను గూర్చిన సత్యమును తిరిగి బయటకు తెచ్చుటకును మరియు బైబులును తగిన స్థానములో స్థిరపరచుటకును దిద్దుబాటు అవసరమయ్యింది. దేవుడు ఈ దిద్దుబాటుకు లూథర్ ను ఉపయోగించుకున్నాడు.
ప్రొటెస్టంట్ సంస్కరణ
లూథర్ యొక్క జన్మము విద్యాభ్యాసము (క్రీ.శ. 1483): కొలంబస్ అమెరికాను కనుగొనడానికి 9 సంవత్సరాల ముందు, క్రీ.శ. 1483లో లూథరు జర్మనీలో గల ఐస్ లేబన్ అనే చిన్న పట్టణమందు జన్మించాడు. అతని తలితండ్రులు పేదవారై యున్నప్పటికిని మార్టిన్ లూథర్ తెలివిగలవాడని యెరిగి అతనిని స్కూలుకు పంపారు. లూథరు 14 సంవత్సరముల ప్రాయములో చదువు కొనసాగించడానికి ఇల్లు వదిలి వెళ్ళవలసి వచ్చింది. డబ్బు కొదువుగా ఉన్న పిల్లలవలె లూథరు కూడా కొందరు ధనవంతుల ఇండ్లలో పాటలు పాడి తన భోజనమును కొన్నిసార్లు సంపాదించుకోవల్సి వచ్చింది. అయినప్పటికీ, అతడు తన విద్య యందు బహు ప్రావీణ్యతను చూపించాడు గనుక అతని అధ్యాపకులు అతనిని కళాశాలకు వెళ్ళమని ప్రోత్సహించారు.
కాని క్రీ.శ. 1517లో ప్రొటెస్టంట్ సంస్కరణ తర్వాత, డినామినేషన్స్ సంఖ్య గణనీయముగా పెరగడం ప్రారంభ మైంది. సంస్కరణ – అనేక సంఘటనల ద్వారా ప్రేరేపించబడింది, ముఖ్యంగా మార్టిన్ లూథర్ యొక్క 95 థీసెస్ – వ్యక్తిగత విశ్వాసాన్ని నొక్కి చెప్పింది. ఈ ఉద్యమం బైబిల్ యొక్క వ్యాఖ్యానాలకు, కృప, పాప క్షమాపణ మరియు పరలోక ప్రవేశం అన్ని క్యాథలిక్ మతంలో ప్రిస్ట్స్ ద్వారా మధ్యవర్తిత్వం వహించుచుండుటను బట్టి అందుకు ప్రతిస్పందనగా మొదలయ్యింది. లూథర్ మరియు అతని అనుచరులు చర్చి అనేది హైర్ఆర్కి (hierarchy) కాదని, ప్రిస్ట్స్ మరియు పోప్‌తో సహా ప్రజలందరిపై అంతిమ అధికారం లేఖనాలదే అని అనేకమైన మతపరమైన పద్ధతులు మరియు పాప విముక్తి కోసం చర్చికి డబ్బు చెల్లిం చడం (indulgences) అనేవి అనైతికమైనవని పేర్కొన్నారు.
విభేదాలు విభజనగా ప్రత్యర్థి తెగల మధ్య హింసాత్మక సంఘర్షణలకు దారితీశాయి. సంస్కరణలు పాపల్ అధికారాన్ని సవాలు చేసిన తర్వాత, ప్రజలు అవినీతి లేదా సందేహాస్పదమైన ఆచారాల గురించి మతపరమైన అధికారులను ప్రశ్నించడం ప్రారంభించారు.
క్రీ.శ. 1534లో హెన్రీ VIII చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను ప్రారంభించినప్పుడు ఇతర ప్రొటెస్టంట్ తెగలు అధికారం కోసం విడిపోయాయి. అతను ఇంగ్లాండ్ యొక్క రాజకీయ స్వయంప్రతిపత్తిని స్థాపించాలనుకున్నాడు. దానికి ఒక మార్గం రోమ్ నుండి మతపరమైన స్వయంప్రతిపత్తి ని తీసుకోవడం. చర్చి మంజూరు చేయడానికి నిరాకరించిన విడాకులు కూడా అతను ప్రముఖంగా కోరుకున్నాడు.
ఈ సంస్కరణ మరింత క్రైస్తవ శాఖలకు నాంది పలికింది. 17వ శతాబ్దం నాటికి, సమకాలీన పదం డినామినేషన్ అనేది మతపరమైన శాఖలను వివరించడానికి ఉపయోగించడం ప్రారంభమైంది. ప్రొటెస్టంట్లు రోమన్ కాథలిక్ చర్చిని విమర్శించడానికి లేఖనాలను ఉపయోగించారు, ఏ విశ్వాసి అయినా లేఖనాలను చదవగలరని మరియు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ ఒక సమస్య ఉద్భవించింది: లేఖనాల యొక్క ఎవరి వివరణ సరైనది? అనే ప్రశ్న తలేత్తింది. విశ్వాసులు లేఖనాలను మరియు మతకర్మలను చర్చించడం ప్రారంభించుటను బట్టి అనేక బైబిల్ వివరణలు, ఆరాధన మార్గాలు మరియు సంస్థాగత నిర్మాణాల ఆధారంగా చర్చిలు ఏర్పడ్డాయి మరియు విడిపోయాయి. ఈ చర్చల నుండి, ప్రెస్బిటేరియన్లు, మెన్నోనైట్‌లు, బాప్టిస్ట్‌లు మరియు క్వేకర్‌లు వంటి వర్గాలు రూట్ తీసుకున్నాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులలో 45,000 కంటే ఎక్కువ డినామినేషన్లు ఉన్నాయి.
ఈ రోజు క్రైస్తవత్వము వేలాది డినామినేషన్స్ గా విభజింపబడియున్నది. ఏ మతమైనా తనకు తానుగా సిధ్ధాంతపరంగా వ్యతిరేకించుకొంటూ వేలాది డినామినేషన్స్ గా విభజింపబడి ఉంటుందా? ఈ విభజనలకు కారకులెవరు? క్రైస్తవత్వములో ఇన్ని డినామినేషన్స్ ఉండటం విచారించదగిన విషయం. వాక్యంలో సరియైన శిక్షణ లేకుండా క్రైస్తవ సమాజము ఉండటం, క్రీస్తును, క్రీస్తు ప్రేమను ప్రతిబింబించ లేకపోవడం, వాదనలు, బైబిలుకు విభిన్నమైన వివరణలు, మనవల్లనే క్రీస్తుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడటమే కాకుండా మన మతాన్ని మనమే చులకన చేసుకొంటూ దాని బోధలను పలుచన చేస్తూ ఉన్నాం.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl