సంఘములో స్త్రీ భోదించొచ్చా

1 తిమోతికి 2:9-15, 9మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కొనక, 10దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 11స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. 12స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. 13మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? 14మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. 15అయినను వారు స్వస్థబుద్ధి కలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన యెడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును.

1 తిమోతి 2:9–15 వచనాలు బోధించడానికి, అన్వయించడానికి అత్యంత సవాలుతో కూడిన భాగాలలో ఒకటి. స్త్రీలు అణుకువ, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవడం మరియు స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను అను పౌలు సూచనలు నేటి ప్రపంచంలో తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడుతున్నాయి మరియు తిరస్కరించబడుతున్నాయి. పౌలు మాటలు మతసంబంధమైనవి మరియు సవాలుతో కూడుకున్నవే కాకుండా ఈ వచనాలు సంఘములో ఉన్న విశ్వాసుల జీవితాలకు మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తున్నాయి. నేటి సంస్కృతిలో, (1) అణుకువ మరియు బాహ్య రూపాన్ని గురించిన ప్రశ్న, మరియు (2) ప్రజా ఆరాధనలో బోధన మరియు అధికారాన్ని చెలాయించడంలో మహిళల పాత్రను గురించి చాలా ఒత్తిడి ఉంది.

రెండు సాంస్కృతిక ఒత్తిడి అంశాలు
మొదటి ఒత్తిడి అంశం, దుస్తులు మరియు అణుకువ. నేటి క్రైస్తవులు, మీడియా, ఫ్యాషన్ మరియు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ప్రభావితమైన సంస్కృతిలో నివసిస్తున్నారు. చాలా మంది యువతులు, అణుకువను తరచుగా అణచివేతగా అర్థం చేసుకొంటున్నారు. మరికొందరు, ఖరీదైన లేదా తమను బహిర్గతం చేసే దుస్తులను ధరించడం స్వీయ వ్యక్తీకరణగా మరియు స్వేచ్ఛగా చూస్తున్నారు. ఇది గందరగోళానికి దారితీస్తుంది. పౌలు సంఘములో అందాన్ని మరియు ఫ్యాషన్‌ను పూర్తిగా పరిమితం చేశాడా? అసలు పౌలు ఏమి చెప్పాడు?

నేటి సంస్కృతి, వ్యక్తిగత వ్యక్తీకరణ ఫ్యాషన్‌ను ఎంతో విలువైనదిగా భావిస్తుంది. ఆ దృక్పధంలో చాలా మంది హెయిర్ స్టైల్స్ లేదా ఆభరణాలతో అలంకరించుకోవడం గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా అర్థం చేసుకుంటారు. ఇతరుల్ని “ఆకట్టుకోవడానికి దుస్తులు ధరించమని” ప్రోత్సహించే ఈ సంస్కృతిలో మరియు స్వీయ-విలువ తరచుగా శారీరక రూపంతో ముడిపడి ఉన్న చోట, అణుకువ గురించి పౌలు సూచనలు పరిమితంగా అనిపించొచ్చు. నిజానికి పౌలు బోధన యొక్క ప్రధాన అంశం అందాన్ని నిషేధించడం గురించి కాదు, కాని క్రీస్తులో గుర్తింపు పై ద్రుష్టి పెట్టమని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. అలంకరణల ద్వారా తమ వైపు దృష్టిని ఆకర్షించుకొనే బదులు, క్రైస్తవ స్త్రీలు అణుకువ మరియు మంచి పనుల ద్వారా దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాలని పౌలు చెప్తున్నాడు (వచనం 10). క్రైస్తవ స్త్రీలు దేవుని దృష్టిలో మరియు వారి తోటి క్రైస్తవుల దృష్టిలో నిజంగా అందంగా ఉండటాన్ని గురించి తెలుసుకోవాలని పౌలు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆచరణలో, దుస్తుల ఎంపికలో జాగ్రత్త వహించమని పౌలు సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. “నా వస్త్రధారణ దేవునికి గౌరవాన్ని తెస్తుందా? లేదా అది ఇతరుల దృష్టిని మరల్చి నా వైపు ఆకర్షిస్తుందా?” అనే విషయాన్ని ఆలోచించవల్సి ఉన్నాం. ఉదాహరణకు, సంఘ కార్యక్రమాలలో ఒక యువతి మెరుస్తున్న లేదా ఆమెను బహిర్గతం చేసే దుస్తులను ధరించుకొని వచ్చిందనుకోండి. ఆమెను అవమానించడానికి బదులుగా, నిజమైన అందం దైవభక్తిలో కనిపిస్తుందని మరియు అణుకువ అనేది ఆరాధన సమయంలో పరధ్యానాలను నివారించడం ద్వారా దేవునిని సేవించేటట్లు ప్రేరేపిస్తుందని ఆమెకు చెప్పవలసి ఉన్నాం. ఆరాధన అంటే దేవునిని ఆరాధించడం తప్ప ఇతరులకు శోధనగా ఉండడం కాదు. అట్లే ఒకరు దుస్తులు ధరించే విధానం వాళ్ళ ఆలోచనను వారి ప్రవర్తనను తెలియజేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవల్సి ఉన్నాం. అందుకని అసహ్యంగా దుస్తులు ధరించమని లేదా చులకన చేసే విధంగా మరియు అపరిశుభ్రంగా దుస్తులు ధరించమని పౌలు చెప్పటం లేదు. దేవుని ప్రమాణాల ప్రకారం ఏది మంచిదో మరియు సముచితమో గుర్తించవల్సి ఉన్నాం.

మరోవైపు, అనవసరమైన దృష్టిని ఆకర్షించడానికి వేసిన “జడ”, బంగారు ఆభరణాలు మరియు ధనవంతులని చూపించే ఖరీదైన బట్టలు ఒక స్త్రీకి సంఘములో వ్యర్ధమైనవి. ఇది స్వీయ మరియు సంపదపై కేంద్రీకృతమై ఉన్న హృదయాన్ని బహిర్గతం చేస్తుంది.

క్రైస్తవ స్త్రీలు “తగిన మంచి పనులతో” తమను తాము అలంకరించుకోవాలి. వారి అందం కేవలం బాహ్యమైనది కాదు, దేవునికి ఇష్టమైన పనులు చేయడంలో వ్యక్తమయ్యే హృదయ సౌందర్యం.

క్రైస్తవ భార్యలను ఉద్దేశించి పేతురు కూడా వారి నిజమైన అందాన్ని ఇలా వర్ణించాడు: జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి, 1 పేతురు 3:3-5. క్రైస్తవ స్త్రీలు ఎదుర్కొన్న మరో విధ్వంసక ఒత్తిడి ఏమిటంటే, అందంగా ఉండాలనే సమాజం నుండి వచ్చే ఒత్తిడి. ఆ కాలంలో, ఇప్పుడు లాగానే, స్త్రీలు తమ రూపాన్ని బట్టి నిరంతరం తీర్పు తీర్చబడ్డారు. తమ రూపాన్ని బట్టి గ్రేడింగ్ చేయబడుతున్నామని భావించారు. ఎవరి ఆమోదం కోసం వారు ఎక్కువగా కోరుకుంటున్నారో పరిశీలించుకొమ్మని చెప్తూ, ఇతరుల కోసమైతే ఆ ఆట ఆడాల్సిన అవసరం లేదని పేతురు వారిని హెచ్చరించాడు. పురుషుల దృష్టి మరియు ఇతర స్త్రీల ఆమోదం కోసం పోటీ పడటానికి దుస్తులు ధరించే బదులు, క్రైస్తవ స్త్రీలు దేవుడు దేనికి విలువ ఇస్తాడో తమను తాము ప్రశ్నించుకోవాలి. దేవునిపై విశ్వాసం ఉంచిన పూర్వపు పరిశుద్ధ స్త్రీలు దేవుడు తమ గురించి ఏమనుకుంటున్నాడో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించారు. కాబట్టి వారు తమ బాహ్య రూపంతో ముడిపెట్టబడి ఉన్న అభద్రతా భావాలు తమను బాధపెట్టడానికి వాళ్ళు అనుమతించలేదు మరియు అవి వారిని ఇతరుల ముందు గొప్పగా చేస్తాయనే వ్యర్థమైన ఆశతో వారిని ఫ్యాన్సీ హెయిర్‌ స్టైల్స్, సౌందర్య సాధనాలు, నగలు మరియు డిజైనర్ దుస్తులకు నడిపించలేకపోయాయి.

విలువైన అందం అంతర్గతమైనది. 3వ వచనం నేటి మహిళలకు జడలు, నగలు మరియు అందమైన బట్టలు పాపపూరితమైనవని చెప్పడం లేదు, కానీ స్త్రీలు (మరియు పురుషులు) ఫ్యాషన్ మ్యాగజైన్‌ల అందం కంటే పాత్ర యొక్క అందాన్ని ఎక్కువగా విలువైనదిగా పరిగణించాలి. నిజమైన అందం లోపలి నుండి వస్తుంది.

పేతురు శారా ఉదాహరణను ప్రస్తావించాడు, 1 పేతురు 3:6. పౌలు లూదియ (అపొస్తలుల కార్యములు 16:14, 15), ఫోబే మరియు ప్రిస్కిల్ల (రోమా 16:1–4) ఇంకా అనేకులను ఉదాహరణలగా పేర్కొన్నాడు. సామెతలు 31:10–31 “గొప్ప స్వభావముగల భార్య” గురించి సమగ్ర వర్ణనను ఇస్తుంది. నేడు కూడా క్రైస్తవ స్త్రీలు తమ నిజమైన అంతర్గత స్వభావాన్ని బహిర్గతం చేసే విశ్వాసం, ప్రేమ మరియు పరిచర్య జీవితాలను గడుపుతూ బాహ్య సౌందర్యాన్ని మించిన విధంగా నిజంగా అందంగా కనిపించడానికి ప్రయత్నించవల్సి ఉన్నారు.

రెండవ ఒత్తిడి అంశం, బోధనలో మహిళల పాత్ర మరియు ఆరాధనలో అధికారం. మన సాంస్కృతిక క్షణం సమానత్వాన్ని మరియు స్వీయ వ్యక్తీకరణను బహుమతిగా ఇస్తుంది. నేడు చాలా మంది మహిళలు సంఘములో బోధించకూడదు లేదా అధికారం వహించకూడదు అనే పౌలు సూచనలతో పోరాడుతున్నారు. కొంతమందికి, ఇది స్త్రీలను నిశ్శబ్దం చేయడం లేదా కించపరచడం లాగా అనిపిస్తుంది. మరికొందరికి, ఇది పాతది మరియు అసంబద్ధమైన ఆజ్ఞగా అనిపిస్తుంది. ఈ ఉద్రిక్తతలో, పౌలు మాటలు స్త్రీలను అణచివేయడం కాదు లేదా వారిని తిరస్కరించడం కాదు అనే విషయాన్ని వారు మొదటిగా గ్రహించవల్సి ఉన్నారు. పౌలు స్త్రీల బోధనలన్నింటినీ నిషేధించే నియమాన్ని లేదా చట్టాన్ని ఏర్పర్చ లేదు. ఆమె బోధన “అధికారం” సూత్రాన్ని ఉల్లంఘించినప్పుడు ఆమె బోధించడం ఆందోళనకరం.

నేడు, సమానత్వం కోసం పోరాడుతూ స్త్రీపురుషులిరువురు ఒక్కటేనని చెప్తున్న ఈ సంస్కృతిలో పౌలు మాటలు తప్పుగా అర్థం చేసుకోబడుతున్నాయి. కొందరు పౌలు స్త్రీలను వారి తలాంతులను అణిచివేస్తున్నాడని అనుకుంటారు. మరికొందరు అతిగా స్పందించి పౌలు స్త్రీలను పరిచర్య నుండి పరిమితం చేస్తున్నాడు అనుకొంటారు. అయితే, పౌలు ఉద్దేశ్యం స్త్రీలను అణచివేయడం కాదు, సంఘము యొక్క బహిరంగ ఆరాధనలో దేవుడు సృష్టించిన క్రమాన్ని కాపాడటం.

ఇందుకు పౌలు ఇచ్చిన ఉదాహరణ, మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? 1 తిమోతి 2:13. దేవుడు ఆదాము హవ్వలను కాలక్రమానుసారంగా సృష్టించి స్త్రీ పురుష సంబంధాన్ని స్థాపించాడు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వాని కొరకు చేయుదునను కొనెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను, ఆదికాండము 2:7,18,22. ఆ విధంగా దేవుడు పురుషుడు మరియు స్త్రీలను ఒక నిర్దిష్ట పాత్ర కోసం, ఆదామును తలగా, హవ్వను సహాయకురాలుగా సృష్టించాడు. స్త్రీ బోధించి పురుషునిపై అధికారం కలిగి ఉంటే ఈ సంబంధం ఉల్లంఘించబడుతుంది. సృష్టిలో వెల్లడైనట్లుగా దేవుని చిత్తానికి అది విరుద్ధం. పౌలు అందుకు “నేను అనుమతించను” అని చెప్పడానికి ఇదే కారణం.

ఇందుకు సపోర్ట్ గా పౌలు మరో విషయాన్ని ఇక్కడ జోడించాడు. ఆదికాండములో నమోదు చేయబడిన తదుపరి చారిత్రక సంఘటన, పాపంలో పడటం. ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అని ఆ సంఘటనను గుర్తు చేస్తున్నాడు. మోసపోయిన హవ్వ బలహీనంగా ఉండటం వల్లనే ఆమెకు బోధించడానికి లేదా పురుషునిపై అధికారం కలిగి ఉండటానికి అనుమతి లేకపోవొచ్చు. పౌలు చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆదికాండము 3వ అధ్యాయంలోని చారిత్రక వృత్తాంతాన్ని పరిశీలిధ్ధాం.

ఈ వృత్తాంతం సర్పం (సాతాను) హవ్వ దగ్గరికి వచ్చి ఆమెను మోసం చేయడంతో ప్రారంభమవుతుంది. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను, ఆదికాండము 3:6. ఆదాము సాతాను అబద్ధాలు మరియు వాగ్దానాల ద్వారా మోసపోలేదు. అయినప్పటికీ, అతడు నాయకత్వం వహించడంలో విఫలమయ్యాడు. హవ్వ నాయకత్వాన్ని అనుసరించి ఆమె నుండి ఫలాన్ని తీసుకొని తిన్నాడు. హవ్వ పాపాన్ని ప్రారంభించినప్పటికీ, దేవుడు తాను మొదట సృష్టించిన ఆదామును తలగా ఉంచాడు, పతనానికి బాధ్యుడని భావించాడు. ఇక్కడ దేవుడు వీరిద్దరికి ఇచ్చిన పాత్రలు తిరగబడ్డాయి. హవ్వ నాయకత్వం వహించింది ఆదాము అనుసరించాడు. కాబట్టి దేవుడు ఆదాముతో –నీవు నీ భార్యమాట విని–తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నదని చెప్పాడు (ఆదికాండము 3:17). పౌలు రోమీయులకు వ్రాస్తూ, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా (ఆదాము ద్వారా) పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను (రోమీయులు 5:12) అని చెప్పాడు. హవ్వ తనకు కేటాయించిన పాత్ర నుండి బయటకు వచ్చినప్పుడు మరియు ఆదాము తన బాధ్యతను నిర్వర్తించనప్పుడు, ఫలితం వినాశకరమైంది.

దేవుడు ఆదామును శిరస్సుగా బాధ్యునిగా చేసినప్పటికీ, ఆమె చర్య యొక్క పరిణామాలు స్త్రీకి ఎలా ఉంటాయో చూపిస్తూ హవ్వకు కూడా ఒక మాట చెప్పాడు: నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పాడు, (ఆదికాండము 3:16). “ఫలించి వృద్ధి పొందుడి” (ఆదికాండము 1:28) అను దేవుని ఆశీర్వాదంలో ఇప్పుడు ప్రయాసము మరియు వేదన వచ్చి చేరాయి. వారు ఇప్పుడు పాపభరితంగా ఉన్నందున, పురుషుడు ఆమెపై పరిపాలన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది మరియు అనుభూతి చెందుతుంది. ఈ సంబంధం ఇప్పుడు పురుషుడు శిరస్సుగా దుర్వినియోగానికి మరియు సహాయకురాలిగా స్త్రీ ఆగ్రహానికి గురైంది. ఆమె పురుషుని సహాయకురాలిగా తనను తాను కోల్పోయినట్లు లేదా తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా భావించాల్సిన అవసరం లేదు. దేవుడు ఆమెకు కేటాయించిన పాత్రలో ఆమె జీవించాల్సి ఉంది. ఆ పాత్రలో ప్రత్యేకమైనది పిల్లలను కనడం మరియు దానితో పాటు వచ్చే తల్లితత్వం. దేవుడు ఇచ్చిన పాత్ర ప్రకారం జీవించడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షణను ఆమె ఏ విధంగానూ కోల్పోదు.

సృష్టిలో దేవుడు స్థాపించిన క్రమాన్ని పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ గుర్తించి దాని ప్రకారం పనిచేయాలనేది దేవుని చిత్తం. అందువల్ల పౌలు ఇలా వ్రాశాడు, “స్త్రీ ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.” ఆరాధన కోసం సమావేశమైన కొరింథు ​​సంఘానికి కూడా పౌలు ఈ సూత్రాన్ని అదే కారణంతో వర్తింపజేశాడు, 1 కొరింథీయులు 14:34, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు.

పౌలు సంఘములో స్త్రీలు మాట్లాడడాన్ని నిషేధించాడు. వారు సంఘములో పురుషుల శిరస్సత్వాన్ని గుర్తించాలి. సంఘ సమావేశాలలో పురుషులు బాధ్యత వహించాలి. ఈ విషయంలో దేవుని ధర్మశాస్త్రమైయున్న పాత నిబంధన దేవుని చిత్తాన్ని నమోదు చేసింది. 1 తిమోతి 2:13,14 పాత నిబంధనను ఉటంకిస్తుంది, దీని రికార్డు పౌలు సూచనకు ఆధారం: “మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.” ఆదికాండము 1 నుండి 3 అధ్యాయాల ప్రేరేపిత రికార్డులో, పరిశుద్ధాత్మ సంఘములో మరియు కుటుంబంలో పురుషుని శిరస్సుగా స్థాపించాడు. ఈ సృష్టి క్రమాన్ని మరియు పతనం యొక్క పాఠాన్ని తిరస్కరించే సంఘము/ సంస్థలు వారి అవిధేయతకు దేవునికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. పురుషులు దేవుడు ఇచ్చిన మరియు దేవుడు నియమించిన బాధ్యతలను అంగీకరించి నిర్వర్తించినప్పుడు సంఘము మరియు ఇల్లు మెరుగ్గా ఉంటాయి.

ఆ స్త్రీ “మోసపోయి పాపాత్మురాలైంది” అని ఎత్తి చూపిన పౌలు, “స్త్రీలు విశ్వాసం, ప్రేమ మరియు పవిత్రతలో సముచితంగా కొనసాగితే – వారు పిల్లలను కనడం ద్వారా రక్షింపబడతారు” అనే మాటలతో ఈ చర్చను ముగించాడు.

కాని ఆధునిక తత్వశాస్త్రంలో మునిగిపోయిన ఈ ప్రపంచం, సృష్టి కాలం నాటి శిరస్సు మరియు సహాయక సంబంధాన్ని ప్రశ్నించడానికి క్రైస్తవ స్త్రీని కూడా ప్రేరేపిస్తుంది. ఇది స్త్రీలను కించపరిచేది మరియు పక్షపాతం చూపించేది అని ఆమెకు చెప్తుంది. సమానత్వం మరియు హక్కుల గురించి ప్రబలంగా ఉన్న అభిప్రాయాలతో ఏకీభవించేలా, క్రైస్తవ స్త్రీలను ప్రేరేపిస్తుంది.

గలతీయులకు 3:26, యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులై యున్నారు అని చెబుతుంది. మీరందరు అనే మాటకు, ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తు నందు మీరందరును ఏకముగా ఉన్నారు అని స్పష్టముగా చెప్పాడు, గలతీయులకు 3:28. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను, అని కూడా పౌలు చెప్పాడు, 1 తిమోతి2:6. ఈ ప్రస్తుత ప్రపంచంలో వారి స్థితి మరియు పాత్ర క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని పిల్లలుగా ఉండటంలో వారిని ఏ విధంగానూ ప్రభావితం చేయదని పౌలు స్త్రీపురుషులకు హామీ ఇస్తున్నాడు. ఇది ఈ జీవితములో స్త్రీపురుషుల మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని తొలగించిందా? కొందరు అవునని వాదిస్తున్నారు. కాని బైబులు అలా చెప్పటం లేదు. ఈ ప్రపంచంలో క్రైస్తవ సంఘములో క్రైస్తవులు కలిసి జీవించే విధానానికి ఆయన “శిరస్సు మరియు సహాయక సూత్రాన్ని” పేర్కొన్నాడు మరియు వర్తింపజేసాడు అని పౌలు చెబుతున్నాడు. మన విమోచన మరియు దేవునితో సంబంధం గురించిన సత్యం ఇక్కడ ఇప్పుడు ఈ కృపా సమయంలో మన జీవితాల కోసం దేవుడు తన చిత్తాన్ని వెల్లడించడాన్ని రద్దు చేయదు.

ఎఫెసీయులకు రాసిన తన లేఖలో పౌలు భార్యాభర్తలకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింపజేసాడు, (5:22–33, స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానము చేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను), భార్యలు తమ భర్తలకు లోబడాలని పిలుపునిస్తూ, పౌలు భార్యాభర్తల సంబంధాన్ని క్రీస్తు మరియు చర్చితో పోల్చాడు. ఆమె లోబడటం అనేది చర్చి తన శిరస్సైన క్రీస్తుకు లోబడటమే కాని ఆమెను తక్కువ చెయ్యటం కాదు. అయితే, భర్తలు కూడా భార్యలను తక్కువ చెయ్యకూడదు.

పేతురు అదేవిధంగా భార్యలను “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి” అని చెప్పాడు (1 పేతురు 3:1). భర్తలు తమ భార్యల ప్రవర్తనను బట్టి, “వారు భయముతో కూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడి వలన రాబట్టబడ వచ్చును” అని చెప్పాడు, (2వ వచనం). క్రీస్తుకు మహిమ తెచ్చే జీవితంలో ఖచ్చితంగా ఏదీ తక్కువ కాదు. అదే సమయంలో, పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని కూడా హెచ్చరించాడు (7వ వచనం). వారు తమ భార్యల పట్ల శ్రద్ధ వహించాలి మరియు వారిని గౌరవంగా చూడాలి. ఇది ప్రతి రకమైన దుర్వినియోగ ప్రవర్తనను, భార్యను తక్కువ అనుభూతి చెందేలా చేసే దేనినైనా తొలగిస్తుంది. క్రైస్తవ భర్తలు తమ క్రైస్తవ భార్యలు క్రీస్తు ద్వారా నిత్యజీవమనే కృపగల జీవితానికి వారసులు అని గుర్తుంచుకోవాలి. ప్రభువైన యేసును ఆయన చిత్తానికి అనుగుణంగా సేవించడానికి పురుషులు మరియు స్త్రీలు, భర్తలు మరియు భార్యలకు ఈ మాటలు ఎంతో ప్రోత్సాహకం.

స్త్రీలు ఆచరణలో, పిల్లలకు బోధించడం, యువతులకు మార్గదర్శకత్వం చేయడం, దయ పరిచర్యలలో నాయకత్వం వహించడం, పాడటం మరియు ప్రార్థన చేయడం ద్వారా మహిళలు పరిచర్యకు చాలా దోహదపడతారు. సంఘములో బైబిలు జ్ఞానంలో లోతైన ప్రతిభావంతులైన ఒక స్త్రీ, గొప్ప ఫలవంతమైన రీతిలో మహిళల బైబిలు అధ్యయనాన్ని నడిపించగలదు.

ఈ వచనాలను బోధించడంలో మరియు ఆచరించడంలో, చట్టబద్ధత (legalism) మరియు లైసెన్సు (license) రెండింటినీ నివారించడం చాలా ముఖ్యం. లీగలిజం బాహ్య వివరాలపై (కొన్ని హెయిర్ స్టైల్స్ నిషేధించడం లేదా మహిళల దుస్తులను నియంత్రించడం వంటివి) దృష్టి సారించి, తద్వారా అణుకువ మరియు దైవభక్తి గురించిన పౌలు బోధన యొక్క ముఖ్యాంశాన్ని కోల్పోవచ్చు. మరోవైపు, లైసెన్సు ఆ వచనాన్ని అసంబద్ధంగా తోసిపుచొచ్చు మరియు తద్వారా ఆరాధన మరియు శిష్యరికం కోసం దేవుని రూపకల్పనను బలహీనపర్చొచ్చు.

చివరగా, 1 తిమోతి 2:9–15 దేవుడు ఆరాధన యొక్క హృదయం మరియు ఆరాధన క్రమం రెండింటినీ పట్టించుకుంటాడని మనకు గుర్తు చేస్తుంది. అణుకువ స్వీయం కంటే క్రీస్తుపై కేంద్రీకృతమైన హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. ఆరాధన క్రమం దేవుడు తన చర్చి కోసం చేసిన మంచి రూపకల్పనపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. జాగ్రత్తగా బోధించినప్పుడు, ఈ వచనాలు క్రీస్తు శరీరాన్ని ప్రేమలో నిర్మించగలవు. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ దేవుని చిత్తం ప్రకారం మరియు ఆయన మహిమ కోసం సేవ చేస్తారు. ఈ విధంగా, 1 తిమోతి 2:9–15 నేటి మన క్రైస్తవ సంస్కృతిని సవాలు చేస్తూ ఉంది.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl