
మోషే ధర్మశాస్త్రములోని మొదటి ఆజ్ఞ
మొదటి ఆజ్ఞ : నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
దీనికి అర్ధమేమి: మనము సమస్తమైన వాటికంటే దేవుని భయపడి, ఆయనను ప్రేమించి నమ్మి యుండవలెను.
1. మొదటి ఆజ్ఞయందు దేవుడు తన మహిమను గురించి మనకు ఏమి బోధిస్తున్నాడు?
యెషయా 42:8, యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చు వాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.
యెషయా 45:21, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు.
మత్తయి 4:10, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.
1 జవాబు: మనుష్యులకంటే లేక వస్తువులకంటే దేవునికే మహిమను ఇవ్వవలెనని ఆయన కోరుకొంటున్నాడని దేవుడు మనకు బోధిస్తున్నాడు.
2. మనము సమస్తమైన వాటికంటే దేవునికి మహిమను ఎలా ఇస్తాం?
దానియేలు 3:1-18. (ముగ్గురు యవ్వనస్థులు నెబుకద్నెజరు నెలకొల్పిన ప్రతిమను పూజించుటకంటె మండుచున్న అగ్ని గుండము లోనికి వెళ్లిరి).
ఆదికాండము 39:1-9. (యేసేపు పోతీఫరు భార్యకు లోబడుట కంటె దేవునికి లోబడెను. 9వ వచనాన్ని ముఖ్యముగా గమనించండి, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును).
సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే.
కీర్తన 119:11. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
కీర్తన 86:11. యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.
2A జవాబు: మనుష్యుల మాటలకంటే, ఆజ్ఞలకంటే పైగా దేవుని మాటను, ఆజ్ఞను ఉంచుట ద్వారా మనము సమస్తమైన వాటికంటే ఆయనకే మహిమను ఇస్తున్నాం. (సమస్తమైన వాటికంటే దేవునికే భయపడుట)
హెబ్రీయులకు 11:24-26. (మోషేకు ఐగుప్తు యొక్క ఖ్యాతికంటె లేక ధనముకంటే దేవుడే బహు ప్రాముఖ్యుడై ఉండెను).
ఆదికాండము 22:1-19. (అబ్రాహామునకు తన ఏకైక కుమారుడైన ఇస్సాకుకంటే దేవుడే ప్రియుడై ఉండెను).
మత్తయి 22:37. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునదియే.
కీర్తన 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకము లోనిది ఏదియు నా కక్కరలేదు.
2B జవాబు: మనుష్యులకంటే దేవునిని బహు ప్రియముగా ఎంచుట ద్వారా మనము సమస్తమైన వాటికంటే ఆయనకే మహిమను ఇస్తున్నాం. (సమస్తమైన వాటికంటే దేవునిని అధికముగా ప్రేమించుట).
ఆదికాండము 13, 14. (అబ్రాహాము లోతునకు తాను ఉండవలసిన ప్రాంతాన్ని కోరుకోవడానికి మొదటి అవకాశాన్ని ఇచ్చినప్పుడును మరియు రక్షించినప్పుడును, అబ్రాహాము దేవుని యెడల తన నమ్మకాన్ని చూపించాడు).
దానియేలు 6:1-23. (దేవుడు సింహపు బోనులో నుండి తనను కాపాడునని దానియేలు నమ్మాడు. ప్రత్యేకముగా 23వ వచనాన్ని గమనించండి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు).
దానియేలు 3:1-18. (ముగ్గురు యవ్వనస్థులు అగ్ని గుండములో నుండి తమ్మును దేవుడు రక్షించునని నమ్మారు. ప్రత్యేకముగా 17వ వచనాన్ని గమనించండి. మేము సేవించుచున్న దేవుడు ….. మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు).
1 సమూయేలు 17:32-50. (దేవుడు గొల్యాతుపై విజయాన్నిస్తాడని దావీదు నమ్మాడు. ప్రత్యేకముగా 37, 45 వచనాలు గమనించండి).
కీర్తన 37:5, 40. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము ….. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చియున్నారు.
యెషయా 50:10. వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.
కీర్తన 124:8. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
2C జవాబు: మనుష్యులకంటే వస్తువులకంటే ఎక్కువగా సహాయము కొరకు దేవునిపై ఆధారపడటం ద్వారా మనము సమస్తమైన వాటికంటే ఆయనకే మహిమనిస్తున్నాం. (సమస్తమైన వాటికంటే అధికముగా దేవునిని నమ్మియుండుట).
3. మొదటి ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్తానికి విరోధముగా ప్రజలు యెట్లు బహిరంగంగా పాపమును చేస్తున్నారు?
నిర్గమకాండము 32. (ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించారు. ప్రత్యేకముగా 31వ వచనాన్ని గమనించండి. అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి).
1 రాజులు 18:17-39. (అహాబు ఇశ్రాయేలు ప్రజలను బయలు దేవతను పూజించడానికి నడిపించాడు. ప్రత్యేకముగా 18వ వచనాన్ని గమనించండి. యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై యున్నారు).
నిర్గమకాండము 20:4. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
రోమీయులకు 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమా స్వరూపముగా మార్చిరి.
1 యోహాను 5:21. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.
3A జవాబు: ప్రజలు విగ్రహములను తమ దేవునిగా మహిమపర్చినపుడు దేవుని చిత్తానికి విరోధంగా వారు పాపమును చేయుచున్నారు. (బహిరంగ విగ్రహారాధన)
యోహాను 8:42. యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.
యోహాను 5:23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
1 యోహాను 2:23. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.
3B జవాబు: ప్రజలు యేసుకు తండ్రితో సమాన మహిమను ఇవ్వకుండా తండ్రికే మహిమను ఇవ్వడానికి ప్రయత్నిస్తు దేవుని చిత్తానికి విరోధంగా వారు బహిరంగంగా పాపమును చేస్తున్నారు. (బహిరంగ విగ్రహారాధన)
4. మొదటి ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్తానికి విరోధంగా ప్రజలు యెట్లు రహస్యంగా పాపము చేస్తున్నారు?
లూకా 12:15-21. (ధనవంతుడైన బుద్ధిహీనుడు దేవునికన్న తన కొరకు సమస్తమును సమకూర్చుకోడానికి సిద్ధపడ్డాడు).
మత్తయి 19:16-22. (ధనవంతుడైన యవ్వనస్తుడు యేసును వెంబడించుటకన్న తన సంపాదనే ప్రేమించాడు).
1 యోహాను 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
కీర్తన 62:10. ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.
మత్తయి 10:37. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.
యిర్మీయా 17:5. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.
4 జవాబు: ప్రజలు తమ హృదయములలో దేవునికి బదులుగా మరి ఎవనికైనను లేక దేనికైనను ప్రధమ స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుని చిత్తానికి విరోధంగా వారు రహస్యంగా పాపమును చేస్తున్నారు.
5. మొదటి ఆజ్ఞ అద్దమువలె మనకు ఎట్లు ఉపయోగపడుచున్నది?
నిర్గమకాండము 14:5-12; 16:1-8. (ఎల్లప్పుడూ దేవుడే వారిని రక్షిస్తున్నాడని, వారికి కావాల్సిన వాటినన్నిటిని దయచేస్తున్నాడని ఇశ్రాయేలీయులు నమ్మలేదు).
మత్తయి 26:69-75. (పేతురు ఎల్లప్పుడూ దేవునికి భయపడలేదు).
1 యోహాను 1:8. మనము పాపములేని వారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చు కొందుము; మరియు మనలో సత్యముండదు.
5 జవాబు: మన జీవితాలలో దేవునికి మనము ప్రధమ స్థానాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు గనుక మొదటి ఆజ్ఞ మన పాపములను మనకు చూపుచున్నది.
6. మొదటి ఆజ్ఞకు విరోధమైన మన పాపముల నుండి యేసు మనలను ఎట్లు రక్షించాడు?
మత్తయి 4:1-10. (యేసు శోధింపబడినప్పుడు, ఆయన ఎల్లప్పుడూ దేవునికే ప్రధమ స్థానాన్ని ఇచ్చాడు).
మత్తయి 17:5. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను.
రోమా 5:19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
6A జవాబు: యేసు పరిపూర్ణంగా మన కొరకై మొదటి ఆజ్ఞకు విధేయుడగుట చేత మనలను రక్షించాడు.
1 పేతురు 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ….. చంపబడియు, ….. పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను.
6B జవాబు: యేసు మన పాపములన్నిటిని తీసివెయ్యడానికి మరణించటం ద్వారా మనలను రక్షించాడు.
7. మొదటి ఆజ్ఞ మార్గదర్శిగా మనకు ఎట్లు ఉపయోగపడుచున్నది?
కొలొస్సయులకు 3:17. మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
1 సమూయేలు 12:24. ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
7 జవాబు: దేవుని మంచితనమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుటకుగాను మనము సమస్తమైన వాటికంటే దేవునికి భయపడి, ఆయనను ప్రేమించి నమ్మియుండవలెనని దేవుడు కోరుచున్నాడని మొదటి ఆజ్ఞ మనకు తెలియజేస్తూ ఉంది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl