
పాత నిబంధన పాఠము: ఆదికాండము 22:1-18; పత్రిక పాఠము: రోమా 8:31-39; సువార్త పాఠము: మార్కు 1:12-15; కీర్తన 6.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: ఆదికాండము 22:1-14
బాబెలు మరియు సొదొమలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి దేవుడు పరలోకము నుండి దిగి రావాల్సిన అవసరం లేదు (11:5; 18:21). అదే విధంగా అబ్రాహాము దేవునికి భయపడుతున్నాడో లేదో తెలుసుకోవడానికి ఆయన అబ్రాహామును పరీక్షించవలసిన అవసరం లేదు (12). నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకోగలడు (ద్వితీయోప 8:2). ఆయన తన పిల్లల హృదయ వేదనలలో శాడిస్టిక్ ఆనందాన్ని పొందడు. ఆయన వారిని పరీక్షించినప్పుడు, ఆయన తన హృదయంలో వారి పట్ల ఆసక్తిని కలిగి ఉంటాడు. ఆయన వెండిలోని మష్టును తీసివేయడానికి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు (సామెతలు 25:4; యెషయా 1:25; మత్తయి 3:3). విశ్వాసులు దేవుణ్ణి మార్గంగా పరిగణిస్తున్నారా? పూర్తి విశ్వాసంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నారా? లేదా అనే విషయాన్ని వారు చూసుకొంటూ ఉండాలి. దేవుడు ప్రతి విశ్వాసిని ఆయన జ్ఞానం మరియు ప్రేమ ప్రకారం పరీక్షిస్తాడు – కొన్నిసార్లు తీవ్రంగా పరీక్షించొచ్చు లేదా కొద్దిగా పరీక్షించొచ్చు, కొన్నిసార్లు తరచుగా పరీక్షించొచ్చు. నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను (కీర్తన 119:71), ఎందుకంటే “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” హెబ్రీ 12:11; 2 కొరింథీ 1:6. దేవుడు అబ్రాహామును పరీక్షించాడు.
అబ్రాహాము విషయములో ఇది పరిశోధనే అని దేవునికి తెలుసు, ఈ వాక్యభాగాన్ని చదివిన మనకు తెలుసు, కాని ఇది అబ్రాహాముకు తెలియదు. పరిశోధన దేవుని పట్ల మనకున్న మన నిబద్ధతను పరీక్షిస్తూ, దానిలో భాగముగా సరైనదాన్ని ఎన్నుకునేలా ప్రేరేపించడమే కాకుండా నిర్ణయాత్మకమైన దృఢమైన నిశ్చయమైన విశ్వాసాన్ని చూపెట్టేందుకు కారణమౌతుంది. కాబట్టే దేవుడు అబ్రాహామును చూచి, “నీవు దేవునికి భయపడు వాడవని” అతనిని గూర్చి సాక్షమిచ్చాడు. దేవుడు తన భక్తుని గురించి అలా చెప్పడానికి అసలేం జరిగిందో మన పాఠమును చూధ్ధాం.
అంశం: దేవునికి భయపడువాడు అంటే?
- దేవునికి లోబడుతూ ఆయన చిత్తాన్ని మాత్రమే వెంబడించేవాడని .
- విశ్వాసముతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించేవాడని.
- దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుతూ ప్రతిదానిని దేవుని చిత్తానికి వదిలివేయువాడని.
1,2 వచనాలను చదువుకొందాం_ 1ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రాహామా, అని పిలువగా అతడు– చిత్తము ప్రభువా అనెను. 2అప్పుడాయన–నీకు ఒక్కడై యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయాదేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పాడు.
ఈ వచనంలో మనం మొదటిగా అర్ధం చేసుకోవలసిన విషయమేమిటంటే అబ్రాహాము విశ్వాసము ఎంత బలమైనదో లేక అతనిలోని విశ్వాసము ఎంతవరకు తట్టుకోగలదో చూడడానికి దేవుడు ప్రయత్నించడం లేదనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవలసి ఉన్నాం. దేవుడు మన అందరి హృదయాలలోనికి చూడగలడు. మన విశ్వాసము బలమైనదో బలహీనమైనదో ఆయనకు తెలుసు. మరి దేవుడు అబ్రాహామును పరిశోధించెను అని చెప్పడంలో గ్రంధకర్తయైన మోషే, పరిశోధించుట దేవుని వైపు నుండి వచ్చిందని, దేవునిపై ఆధారపడే విషయములో సహాయము చేయుట కొరకై రూపొందించబడిందనే ఉద్దేశ్యములో చెప్తూవున్నాడు. పరిశోధించడం అంటే ఒక వ్యక్తికి సరైన దాన్ని ఎన్నుకునే అవకాశం ఇవ్వడం. పరిశోధించుట “ఒకనిలోని నాణ్యతను నిరూపించే ప్రయత్నాన్ని సూచిస్తుంది” అని కొందరు చెప్తుంటారు. ఏదిఏమైనా పరిశోధించుట దేవునికి దగ్గర చేస్తుంది అని మాత్రం చెప్పొచ్చు. దేవుడు అబ్రాహామును పరిశోధించెను అను మాటలలో పరిశోధించెను అనే మాట హీబ్రూ భాషలో అభివృద్ధిపరచుట అనే ఉద్దేశములో వాడబడింది. అంటే గ్రంధకర్తయైన మోషే, దేవుడు అబ్రాహామును మోరియా దేశమునకు పంపుట ద్వారా (శ్రమలు కష్టాల ద్వారా) అతనిని విశ్వాసమునందు బలపరచెను అని చెప్తూవున్నాడు. రెండవదిగా మనం అర్ధం చేసుకోవలసిన విషయమేమిటంటే, లోక పాపాల కోసం తన కుమారుడైన యేసుక్రీస్తును అర్పించబోతున్న తన చర్యకు ముందుగా ఒక సాదృశ్యమును చూపెడుతూ ఉన్నాడు.
అబ్రాహాము తన కొడుకును ప్రేమిస్తున్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. అది దేవునికి తెలుసు. 3,6,7,9 లోని “తండ్రి” మరియు “కొడుకు” అనే పదాలు తల్లిదండ్రుల ప్రేమ మరియు పవిత్ర విధి మధ్య హెచ్చయైన ఉద్విగ్వభరితమైన పరిస్థితులను గురించి తెలియజేస్తూవున్నాయి.
మోరీయాదేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద– అక్కడే తరువాతి కాలములో యెరూషలేము మరియు దేవాలయం నిర్మించబడ్డాయి. సొలొమోను “యెరూషలేములో మోరియా పర్వతంపై యెహోవాకు ఒక మందిరాన్ని” నిర్మించాడు, 2 దినవృత్తాంతములు 3:1. తర్వాతి కాలములో అబ్రాహాము బలిపీఠమును కట్టిన స్థలంలోనే ఇశ్రాయేలీయులు దహనబలుల కొరకు బలిపీఠమును నిర్మించారు.
2వ వచనంలో అప్పుడాయన–నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు, ఇక్కడ దేవుడైన యెహోవా, ప్రత్యేకముగా, నీకు ఒక్కడై యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును బలిగా నర్పించుమని అడిగాడు. కనానీయులలో మానవ బలులు సర్వసాధారణం.
అబ్రాహాము ఇస్సాకును ప్రేమించడమే కాదు, ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రాహాముకు వారసులను ఇస్తానని వాగ్దానం చేశాడు (21:12). ఇప్పుడు దేవుడు ఇస్సాకును ఇమ్మని అడుగుతున్నాడు. అబ్రాహాముకు తన వృద్ధాప్యంలో ఉన్న ఈ కొడుకు కంటే విలువైనది ఏదీ లేదు. దేవుడు అబ్రాహాము నుండి ఏమి అడుగుతున్నాడో అర్థం చేసుకోవడంలో ఇది ఎంతో కీలకం. అబ్రాహాము దేవునికి ఇవ్వగలిగిన అత్యంత విలువైన అర్పణను ఇమ్మని దేవుడు అడుగుతున్నాడు. ఇస్సాకును అమితముగా ప్రేమిస్తున్న అబ్రాహాము దేవుణ్ణి ఇస్సాకు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అనే దానికి ఇది పరీక్ష.
ఆ పరీక్షలో భాగముగా దేవుని మాటలెంత కఠినముగా ఉన్నాయో తెలుసా? ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు అదే ప్రాణాన్ని క్రూరమైన పద్దతిలో తిరిగి తనకివ్వమని ఆజ్ఞ్యాపించియున్నాడు. ఇస్సాకును తన కొరకు చంపి దహనబలిగా అర్పించుమని అడుగుతున్నాడు.
దేవునిపై ఆధారపడిన మీరు మీ జీవితాలలో సరియైన దానిని ఎన్నుకొనేలా దేవుడు మిమ్మల్ని పరిశోధించి నప్పుడు, మిమ్మల్ని అభివృద్ధిపరచాలని, విశ్వాసమునందు బలపరచాలని ఆయన ఆశపడుతూ మనలను పరిశోధించినప్పుడు, అవి శోధనలనుకొని పొరబడ్డామేమో ఒక్కసారి ఆలోచించుకోండి లేదా ఆ పరిశోధనలో ఉన్న కష్టాన్నిబట్టి సణుగుకొంటూ, మనముందు ఉంచబడిన సరియైన అవకాశాన్ని గుర్తించడంలో, ఎన్నుకోవడంలో ఎన్నిసార్లు విఫలం చెందియున్నామో ఆలోచించండి. మిమ్మల్ని అభివృద్ధి పరచాలని మీతో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని దేవుడు మనతో చెప్పినప్పుడు, మనలో కొంతమంది ఆ మాటలను లెక్కచేసి ఉండకపోవొచ్చు. మరికొందరు అందులోవున్న కష్టాన్ని బట్టి అట్లు చేసి ఉండకపోవచ్చు, కొందరు వెనుకకు తిరిగి ఉండొచ్చు.
మన పాఠములో దేవుడు, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పాడు. అబ్రాహాము తన కుమారుని తీసుకొని మోరియా దేశమునకు బయలుదేరాలి, ఇది కొన్ని నిమిషాల ప్రయాణము కాదండి 3రోజుల ప్రయాణమిది. దేవునికి భయపపడువాడు విశ్వాసముతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు, అబ్రాహాము విశ్వాసముతో దేవుని చిత్తాన్ని ఏవిధముగా నెరవేర్చడానికి ప్రయత్నించాడో 3-5 వచనాలను పరిశీలించి తెలుసుకొందాం.
3తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట బెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను. 4మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి 5తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి (ముందుకు వెళ్లారు).
ఇక్కడ అబ్రాహాము హృదయంలో ఉన్న గందరగోళం గురించి ఒక్క మాట కూడా చెప్పబడలేదు. అతడు నిశ్శబ్దంగా ఉద్దేశపూర్వకంగా దేవుని ఆజ్ఞను అక్షరార్థంగా నెరవేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. బలి కోసం కలపను, యాత్రకు అవసరమైన ఆహారాన్ని తీసుకొన్నాడు. ఇద్దరు ఇంటి-బానిసలను తనతో పాటు రమ్మని ఆదేశించాడు. ఆపై మోరియాకు బయలుదేరాడు. అతని విశ్వాసం విధేయతలో చురుకుగా ఉంది కాబట్టి అతడు ఈ విషయాన్ని గురించి ఎవరితో సంప్రదించలేదు. ఇక్కడ రెండు విషయాలు గమనించవలసి ఉన్నాం_ 1. తన కుమారుని వెంటబెట్టుకొని, దేవుని నిర్ణయానికి ఆజ్జ్యకు కట్టుబడి అబ్రాహాము ఆలస్యము చెయ్యలేదు, వెనుకాడలేదు, ఫిర్యాదు చెయ్యలేదు, వేడుకోలేదు, కనీసం ప్రశ్నించను కూడా లేదు బయలు దేరాడు. 2. మోరియా పర్వతము దగ్గర కర్రలు దొరకక పోతే అని ఆలోచించి తమతో పాటుగా కర్రలను తీసుకొని వెళ్ళాడు. కర్రలను చీల్చడం అంటే అబ్రాహాము తన చేతులు మరియు మనస్సును దేవుని మాటలపై ఎలా కేంద్రీకరించాడో చూడండి. బయలుదేరి గమ్యానికి నడవడం అంటే faith on wheels ని చూడండి. ఇలా చెయ్యాలంటే దేవుని పట్ల ఎంతో విశ్వాసము నమ్మకము ప్రేమ ఉండాలి.
బెయేర్షెబా నుండి మోరియా దేశమునకు దూరం నలభై-ఐదు నుండి యాభై మైళ్లు. అందువల్ల దాదాపు రెండున్నర రోజులు గట్టిగా ప్రయాణం అవసరం. ఎందుకని దేవుడు అబ్రాహాముకు 3రోజుల ప్రయాణాన్ని నిర్దేశించాడు? అబ్రాహాము విధేయత క్షణికమైన ఉత్సాహము నుండి వచ్చినది కాకుండా హృదయపూర్వకముగా సంపూర్ణమైన విధేయత నుండి వచ్చినదై యుండాలనే దేవుడు 3రోజుల ప్రయాణాన్ని అబ్రాహాముకు నిర్ణయించాడు. మూడు రోజుల ప్రయాణం అబ్రాహాముకు ఆలోచించడానికి చాలా సమయం ఇచ్చింది. అబ్రాహాము తన సొంత కొడుకు ప్రాణాలను తీయకుండా సాతాను ఎన్నో తార్కికమైన కారణాలను అబ్రాహాముకు ఇచ్చి ఉండొచ్చు.
దారిలో అతడి నిశ్శబ్దం అతడు సొదొమ గొమొఱ్ఱాలను నాశనం చేయకుండా దేవుణ్ణి నిరోధించడానికి ప్రయత్నించిన స్వభావానికి భిన్నముగా ఉంది, 18:22-32.
4మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి_ దేవుడు అతనికి చెప్పిన ప్రదేశానికి వారు వచ్చారు. అబ్రాహాము మొదటిసారిగా తన కన్నులెత్తి తన కొడుకు మరణించబోతున్న స్థలాన్ని చూసాడు. గుండె పగిలే సన్నివేశమిది.
5తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి (ముందుకు వెళ్లారు).
అబ్రాహాము ఎందుకని తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి (ముందుకు వెళ్లారు?). అందుకు 2కారణాలు ఉండొచ్చు. దేవుని ఆజ్జ్య మరియు ఇస్సాకును దహనబలిగా అర్పించడం ఇవేవి వాళ్లకు అర్ధంకాదు వాళ్ళు భయపడొచ్చు. అలాగే వాళ్ళు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు. వాళ్ళు ఇస్సాకును బలి ఇవ్వకుండా అబ్రాహామును ఆపొచ్చు. కాబట్టి అబ్రాహాము వాళ్ళను ఆగిపోమ్మని చెప్పి ఉండొచ్చు. విచక్షణను కోల్పోని వివేకాన్ని అబ్రాహాము చూపించడం నిజంగా మెచ్చుకోదగిన అంశము.
అబ్రాహాముతో ఉన్న వారందరికీ తెలుసు తామంతా దహన బలిని అర్పించుటకు వచ్చియున్నామని. అట్లే వాళ్ళ దగ్గర ఆ దహనబలికి అవసరమైన గొర్రెపిల్ల లేదనే విషయం కూడా వాళ్లకి తెలుసు. ఇప్పుడేమో కర్రలు ఇస్సాకును తీసుకొని అబ్రాహాము పర్వతం పైకి వెళ్తున్నాడు, గొర్రెపిల్ల లేకుండా. వాళ్లలో ఎక్కడో చిన్న సందేహము ఉండొచ్చు. కాబట్టి అబ్రాహాము తన సేవకులకు భరోసా ఇస్తూ అసాధారణమైనదేది జరుగదని తిరుగు ప్రయాణం కూడా అసాధారణమైనదిగా ఉండదని చెప్పడానికి ఇలా చెప్పి ఉండొచ్చని కొందరు చెప్తుంటారు.
కాని నిజానికి ఈ భయంకరమైన పరిస్థితి నుండి దేవుడే తనకు ఒక మార్గం చూపిస్తాడని నమ్ముతూ మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పడం ద్వారా అబ్రాహాము దేవునియందు తనకున్న నిశ్చయతను తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసిగా అబ్రాహామును ఈ ప్రయాణములో ఒక ప్రశ్న చాల ఇబ్బంది పెట్టి ఉండొచ్చు- దయగల దేవుడు తానే ఇస్సాకు ద్వారా మెస్సయ్యను వాగ్దానము చేసిన తరువాత ఇస్సాకును చంపమని ఎలా ఆజ్ఞ్యాపిస్తాడు?. కాని అతని విశ్వాసము ఇస్సాకును చంపమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను ఆయనకు విధేయతను చూపించాలి (అతని విశ్వాసం ప్రభువు యొక్క వాగ్దానానికి కట్టుబడి ఉంది). విధేయతను చూపిస్తే, దేవుడు దహనబలిగా అర్పింపబడియున్న ఇస్సాకును ఆ బూడిద నుండి తిరిగి జీవానికి తీసుకువస్తాడని, (దేవుడు ఇస్సాకును మృతులలో నుండి కూడా లేపగలడని) అతడు నమ్మాడు కాబట్టే మేము ఇద్దరం తిరిగి వస్తాం అనే ఉద్దేశములో అబ్రాహాము వారితో అలా చెప్పాడని, హెబ్రీ 11:17–19 చెప్తూవుంది.
విధేయత ఎప్పుడూ కూడా దేవుని మంచితనము మీద నమ్మకముంచేటట్లు చేస్తుంది కాబట్టే ఆయనయందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి యుంచిన మేలు యెంతో గొప్పది అని ఆ కష్టములో అబ్రాహాము నమ్మాడు. అంతేనా యెహోవాయందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించును కాబట్టి తనపట్ల దేవునికున్న కనికరాన్ని బట్టి యెహోవాను నమ్ముకొనుట ధన్యతగా ఎంచి యెహోవాయందు నమ్మికయుంచి భయపడక, నా శరీరము నా హృదయము క్షీణించి పోయినను యెహోవా నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు అనే ధైర్యముతో, యెహోవాను ఆశ్రయించిన వానికి ఆయనే అన్ని విషయములలో వారికి తోడుగా ఉండును అనే నిబ్బరంతో మోరియా పర్వతాన్ని ఎక్కుతూ విశ్వాసిగా తన విశ్వాసమును ఏ విధముగా అబ్రాహాము ప్రదర్శిస్తున్నాడో చూడండి.
విశ్వాసిగా మనమందరం కష్టాలలో వున్నప్పుడు మనతండ్రియైన దేవునిమంచితనము మీద నమ్మిక ఉంచుతూ ఉన్నామా?
- కష్టములో ఆయన మన కొరకు దాచివుంచిన మేలు ఎంతో గొప్పదని విశ్వాసముతో ముందుకు వెళ్తున్నామా?
- కష్టాలలో కూడా దేవుని కృప మనలను ఆవరించివున్నదనే విషయాన్ని మర్చిపోతున్నామా?
- అన్ని వేళల దేవునిని నమ్ముకొనుట ధన్యతగా భావిస్తూ ఉన్నామా?
- నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను యెహోవా నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు అనే ధైర్యము మీకుందా?
- యెహోవాను ఆశ్రయించిన వానికి ఆయనే అన్ని విషయములలో వారికి తోడుగా ఉండును అనే నిబ్బరం మీకుందా? పరిశీలించుకోండి.
దేవునికి భయపడువాడు దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుతూ ప్రతిదానిని దేవుని చిత్తానికి వదిలి వేస్తాడు. బలిపీఠం కట్టడం, దానిపై సరైన మొత్తంలో కలపను వేయడం, ఇస్సాకును బంధించడం మరియు అతనిని బలిపీఠం మీద ఉంచడం అబ్రాహాము యొక్క కఠినమైన విధేయతను తెలియజేస్తూవుంది. అబ్రాహాము ఏవిధముగా దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుతూ ప్రతిదానిని దేవుని చిత్తానికి వదిలివేసాడో 6-10 వచనాలను పరిశీలించి తెలుసుకొందాం.
6దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా 7ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో–నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు–ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు–నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా 8అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను. 9ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. 10అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా.
అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు తన బలి కొరకు తానే కర్రలను మోయడం అబ్రాహాముకు ఎంతటి దుఃఖమును కలిగించి యుండునో కదా. యెహోవా కోసం చక్కటి గొర్రెపిల్ల కావాలి, అంటే ఎలాంటి లోపము లేనిది, ఆ విషయాన్నే ఇస్సాకు అబ్రాహాముకు గుర్తుచేస్తూ దహన బలికి కర్రలు అంతదూరం నుండి తెచ్చాము. మన మందలో నుండి మంచి లోపములేని గొర్రెను తెచ్చివుంటే బాగుణ్ణు ఇప్పుడు ఇక్కడ ఎలా మంచి లోపములేని గొర్రెను కనుగొనగలం? అనే ఉద్దేశములో, తండ్రి, నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహన బలికి గొఱ్ఱెపిల్ల ఏది? అని అడిగాడు. అమాయకమైన ఈ ప్రశ్న అబ్రాహాము యొక్క బాధను గణనీయంగా పెంచి ఉండొచ్చు. అట్లే దహనబలిని అర్పించడానికి వెళ్తున్నాం, కాని మా దగ్గర గొర్రెపిల్ల లేదు ఏదో తప్పు జరుగుతుంది అని ఇస్సాకు అనుకొని ఉండొచ్చా? తానే దహన బలినని ఇస్సాకుకు అనిపించి ఉండొచ్చా? మనకు తెలియదు. అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని జవాబు చెప్పాడు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఇస్సాకు తన తండ్రిని వెంబడించడం ఒక్కటే మనం చూస్తున్నాం.
తండ్రియైన దేవుడు మనందరిపై ప్రేమతో తన కుమారుణ్ణి అర్పించ సంకల్పించినప్పుడు ఆయన తన కుమారునిపై ఇస్సాకువలె బహుగొప్ప భారాన్ని మోపాడు. యేసుయైతే తెలిసి తన సిలువను తానే మోశాడు.
అలా ఇద్దరూ కలిసి వెళ్లారు. ఈ మాటలు తప్ప వారి మధ్యన ఇక మాటలు లేవు. లూథర్ గారు చెప్పినట్లుగా, దైవిక ఆజ్ఞ యొక్క వివరాలతో తన కుమారుడిని హింసించడం అబ్రహం ఉద్దేశం కాదు; అట్లే అబ్రాహాము యొక్క నిశ్శబ్దం ఇస్సాకును సంతృప్తిపరిచింది. అలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టాడు. అంటే అబ్రాహాము తన కొడుకును బలిగా అర్పించడానికి step by step చక్కగా బలిపీఠాన్ని కట్టాడు తప్ప వెనుకాడలేదు, సంకోచించలేదు, దేవా ఇంకా ఈ పరీక్ష చాలు అని వేడుకోలేదు, ప్రాధేయపడలేదు. బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచాడు. యవ్వనస్థుడైన ఇస్సాకు వృద్దుడైన తన తండ్రి తనను బంధించడానికి అనుమతించి వున్నాడు, తన తండ్రికి మనఃస్ఫూర్తిగా సహకరించియున్నాడు.
ఇక్కడ ఇస్సాకు యొక్క విధేయత ఆశ్చర్య పరచుచున్నది, ఇస్సాకులో భయము లేదు. తన తండ్రితో పెనుగులాడలేదు. అతడు తన తండ్రినుండి తప్పించుకొని ఉండొచ్చు. కాని ఇస్సాకు అలా చెయ్యలేదు. తన తండ్రికి సంపూర్ణమైన విధేయతను చూపించాడు, తన తండ్రి చిత్తానికి సంపూర్ణముగా లోబడ్డాడు. తన తండ్రి ఇష్టానికి అతడు ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. బైండింగ్ కేవలం ఒక త్యాగం. తన తండ్రి దేవుని చిత్తానికి విధేయత చూపుతున్నాడని అతడు నిర్ధారించుకొన్నాడు.
అబ్రాహాము తన చేయి చాచి, తన కుమారుని చంపుటకు కత్తిని తీసుకున్నాడు. ఇది క్లైమాక్స్, కథ యొక్క అత్యంత నాటకీయమైన క్షణం: ఇస్సాకు దహన బలిని తానేనని తెలుసుకొని తన తండ్రి తనను చంపబోతువుండగా సిద్ధంగా ఉన్నాడు.
11యెహోవాదూత పరలోకమునుండి–అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు–చిత్తము ప్రభువా అనెను. 12అప్పుడు ఆయన–ఆ చిన్నవాని మీద చెయ్యివేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడై యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందు వలన నాకు కనబడుచున్న దనెను. 13అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని యున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. 14అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత–యెహోవా పర్వతముమీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడుచున్నది. ఈ సంఘటన దేవుని పర్వతముపై యెరూషలేములో జరిగింది.
అబ్రాహాము విశ్వాసం యొక్క పరీక్ష, దాని శ్రమ కష్టము వ్యర్ధము కాలేదు. దేవునికి భయపడువానిగా అతడు జీవితాన్ని కోల్పోయాడు, మరియు తిరిగి దానిని కనుగొన్నాడు (మత్తయి 10:37-39; 16:24-25; యోహాను 12:25).
ఈ క్లిష్టమైన సమయంలో యెహోవాదూత జోక్యం చేసుకొన్నాడు. మానవ బాధితులను దేవుడు అంగీకరించడు. మనిషి నైతికంగా అపవిత్రుడు, అందువలన త్యాగానికి అనర్హుడు. అతడు ఏ కోణంలోనైనా బాధితుడు కాదు, కాని శిక్షార్హమైన అపరాధి. కళంకం లేని, శిక్షార్హము కాని గొర్రెపిల్ల నిజమైన ప్రాయశ్చిత్తానికి అవసరం.
దేవుడు ఇస్సాక్‌కు ప్రత్యామ్నాయాన్ని అందించాడు. కనానీయులు నరబలి ఇవ్వడం ఆయన దృష్టిలో అసహ్యకరమైనది. అయితే అబ్రాహామును పరీక్షించడం ద్వారా దేవుడు నేర్పించాలనుకున్న పాఠం ఇది కాదు. దేవునికి భయపడే వ్యక్తి అపరాధిగా దేవుని ఎదుట ఒప్పుకోవలసియున్నాడు. అతడు జంతువును బలి ఇచ్చినప్పుడు, తన నేరాన్ని ఒప్పుకొంటున్నాడు, ప్రాయశ్చిత్తం యొక్క అవసరాన్ని గుర్తించి క్షమించమని ప్రార్దిస్తున్నాడు. దేవుడు ఆ బలి ద్వారా ఆయన ఆరాధికునికి పవిత్ర దేవుడితో సయోధ్యకు హామీ ఇచ్చాడు. మోరియా పర్వతం ఎదురుగా గోల్గోతా ఉంది. అక్కడ దేవుడు “గొఱ్ఱెపిల్లను” ఇచ్చాడు అది మనశిక్షను భరించింది (యెషయా 53:5; యోహాను 1:29).
కాబట్టే హెబ్రీయులకు 11: 17-19 అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను అని చెప్తూవుంది.
అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని యున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అప్పటివరకు అబ్రాహాము చుట్టుప్రక్కల గమనించలేదు. ఒకవేళ అబ్రహాము పొట్టేలును ముందే చూసి ఉన్నట్లయితే? చూసినను అతడు దానిని పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అతడు దాని స్వరాన్ని విని ఉండొచ్చు. దానిని అతడు పరిగణనలోకి తీసుకొని ఉండకపోవచ్చు. అబ్రాహాము దేవుని ఆజ్జ్యకు విధేయుడై అతడు బలిపీఠాన్ని నిర్మించడంలో మరియు ఇస్సాకును బలికి సిద్ధం చేయడంలో మాత్రమే లీనమైయున్నాడు. చుట్టూ చూడలేదు. బలి పశువు గురించి అబ్రాహాము చెప్పిన సమాధానం ఇస్సాకుకు తెలుసు. అతడు ఉత్సుకతతో దానిని వెతికి, గమనించి తన తండ్రికి చెప్పడానికి ప్రయత్నించొచ్చు. కాని అతడు అటూ ఇటూ చూడకుండా తండ్రికి సాయంగా ఉండడం అద్భుతం. అతను కూడా తన తండ్రి అనుమతి లేకుండా ఆ స్థలం వదిలి వెళ్ళలేదు. ఎంత గొప్ప విశ్వాసం మరియు విధేయత.
దేవునికి భయపడటం అంటే దేవుని ఆజ్ఞలను పాటించడం. దేవునికి భయపడే వ్యక్తి దేవుడేం చెప్తున్నా చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడు. యెహోవా చేసిన గొప్ప కార్యములను చూచి యెహోవాకు భయపడి యెహోవాయందు నమ్మక ముంచడమే కాదు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, ఇతర దేవతలను తొలగద్రోసి, పరిస్థితులు ఎంతటి కఠినములైనను యెహోవానే సేవించడం.
ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును అను నిశ్చయతను కలిగి ఉండండి. యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగల వారిమీదను ఆయన కృపకొరకు కనిపెట్టు వారిమీదను ఎల్లప్పుడూ నిలచే ఉంటుంది (కీర్తన 33:18).
దేవునికి భయపడటం అంటే ఆయనను మాత్రమే సేవించడం అని బైబులు ద్వితీయోప 6:13 చెప్తూవుంది.
దేవునికి భయపడటం అంటే దేవుని ఆజ్ఞలను పాటించడం అని అర్ధం (ద్వితీయోప 28:58). యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము అని (సామెతలు 1: 7) చెప్తూవుంది అంటే దేవునికి భయపడే వ్యక్తి దేవుడు చెప్పిన వాటిని చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడని అర్ధం. దేవునికి భయపడటం అంటే యెహోవా చేసిన గొప్ప కార్యములను చూచి యెహోవాకు భయపడి యెహోవాయందు నమ్మకముంచడం అని అర్ధం (నిర్గమకాండము 14:31). దేవునికి భయపడటం అంటే యెహోవాయందు భయభక్తులుగలవారై, పరిస్థితులు ఎంతటి కఠినములైనను, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, ఇతర దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించడం అని అర్ధం (యెహోషువ 24:14). ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములుండును అను నిశ్చయతను కలిగి ఉండడం అని అర్ధం (లూకా 1:50). యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారిమీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను ఎల్లప్పుడూ నిలచే ఉంటుంది (కీర్తన 33:18). ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
Ahaa, its good conversation about this paragraph here at this website, I have read all that,
so now me also commenting at this place.
Greetings from Carolina! I’m bored to tears at work so I decided to check out your site on my
iphone during lunch break. I enjoy the info you provide here and
can’t wait to take a look when I get home. I’m amazed at
how quick your blog loaded on my phone .. I’m not even using WIFI, just 3G ..
Anyways, excellent blog!