మిలీనియలిజం (వెయ్యేండ్ల పాలన) యొక్క సంక్షిప్త చరిత్ర

ఎస్కాటాలజీ అనేది లోకాంతమును గురించి తెలియజేసే ఒక విభాగం. బైబిల్‌లోని ఎస్కాటలాజికల్ ప్రవచనాలు ఈ లోక ముగింపు మరియు రాబోయే లోకం యొక్క స్వభావాన్ని గురించి మనకు తెలియజేస్తాయి.

పాత కొత్త నిబంధనలు రెండూ ఇలాంటి అనేక అంత్యకాల ప్రవచనాలను కలిగి ఉన్నాయి. అవి దేవుడు తన కృపగల ప్రణాళికలు మరియు శాశ్వత ఉద్దేశాల గురించి మానవునికి స్వయంగా వెల్లడించినవి. వాటిని జాగ్రత్తగా అధ్యాయనం చేయాలని, వాటిని ఆలోచనాత్మకంగా ఆలోచించాలని, వాటిని నమ్మాలని మరియు వాటి నెరవేర్పును ఆనందంగా స్వాగతించాలని ఆయన మనల్ని కోరుతున్నాడు.

పాత నిబంధన ప్రవక్తలు కూడా దేవునికి ఇష్టమైన లేఖనాలను అధ్యాయనం చేయడంలో మనకు ఒక ఉదాహరణగా నిలిచారు. వారు తమ స్వంత ప్రవచనాలను శ్రద్ధగా అధ్యాయనం చేశారని, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరని (1 పేతురు 1:11), దేవదూతలు కూడా ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారని పేతురు మనకు తెలియజేశాడు, (1 పేతురు 1:12).

దేవుని ప్రత్యక్షతలన్నిటి లాగే, బైబిల్ యొక్క ఎస్కటోలాజికల్ ప్రవచనాలు కూడా, ఓర్పు వలనను, లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడ్డాయి (రోమా 15:4). అవి మన ఓదార్పును మరియు మన విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. అవి మనకు అద్భుతమైన సమాచారాన్ని మరియు భవిష్యత్తుకు సంబంధించిన అనేక విలువైన వాగ్దానాలను అందిస్తున్నాయి. దేవుని ఈ వాగ్దానాలు క్రీస్తు యేసుపై విశ్వాసం ద్వారా రక్షణ మరియు నిత్యజీవం యొక్క మన నిరీక్షణ పై దృడంగా నిర్మించబడ్డాయి.

అయితే, దేవుడు కొన్ని రహస్యాలను తనకోసం దాచుకున్నాడని కూడా బైబిల్ మనకు చెబుతుంది. ఆయన తన ప్రణాళికలన్నింటినీ మనకు వెల్లడించలేదు. అన్వేషించలేని ఆయన జ్ఞానంతో, ఆయన ఖచ్చితమైన మరియు విభిన్నమైన పరిమితులను నిర్దేశించాడు, వాటిని దాటి మనం వెళ్ళలేము మరియు ప్రయత్నించకూడదు. ఈ రహస్యాలలో ఒకటి క్రీస్తు రెండవ రాకడ మరియు లోకాంతం తేదీ. ఉదాహరణకు, మత్తయి 24:36 లో యేసు, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరని చెప్పాడు. ఈ మాటల ప్రకారం, 100% తగ్గించుకొని మన స్థానములో మానవునిగా ఉన్న యేసుకు కూడా ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. నిజమైన దేవుడిగా ఆయన సర్వజ్ఞుడు; కాని మన రక్షణ పనిని నిర్వహించడానికి, ఆయన తన సర్వజ్ఞానంతో సహా తన దైవిక శక్తికి, అధికారాలకు ఈ భూమిపై దూరంగా ఉన్నాడు. ఇది మన పరిధికి మించిన అంశం.

ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు, శిష్యులు, ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు (అపొ. కార్య. 1:6) అని వారిని గద్దించాడు. దేవుడు బయలుపరచని వాటి లోనికి మనం చొరబడటానికి ప్రయత్నించకూడదు. ఆయన వాక్యంలో జవాబు ఇవ్వబడని ప్రశ్నలు తలెత్తినప్పుడు, లూథర్ తన ఆదికాండము వ్యాఖ్యానంలో చేసిన వ్యాఖ్యలను జ్ఞాపకం చేసుకొందాం: అక్కడ అతడు, దేవుని విషయానికొస్తే, ఆయన ప్రత్యక్షం కానంత వరకు, విశ్వాసం లేదు, జ్ఞానం లేదు, అవగాహన లేదు. మనకు పైన ఉన్నది మనకు సంబంధించినది కాదు. దేవుని ప్రత్యక్షతకు పైన లేదా వెలుపల ఉన్న శ్రేష్ఠమైన వాటిని పరిశోధించాలనే ఆలోచనలు పూర్తిగా దయ్యాలలాంటివి ఎందుకంటే అవి బయలుపర్చుకొన్న దేవుని పై కాకుండా తెలుసుకోరాని దేవునిపై దృష్టి పెట్టేటట్లు చేస్తాయి కాబట్టి వాటితో మనం నాశనంలోకి త్రోయబడటం తప్ప మరేమీ సాధించలేము. దేవుడు తన నిర్ణయాలను రహస్యాలను రహస్యంగా ఎందుకు ఉంచకూడదు? అని రాసాడు. అలాగే లూథర్ మరొక చోట, “వాక్యానికి శ్రద్ధ చూపండి అలాగే వాక్యంలో తెలుకోరాని వాటిని వదిలెయ్యండి” అని చెప్పాడు.

యేసు తన రెండవ రాకడ ఎవరికి తెలియదని స్పష్టముగా చెప్పినప్పటికీ, ఆయన రెండవ రాకడ తేదీ తమకు తెలుసని చెప్పుకునే వ్యక్తులచే అనేక మత విభాగాలు స్థాపించబడ్డాయి. అందుకు ఉదాహరణలు సెవెంత్ డే అడ్వెంటిస్టులు మరియు యెహోవాసాక్షులు.

సెవెంత్ డే అడ్వెంటిస్టుల స్థాపకుల్లో ఒకరైన శ్రీమతి ఎల్లెన్ వైట్, క్రీస్తు 1843లో తిరిగి వస్తాడని ప్రవచించిన బాప్టిస్ట్ బోధకుడైన విలియం మిల్లర్ యొక్క ప్రారంభ అనుచరురాలు. ఆమె ఆయన రెండవ రాకడ తేదీని అక్టోబర్ 22, 1844గా నిర్ణయించింది, అది కార్యరూపం దాల్చలేదు.

యెహోవా సాక్షులుగా పిలువబడే ఈ శాఖ పితామహుడు చార్లెస్ టి. రస్సెల్, క్రీస్తు 1874లో అదృశ్యంగా ఈ లోకానికి తిరిగి వచ్చాడని మరియు 1914లో ఒక నూతన ప్రపంచం ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు. అయితే, మనకు తెలిసినట్లుగా, అది మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం, లక్షలాది మందికి చెప్పలేని బాధను మరియు మరణాన్ని తెచ్చిపెట్టిన యుద్ధం.

జీన్ డిక్సన్ స్వయం ప్రకటిత ప్రవక్తగా, అధ్యక్షులకు సలహాదారుగా, తన బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘ది కాల్ టు గ్లోరీ’లో, 2020 మరియు 2037 మధ్య క్రీస్తు తిరిగి వస్తాడని అంచనా వేసింది.1

లూథరన్ చర్చి కూడా అటువంటి తేదీ నిర్ణయకర్తలను కలిగి ఉంది. లూథర్ సన్నిహిత మిత్రుడు మైఖేల్ స్టీఫెల్ ఈ ప్రలోభానికి బలై క్రీస్తు రాకడ అక్టోబర్ 19, 1533న జరుగుతుందని లెక్కించాడు. అతని తప్పు స్పష్టంగా కనిపించినప్పుడు, అతన్ని తన పాస్టర్ పదవి నుండి తొలగించి, విట్టెన్‌బర్గ్‌లో నాలుగు వారాల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. స్టీఫెల్ అంచనాలను తీవ్రంగా వ్యతిరేకించిన లూథర్, 1535లో హోల్జ్‌డార్ఫ్‌లో పాస్టర్‌గా అతడు మరొక పదవిని పొందే వరకు అతనికి మద్దతు ఇచ్చాడు.2

ప్రఖ్యాత లూథరన్ వేదాంతవేత్త, జోహన్ ఆల్బ్రెక్ట్ బెంగెల్ (1687-1752), మరొక తేదీని నిర్ణయించాడు. ప్రకటన 20లో ప్రస్తావించబడిన వెయ్యేండ్ల పాలన 1836లో ప్రారంభం అవుతుందని అతడు ప్రకటించాడు. బెంగెల్ కలగన్న వెయ్యేండ్ల పాలన, అంటే ప్రపంచ ముగింపుకు ముందు సార్వత్రిక శాంతి మరియు శ్రేయస్సు యొక్క స్వర్ణయుగం. ఈ దృక్పధం పురాతన ఆధునిక వేదాంత దోషవాదుల ఎస్కాటాలజీలో ఒక ప్రముఖ లక్షణం. మన పాఠ్యభాగం, ఎస్కాటోలాజికల్ ప్రవచనాలు మరియు ప్రస్తుత తప్పుడు వివరణలు. ఇది వివిధ మిలీనియల్ సిద్ధాంతాల పరిశోధనలో మనల్ని ఉంచుతుంది. మిలీనియల్ సిద్ధాంతాలు ప్రాథమికంగా రెండు రకాలు, ప్రీమిలీనియలిజం మరియు పోస్ట్‌మిలీనియలిజం. ప్రీమిలీనియలిజం అంటే క్రీస్తు తిరిగి రావడం మిలీనియలిజానికి ముందు జరిగే వాటిని గురించిన దృక్పథం. పోస్ట్‌మిలీనియలిజం అంటే వెయ్యి సంవత్సరాల క్రైస్తవ ఆధిపత్యం మరియు శాంతి ముగింపులో ఆయన తిరిగి వస్తాడనే దృక్పథం.

బైబిల్ యొక్క ఎస్కాటోలాజికల్ ప్రవచనాల యొక్క ప్రస్తుత తప్పుడు వివరణలు నిజంగా కొత్తవి కావు. పురాతన అబద్ద బోధలు ఆధునిక దుస్తులలో తిరిగి కనిపిస్తున్నాయి. ఈ లోపాలను వాటి సరైన చారిత్రక దృక్పథంలో ఉంచడానికి, వెయ్యేండ్ల పాలన లేదా చిలియాజం అని కూడా పిలువబడే చరిత్ర యొక్క సంక్షిప్త వివరణతో మన ఈ అధ్యాయనాన్ని ప్రారంభిధ్ధాం.

ఆగ్స్‌బర్గ్ ఒప్పుకోలు ఈ తప్పు యొక్క మూలాన్ని సూచిస్తుంది. ఆర్టికల్‌ XVIIలో, “మృతుల పునరుత్థానానికి ముందు దైవభక్తిగలవారు ప్రపంచ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారని, భక్తిహీనులు ప్రతిచోటా అణచి వేయబడతారని” చెప్తూ యూదు అభిప్రాయాలను వ్యాప్తి చేస్తున్న వారిని ఇది ఖండిస్తుంది.3 యూదులకు చెందిన ఈ అభిప్రాయం సుదీర్ఘమైన మానవ అభిప్రాయాలపై ఆధారపడి ఉంది. దీని పుట్టుక క్రీస్తు జననానికి ముందు మరియు తరువాత శతాబ్దాలలో కనిపించిన యూదు అపోక్రిఫాల్ మరియు సూడెపిగ్రాఫికల్ సాహిత్యంలో కనిపిస్తుంది.

యేసు కాలంలోని యూదులు రోమన్ కాడిని తొలగించి, దావీదు మరియు సొలొమోను రాజ్యం వంటి శక్తివంతమైన స్వతంత్ర యూదు రాజ్యాన్ని తిరిగి స్థాపించే రాజకీయ విమోచకుడి కోసం వారు ఎదురుచూశారని మనకు తెలుసు.

యేసు ఐదువేల మందికి ఆహారం పెట్టే అద్భుతం చేసిన తర్వాత, ప్రజలు ఆయనను తమ రాజుగా చేసుకోవాలనుకున్నారు. కాని ఆయన వారి తప్పుడు ఆలోచన కారణంగా వారి నుండి తప్పించుకున్నాడు. తాను భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదనే విషయాన్ని ఆయన తన శిష్యులకు వివరించడానికి పదే పదే ప్రయత్నించాడు. అయితే, ఆయన ఆరోహణ సమయంలో కూడా, వారు అలాంటి ఆలోచననే కలిగి ఉన్నారు. పిలాతు ముందు తన సాక్ష్యంలో కూడా యేసు తన రాజ్యం యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని గురించి తెలియజేస్తూ “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” (యోహాను 18:36) అని స్పష్టంగా చెప్పాడు.

యూదు అపోకలిప్టిక్ రచయితలలో చిలియాస్టిక్ (వెయ్యేండ్ల పాలన) అనే ఆలోచన ఏ విధంగానూ ఏకరీతిగా ఉండదు, కాని ఈ క్రింది అంశాలు పదేపదే కనిపిస్తాయి:4

  1. శ్రమలు మరియు గందరగోళాల చివరి కాలం.
  2. మెస్సీయకు ముందుగా వచ్చు ఏలీయా యొక్క ప్రత్యక్షత.
  3. తన ప్రత్యర్థులను పడగొట్టడానికి మెస్సీయ కనిపించడం.
  4. మెస్సీయపై మరియు ఆయన అనుచరుడిపై ఆయన శత్రువులు తుది దాడి చేయడం.
  5. దైవిక జోక్యం ద్వారా మెస్సీయ విరోధుల నాశనం.
  6. యెరూషలేము పునరుద్ధరణ.
  7. చెల్లాచెదురుగా ఉన్న ఇశ్రాయేలీయుల తిరిగి రావడం.
  8. యెరూషలేము కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప రాజ్యం ఏర్పడటం.
  9. ఈ రాజ్యంలో పాల్గొనడానికి ఇశ్రాయేలీయుల పూర్వ తరాల పునరుత్థానం.
  10. ప్రపంచ పునరుద్ధరణ.
  11. సాధారణ పునరుత్థానం.
  12. తుది తీర్పు. ఈ ఆలోచనలలో ఏవైనా క్రైస్తవ చిలియాజంలో భాగమని మనమందరం వెంటనే గుర్తిస్తాం.

యూదులు తమ వెయ్యేండ్ల పాలన అనే ఆలోచనను పర్షియన్ జొరాస్ట్రియనిజం నుండి పొందారని తరచుగా వాదించబడుతుంది. క్రీ. పూ. 660లో జన్మించిన జొరాస్టర్ బోధనలు బాబిలోనియన్ మరియు మాదయ-పర్షియన్ సామ్రాజ్యాల ద్వారా వేగంగా వ్యాపించాయి. అతని బోధనలలో మంచి వ్యక్తులకు అమరత్వం మరియు తుది పునరుద్ధరణ, వెయ్యేండ్ల పాలన మరియు పునరుత్థానం యొక్క నిరీక్షణ ఉన్నాయి. V. A. W. మెన్నికే, యూదులు వారి చెర అనంతరం వారి ఎస్కాటలాజికల్ అభిప్రాయాలలో, వారు ఎక్కడి నుండి అయితే బయలుదేరారో, ఆ దేశాలకు చెందిన ప్రవక్తచే ప్రభావితమయ్యారని, క్రీస్తు పూర్వం యొక్క చివరి శతాబ్దాలలో యూదుల రబ్బీలు మరియు పెర్షియన్ జ్ఞానుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఈ విషయం రుజువవుతోందని పేర్కొన్నాడు.5

బాబిలోనియన్ చెరలో యూదులు సహజంగానే ఈ కొత్త అన్య మతానికి బహిర్గతమయ్యారు. క్రీ. పూ. 538 లో సైరస్ బాబిలోనియాను విడిచి వెళ్ళడానికి అనుమతిస్తూ ఆజ్ఞ జారీ చేసిన తరువాత, దాదాపు 50,000 మంది (ఎజ్రా 2:64,65) మాత్రమే ఇశ్రాయేలుకు తిరిగి వచ్చారు. మెసొపొటేమియాలో నివసించడానికి ఎంచుకున్న వారు వారి అన్యమత వాతావరణం ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యారు.

ఈ జొరాస్ట్రియన్ ప్రభావం వాస్తవానికి బలమైనదా, కాదా అనేది అప్రస్తుతం. కాని చిలియాజం (వెయ్యేండ్ల పాలన) అనేది మనుష్యుల హృదయాలను సహజంగానే ఆకర్షించింది. పాపంలోకి పతనమైనప్పటి నుండి, మనిషి ఇక్కడ భూమిపై తన కోసం స్వర్గాన్ని సృష్టించుకోడానికి ప్రయత్నించాడు. ఇతరుల కంటే గౌరవాన్ని కోరుకున్నాడు. ఆ క్రమములో ప్రభువు ఉగ్రత దినం చాలా దూరంలో ఉందని తనను తాను ఒప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ యూదు మరియు క్రైస్తవ సహస్రాబ్దివాదంలో ప్రాథమిక అంశాలు.

బాబిలోనియన్ చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత, యూదులు విగ్రహారాధనను తిరస్కరించారు. అలాగే దేవుని దయపై ఆధారపడటానికి బదులుగా వారి స్వనీతి, మతపరమైన ఆచారాలు, ధర్మశాస్త్రానికి విధేయత చూపడం పై ఆధారపడి విశ్వాస బ్రష్టులయ్యారు. పరిసయ్యుల శాఖ ఉద్భవించిన సమయం ఇది. పాపం నుండి రక్షకుడి అవసరం లేదని భావించిన యూదులు మొత్తంగా పాత నిబంధన యొక్క మెస్సీయ వాగ్దానాలను లౌకికంగా మార్చారు. మెస్సీయ ఆధ్యాత్మిక రాజ్యం యొక్క రక్షణ, శాంతి మరియు మహిమను ప్రవచనాత్మకంగా వివరించే ప్రవచనాలను ఇశ్రాయేలు యొక్క రాజకీయ శక్తి యొక్క పునరుద్ధరణను మరియు ఆదర్శవంతమైన సమాజ స్థాపనను సూచిస్తున్నాయని తప్పుగా అర్థం చేసుకున్నారు. దేశం దాని ఆధ్యాత్మిక వారసత్వాన్ని త్యజించినప్పుడు మిగిలిపోయిన శూన్యతను వారి శారీరక, భౌతిక కలలు భర్తీ చేశాయి. క్రీస్తు జన్మించే సమయానికి, వృద్ధ సుమెయోను మరియు అన్నాల వలె, ఆధ్యాత్మిక కోణంలో “యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న” (లూకా 2:38) ఒక చిన్న శేషం మాత్రమే మిగిలి ఉంది.

ఆర్. హెచ్. చార్లెస్, ది అపోక్రిఫా అండ్ సూపిగ్రాఫా ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ రచనలను సేకరించి వాటిని ఇంగ్లీష్‌లో ప్రచురించారు.6 ఈ సేకరణలోని అపోకలిప్టిక్ రచనలలో ది బుక్ ఆఫ్ జూబ్లీస్, I మరియు II ఎనోచ్, ది టెస్టమెంట్స్ ఆఫ్ ది ట్వెల్వ్ పాట్రియార్క్స్, ది సిబిల్లైన్ ఒరాకిల్స్, ది అజంప్షన్ ఆఫ్ మోసెస్, II మరియు III బారుచ్ మరియు IV ఎజ్రా (దీనిని II ఎస్డ్రాస్ అని కూడా పిలుస్తారు) ఉన్నాయి.

ఈ రచయితల రచనలు మెస్సీయ రాజ్యంతో ఏవిధంగా సంబంధాన్ని కలిగి ఉన్నాయో చూధ్ధాం. మొదటిగా I హనోకును చూధ్ధాం: అప్పుడు భూమి అంతా నీతిగా సాగు చేయబడుతుంది మరియు చెట్లతో నాటబడుతుంది మరియు ఆశీర్వాదంతో నిండి ఉంటుంది. దాని మీద అన్ని అందమైన చెట్లు, ద్రాక్షతోటలు నాటబడతాయి : దానిపై నాటిన ద్రాక్షతోటలు సమృద్ధిగా ద్రాక్షారసాన్ని ఇస్తాయి, మరియు దాని మీద విత్తిన ప్రతి విత్తనం వెయ్యి పండ్లను ఇస్తుంది, మరియు ప్రతి కొలత ఆలివ్‌లు పది తొట్టెల నూనెను ఇస్తాయి… మరియు మనుష్యులందరూ నీతిమంతులవుతారు, మరియు అన్ని దేశాలు ఆరాధనను అర్పించి నన్ను స్తుతిస్తాయి మరియు అందరూ నన్ను ఆరాధిస్తారు. మరియు భూమి అన్ని కల్మషాల నుండి, అన్ని పాపాల నుండి, అన్ని శిక్షల నుండి మరియు అన్ని హింసల నుండి శుద్ధి చేయబడుతుంది…. మరియు సత్యం మరియు శాంతి ప్రపంచంలోని అన్ని రోజులలో మరియు అన్ని తరాలలో కలిసి ఉంటాయి.7

హనోకు ప్రకారం ఆ రోజుల్లో, నీతిమంతులు “వేలకొద్దీ పిల్లలను కనే వరకు బ్రతుకుతారు, మరియు వారి యవ్వన దినాలన్నీ మరియు వారి వృద్ధాప్యం అంతా వారు శాంతితో పూర్తి చేసుకుంటారు” (10:17). యూదులపై అన్యులు చివరిగా నిష్ఫలమైన దాడి చెయ్యడం, చెల్లాచెదురుగా ఉన్న యూదులు వాగ్దాన దేశానికి తిరిగి రావడం, పాత నగరం ఉన్న ప్రదేశంలో కొత్త యెరూషలేము స్థాపన, మనుగడలో ఉన్న అన్యులను ఇశ్రాయేలు విశ్వాసంలోకి మార్చడం మరియు మెస్సియానిక్ రాజ్యంలో పాల్గొనడానికి ఇశ్రాయేలులోని చనిపోయిన నీతిమంతుల పునరుత్థానం (90:13-42) గురించి అతడు ప్రవచించాడు.

సిబిల్లైన్ ఒరాకిల్స్ అనేది క్రీస్తుపూర్వం 160 నుండి క్రీ.శ. ఐదవ శతాబ్దం లేదా ఆ తరువాత కాలం నాటి యూదు మరియు క్రైస్తవ రచయితల ప్రవచనాల సమాహారం. వాటికి ఎక్కువ విశ్వసనీయత మరియు అధికారాన్ని ఇవ్వడానికి పురాతన అన్యమత ఒరాకిల్స్ పేరైన, సిబిల్స్, వాటికి జోడించబడింది.

సిబిల్లైన్ ఒరాకిల్స్ యొక్క ఎస్కాటాలజీ హనోకు మాదిరిగానే ఉంటుంది. దేశాలు సమావేశమై పాలస్తీనాపై దాడి చేస్తాయి. కాని దేవుడు ఇశ్రాయేలును అద్భుతంగా రక్షిస్తాడు మరియు దాని శత్రువులను నాశనం చేస్తాడు. మనుగడలో ఉన్న అన్యులు మతం మార్చబడి దేవుణ్ణి స్తుతించడంలో ఇశ్రాయేలుతో ఐక్యమవుతారు. దేవుడు యెరూషలేమును రాజధానిగా చేసుకుని మానవాళి అంతటా తన రాజ్యాన్ని స్థాపించడంతో మెస్సీయ యుగం సార్వత్రిక శాంతి మరియు శ్రేయస్సును తెస్తుంది.

హనోకు లాగానే, బారూకు మెస్సీయ ప్రపంచంలో భూమి యొక్క ఉత్పాదకతను రంగురంగులుగా చిత్రీకరించాడు: భూమి తన ఫలాలను పదివేల రెట్లు ఇస్తుంది మరియు ప్రతి తీగపై వెయ్యి కొమ్మలు ఉంటాయి, మరియు ప్రతి పొలం వెయ్యి గుత్తులు, మరియు ప్రతి గుత్తి వెయ్యి ద్రాక్ష పండ్లను ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రతి ద్రాక్ష ఒక కోర్ [సుమారు 120 గ్యాలన్లు] ద్రాక్షారసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆకలితో ఉన్నవారు సంతోషిస్తారు; అంతేకాకుండా, వారు ప్రతిరోజూ అద్భుతాలను చూస్తారు…. మరియు అదే సమయంలో మన్నా ఖజానా మళ్ళీ పై నుండి దిగి వస్తుంది మరియు వారు ఆ సంవత్సరాల్లో దాని నుండి తింటారు, ఎందుకంటే వీరు కాల ముగింపుకు వచ్చారు. మరియు ఈ విషయాల తర్వాత, మెస్సీయ రాక సమయం పూర్తయినప్పుడు, ఆయన మహిమతో తిరిగి వస్తాడు.8

ఈ “యూదు అభిప్రాయాలు”, ఆదిమ క్రైస్తవ సంఘంలో వేళ్ళూనుకోవడం ఆశ్చర్యం కలిగించదు. అపొస్తలుల కాలం నుండి అగస్టీన్ (354-430) వరకు సంఘం ప్రధానంగా వెయ్యేళ్ళ నాటిదని మిలీనియలిస్టులు తరచుగా చెబుతారు. ఉదాహరణకు, ఆర్. లుడ్విగ్సన్ తన పుస్తకం ఎ సర్వే ఆఫ్ బైబిల్ ప్రోఫెసీలో, “చరిత్రలో ఈ సమయం వరకు ప్రీమిలీనియలిజం అని, ఇది చర్చి యొక్క ప్రబలమైన అభిప్రాయం” అని వక్కాణించాడు.9

అపోస్టోలిక్ అనంతర సంఘంలో మిలీనియం యొక్క లోపం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు, కాని అది “సంఘం యొక్క ప్రబలమైన అభిప్రాయం” అనే వాదన వాస్తవాలకు అనుగుణంగా లేదు. ప్రారంభ సంఘం సాధారణంగా ప్రభువు తిరిగి రావడం ఆసన్నమైందనే ఉల్లాసమైన నిరీక్షణను కలిగి ఉంది. అయితే, ఈ నిరీక్షణ ఈ ప్రారంభ క్రైస్తవులు మిలీనియంవాదులు అని చెప్పటం లేదు. జార్జ్ ముర్రే తన మిలీనియల్ స్టడీస్‌లో సంఘ చరిత్రకారుడైన నియాండర్‌ను ఉదహరిస్తూ, అతడు ప్రీమిలీనియలిజం అపోస్టోలిక్ అనంతర కాలంలో చాలా ప్రబలంగా ఉందని నమ్ముతున్నప్పటికీ, అతని వ్యాఖ్యలు “చిలియాజం చర్చి యొక్క సాధారణ విశ్వాసంలో భాగంగా ఏర్పడిందని అర్థం చేసుకోకూడదు” అని చెప్పాడు.10 మిచిగాన్‌లోని గ్రాండ్ రాపిడ్స్‌లోని కాల్విన్ థియోలాజికల్ సెమినరీకి చెందిన డి. హెచ్. క్రోమింగా, మితవాద ప్రీమిలీనియలిస్ట్, “చిలియాజం పురాతన చర్చిలో ఆమోదం పొందలేదు” అని కూడా ఒప్పుకున్నాడు.11

అపోస్టోలిక్ ఫాదర్లను – రోమ్ కు చెందిన క్లెమెంట్, పాలికార్ప్, పాపియాస్, ఇగ్నేషియస్, బర్నబాస్, మరియు అనామక షెపర్డ్ ఆఫ్ హెర్మాస్ మరియు డిడాచే రచనలను జాగ్రత్తగా చదివితే, ఆ కాలపు చర్చి ప్రధానంగా చిలియాస్టిక్ కాదని తెలుస్తుంది. మిచిగాన్ లోని హాలండ్ లోని వెస్ట్రన్ సెమినరీకి చెందిన డాక్టర్ ఆల్బర్టస్ పీటర్స్ వంటి సంఘ చరిత్ర విద్యార్థులు కూడా దీనిని గుర్తించారు. వారు ఈ పత్రాలను అధ్యయనం చేశారు. వారు ప్రారంభ చర్చి దాదాపు పూర్తిగా ప్రీమిలీనియల్ అని ప్రీమిలీనియన్ వాదన చెల్లుబాటు అవుతుందో లేదో నిర్ణయించే ఉద్దేశ్యంతో ఈ పత్రాలను అధ్యయనం చేశారు. డాక్టర్ ఆల్బర్టస్ పీటర్స్ ఆగస్టు మరియు సెప్టెంబర్ 1958, కాల్విన్ ఫోరం సంచికలలో తన అధ్యాయనాల ఫలితాలను ప్రచురించాడు. అతడు ముగింపుగా, అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం, క్రీ.శ. 150 తో ముగిసిన ఉప-అపోస్టోలిక్ కాలంలో చర్చిలో మిలీనియంలిజం ప్రబలంగా ఉందనే వాదనకు ఎటువంటి ఆధారం లేదు. సాహిత్యం సూచించినంత వరకు అది చాలా తక్కువగా ఉండటమే కాకుండా, అక్కడ ఉన్న ఈ కొద్దిపాటి ఆలోచన ఖచ్చితంగా క్రైస్తవేతర యూదుల అపోకలిప్టిక్ మూలాల నుండి గుర్తించవచ్చని చెప్తూ తన వ్యాసాన్ని ముగించాడు.12

ఈ దృక్కోణం నుండి ఈ కాలపు రచనలను అధ్యయనం చేసిన క్రోమింగా, తన సొంత ప్రీమిలీనియలిజంలో చిలియాజం యొక్క ఆధారాలు అమిలీనియలిస్ట్ అయిన డాక్టర్ పీటర్స్ కంటే తక్కువగా ఉన్నాయని కనుగొన్నాడు.13

ఈ కాలపు సాహిత్యాన్ని పరిశీలిస్తే, క్లెమెంట్ క్రీస్తు రెండవ రాకడ, పునరుత్థానం మరియు తీర్పు గురించి ప్రస్తావించాడని మనకు తెలుస్తుంది, కానీ క్రీస్తు రాజుగా పునరుద్ధరించబడిన యూదు రాజ్యం గురించి ఏమీ చెప్పలేదు. అపొస్తలుడైన యోహాను శిష్యుడు పాలికార్ప్ విషయంలో కూడా ఇదే నిజం. దిడాచే చివరి రోజుల గురించి చెప్తూ, దేవుని కుమారుడని చెప్పుకొంటూ అధిగమించలేని దుష్టత్వానికి దోషిగా ఉండే ప్రపంచ మోసగాడి పెరుగుదలను ఇది అంచనా వేస్తుంది. దీనిలో రెండు పునరుత్థానాల సూచనలు ఉన్నాయి, కాని వాటి మధ్య వెయ్యి సంవత్సరాల విరామం గురించి ప్రస్తావించలేదు. క్రీ. శ. 107లో అమరవీరుడైన ఆంటియోక్ బిషప్ ఇగ్నేషియస్, తన ఉనికిలో ఉన్న ఏ లేఖలోనూ చిలియాజం యొక్క సూచన లేదు.

బర్నబాస్ వ్రాసిన సువార్త పూర్వ సహస్రాబ్ది విశ్వాసాలతో అతనికున్న పరిచయాన్ని చూపిస్తుంది, కాని వాటితో ఏకీభవించదు. సృష్టి వారంపై బర్నబా యొక్క నమూనా అతని ఎస్కాటాలజీ. సృష్టి వారంలోని ప్రతి రోజు వెయ్యి సంవత్సరాలను సూచిస్తుందని భావించి, 6000 సంవత్సరాల వయస్సులో ప్రపంచం అంతం అవుతుందని అతడు భావించాడు. అప్పుడు క్రీస్తు మళ్ళీ వచ్చి కొత్త యుగాన్ని, బైబిల్ మాట్లాడే కొత్త స్వర్గం మరియు కొత్త భూమిని ప్రారంభిస్తాడని చెప్పాడు. బర్నబాస్ ఒక చిలియాస్ట్ కాదని క్రోమింగా కూడా ఒప్పుకున్నాడు.

అయితే, ఫ్రిజియాలోని హిరాపోలిస్ బిషప్ పాపియాస్ రచనలలో (క్రీ. శ. 70-155) క్రూరమైన చిలియాజం కనిపిస్తుంది. చిలియాజంలో ద్రాక్షతీగలు పెరిగే రోజులు వస్తాయి, ప్రతి కొమ్మలో పదివేల కొమ్మలు, మరియు ప్రతి నిజమైన కొమ్మలో పదివేల రెమ్మలు, మరియు ప్రతి రెమ్మలో పదివేల గుత్తులు, మరియు ప్రతి గుత్తులపై పదివేల ద్రాక్షపండ్లు ఉంటాయి మరియు ప్రతి ద్రాక్షను నొక్కినప్పుడు ఇరవై ఐదు మీటర్ల వైన్ ఇస్తుంది.14 యోహానును చూసిన పెద్దలు ప్రభువు బోధించినట్లు అతని నుండి ఈ విషయాలను విన్నట్లు గుర్తుచేసుకున్నారని పాపియాస్ చెప్పాడు.

పాపియాస్ మాటలు, క్రైస్తవ పూర్వ యూదు అపోకలిప్స్ అయిన II బారుచ్ మాటలను పోలి ఉన్నాయి. బారుచ్ వెయ్యి అని చెప్పే చోట, పాపియాస్ పదివేలు అని చెబుతాడు. ముర్రే చెప్పినట్లుగా, “ప్రారంభ చర్చి యొక్క అత్యుత్తమ ప్రీమిలీనియన్ వాస్తవానికి యూదు కథల నుండి తన సిద్ధాంతాలను అరువు తెచ్చుకున్నాడని రుజువులను అంగీకరించే ఎవరికైనా నిరూపించడానికి ఇది సరిపోతుంది.”15

యూసేబియస్ (క్రీ. శ. 280-339) “పునరుత్థానం తర్వాత ఒక నిర్దిష్ట సహస్రాబ్ది ఉంటుంది మరియు ఈ భూమిపైనే క్రీస్తు శారీరక పాలన ఉంటుంది” అనే పాపియాస్ బోధలను కల్పితాలని చెప్పాడు. యూసేబియస్ చెప్పినట్లుగా, అపోస్టోలిక్ కథనాల ద్వారా అధికారం పొందినట్లుగా ఈ విషయాలను పాపియాస్ ఊహించి చెప్పాడు.16

ప్రారంభ చర్చిలో సహస్రాబ్దివాదాన్ని పేర్కొన్న మరొక వ్యక్తి గ్రీకు అపోలోజిస్ట్ యైన జస్టిన్ మార్టిర్ (క్రీ. శ. 100-165). తన “డైలాగ్ విత్ ట్రిఫో” అనే పుస్తకంలో, “యూదుడితో జరిగే సంభాషణలో” ట్రిఫో, “ఈ స్థలం, జెరూసలేం, పునర్నిర్మించబడుతుందని మీరు నిజంగా ఒప్పుకొంటారా? మరియు మీ ప్రజలు క్రీస్తుతో, పితరులతో, ప్రవక్తలతో, మీ జాతి వారితో, మరియు క్రీస్తు రాకముందు మీతో చేరిన ఇతర మతమార్పిడి వ్యక్తులతో సమావేశమై ఆనందిస్తారని మీరు ఆశిస్తున్నారా?” అని అడుగుతాడు. అందుకు జస్టిన్ జవాబిస్తూ, “నేను మరియు చాలా మంది ఇతరులు ఇదే అభిప్రాయం కలిగి ఉన్నాము మరియు అలాంటిదే జరుగుతుందని నమ్ముతున్నాము;… కాని, మరోవైపు, స్వచ్ఛమైన మరియు భక్తిపూర్వక విశ్వాసానికి చెందిన మరియు నిజమైన క్రైస్తవులు అయిన చాలామంది భిన్నంగా ఆలోచిస్తారని నేను మీకు సూచిస్తున్నాను…. కాని నేను మరియు ఇతరులు, అన్ని విషయాలలో సరైన మనస్సు గల క్రైస్తవులు, మృతుల పునరుత్థానం ఉంటుందని మరియు యెరూషలేములో వెయ్యి సంవత్సరాల పాలన ఉంటుందనే భరోసాను కలిగియున్నాము, అది తరువాత ప్రవక్తలైన యెహెజ్కేలు, యెషయా మరియు ఇతరులు ప్రకటించిన విధంగా నిర్మించబడి, అలంకరించబడి, విస్తరించబడుతుంది.”17 జస్టిన్ సహస్రాబ్దివాదంతో చాలా మంది క్రైస్తవులు ఏకీభవించరని గమనించాలి.

లియోన్స్ బిషప్ యైన ఇరేనియస్ (క్రీ. శ. l20-202), మరొక సహస్రాబ్దివాది. తన పుస్తకం ఎగైనెస్ట్ హెరెసీస్‌లో అతడు “రాజ్య సమయం గురించి మాట్లాడాడు, అప్పుడు నీతిమంతులు మృతులలో నుండి లేచి పరిపాలిస్తారని; సృష్టి కూడా పునరుద్ధరించబడి విముక్తి పొందిన తర్వాత, అన్ని రకాల ఆహారాలతో సమృద్ధిగా ఫలిస్తుందని” చెప్పాడు.18 అతడు యెషయా 11:6ని తప్పుగా అర్థం చేసుకున్నాడు, అది తోడేలు గొఱ్ఱెపిల్ల యొద్ద వాసము చేయునని చిఱుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనునని చెబుతుంది. అక్షరాలా, కొందరు దీనిని విశ్వాసుల సహవాసం అని అర్థం చేసుకుంటారని అతనికి తెలుసు. యెషయా గ్రంథంలోని ఈ భాగం మరియు ఇలాంటి వాక్యాలు “క్రైస్తవ వ్యతిరేకి రాక తర్వాత జరిగే నీతిమంతుల పునరుత్థానం మరియు ఆయన పాలనలో ఉన్న అన్ని దేశాల నాశనాన్ని సూచిస్తూ నిస్సందేహంగా చెప్పబడ్డాయని, ఆ [పునరుత్థాన] కాలంలో భూమిపై నీతిమంతులు రాజ్యం చేస్తారని” అతడు వక్కాణించాడు.19 ఈ ప్రవచనాలు, అతడు చెప్పినదాని ప్రకారం, పరలోకంలో శాశ్వత జీవితాన్ని సూచించవు, కానీ భూమి పునరుద్ధరించబడిన మరియు యెరూషలేము పునర్నిర్మించబడిన సమయాన్ని సూచిస్తాయి.

క్రీస్తు తర్వాత రెండవ శతాబ్దంలో ఉద్భవించిన మోంటానిస్ట్ ఉద్యమంలో మిలీనియలిజం అత్యుత్తమ లక్షణం. మోంటానస్ అనే ఫ్రిజియన్ ఉత్సాహి మరియు అతనితో సంబంధం ఉన్న ఇద్దరు ప్రవక్తలు ప్రిస్కా మరియు మాక్సిమిల్లా, క్రీస్తు తిరిగి రావడం ఆసన్నమైందని ప్రకటించారు. కొత్త జెరూసలేం త్వరలో పెపుజా అనే ఫ్రిజియన్ గ్రామంపైకి వస్తుందని మరియు క్రీస్తు రాజ్యం యొక్క స్వర్ణయుగం ప్రారంభమవుతుందని వారు చెప్పారు. మోంటానిస్ట్ ఉద్యమం వేలాది మంది అనుచరులను ఆకర్షించింది, వీరిలో ప్రసిద్ధ వేదాంతి టెర్టులియన్ కూడా ఉన్నారు.

ఆశ్చర్యకరంగా, ఆరిజెన్ (క్రీ. శ. 180-254), అనేక అబద్ద భోధలకు పితామహుడైనప్పటికీ, చిలియాజమ్‌ను తిరస్కరించాడు.20 “బహుశా సహస్రాబ్ది బోధన ఆధారంగా ఉన్న భాగాలను ఉపమానంగా చూపించిన మొదటి వ్యక్తి” అని చిలియాజస్ట్‌లు అతన్ని తీవ్రంగా విమర్శించారు.21 ఇది అమైలీనియలిజంకు తలుపు తెరిచిందని నిందించారు.

లాక్టాంటియస్ (క్రీ. శ. 260-330) పురాతన క్రైస్తవ చిలియజం యొక్క చివరి గొప్ప సాహిత్య ప్రతినిధి. అతను మొదటి క్రైస్తవ రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ ది గ్రేట్ కోసం తన డివైన్ ఇన్స్టిట్యూట్స్ ను రాశాడు. అతని చిలియజం ఈ క్రింది ఉల్లేఖనంలో స్పష్టంగా కనిపిస్తుంది: దేవుని పనులన్నీ ఆరు రోజుల్లో పూర్తయ్యాయి కాబట్టి, ప్రపంచం ఆరు యుగాల వరకు, అంటే ఆరు వేల సంవత్సరాల వరకు ప్రస్తుత స్థితిలోనే కొనసాగాలి. ఎందుకంటే దేవుని గొప్ప దినం వెయ్యి సంవత్సరాల వృత్తం ద్వారా పరిమితం చేయబడింది, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి, 2పేతురు 3:8. ఆ ఆరు రోజులలో దేవుడు గొప్ప పనులను సృష్టించడంలో శ్రమించినట్లే, ఈ ఆరు వేల సంవత్సరాలలో ఆయన మతం మరియు సత్యం శ్రమించాలి, అయితే దుష్టత్వం ప్రబలి పాలన సాగిస్తుంది. దేవుడు తన పనులను పూర్తి చేసిన తర్వాత, వాటిని ఆశీర్వదించి ఏడవ రోజున విశ్రాంతి తీసున్నట్లే, ఆరు వేల సంవత్సరాల ముగింపులో దానిని ఆశీర్వదించినందున, భూమి నుండి అన్ని దుష్టత్వాలు తొలగించబడతాయి మరియు ధర్మం వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేస్తుంది; మరియు ప్రపంచం ఇప్పుడు చాలా కాలంగా సహిస్తున్న శ్రమల నుండి ప్రశాంతతను మరియు విశ్రాంతిని పొందుతుంది అని చెప్పాడు.22

Foot notes:
1Jeane Dixon, The Call to Glory (New York: William Morrow, 1972), p 181.
2Carl Meusel, Kirchliches Handlexikon (Leipzig: Justus Naumann, 1900), 6:425ff.
3The Augsburg Confession, Art. XVII, 5. Concordia Triglotta (St. Louis: Concordia, 1921), p 51
4Cf. D. H. Kromminga, The Millennium in the Church (Grand Rapids: Eerdmans, 1945), p 25
5V. A. W. Mennicke, “Notes on the History of Chilism,” Concordia Theological Monthly, Vol. XIII, 3 (March,1942), p 195. Cf. also Paul Althaus, Die Letzten Dinge (Gütersloh: Gerd Mohn, 1964), p 297.
6R. H. Charles, The Apocrypha and Pseudepigrapha of the Old Testament in English, 2 Vols, (Oxford: Clarendon Press, 1913).
7I Enoch 10:18 – 11:2. Char1es, Vol. II, p 195.
8II Baruch 29:5 -30:1. Charles, Vol. II, p 497f
9R. Ludwigson, A Survey of Bible Prophecy (Grand Rapids: Zondervan, 1973) p. 129.
10 George Murray, Millennial Studies (Grand Rapids Baker, 1948), p 193, quoting Neander,
11Church History, Vol. 1, p 651. 14 Kromminga, p 51.
12Quoted in Kromminga, p 41.
13Kromminga, p 41f.
14The Ante-Nicene Fathers, Alexander Roberts and James Donaldson, ed. [Reprint: Grand Rapids: Eerdmans, 1973], Vol. I, p 153.
15Murray, p 197
16The Ecclesiastical History of Eusebius Pamphilus, translated by Christian Frederick Cruse (Grand Rapids: Baker, 1955). III, 39:11-14.
17The Ante-Nicene Fathers, Vol. I, p 153.
18Ibid., Vol. I, p 562.
19Ibid., Vol. I, p 565.
20Cf. Adolf Hoenecke, Ev. Luth. Dogmatik (Milwaukee: Northwestern, 1909) IV, 283.
21Ludwigson, p 128.

22The Ante-Nicene Fathers, Vol. VII, p 211.