
అడ్వెంట్ 2 సిరీస్ B (పాత నిబంధన ప్రసంఘములు)
పాత నిబంధన పాఠము: యెషయా 40:1-11; పత్రిక పాఠము: 2పేతురు 3:8-14; సువార్త పాఠము: మార్కు 1:1-8; కీర్తన 85.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: యెషయా 40:1-11
ఉపొధ్ఘాతము: యెషయా తన ప్రవచనంలోని మొదటి భాగాన్ని (అధ్యాయాలు 1–39) ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదానుగూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయా ప్రవచించాడని (యెషయా 1:1) చెప్తుంది.
ఒకప్రక్క, 2 రాజులు 18:11, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి. అస్సిరియ రాజైన షల్మనేసర్ V ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు పై దండెత్తి దాని ముఖ్యపట్టణమైన సమరియాను స్వాధీనం చేసుకుని నాశనం చేసి ఇశ్రాయేలు పదిగోత్రాలను చెరగొనిపోయాడు. ఇక్కడితో ఇశ్రాయేలు కథ ముగిసిపోయింది.
మరొకప్రక్క, ఆహాజు పరిపాలించినంత కాలం, యూదా రాజ్యం అస్సిరియన్ శక్తిచే తాకబడలేదు. కాని హిజ్కియా యేలుబడిలో, అతడు అష్షూరు రాజుపై తిరుగబడుటకు ప్రోత్సహించబడ్డాడు (2 రాజులు 18:7). అతడు దేవునిని అడగకుండా ఆలోచన చేసి ఐగుప్తు రాజుతో పొత్తు పెట్టుకున్నాడు (యెషయా 30:2-4). అప్పుడు అష్షూరు రాజు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొన్నాడు. హిజ్కియా అస్సిరియన్లకు లొంగిపోయాడు కప్పం చెల్లించాడు (2 రాజులు 18:12-15). కొంత విరామం తర్వాత సన్హెరిబ్ యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనను పంపి యెరూషలేమును ముట్టడించాడు. ఆ సందర్భంలో యెషయా హిజ్కియాను భయపడవద్దని ప్రోత్సహించాడు (యెషయా 37:6). దేవుని దూత అస్సిరియన్ సైన్యంపై పడింది దాని లోని 185,000 మంది పురుషులు ఒక రాత్రిలో చంపబడ్డారు (2 రాజులు 19 మరియు 2 దినవృత్తాంతములు 32). రాజధాని నగరంయొక్క ప్రధానద్వారము వద్ద అస్సిరియన్ దళాలను నాశనం చేయడం ద్వారా దేవుడు యెరూషలేమును రక్షించటంతో మొదటి భాగం ముగుస్తుంది. యెషయా, 39వ అధ్యాయంలో బాబిలోనియన్లను పరిచయము చేస్తూ, భవిష్యత్తులో యూదా ప్రజలును వారి తిరుగుబాటును బట్టి బబులోను చెరలోనికి వెళ్తారని యెషయా హిజ్కియాను హెచ్చరించటంతో మొదటి భాగము ముగుస్తుంది.
40వ అధ్యాయంలో ప్రవక్త భవిష్యత్తులో జరగబోయేదానిని గురించి చెప్తూ, యూదా ప్రజలను దేవుడు తిరిగి వారిని చెరనుండి విడిపిస్తాడని ప్రవచించాడు – సైరస్ బాబిలోన్‌ను ఓడించడం 538 బి.సి.లో యూదులు యెరూషలేముకు తిరిగి రావడానికి మరియు ఆలయాన్ని మరియు నగరాన్ని పునర్నిర్మించడానికి అనుమతించే శాసనాన్ని జారీ చేయడం, అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి రావడం ఇవ్వన్ని ప్రవక్తకు దేవుడు ముందుగానే చూపించాడు.
చెరలో ఉన్న తన ప్రజలను యెహోవా దర్శిస్తాడని (ఐగుప్తు దాస్యమునుండి విడిపించినట్లుగా) తిరిగి వారిని సీయోనుకు తెస్తాడని, ప్రతి అడ్డంకిని తొలగిస్తాడని యెహోవా మహిమ తిరిగి బయలుపరచబడునని ఒకడును తప్పకుండ సర్వ శరీరులు దాని చూచెదరని ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చునని ప్రవక్త ప్రకటించుచుండగా, ఈ అడ్వెంట్ కాలములో తిరిగి రాబోవుచున్న ప్రభువు కొరకై సిద్ధపడుదాం.
అంశము: తిరిగి బయలుపరచబడబోవుచున్న యెహోవా మహిమ కొరకై సిద్దపడదాం
- ఆయన ప్రకటించిన ఆదరణను బట్టి 1,2
- ఆయన కొరకు సిధ్దపడదాం 3-5
- నిత్యము నిలుచు ఆయన వాగ్దానములను బట్టి 6-8
1
బబులోను చెరను గురించిన ప్రవక్త మాటలు యూదా ప్రజలను ఎలా తాకాయో మనకు తెలియదు. ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళటం, ఆ భయానక సంఘటలను గురించి విన్న యూదా ప్రజలకు ఈ మాటలు భయాన్ని కలిగించి ఉండొచ్చు. కలవరపడుచున్న తన ప్రజల హృదయములను నిమ్మళింపజేయడానికి, తన కృప కనికరములలో, 1మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, 2నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. ఓదార్చబడవలసిన ప్రజలు “ఆయన ప్రజలు”. దేవునిచే ఎన్నుకోబడిన వారు ఆయన స్వకీయ సంపాద్యము ఆయన ప్రత్యేకమైన సొత్తు. యూదా దేశము వారి స్వకీయ దురాశలను బట్టి మరులు కొల్పబడి దేవునికి విరుధ్ధముగా ప్రవర్తించుచు దేవునికి దూరమయ్యి చెరలోనికి పోయారు. బబులోనీయులుచే యెరూషలేము, వారి దేవాలయము నాశనము చేయబడింది. ప్రజలు బబులోనులో సుదీర్ఘ చెరను అనుభవిస్తున్నారు. చెరలో ఉన్న వారిని ఆయన నా జనులు అని పిలవడం వారిపట్ల ఆయనకున్న మార్పులేని ప్రేమను తెలియజేస్తున్నాయి. మీ దేవుడు (మీ దేవుడైన యెహోవా అను నేను మీతో చెప్తునదేమనగా) అనే మాటలు ఎంతో ఓదార్పునిస్తున్నాయి. మీ దేవుడు అనే మాట యెహోవా ఆయన ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది.
“ఓదార్పు” అనే పదం ఇక్కడ దుఃఖము లేదా బాధను అనుభవిస్తున్న వారికి ఓదార్పునిచ్చుట అనే అర్ధము లో వాడబడింది. ఈ ఆజ్ఞ ఏక వచనము కాదు బహువచనం. దేవుని ఓదార్పు సందేశం ప్రవక్తల ద్వారా నాటి విశ్వాసులందరికి వర్తిస్తుంది. చెరలోనికి వెళ్లిన వారిలో చాలామంది చెరలో మరణిస్తారు. క్రొత్త తరం వస్తుంది. ప్రజలు నిరాశలో ఉంటారు. అలాంటి పరిస్థితిలో, నిస్సందేహంగా వారి సుదీర్ఘమైన చెరలో బాధల మధ్య వారికి ఓదార్పు నిచ్చే మూలంగా వాళ్ళు నిరీక్షణ కోల్పోకుండా దేవుని ఈ మాటలు వారికి చేయూతనిచ్చుటకు చెప్పబడ్డాయి. చెర ముగియబోతోందని, సంతోషకరమైన రోజులు మళ్ళి వస్తాయని ఒక హామీని ఈ మాటలు అందిస్తున్నాయి. భాదలలో ఉన్నవారికి, చింతాక్రాంతులై ఉన్నవారికి, బలహీనులకు, నిరుత్సాహపడు వారికి, ఇబ్బందిపడుతున్న వారికి ఓదార్పు అవసరం. కాబట్టి ప్రతిఒక్కరు ఈ మాటలను పట్టుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొనుమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని మాటలు ఏ రూపములో ఉన్నను, అది చెప్పే విషయము ఒక్కటే, నిరీక్షణను చేపట్టుటకు, బలమైన ధైర్యము కలుగునట్లు పశ్చాత్తాపము ద్వారా పరివర్తన ద్వారా దేవుని మాటలను విశ్వసించినప్పుడు వాటిని ఆధారము చేసుకొని నిలబడినప్పుడు/ జీవించినప్పుడు ఓదార్పు కలుగుతుంది.
యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆయన మాటలను ప్రేమతో ఒకరితో మరొకరు పంచుకొనుమని దేవుడు చెప్తున్నాడు. ఓదార్పు దేవుని నుండి మాత్రమే వస్తుంది. దేవుని మాటలు మాత్రమే ఒకనికి ఓదార్పును ఇచ్చి నమ్మకాన్ని ఇవ్వగలవు. ఓదార్పుగా ఇక్కడ దేవుడు మూడు విషయాలను తెలియజేశాడు: ఆ మాటలు ఆదరణకరముగా నీరీక్షణను ఇస్తూ ఆయన క్షమాపణను కృపను తెలియజేస్తున్నాయి. మొదటిగా, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. (చెర యుధ్ధమే) చెర ముగింపుకు వస్తుందని అంటే దేవుడు నిర్ణయించినంత కాలము (70 సంవత్సరాలు) మాత్రమే వాళ్ళు చెరలో ఉంటారని, నిశ్చయత వారికి ఇవ్వబడింది. చెరనుండి విడుదలను గురించి మాత్రమే దేవుడు మాట్లాడటం లేదు, ఇక బానిసలుగా ఉండరు. రెండవదిగా, ఆమె దోష రుణము తీర్చబడెను (past tense) వారి పాపాలు చెల్లించబడ్డాయని? ఎలా? ఎవరు చెల్లించారు? ఆమేమో తన ప్రియమైన దేశమునకు దూరముగా 70 సంవత్సరాలు చెరలో ఉండగా (ఆమె తనకు తాను చేసుకొనలేని దానిని) వేరొకరు ఆమె కొరకు చేయుదురని తెలియజేసేందుకే దేవుడు ఇక్కడ ఈ మాటను వాడాడు. ఆమెకు బదులుగా యెషయా 53 అధ్యాయములో వివరిస్తున్నట్లుగా శ్రమపడు దేవుని పరిచారకుడు ఇశ్రాయేలు పొందుటకు పాత్రమైయున్న దోషమును, శిక్షను తీసుకొంటాడు.
మూడవది, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. మూడవది మిగిలిన రెండింటి కంటే రెండు రెట్లు ఎక్కువగా దేవుని దయను గూర్చి వక్కాణిస్తుంది. త్రాసు అను ఒకదానిని తీసుకొని దానిలో ఒకప్రక్క ఇశ్రాయేలు పాపమును మరియొకవైపు క్షమాపణను రెండింతలుగా ఉంచడాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. దేవుని దైవికమైన న్యాయములో ఆమె చేసిన ప్రతి పాపమునకు సంపూర్ణముగా రెండింతలు క్షమాపణను పొందెనను నిశ్చయతను ఇశ్రాయేలు కలిగియున్నది. స్వంత ప్రయత్నంతో విడుదలను సాధించడం వల్ల ఆమె విడుదలకాలేదు. ప్రభువు యొక్క సేవకుని బాధాకరమైన బాధ మరియు మరణం ద్వారా ఆమె చేసిన ప్రతి పాపమునకు చెల్లించబడుతుంది. “మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను” (53:6).
ఇవి 600 సంవత్సరాల తరువాత క్రీస్తులో నెరవేర్చబడతాయి. కాని ఈ విషయాలు చెప్తున్న ప్రవక్త “ఇప్పుడే” తీర్చబడినట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకని? యెషయా అలా చెప్పటానికి గల కారణము: దేవుడు ఎప్పుడు పలికిన ఆయన పలికినట్లుగా అవి జరుగుతాయి. దేవుడు ఒకదానిని గురించి చెప్పాడనుకొండి అలా జరుగుతుంది అంతే. భూతకాలములో దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే అది అలా జరుగుతుందని ఆమె దోష ఋణము తీర్చబడిందని తన ప్రేమలో దేవుడు వారికి నిశ్చయతనిస్తున్నాడు. బబులోను ఈ మాటలు ప్రవచించే కాలానికి ఇంకా శక్తివంతమైన దేశంగా మారలేదు. యూదా ఇంకా బందీగా తీసుకెళ్లబడ లేదు. సైరస్ ఇంకా పుట్టలేదు, యూదులు యెరూషలేముకు తిరిగి రావడానికి అనుమతించే శాసనం జారీ చేయబడలేదు, యేసు ఇంకా ఈ లోకములోనికి రాలేదు. దేవుడు ప్రకటించిన ప్రవచనాలు వాటితో ముడిపడియున్న సంగతులు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూడండి. ఇవన్ని ఇప్పటికే పూర్తయినట్లుగా దేవుడు మాట్లాడు తున్నాడు. భవిష్యత్తు గురించి ఎటువంటి సందేహం లేదు.
2
ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
ప్రభువు రాకడకు ముందుగా ఆయన ప్రజలను సిద్ధపరచుటకు ఇవ్వబడిన ప్రవచనము ఇది. బబులోను ప్రవాస కాలం పూర్తికానుంది. యెహోవా తన ప్రజలను ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించినట్లుగా అరణ్యంగుండా తిరిగి వారిని వారి స్వంతదేశానికి తీసుకెళ్లబోతున్నాడు. అరణ్యము అనే మాట యూదయ ప్రజలు బబులోనునుండి యెరూషలేముకు ఏ మార్గములో ప్రయాణించాలో తెలియజేస్తుంది. బబులోను యూదయ దేశములకు మధ్యన దట్టమైన అరణ్యముంది. అరేబియా ఎడారులుగా పిలువబడే ఈ భాగం ఈ ప్రాంతంలోనే ఉంది. కాబట్టి బబులోనునుండి యెరూషలేముకు ఈ నిర్జన ప్రాంతాము గుండా వెళ్ళవలసియున్నారని అనుకూలమైన రహదారి దేవుని ఆజ్ఞచే సిద్ధపర్చబడుతుందని తెలియజేయబడింది. (యెషయా 35:8-10, అక్కడ దారిగానున్న రాజ మార్గము ఏర్పడును. అక్కడ సింహముండదు క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములుగలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును). వారు చెరలోనికి పోకముందే, చెరలోనుండి తిరిగి వచ్చేందుకు వారికి పరిపూర్ణమైన రూట్ మ్యాప్ ఇవ్వబడింది, దేవుని కృపలో. వారి పాపములే వారిని దేవుని మందిరము నుండి వాగ్దాన దేశము నుండి దూరపర్చాయి. చెర వారి తిరుగుబాటును బట్టి శిక్షగా వారిలో పరివర్తన తెచ్చేందుకు నిర్ణయింపబడినదిగా తెలుస్తుంది. వారి ఆత్మీయ జీవితములలో సిద్ధపాటు అవసరమైంది_దేవునిని ఆరాధించే విషయములో, పరిశుద్ధముగా జీవించే విషయములో సిద్ధపాటు వారికి అవసరమైంది.
మార్గము సిద్ధపరచుడి. ఇది ఒక చక్రవర్తి ఆజ్ఞలా ఉంది. యెషయా రోజులలో చక్రవర్తులు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లే ముందు రూట్ మ్యాప్ ఇచ్చి దారి క్లియర్ చేయడానికి అతని కంటే ముందుగా ఒక బృందాన్ని పంపేవారు. చక్రవర్తి ప్రయాణించే మార్గములో అవసరమైన ఏర్పాట్లు చూడటం అందుకు తగినట్టుగా పనిచేసే వారికి సామాగ్రిని అందించడం, వంతెనలను కట్టడం, కొండలను సమం చేయడం, లోయలపై కాజ్‌వేలను నిర్మించడం లేదా వాటిని నింపడం, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉంచడం ఆ దూతల పని. ప్రవాస యూదుల పునరాగమనానికి వర్తింపజేస్తే, అన్ని అడ్డంకులు తొలగించబడతాయని దేవుని ఆదేశం ముందుకు సాగుతుందని అర్థం. ప్రభువగు యెహోవా ఒక చక్రవర్తిగా ఆయనే తన ప్రజలను విమోచించి వారి స్వంత దేశానికి నడిపించ బోతున్నాడు. ఆయన కొరకు ఆయన ప్రజలు సిద్ధపడవల్సియున్నారు. ఎందుకంటే యెహోవాయే వారి రక్షకుడు ఆయనే వారిని విమోచించిన వాడు. (అందరూ కలసికట్టుగా ఒకటిగా ఐక్యతతో పనిచేయవలసియున్నారు. ప్రతిఒక్కరు ప్రతిఒక్కరికి సహాయపడవల్సియున్నారు. వారు ప్రయాణ మార్గములలో ఉన్నను యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచువారిగా విమోచింపబడిన వారుగా ప్రతిఒక్కరు ప్రతిఒక్కరి బాధ్యతను తీసుకోవల్సియున్నారు. దేవుడు వారి మధ్య ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తింపవల్సియున్నారు, గమ్యమును చేరుకోవల్సియున్నారు, ఆయన నాయకత్వములో).
యెహోవా మహిమ అంటే ప్రజలకు దేవుని యొక్క శక్తిని ప్రేమను తెలియజేయుటకు బయలుపరచు ప్రత్యేకమైన ప్రత్యక్షత. తన ప్రజలను వారి బానిసత్వం నుండి విడిపించడం ద్వారా, వారి స్వంత భూమికి వారిని తిరిగి నడిపించడం ద్వారా తాను ఒడంబడికను కాపాడుకునే దేవుడిగా ఆయన వెల్లడించుకొన్నాడు. ఈ మహిమ మరియు విశ్వసనీయత బబులోనులోని వారి చెరనుండి వారిని విడిపించడంలో చూపబడుతుంది. యెరూషలేము చేసిన పాపాలకు యెహోవా శిక్షించాడు, కాని ఆయన ఉద్దేశ్యం వారి బాధలు కాదు, వారి విముక్తి. వారి అపవిత్రతను ప్రక్షాళన చేయటానికి చెర అనే అగ్ని ద్వారా ఆయన వారిని పంపించాడు. ఆయన ఎన్నుకున్న ప్రజలుగా వారి పూర్వ స్థితికి వారిని తెచ్చుటకే ఆయన ఇలా చేశాడు. యెహోవా మహిమను వాళ్ళు సర్వజనులకు బయలుపరచవల్సిన వారై యున్నారు. తరువాతి రోజుల్లో తన ప్రజల విమోచనను నెరవేర్చడానికి మెస్సీయను పంపడంలో ఇది మరింత విశిష్టంగా చూపబడుతుంది.
అట్లే మెస్సయ్యాకు ముందుగా పోవు దూతను గూర్చి కూడా ఈ ప్రవచనము తెలియజేస్తూ ఉంది. ఈ మాటలను ఆలకించినప్పుడు యేసుని రాకడ కొరకు తన ప్రజలను సిద్ధపరచుటకు ప్రభువు పంపిన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చిన ప్రవచనమని సువార్తల ద్వారా తెలుసుకున్నాం. బాప్తిస్మమిచ్చు యోహాను మరియు ప్రతి దేవుని సేవకుని సందేశమొక్కటే, పశ్చాత్తాపపడండి, దేవుని రాజ్యం సమీపించియున్నది. పశ్చాత్తాపము అంటే పాపము నుండి మళ్లుకొనుట మరియు దేవుడు ప్రకటించే క్షమాపణను నమ్ముకొనుట.
మెస్సీయకు వర్తింపజేస్తే, దేవుడు తన ప్రజలను విమోచించడానికి వారి వద్దకు రాబోతున్నాడని అర్థం. తన ప్రజలను విమోచించడంలో సర్వశరీరులు దైవికమైన జోక్యాన్ని చూస్తారని ఆయన శక్తి మహిమ యొక్క సాక్ష్యాలను గుర్తిస్తారని ఈ మాటలు చెప్తున్నాయి. అట్లే రక్షకుని పొందుటకు కోరుకొంటున్న వారందరి కొరకు ఇవ్వబడిన నియమాలుగా వీటిని మనము తీసుకోవలసి ఉన్నాం. ప్రభువు హృదయము లోనికి వచ్చు మార్గములో ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను చెయ్యబడవలెను. యేసు ముఖమును మనము చూసే ప్రతి సరి దేవుని మహిమను మనము చూస్తూవున్నాం.
3
ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు –నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డియైయున్నారు. వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వువాడును. నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడి పోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
ఇక్కడ యెహోవా యెషయాతో ప్రకటించుమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ప్రకటించుట ద్వారా దేవుని సందేశము మనుష్యులను చేరుకొంటుంది కాబట్టే దేవుని మాటలను ప్రకటించుమని అతడు ఆజ్ఞాపింపబడ్డాడు. అయితే నేనేమి ప్రకటింతునని అతడు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలో ప్రకటన చేయడానికి అతని సముఖతను మనం చూడొచ్చు, అట్లే ఏమి ప్రకటించాలో తెలుసుకోవడానికి చెప్పుమని అతడు అడుగుతున్నాడు.
మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, సర్వశరీరులు ప్రభువులు, చక్రవర్తులు, సైన్యాలు, న్యాయాధికారులు, దేశాలు, రాజ్యాలు, ప్రజలు అందరూ గతించిపోతూ ఉండేవాళ్ళే, ఏ ఒక్కరు శాశ్వతులు కాదు అందరూ అశాశ్వతులే, దేవుడు మాత్రమే శాశ్వతుడని, ఆయన మాట నిత్యము నిలుచునని, దేవుడు తాను చెప్తున్నట్లే వారిని విడిపించడానికి ఖచ్చితంగా వస్తాడని దేవుడు తన మాటను నెరవేర్చుకొంటాడని ప్రకటించాలి. నెరవేర్చుకొంటాడులో రెండు విషయాలు ఉన్నాయి_ 1. చెరకు కొనిపోయిన వారు ఆయన ప్రజలను శాశ్వతముగా బందీలుగా బానిసత్వములో ఉంచలేరని అట్లే వారి అధికారము కూడా శాశ్వతము కాదని, 2. ఆయన మాట ఇచ్చినట్లుగా వారి విడుదలను ఆయన టైములో ఆయనే వారికి ఇస్తాడని, ఆయన సర్వోన్నతత్వాన్ని ఆయన సర్వశక్తిమంతత్వాన్ని, వారిని గుర్తుచేసుకోమని ప్రోత్సహిస్తున్నాయి. వారి విడుదలను ఏ ఒక్కరు అడ్డుకోలేరనే విషయాన్ని, వాళ్ళు తిరిగి తమ స్వదేశమునకు తిరిగి వస్తారని, ఆయన వారికి అనుగ్రహించిన వాగ్దాన దేశమును వారి నుండి ఆయన శాశ్వతముగా తీసివేయటం లేదనే విషయాన్ని వాళ్ళు గుర్తించుకోవాలనే విషయాన్ని వారికి తెలియజేస్తూ దేవుడు నమ్మకమైనవాడని, ఆయన వాగ్దానాలు విఫలం కాదనే విశిష్టమైన సందేశాన్ని ప్రజలకు ప్రకటించుమని ప్రవక్త ఆజ్ఞాపింపబడ్డాడు.
కీర్తనలు 103:15,16 నరుని ఆయువు గడ్డివలె నున్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. 1 పేతురు 1:24 సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, ఈ ఉదాహరణ ద్వారా, దేవుని గొప్ప మహిమ మరియు శక్తి ముందు మానవులు గడ్డివంటి వాళ్ళు అనే వాస్తవాన్ని మనకు గుర్తుచేస్తున్నాడు. గర్వాంధులు కాకుండుడి అని హెచ్చరిస్తున్నాడు. మనమందరం మనల్ని మనం గొప్పగా ఎంచుకొంటాం. చరిత్ర పుస్తకాలు మన గొప్పతనాన్ని నమోదు చెయ్యొచ్చు. కాని మన కీర్తి పువ్వు వంటిది, కొద్దికాలమే. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వువాడును. “యెహోవా ఊపిరి” అనే పదం పాలస్తీనా దాని చుట్టుప్రక్కల నున్న ఎడారుల నుండి అంతటా తరచుగా వీచే వేడి పొడి గాలులను వారికి గుర్తుచేయటానికి ఇక్కడ వాడబడింది. తక్కువ సమయంలో అలాంటి వేడి, నిరంతర గాలి గడ్డిని ఎండిపోజేస్తుంది పువ్వులను వాడిపోజేస్తుంది. దేవుని వాక్యం పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపాన్ని మరియు మానవులందరి పట్ల ఆయనకున్న అపరిమితమైన ప్రేమను తెలియజేస్తుంది కాబట్టే దేవుని ప్రేమను ప్రకటించుమని ప్రవక్త ఆజ్ఞాపింపబడ్డాడు.
ముగింపు: దుఃఖించు హృదయములను బలహీనమైన ఆత్మలను సంతోషపరచుటకు రూపుదిద్దుకొన్న సందేశమిది. మన పాపములను బట్టి మనము దేవునినుండి ఆయన సన్నిధానము నుండి దూరపరచబడుతున్నాం, (మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను యెషయా 59:2). నిత్యశిక్ష క్రింద నరకమునకు పాత్రులమై ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ మనకు ఆశను నీరీక్షణను ఆదరణను ప్రకటిస్తూ మీ శ్రమలు సమాప్తమయ్యెను మీ అతిక్రమములు క్షమింపబడెను వాటి కొరకు నా కుమారుడు సంపూర్ణముగా వెలను చెల్లించి యున్నాడు అని ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రజలు ఓదార్చబడాలని ఆయన కోరుకొంటున్నాడనే విషయాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. ప్రభువు మీ హృదయము లోనికి వచ్చులాగున మార్గమును సిద్ధపరచుడి. ఆయన కొరకు ఎదుచూస్తూవున్న మీ హృదయములోనికి యేసు ప్రవేశించిన ప్రతిసారి మీ కొరకు బయలు పరచబడిన యెహోవా మహిమను చూస్తూవున్నారు. మన ఆయుష్యు క్షణకాలమనే విషయాన్ని మర్చిపోకండి. తీర్పులో నిలబడవలసియున్నాం. అటువంటప్పుడు మనకు నిరీక్షణ, నిత్యము నిలుచు దేవుని మాటలే. వాటిని మన జీవితములకు ఆధారము చేసుకొందాం. సువార్త ద్వారా దేవుడు పశ్చాత్తాపపడని, అవిశ్వాసముతో నిండిన హృదయములను తట్టుచున్నాడు. విశ్వాసమును సృజించుచున్నాడు. పరిశుధ్ధాత్ముడు హృదయములో విశ్వాసమును సృజించినప్పుడు అడ్డంకులు తొలగిపోతాయి. ఆయన కుమారుని మనము పుచ్చుకోనునట్లు మన హృదయములను సిద్ధపరచుటకు దేవుడు మనలను ప్రేరేపించును గాక. ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
Normally I don’t read article on blogs, but I would like to say that this write-up very forced me to try and do so! Your writing style has been amazed me. Thanks, very nice post.
Thank you