
అడ్వెంట్ 3 సిరీస్ B (పాత నిబంధన ప్రసంగము)
పాత నిబంధన పాఠము: యెషయా 61:1-3,10-11; పత్రిక పాఠము: 1థెస్సలొనీకయులకు 5:16-24; సువార్త పాఠము: యోహాను 1:6-8,19-28; కీర్తన 71.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
పాఠమును చదువుకొందాం: యెషయా 61:1-3;10,11
యెషయా 61:1-3;10,11, 1ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయముగల వారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును 2యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును 3సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి యున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. 10శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి యున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది 11భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడినవాటిని అది మొలిపించు నట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును.
ఉపొధ్ఘాతము: వారి పాపములు వారిని దేవునికి దూరముగా చేసి ఉండుటను బట్టి, వారికి అనుగ్రహింపబడియున్న గుర్తింపును వాళ్ళు కోల్పోయారు. దేవుడు అనుగ్రహించిన వాగ్దాన దేశమును వాళ్ళు పోగొట్టుకున్నారు. 63:18లో, 64:10లో, 64:11లో చెప్పబడివున్నట్లుగా, “శత్రువులు పరిశుద్ధాలయమును త్రొక్కి యున్నారు” వారిధాటికి “పరిశుద్ధ పట్టణము బీటిభూములాయెను, సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను, వారి పితరులు కీర్తించుచుండిన పరిశుద్ధ మందిరము అగ్నిపాలాయెను, మాకు మనోహరములైన వన్నియు నాశనమైపోయెను. ఒక ప్రక్క 10 గోత్రాలు చెరలోనికి వెళ్లి సుదూర ప్రాంతాలకు చెదరగొట్టబడ్డాయి. వాళ్ళు తిరిగి వచ్చుదురన్న ఆశ లేదు. మరొక ప్రక్క యూదా కూడా చెరలోనికి వెళ్లిపోయింది, ప్రవాసములో బందీ చెయ్యబడింది. చెర అంటే (గుర్తింపును పోగొట్టుకోవడం, వాగ్దాన దేశమును కోల్పోవడం, వారి మందిరం నాశనము చెయ్యబడటం).
అటువంటి సందర్భములో, చెరలో ఉన్నవారికి ప్రవక్త , యూదా యొక్క అద్భుతమైన భవిష్యత్తును గూర్చిన ప్రవచనాలు 58-66 అధ్యాయాలలో ప్రకటించి ఉండటాన్ని మనం చూడగలం. ఈ అధ్యాయం ఆయన రాకడ ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ, యూదా ప్రజలు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరు ఒప్పుకొందురని, యెహోవాను బట్టి మహానందముతో వారు ఆనందించుదురని వారికి అనుగ్రహింపబడబోవు సంతోషము నీతి స్వచ్ఛత ఆమెను జనములలో ఏవిధముగా ఇనుమడింప జేయబోతూ ఉందొ 10,11 వచనాలలో పేర్కొనబడింది.
అట్లే యెషయ, దావీదు సొలొమోను యొక్క భూసంబంధమైన రాజ్యాన్ని పునరుద్ధరించడానికి లేదా ఇశ్రాయేలును తిరిగి శక్తిగల రాజ్యముగా స్థాపించడం దేవుని చిత్తం కాదని, దేవుడు చెయ్యబోతూవున్న ఒక గొప్ప పనిని గురించి చెప్తూ ఆ పని యొక్క ప్రత్యేకతను వారి ప్రస్తుత పరిస్థితికి అలాగే ఆ ప్రత్యేకత ప్రజలందరికి ఏ విధముగా వర్తించబోతుందొ చెప్తూవున్నాడు. ఈ అధ్యాయం, మెస్సీయను కూడా సూచిస్తూ ఉందనేది యెషయా 61:1-3లను బట్టి అర్ధమవుతుంది.
ఆయన (మెస్సయ్య) రాకడ యొక్క ప్రాముఖ్యత
- మన జీవితములను మార్చియున్నాడు. 1-3a
- నీతి వస్త్రములను ధరింపజేసియున్నాడు. 3b,10
- దేవుని పట్ల కృతజ్జ్యతతో స్పందిద్దాం. 11, 3c
1
1ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. శుభవార్త ప్రకటించడానికి ప్రభువు ఎవరిని అభిషేకించి పంపాడు? యెషయా అభిషేకింప బడిన వ్యక్తిని గురించి ముందుగానే తెలియజేశాడు. యెషయా 11:1,2లో, ప్రవక్త యెష్షయి మొద్దు నుండి వచ్చిన కొమ్మపై ప్రభువు ఆత్మ నిలిచి ఉంటుందని వ్రాశాడు. యెషయా 42:1లో, అన్యజనులకు న్యాయము కనుపరచు తన సేవకుడిపై తన ఆత్మను ఉంచుతానని ప్రభువు వాగ్దానం చేశాడు. యెషయా 50:4లో, అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా తన సేవకుడికి దయచేసియున్నాడని పేర్కొన్నాడు. యెషయా 49:8,9లో బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను తన సేవకుడు చెప్పునని చెప్పాడు. ఈ వచనాల్లో దేవుడు తన సేవకుని ఏ పనులకై అభిషేకించాడో చూడొచ్చు. ఈ సేవకుడు మరెవరో కాదు, యెష్షయి నుండి వచ్చిన కొమ్మ, అంటే యేసుక్రీస్తు. యేసు నజరేతులోని సమాజమందిరానికి వెళ్ళినప్పుడు, ఆయన యెషయా ప్రవక్త గ్రంథపు చుట్టను తీసుకొని ఈ భాగాన్ని చదివాడు. ఆయన దానిని చదివిన తర్వాత, ఆ గ్రంథపు చుట్టను చుట్టి కూర్చున్నాడు. అప్పుడు యేసు, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో” అన్నాడు (లూకా 4:21).
కాబట్టి యేసు ఇక్కడ ప్రవచనంలో మాట్లాడుతు ప్రభువు ఆత్మ తనపై ఉందని ప్రకటించాడు. ఆ ఆత్మ ఆయన బాప్తిస్మ సమయంలో దృశ్యమానంగా ఆయన పైకి దిగింది (మత్తయి 3:13–17; మార్కు 1:9–11; లూకా 3:21, 22). యెషయా రాసిన ఈ మాటలలో, యేసు ఆత్మను “ప్రభువు” యొక్క ఆత్మగా, అంటే నిబంధన దేవుడుగా, కృప కరుణను వాగ్దానం చేసిన ఆత్మగా పేర్కొన్నాడు. అదనంగా, ఆ ఆత్మ, సర్వోన్నత ప్రభువు యొక్క ఆత్మ. ఆ ఆత్మ సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వస్తున్నట్లు చెప్పబడింది. ఆయన తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాడు. యేసు స్వయంగా రాలేదు. కృపగల దేవుడు ఆయనను పంపి ఆయనకు తన ఆత్మను ప్రసాదించాడు. త్రిత్వానికి సంబంధించిన సూచనను ఇక్కడ మనం గమనించొచ్చు: యెహోవా, ఆత్మ మరియు ఆయన సేవకుడు లేదా అభిషిక్తుడు.
యేసు అభిషిక్తుడు, అంటే మెస్సీయ అయ్యాడు. ఆయన శుభవార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆయన మొత్తం లక్ష్యం “శుభవార్త” లేదా సువార్తపై కేంద్రీకృతమై ఉంది. దావీదు సొలొమోనుల భూసంబంధమైన రాజ్యాన్ని పునరుద్ధరించడానికి లేదా భూమిపై కొత్త, మెరుగైన రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు తన మెస్సీయను పంపలేదని మనం మర్చిపోకూడదు. ఆయన శుభవార్తతో, స్వస్థత స్వేచ్ఛ యొక్క సందేశంతో దిగి వచ్చాడు. పేదలకు, నలిగిన హృదయముగల వారికి, చెరలోనున్న వారికి ఆ శుభవార్తను తెలియజేయడానికి ఆయన వచ్చాడు. ఈ పదాల యొక్క విస్తృత సందర్భం వాటిని భౌతిక సమస్యలుగా కాకుండా ఆధ్యాత్మిక సమస్యలుగా చూడటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రజల దోషాలు వారిని దేవుని నుండి వేరు చేశాయని (59:2) మరియు చీకటి భూమిని కప్పివేసిందని (60:2) యెషయా వ్రాశాడు. మునుపటి అధ్యాయాలలో, దేవుడు పాపం మరియు చీకటి నుండి అద్భుతమైన ఉపశమనాన్ని వాగ్దానం చేశాడు. ఈ అధ్యాయంలో ఆ ఉపశమనం మరియు విమోచనను ఎవరు తెస్తారో ఆయన చెప్పాడు. “ప్రభువగు యెహోవా ఆత్మ [ఆయన] మీద ఉంది” కాబట్టి మెస్సీయ ఈ విమోచనను తెస్తాడు. మెస్సీయ పాపం, మరణం నుండి విముక్తిని సాధించడానికి మాత్రమే కాదు (అధ్యాయం 53), కాని బాధపడుతున్న వారందరికీ దానిని స్పష్టంగా ప్రకటించడానికి వచ్చాడు.
యూదా ప్రజలు ఈ మాటలను ఏ విధంగా అర్ధం చేసుకొని ఉండొచ్చు? యెహోవా నన్ను అభిషేకించెను అను మాటకొచ్చేటప్పటికే ప్రవక్తలు రాజులు వారి తలలపై అభిషేక తైలము పోయడం ద్వారా వారు అభిషేకింపబడ్డారు. అది వారికి తెలుసు. ఇక్కడ, మాటలు అందుకు భిన్నముగా ఉన్నాయి. ఈ మాటలు చెరలో ఉన్న యూదా ప్రజలకు ఏవిధముగా ఆదరణను కలిగించి ఉండొచ్చు? చెరలో ఉన్నవారికి కావలసింది విడుదల, ఓదార్పు, వారు పోగొట్టుకొనిన గుర్తింపు మాత్రమే.
వీటిని గురించే ఈ వచనము మాట్లాడుతుంది. ఈ వచనంలో సువర్తమానము అనే మాట ఇక్కడ ప్రాముఖ్యం. ఇశ్రాయేలీయులు ఉంటున్న సందర్భానికి ఈ మాట వారికి చాలా ఆదరణను కలిగించి ఉండొచ్చు. హీబ్రూలో సువర్తమానము అనే మాటకు ఇక్కడ బాస్ సెర్ అనే మాట వాడబడింది. ఈ మాటకు “అణచివేతదారుడిపై విజయం” “మిలిటరీ విక్టరీ” అని అర్ధం. యెహోవా తన ప్రజలకు తీసుకు వచ్చే విజయాన్ని సూచించడానికి పాత నిబంధనలో ఈ బాస్ సెర్ అను మాట చాలా చోట్ల వాడబడింది.
ఈ వచనాలలో యెహోవా తన ప్రజలకు తీసుకువచ్చే విజయం వాళ్లకు రెండు రకాలుగా ప్రవచింపబడింది _ మొదటిగా, వాళ్ళ వాస్తవ పరిస్థితులకు (అంటే వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులకు) సంబందించినది, దేవుడు వారి చెరనుంచి వారిని ఆయనే విడిపించబోతున్నాడనేది. ఉదాహరణకు: విస్తారమైన సైన్యమును ఆయుధాలను సంపత్తిని కలిగిన ఐగుప్తు పై ఆయన ఎలాంటి సైనిక చర్యను తీసుకొనియున్నాడో వాళ్లకు తెలుసు. అలాంటి సైనిక చర్యను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. రాబోతున్న విజయమును గూర్చిన వర్తమానమును వారికి తెలియచెప్పాడు. తద్వారా చెరనుండి విడుదలై తమ వాగ్దానదేశమునకు తిరిగి వెళ్లుదురని నిశ్చయతను వారికి ఇచ్చాడు.
ఇప్పుడు చెరలో, శ్రమలలో వారికి అవసరమైనది దేవుని సువర్తమానము మాత్రమే. అది కూడా అధికార పూర్వకమైన సువర్తమానము మాత్రమే వారికి ఆశను కలిగించగలదు, నిరీక్షణను ఇవ్వగలదు. ఆనాడు వారి మధ్యకు అధికారపూర్వకముగా పరిచర్య నిమిత్తమై పంపబడిన వాడు ప్రవక్తయైన యెషయా మాత్రమే. కాబట్టే అతడు 1ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అని చెప్తూ ఆ సువర్తమానమును, దీనులకు ప్రకటించుటకు, నలిగిన హృదయముగల వారిని దృఢపరచుటకు, చెరలో నున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును, దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింప జేయుటకు, యెహోవా నన్ను అభిషేకించెను అని చెప్పినపుడు తన ప్రవక్తను వారి దగ్గరకు ఆయనే పంపియున్నాడని రెండవదిగా ఈ సువర్తమానమును ఇతని ద్వారా వారికి తెలియజేయిస్తూ ఉన్నాడనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు.
దీనులు అనే మాట_ వాస్తవానికి “బిచ్చగాళ్ళను” ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన వాళ్ళను సూచిస్తుంది. తరువాత ఇది “సామాజికంగా బలహీనమైన” “దయనీయమైన” లేదా “పేద” వారిని వివరించడానికి వాడబడింది. భాదితులను, బాధలలో ఉన్నవారిని, పేదవారిని, విపత్తు కారణంగా అణచి వేయబడిన వారిని ఈ మాట సూచిస్తుంది. బబులోనులో చెరలో ఉన్న వారికి ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. నలిగిన హృదయులు అనే మాట_ తీవ్రంగా మధనపడే వారు మరియు బాధపడే వారిని సూచిస్తుంది. వారి పాపాలను బట్టి, లేదా చెరను బట్టి, అణచివేతను బట్టి, సంబంధాలు తెగిపోవడం బట్టి, కుటుంబాలు చెదరిపోవడం బట్టి, జరిగిన నష్టాన్ని బట్టి, పోగొట్టుకొనిన గుర్తింపును బట్టి, కోల్పోయిన స్వేచ్ఛ స్వతంత్రాన్ని బట్టి, స్వదేశమునకు దూరమయ్యి దేవుని ఎరుగని వారి క్రింద దాసులుగా ఉండటాన్ని బట్టి, హృదయము నందు మనఃసాక్షియందు నెమ్మదిలేని వారిని సూచిస్తుంది అంటే ఆశను కోల్పోయిన వారిని, పాపమును బట్టి వారు కోల్పోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ, పాపమును బట్టి సిగ్గుపడుతూ, శిక్షలో ఉండటం, ఆశలేక నిస్సహాయమైన స్థితిలో నలుగుతూ ఉండే వారిని సూచిస్తుంది. Bind up the brokenhearted బైండింగ్-అప్ అంటే సాధారణమైన ఓదార్పుకు మించిoది. బైండింగ్-అప్ థెరపీ అంటే శస్త్ర చికిత్స అంటే విరిగిన ముక్కలను కలిపి కట్టటం. అవి అతుకుకొనుటకు అవసరమైన విధముగా చికిత్స చేసి బాగు చెయ్యటం. చెరలోనున్న వారు అనే మాట_ బందీలుగా చెరలోనికి కొనిపోబడి బాధాకరమైన దాస్యంలో ఉన్నవాళ్ళని సూచిస్తుంది. వారికి దరిదాపులలో ఆశ లేదు. విడిపించు వాడెవడు లేడు. వారికి రాజు లేడు సైన్యము లేదు. చెరలో దాస్యములో శరణార్థులుగా ఉన్నారు. సీయోనులో దుఃఖించువారు అనే మాట_ బబులోనీయులు ఇశ్రాయేలును జయించిన తరువాత సీయోనులో వదిలివేయబడిన నిరుపేదలు అంగవికలురు బలహీనులను సూచిస్తుంది. తీర్పును వారి మీదికి తెచ్చిన వారి పాపాన్ని బట్టి విలపిస్తూ, దేవుడు ఇంకను మా పట్ల దయ చూపునా అని విలపిస్తున్న పేద పీడిత బాధిత ప్రజలు.
ప్రవక్త వారి స్థితి పరిస్థితి మారుతుందనే సువర్తమానాన్ని ప్రకటిస్తూ, దీనులు, నలిగిన హృదయులు, చెరలోనున్న వారు, బందీలు, సీయోనులో దుఃఖించు వారికి సువర్తమానమును_ యెహోవా హితవత్సరమును, దేవుని ప్రతి దండన దినమును ప్రకటించాడు. రెండవదిగా, పాపము నుండి విడుదలను గూర్చి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెషయా 59:2 మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. చెర దాని ఫలితమే. ప్రతి 50 సంవత్సరాలకు ఇశ్రాయేలీయులకు హితవత్సరము ప్రకటించబడెడిది. ఆ హితవత్సరము ప్రకటింపబడినప్పుడు గత రుణములన్నియు క్షమింప బడెడివి. దాసులందరు విడిపింపబడేవారు. స్వాస్థములైన భూములు తిరిగి వారి స్వంత యజమానులకు ఇవ్వబడేవి. ప్రతి ఒక్కరి తప్పులు క్షమింపబడేవి, వారికి మరల అవకాశము ఇవ్వబడేది (లేవీయకాండము 25:8-55).
ప్రతిదండన దినము_ తన ప్రజలను రక్షించడం కోసం ఆయన వారి శత్రువులపై ప్రతీకారం తీర్చుకొంటాడని ఈ మాటలు తెలియజేస్తున్నాయి, (ఐగుప్తు పై, ఎదోముపై 34; ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి). నలిగి ఆశను కోల్పోయిన వీరికి దేవుడు ఆశను కలుగజేస్తున్నాడు. ఆయన దయను తిరస్కరించే వారందరికి, తీర్పు మరియు ప్రతీకారం ఉంటుంది. లేఖనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి (నిర్గమకాండము 34:5-7; మార్కు 16:16; యోహాను 3:16-18; 2 పేతురు 3:8-10).
యెషయా తర్వాత 600 సంవత్సరాలకు, దేవుని కుమారుడైన యేసు తాను భూమి మీదికి వచ్చిన తరువాత, తనకు స్పష్టంగా ఈ ప్రవచనాన్ని అన్వయించుకోవడం ద్వారా ఇది సంపూర్తిగా నెరవేర్చబడింది, మత్తయి 3:16. దేవుని ఆత్మ పావురమువలె దిగి ఆయన మీదికి వచ్చెను. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండ ఆత్మననుగ్రహించెను, యోహాను 3:34. ఆయన– నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను, లూకా 4:16-21.
ఆయన నరులందరికి క్రీస్తు ద్వారా ఆశను కలుగచేస్తూ జరిగిన నష్టాన్ని సరిచేస్తూ దుఃఖానికి గల కారణాన్ని శాశ్వతముగా యేసుక్రీస్తును బట్టి తొలగించుదునని తెలియజేశాడు. ఈ మెస్సీయ దేవుని నుండి క్షమాపణ యొక్క స్వస్థత సందేశాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఆయన విరిగిన హృదయం ఉన్న పాపులను తన క్షమాపణ యొక్క ఓదార్పు సందేశంతో ఆదరిస్తాడు. ఆయన అపరాధ మనస్సాక్షి నుండి భారాన్ని తొలగిస్తాడు. ఆయన వారి స్వంత దుర్మార్గం యొక్క నిరాశాజనకమైన చెరసాలలో బంధించబడిన పాపులను విడుదల చేస్తాడు. ఆయన మానవ జీవితాలపై సాతాను నియంత్రణ ప్రభావం యొక్క బంధనాన్ని విచ్ఛిన్నం చేసాడు. ఆయన సందేశం పాపం, మరణం, నరకం మరియు సాతాను నుండి అద్భుతమైన విముక్తిని ప్రకటించింది.
యెషయా వివరించుచున్నట్లుగా మనమందరము దయనీయమైన స్థితిలో పాపమనే కుష్టుతో స్వనీతియను మురికిగుడ్డలతో దుష్టత్వము నిండిన స్వభావంతో అపవిత్రులుగా అసహ్యులుగా దోషులుగా ఉన్నాం. దేవునికి దూరముగా చెరలో ఉన్నాం, స్వాస్థమును పోగొట్టుకొనిన వారముగా ఉన్నాం. ఏమియు చెయ్యలేని నిస్సహుయులుగా ఉన్నాం. మన దేవుడు మన మధ్యకు వచ్చాడు. హితవత్సరమును ప్రకటించాడు. మన రుణములన్నియు కొట్టివేయబడ్డాయి. మన తప్పులన్నియు సంపూర్ణముగా తుడిచివేయబడ్డాయి. ఆయన మన స్థితిని పరిస్థితిని మార్చాడు. మనము ప్రతిదీ క్రొత్తగా మొదలుపెట్టుటకు అవకాశమియ్యబడింది. మన జీవితాలను ప్రభువు ఎంతగా మార్చాడో చూడండి. మనము ఊహించలేని దానిని ఆయన మనకొరకు చేసాడు. దేవుని పిల్లలుగా మనలను ప్రకటించాడు. దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదెకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మనకు ఇచ్చాడు.
2
బూడిదెకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును… శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి యున్నాడు కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను.
బూడిద వారి దుఃఖాన్ని నిస్సహాయతను పశ్చాత్తాపపడడాన్ని తెలియజేస్తూవుంది. ఆ కాలములో దుఃఖపడువారు దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసుకోకుండా ఉండేవాళ్ళు. ఒకని జీవితము నుండి సంతోషము ఆనందము సంపూర్ణముగా విడిచి వెళ్లిందని సూచించడానికే నాటి ప్రజలు తలలపై బూడిదను పోసుకొనేవాళ్ళు. భారభరితమైన ఆత్మకు అంటే ఇక్కడ వాడబడిన మాటకు బలహీనమైన నిర్బలమైన వారు అని అర్ధం. ఇది ఆరిపోయే దీపానికి వర్తిస్తుంది. ఇక్కడ అది నిరుత్సాహ హృదయాన్ని సూచిస్తుంది. స్తుతివస్త్రము అంటే దుఃఖానికి బదులుగా కృతజ్ఞతను వ్యక్తపరిచే దుస్తులు.
ఒక వైపు వారికి దుఃఖం బూడిద నిరాశ ఉన్నాయి. మరోవైపు ఘనత ఆనందతైలము మరియు స్తుతివస్త్రము ఉన్నాయి. పాపాల కారణంగా జీవితాలు ఎల్లప్పుడూ దుఃఖం, బూడిద నిరాశతో ఉంటాయని ఆయనకు తెలుసు. కాబట్టే ఆయన అభిషక్తునిలో ప్రత్యామ్నాయాన్ని అందించాడు. సువార్త ద్వారా మానవ హృదయాలలో పని చేయడానికి ప్రభువు ఎంచుకున్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు ఓదార్పు సంతోషం స్వేచ్ఛ మరియు బలాన్ని ఇస్తున్నాడు. కాబట్టే సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది, అని రోమా 1:16 చెప్తూ ఉంది.
కాబట్టే మానవులందరూ యేసు శుభవార్తను వినాలి. ఎందుకంటే మానవ జీవితాలు తరచుగా దుఃఖం ఇబ్బందులతో నిండి ఉన్నాయి. మనం విజయం కంటే ఓటమిని వైఫల్యాన్ని ఎక్కువగా భరిస్తున్నాం. మన హృదయాలు విరిగిపోయి ఉన్నాయి. మనం మళ్ళీ మళ్ళీ నిరాశ చెందుతూనే ఉన్నాం. మన ప్రియులు బాధను అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు మనం ప్రేమించే వారు మనకు బాధను కలిగించి, మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు. మనం మన స్వంత వైఫల్యాల పరిణామాల నుండి తప్పించుకోలేక ఇబ్బందిపడుతూ ఉండొచ్చు లేదా ఇతరుల తప్పులచే మనం నియంత్రించబడుతూ ఉండొచ్చు. జీవిత భాగస్వామి యొక్క చేదు, తల్లిదండ్రుల ప్రేమలేని వైఖరి, మరియు ఇతరుల కఠినమైన విమర్శలతో మనం బాధపడుతూ ఉండొచ్చు. మన జీవితాలు తరచుగా శోకం మరియు దుఃఖం యొక్క ఎపిసోడ్‌ల శ్రేణి. ఆనందం యొక్క క్షణాలు క్షణికాలు. మనం మరొక నష్టంలో కూరుకుపోయి ఉండొచ్చు. మన జీవితాలు తరచుగా దురాశ, అసూయ, గర్వం, కామం, అసూయ, ద్వేషం మరియు కోపంతో నిండి ఉన్నాయి. మానవ జీవితం చివరలో మరణం ఉంది – తప్పించుకోలేనిది, మరియు తిరస్కరించలేనిది. మానవులందరు తమ స్వంత పాపాలు, తిరుగుబాటు మరియు అపరాధం కారణంగా అలాంటి పరిస్థితులకు వారసులు. మనం బందీలుగా ఉన్నాం. యేసుక్రీస్తుని గూర్చిన సువార్త రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. అయితే, ఏ మానవుడు అలాంటి విధికి వదిలివేయబడాలని ప్రభువు కోరుకోడు. ఆయన తన అభిషిక్తుడిని భవిష్యత్తును గురించిన శుభవార్తను ప్రకటించడానికి పంపాడు. అలసిపోయిన పాపుల పట్ల దేవుని ప్రేమ సందేశాన్ని ప్రకటించడానికి మెస్సీయ పంపబడ్డాడు.
శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి యున్నాడు కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. యెహోవాను బట్టి మహానంద -ముతో నేను ఆనందించుచున్నాను అను మాటకు యెహోవా తన ప్రజల విమోచనలో చూపిన విశ్వసనీయత పరిపూర్ణతలను బట్టి సంతోషం పుడుతుందని అర్థం. ప్రకటింపబడిన వాగ్దానాలను బట్టి, విడుదల, మందిర పునరుద్ధరణ, రాజ్యముగా పాలన, సార్వత్రిక యాజకత్వం, వాగ్దాన దేశము, గుర్తింపు వీటిని బట్టి, యూదా ప్రజల హృదయపూర్వక ఆనందాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. ఈ ఆనందానికి మంచి కారణాలు ఉన్నాయి, ఆయన రక్షణవస్త్రములను, నీతి అను పై బట్టను నాకు ధరింపజేసియున్నాడు అంటే, (1) ఆయనే వారిని పవిత్రంగా చేసాడు. (2) ఆయన స్వనీతిని వస్త్రముగా వారికి ధరింపజేశాడు. ధరింపజేసియున్నాడు అనే మాట వారికి ప్రకటింపబడిన వాగ్దానాలు వారి యోగ్యతను బట్టి కాదు లేదా వారి నీతికార్యములను బట్టి కాదు గాని ఆయన వాగ్దానములను బట్టి అయోగ్యులైన వారికి ఆయనే రక్షణ వస్త్రములను ధరింపజేశాడు. కాబట్టి ఎవడును అతశయపడ వీలులేదు. వారి రక్షణ విషయములో ఆయన తీసుకొన్న ఇనిషియేటివ్ ని ఈ విషయాలు వారికి గుర్తుచేస్తూ మెస్సయ్యలో దీని సర్వపరిపూర్ణతను తెలియజేస్తున్నాయి. శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగాను ఉత్సవ వస్త్రములను ఆయనే వారికి ధరింపజేశాడు.
సంతోషమే లేని వారి స్థితిని, సంతోషానికి ఆయన మార్చబోతున్నాడు. కష్టములో ధరించుకొనే వస్త్రములు ఇక లేవు, ఆయన సంతోషకరమైన వస్త్రములను ధరింపజేశాడు. ఆయన వారిని క్షమించాడు. తన ఎదుట నిలబడుటకు అనుమతించాడు. తిరిగి వారిని చేర్చుకొన్నాడు. దేవుడు వారిని విడిచి పెట్టలేదని, తన స్వకీయ సంపాద్యముగా తన ప్రత్యేకమైన సొత్తుగా ఆయనకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పినట్లుగా, ఆయన వారి పాపములను బట్టి వారిని కొట్టివేయక, తన మాటకు కట్టుబడి యున్నాడని చెప్పడం నిజముగా గొప్ప ఓదార్పే, సువర్తమానమే.
3
యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. మెస్సీయ సందేశాన్ని విని దానిని నమ్మిన వారిని “నీతి అను మస్తకివృక్షములని” పిలుస్తారు. ప్రాచీన ప్రపంచంలోని మస్తకివృక్షము బలమైన మన్నికైన ఆకురాల్చే చెట్టు. లేఖనాలు విశ్వాసులను అలాంటి చెట్లుగా చెప్తున్నాయి. మెస్సీయ సందేశాన్ని విని దానిని నమ్మిన వారు “నీతి అను మస్తకి వృక్షాలు” ఎందుకంటే వారు తమ మంచి పనులలో కాదు, మెస్సీయలో తమ నీతిని కనుగొంటారు. దేవుని నీతి వారికి బలాన్ని మరియు క్రొత్త జీవితాన్ని ఇస్తుంది. అలాగే ప్రభువు వారి కొరకు సమస్తమును చేసాడు. యెషయా దేవుని దీవెనలను పొందుకొనిన వారిని “యెహోవా తన మహిమను కనబరచుటకు ఆయన నాటిన చెట్లని” అని పిలుస్తున్నాడు అంటే ఇతరులు వారిని చూచి ఏమియు చెప్పజాలక, వీళ్ళు ప్రభువు ప్రేమ యందు నాటబడిన వారని, దేవుని ప్రేమ వారి జీవితాలలో మార్పును కలుగజేసియున్నదని, వీళ్ళు ప్రత్యేకమైన వారని వాళ్ళు చెప్పాలని అర్ధం.
సువార్త ప్రకటన కొంతమంది హృదయాలలో విశ్వాసాన్ని సృష్టిస్తుంది. మెస్సీయ సందేశాన్ని విని దానిని నమ్మిన వారు దేవుని పరిశుద్ధులు, ఈ లోకంలో నీతిమంతులు మరియు బలవంతులు. దేవుడు వారిని నీతిమంతులుగా ప్రకటించినందున మాత్రమే వారు బలంగా ఉన్నారు. దేవుని పరిశుద్ధులు ప్రభువు వాగ్దానాలపై పోషించబడ్డారు కాబట్టి వారు బలంగా ఎదిగారు. వారు గందరగోళం, హింస మరియు చెడు ప్రపంచంలో శాశ్వత వృక్షాలు.
భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. నాటబడిన ఒక విత్తనమువలె ఆయనే వారిని తిరిగి ఉజ్జీవింపజేస్తాడు. నాటబడిన విత్తనము మరణిస్తుంది, దానిని జీవింపచేసేది దేవుడే. మొక్కలను నాటినపుడు అవి ఎదిగి పుష్పించాలని ఎదురు చూస్తాము. దేవుని దీవెనలను పుచ్చుకొనిన ప్రజలు పుష్పించాలి. వాళ్ళు నీతిలోను దేవునిని స్తుతించుటలోను పుష్పించవలసి యున్నారు. దేవుడు వారి స్థితిని పరిస్థితిని మార్చియుండగా వాళ్ళు మౌనముగా ఉండకూడదు. భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయవలసియున్నారు. దేవుని నీతి అను వస్త్రములతో వాళ్ళు కప్పబడి యున్నారు. కాబట్టి కృపగల ప్రభువునకు గౌరవము తెచ్చు రీతిలో వాళ్ళు జీవించవలసియున్నారు. కాబట్టి ఇతరులు వారిని బట్టి వారి దేవునిని ప్రశంసించి, ఆ దేవునిని గూర్చి సాక్షమిచ్చేలా మనం కృతజ్జ్యతతో స్పందిద్దామ్.
వృక్షము బలమును స్థిరత్వమును సూచిస్తుంది. వృక్షము తరతరాలుగా ఎన్నో ఎదురు దెబ్బలు పెద్దపెద్ద తూఫానులను తట్టుకొని నిలబడుతుంది. దాని స్థిరత్వం ఓదార్పునిస్తుంది. దాని బలము ఇతరులకు నమ్మకాన్ని ఇస్తుంది. అలాగే ఇశ్రాయేలీయులు కూడా స్థిరమైన స్తంభాలుగా _ పిల్లర్స్ అఫ్ ది చర్చిగా ఉండాలని దేవుడు కోరుకొంటున్నాడు. ఇక్కడ వాడబడిన నీతి అనే మాట _సెడెక్_ వారు నైతిక ప్రవర్తన విషయములో నీతితో జీవించాలని, దేవుని ధర్మశాస్త్రము మరియు ఆయన చిత్తప్రకారము జీవించాలని తెలియజేస్తూవుంది. ఆయనచే నాటబడిన మొక్కలు ఆయనకు మాత్రమే మహిమను తేవలసివున్నాయి. యూదా ప్రజలు మట్టిగా ఉన్నారు వారిలో నుండి మెస్సయ్యా పుట్టబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవాకు నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేసాడు. ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని గుర్తించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
Hey very nice blog!