
పాత నిబంధన పాఠము: 2 రాజులు 5:1-14; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 9:24-27; సువార్త పాఠము: మార్కు 1:40-45; కీర్తన 32.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: 2 రాజులు 5:1-14
మన పాఠములో సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను ఒకడున్నాడు. అతడు మహాపరాక్రమశాలి. అతడు ఎన్నో యుద్ధములు గెలిపించియున్నాడు కాబట్టి తన రాజు దృష్టికి ఘనుడై దయపొందియున్నాడు. గాని అతడు కుష్ఠరోగి. అతడు ఎలా తన కుష్ఠురోగము నుండి బాగుపడియున్నాడో, అనారోగ్యము నుండి పరిపూర్ణమైన ఆరోగ్యమును ఎలా పుచ్చుకొని యున్నాడో, ఈ క్రమములో అసలు ఏమి జరిగింది, ఎక్కడికి వెళ్ళాడు, ఎలాంటి మందులు తీసుకొన్నాడు, ఎలా ఉన్నాడు, ఎవరు సహాయపడియున్నారు అనే విషయాలను గూర్చి మన పాఠము ఏమి చెప్తూవుందో తెలుసుకొందాం. ఈ పాఠము నేర్పిస్తున్న విషయాలను నేర్చుకొని మన జీవితాలను కూడా బాగుచేసుకొందాం.
దేవునిని గూర్చి ధైర్యముగా సాక్షమిద్దాం.
- సాక్షిగా ఇతరులలో విశ్వాసాన్ని రగిలిద్దాం 1-8
- ఆ విశ్వాసము ఇతరులలో కార్యకారి అగులాగున ప్రోత్సాహమిద్దాం 9-14
1
మొదటి వచనములో వివరించబడియున్న నయమాను సైన్యాధిపతి, పరాక్రమశాలి, ఎన్నో యుద్ధములు గెలిపించినవాడు, ఘనుడు, రాజుచేత దయనొందినవాడు, ఈ మాటలు నయమాను ఆ రోజుల్లో ఒక శక్తివంతమైన వ్యక్తి అని చాల గొప్ప వ్యక్తి అని, అతడు మంచి స్థితిని, హోదాను, గౌరవాన్ని, సమాజములో ఎన్నో ప్రశంసలను (మెడల్స్ను) కలిగి ఆ సమాజములో రాజ్యములో ఉన్నతమైన వ్యక్తులతో సంబంధాలను కలిగి ఉన్నవాడని రాజ్యములో శక్తివంతమైన అధికారము కలిగిన వ్యక్తులలో ఒకడని చెప్తూవుంది. ఇంత గొప్ప వ్యక్తి కుష్ఠు వ్యాధి రోగగ్రస్తుడు. ఆ రోజుల్లో కుష్టు వ్యాధి ఒక ప్రాణాంతకమైన వ్యాధి. నయమాను గొప్పవాడే కావొచ్చు కాని అతని గొప్పతనము అతనికి సహాయపడలేనిదిగా ఉంది. నిజం చెప్పాలంటే, అతడు నెమ్మదిగా బాధాకరమైన మరణానికి దగ్గరవుతూ ఉన్నాడు, అంతేనా ఒకరోజు అతని కుష్ఠురోగాన్నిబట్టి అతడు ప్రజా జీవితం నుండి వైదొలగాల్సి ఉన్నాడు_ తన అధికారాన్ని పదవిని వదులుకోవాల్సి ఉన్నాడు, చివరికి అతడు తాను ప్రేమించిన వారందరి నుండి కుటుంబం నుండి వేరుచేయబడి వెలివేయబడిన ఒక వ్యక్తిగా ఊరికి బయట ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకవలసి ఉన్నాడు.
ఈ వచనము తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన సత్యములు_ మొదటిగా, క్షయమైన శరీరము యొక్క దుర్బలత్వమును చూడండి. పాపము ఈ లోకములోనికి వస్తూ తనతో తెచ్చిన రోగము అందుకు కారణమైన పాపేచ్ఛలను చూడండి. ఎంతటి వారైనను వారు స్వతంత్రించుకొనియున్న పాపమును బట్టి దాని ఉచ్చులకు చిక్కుకొనియున్నారనే సంగతి మరచిపోకండి.
చరిత్ర అంతటా సరిహద్దు వివాదాలు సాధారణం. సిరియనులు ఇశ్రాయేలు సరిహద్దు కూడా వివాదాస్పదమైన ఒక సరిహద్దు. తరచుగా ఇరువురికి సరిహద్దులలో గొడవలు జరుగుతూ ఉండెడివి. అలాంటి ఒక దాడిలోనే ఇశ్రాయేలీయుల చిన్నది ఒకతె బందీగా పట్టుకోబడింది. ఈ చిన్నదానిని గురించి మనకేమి తెలియదు, ఆమె పేరు కూడా తెలియదు. ఆ సరిహద్దు గొడవలో ఆ చిన్నదాని తలితండ్రులు చనిపోయివుండొచ్చు. లేదా సైనికచర్యలో భాగముగా ఆ చిన్నది సైనికుల చేతికి చిక్కి వుండొచ్చు లేదా సైనికుల ఉల్లాసముకొరకు ఆ చిన్నది చెరపట్టబడి ఉండొచ్చు లేదా ఆ సైనిక గొడవలో ఆ కుటుంబ మంతయు చెరపట్టబడియుండొచ్చు మనకు తెలియదు. ఈ చిన్నదాని దురదృష్టాన్ని బట్టి ఎవరిని నిందిద్దాం. ఏదేమైనా బందీగా పట్టబడియున్న ఆ చిన్నది ఆమె తన తలితండ్రులకు స్వకీయస్థులకు తన స్వదేశమునకు తన దేవుని మందిరమునకు దూరము చెయ్యబడింది. తనకున్న ప్రతి హక్కును కోల్పోయింది. దాస్యములో పరాయి దేశములో తనకు పరిచయము లేని జనుల మధ్య కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అని 2 వచనము తెలియజేస్తూ ఉంది.
ఈ వచనము తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన సత్యములు_ మొదటిగా, దురదృష్టము మన స్థితిని పరిస్థితిని మార్చివేసి నప్పటికిని దేవునిలో విశ్వాసాన్ని కోల్పోని ఆ చిన్నది తన కివ్వబడిన పనిలో నమ్మకముగా ఉండటమే కాకుండా తానున్న స్థితిలో తన యజమానురాలితో సంభాషించేంత దగ్గరగా వెళ్ళింది. తన యజమానురాలి దయను సంపాదించుకోగలిగింది.
అంతేనా, ఈ చిన్నది తన యజమాని ఇంటిలో అంతా సవ్యముగా లేదనే విషయాన్నీ తెలుసుకొని తన యజమానురాలితో సంభాషిస్తూ_ షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్టురోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను అని 3 వచనము తెలియజేస్తూ ఉంది. అంటే, ఆ చిన్నది వారి భాదను అర్ధం చేసుకొంది. తాను సహాయపడగలనని ఆమెకు తెలుసు. కాబట్టే కనికరముతో పరిష్కారాన్ని చెప్పింది. అంతేకాని వాళ్ళు తనకు కలిగించిన నష్టాన్నిబట్టి వారిపై కోపముంచుకొని ఆ కోపములో తన యజమానికి కీడు జరగాలని ఆమె ఆశపడుతూ ఆమె మౌనముగా ఊరుకోలేదు. నా యజమానుడు బాగుండాలని నేనెంతో ఆశపడుతూవున్నాను అని ఆమె తన మనోగతాన్ని స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. మనమైతే మౌనముగా ఉండేవాళ్ళం.
ఇక్కడ ఆ చిన్నది తన విశ్వాసాన్ని ఎంత చక్కగా తెలియజేస్తూ ఉందొ చూడండి, ఆమె మాటలలో విశ్వాసము ఎక్కడ ఉంది అని అనుకొంటున్నారా? ఆలోచించండి. ఈ చిన్నది దేవుడేంత పెద్ద వాడో తెలియజేస్తున్న మాటలు ఇవి. ఆమె మాటల ద్వారా ఆమె మనసును చూద్దాం: ఆ చిన్నది షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్టురోగమును బాగు చేయునని చెప్పింది కదా. ఆమె ఏమి చెప్తుందో తెలుసా? నా దేవుడు నయం చేస్తాడు అని చెప్తుంది ఈ మాటలలో ఆమె విశ్వాసంతో నా దేవుడు ఇశ్రాయేలీయుడు కాని నా యజమానిని అంటే అన్యుడును ఇశ్రాయేలీయులకు శత్రువైన నా యజమానిని నయంచేస్తాడు అని అంటూవుంది. అంటే నా దేవుడు అందరికి దేవుడు తనను ఆశ్రయించే వారిని త్రోసివేయని దేవుడు అని చెప్తూ ఆయన కనికరానికి యోగ్యత, జాతి, బేధాలు ఏవి లేవని ఆయన నా యజమానిని తప్పక నయం చేస్తాడు అని నిశ్చయతతో చెప్పింది. ఆమె ఇంత నిశ్చయతతో చెప్తుందంటే ఆమె ఆత్మీయముగా దేవునిలో ఎంతగా ఎదిగివున్నదో ఆలోచించండి. దేవుని గూర్చి తాను విన్న ప్రతి మాట, కధ ఆ చిన్నదానిలో ఎంతటి విశ్వాసమును కలిగించి ఉన్నవో గుర్తించండి. ఆ చిన్నది ఒక విశ్వాసిగా వారిలో విశ్వాసమును నమ్మకాన్ని ఎలా రగిలించిందో చూడండి.
అంతేనా ఆ చిన్నది లీడింగ్ తీసుకోవడం చూడండి, వినయపూర్వకమైన ఆ చిన్నదాని యొక్క బలాన్ని గుర్తించండి, అలాగే ఆ చిన్నదాని నిశ్చయత ఇతరులకెంత బలాన్ని ఇచ్చ్చిందో గమనించండి. దేవుని యెదుట ధైర్యముగల చిన్నదిగా దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఇతరులు తన విశ్వాసమునందు పాలివారగుట అనునది కార్యకారికావలెనని ఆశపడుతుండుటను గుర్తించవలసి ఉన్నాం.
ఈ వచనము తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన సత్యములు_ మొదటిగా, మన పిల్లలతో మనం సమయాన్ని దేవుని వాక్యంతో గడుపుతున్నామా? దేవుని కథలను వాళ్ళకి చెప్పటం ద్వారా వాళ్లలో మంచి పునాది వేస్తున్నామా? పిల్లల హృదయాల్లో దేవుని వాక్యాన్ని నిక్షిప్తం చేస్తున్నామా? వాళ్ళకి లీడింగ్ ఎలా తీసుకోవాలో నేర్పించవలసి వున్నాం. అలాగే వినయాన్ని నేర్పించవలసి వున్నాం. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నట్లుగా జీవితం ఉండక పోతే వాళ్లు కృంగిపోకుండా దేవునిలో విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని వాక్యమనే పునాదుల మీద వారిని కట్టవలసి ఉన్నాం. అలాగే మన పిల్లలకు దేవుని వాగ్దానాలు ఎప్పుడు అవసరపడతాయో మనకు తెలియదు. కాబట్టి మన పిల్లలను ఆత్మీయముగా దేవునిలో పెంచవలసి ఉన్నాం. రెండవదిగా, మన శత్రువులను గురించి మనకు అన్యాయము చేసిన వారిని గురించి మనము ప్రార్ధించవలసి ఉన్నాం. వారి కష్టములో వారికి సహాయపడవలసి ఉన్నాం. వీటిని మన పిల్లలకు నేర్పించవలసి ఉన్నాం.
4-7_ ఆ చిన్నదాని మాటలను దాని యజమానురాలు సీరియస్ గా తీసుకోవడమే కాకుండా తన భర్త అయిన నయమాను కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రయత్నించమని ప్రోత్సహించిoది. అలా ప్రోత్సహించా లంటే ఆ చిన్నది తన దేవుని శక్తిని గురించి ఆయన సేవకుడైన ప్రవక్తను గురించి ఎంత చక్కగా చెప్పి యుండాలో కదా.
అంతేనా ఆ చిన్నదాని మాటలను పట్టుకొని నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేశాడు. అప్పుడు సిరియా రాజు అధికారపూర్వకముగా ఈ విషయములో ఇశ్రాయేలు రాజునకు లెటర్ వ్రాస్తూ _నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయ వలెనని లెటర్ వ్రాసి ఈ విషయములో సహాయము చెయ్యమని అడగటమే కాకుండా ఈ విషయములో బాధ్యతను కూడా తీసుకోవాలనే ఉద్దేశ్యములో ఇశ్రాయేలు రాజునకు బహుమతులను నయమాను చేత పంపించాడు. సిరియా రాజు ఈ విషయములో ఎంత సీరియస్ గా ఉన్నాడో ఆ లెటర్ తెలియజేస్తూ ఉంది, అలాగే వచ్చినవాడు పరాక్రమశాలి అయిన నయమాను, వాళ్ళ తంత్రమెంటో అర్ధంకాక ఇశ్రాయేలు రాజుకు అభద్రతా భావము కలిగింది. ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని– చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడి అని అనడంలో ఆ అభద్రతా భావాన్ని మనం చూడగలం.
ఇశ్రాయేలు రాజు ఈ విషయములో దేవునిని వేడుకోలేదు సరికదా ఈ విషయములో దేవుని చిత్తమును ప్రవక్త ద్వారా తెలుసుకొనుటకు ప్రయత్నించలేదు కూడా.
ఎందుకంటే ఒక దేశ సర్వసైన్యాధక్ష్యుడు మరొక దేశాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ లెటర్ చాల టెన్షన్ create చేసింది. ఎంతగా అంటే ఒక దేశానికి రాజు, దేవుని చేత రాజుగా ఉండుటకు అభిషేకింపబడినవాడు టెన్షన్ పడి తన వస్త్రములను చింపుకొనుట ద్వారా తనను తాను అవమానపరచుకోనేటంతగా. ఏమి లేనిదానికి టెన్షన్ పడి బట్టలు చింపుకొని హైపర్ టెన్షన్ తెచ్చుకొనేటంతగా.
ఎందుకని ఇంత టెన్షన్ పడ్డాడో ఊహించగలరా? ఏమి లేనిదానికి అని నేను ఎందుకని అంటున్నానంటే, నిజానికి, సిరియా రాజు పంపించిన లెటర్లో డీటెయిల్స్ లేవండి. అంటే ఆ చిన్నది చెప్పిన మాటలు, అసలు నయమాను వచ్చినది ప్రవక్తను కలవడానికి అనే విషయం ఇవేమి ఆ లెటర్లో లేవండి. సిరియా రాజు ఏమను కొని ఉంటాడంటే, ఇశ్రాయేలులో దొరికే వైద్యం గురించి ఇశ్రాయేలు రాజుకు తెలిసివుంటుందని అతడు నయమానును సరియయిన డైరెక్షన్లో నడిపిస్తాడని అనుకోని డీటెయిల్స్ లెటర్లో ప్రస్తావించలేదు. ఇశ్రాయేలు రాజు కూడా నయమానును డీటెయిల్స్ అడగలేదు. చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? అసాధ్యమైన దానిని చెయ్యమని అడగడం ద్వారా సిరియా రాజు యుద్దానికి ప్రయత్నిస్తూ ఉన్నాడని ఇశ్రాయేలు రాజు అనుకొన్నాడు. ఇశ్రాయేలు రాజు నయమానుతో మాట్లాడలేదు. దౌత్యసంబంధముగా ఆ రోజు నయమానును రిసీవ్ చేసుకొన్న వాళ్ళు కూడా నయమాను ఎందుకని వచ్చాడో డీటెయిల్స్ అడగలేదు.
మనమందరం కూడా టెన్షన్ పార్టీస్ యే కదండి? నిజానికి ఎన్నో విషయాలు కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోతాయి, సమస్యలు పరిష్కారంఔతాయి, అంతేగాని మనం ఏవేవో ఊహించుకొని భయపడుతూ మన జీవితాలను మనం దుర్లభం చేసుకోవడమే కాకుండా మన చుట్టూ వున్నవారిని కూడా టెన్షన్ పెట్టడం సరియైనదేనా ఆలోచించండి.
8 ఇశ్రాయేలురాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు–నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని నిశ్చయతతో రాజునకు వర్తమానము చేసాడు. తప్ప ఇశ్రాయేలు దేవుడు నిన్ను స్వస్థపరచును గాక అని చెప్పమని లేదు.
రాజు ఈ విషయాన్ని నయమానుకు ఎలా తెలియజేసి ఉంటాడంటారు? మనకు చెప్పబడలేదు. కాని రాజు నాకంత శక్తి లేదు. ఎలిషా అతని సిబ్బంది వైద్యం చేసే బాధ్యత వహిస్తున్నారని తెల్పి నయమానును ప్రవక్త దగ్గరకు పంపించి వుండొచ్చు. ఇక్కడ సువార్తను చెప్పే అవకాశం రాజుకున్నను అతడు దానిని ఉపయోగించుకోలేదు, తప్పించుకున్నాడు.
2
9నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలబడ్డాడు. శత్రుదేశ సైన్యాధక్షుడు ప్రవక్తను రీచ్ అవ్వడానికి ఇశ్రాయేలు సైన్యములో పెద్దలు తోడుగా వచ్చి ఉండొచ్చు. పెద్ద కాన్వాయ్, ఎస్కార్ట్, ప్రోటోకాల్లో భాగముగా బందోబస్తు వెంబడించి ఉండొచ్చు కదా. ప్రజలు కూడా వాళ్ళందరిని భయముతో చూస్తువుండొచ్చు. ఏం జరగబోతుందో తెలియక దేవా దయ చూపుమని ప్రార్ధిస్తూ వుండొచ్చు. ఎలీషా ఆ గుర్రాలు రథాలు సైన్యము పెద్దలు వీళ్ళెవ్వరిని పట్టించుకోలేదు. అసలు బయటికే రాలేదు. తలుపు దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడలేదు.
ఎందుకని ఎలీషా బయటికి రాలేదు? నయమాను ఏమి ఎదురుచూసి ఉండొచ్చు చెప్పండి. ఎలీషా బయటికి వచ్చి తనపై చేతులు ఉంచి ప్రార్ధన చేస్తాడేమో అని అనుకోని ఉండొచ్చు. లేదా తనను బట్టి బలులు అర్పించి పూజలు చేస్తాడేమో అని అనుకోని ఉండొచ్చు. లేదా మరొక విధముగా తనకు వైద్యం చేస్తాడేమో అనుకోని సిద్దపడి వచ్చాడు.
10-14 అయితే ఎలీషా ఒక దూతను పంపి నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పమన్నాడు.
ఒక్కసారి అక్కడి పరిస్థితిని ఊహించండి. నయమానుకు చాల కోపం వచ్చిఉండొచ్చు. అవమానంగా ఫీల్ అయ్యివుండొచ్చు. కోపములో అతని చెయ్యి కత్తి మీదికి వెళ్లి ఉండొచ్చు. నయమాను తన దేశములో ఒక నిర్ణయాత్మకమైన శక్తి. అతనితో మాట్లాడడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో వస్తూవుంటారు. అతనితో మాట్లాడడానికి ఎందరో ఎదురు చూస్తూవుంటారు. అలాంటిది ఇక్కడ పరిస్థితి తారుమారుగా ఉంది. ఒక సేవకుడు వచ్చి ప్రవక్త మాటలను తెలియజేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి? తనతో వచ్చిన సైనికులు చూస్తూవున్నారు. అతని ముఖము కోపముతో ఎర్రబడి ఉండొచ్చు. నయమానుతో వచ్చిన ఇశ్రాయేలు పెద్దలు ఆ ఊరి జనాలు ఏమి జరుగుతుందో అని భయపడి ఉండొచ్చు. ఎలీషాను గూర్చి యేమని అనుకోని వుండచ్చొ ఒక్కసారో ఆలోచించండి. అసలు ఇతడు తన్ను గురించి ఏమనుకొంటున్నాడు? మా అందరి ప్రాణాలను ఇరుకునపెట్టాడు? అని అనుకోని ఉండొచ్చు కదా. చోద్యం కాకపోతే యొర్దానులో మునిగితే కుష్ఠు పోతుందా? మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. యొర్దానులో దిగి స్వస్థపడిన వాడు ఇప్పటి వరకు లేడు, దేవుడా అని అనుకోని ఉండొచ్చు.
యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువను మాటలలో ఎలీషా ఏమి చెప్తున్నాడో అర్ధం అయ్యిందా. ఎలీషా రోగిని చూడకుండానే, పరీక్షించకుండానే తన ప్రిస్క్రిప్షన్ లో నయమాను నువ్వు ఏడు మారులు యొర్దానులో మునిగితే నీలో ఉన్న కుష్ఠువ్యాధి తన పురోగతిని కోల్పోవడమే కాకుండా ఆ కుష్ఠురోగము అప్పటివరకు నీలో పాడు చేసిన ప్రతి భాగము మరల బాగౌతుంది ఇక నీకు కుష్ఠు ఉండదు అని చెప్తున్నాడు.
దేవుని ప్రవక్త రాకపోవడానికి కారణం ఉండొచ్చు. ఎందుకంటే నయమాను కొన్నింటిని అధిగమించవలసి ఉన్నాడు. కొన్నిటిని నేర్చుకోవలసి ఉన్నాడు. కాబట్టే ఎలీషా అతనికి కొన్ని పాఠాలను నేర్పిస్తువున్నాడు. పాఠాలు కష్టముగా వున్నాయి. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే మనుషులను అదృష్టము నుండి విజయము నుండి విడుదల నుండి దూరపరుస్తాయి. నిజం చెప్పాలంటే పరిపూర్ణమైన స్వస్థతకు కొద్దీ దూరములో నయమాను ఉన్నాడు. ఆ కొద్దీ దూరాన్ని దాటడానికి అతడు వినయమును విధేయతను తగ్గింపును నేర్చుకోవలసి ఉన్నాడు. దేవుని మాటలలో నమ్మకమును వుంచవలసి ఉన్నాడు. యొర్దానులో నీరు పరిశుద్ధమైనదేం కాదు కాని విశ్వాసముతో అందులో మునగవలసి ఉన్నాడు. ఇక్కడ నీరు ప్రాముఖ్యము కాదు దేవుని మాటకు విధేయత చూపడం ముఖ్యం, నువ్వు ఎంత గొప్పవాడవైనను సరే,
యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని నయమానుకు చెప్పబడింది. ఈ మాటలలో అంతర్లీనంగా ఉన్న అర్ధం, ఇవి నా మాటలు కావు నీ పక్షమున నేను దేవుడైన యెహోవాను అడుగగా లేదా యెహోవా ఆయనే ఇట్లు చెప్పుమని నీ విషయములో నాకు తెలియజేసి యున్నాడు. నువ్వు దేవుని చిత్తానికి విధేయుడవైతే స్వస్థత దొరుకుతుంది, నీ ఇష్టం, ఇందులో నా పాత్రేమీ లేదు అనే కదా ప్రవక్త చెప్తున్నాడు. అందుకే ప్రవక్త దూరముగా వుండిపోయాడు. మహిమను దేవునికిచ్చాడు. నయమానుకు ఈ మాటలు అర్ధం కాలేదండి. విశ్వాసముతో అడుగు ముందుకు వెయ్యడం నయమానుకు చాల కష్టముగా ఉంది. నయమాను హోదా పరపతిని ప్రక్కన పెట్టి విశ్వాసముతో అడుగు వెయ్యవలసి ఉన్నాడు. నయమానుకు కోపము వచ్చింది, అతని గర్వము, అహంకారము, జ్ఞానము, హోదా పరపతి అతనిని వెనుకకు లాగుతూవున్నాయి. కోపములో విచక్షణ కోల్పోయే ప్రమాదముంది. కోపము ప్రమాధికారి. నయమాను ఇష్టపడే కదా అంత దూరం వచ్చాడు.
కాని బహిరంగముగా జరిగిన ఈ అవమానానికి నయమాను ఎలా ప్రతిస్పందిస్తాడు? ఎలాంటి ఆజ్జ్యలను జారీ చేస్తాడు అని అతనితో వచ్చిన వాళ్ళు సిద్దపడి రెడీగా ఉండొచ్చు. అతడు ప్రవక్త అయిన ఎలీషా మీద దాడి చెయ్యమని చెప్తాడా? లేదా ప్రవక్త మాటలను నయమనుకు తెలిపిన గేహజీని చంపమని చెప్తాడా? ఏం జరగ బోతుంది? నయమాను కోపము తెచ్చుకొని రౌద్రుడై తిరిగి వెళ్లి పోతుండగా, అతని దాసులలో ఒకడు వచ్చి–నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని చెప్తే మీరు చేసివుండేవారు కదా చెయ్యకుండా ఉంటారా? ప్రవక్త ఏం చెప్పాడు, స్నానముచేసి శుద్ధుడవు కమ్మని చిన్న పనే కదా అతడు చెప్పింది, మంచిదే కదా అని చెప్పినప్పుడు, అతడు ఆలోచించాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకొన్నాడు, విచక్షణను కోల్పోకుండా, పరిస్థితులను కష్టము చేసుకోకుండా తన తప్పును తెలుసుకొని విధేయత చూపుతూ యొర్దానుకు వెళ్ళాడు.
పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడయ్యాడు. స్వస్థతను పొందుకొన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కధలో మనము నేర్చుకోవాల్సిన సరిదిద్దుకోవాల్సిన ఎన్నో విషయాలు వున్నాయి. ఈ కథను మనము ఎన్నోసార్లు ఆలకించియుండొచ్చు. కాని మరొకసారి మన దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఆలకించివున్నాము. మనలను మనం సరిదిద్దుకొందాం. సరిదిద్దుటకు దేవునికి అవకాశమును ఇద్దాం. బాగుపడడానికి నేను ఏమి చెయ్యాలో చెప్పండి అని అంటూవుంటాం. మీరు ఏమి చెయ్యనక్కర లేదు క్రీస్తు నందు విశ్వాసముంచండి చాలు అంటే ప్రజలు అసహనంతో కోపగించుకొని వెళ్లిపోతూఉన్నారు. ఒక్క క్షణము ఆగండి, మీరు బాగుపడుటకు యేసునందు విశ్వాసముంచండి. విశ్వాసముతో జీవించండి. చాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl