చర్చి యానివర్సరీ ప్రసంగము
ఈ ఉదయకాలమున, ప్రత్యేకముగా కూడుకొన్న దేవుని ప్రియమైన కుటుంబ సభ్యులందరికి నా ధన్యవాదములు. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. దేవుడు తన జ్ఞపకార్ధముగా కట్టించుకున్న ఈ మందిరాన్ని బట్టి, 25 సంవత్సరా -లుగా ఈ మందిరంపట్ల దేవుడు చూపించుచున్న కృపను బట్టి, దేవునికి కృతజ్ఞత స్తుతులను చెల్లించడానికి, మనమందరం ఇక్కడ సమావేశమయ్యాము. 25 సంవత్సరాలుగా, దేవుడు ఈ సంఘాన్ని నడిపిస్తూవున్నాడు, ప్రజలను రక్షిస్తూనేవున్నాడు, ఆశీర్వదిస్తూనేవున్నాడు.
గత 25 సంవత్సరాలను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడమే కాకుండా, ప్రతి విజయం, ప్రతి పరిచర్య మరియు ప్రతి సేవా ప్రయత్నం వెనుక దేవుని హస్తముందని గుర్తుంచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కీర్తనలు 100:5 యేమని చెప్తూవుందంటే, “యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన (విశ్వాస్యత) తరతరములుండునని” మనకు గుర్తుచేస్తుంది.
అంశం: మార్పులేని దేవుని విశ్వాస్యతను పండుగగా జరుపుకొందాం
1. యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును మార్పులేని దేవుని విశ్వాస్యతను గురించి, విలాప వాక్యములు 3:23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని చెప్తూవుంది.
25 సంవత్సరాల క్రితం దేవుడు ఈ మందిరాన్ని ఉనికిలోకి తెచ్చినప్పుడు, —తన నామం మహిమపరచబడే ఈ ప్రదేశాన్ని గురించి మరియు తన ప్రజలు విశ్వాసంలో పెంచబడే ఈ ప్రదేశాన్ని గురించి ఆయన కొక ఉద్దేశ్యముంది. ఆ ఉద్దేశ్యాన్ని గురించి నిర్గమకాండము 20:24 చెప్తూ, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని తెలియజేస్తూ ఉంది. ఈ మాటలకు అర్ధం, ఆయన తన జ్ఞాపకార్థముగా ఈ స్థలమును ఎన్నుకున్నాడని, మీ అందరి నివాస స్థలముల యొక్క పొలిమేరలను స్థిరపరచి మీ మధ్యలో ఆయన తన కొరకు మందిరమును కట్టించి తన నామమును అందుంచి మీరందరు ఆశీర్వదింపబడు లగున దీనిని ప్రతిష్టించాడు. అనుదినము నూతనముగా ఆయనకు మనుష్యుల పట్ల పుట్టుచున్న వాత్సల్యతే కారణం. ఈ మందిరం ఏర్పడడం అనేది మానవ ఆలోచన కాదు ఇది దేవుని ప్రణాళికలో భాగం. ఈ స్థలంను గురించి దేవుని ఉద్దేశ్యం: ఆయన నామం గౌరవించబడటం, ఆయన వాక్యం బోధించబడటం, ఆయన ప్రజలు పోషించబడటం మరియు ఆయన ప్రేమను సమాజంతో పంచుకోవాలనేది దేవుని వుద్దేశ్యం. ఆయన ఆలోచన యొక్క నెరవేర్పే ఈ మందిరం.
ద్వితీ.కాం. 7:9, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరముల వరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు, …నీవు తెలిసికొనవలెను, అని చెప్తూవుంది. ఆయన ఈ మందిరాన్ని ఉనికిలోకి తెచ్చినప్పటి నుండి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనుచున్న మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు, నడిపిస్తునే ఉన్నాడు. ఈ 25 సంవత్సరాలలో, మీ ఈ ప్రయాణం సులభమైనదేం కాదు. ఆర్థిక ఒత్తిడిలు, అనిశ్చితి క్షణాలు, నాయకత్వ మార్పులు మరియు సామాజిక సాంస్కృతిక మార్పుల వల్ల కలిగిన అనేక సవాళ్లు ఉన్నాయి. ఎదురైన ప్రతి సవాలులో – ఆయన వారు, ఆయన ప్రజలు, ఆయన మేపు గొఱ్ఱెలైన మీకు ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ఈ మందిరాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన మీ అవసరాలను తీర్చాడు. అలసిపోయిన మీ హృదయాలను బలపరిచాడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేసి (1 యోహాను 1:9) మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాడు. ప్రతి కాలంలో – మీకు జరిగిన మేలులలో లేదా కష్టంలో – మారని దేవుడు మీ పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించి వచ్చిన వారందరిని ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.
ఉదాహరణగా: నది ఒడ్డున నాటబడిన ఒక చెట్టును గురించి ఆలోచించండి. దానిని మొదట నాటినప్పుడు, అది చిన్నదిగా బలహీనంగా ఉండొచ్చు. 25 సంవత్సరాలకు పైగా, అది బలంగా పెరిగిందనుకోండి, దాని వేర్లు నీటి దగ్గర ఉన్నందున, అది మనుగడ సాగిస్తూ బలంగా పెరిగింది అని చెప్తాము. దానర్ధం దాని వేర్లు లోతుగా పాతుకుపోయాయనేగా. అదే విధంగా, దేవుడు తన వాక్యం యొక్క జీవజలం సమృద్ధిగా ఉన్న స్థలంలో ఆయన ప్రణాళిక ప్రాకరమైన ఈ మందిరములో ఆయన మిమ్మల్నందరిని నాటాడు. ఈ మందిరం యొక్క వేర్లు విశ్వాసం, ప్రార్థన మరియు విధేయతలో లోతుగా పెరిగాయి. దానికి రుజువుగా ఈ 25 సంవత్సరాలలో ఈ సంఘానికి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి ఉండొచ్చు ఎన్నో గాయాలు అయ్యుండొచ్చు. ఎన్నో భయంకరమైన తుఫానులను ఇది ఎదుర్కొని ఉండొచ్చు. దీని కొన్ని కొమ్మలు విరిగిపోయి ఉండొచ్చు. కానీ ఇది చాలా ఫలాలను ఇచ్చింది. నేడు, మనం ఈ సంఘ ఫలాలను చూస్తున్నాము – దేవుని వాక్యాన్ని బట్టి మారిన సంఘ సభ్యుల జీవితాలలో, బాప్తిస్మాలలో, కుటుంబాలు పునరుద్ధరించబడటంలో మరియు దేవుని ప్రేమతో తాకబడిన సమాజంపై దాని ప్రభావంలో మనం ఆ ఫలాలను చూస్తున్నాము.
కాబట్టి ఈ వేడుకలో తన వాత్సల్యములో తన జ్ఞాపకార్థముగా ఉంచిన ఈ మందిరాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేద్దామ్. తన వాత్సల్యములో, ఆయన ఉపయోగించిన ప్రజలను కూడా మనం గౌరవిద్దాము. విశ్వాసంతో అడుగుపెట్టిన స్థాపకులు, వినయంతో సేవ చేసిన నాయకులు, కష్ట సమయాల్లో దేవునికి మొరపెట్టిన ప్రార్థన యోధులు మరియు కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇచ్చిన, సేవ చేసిన మరియు కట్టుబడి ఉన్న నమ్మకమైన సభ్యులు ఈ మందిరానికి ఉండటం మెచ్చుకోదగిన అంశం.
2. ఈ మందిరము ద్వారా కలిగిన జీవితాల పరివర్తనను బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దామ్.
దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల మధ్య నివసించాలని కోరుకున్నాడు. ఆది నుండి, దేవుడు మనుష్యులకు దూరంగా ఉండటానికి ఇష్టపడలేదు – ఆయన వారికి దగ్గరగానే ఉండటానికే ఇష్టపడాడు. నిర్గమకాండము 25:8లో, దేవుడు, “నేను వారి మధ్యలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను” అని చెప్పాడు. ఈ వచనం దేవుని హృదయం ఎల్లప్పుడూ తన ప్రజలతో సంబంధాన్ని కోరుకొంటున్నటుగా తెలియజేస్తూ ఉంది. చర్చి అంటే కేవలం ఇటుకలు మరియు సిమెంట్ కాదు—అది విశ్వాసుల కుటుంబం. అంకితం చెయ్యబడిన ఈ మందిరం, దేవుని ప్రజలు ప్రార్థన, స్తుతి, ఆరాధనలో ఆయనను ఇక్కడ కలుసుకునే స్థలం. గత 25 సంవత్సరాలుగా, ఈ మందిరం ద్వారా లెక్కలేనన్ని జీవితాలు తాకబడ్డాయి, వివాహాలు పునరుద్ధరించ బడ్డాయి, యువత శిష్యులుగా మార్చబడ్డారు, పేదలకు సహాయం చేయబడింది, ఆత్మలు క్రీస్తు వద్దకు తీసుకురాబడ్డాయి. దేవునికే మహిమ కలుగును గాక.
ఒక మందిరం దాని గోడలు, దాని రూపకల్పన లేదా దాని పరిమాణం కారణంగా పవిత్రమైనది కాదు. కానీ దేవుని ప్రజలు నిజాయితీగల హృదయాలతో కలిసి వచ్చినప్పుడు అది పవిత్రంగా మారుతుంది. దేవుని ప్రజలు నిజాయితీగల హృదయాలతో సమావేశమైనప్పుడు, పరిశుద్ధాత్మ ఉనికి ఈ మందిరాన్ని నింపుతూ ఉంది. “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని” (మత్తయి 18:20) యేసు స్వయంగా వాగ్దానం చేశాడు. ఆరాధన అనేది ఒక కార్యక్రమం లేదా ప్రదర్శన కాదు; అది సజీవ దేవుని కలిసే ఒక స్థలం. ఆరాధన నిజమైనది అయినప్పుడు, దేవుడు మనల్ని ఇక్కడ కలుస్తాడు, పరిశుద్ధాత్మ కదులుతుంది, హృదయాలు తేలికపడతాయి, జీవితాలు మారుతాయి. కాబట్టి ఈ మందిరం దైవిక సమావేశం యొక్క ప్రదేశం.
ఉదాహరణకు, అరణ్యంలోని ప్రత్యక్షగుడారం గురించి ఆలోచించండి. దానిని ఎలా నిర్మించాలో, ఉపయోగించాలో అనే విషయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు చాలా నిర్దిష్టమైన సూచనలను ఇచ్చాడు. ఎందుకంటే ఆ గుడారం కేవలం ఒక గుడారం కాదు—అది స్వర్గం భూమిని కలిపే స్థలం. అది దేవుని సన్నిధి ప్రదేశం, ఆయన ప్రజలకు తన ఉనికిని వెల్లడించే స్థలం. దేవుని మహిమ వెల్లడి చేయబడే స్థలం. బలులు అర్పించే ప్రదేశం, ప్రార్థనలు వినబడే ప్రదేశం మరియు దేవుడు తన ప్రజలతో మాట్లాడే ప్రదేశం. దానిలోని ప్రతి భాగం దేవుని పవిత్రతను మరియు తన ప్రజల మధ్య నివసించాలనే ఆయన కోరికను సూచిస్తుంది.
అలాగే ఈ మందిరం యొక్క పరిచర్య ద్వారా జీవితం మార్చబడి— క్రీస్తులో నిరీక్షణను కనుగొని ఆశీర్వదింపబడిన ఒకరిని గురించి ఆలోచించండి. అటువంటి వారి ప్రతి కథ దేవుని ప్రేమకు సజీవ సాక్ష్యమై ఉంది. ఆరాధన అంటే పాటలు పాడటం మాత్రమే కాదు; అది మన హృదయాలను దేవునికి అర్పించడం. ఆరాధన అంటే దేవునికి పూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవడం అని రోమీయులు 12:1 మనకు గుర్తు చేస్తుంది. మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, నిజాయితీగా పాడినప్పుడు, విధేయతతో ఆయన వాక్యాన్ని విన్నప్పుడు మరియు పశ్చాత్తాపం మరియు నిబద్ధతతో వాక్యం పట్ల స్పందించినప్పుడు, దేవుడు జీవితాలను మారుస్తాడు.
2 కొరింథీయులు 5:17, “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను” అని మనకు గుర్తుచేస్తుంది. మందిరం యొక్క ప్రభావం మనుష్యులు చేసే కార్యక్రమాల ద్వారా కొలవబడదు, దేవునికి అంకితమైన మారిన జీవితాలు హృదయాల ద్వారా కొలవబడుతుంది. మన మందిరం నిజమైన ఆరాధనా స్థలంగా ఉండాలంటే, మనం దానిని కాపాడుకోవాలి. మనం ఐక్యతను కాపాడుకోవాలి, పవిత్రతను అనుసరించాలి మరియు క్రీస్తును మధ్యలో ఉంచాలి. కాబట్టి ఈ మందిరాన్ని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని స్వాగతించే, ఆయన నామాన్ని గౌరవించే మరియు జీవితాలు నిరంతరం మారే ప్రదేశంగా ఉండనివ్వండి.
3. దేవుని భవిష్యత్తు దర్శనానికి కట్టుబడి ఉండండి
గత 25 సంవత్సరాలుగా దేవుడు చేసిన వాటిని మనం వేడుకగా, జరుపుకొంటున్నాం సరే కానీ ఈ మందిరంలో దేవుని పని ఇంకా పూర్తికాలేదని గుర్తుంచుకోండి. దేవుడు ఈ చర్చిని ఇక్కడ ఒక ఉద్దేశ్యం కోసం ఉంచాడు – తన వెలుగును ప్రకాశింపజేయడానికి, కరుణతో సేవ చేయడానికి మరియు యేసుక్రీస్తు శుభవార్తను ప్రకటించడానికి. ఆయన పనిని నమ్మకంతో చేద్దాము. మన పాత్రను బాగా పూర్తి చేయడమే కాకుండా, తదుపరి తరానికి అందజేయడం కూడా మన బాధ్యత.
రాబోయే 25 సంవత్సరాలు మీ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడమే కాకుండా మీపిల్లలను మీ కుటుంబ సభ్యులను దేవుని యందలి విశ్వాసము లోనికి తీసుకురావల్సి ఉన్నారు, దేవుని సంఘ కార్యకలాపాలను విస్తరించవల్సి ఉన్నారుమరియు తదుపరి తరం నాయకులకు/ కుటుంబాలకు మార్గదర్శకత్వం వహించవలసి ఉన్నారు.
దీని అర్థం మీరందరు ప్రార్థనలో బలంగా పెరగడం, దేవుని వాక్యంలో మరింతగా స్థిరపడటం మరియు మన దైనందిన జీవితంలో మరింత విధేయత చూపడం, ఉదారంగా ఇవ్వడానికి మరియు నమ్మకంగా సేవ చేయడానికి కట్టుబడి ఉండటం. ఫిలిప్పీయులు 1:6 యేమని చెప్తూ ఉందంటే, “మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని” కాబట్టి ఆయన మహిమార్థమై ఆయన చేతిలో ఒక సాధనంగా ఒదిగిపోదాం. దేవుడు తనతో దగ్గరగా నడిచే ప్రజలను కోరుకుంటున్నాడు. అందుకై మీరు పిలువబడ్డారనే విషయాన్ని మర్చిపోకండి.
మన విశ్వాసం మన బలం మీద కాదు, దేవుని విశ్వాస్యత మీద ఆధారపడి ఉంది.
ముగింపు:
దేవుని విశ్వసనీయతకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ వేడుకలో, ఒక శక్తివంతమైన సత్యాన్ని మనం గుర్తు చేసుకొందాం : ఈ సంఘం దేవునిది. ఇది ఆయన పని, ఆయన ప్రణాళిక, మరియు ఆయన కృపే మనల్ని ఈ క్షణం వరకు నడిపించాయి. ఈ రోజు మనం జరుపుకుంటున్న ప్రతి ఆశీర్వాదం—మార్చబడిన ప్రతి జీవితం, జవాబివ్వబడిన ప్రతి ప్రార్థన, స్థాపించబడిన ప్రతి పరిచర్య—అన్నీ ఆయన ప్రేమగల హస్తం నుండే వచ్చాయి.
మొదటగా, గడిచిన కాలాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం మరియు ప్రతి కాలంలో ఈ సంఘాన్ని నిలబెట్టిన విశ్వాస్యతను గుర్తు చేసుకుందాం. దేవుడు నమ్మకంగా ఉన్నాడు, ఈ రోజు ఆయన మన స్తుతికి, కృతజ్ఞతకు అర్హుడు.
రెండవదిగా, వర్తమానంలో సంతోషిద్దాం. దేవుడు ఇప్పటికీ మన మధ్యలో పని చేస్తున్నాడు. ఆయన ఇప్పటికీ జీవితాలను రక్షిస్తున్నాడు, కుటుంబాలను బలపరుస్తున్నాడు, మరియు తన సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఈ రోజు కేవలం చరిత్రను జరుపుకోవడం కాదు—ఇది మన మధ్యలో దేవుడు ఇప్పుడు చేస్తున్న దానిని జరుపుకోవడం.
చివరగా, విశ్వాసంతో, నిరీక్షణతో భవిష్యత్తును దేవునికి అప్పగిద్దాం. 25 సంవత్సరాలు మనల్ని నడిపించిన అదే దేవుడు రాబోయే సంవత్సరాలలో కూడా మనల్ని నడిపిస్తాడు. ఆయనను విశ్వసిస్తూ, ఆయనకు సేవ చేస్తూ, ఆయన పిలుపుకు నమ్మకంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఆయన వాగ్దానాలపై నమ్మకంతో, దేవుని గొప్ప కార్యాలు ఇంకా ముందున్నాయని విశ్వసిస్తూ మనం భవిష్యత్తులోకి అడుగు పెట్టాలని ఆశిస్తూ, నిన్న, ఈ రోజు, మరియు నిరంతరం సమస్త మహిమ దేవునికే చెందును గాక. ఆమేన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
