
తండ్రియైన దేవునిని గురించి
బైబిల్లో దేవుడు “తండ్రి” అని అనేక ముఖ్యమైన వేదాంతపరమైన సంబంధ కారణాల వల్ల పిలువబడ్డాడు. ఈ శీర్షిక దేవుని స్వభావాన్ని, తన ప్రజలతో ఆయనకున్న సంబంధాన్ని మరియు సృష్టి మరియు రక్షణలో ఆయన పాత్రను వెల్లడించడానికి సహాయపడుతుంది.
దేవుడు, “తండ్రియైన దేవుడు” అనే బిరుదును ఎంత కాలం నుండి కలిగియున్నాడు? కీర్తనలు 90:2.
తండ్రియైన దేవుడు, త్రిత్వములోని మొదటి వ్యక్తిగా, ఆయన శాశ్వతుడు సృష్టించబడని వాడు, మార్పులేని దేవుడు, టైంకి స్థల పరిమితులకు అతీతుడు. దేవుడు శాశ్వతమైన తండ్రి అనే భావన బైబిల్ అంతటా కనిపిస్తుంది. ఇది ఆయన మారని స్వభావాన్ని, ఆయన సర్వశక్తిని మరియు ఆయన పాత్రను వక్కాణిస్తుంది. ఆయన సృష్టికర్త మరియు అన్నింటిని సంరక్షిస్తూ ఉన్నవాడు.
కీర్తనలు 90:2, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు అని ప్రకటిస్తుంది. ఈ వచనము తండ్రియైన దేవుని యొక్క శాశ్వతమైన స్వభావాన్ని హైలైట్ చేస్తూ ఆయన సృష్టికి ముందు ఉనికిలో ఉన్నాడని మరియు శాశ్వతత్వం అంతటా కొనసాగుతూ ఉన్నాడని తెలియజేస్తుంది.
సృష్టికర్తగా తండ్రి అయిన దేవుడు : దేవుడు అన్నిటికీ మూలం మరియు సృష్టికర్త కాబట్టి ఆయన “తండ్రి” అని పిలవబడ్డాడు. మలాకీ 2:10 – మనకందరికి తండ్రి యొక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా?. తండ్రిగా, దేవుడు జీవాన్ని ఇచ్చాడు, ప్రపంచాన్ని పోషిస్తున్నాడు మరియు తన సృష్టిని జాగ్రత్తగా చూసుకొంటున్నాడు. ఇది అన్నింటిపై దేవుని అధికారాన్ని యాజమాన్యాన్ని నొక్కి చెబుతుంది.
క్రైస్తవ వేదాంతశాస్త్రంలో, దేవుని పితృత్వం అనేది ఆయన స్వభావంలో చాలా ముఖ్యమైన అంశం. అది ఆయన సంరక్షణను, ప్రేమను, ఆయనకు సృష్టితో గల సంబంధాన్ని వెల్లడిస్తుంది. శాశ్వతమైన తండ్రిగా, ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ ఉంటాడు. పరిమితమైన జీవులుగా మన అవగాహనను పరిమితం చేసే టైం, స్థల పరిమితులకు ఆయన అతీతుడు.
తండ్రియైన దేవుని యొక్క శాశ్వతమైన ఉనికిని విశ్వసించడం అనేది ఆయన అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని మరియు శాశ్వతత్వాన్ని వక్కాణించడమే. అది విశ్వాసులకు ఆదరణ, భద్రత మరియు నిరీక్షణకు మూలముగా ఉంది. కాలం గడిచినా లేదా మారుతున్న పరిస్థితులతో సంబంధం లేకుండా, తండ్రియైన దేవుడు నిన్న, నేడు మరియు ఎప్పటికీ, మన నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని మనం ఉంచగల బలమైన పునాదిగా ఒకేలా ఉంటాడు.
పాత నిబంధనలో, దేవుడు తనను తాను ఇశ్రాయేలుకు తండ్రిగా పిలుచుకొన్నాడు — వారిని ఎన్నుకొని, విమోచించి సంరక్షిస్తున్న వ్యక్తిగా. నిర్గమకాండము 4:22-23, అప్పుడు నీవు ఫరోతో–ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు; నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంపనొల్లని యెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. ద్వితీయోపదేశకాండము 32:6, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. యెషయా 63:16, మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మా తండ్రివి అనాదికాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. ఇది ఆయన ఏర్పరచుకొన్న ప్రజలతో ఆయనకున్న ప్రత్యేక సంబంధాన్ని చూపిస్తుంది.
కొత్త నిబంధనలో, యేసు పదే పదే దేవుడిని తన తండ్రిగా పేర్కొంటూ, వారి ప్రత్యేకమైన దైవిక సంబంధాన్ని వ్యక్తపరిచాడు. గలతీయులకు 4:4-6, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; మత్తయి 3:17, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యోహాను 10:30, నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. తండ్రియైన దేవుడు మరియు కుమారుడైన యేసు మధ్య సంబంధం శాశ్వతమైనది, ప్రేమగలది మరియు త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కేంద్రమైనది.
ఆయన క్రీస్తు ద్వారా విశ్వాసులందరికి తండ్రియై ఉన్నాడు కాబట్టే ఆయన తండ్రి అని పిలవబడుతూ ఉన్నాడు. యేసు నందు విశ్వాసము ద్వారా, క్రైస్తవులు దేవుని కుటుంబంలోకి దత్తత తీసుకోబడ్డారు మరియు ఆయనను తండ్రి అని పిలుచుచున్నారు. యోహాను 1:12, తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. గలతీయులు 3:26, యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని పిల్లలై యున్నారు. రోమా 8:15 – మీరు దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము–అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము. గలతీయులకు 4:6, మీరు కుమారులై యున్నందున– నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇది మన ప్రేమగల తండ్రిగా దేవునితో మనకున్న సన్నిహిత, నమ్మకమైన మరియు సురక్షితమైన సంబంధాన్ని చూపిస్తుంది.
యోహాను 20:17, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొన వద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి– నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను – యోహాను 20:27లో యేసు తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. యేసు శిలువ వేయబడడానికి ముందు శిష్యులను సిద్ధం చేస్తున్నప్పుడు ఆయన వారిని తన స్నేహితులుగా పిలిచాడు (యోహాను 15:14,15). ఇప్పుడు ఆయన వారిని ఇక్కడ తన సోదరులు అని పిలిచాడు. ఆయన తన ఆరోహణ కోసం వారిని సిద్ధం చేస్తున్నాడు. సోదరులుగా, ఇప్పుడు వారు ఒకే తండ్రిని కలిగి ఉన్నారు – వారు ఆయన పై విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మానవ స్వభావాన్ని బట్టి. వారు తండ్రి సమక్షంలో శాశ్వత జీవితానికి సంబంధించిన అదే వారసత్వాన్ని పంచుకున్నారు. యేసు దేవునితో ఉండుటకుగాను వెళ్తున్నాడు. యేసు కూడా మొదటి నుండి ఉన్న దేవుడే (యోహాను 1:1,2). అయినప్పటికీ, యేసు తన మానవ స్వభావంలో తండ్రిని తన దేవుడు అని పిలిచాడు. మరి ఇక్కడ యేసు మరియను తాకొద్దు అని అన్నాడు. తోమాను తాకమన్నాడు ఎందుకని? అని ఎవరైనా ప్రశ్నించొచ్చు. అయితే ఈ రెండు సందర్భాలు వేరు వేరు. తోమా యేసు తిరిగి బ్రతికించబడ్డాడా అని సందేహించాడు. మరియకు ఆ అనుమానం రాలేదు. ఇక్కడ మరియ సంతోషం కృతజ్ఞతతో నిండిపోయింది. మత్తయి 28:9 యేసు వారిని ఎదుర్కొని–మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, స్త్రీలు, వారు యేసును కలుసుకున్నప్పుడు, ఆయన పాదములను పట్టుకొని పూజించినట్లు కనిపిస్తుంది. ఈ రకమైన ఆరాధన బహుశా మరియ యొక్క ఉద్దేశ్యం కావచ్చు, కాబట్టి ఆ సమయంలో, యేసు మరియను తాకనివ్వలేదు. వెంటనే వెళ్లి తన శిష్యులకు తాను లేచినట్లు చెప్పమని ఆమెను ఆదేశించాడు.
రోమా 16:26, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది.
మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు అను వచనాన్ని బట్టి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులలో తండ్రియైన దేవుడు ఒకరని నేను నమ్ముతున్నాను. ఆయన యేసుక్రీస్తుకు మరియు యేసునందు విశ్వాసముంచు వారందరికి తండ్రియైయున్నాడు కాబట్టే ఆయన తండ్రి అని పిలవబడుతూ ఉన్నాడు.
దేవుడిని “తండ్రి” అని పిలవడం ఆయన పితృత్వ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది:
ప్రేమ – యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
క్రమశిక్షణ – హెబ్రీయులు 12:6–7, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
సమకూర్చుట – మత్తయి 6:26,32, ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
సంరక్షణ – కీర్తన 103:13, తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
మార్గదర్శకత్వం – సామెతలు 3:11–12, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును.
కాబట్టే, యేసు తన శిష్యులకు “పరలోకమందున్న మా తండ్రీ…” (మత్తయి 6:9) అని ప్రార్థించమని భోదించి, వారిని తండ్రియైన దేవునితో వ్యక్తిగత సంబంధంలోకి ఆహ్వానించాడు. మత్తయి 6:6,9-13, నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గది లోనికి వెళ్లి తలుపు వేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, –పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము.
దేవుడు ఆత్మయై ఉన్నాడు (యోహాను 4:24 దేవుడు ఆత్మగనుక). అలాగని ఆయన అదృశ్యునిగా ఏదో ఒక స్థలానికి మాత్రమే పరిమితమై ఉంటాడని కాదు. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు, మలాకీ 2:10, మనకందరికి తండ్రి యొక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా?. ఆయన పరిశుద్దుడు, లేవీయకాండము 19:2, మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను. ఆయన ప్రేమకలవాడు న్యాయవంతుడై యున్నాడు. ఆయన సమస్త సృష్టిని, మనుష్యులందరిని సంరక్షిస్తూ ఉన్నాడు, నిర్గమకాండము 34:6,7, అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.
రోమా 8:32, తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?
దేవుడిని “తండ్రి” అని పిలవడం కేవలం ఒక బిరుదు కాదు – ఇది ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవటానికి, ఆయనను పూర్తిగా విశ్వసించడానికి మరియు ఆయన పిల్లలుగా ఆయన ప్రేమలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఆహ్వానం.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl