
దేవుడు సృష్టిని ఆరు రోజుల్లోనే చేశాడా?
దేవుడు ఆరు రోజుల్లో ప్రతిదీ సృష్టించాడా అనే ప్రశ్న వేదంతపరంగా, ఫిలసాఫికల్ గా మరియు సైంటిఫిక్ గా చర్చనీయాంశంగా ఉంది. ఆదికాండము 1 లోని బైబిల్ సృష్టి వృత్తాంతం దేవుడు ఆరు రోజుల్లో ఆకాశాలను మరియు భూమిని సృష్టించి ఏడవ తేదీన విశ్రాంతి తీసుకున్నాడని చెప్తుంది. చాలా మంది క్రైస్తవులు ఈ వృత్తాంతాన్ని అక్షరాలా తీసుకుంటే, మరికొందరు దీనిని సింబాలిక్ గా లేదా కవితాత్మకంగా చూస్తారు. ఇది సృష్టి యొక్క “ఆరు రోజులు” యొక్క అర్థంపై బహుళ దృక్కోణాలకు దారితీస్తూ, చర్చనీయాంశంగా మారింది.
ఆదికాండములోని మొదటి అధ్యాయములో దేవుడు సృష్టినంతటిని చేసిన “ఆ ఆరు రోజులు” దీర్ఘ యుగాలను సూచిస్తున్నాయా? ఈ ప్రశ్నకు సైన్స్ అవును, ఈ సృష్టి ఉనికి లోనికి రావడానికి ఎన్నో దీర్ఘ యుగాలను తీసుకొంది అని చెప్తుంది. కొన్ని మతాలు కొందరు బైబులు పండితులు సైన్స్ తో ఏకీభవిస్తూ, నిజమే అలా జరిగి ఉండొచ్చు అని అంటున్నారు.
కొంతమంది బైబిల్ పండితులు దేవుడు సృష్టిని ఆరు రోజులలోనే చేసాడనే చెప్తారు. కాని ఒకొక్క రోజు కొన్ని యుగాలకు సమానమనే ఉదేశ్యములో, 2 పేతురు 3:8ని చూపిస్తూ, “ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వంటిది” అని చెప్తుంటారు. ఇదే బైబులు పండితులు ఇదే వచనములోని రెండవభాగము చెప్తున్న దానిని పరిగణలోనికి తీసుకోరు. నిజానికి ఇదే వచనములోని రెండవ భాగము “ప్రభువు దృష్టికి వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి” అని చెప్తున్నప్పటికిని ఈ మాటలు వారి వాదన తప్పు అని ఖండిస్తూ ఉన్నప్పటికిని వాళ్ళు పట్టించుకోరు. ప్రభువు దృష్టికి వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అంటే దేవుడు వేరే టైంలో (గడియారంలో) పరిగెడుతున్నాడని కాదు— అంటే ఆయన కాలానికి పరిమితం కాదు: ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు రెప్పపాటు లాంటివి. ప్రతి క్షణం ఆయనకు సమానంగా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఓపికగా వేచి ఉండగలడు లేదా తక్షణమే చర్య తీసుకోగలడు.
చాలా మంది క్రైస్తవ సంప్రదాయవాదులు లేదా సువార్తిక క్రైస్తవులు సృష్టి యొక్క ఆరు రోజులను అక్షరాలా, రోజుకు 24 గంటలుగా అర్థం చేసుకుంటారు. దీనిని యంగ్ ఎర్త్ క్రియేషన్ వాదం అని పిలుస్తారు. దేవుడు విశ్వాన్ని అన్ని జీవులను దాదాపు 6,000 నుండి 10,000 సంవత్సరాల క్రితం సృష్టించాడని మరియు బైబిల్ సరళమైన చారిత్రక రికార్డును ఇస్తుందని వారు నమ్ముతారు.
ఈ దృక్పథాన్ని సమర్ధించేవారు ఇలా వాదిస్తారు: “దినము” (యామ్) అనే పదానికి హీబ్రూ పదం తరచుగా “సాయంత్రం మరియు ఉదయం” తో ఉపయోగించినప్పుడు సాధారణ రోజు అని అర్ధమిస్తుందని, దేవుని సృష్టి నమూనా మానవ ఆరు రోజుల పని వారం మరియు సబ్బాత్ (నిర్గమకాండము 20:11) నమూనాకు సెట్ అవుతుందని, అక్షరాలా దేవుడు చెప్పినట్లుగా 6 రోజుల సృష్టిని అంగీకరించడం లేఖనాల అధికారాన్ని సమర్ధించడమేనని నమ్ముతారు.
“దినము” లేదా “రోజు” అనే పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నప్పటికి, ఒక సాధారణ రోజుకు ఉండే “24” గంటలను తెలియజేసేందుకు వాడే అతి సామాన్యమైన హీబ్రూపదమైన “యామ్” అనే మాట ఆదికాండము 1 అధ్యాయములోని “ఆరు సృష్టి రోజులకు” వాడబడింది. యామ్ అనే మాట కాన్సెప్ట్ అఫ్ టైంకి సంబంధించిన మాట. ఉదాహరణకు భూమిపై ఒక రోజు అంటే 24 గంటలు. అంగారక గ్రహముపై అది ఎక్కువ. వేరే గ్రహాలపై అది ఇంకా ఎక్కువ కావొచ్చు. కాబట్టి ఈ మాటను కాంటెక్స్ట్ ని బట్టి అర్ధం చేసుకోవాలి. మన కాంటెక్స్ట్ లో అనగా భూగ్రహముపై దేవుడు నిర్ణయించిన 24 గంటలనే అర్ధములో మనం దీనిని అర్ధం చేసుకోవల్సి ఉన్నాం. కాబట్టి మన కాంటెక్స్ట్ లో యామ్ అంటే 24 గంటలను కలిగిన ఒక సాధారణమైన రోజని అర్ధం.
బైబిలులో “రోజు” అనే పదంతో సూచించబడిన కాల వ్యవధి ఖచ్చితంగా పరిమితం. బిలియన్లు లేదా మిలియన్లు లేదా వేల సంవత్సరాల పొడవున్న కాలాన్ని సూచించడానికి ఈ పదం ఉపయోగించబడిన సందర్భం నాకు తెలియదు.
చాలామంది “అస్తమయమును ఉదయమును” అనే మాటను బట్టి కన్ఫ్యూజ్ అవుతూ, నాల్గవ రోజు వరకు సూర్యుడు లేడు కదా. అస్తమయమును ఉదయమును ఎలా కలిగాయి? అసలు రోజులు ఎలా గడిచాయి? అని ప్రశ్నించొచ్చు. మనకు తెలిసిన పగలు + రాత్రి ఇవి రెండు కలిపితేనే కదా ఒక రోజు అని మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. కాబట్టే ఈ ప్రశ్న అసంబద్ధం, అప్రస్తుతం. ఎందుకంటే “రోజు” అనేది గడవడానికి టైం అవసరం. అట్లే “రోజు” అనే మాట కాల పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇది దేవుడు రోజు పొడవును నిర్ణయించి ఉండటాన్ని తెలియజేస్తుంది.
దేవుడు శాశ్వతుడు — కాలానికి అతీతుడు: కీర్తన 90:2 — “యుగయుగములు నీవే దేవుడవు”. ప్రకటన 1:8 — “అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే”. యెషయా 57:15 — దేవుడు “మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు, మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను.”
వీటి అర్థం: దేవునికి ప్రారంభం లేదా ముగింపు లేదు. కాలం అనేది ఆయన సృష్టించినది – ఆయన ఆధీనంలో ఉన్నది కాదు. ఆయన భూత, వర్తమాన మరియు భవిష్యత్తు అనే కాలాన్ని ఒకేసారి చూస్తాడు (మొత్తం కథను ఒక్క చూపులో చూసినట్లు). అందునుబట్టి, బైబిల్లో, కాలం అనేది ఒక సృష్టించబడిన ఒక వాస్తవం. దేవుడు మనలాగే కాలానికి కట్టుబడి ఉండడు. ఆయన కాలానికి బయట ఉన్నాడు. అయినప్పటికీ మన కోసం కాలంలోనే సంకర్షణ చెందుతాడు, (మరొకరిపై ప్రభావం చూపే విధంగా వ్యవహరిస్తాడు).
దేవుడు కాలాన్ని సృష్టించాడు : ఆదికాండము 1:1 — “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను”. ఆ “ప్రారంభం” మనకు తెలిసినట్లుగా కాల ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతకు ముందు, దేవుడు మాత్రమే ఉన్నాడు. స్థలం మరియు పదార్థం వలె సమయం కూడా సృష్టించబడిన సృష్టి క్రమంలో ఒక భాగం.
టైం లక్షణాలు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? టైం అనేది నిజం. ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. టైం యొక్క అత్యంత విచిత్రమైన లక్షణాలలో ఒకటి చలనం. టైం కనికరంలేనిది. నిర్దాక్షిణ్యంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. అంటే దేవుడు టైంకి దిశను నిర్ధేశించినట్లేగా, దానికి నిర్దేశింపబడిన దిశలో టైం పోతూ ఉందంటే టైంకి ఒక క్రమము ఉన్నట్లేగా. టైంకి వ్యవధి ఉంది, సంఘటనల మధ్య టైంని మనం లెక్కించ వచ్చు. కాలానికి విశేషమైన వర్తమానం ఉంది, ఈ క్షణం మాత్రమే నిజం. అంతేనా టైం అనేది సార్వత్రికం, అంతటా ఉంటుంది. దీని ద్వారా అన్ని సంఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. టైం అనేది వర్తమానం నుండి భవిష్యత్తులోకి పురోగమిస్తూనే ఉంటుంది. వెనుకకు కాదు. టైం ఒత్తిడి లేనిది, దీనికి రంగు రుచి వాసన రూపం లేదు. అది చలనం ద్వారా స్పష్టంగా కనిపిస్తుందనేది వాస్తవం. మానవుల ప్రయోజనార్ధమై ప్రయోజనకారిగా పనిచేయడానికి 4వ రోజున సూర్యుడు సృష్టింపబడ్డాడు తప్ప సూర్యుడు సృష్టింపబడినప్పటి నుంచి టైం ప్రారంభం కాలేదు.
దేవుడు మానవ కాలంలో (టైంలో) పనిచేస్తాడు (క్రోనోస్ మరియు కైరోస్) : క్రోనోస్ (χρονος) — మన టైంని, టిక్కింగ్ సమయాన్ని (గంటలు, రోజులు) అనుసరించగలడు. కైరోస్ (καιρος) — దేవుడు నియమించిన సమయం, సరైన క్షణం. గలతీయులు 4:4 — “అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను”. దేవుడు కాలంలోకి ప్రవేశిస్తాడు, కాని దానిచే ఎప్పుడూ నియంత్రించబడడు.
ఆధ్యాత్మికంగా ఇది ఎంతో ముఖ్యమైన విషయం : దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు. ఆయన సరైన సమయంలో చర్య తీసుకుంటాడు (రోమీయులు 5:6 — క్రీస్తు యుక్తకాలమున (సరియైన సమయంలో) భక్తిహీనులకొరకు చనిపోయెను). దేవుడు ఓపికగలవాడు. ఎక్కువ మంది పశ్చాత్తాపపడేలా ఆయన తీర్పును ఆలస్యం చేస్తాడు (2 పేతురు 3:9). దేవుడు మీ గతాన్ని, వర్తమానాన్ని మరియు భవిష్యత్తును చూస్తాడు. ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి మీరు ఆయనను పూర్తిగా విశ్వసించొచ్చు.
కొందరు “అస్తమయమును ఉదయమును” అనే మాటను బట్టి కన్ఫ్యూజ్ అవుతూ, నాల్గవ రోజు వరకు సూర్యుడు నక్షత్రాలు సృష్టించబడకపోతే మొదటి రోజున కాంతి ఎలా వచ్చింది? అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి హీబ్రూ భాష కాంతి పదార్ధము (కణాలు లేదా తరంగాల రూపంలో ఉన్న శక్తి లేదా రెండింటిని కలిగియున్న పదార్ధము) మరియు హీవెన్ లి లైట్ బేరర్ల (అంతరిక్షంలో కాంతిని ఉత్పత్తి చేసే వాటి) మధ్య ఉన్నతేడాను చాల స్పష్టముగా తెలియజేస్తుంది. మొదటి రోజున దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగుకు నిర్వచనాన్ని మనం చూసినట్లయితే, అది “తరంగ దైర్ఘ్యాలతో కూడిన ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ గా” నిర్వచించబడింది. వెలుగు అంటే వస్తువులను కనిపించేలా చేసే ఒక సహజమైన ఏజెంట్ మాత్రమే కాదండి. కాంతి కణాల వలె ప్రవర్తిస్తుంది తరంగాల వలె ప్రవర్తిస్తుంది కూడా. పదార్థంతో కాంతి పరస్పర చర్యలు విశ్వం యొక్క నిర్మాణాన్ని రూపొందించడంలో విశ్వం స్పేసులో విస్తరింపబడుటకు సహాయపడింది అనడంలో నిస్సందేహముగా ఎలాంటి సందేహము లేదు, అందుకు సైన్స్ కూడా ఏకీభవిస్తూ ఉంది.
శక్తివంతమైన దేవుని మాట వెలుగును ఉనికి లోనికి తెచ్చింది, వెంటనే వెలుగు కలిగింది. కాంతిని నియంత్రించేవి మూడు రోజుల తర్వాత గాని సృష్టించబడలేదు. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. ఆయన చీకటిని నాశనం చేయలేదు, ఎందుకంటే కాంతి వలె, అది కూడా ఒక ప్రయోజనకరమైన ప్రయోజనానికి ఉపయోగపడుతుందని ఆయనకు తెలుసు. కాబట్టే పగలును చీకటిని ఒక క్రమమైన పద్దతిలో అందించడానికి దేవుడు కాంతిని నియంత్రించాడు. “రోజులో ” period of lightని కాంతి కాలమని దాని తరువాత చీకటి కాలాన్ని period of darknessని ఉంచాడు. అలాగే దేవుడు వెలుగునకు అంటే period of lightకి పగలనియు, చీకటికి అంటే period of darknessకి రాత్రి అనియు పేరు పెట్టాడని ఆదికాండము 1:5 తెలియజేస్తుంది.
ఈ విషయాన్నే “అస్తమయమును ఉదయమును కలుగగా” అనే మాటలు తెలియజేస్తున్నాయి. ఈ మాటలకూ అర్ధం, “అస్తమయమును ఉదయమును” అనగా కాంతి కాలం ముగియుటను అస్తమయము అని చెప్తూ దాని తరువాత చీకటి కాలము దాని తరువాత తిరిగి కాంతి కాలము వచ్చుటను ఉదయము అని తెలియజేస్తూ ఉండటమే కాకుండా ఆయన వాటి మధ్య వ్యవధిని నిర్ణయించాడని వాటి ప్రయోజనాల్ని నిర్దేశించాడని కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాయి.
పగటిపూట సుదీర్ఘకాల (దీర్ఘకాల యుగాలు) కాంతిని కలిగి ఉంటే, ఆ రోజుల తర్వాత వచ్చే రాత్రులు కూడా సుదీర్ఘకాల (దీర్ఘకాల యుగాలు) చీకటిగా ఉండాలి. అప్పుడు మూడవ రోజున సృష్టించబడిన మొక్కలకు ఏమి జరిగి ఉండేదో ఊహించడం పెద్ద కష్టమేమి కాదు.
చివరిగా శాస్త్రవేత్తలు టైంని నిర్వచించడానికి ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం general theory of relativity సహాయముతో ఏవేవో చెప్తుంటారు. వాటిలో ప్రాముఖ్యముగా టైం ఉనికిలో లేదని చెప్పడం కంటే ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంతిమ సిద్ధాంతం కాదనే విషయాన్ని మర్చిపోకండి.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl