ధర్మశాస్త్రము

సృష్టి ప్రారంభములోనే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మానవుల హృదయాలలో లిఖించియున్నాడని నేను నమ్ముతున్నాను. మానవుని మనఃసాక్షి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి సాక్ష్యమిస్తూవుంది (దీనిని స్వాభావికమైన ధర్మశాస్త్రము అని అంటారు). దేవుని ధర్మశాస్త్రానికి సాక్ష్యంగా ప్రతి వానిలో ఒక స్వరముగా ఉండులాగున ప్రతి వ్యక్తికి దేవుడు మనఃసాక్షిని ఇచ్చాడు. రోమా 2:14,15, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని గూర్చిన జ్ఞానము పాపాన్ని బట్టి మానవుని హృదయములో కలుషితమయ్యింది. జనులు విస్తరించుట ఆరంభమైనప్పుడు ఒకని మనఃసాక్షి పాపమును బట్టి మొద్దుబారుటచే అతడు పాపము చేయునపుడు అది అతనిని ఏ మాత్రమును బాధించకపోవుటను బట్టి, వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, రోమా1:21,22; వారైతే అంధకారమైన మనస్సుగల వారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి, ఎఫెసీ 4:18,19. అట్లే ఒకని మనఃసాక్షి దేవుని వాక్యము పాపమని చెప్పని దానిని కూడా పాపమని వానికి చెప్తూ ఉండుటను బట్టి (రోమా 14:2) ఒకని మనఃసాక్షి సంపూర్ణముగా ఆధారపడ తగినది కాకుండా పోయింది. అలాంటి పరిస్థితులలో ప్రజలందరూ దేవుని చిత్తమేమైయున్నదో పరిపూర్ణముగా యెరుగునట్లు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని బైబులు నందు లిఖియింపజేయుట ద్వారా దానిని రెండవసారి నిర్దిష్టమైన రీతిలో ఇచ్చాడు (దీనినే లిఖియింపబడిన ధర్మశాస్త్రము అని అంటారు).

ద్వితీయోపదేశకాండము 10:4 ఆ సమాజదినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. మత్తయి 5:48 పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును (ప్రతిఒక్కరును) పరిపూర్ణులుగా (ఉండులాగున) ధర్మశాస్త్రము ఇవ్వబడింది. దేవుని ధర్మశాస్త్రము మన మాటలలో తలంపులలో క్రియలలో పరిపూర్ణతను కోరుతూ ఉంది. పాపము చేయువారందరిని ధర్మశాస్త్రము ఖండిస్తూ ఉంది.

రోమా 7:7-24, 7కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. దేవుని ధర్మశాస్త్రం పాపానికి కారణమా? చెడు ఏమిటో తెలుసుకుని, దానిని నివారించగలిగేలా ప్రజలను దేవుని చిత్తం ఏమిటో తెలుసుకునేలా అప్రమత్తం చేసే ధర్మశాస్త్రం యొక్క ఉపయోగకరమైన విధిని గురించి ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రం లేకపోతే దేవుని చిత్తం ఏమిటో మనకు తెలియదు. 8అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని (ఆజ్ఞ ద్వారా) సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 9ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అని పౌలు అంటున్నాడు. ధర్మశాస్త్రము చెప్పబడనప్పుడు పాపం ఉనికిలో లేదు అనేది పౌలు ఉద్దేశ్యం కాదు. అతిక్రమించమని నిర్దిష్ట ఆజ్ఞ లేనప్పుడు పాపం యొక్క కార్యాచరణ భిన్నంగా ఉంటుంది. పాపం, ఆజ్ఞ ద్వారా అందించబడిన అవకాశాన్ని ఉపయోగించుకుని, ప్రతి రకమైన దురాశను ఉత్పత్తి చేసింది. ఉపయోగకరంగా రక్షణగా ఉండటానికి ఉద్దేశించిన ధర్మశాస్త్రం ఇప్పుడు సమస్యగా కనిపిస్తుంది. దేవుని చిత్తాన్ని తెలిపే ఆజ్ఞ తెలుపబడినప్పుడు, నిద్రాణమైన పాపం “జీవించింది.” 10అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. 11ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసికొని (ఆజ్ఞ ద్వారా) నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. 12కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. కాబట్టి పాపమే విలన్ తప్ప దేవుని ధర్మశాస్త్రం కాదు. పాపం అన్ని రకాల మోసపూరిత హేతుబద్ధీకరణలకు ఉపయోగపడుతుంది: అది ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతిఒక్కరు దీన్ని చేస్తున్నారు. మనుగడకు ఇది అవసరం లాంటి మోసపూరిత కారణాలను ఇస్తుంది. పాపం గీతను దాటడానికి అన్ని రకాల మోసపూరిత ప్రోత్సాహాన్ని అందిస్తుంది – పాపి ఉచ్చులో పడే వరకు. అప్పుడు అది అతనిపై తిరగబడి మరణశిక్షతో అతన్ని ఎదుర్కొంటుంది. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా దేవుని చిత్తానికి అవిధేయత చూపడం వల్ల కలిగే న్యాయమైన పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుంది. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, 1 కొరింథీయులు 15:56, ధర్మశాస్త్రం దాని శక్తిని చూపిస్తుంది, పాపమువలన వచ్చు జీతము మరణము, రోమీయులు 6:23. కాబట్టి సహాయకారిగా ఇవ్వబడిన ధర్మశాస్త్రం వాస్తవానికి మరణాన్ని తెస్తుంది.

13ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను. ధర్మశాస్త్రం పాపిని మరణానికి ఖండిస్తుందనే విషయాన్ని తిరస్కరించలేం. కాని ఆ మరణ తీర్పు కూడా ఉపయోగకరమైన ఒక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది పాపం ఎంత తీవ్రమైనదో చూపిస్తుంది. తద్వారా పశ్చాత్తాపానికి పిలుపుగా మారుతుంది. దేవుడు తన ధర్మశాస్త్రంలో నన్ను అడిగే దానికి మరియు నా జీవితంలో నేను చేసిన క్రియలను చూసినప్పుడు, నేను ఎంత పాపినో మరియు నేను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నానో నేను గ్రహిస్తాను. నాకు సహాయం కావాలి; నాకు రక్షకుడు కావాలి. అదృష్టవశాత్తూ, ఆ రక్షకుడు క్రీస్తు యేసు వ్యక్తిత్వంలో మనందరికీ ఉన్నాడు. 14ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. “అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను” అని పౌలు చెప్పినప్పుడు అతడి అర్థం ఏమిటి అనేది చర్చనీయాంశముగా ఉంది. ఇక్కడ పౌలు ఆలోచనకు కీలకం క్రైస్తవుని ద్వంద్వ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. లూథర్ క్రైస్తవుడిని “పరిశుద్దుడు మరియు పాపి” అని చెప్పినపుడు అతడు ఈ విషయాన్నే చెప్పాడు. దీని అర్థం ఏమిటంటే, అన్ని సమయాల్లో విశ్వాసం యొక్క కొత్త స్వభావాన్ని పాత పాప స్వభావం, పాత ఆదాము చుట్టుముట్టే ఉంటాయి. పాత మరియు కొత్త స్వభావాలు రెండూ ఈ భూసంబంధమైన జీవితమంతా క్రైస్తవుడిలో చురుకుగా ఉంటాయి, గలతి 5:16,17. క్రైస్తవుడు పాత మరియు నూతన స్వభావాల కలయిక. అందువల్ల, 17 నుండి 24 వచనాలలో తాను ఇప్పటికీ ప్రతిరోజూ పాపం చేస్తూనే ఉన్నానని క్రైస్తవుడైన పౌలు విచారిస్తున్నాడు. అయితే, క్రైస్తవుడిలో పాత మరియు నూతన స్వభావాలు పక్కపక్కనే కనిపిస్తున్నప్పటికీ, అవి సమాన స్థానాన్ని కలిగి ఉండవని మనం గమనించాలి. క్రైస్తవుని నిజమైన గుర్తింపు నూతన స్వభావానికే పరిమితం. ప్రతి క్రైస్తవుడిలాగే, పౌలులో కూడా “ఆధ్యాత్మికం కాని” ఒక భాగం ఉంది. కాబట్టి, అతడు ప్రతిరోజూ పాపం చేస్తూనే ఉన్నానని అంగీకరించాల్సి వచ్చింది. నిజానికి, పాత ఆదాము పట్టు చాలా దృఢంగా ఉంది కాబట్టే పౌలు తనను తాను “పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను” అని చెప్పుకొన్నాడు. దీని అర్థం పౌలు పాపం నియంత్రణలో ఉన్నాడని కాదు. క్రీస్తు మరణం ద్వారా పాప ఆధిపత్యం విచ్ఛిన్నమైందని గుర్తుంచుకోండి. పాపం పౌలు జీవితానికి యజమాని కాదు, కాని, అతని పాత పాప స్వభావం పౌలు యొక్క ఉత్తమ ఉద్దేశాలను కూడా పాడు చేస్తుంది. 15ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. 16ఇచ్ఛయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. 17కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. దేవుడు నిషేధించిన చెడు పనులు చేయకూడదనుకున్నప్పుడు, దేవుని ధర్మశాస్త్రం మరియు ఆజ్ఞలు మంచివి సరైయైనవని అతడు దేవునితో అంగీకరిస్తున్నాడు. కాబట్టి సమస్య క్రైస్తవుని కొత్త స్వభావముతో లేదా దేవుని ధర్మశాస్త్రంతో లేదు. పాపం, పాత పాప స్వభావం ద్వారా పనిచేస్తుంది, ఇది ఇప్పటికీ ప్రతి క్రైస్తవునికి అతుక్కునే ఉంది.

18నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. 19నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడుచేయు చున్నాను. 20నేను కోరని దానిని చేసిన యెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. పౌలు పాత ఆదామును గురించి మాట్లాడుతున్నాడు. 21కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. 22అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని 23వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది. 24అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? పాత ఆదాము మరియు అతనిలో కొత్త వ్యక్తిత్వం కలయిక అతడు మార్చగల విషయం కాదని అపొస్తలుడు మునుపటి వచనాలలో సూచించాడు. అందువల్ల పౌలు తన జీవితంలో మంచి చేయాలనుకున్నప్పటికీ, చెడు అతనితోనే ఉందని చెప్తున్నాడు. ఇది పౌలు జీవితంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము [నోమోస్] నందు ఆనందించుచున్నాడు. ఇక్కడ ఈ పదం నిస్సందేహంగా ఆయన వాక్యంలో వెల్లడి చేయబడిన దేవుని పవిత్ర చిత్తాన్ని సూచిస్తుంది. పౌలు జీవితంలో దేవుని చిత్తాన్ని చేయాలనే కోరికను కలిగించే నూతన స్వభావం యొక్క ప్రేరణ ఉంది. కాని అతని శరీర అవయవాలలో మరొక [నోమోస్] పనిచేస్తున్నట్లు చూస్తున్నాను అని అంటున్నాడు. సానుకూల ప్రేరణతో పాటు, మరొకటి కూడా అతనిలో ఉంది. దురదృష్టవశాత్తు, ఇది ప్రతికూలమైనది. ఈ ప్రతికూలమైనది, “మనస్సు నందున్న ధర్మశాస్త్రము [నోమోస్] తో పోరాడుతూ ఉంది. విశ్వాసి యొక్క “నూతన స్వభావాన్ని” పౌలు వివిధ మార్గాల్లో వ్యక్తపర్చాడు. మునుపటి వచనంలో, అతడు “అంతరంగ పురుషుడు” అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ వచనంలో మరియు తదుపరి వచనంలో, అతడు తన నూతన స్వభావాన్ని లేదా అంతరంగ పురుషుని తన “మనస్సు”గా సూచించాడు. దురదృష్టవశాత్తు, నూతన స్వభావ ప్రయత్నాలు చాలా తరచుగా విఫలమవుతాయి. అప్పుడు శరీర అవయవాలలో పనిచేసే చెడుకు లొంగిపోతాం. అవయవాలలో పనిచేసే పాపనియమానికి [నోమోస్] ఖైదీగా మారతాం. నూతన స్వభావం దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తుంది మరియు దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటోంది. కాని పాపపు స్వభావం క్రైస్తవుని ఉత్తమ ప్రయత్నాలను పాడుచేస్తూనే ఉంటుంది. ఇది క్రైస్తవులను నిరాశ పరుస్తుంది, దుఃఖంలో ముంచెత్తుతుంది. కాబట్టే పౌలు, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అని అంటున్నాడు.

కాబట్టి, నేను నా మనస్సులో దేవుని నియమానికి బానిసను, కానీ పాప స్వభావంలో పాప నియమానికి బానిసను.

యాకోబు 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల (తొట్రిల్లిన యెడల), ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. కాబట్టి ఏ ఒక్కరు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా నెరవేర్చి రక్షింపబడలేరు. రోమా 3:20 ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

దేవుని ధర్మశాస్త్రము మన పాపాల్ని మనకు చూపెట్టడానికి సహాయపడుతూ పాపాన్ని బట్టి వచ్చు దేవుని కోపాన్ని బట్టి మనలను హెచ్చరిస్తూ మన క్రైస్తవ జీవితములో మనలను నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేత తమ నడతలను శుద్దిపరచుకోవలసియున్నారు, కీర్తన 119:9.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl