పరిశుద్ధ బాప్తిస్మము పై చర్చి ఎదుర్కొనిన దాడులు

పరిచయం
ఆచరణాత్మకంగా క్రైస్తవ మతంలో ఎవరూ పరిశుద్ధ బాప్తీస్మాన్ని “వ్యతిరేకిస్తున్నట్లు” ఒప్పుకోరు. క్వేకర్లు, సాల్వేషన్ ఆర్మీ కూడా పరిశుద్ధ బాప్తీస్మాన్ని నిర్లక్ష్యం చేస్తారు తప్ప అంతగా వ్యతిరేకించరు. సంఘము ఎందుకని బాప్తిస్మము ఇస్తుంది, ఏ విధంగా బాప్తిస్మము ఇస్తుంది మరియు ఎవరికి బాప్తిస్మము ఇస్తుంది అనే దానిపై ఆదిమ క్రైస్తవుల అభిప్రాయాలను తెలుసుకొందాం. ఎందుకంటే, ఈ నాడు కొన్ని సంఘాలలో బాప్తీస్మాన్ని విభిన్నముగా ఆచరిస్తూ ఉండటాన్ని బట్టి క్రైస్తవులు ఉద్రేకపడుతున్నారు తప్ప వాళ్ళు బాప్తీస్మాన్ని విభిన్నముగా ఎందుకని ఆచరిస్తున్నారో తెలియకపోవటమే వాళ్ళు ఉద్రేకపడటానికి కారణం.

ఈ కారణంగా, నేడు కొందరు ఈ అధ్యాయనం యొక్క విలువను, సముచితతను కూడా ప్రశ్నించొచ్చు. పరిశుద్ధ బాప్తిస్మముపై దాడులను వివరించడానికి, బాప్తిస్మము పై ప్రతిపాదించబడిన కొన్ని సిద్ధాంతాలను గురించి తెలుసుకొందాం. ఒప్పుకోలు లూథరన్ క్రైస్తవులుగా, మనం నమ్మే సానుకూల సత్యాలను ఒప్పుకోవడమే కాకుండా, మనం తిరస్కరించే అబద్ధాలను కూడా బహిర్గతం చేధ్ధాం. అలా చేయడం ద్వారా మనం కేవలం ప్రతికూలంగా ఉండటం లేదు. మనం మన విశ్వాస ఒప్పుకోలును పదునుపెడుతున్నాం, స్పష్టం చేస్తున్నాం. తప్పుడు వివరణలకు మరియు అపార్థాలకు తలుపులు మూసివేస్తున్నాం.

బాప్తిస్మము యొక్క స్వభావాన్ని గురించి దాని ఉపయోగం గురించిన తప్పుడు ఆలోచనలను బహిర్గతం చేయడం, ఖండించడం దాని సువార్త ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుంది. బాప్తిస్మము గురించి సరైన బోధనను సమర్థించడం అంటే సువార్తను సమర్థించడమే. బాప్తిస్మము అనేది శుభవార్త. సంఘాలు, సంఘ సభ్యులు దీనిని స్పష్టంగా అంగీకరించడంలో విఫలమైనప్పుడు, బాప్తిస్మము తెచ్చే సువార్తను, విశ్వాసాన్ని బలపరిచే దాని ఓదార్పును పొందలేరు. ఆ ఓదార్పును ప్రజలకు దూరం చేసే ఉద్దేశ్యములో, బాప్తిస్మముపై దాడులు జరిగాయి. సంఘము పరిశుద్ధ బాప్తిస్మముపై జరిగిన దాడులను ఎదుర్కొంది.

పరిశుద్ధ బాప్తిస్మము అనేది అందరికీ ప్రాణాన్ని ఇచ్చే, విశ్వాసాన్ని అందించే కృప వాహనం. శతాబ్దాలుగా ఎందరో వేదాంతవేత్తల వివాదాస్పద రచనలు చాలావరకు బాప్తిస్మము యొక్క సరైన విధానం (మనం అభ్యర్థిపై నీటిని ఎలా అన్వయించాలి?) మరియు బాప్తిస్మము యొక్క సరైన లక్ష్యాలు (మనం ఎవరిని బాప్టిజం పొందనివ్వాలి?) చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి ముఖ్యమైన ప్రశ్నలే అయినప్పటికీ, బాప్తిస్మము మన కొరకు ఏమి చేస్తుంది? (దేవుని వాక్య వాగ్దానముల ప్రకారము బాప్తిస్మము పాపపరిహారము కలిగించుచు, మరణము నుండియు, సాతాను నుండియు విడిపించుచు నమ్మువారందరకు నిత్య రక్షణను ఇచ్చుచున్నది) మరియు ఇటువంటి ఘనమైన మేళ్లను నీళ్లు ఎలా కలుగజేస్తాయి? (నీళ్లతో మరియు నీళ్లలో వున్న దేవుని వాక్యము మరియు నీళ్లతో వాడబడిన ఈ వాక్యమును విశ్వసించు విశ్వాసము ఇటువంటి ఘనమైన మేళ్లను కలుగజేయును గాని వాస్తవముగా నీళ్లు ఇటువంటి మేళ్లను కలుగ చేయవు. ఎట్లనగా దేవుని వాక్యము లేని నీళ్లు వట్టి నీళ్లు మాత్రమే గాని బాప్తిస్మము కాదు. ఆ నీళ్లు దేవుని వాక్యంతో చేర్చబడినప్పుడు బాప్తిస్మమైయున్నది అనగా, కృపగల జీవపు నీళ్లును మరియు పరిశుద్దాత్మ వలననైన పునర్జన్మమునై యున్నది) అనే వాటిని అర్ధం చేసుకొనే విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి.

బాప్టిజం యొక్క ఉద్దేశ్యాన్ని పాడుచేస్తూ ఆదిమ సంఘము లోనికి ప్రవేశించిన మొదటి తప్పుడు బోధ

ఈ ప్రశ్నలకు ఆదిమ సంఘ ఫాదర్లు, బాప్తిస్మము పాపాలను క్షమిస్తుంది మరియు దానిని స్వీకరించే వారి ఆత్మలను పునరుత్పత్తి చేస్తుంది అని చెప్పారు. తన మొదటి అపాలజీ యొక్క LXI అధ్యాయంలో, ప్రముఖ ప్రారంభ క్రైస్తవ అపోలజెటిక్ మరియు తత్వవేత్తయైన జస్టిన్ మార్టిర్ (క్రీ.శ. 110-165), క్రైస్తవ బోధను నమ్మి, దాని ప్రకారం జీవించడానికి కట్టుబడి ఉన్నవారు మొదటగా తమ గత పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, ప్రార్థించి ఉపవాసం ఉండాలని, క్రైస్తవ సమాజం వారితో ప్రార్థించి ఉపవాసం ఉంటుందని తరువాత వారు బాప్తీస్మానికి తీసుకురాబడతారని, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో కడుగబడటం ద్వారా ఇతర విశ్వాసుల మాదిరిగానే వాళ్ళు ఆధ్యాత్మికంగా పునర్జన్మ పొందుతారని రాసాడు. బాప్తిస్మము గత పాపాలకు క్షమాపణను ఇస్తుందని జస్టిన్ మార్టిర్ చెప్పాడు.

బాప్తిస్మము “గతంలో చేసిన పాపాలకు విముక్తిని” తెస్తుందని జస్టిన్ మార్టిర్ చేసిన ప్రకటన చర్చిలో ఆందోళనలను రేకెత్తించింది. క్షమాపణ బాప్తిస్మముకు ముందు చేసిన పాపాలకు మాత్రమే పరిమితమా? దీనిపై అతడు స్పష్టతను ఇవ్వలేదు. క్షమాపణను గత పాపాలతో ముడిపెట్టడం సహజమే అయినప్పటికీ, దేవుని క్షమాపణ వాగ్దానం గతానికే పరిమితం కాదు, అది వర్తమానానికి భవిష్యత్తుకు కూడా విస్తరించింది.

బాప్తిస్మము యొక్క క్షమాపణ వాగ్దానం బాప్తిస్మము పొందే ముందు చేసిన పాపాలకు మాత్రమే వర్తిస్తుందనే ఆలోచనను కొందరు ఆదిమ సంఘ నాయకులు మరింతగా ప్రోత్సహించారు. బాప్తిస్మము యొక్క ఆచరణలో అనారోగ్యకరమైన తప్పుడు బోధలకు ఇదే కారణం. శిశు బాప్తిస్మము యొక్క తొలి వ్యతిరేకులలో ఒకరైన టెర్టుల్లియన్ (క్రీ.శ. 145-220), ఆఫ్రికాలోని రోమన్ ప్రావిన్స్‌లోని కార్తేజ్ నుండి వచ్చిన ఒక గొప్ప ప్రారంభ క్రైస్తవ రచయిత, వేదాంతవేత్త. టెర్టుల్లియన్ ఒక వ్యక్తి యొక్క శరీరం మరియు ఆత్మ రెండూ గర్భధారణ సమయంలో ఒకనికి వాని తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తాయని దేవుడు ప్రతి వ్యక్తికి కొత్త ఆత్మను సృష్టించడని నమ్మాడు (ట్రడూషియనిజం సిద్ధాంతం). మొదటి ఆత్మ, ఆదాముది అది పాపభరితమయ్యింది కాబట్టి, తరువాతి ఆత్మలన్నీ కూడా పుట్టుకతోనే పాపంతో కలుషితమయ్యాయని, ఆత్మ తల్లిదండ్రుల నుండి బిడ్డకు సంక్రమించినందున, దాని ద్వారా ఆదాము పాపం యొక్క కళంకం మానవాళి అందరికీ వ్యాపిస్తుందని అతడు తర్కించాడు. టెర్టుల్లియన్ ఆత్మ ద్వారా పాప స్వభావాన్ని వ్యాప్తి చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాడు.

అతడు పాపాలను శుద్ధి చేయడానికి బాప్టిజం అవసరమని నమ్ముతూ, శిశు బాప్టిజం యొక్క స్థిరపడిన ఆచారాన్ని కూడా అంగీకరించాడు కాని దాని అభ్యాసాన్ని ప్రశ్నించాడు. వ్యక్తులు వ్యక్తిగతంగా తమ విశ్వాసాన్ని ప్రకటించే వరకు దానిని ఆలస్యం చేయాలని సూచించాడు. బాప్టిజం బాప్టిజంకు ముందు చేసిన పాపాల అపరాధాన్ని కడిగివేస్తుందనే ఆలోచన కారణంగా, పిల్లలు బాప్టిజం ఆలస్యం చేయడం వల్ల బాప్టిజం తర్వాత పాపాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తర్కిస్తూ, అతడు శిశు బాప్టిజంను నిరుత్సాహపరిచాడు. ఇది వారి రక్షణకు ముప్పు కలిగించే అవకాశం ఉందని అతడు తర్కించాడు. అవివాహితులు ఎదుర్కొనే శోధనల కారణంగా బాప్టిజంను ఆలస్యం చేయాలని కూడా వాదించాడు.

ఇతడు బాప్తీస్మాన్ని, అసలు పాపాన్ని (ఒరిజినల్ సిన్) తప్పుగా అర్థం చేసుకున్న కారణాన్న కార్తేజ్ ప్రజలు తమ పిల్లలను బాప్తీస్మం కోసం తీసుకురావద్దని నిరుత్సాహపరిచాడు. దానిని ఆలస్యం చేయడానికి ఇష్టపడ్డాడు. బాప్తిస్మము యొక్క ఈ తప్పుడు బోధ “ప్రధానంగా చిన్న పిల్లల విషయంలో బాప్తీస్మాన్ని ఆలస్యం చెయ్యడం ఉత్తమం” అని సూచించడానికి దారితీసింది. ఒక శతాబ్దం తర్వాత ఆదిమ సంఘములోని వివిధ ప్రాంతాలలో ఇది ఎంతో అసంబద్ధమైన విపరీతాలకు తీసుకువెళ్లబడింది. గ్రెగొరీ ఆఫ్ నాజియాంజస్, బాసిల్ ది గ్రేట్, ఆంబ్రోస్, జాన్ క్రిసోస్టమ్ మరియు అగస్టీన్ (అందరూ క్రీ.శ. 329 మరియు 354 మధ్య జన్మించారు) వంటి ప్రముఖ క్రైస్తవులు, వారు క్రైస్తవ కుటుంబాలలో జన్మించినప్పటికీ, వారు యుక్తవయస్సు వరకు బాప్టిజంను వాయిదా వెయ్యడానికి కారణమయ్యింది. కాన్స్టాంటైన్ చక్రవర్తి తన మరణశయ్య వరకు బాప్టిజంను వాయిదా వేయడానికి దారితీసింది. బాప్తీస్మాన్ని వాయిదా వెయ్యడానికి కారణం, బాప్టిజం యొక్క పాప-శుద్ధి ప్రభావాన్ని పెంచుకోవాలని ఆశించి వాళ్ళు బాప్టిజంను ఆలస్యం చేశారు. తరువాత కాలములో, గ్రెగొరీ ఆఫ్ నాజియాంజస్ మరియు అగస్టీన్ వంటి నాయకులు ఒకరు పుట్టిన తరువాత లేదా మతమార్పిడి తర్వాత వెంటనే బాప్టిజంను ప్రోత్సహించడం ద్వారా ఈ తప్పుడు బోధను సరిదిద్దడానికి పనిచేశారు.

మధ్యయుగ మరియు ఆధునిక కాథలిక్కులలో బాప్టిజం యొక్క ఉద్దేశ్యం

థామస్ అక్వినాస్ (క్రీ.శ. 1224-1274) వంటి వేదాంతవేత్తలు బాప్టిజం అన్ని పాపాలను క్షమిస్తుందని అంగీకరించారు. అయినప్పటికీ మధ్యయుగ సంఘం బాప్టిజంను అసంపూర్ణంగా భావించింది. కాబట్టి బాప్టిజంను “పరిపూర్ణం” చేయడానికి నిర్ధారణ అవసరమనే ఆలోచనను అక్వినాస్ ప్రోత్సహించాడు – దేవుని వాక్యం ద్వారా నిరంతర ఆధ్యాత్మిక వృద్ధిగా కాదు, కానీ ఒక మర్మమైన ఆచారం ద్వారా. బాప్టిజం తర్వాత చేసిన మర్త్య పాపాలకు క్షమాపణ కోసం పశ్చాత్తాపం యొక్క మతకర్మ అవసరమని కూడా అతడు వక్కాణించాడు. పశ్చాత్తాపం మరియు దేవుని వైపు తిరగడం (ఇది బాప్టిజంకు తిరిగి రావడాన్ని ప్రతిబింబిస్తుంది) క్షమాపణను తీసుకురాగలదని అక్వినాస్ అంగీకరించినప్పటికీ, అతడు పశ్చాత్తాపం యొక్క మతకర్మ శక్తిపై, ముఖ్యంగా సంఘ సేవకుల ద్వారా ఉపయోగించబడే తాళపు చెవులకు మరింత ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చాడు. (తాళపు చెవులను గురించి ప్రశ్నోత్తరిలో తాళపు చెవుల వాడుక ఉపయోగము అనే ఆర్టికల్ లో ఉంది చదవండి). ఇది బాప్టిజంలో దేవుని కృప నుండి అదనపు మతకర్మల ద్వారా సంస్థాగత నియంత్రణకు దృష్టిని మార్చింది.

అక్వినాస్ ప్రకారం, పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ ప్రధానంగా తాళపుచెవుల శక్తి నుండి వస్తుంది (సంఘ సేవకులకు (పాస్టర్లకు) పాపాలను క్షమించడానికి ఇవ్వబడిన అధికారం). రెండవది, ఇది పశ్చాత్తాపపడేవారి చర్యలను (పశ్చాత్తాపం మరియు ఒప్పుకోలు వంటివి) కలిగి ఉంటుంది. ఈ చర్యలు సంఘ అధికారానికి లోబడి ఉంటాయి. అందువల్ల, మతకర్మ యొక్క శక్తి ప్రధానంగా సంఘము యొక్క పాత్రలో ఉంటుంది తప్ప వ్యక్తి యొక్క పశ్చాత్తాపంలో కాదు. అక్వినాస్ ప్రకారం, పాప క్షమాపణ అనేది వ్యక్తిగత ధర్మంగా (పశ్చాత్తాపం) మాత్రమే కాకుండా, సంఘము నిర్వహించే మతకర్మగా పశ్చాత్తాపం ద్వారా మరింత శక్తివంతంగా వస్తుంది. క్షమాపణను పంపిణీ చేయడంలో సంఘము యొక్క సంస్థాగత మరియు మతకర్మ పాత్రను ఇది వక్కాణించింది.

పశ్చాత్తాపపడే వారి చర్యలు క్షమాపణ పొందడానికి దోహదపడతాయని అక్వినాస్ బోధించాడు. అక్వినాస్ ధర్మశాస్త్రం మరియు సువార్త, కృప మరియు క్రియలను మిళితం చేసాడు. ఇది దేవుని ఉచిత క్షమాపణ వాగ్దానానికి విరుద్ధంగా ఉంది. ఈ రోమన్ కాథలిక్ మతకర్మ పశ్చాత్తాపం మరియు బాప్టిజం మధ్య ఉన్న సంబంధాన్ని మరియు బాప్టిజం యొక్క క్షమాపణా వాగ్దానాన్ని అస్పష్టం చేసింది. అయితే సుమ్మ థియోలాజికాలో అక్వినాస్ అభిప్రాయం చివరికి బాప్టిజం యొక్క క్షమాపణ యొక్క స్పష్టమైన వాగ్దానాన్ని పశ్చాత్తాపం లేకుండా అసంపూర్ణంగా అనిపించేలా చేసింది.

బాప్టిజం ప్రధానంగా అసలు పాపానికి (ఒరిజినల్ సిన్ కి) పరిష్కారంగా పనిచేస్తుందని, బాప్టిజం అసలు పాపం యొక్క అపరాధాన్ని క్షమించడమే కాకుండా దాని ఉనికిని పూర్తిగా తొలగిస్తుందని అక్వినాస్ బోధించాడు. అయితే, ఈ ఆలోచన తరువాత సంస్కరణ సమయంలో సవాలు చేయబడింది.

ఆగ్స్‌బర్గ్ ఒప్పుకోలు సమర్పించబడినప్పుడు, రోమన్ కాథలిక్ చర్చి అసలు పాపంపై దాని ఆర్టికల్ IIని తిరస్కరించింది. ముఖ్యంగా బాప్టిజం పొందిన పిల్లలలో కామం (పాపపు కోరిక) మిగిలి ఉంటుందనే బోధనను తిరస్కరించింది. బాప్టిజం తర్వాత శిశువులలో పాపం అలాగే ఉంటుందని మరియు ఆత్మను అడ్డుకుంటూనే ఉంటుందని మార్టిన్ లూథర్ చేసిన వాదనలను గతంలో ఖండించినట్లు ప్రస్తావిస్తూ, రోమన్ కాథలిక్ సంఘము తన అధికారిక ప్రతిస్పందన అయిన కన్ఫ్యూటేషన్‌లో ఈ అభిప్రాయం స్థాపించబడిన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. బాప్టిజం తర్వాత అసలు పాపం యొక్క స్వభావం మరియు నిలకడకు సంబంధించి సంస్కర్తలు మరియు రోమన్ కాథలిక్ సంఘము మధ్య ఉన్న కీలకమైన వేదాంత విభజనను ఇది హైలైట్ చేస్తుంది.

జూన్ 17, 1546న, దాని ఐదవ సమావేశంలో, ట్రెంట్ కౌన్సిల్ అధికారికంగా రోమన్ కాథలిక్ వైఖరిని ప్రకటిస్తూ, తిరిగి జన్మించిన వారిలో (అంటే, బాప్టిజం పొందిన వారిలో), “దేవుడు ద్వేషించేది ఏదీ లేదు” అనే వారి బోధను సమర్ధించింది. ఇది బాప్టిజం ద్వారా అసలు పాపం పూర్తిగా తొలగిపోతుందనే నమ్మకాన్ని బలోపేతం చేసింది. బాప్టిజం పొందిన వారిలో పాపం లేదా దాని ప్రభావాలు మిగిలి ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యతిరేకించింది.

ఈ సమర్ధన పైకి బాగానే కనబడుతున్నప్పటికీ, క్షమాపణ అనేది క్రీస్తుని బట్టి దేవుని కృపపై మాత్రమే కాకుండా వ్యక్తిలోని అంతర్గత మార్పుపై ఆధారపడి ఉంటుందని సూచించడం ద్వారా ఇది సంస్కారము యొక్క నిజమైన స్వభావముపై దాడి చేసింది. గ్రేషియా ఇన్ఫ్యూసా భావనకు సమానమైన ఈ దృక్పథం, దేవుని వాగ్దానం నుండి రక్షణ కొరకైన హామీని వ్యక్తిగత అనుభవానికి మార్చింది. అయితే, రోమా 7:15-23లో పౌలు చెప్పినట్లుగా, విశ్వాసి పాప స్వభావంతో నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు, తద్వారా అసలు పాపం మిగిలి ఉందని చెప్పాడు. బాప్టిజం దానిని పూర్తిగా తొలగించి ఉంటే, అటువంటి అంతర్గత సంఘర్షణ ఉండేది కాదు. ఇది బాప్టిజం యొక్క ప్రభావంపై సందేహాన్ని కలిగిస్తుంది మరియు దేవుని కృప యొక్క నిశ్చయతను తగ్గిస్తుంది.

ఆధునిక కాథలిక్ బోధన ఇప్పటికీ బాప్టిజం అసలు పాపాన్ని తుడిచివేస్తుందని మరియు ఒక వ్యక్తిని కొత్త సృష్టిగా మారుస్తుందని నమ్ముతుంది. వారి క్యాటికిజం మరియు ఇతర కాథలిక్ వనరులు బాప్తిస్మములో నీతిమంతునిగా ప్రకటింపబడటం (నీతి యొక్క చట్టపరమైన ప్రకటన) కంటే అంతర్గత మార్పును వక్కాణిస్తూ మనం అక్షరాలా కొత్త సృష్టిగా పునర్నిర్మించబడ్డాం అని చెప్తున్నాయి. దేవుని క్షమాపణ యొక్క లక్ష్య వాగ్దానం నుండి ఆత్మాశ్రయ పరివర్తనకు ఈ దృష్టి మార్పు – బాప్టిజం అందించడానికి ఉద్దేశించిన నిజమైన ఓదార్పును మరియు హామీని దెబ్బతీస్తూ ఉంది.

బాప్టిజంపై పైటిస్టుల దాడులు: అనాబాప్టిస్టులు, బాప్టిస్టులు మరియు లూథరన్ పైటిస్టులు

“పైటిస్ట్” అంటే తరచుగా మతం యొక్క అధికారిక లేదా మేధోపరమైన అంశాలకు భిన్నంగా వ్యక్తిగత, అనుభవపూర్వక విశ్వాసం మరియు భక్తిని నొక్కి చెప్పే వ్యక్తి. ఇది అధిక లేదా ప్రభావితమైన భక్తిని ప్రదర్శించే వ్యక్తిని కూడా సూచిస్తుంది. ఈ పదం లూథరనిజంలో వ్యక్తిగత మతపరమైన అనుభవాన్ని వక్కాణించిన 17వ శతాబ్దపు మత ఉద్యమం అయిన పైటిజం నుండి ఉద్భవించింది.

దేవుడు క్షమాపణను ప్రసాదించే మార్గంగా మరియు విశ్వాసాన్ని సృష్టించే మార్గంగా బాప్టిజం పై అవగాహనను పునరుద్ధరించడానికి మార్టిన్ లూథర్ కృషి చేస్తున్నప్పుడు, కొత్త సవాళ్లు తలెత్తాయి. ఈ సవాళ్లు బాప్టిజం యొక్క నిజమైన శక్తిని మరియు ఆ శక్తి పనిచేసే ఖచ్చితత్వాన్ని (బాప్టిజంలో నిజమైన శక్తి లేదని) తిరస్కరించాయి. బాప్టిజం యొక్క ఉద్దేశ్యం పై ప్రత్యామ్నాయ అభిప్రాయాలకు దారితీశాయి. అది సహజంగానే బాప్టిజం ఇవ్వడంలో దేవుని ఉద్దేశ్యం గురించి భిన్నమైన ఆలోచనలను అభివృద్ధి చేసింది. ఫలితంగా, బాప్టిజం అనేది దేవుని శక్తివంతమైన, కృపతో నిండిన చర్యగా కాకుండా, సంఘ జీవితంలో ఒక ఆచారంగా చూడబడింది.

అలాగే కృప సాధనమైన బాప్టిజంపై అనాబాప్టిస్ట్లు తీవ్రంగా దాడి చేసారు. ఈ ఉద్యమాన్ని కాన్రాడ్ గ్రెబెల్, బాల్తాసర్ హ్యూబ్‌మైయర్, సైమన్ స్టంప్, ఫెలిక్స్ మాంజ్ మరియు మెన్నో సైమన్స్ వంటి వ్యక్తులు నడిపించారు. అనాబాప్టిస్ట్లు అనే పేరు సూచిస్తున్నట్లుగా, అనాబాప్టిస్టులు శిశు బాప్తీస్మాన్ని తిరస్కరించారు. బాల్యంలో బాప్టిజం పొందిన వారి పునఃబాప్టిజంపై పట్టుబట్టారు. అయితే, వారి భోధన వారి వేదాంతపరమైన అవగాహన నుండి ఉద్భవించింది.

బాప్టిజం యొక్క ఉద్దేశ్యం గురించి అనాబాప్టిస్టుల నమ్మకాలను అర్థం చేసుకోవాలంటే, 16వ శతాబ్దపు ప్రధాన సంస్కరణ నుండి వాళ్ళు వేరు కావడానికి దారితీసిన వారి నమ్మకాలను మనం అర్ధం చేసుకోవల్సి ఉన్నాం.

అనబాప్టిస్టులు అన్నింటికంటే ముఖ్యంగా క్రీస్తు బోధన మరియు క్రీస్తు ఉదాహరణను అనుసరించి రూపొందించబడిన నిజ క్రైస్తవ జీవితాన్ని గురించి ఆందోళన చెందారు. సంస్కరణ మంచిదే కాని అది మాత్రమే సరిపోదని, క్రీస్తులో కొత్తదనంతో కూడిన మార్పు చెందిన జీవితం లేకుండా, విశ్వాసం కపటమని వారు భావించారు. వారు క్రీస్తు ఉదాహరణను అనుసరించి రూపొందించబడిన జీవితాలను లీడ్ చెయ్యాలనుకున్న వయోజనులైన క్రైస్తవులతో కూడిన సంఘాన్ని నిర్వహించాలను కొన్నారు, దాని కోసం ప్రజలను కనుగొన్నారు.

అనాబాప్టిస్టులకు, సమర్థన కంటే పవిత్రీకరణే ప్రాధాన్యమయ్యింది. విశ్వాసం ద్వారా జీవించడంలో సంతృప్తి చెందని, విశ్వాసుల జీవితాల్లో దేవుని పనికి అనుభవపూర్వక రుజువును చూడాలని కోరుకునే ఆచరణాత్మక వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వారు సువార్త పట్ల అసహనానికి గురయ్యారు. వారు కోరుకున్న సంఘాన్ని ఉత్పత్తి చేయడానికి ఇతర మార్గాల కోసం ప్రయత్నించారు.

శిశువుగా ఉన్నప్పుడు బాప్తిస్మం పొందిన చాలా మంది తర్వాత నీతిమంతమైన జీవితం గడపకపోవడం వలన, బాప్తిస్మం పునరుత్పత్తి కలిగిస్తుందనే వాదనపై అనుమానం కలిగింది. క్షమాపణ వాగ్దానం వారికి వర్తిస్తుందా అన్న ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల, తమ సంఘం కోసం కొత్త దిశలో నడవాలని అనుకున్న అనాబాప్టిస్టులు, బాప్తిస్మానికి కొత్త అర్ధాన్ని, ఉద్దేశ్యాన్ని ఇచ్చారు.

క్రైస్తవునికి నిజమైన పరీక్ష శిష్యత్వమే అని వారు భావించారు. అనాబాప్టిస్టుల గొప్ప మాట “విశ్వాసం” కాదు, “అనుసరించడం” (నాచ్‌ఫోల్జ్ క్రిస్టి). క్రైస్తవ సంస్కారమైన బాప్టిజం, వారికి “దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే (నిబంధన)” 1 పేతురు 3:21, కాబట్టి బాప్తిస్మము ప్రధానంగా గత అనుభవానికి గురుతుగా కాకుండా క్రీస్తుకు విధేయత చూపడానికి పూర్తి నిబద్ధత యొక్క ప్రతిజ్ఞగా మారింది.

ఈ అవగాహన కారణంగానే శిశువుల బాప్టిజంని వాళ్ళు ఆపాల్సి వచ్చింది: నిజమైన క్రైస్తవ మతం అంటే ఏమిటో తెలియకుండా శిశువులు ఎలా నిబద్ధతను ఇవ్వగలరు? వారు దేవుని కృపను నిష్క్రియాత్మకంగా అనుభవించొచ్చు. కాని వారు తమ జీవితాలను క్రీస్తుకు ప్రతిజ్ఞ చేయడంలో స్పందించలేరు. అలాంటి శిశు బాప్టిజం అర్థరహితం కావడమే కాకుండా, క్రైస్తవ మతం యొక్క స్వభావం మరియు సంఘములో సభ్యత్వం యొక్క నిజమైన అవగాహనకు తీవ్రమైన అడ్డంకిగా మారుతుందని వయోజన బాప్టిజం మాత్రమే తెలివైన జీవిత నిబద్ధతను సూచిస్తుందనే ముగింపుకు అనబాప్టిస్టులు వచ్చారు.

1527లో స్విస్ బ్రదరన్ కాన్ఫరెన్స్ ఆమోదించిన ష్లీథీమ్ కన్ఫెషన్ (Schleitheim Confession) ప్రకారం, పశ్చాత్తాపపడి జీవితం మార్చుకొని, క్రీస్తు ద్వారా పాపాలు క్షమించబడినట్టు నమ్మి, యేసుక్రీస్తు పునరుత్థానంలో నడవాలని మరియు మరణంలో ఆయనతో సమాధి కావాలని కోరుకునే వారికే మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మాన్ని స్వయంగా అభ్యర్థించే వారికి మాత్రమే అది ఇవ్వబడుతుంది. ఈ ప్రకటనలో పోప్ అమలు చేస్తున్న శిశు బాప్తిస్మాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని చెప్పారు.

బాప్టిజంపై ఈ ప్రకటన అంతటా క్రైస్తవుడు అతని జీవిత ప్రాధాన్యతను గమనించండి: “…జీవిత సవరణ…నమ్మడం…యేసుక్రీస్తు పునరుత్థానంలో నడవడం…సమాధి చేయబడాలని కోరుకోవడం…” క్రీస్తు రక్షణ కార్యమును గురించి ప్రస్తావించబడినప్పటికీ, దాని ప్రయోజనాలను అందించడం ఇకపై మతకర్మ యొక్క డొమైన్ (హక్కు, అధికారం) కాదు.

సరిగ్గా చెప్పాలంటే, నేటి మెన్నోనైట్లు జర్మనీ మరియు స్విట్జర్లాండ్‌లోని అనాబాప్టిస్ట్ ఉద్యమ వారసులు మరియు వారి సంఘాలలో “విశ్వాసుల బాప్టిజాన్ని” ఆచరించడం కొనసాగిస్తున్నారు. అయితే, వేదాంతపరంగా, అనాబాప్టిస్టులు శిశు బాప్టిజాన్ని తిరస్కరించడానికి దారితీసిన అదే తార్కికం – “నిజంగా మతం మారిన” మరియు “నిజంగా నిబద్ధత కలిగిన” క్రైస్తవులతో కూడిన సంఘం కోసమైన కోరిక మరియు విశ్వాసుల జీవితాల్లో అటువంటి మతమార్పిడి యొక్క దృశ్యమాన సాక్ష్యంపై ప్రాధాన్యత – తరువాతి శతాబ్దాలలో వివిధ డినామినేషన్స్ ఆచారం వెనుక ఉంది. ఈ సమూహాలలో బాప్టిజం ఇకపై విశ్వాసికి దేవుని దయగల క్షమాపణ మరియు విశ్వాసం కోసం శక్తిని అందించేదిగా భావించబడదు. ఇప్పుడు అది క్రీస్తును అనుసరించడానికి కేవలం మానవ నిబంధన ప్రకటనగా కనిపిస్తుంది.

ఈ విషయంలో ముందుగా గుర్తుకు వచ్చేవి బాప్టిస్ట్ సంఘాలు, “విశ్వాసుల బాప్టిజం” అనే ఆలోచనను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇతర సంఘాల కంటే ఎక్కువగా కృషి చేసిన సంఘాలు వీళ్ళే. మొదటి ఇంగ్లీష్ బాప్టిస్ట్ సంఘాలు 1600ల ప్రారంభంలో సెపరేటిస్ట్ ఉద్యమంలో భాగంగా ప్రారంభమయ్యాయి. ప్యూరిటన్లు ఇంగ్లాండ్ చర్చిని అంతర్గతంగా కాథలిక్ ఆచారాల నుండి సంస్కరించాలని ఆశించినప్పటికీ, సెపరేటిస్టులు (ఇంగ్లీష్ ప్రొటెస్టంట్‌లు), వీళ్ళు ఇంగ్లాండ్ చర్చి సంస్కరణకు అతీతంగా ఉందని నమ్మి స్వతంత్ర, స్థానిక చర్చిలను స్థాపించడానికి ప్రయత్నించారు. వీళ్ళు రాష్ట్ర చర్చిచే నియంత్రించబడకుండా తమను తాము పరిపాలించుకునే స్వతంత్ర సంఘాలను స్థాపించారు. ఈ సంఘాలు అనాబాప్టిస్టుల మాదిరిగానే, క్రీస్తు ఉదాహరణను అనుసరించి రూపొందించబడిన జీవితాలను లీడ్ చెయ్యాలనుకున్న క్రైస్తవులతో మాత్రమే రూపొందించబడ్డాయి. హింస నుండి తప్పించుకోవడానికి హాలండ్‌కు వెళ్లిన సెపరేటిస్టుల సమూహం యొక్క పాస్టర్ జాన్ స్మిత్ ద్వారా మొదటి ఇంగ్లీష్ బాప్టిస్ట్ సమాజం స్థాపించబడింది. హాలండ్‌లో అతని సమాజం మెన్నోనైట్‌లతో సంబంధంలోకి వచ్చింది. మెన్నోనైట్లు ఒక క్రైస్తవ సమూహం, అనాబాప్టిస్ట్ శాఖలో భాగం, వారికి 16వ శతాబ్దపు డచ్ మత నాయకుడు మెన్నో సైమన్స్ పేరు పెట్టారు. ఇది 16వ శతాబ్దంలో రాడికల్ సంస్కరణ నుండి ఉద్భవించింది. 1611లో, థామస్ హెల్విస్ ఈ సంఘము నుండి లండన్‌కు తిరిగి వెళ్లి ఇంగ్లీష్ గడ్డపై బాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించాడు. నలభై సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే ఏడు బాప్టిస్ట్ సంఘాలు మొదటి లండన్ బాప్టిస్ట్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్‌ను తయారు చేశాయి. లండన్ బాప్టిస్ట్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్‌ అనేక విధాలుగా ఈ సంఘాలను అనాబాప్టిస్టుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే, బాప్టిజం అనేది క్రీస్తు ఇచ్చిన కొత్త నిబంధన శాసనం, ఇది విశ్వాసాన్ని ప్రకటించే వ్యక్తులకు లేదా శిష్యులుగా చేయబడిన వారికి ఇవ్వబడుతుంది. వారు విశ్వాసం ప్రకటించినప్పుడు, బాప్తిస్మం తీసుకోవాలి, మరియు ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనాలి అని పేర్కొంది (39 వ్యాసంలో).

అనాబాప్టిస్టులు శిశు బాప్తిస్మాన్ని తిరస్కరించడానికి కారణమైన ఆందోళనలు — దృశ్య, అదృశ్య సంఘాల మధ్య తేడాను గుర్తించకపోవడం, నిజంగా మతం మార్చుకున్నవారితో మాత్రమే సంఘాన్ని ఏర్పరచాలన్న కోరిక, సంఘ సభ్యులలో పవిత్రత లేకపోవడంపై అసహనం — ఇవి బాప్టిస్ట్ వ్యవస్థాపకుల ఆలోచనలపై కూడా ప్రభావం చూపాయి. బాప్టిస్ట్ దృక్పథంలో, బాప్తిస్మం ఇక దేవుని కృప, క్షమాపణ, భరోసా ఇచ్చే ప్రకటన కాదు; అది కేవలం మనిషి తనను రక్షించిన క్రీస్తుపట్ల నిబద్ధతను, విధేయతను బహిరంగంగా ప్రకటించే చర్యగా మారింది. అనాబాప్టిస్టులు, బాప్టిస్ట్లు ఇమ్మర్షన్ ద్వారా బాప్టిజం అవసరాన్ని ప్రకటించగల వారికి మాత్రమే బాప్టిజం ఇవ్వాలని పట్టుపట్టారు.

పొరుగువారి జీవితంలో పవిత్రత లేకపోవడం, దేవుని దయ కంటే వ్యక్తిగత నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వడం, సంస్కరణ మరియు పునరుద్ధరణను త్వరగా ఉత్పత్తి చేయనందుకు చర్చి పట్ల అసహనంతో పైయటిజం 17వ శతాబ్దములో జర్మనీలో ఉద్భవించింది. లూథరనిజంలోని పైటిస్టులు సిద్ధాంతం మరియు వేదాంతశాస్త్రంపై సాంప్రదాయ లూథరన్ దృష్టితో పాటు వ్యక్తిగత భక్తి మరియు ఆచరణాత్మక క్రైస్తవ జీవనాన్ని వక్కాణించారు. లూథరనిజం దాని స్వంత పైయటిస్టిక్ పోరాటాలను ఎదుర్కోవడం ప్రారంభించినప్పుడు, బాప్టిజం కూడా దాడికి గురైంది. పైయటిజం వ్యాప్తి చెందుతున్నప్పుడు, అది బాప్టిజం సిద్ధాంతాన్ని బలహీనపరిచింది. వాలెంటిన్ లోషర్ (1673–1749) భక్తిని ప్రోత్సహించే ముసుగులో, పైయటిస్టులు బోధన మరియు ఆచరణలో మతకర్మలను తగ్గించారని హెచ్చరించాడు. కొంతమంది వుర్టెంబర్గ్ పైయటిస్టులు శిశు బాప్టిజంను బహిరంగంగా తిరస్కరించారు.

బాప్టిజం పొందిన పిల్లలలో పునరుత్పత్తికి ఆధారాలు లేకపోవడం చాలా మంది బాప్టిజం పొందిన వ్యక్తులు అపవిత్ర జీవితాలను గడపడాన్ని పైటిస్టులు ఖండించారు. బాప్టిజం నిజంగా కొత్త జీవితాన్ని ఇస్తే, చాలా మంది క్రైస్తవులు నిర్లక్ష్యంగా లేదా అనైతికంగా ఎందుకు పెరిగారని వారు వాదించారు? బాప్టిజం మాత్రమే పునరుత్పత్తికి హామీ ఇవ్వదని వారు తేల్చారు. పైటిజం బాప్టిజంలో దేవుని వాగ్దానం పై నుండి వ్యక్తి యొక్క చేతన నిర్ణయం పైకి మరియు హృదయపూర్వక మతమార్పిడి అనుభవం పైకి దృష్టిని మరల్చింది. శిశువులు పశ్చాత్తాపపడలేరు లేదా స్పృహతో నమ్మలేరు కాబట్టి, పైటిస్టులు వారికి బాప్టిజం ఇవ్వడం అర్థరహితమని భావించారు. సంఘము అంతర్గత ఆధ్యాత్మికతకు బదులుగా బాహ్య రూపాలపై (సంస్కారాలపై) ఎక్కువగా ఆధారపడుతుందని పైటిస్టులు ఆరోపించారు. బాప్టిజం వారి వ్యక్తిగత ప్రమేయం లేకుండా శిశువులకు వర్తించబడుతుంది కాబట్టి, అది ఖాళీ ఆచారంగా మారిందని వారు భయపడ్డారు. కొంతమంది పైటిస్టులు, ముఖ్యంగా వుర్టెంబర్గ్ మరియు హాలీలో, అనాబాప్టిస్టులచే ప్రభావితమయ్యారు. వారు శిశు బాప్టిజంను పూర్తిగా తిరస్కరించారు. వారు స్పృహతో విశ్వాసం ప్రకటించే వారు మాత్రమే బాప్టిజం పొందాలని బోధించారు. సంఘము దృశ్యమానంగా పవిత్రంగా మరియు నైతికంగా పునరుద్ధరించబడాలని పైటిస్టులు కోరుకున్నారు. శిశు బాప్టిజం ప్రతి ఒక్కరినీ చర్చిలోకి చేర్చింది – పవిత్రమైనా లేదా అపవిత్రమైనా – కాబట్టి ఇది క్రైస్తవ సమాజం యొక్క స్వచ్ఛతను బలహీనపరుస్తుందని వారు విశ్వసించారు. వ్యక్తిగత విశ్వాసం, దృశ్య పవిత్రీకరణపై వారి బలమైన ప్రాధాన్యతతో శిశు బాప్టిజం సరిపోకపోవడంతో పైటిస్టులు శిశు బాప్టిజంను తిరస్కరించారు. వారు శిశు బాప్టిజంను పవిత్రతను ఉత్పత్తి చేయనిదిగా చూశారు.

హోలీనెస్ మూవ్మెంట్ మరియు ఆత్మలో బాప్టిజం

అనాబాప్టిస్టులు, బాప్టిస్ట్లు, పైటిస్టులు బాప్తిస్మమును వారి వారి కారణాలతో బాప్తిస్మము యొక్క ఉద్ధేశ్యాన్ని దాని అర్ధాన్ని మార్చివేశారు. కొంత కాలమైన తరువాత కొందరికి, మన సంఘాలు మతం మార్చబడిన వ్యక్తులతో రూపొందించబడ్డాయని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం? అనే ఒక ప్రశ్న ఉద్భవించింది. ఇది సహజంగానే క్రైస్తవ మతంలో మరింత (వ్యక్తిగత అనుభవానికి) ఆత్మాశ్రయ దృష్టికి దారితీసింది.

ఒకని వ్యక్తిగత అనుభవము నుండి, “నేను మతం మార్చబడ్డానని నేను ఎలా ఖచ్చితంగా చెప్పగలను?” అని ఒకడు ఎలా చెప్పగలడు. ఈ ప్రశ్నకు హోలీనెస్ మూవ్మెంట్ మరియు పెంతెకోస్తలిజంలో అనేకులు ఇచ్చిన జవాబు బాప్టిజం యొక్క నిజమైన స్వభావం గురించి మరింత గందరగోళానికి దారితీసింది.

హోలీనెస్ మూవ్మెంట్ని మరియు దాని సంతానమైన పెంతెకోస్టల్ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడానికి మనం దాని ఆధ్యాత్మిక తండ్రియైన జాన్ వెస్లీని చూడాలి. జాన్ వెస్లీ (1703-1791) ఒక ఆంగ్లికన్ పాస్టర్ గారి కుటుంబంలో జన్మించాడు పెరిగాడు, తన పవిత్ర తల్లి సుసన్నా నుండి క్రైస్తవ బోధన పొందాడు. 1725 లో డీకన్‌గా నియమితుడయ్యాడు. తన జీవితంలో మొదటి అర్ధభాగంలో తన విశ్వాసం గురించి సందేహాలతో అతడు కలత చెందాడు. తన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అతడు థామస్ ఎ’కెంపిస్ వంటి ధ్యాన రచయితలను, లూథరన్ మరియు కాల్వినిస్ట్ రచనలను, మధ్యయుగ ఆధ్యాత్మికవేత్తల పుస్తకాలను అతడు విస్తృతంగా చదివాడు. 1738లో, అతడు మొదట మొరావియన్లతో పరిచయం కలిగి ఉన్న జార్జియాలో రెండు సంవత్సరాల మిషన్ పని తర్వాత, అతడు లండన్‌కు తిరిగి వెళ్ళేటప్పుడు తన జర్నల్‌లో ఇలా వ్రాసుకొన్నాడు : జార్జియా ఇండియన్లకు క్రైస్తవత్వాన్ని ప్రకటించడానికి నేను నా స్వదేశాన్ని విడిచిపెట్టి రెండు సంవత్సరాలకు పైగా అయ్యింది; కాని ఈలోగా నేను ఏమి నేర్చుకున్నాను? ఇతరులను మతం మార్చడానికి అమెరికాకు వెళ్ళిన నేను ఎందుకు మారలేదు?

లండన్‌లో వెస్లీ మొరావియన్లతో తన సంబంధాన్ని కొనసాగించాడు. మే 24, 1738న అతడు వెతుకుతున్న నెమ్మదిని కనుగొన్నాడు: ఆ సాయంత్రం నేను చాలా అయిష్టంగానే ఆల్డర్స్‌గేట్‌లోని ఒక సమాజానికి వెళ్ళాను. అక్కడ ఒకరు లూథర్ రోమన్ పత్రికకు వ్రాసిన ముందు మాటను చదువుతున్నారు. తొమ్మిది గంటలకు దాదాపు పావు గంటకు ముందు, క్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుడు హృదయంలో చేసే మార్పును గురించి అతడు వివరిస్తుండగా, నా హృదయం వింతగా వేడెక్కినట్లు నాకు అనిపించింది. రక్షణ కోసం నేను క్రీస్తును, క్రీస్తును మాత్రమే విశ్వసించానని నాకు అనిపించింది. ఆయన నా పాపాలను కూడా తీసివేసాడని మరియు పాపం మరణం యొక్క అధికారం నుండి నన్ను రక్షించాడని నాకు హామీ ఇవ్వబడింది.

ఈ “మార్పిడి అనుభవం” తర్వాత వెస్లీ విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతునిగా ప్రకటించబడ్డాను అనే సిధ్ధాంతాన్ని ఒప్పుకున్నాడు కాని విశ్వాసంతో మాత్రమే, ఆ విశ్వాసం ద్వారా సృష్టించబడిన బలమైన భావోద్వేగాలను బట్టి అతడు కన్ఫ్యూజ్ అయ్యాడు. వెస్లీ సత్యాన్ని కంటే ఈ వ్యక్తిగత అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. ఫలితంగా, క్రైస్తవుని జీవితంలో విశ్వాసం యొక్క సాక్ష్యంపై ప్రాధాన్యత అతని మెథడిస్ట్ వ్యవస్థలో ప్రాధాన్యత పొందింది.

దీనిని మనం అతని పరిపూర్ణత సిద్ధాంతంలో చూస్తాము. జాన్ వెస్లీ ఉద్దేశ్యం క్రైస్తవులు ఈ జీవితంలో దేవునిలాగా పూర్తిగా పాపరహితులుగా లేదా పరిపూర్ణులుగా మారవచ్చని కాదు. బదులుగా, క్రైస్తవ పరిపూర్ణత అనేది పరిణతి చెందిన స్థితి అని అతడు బోధించాడు. ఇక్కడ విశ్వాసి హృదయం దేవుని పట్ల మరియు పొరుగువారి పట్ల ప్రేమతో నిండి ఉంటుంది, ఎంతగా అంటే: ఇకపై ఉద్దేశపూర్వకంగా చేసే పాపం ఉండదు. క్రైస్తవులు తప్పులు చెయ్యొచ్చు, బలహీనతతో పోరాడుతూ ఉండొచ్చు లేదా జ్ఞానం లేకపోవచ్చు, కాని వారు ఉద్దేశపూర్వకంగా ఇకపై పాపం చేయడాన్ని ఎంచుకోరు. స్వార్థం పవిత్ర ప్రేమతో భర్తీ చేయబడుతుంది. ఒకరి కోరికలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాయి. కృపలో పెరుగుదల క్రమంగా ఉంటుంది (పవిత్రీకరణ లాగా). దేవుడు ఒక క్షణం పూర్తి పవిత్రతను క్రైస్తవునికి ఇవ్వగలడని వెస్లీ నమ్మాడు. మతమార్పిడి తర్వాత కృప యొక్క రెండవ ఆశీర్వాదం ఇది. ఈ సిధ్ధాంతానికి బైబిల్ ఫౌండేషన్ గా వెస్లీ, మత్తయి 5:48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మరియు 1 థెస్సలొనీకయులు 5:23, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, వంటి వచనాలను ఆధారంగా చేసుకున్నాడు.

ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎ మెథడిస్ట్ అనే ఒక కరపత్రంలో, ఒక క్రైస్తవుడు ఈ జీవితంలో సాధించగల పరిపూర్ణత గురించి తన అవగాహనను అతడు ఇలా నిర్వచించాడు: ఒకని ఆత్మ అంతా ప్రేమతో, కరుణ, దయ, సాత్వికత, సౌమ్యత మరియు దీర్ఘశాంతముతో నిండి ఉంటుంది. దేవుని ప్రేమతో వాని హృదయం జ్వలిస్తూ ఉంటుంది. ఆర్చ్ బిషప్ అషర్ మాటలలో చెప్పాలంటే, ‘ప్రతి ఆలోచన, మాట మరియు క్రియ నిరంతరం ఆధ్యాత్మిక అర్పణగా, క్రీస్తు ద్వారా దేవునికి ఆమోదయోగ్యముగా ఉంటుంది. మన హృదయాలలోని ప్రతి ఆలోచనలో, మన నాలుక నుండి వచ్చే ప్రతి మాటలో, మన చేతుల యొక్క ప్రతి పనిలో, చీకటి నుండి తన అద్భుతమైన వెలుగులోకి మనలను పిలిచిన ఆయనకు స్తుతిని ప్రదర్శిస్తూ ఉంటుంది.

వెస్లీ యొక్క “పరిపూర్ణత” అనే భావన విశ్వాసి జీవితంలో అన్ని పాపాల ముగింపు కంటే దేవుని పట్ల నిరంతర మతపరమైన వెచ్చదనంతో సంబంధం కలిగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరిపూర్ణతను సాధించడం అనేది క్రైస్తవుడు తన జీవితాంతం సాధించడానికి ప్రయత్నించాల్సిన విషయం, కాని దానిని సాధించవచ్చని అతడు బోధించాడు. 1785లో రెవరెండ్ ఫ్రీబోర్న్ గారెట్సన్‌కు రాసిన ఒక లేఖలో అతడు: వారిలో ఎవరూ సగం క్రైస్తవులుగా ఉండటంలో విశ్రాంతి తీసుకోకూడదు. వారు ఏమి చేసినా, దానిని వారి శక్తితో చేయనివ్వండి; మరియు వారిలో ఎవరైనా దేవునితో శాంతిని కనుగొన్న వెంటనే, వారిని “పరిపూర్ణతకు వెళ్లండి” అని ఉద్బోధించడం మంచిది. సాధారణ విశ్వాసం ద్వారా ఇప్పుడు సాధించగలిగే విధంగా, పూర్తి పవిత్రీకరణ కోసం మీరు విశ్వాసులను ఎంత స్పష్టంగా బలంగా ఒత్తిడి చేస్తే, దేవుని మొత్తం పని అంతగా వృద్ధి చెందుతుంది అని వ్రాసాడు.

వెస్లీ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి నేర్చుకున్నట్లుగా బాప్టిజంను కొనసాగించడానికి సంతోషంగా ఉన్నాడని, దానిని కృప యొక్క సాధనంగా పేర్కొన్నట్లు మరియు శిశు బాప్టిజంను సమర్థిస్తూ ఒక గ్రంథాన్ని కూడా రాశాడని తెలుస్తోంది. బదులుగా, విశ్వాసం యొక్క అనుభవం మరియు “పూర్తి పవిత్రీకరణ” లేదా పరిపూర్ణతపై అతడు నొక్కిచెప్పడం హోలీనెస్ మొవెమెంట్కి మరియు “పరిశుద్ధాత్మతో /ద్వారా, బాప్తిసం” అనే వక్రీకరణకు పునాది వేసింది.

బాప్తిస్మమిచ్చు యోహాను తన కాలంలోని ప్రజలకు, మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును, మత్తయి 3:11 అని చెప్పాడు. “బాప్తిసం” అనే పదం ఈ భాగంలో రెండు వేర్వేరు విషయాలకు ఉపయోగించబడిందనేది నిజం, రెండింటితో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఒక వైపు, ఇది దేవుని క్షమాపణ వాగ్దానంతో అనుసంధానించబడిన నీటిని వర్తింపజేయడానికి ఉపయోగించబడుతుంది – ఆచారంగా లేదా మతకర్మగా. మరోవైపు, క్రీస్తు తన ప్రజలపై పరిశుద్ధాత్మను క్రుమ్మరించడానికి ఇది ఉపయోగించబడుతుంది. పెంతెకోస్తు రోజున యోహాను మాటలు నెరవేరాయని అపొస్తలుల కార్యములు 1:5 స్పష్టం చేస్తుంది.

లేఖనం వారి జీవితాల్లో పరిశుద్ధాత్మను కోరుకునే వారిని వాక్యం మరియు మతకర్మల వైపుకు నడిపిస్తుంది. ఎఫెసీయులు 5లో అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను “ఆత్మ పూర్ణులైయుండుడి” అని ప్రోత్సహించాడు. తరువాత అతడు వారికి, ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి అని చెప్పాడు, (5:19). ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి అని యేసు చెప్పాడు (యోహాను 6:63). పెంతెకొస్తు దినమున అపొస్తలుడైన పేతురు తన ఎదుట ఉన్న ప్రజలతో మాట్లాడుతూ, మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు, అపొస్తలుల కార్యములు 2:38 అని చెప్పాడు. యోహాను ద్వారా బాప్తిస్మము పొందినప్పుడు యేసు స్వయంగా పరిశుద్ధాత్మను పొందాడు. పెంతెకొస్తు దినమున శిష్యుల మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు కూడా, వారు ఆరాధన కొరకు వాక్యము చుట్టూ గుమిగూడినట్లు కనిపిస్తుంది (అపొస్తలుల కార్యములు 2:1).

అనాబాప్టిస్టులు, బాప్టిస్టులు మరియు పైటిస్టులు బాప్టిజం ద్వారా దేవుడు పునరుజ్జీవన శక్తితో పనిచేస్తాడని నమ్మలేదు కాబట్టి, వారు “… ఆత్మలో బాప్టిజం ఇవ్వండి…” అనే ఆలోచనకు తెలియకుండానే చేయూతను ఇచ్చారు. వాళ్ళు దేవుడు కృపా వాహనమైన బాప్టిజం ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా పనిచేస్తాడనే వివరణకు వచ్చారు. వారికి, “ఆత్మ బాప్టిజం” ఆచరణాత్మకంగా “నిజమైన మార్పిడికి” సమానంగా అనిపించింది.

హోలీనెస్ మొవెమెంట్లో వెస్లీ యొక్క వారసులు ఒక అడుగు ముందుకు వేశారు. 19వ శతాబ్దం మధ్యలో యునైటెడ్ స్టేట్స్ అంతటా వెస్లీ యొక్క పూర్తి పవిత్రీకరణ సిద్ధాంతం వ్యాపించడంతో “పవిత్రీకరణ యొక్క వేదాంతశాస్త్రం”గా పరిణామం చెందడం ప్రారంభించింది. 1837లో ఫోబ్ పామర్ అనే ఒక మహిళ ప్రార్థన సమావేశాన్ని ఆమె సోదరి ఇంట్లో నిర్వహించింది. ఫోబే దర్శకత్వంలో, ఇది “పవిత్రీకరణ యొక్క ప్రచారం కోసం మంగళవారం సమావేశం”గా ప్రసిద్ధి చెందింది. తరువాతి 37 సంవత్సరాల పాటు పురుషులు స్త్రీలతో సహా వేలాది మంది ఆమె పార్లర్‌లో “సంపూర్ణ పవిత్రీకరణ” అని పిలువబడే వారి హృదయాలపై దేవుని రెండవ పనిని అనుభవించినట్లు చెప్పుకునేలా అది నడిపించబడింది. వెస్లీ బోధించిన పరిపూర్ణత అనుభవానికి మరియు లేఖనంలోని పెంతెకొస్తు సంఘటనకు మధ్య సంబంధాన్ని ఏర్పరచిన మొదటి వ్యక్తి పామర్ అని తెలుస్తోంది. ఈ సంబంధం చాలా ఖచ్చితమైనది, ‘పరిశుద్ధాత్మ బాప్టిజం’ మరియు పెంతెకొస్తు భాష యొక్క ఇతర వ్యక్తీకరణలు మొత్తం పవిత్రీకరణకు వేదాంత సమానమైనవి. పరిపూర్ణత విశ్వాసులకు తక్షణ అనుభవంగా వెంటనే అందుబాటులో ఉందని కూడా ఆమె నొక్కి చెప్పింది.

ప్రసిద్ధ ఉజ్జీవవాదియైన చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ, “ఓబెర్లిన్ పరిపూర్ణత” అనే తన బోధన ద్వారా పరిశుద్ధాత్మలో బాప్టిజం అనే ఆలోచనను పునర్నిర్మించాడు. పాపం నుండి హృదయాన్ని శుద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి బదులుగా, ఫిన్నీ ఈ రెండవ కృప అనుభవంతో వచ్చిన పవిత్ర జీవనం మరియు ప్రభావవంతమైన సాక్ష్యం కోసం శక్తినిచ్చే అనుభవంగా నొక్కి చెప్పాడు. అతని బోధన తరువాత కాలంలో పెంతెకోస్తువాదం వైపు అడుగువేసింది.

ఒబెర్లిన్ పరిపూర్ణతావాదం అనేది 19వ శతాబ్దపు మత ఉద్యమం, ఇది ఒబెర్లిన్ కళాశాల పునరుజ్జీవన సంప్రదాయానికి (ముఖ్యంగా చార్లెస్ ఫిన్నీ మరియు ఆసా మహాన్ కాలంలో) అనుసంధానించబడింది. ఇది క్రైస్తవ పరిపూర్ణతావాదం యొక్క విలక్షణమైన రూపం – విశ్వాసులు ఈ జీవితంలో పవిత్రత లేదా పరిపూర్ణ ప్రేమ స్థితిని చేరుకోగలరనే ఆలోచన. మూలం మరియు నేపథ్యం : ఒహియోలోని ఒబెర్లిన్ కళాశాలలో కేంద్రీకృతమై ఉంది (1833లో స్థాపించబడింది). చార్లెస్ జి. ఫిన్నీ యొక్క పునరుజ్జీవన బోధన మరియు ఆసా మహాన్ (ఓబెర్లిన్ మొదటి అధ్యక్షుడు) యొక్క వేదాంత నాయకత్వం ద్వారా ప్రభావితమైంది. రెండవ గొప్ప మేల్కొలుపు నుండి ఉద్భవించింది. విశ్వాసులు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పాపం చేయకూడదని మరియు పూర్తి పవిత్రీకరణలో (దేవుడు మరియు పొరుగువారి పట్ల పరిపూర్ణ ప్రేమ) జీవించ డానికి ఎంచుకోవచ్చని నమ్మారు. పాపాన్ని సంకల్పానికి సంబంధించిన విషయంగా భావించారు. ఒక క్రైస్తవుడు దేవునికి పూర్తిగా లొంగిపోతే, వారు పాపాన్ని నివారించవచ్చని భోదించారు.

కొంతమంది వెస్లియన్ పరిపూర్ణతావాదుల మాదిరిగా కాకుండా, ఒబెర్లిన్ నాయకులు తక్షణ “రెండవ ఆశీర్వాదం” అనుభవం కంటే విశ్వాసి యొక్క నైతిక ఎంపికలను నొక్కిచెప్పారు. వ్యక్తిగత బాధ్యత మరియు సమాజంలో చురుకైన క్రైస్తవ జీవనాన్ని నొక్కిచెప్పారు. పవిత్రతను వ్యక్తిగత స్వచ్ఛత మరియు సామాజిక చర్య రెండింటిగా చూశారు.

ఓబెర్లిన్ పరిపూర్ణతావాదులు మానవ సామర్థ్యం గురించి చాలా ఆశావాదంగా ఉన్నారని మరియు అసలు పాపం యొక్క నిలకడను తక్కువగా చూపిస్తారని విమర్శకులు ఆరోపించారు. చాలా మంది సాంప్రదాయ కాల్వినిస్టులు దీనిని పెలాజియన్ (మానవ స్వేచ్ఛా సంకల్పాన్ని అతిగా నొక్కి చెప్పడం) గా తిరస్కరించారు. అయినప్పటికీ, క్రియాశీలత మరియు పవిత్రతపై ఒబెర్లిన్ యొక్క ప్రాధాన్యత తరువాతి పవిత్ర ఉద్యమాలను మరియు పెంటెకోస్టలిజాన్ని కూడా ప్రభావితం చేసింది.

చార్లెస్ ఫాక్స్ పర్హామ్ పవిత్రతను పెంటెకోస్టలిజంలోకి నడిపించిన వ్యక్తి. మెథడిస్ట్ అయిన పర్హామ్, తన పూర్వీకుడు వెస్లీ లాగా అతడు కూడా ప్రభువుతో తన సంబంధం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అతడు “ఆయన ఉనికిని నిజంగా అనుభవించాలని” ఆశపడ్డాడు. ఎందుకంటే? పరిశుధ్ధాత్మతో నిజంగా నింపబడ్డాను అనే రుజువును బయలుపర్చాలని పర్హామ్ ఆశపడ్డాడు. ఒక వ్యక్తి తాను పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందాడని నిజంగా ఎలా నిశ్చయతను కలిగి ఉండగలడు? మతం మారిన మరియు పవిత్రం చేయబడిన ప్రతి విశ్వాసి అలాంటి “బాప్టిజం” పొందాలని పర్హామ్ గట్టిగా నమ్మాడు.

పర్హామ్ కాన్సాస్‌లోని టొపెకాలో ఉన్న రన్ అనే బైబిల్ కళాశాలలో, తన విద్యార్థులకు అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని చదవమని చెప్పి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో బాప్టిజం పుచ్చుకొన్నాడనుటకు లేఖనం ఎలాంటి ఆధారాలను ఇస్తుందో ఖచ్చితంగా తెలుసుకోమని చెప్పాడు. మూడు రోజుల తరువాత ఆ 40 మంది విద్యార్థులు, అందుకు భాషలు మాట్లాడటమే వారు వెతుకుతున్న సాక్ష్యం అనే నిర్ణయానికి వచ్చారు. డిసెంబర్ 31, 1900న, రోజంతా ప్రార్థన చేసిన తర్వాత, విద్యార్థులలో ఒకరు ఊహించినట్లుగానే భాషలు మాట్లాడటం ప్రారంభించాడు, —అక్కడున్న వారిలో ఒకడు చెప్పినట్లుగా, చైనా భాషలో మాట్లాడాడు . (ఇతరులు ఎవరూ చైనీస్ మాట్లాడలేరు కాబట్టి ఇది ఒక రహస్యం అని వారికి ఎలా తెలుసు).

హోలీనెస్ మూవ్మెంట్ “ఆత్మ బాప్టిజం” యొక్క వ్యక్తిగత అనుభవంపై దృష్టిని మరల్చడం ద్వారా బాప్టిజం విలువను బాగా తగ్గించింది. ఆధ్యాత్మిక శక్తిపై ఎక్కువగా ప్రాధాన్యత నిచ్చారు. దేవుని పని యొక్క దృశ్య రుజువైన నీటి బాప్టిజంకు తక్కువ విలువనిచ్చారు. దానిని పురాతన కాలంలో ఉన్న పాత ఆచారంగా పరిగణించారు. క్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపడం వల్ల ఇప్పటికీ ఆచరించబడుతున్నప్పటికీ, దానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడలేదు.

హోలీనెస్ మూవ్మెంట్ లోని కొన్ని శాఖలు బాప్టిజంను పూర్తిగా వదిలివేయడానికి కూడా వెళ్ళాయి. అది ఆత్మలను గెలుచుకునే లక్ష్యానికి ప్రత్యక్షంగా సేవ చేయకపోతే అది అనవసరమని భావించాయి. వ్యక్తిగత మార్పిడి మరియు బాహ్యంగా మారిన జీవితాలపై పునరుజ్జీవన ప్రాధాన్యత చర్చి ఆచారాల పట్ల ఆచరణాత్మక విధానానికి దారితీసింది, ఉపయోగకరంగా అనిపించిన వాటిని మాత్రమే ఉంచింది. ఈ మనస్తత్వం సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడు విలియం బూత్‌ను (1829-1912) ప్రభావితం చేసింది. అతడు చివరికి ఈ సిద్ధాంతాలు లేదా నమ్మకాల అర్థం యొక్క సత్యాన్ని వాటి ఆచరణాత్మక అనువర్తనం యొక్క విజయం పరంగా అంచనా వేసే విధానంలో భాగంగా బాప్టిజంను విస్మరించాడు.

విలియం కుమారుడు బ్రామ్‌వెల్ బూత్ ప్రకారం, విలియం బూత్ మతకర్మలను తిరస్కరించడం, ఇది మన గొప్ప లక్ష్యానికి సహాయపడుతుందా? అది సహాయం చేయకపోతే, అది ఆటంకం కలిగిస్తుందా? అనే ప్రశ్నల వల్ల ఉద్భవించింది అని చెప్పాడు. కాలక్రమేణా, మతకర్మలు రక్షణకు అవసరం లేదని మాత్రమే కాకుండా, అవి సువార్త ప్రచార పనిని కూడా అడ్డుకోగలవని అతడు నిర్ధారించాడు. ఈ దృక్పథం మతకర్మలను దేవుడు ఇచ్చిన ఆధ్యాత్మిక ఆశీర్వాద మార్గాలుగా చూసే “కృప వాహనాలు” అనే అవగాహనకు పూర్తి విరుద్ధంగా ఉంది.

బూత్ వాదన ఇలా ఉంది: చాలా మంది క్రైస్తవులు దేవుడిపై కాకుండా బైబిళ్లు, ప్రార్థనలు, వేడుకలు లేదా ఇతర మతపరమైన ఆచారాలపై ఆధారపడటం ద్వారా తమ నమ్మకాన్ని కోల్పోయారని బూత్ తర్కించాడు. అలాంటి మార్గాలు మంచివి అయినప్పటికీ, అవి దేవుని కంటే ఉన్నతమైనప్పుడు హానికరంగా మారతాయని, దేవుడు రక్షణను తీసుకురావడానికి మార్గాలను నిజంగా ఏర్పాటు చేశాడని అతను నమ్మాడు, కాని వాటిని సాధ్యమైనంత ఆచరణాత్మకంగా మరియు ప్రభావవంతంగా చేయాలని, అవి దేవునిపై నమ్మకాన్ని భర్తీ చేయకుండా వాటి నిజమైన ఉద్దేశ్యాన్ని నెరవేర్చాలని నొక్కి చెప్పాడు.

సాల్వేషన్ ఆర్మీకి “కృపా వాహనాలు” ఉన్నాయి, అవి వారి స్వంతంగా తయారు చేసుకున్న వాహనాలు. బాప్టిజం మరియు ప్రభువు భోజనం స్థానంలో మతేతర రాగాలను వాయించే ఇత్తడి బ్యాండ్ల మతకర్మలు, సైనిక యూనిఫాంలు, పుష్ప ప్రదర్శనలు మరియు దాతృత్వ బహిరంగ ప్రదర్శనలు ఉన్నాయి.

పవిత్రత మరియు పెంతెకోస్టల్ ఉద్యమాల వారసత్వాన్ని పంచుకునే ఇతర చర్చిలకు నేడు బాప్టిజం పై బలమైన వేదాంతశాస్త్రం లేదు, ముఖ్యంగా స్వతంత్రసంఘాలకు. బాప్టిజం యొక్క అర్థం మరియు ఆచారం క్రైస్తవ చరిత్ర అంతటా విభజనకు దారితీసిందని గుర్తించి, కొందరు ప్రజలను ఆకర్షించడానికి బాప్టిజంపై అధికారిక ప్రకటనను కలిగి ఉండకూడదని ఎంచుకుంటారు. ఇవి ఇప్పటికీ మతకర్మల యొక్క బాప్టిస్ట్ విధమైన వేదాంతశాస్త్రాన్ని బోధిస్తాయి. పవిత్ర ఉద్యమం యొక్క నిర్మితమైన “ఆత్మ బాప్టిజం” ప్రజలు కోరుకునే దృఢమైన హామీని ఎప్పటికీ అందించదు. ఇది వారిని ఆధ్యాత్మిక భావోద్వేగాల రోలర్ కోస్టర్ రైడ్‌లో ఉంచుతుంది. ఇది క్రైస్తవుని జీవితంలో పవిత్రాత్మ ఉనికికి పెరుగుతున్న వింతైన “రుజువుల” అభివృద్ధికి దారితీస్తుంది.

ఇటువంటి ఘనమైన మేళ్లను నీళ్లు ఎలా కలుగజేస్తాయి?

అనాబాప్టిస్ట్, బాప్టిస్ట్ లేదా పెంతెకోస్టల్ వారి, జవాబు క్లుప్తం: “నీటితో బాప్టిజం గొప్ప పనులు చేయదు, కాబట్టి దాని శక్తి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు.” బాప్టిజం అనేది ఒక విశ్వాసి “క్రీస్తు తన జీవితంలో ఏమి చేసాడో దానిపై నమ్మకానికి సాక్ష్యమిచ్చే సమయం, క్రీస్తుతో ఐక్యంగా జీవించడానికి, చర్చిలో, దేవుని ప్రజలలో భాగం కావడానికి కట్టుబడి ఉంటాడు,” ఈ వాగ్దానాలను చేయడానికి మరియు నిలబెట్టుకోవడానికి విశ్వాసి యొక్క శక్తి మాత్రమే అవసరమైన శక్తి.

కాథలిక్ చర్చి మరియు లూథరన్ చర్చి బాప్టిజం పొందిన వారిపై అది శక్తివంతంగా పనిచేస్తుందని నమ్ముతాయి. సంస్కరణ సమయంలో, లూథర్ తన కాలంలోని చర్చి దేవుని వాక్యంతో భూసంబంధమైన అంశాల సంబంధం బాప్టిజంకు క్షమించే పునరుజ్జివింపచేసే శక్తిని ఇస్తుందని గుర్తించడంలో విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశాడు. స్మాల్కాల్డ్ వ్యాసాల భాగం III, ఆర్టికల్ V లో, లూథర్ ఇలా వ్రాశాడు: బాప్టిజం అనేది నీటితో జతచెయ్యబడిన దేవుని వాక్యం తప్ప మరొకటి కాదు. పౌలు చెప్పినట్లుగా, వాక్యంలో కడుగుకోవడం…. ఈ కారణంగా మేము థామస్ [లేదా డొమినికన్లు] విభేదించము, వారు దేవుని స్థాపించిన ఆచారాన్ని మరచిపోయి, దేవుడు నీటికి ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చాడని, అది నీటి ద్వారా పాపాన్ని కడుగుతుందని చెబుతారు. స్కాటస్ [మైనరైట్లు లేదా ఫ్రాన్సిస్కాన్ సన్యాసులు] దైవిక సంకల్పం సహాయంతో, బాప్టిజం పాపాలను కడుగుతుందని మరియు ఈ అభ్యంగనీకరణ దేవుని చిత్తం ద్వారా మాత్రమే జరుగుతుందని, ఏ విధంగానూ వాక్యం లేదా నీటి ద్వారా కాదని బోధించేవారని చెప్పాడు.

నీటికి మరియు వాక్యానికి మధ్య ఉన్న ఈ విభజన, బాప్టిజం తర్వాత మిగిలిపోయిన నీటి చుట్టూ పెరిగిన కొన్ని మూఢ నమ్మకాలు మరియు ఆచారాలకు దోహదపడింది లేదా బలోపేతం చేసింది. అయితే, ఆధునిక కాలంలో, కాథలిక్ చర్చి నీరు మరియు వాక్యానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని తిరిగి పొందింది. కాథలిక్ చర్చి యొక్క కేటకిజం ఇలా చెబుతోంది: బాప్టిజం అనేది దేవుని వాక్యం యొక్క “నాశనం కాని విత్తనం” దాని జీవాన్నిచ్చే ప్రభావాన్ని ఉత్పత్తి చేసే నీటి స్నానం. సెయింట్ అగస్టీన్ బాప్టిజం గురించి ఇలా అన్నాడు: “వాక్యం భౌతిక మూలకానికి తీసుకురాబడుతుంది, మరియు అది ఒక మతకర్మగా మారుతుంది.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని భద్రపర్చాలనే ఈ ప్రయత్నాన్ని గుర్తించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,          
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl