మత్తయి సువార్త 4వ అధ్యాయము వ్యాఖ్యానము

యేసు శోధన
మత్తయి 4:1-11, 1అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 2నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా 3ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. 4అందుకాయన –మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. 5అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి 6–నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము – ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. 7అందుకు యేసు – ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను. 8మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి 9–నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా 10యేసు వానితో–సాతానా, పొమ్ము – ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. 11అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.

యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరలోకమందున్న తండ్రి యేసుని గురించి సాక్ష్యమిచ్చిన తరువాత, యేసు అపవాది చేత శోధింపబడుటకు తన బహిరంగ పరిచర్య ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ యేసును అరణ్యంలోకి నడిపించిందని మత్తయి చెప్పాడు. యేసు ఇష్టపూర్వకంగా వెళ్ళాడని కూడా స్పష్టంగా తెలుస్తుంది. యేసు చిత్తానికి మరియు తండ్రి లేదా పరిశుద్ధాత్మ చిత్తానికి మధ్య ఎప్పుడూ వివాదం లేదు.

యేసు మనకోసం సాతానును జయించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. యేసుకు వచ్చిన శోధనలను పరిశీలిస్తే ఆయన ఎలాంటివాడో, సైతాను ఎలాంటివాడో, ఇలాంటి శోధనలను జయించడమెలానో మనం నేర్చుకోగలం. యేసును తన పరిచర్య కోసమని అంతకు ముందే దేవుని ఆత్మ ఆభిషేకించాడు, మత్తయి 3:16. దేవుని రాజ్యం సమీపించింది. రాజు అభిషేకింపబడ్డాడు. యొర్దాను నది నుండి ఆత్మ ఆయనను విషమ పరీక్షలను లేక దుష్ప్రేరణలను ఎదుర్కొనేందుకు అరణ్యమునకు తోడ్కొని వెళ్ళాడు. గొప్ప రాజ్యాన్ని తీసుకు వచ్చే రాజు ఉపవాసం, ఆకలి, పరీక్షలకు గురికావడం మానవుని పద్ధతి ఎంత మాత్రమును కాదు. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనది. ఆ రాజ్యానికి రాజు అయిన వ్యక్తి స్వభావాన్ని పరీక్షలకు గురిచేసి ఆమోదించాలి. ఆయన దేవుని రాజ్యానికి శత్రువైన సైతానును ఓడించాలి. ఈ విషమ పరీక్షల వల్ల యేసు పరమ తండ్రికి పూర్తిగా విధేయుడని అన్నిటిలోను ఆయన్ను ఆనందపరిచేవాడని వెల్లడి అయ్యింది.

“శోధింపబడుట” అని అనువదించబడిన గ్రీకు క్రియను “పరీక్షించబడుట” అని కూడా అనువదించొచ్చు. శోధించటం అంటే లోహాల విషయానికి వస్తే అగ్ని ద్వారా లోహాల యొక్క స్వభావాన్ని పరీక్షించడం అని అర్ధం. మనుష్యుల విషయానికి వస్తే ఒకని నైతిక లక్షణాలను పరీక్షించడం, అతడు ఎలా సహిస్తాడో చూడటం. ఇది దైవికంగా ఉద్దేశించబడింది, దీని ప్రాథమిక నేపథ్యం ద్వితీయోపదేశకాండము 8:1-5, ఈ భాగము నుండే యేసు అపవాది కిచ్చిన తన మొదటి జవాబును ఉటంకించాడు. అక్కడ, మోషే ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము (ద్వితీయోప 8:2) దేవుడు అరణ్యంలో వారిని ఎలా నడిపించాడో గుర్తుచేసుకున్నాడు. ఇక్కడ తన పరిచర్య ప్రారంభంలో యేసు ఇలాంటి పరీక్షకు గురయ్యాడు. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రదుకుదురని నిజమైన ఇశ్రాయేలీయుడిగా ఆయన తనను తాను చూపుకొన్నాడు (ద్వితీయోప 8:3). ఆదాము ఏదెను పరీక్షలో విఫలమయ్యాడు మరియు మానవ జాతిని మొత్తంగా పాపంలోకి నెట్టాడు (ఆది 3). యేసు దేవునికి సంపూర్ణ విధేయునిగా తద్వారా ఆయనను స్వీకరించే వారందరికీ రక్షకుడిగా మారడానికి తన అర్హతను శోధనలలో ప్రదర్శించాడు. అంతేకాకుండా, యేసు ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము (హెబ్రీ 2:16), మరియు శోధింపబడు వారికి సహాయము చేయడానికి (హెబ్రీ 2:17; హెబ్రీ 4:15-16) ఇశ్రాయేలు మరియు మనలాగే ఆయన పరీక్షించబడటం/ శోధించబడటం చాలా ముఖ్యం.

శోధన అనేది ఒక పరీక్ష. పరీక్షించబడే వ్యక్తి అందులో ఉతీర్ణుడౌవచ్చు లేదా విఫలమవ్వొచ్చు. శోధనలు అనేవి అనేక రూపాల్లో వస్తాయి. శోధన అనగానే మనం మొదటగా మనలను పాపము లోనికి నడిపించే వాటిని గూర్చే ఎక్కువగా ఆలోచిస్తాం. అది అనైతిక ప్రవర్తన కావొచ్చు లేదా దొంగతనం కావొచ్చు. శోధనలో మనం నొప్పి, బాధ, అనారోగ్యం, నిరాశ, పేదరికం మరియు వియోగం వంటి ఇష్టపడని అనుభవాలను కూడా చేర్చవల్సి ఉన్నాం. అలాంటి అనుభవాలు మనం దేవుని జ్ఞానాన్ని లేదా ప్రేమను ప్రశ్నించేందుకు కారణమవుతాయి. కొన్నిసార్లు విజయం, మంచి ఆరోగ్యం, శారీరక బలం, తెలివితేటలు, ప్రతిభ లేదా అందం అనేవి తీవ్రమైన శోధనలు కావచ్చు. ప్రతిఒక్కరం ఏదోవిధంగా నిత్యం శోధనలను ఎదుర్కొంటూనే ఉంటాం. శోధనలలో, వినయంగా దేవుని వాగ్దానాలను నమ్ముతూ, ఆయన దయపై ఆధారపడితే, దేవుడు ఖచ్చితంగా వాటిని భరించడానికి మనకు సహాయం చేస్తాడు. ఆయన అంతకంటే ఇంకా ఎక్కువగానే చేస్తాడు. వాటి ఫలితంగా మనకు ఆశీర్వాదాలు కలిగేటట్లు ఆయన చేస్తాడు.

ఈ శోధనలు అపవాది ఉద్దేశించినవి కావు, కాని దేవుడు ఉద్దేశించినవి. రక్షకుడు శోధించబడి విజయం సాధించాలనేది ఆయన శాశ్వత ప్రణాళిక. నిజమైన మానవుడిగా, యేసు నిజమైన శోధనను అనుభవించాడు. నిజమైన దేవుడిగా, ఆయన శోధనను అధిగమించాడు.

యేసు ఎదుర్కొన్న శోధనలు లోకాన్ని దాని విమోచకుడి నుండి దోచుకోవడానికి అపవాది చేసిన తీవ్రమైన ప్రయత్నాలు. విమోచకుడు అవసరమయ్యేలా సాతాను మొదటి ఆదామును పాపంలోకి నడిపించడంలో విజయం సాధించాడు. ఇప్పుడు వాడు రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తుపై దాడి చేసి, ఆయన విమోచనా కార్యాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు.

సాతాను దేవుని పవిత్ర దేవదూతలలో ఒకరిగా సృష్టించబడ్డాడు. కాని ఇప్పుడు వాడు పడిపోయిన ఒక దేవదూత. వాడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. వాని తిరుగుబాటులో వానిని అనుసరించిన అనేక మంది దేవదూతలతో పాటు వాడు పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. ఇది ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో మనం ఖచ్చితంగా చెప్పలేం. ఆపై దేవుడు సాతానును వాని దుష్ట దేవదూతలను ఎందుకు పూర్తిగా నాశనం చేయలేదనే విషయాన్ని కూడా మనం వివరించలేం. మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు ఇప్పటికీ సాతాను కంటే చాలా తెలివైనవాడు మరియు శక్తివంతుడు. మనం మన ప్రభువు మరియు రక్షకుడిపై నమ్మకం ఉంచినంత కాలం సాతాను మనపై ఆధిపత్యం చెలాయించలేడు.

ఇక్కడ సాతాను కోసం ఉపయోగించిన గ్రీకు పదం డయాబోలోస్ (దీని నుండే డయాబోలికల్ అనే పదం వచ్చింది). ఈ పదానికి నిందలు మోపేవాడు, దూషించేవాడు అని అర్థం. అపవాది అబద్ధాలకోరు. అపవాది కేవలం తెలివైన అబద్ధాలకోరు మాత్రమే కాదు వాడు అబద్దాలకు అలవాటు పడిన అబద్ధాలకోరు. వాడు నిరంతరం అబద్ధాలకోరు. వాడు అబద్ధాలకు జనకుడు. వాడు అబద్ధం చెప్పే ఆలోచనను కనిపెట్టాడు మరియు మొట్టమొదటి అబద్ధాన్ని చెప్పాడు. వాడు హవ్వకు చెప్పినట్లుగా అద్భుతమైన వాగ్దానాలు చేస్తాడు (మీరు చావనే చావరు ఆదికాండము 3:4), కాని వాడు వాటిలో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు మరియు ఎప్పటికీ నిలబెట్టుకోలేడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సత్యాలు మాట్లాడినను, వాడు వాటిని వక్రీకరిస్తాడు లేదా వాటిని తప్పుగా అన్వయిస్తాడు లేదా సందర్భం నుండి తీసివేస్తాడు లేదా వెంటనే వాటికి విరుద్ధంగా ముందుకు వెళ్తాడు.

అపవాది గురించి మనకు ఈ విషయాలు తెలుసు. అయినప్పటికీ మనం వాడి అబద్ధాలకు పడిపోతూనే ఉంటాం. దేవుని ఆజ్ఞలను మనం పాటించకపోతే జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుందని వాడు మనకు చెబుతాడు. కాబట్టి వాడు మనల్ని అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి, దొంగిలించడానికి మరియు వ్యభిచారం చేయడానికి ఒప్పిస్తాడు. మనం నిజంగా వేరొకరికి హాని కలిగించేది చేయనంత వరకు – దురాశ, కామం, అసహ్యకరమైన మాటలు మరియు దేవుని నామాన్ని దుర్వినియోగం చేయడంలో తప్పు లేదని వాడు మనకు చెబుతాడు. వాడి అబద్ధాలు అన్ని రకాల ఇబ్బందులకు, దుఃఖానికి, పశ్చాత్తాపానికి, చింతించేందుకు కారణమవుతాయి. అయినప్పటికీ, ప్రతి ఒక్కరి విషయంలో అలా జరగదని, భిన్నంగా ఉంటుందని వాడు ప్రజలను ఒప్పిస్తాడు. కాని ప్రతి సందర్భంలోనూ అపవాది వాగ్దానాలు మన మంచి లేదా ప్రయోజనం కోసం ఉద్దేశించబడలేదు. వాడి ఏకైక లక్ష్యం ప్రజలను దేవుని నుండి వేరు చేయడం లేదా ప్రజలను దేవుని నుండి వేరుగా ఉంచడం మరియు వారిని తనతో పాటు నరకం యొక్క శాశ్వత హింసలకు లాగడం.

దేవుడు తన ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాడు, కాని చెడు చేయడానికి శోధించేది అపవాదే (ఆదికాండము 22:1; యాకోబు 1:13; 1 యోహాను 3:8; ప్రకటన 2:9-10; 12:9-10). యేసు ఎదుర్కొన్న శోధనలను మనం పరిశీలిస్తున్నప్పుడు, ఒక కలవరపెట్టే ప్రశ్న మన మనస్సులోకి వస్తుంది: యేసు లొంగిపోయి పాపం చేసి ఉంటే? దీని వలన ఆయన మనల్ని విమోచించడం అసాధ్యం అయ్యేది. కాని ఇది జరిగి ఉండేదా? జరగదు. దేవుని కుమారుడిగా ఆయనకు పాపం అసాధ్యం. పరీక్షకు గురి అవుతున్నది ఆయన మానవ స్వభావమే గాని ఆయన దైవ స్వభావం కాదు (కీడు చేసేలా దేవునికి ప్రేరేపణ కలగడం అసాధ్యం (యాకోబు 1:13, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు). కాబట్టి ఫలితం విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ ఇది యేసుకు నిజమైన శోధన మరియు పోరాటం. ఇది మన అవగాహనకు మించినదని మనం వినయంగా అంగీకరించాలి.

యేసు 40 పగళ్లు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఆయనకు తినడానికి ఏమీ లేదు. సీనాయి పర్వతంపై మోషే 40 రోజులు ఆహారం, నీరు తీసుకోలేదని నిర్గమకాండము 34:28 మనకు చెబుతుంది. యేసు కూడా తన ఉపవాస సమయంలో ఆహారం, నీరు తీసుకోలేదని తెలుస్తోంది. 40 రోజులు తండ్రి ఆయనను ఆదుకున్నాడు. ఆ 40 రోజులు యేసు అపవాది నుండి నిరంతరం శోధనలను ఎదుర్కొన్నాడు. అయితే, ఆ శోధనల గురించి మనకు నిర్దిష్ట సమాచారం లేదు. నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొన్నాడు.

బైబిల్లో 40 అనే సంఖ్య ఎంత తరచుగా వస్తుందో గమనించడం ఆసక్తికరంగా ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు కొనసాగిన కుండపోత వర్షంతో మహా జలప్రళయం ప్రారంభమైంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్లే మార్గంలో 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపారు. ప్రవక్త ఏలీయా ఒకసారి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ప్రజలు పశ్చాత్తాపపడకపోతే నీనెవె నగరం 40 రోజుల్లో నాశనమవుతుందని ప్రవక్తయైన యోనా ప్రకటించాడు. ఈస్టర్ తర్వాత 40 రోజులకు యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. బైబిల్ వ్యాఖ్యానాలలో అటువంటి సంఖ్యల గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఈ 40లన్నింటికీ వర్తించే ఏ సాధారణ ఇతివృత్తాన్ని మనం గుర్తించలేకపోవచ్చు. బైబిల్ లో కొన్నిసార్లు 40 సంఖ్య పరీక్షకు సిద్దపటుకు గుర్తు. ఇది దేవుడు తన ప్రణాళికలను ఖచ్చితమైన, పరిమిత కాల వ్యవధిలో అమలు చేయడాన్ని మరియు ఆయన తన సంఘము మరియు ప్రపంచ వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉన్నాడని, ఆయన షెడ్యూల్ అమలు చేయబడుతుందని తెలియజేస్తుంది.

నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని” శోధకుడు యేసుతో చెప్పాడు. దాని అర్థం వాడు యేసుని దైవిక కుమారత్వాన్ని ప్రశ్నించలేదు/ అనుమానించడం లేదు లేదా యేసు ఆ వాస్తవాన్ని అనుమానించేలా వాడు ప్రయత్నం చెయ్యలేదు. సాతాను ఇలా సూచించి ఉండొచ్చు : నీవు దేవుని కుమారుడివి కాబట్టి, నీవు ఆకలితో ఉండనవసరం లేదు. నేను నీకు ఒక సరళమైన పరిష్కారం చెప్తాను. ఈ అరణ్యములోని రాళ్లలో కొన్నింటిని రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని వాడు చెప్పాడు. మనుషులందరికి ఆహరం అవసరమే. ప్రతి ఒక్కరు తమ ఆహారాన్ని తాము సంపాదించుకోవడంలో ప్రయత్నం చెయ్యడం తప్పు కాదు. అయితే దానిని సంపాదించుకొనే విషయంలో పరీక్ష వచ్చింది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలుగా నేల నుండి ఏరుకొనిన అద్భుతమైన ఆహారం అయిన మన్నాతో తినిపించబడ్డారు. కాబట్టి ఈ అద్భుత మార్గంలో మీరు మీ అవసరాలను తీర్చుకోకుండా ఉండటానికి ఎటువంటి కారణం అవసరం లేదు అని చెప్పాడు.

కాని యేసు ఈ సూచనను తిరస్కరించడానికి ఒక కారణం ఉంది. ఆయన తన శారీరక ఆకలిని తీర్చుకోవడానికి తన దైవిక శక్తిని తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించమని వాడు ఆయనను ప్రలోభపెట్టాడు. తండ్రిపై ఆధారపడకూడదని శోధించాడు. ఆయనను అప్పటికే తండ్రి 40 రోజులు అద్భుతంగా పోషించాడు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం యేసు తన దైవిక శక్తిని ఎప్పుడూ ఉపయోగించలేదు. యేసు చేసిన అద్భుతాలు ఎల్లప్పుడూ ఇతరుల ప్రయోజనం కోసమే. ఆయన మానవుల మధ్య తగ్గించుకొని జీవించడానికి వచ్చాడు. ఆయన తన భూసంబంధమైన జీవితమంతా అలాగే జీవించాడు.

4వ వచనంలో బాప్తిస్మం తర్వాత యేసు చెప్పిన మొదటి మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 8:3 నుండి దేవుని వ్రాతపూర్వక వాక్యాన్ని ఆయన ఉటంకించడం గమనార్హం. అందుకాయన, –మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి యున్నదనెను. శోధనలను ఎదుర్కోవడానికి మనకు ఉన్న ఆత్మ ఖడ్గాన్నే ఆయన ఉపయోగించాడు. తన శరీరానికి ఆహారం పొందడం కంటే తండ్రికి విధేయత చూపడం చాలా ముఖ్యమని ఆయన చెప్పాడు. దేవుని కుమారునిగా మన స్థానములో వచ్చిన నిజ మానవునిగా యేసు తన అవసరాలను తండ్రి తీరుస్తాడని నమ్మి, తండ్రి మాట పై మాత్రమే ఆధారపడ్డాడు తప్ప యేసు ఆహారం కోసం తన సొంత అద్భుత శక్తిపై ఆధారపడలేదు. ఒక సందర్భంలో యేసు తన శిష్యులతో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది అని చెప్పాడు (యోహాను 4:34). మరొక సందర్భంలో యేసు, నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను అని చెప్పాడు (యోహాను 5:30). మరొక సందర్భంలో యేసు, నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని అని చెప్పాడు (యోహాను 6:38). ఇంకొక సందర్భంలో యేసు, నన్ను పంపిన వాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాడు (యోహాను 8:29). మరొక సందర్భంలో యేసు, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. –బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములును పాపపరిహారార్థ బలులును నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను– గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పాడు (హెబ్రీ 10:5-7).

సైతాను సూచనకు తలవొగ్గి కడుపు నింపుకోవడం కంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా పస్తులుండడమే మేలు. ఈ లోకములో మనుష్యులకు అవసరమైనవి అవసరమని వారు అనుకొన్న వాటి విషయంలో ఇది వర్తిస్తుంది. ఈ విషయంలో దేవుని విధానమొకటి ఉంది. సైతాను విధానాలు కొన్ని ఉన్నాయి. దేవుడు మన అవసరాలు తీర్చగలడన్న విషయాన్ని సందేహించేలా సైతాను మనల్ని ప్రేరేపిస్తాడు. మనమే పూనుకొని అది మంచిదైనా చెడ్డదైనా ఏదో ఒక రీతిని మన అవసరాలు మనమే తీర్చుకొనేలా వాడు చేస్తాడు, మత్తయి 6:25-33; లూకా 12:16-21; ఫిలిప్పీ 4:19.

ఏదెనులో ఆదాము శోధనకు, ఎడారిలో క్రీస్తు శోధనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించడం ఆసక్తికరం. రెండు సందర్భాల్లోనూ దేవునిపై అపనమ్మకాన్ని రేకెత్తించడానికి సాతాను తినడానికి ఏదో ఒకటి ఉపయోగించాడు. సమృద్ధిగా ఉన్న ఏదెనులో వాడు విజయం సాధించాడు, అక్కడ తీరని ఆకలి లేదు. కాని యేసు చాలా ఆకలితో ఉన్నప్పుడు వాడు బంజరు అరణ్యంలో విఫలమయ్యాడు. యేసు తన భూసంబంధమైన జీవితమంతా అనుభవించిన శోధనలు మరియు బాధలు మనం భరించే పరీక్షల యొక్క గొప్ప రూపాలు. అయినప్పటికీ మనం పాపంలో పడిపోతూనే ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. ఆయన మన వైఫల్యాలన్నింటికీ మనం పొందవలసిన శిక్షను ఇష్టపూర్వకంగా అనుభవించాడు మరియు ఆయన తన విజయాలన్నింటికీ మనకు ఘనతను మరియు ఆశీర్వాదాలను ఇచ్చాడు. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది (యెషయా 53:5). మనం జీవించడానికి ఆయన మరణించాడు.

రెండవ గొప్ప శోధన కోసం, సాతాను యేసును పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి –నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము – ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి యున్నదని ఆయనతో చెప్పాడు. అది ఎలా జరిగిందో మనం ఖచ్చితంగా వివరించలేకపోయినా ఇది అక్షరాలా జరిగింది. యేసు ఇష్టపూర్వకంగా వెళ్ళాడని కూడా స్పష్టంగా తెలుస్తుంది. సాతానుకు పరిమిత శక్తి మాత్రమే ఉంది. వాడు యేసును తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయమని బలవంతం చేయలేడు. ఆలయ సముదాయంలోని ఈ ఎత్తైన ప్రదేశం కిద్రోను లోయను చూసే తూర్పు వైపున ఉండొచ్చని చరిత్రకారుడైన జోసీఫస్ చెబుతున్నాడు. అక్కడ నుండి దూకడం అంటే దాదాపు 450 అడుగులు క్రిందికి పడిపోవడం. దైవిక రక్షణ లేకుండా ఎవరూ అక్కడి నుండి పడిపోతే బయటపడలేరు.

ఈ సందర్భంలో సాతాను కూడా లేఖనాలను ఉటంకించాడు. సైతాను కూడా బైబిలులోని మాటలను వల్లించగలడు. ఆత్మ ఖడ్గాన్ని మనపై ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ యేసు చేతుల నుండి ఆత్మ ఖడ్గాన్ని లాక్కొని, దానిని ఉపయోగించి ఆయనపై దాడి చేయాలనుకున్నట్లుగా ఉంది. వాడు కీర్తన 91:11,12 వచనాలను ఉటంకించాడు, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము – ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పాడు. ఈ మాటలు పరిస్థితికి సరిగ్గా సరిపోతున్నట్లుగా ఉన్నాయి. యేసు ఈ సవాలును అంగీకరించకపోతే తండ్రిపై తనకు నమ్మకం లేదని తెలియజేస్తున్నాడని సాతాను ఆయనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇక్కడ సాతాను దేవుని వాగ్దానాన్ని కుయుక్తిగా వక్రీకరిస్తున్నాడు.

వాడు ఇక్కడ దేవుని వాక్యాన్ని తన ఉద్దేశ్యానికి అనుగుణంగా వక్రీకరించాడు. కీర్తన 91:11,12 వచనాలను మనం చదివినట్లయితే, అక్కడ, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని ఉంది. వాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు అనే మాటలను కావాలనే వచనములో నుండి తొలగించి తన ఉద్దేశ్యానికి అనుగుణంగా వాక్యాన్ని ఉపయోగించాడు. ఇది అన్ని పరిస్థితులలోనూ అపరిమితమైన దేవదూతల రక్షణకై ఇవ్వబడిన వాగ్దానం కాదు. అనుదినము దేవుడు వారికిచ్చిన బాధ్యతలను ఆయన ప్రజలు నిర్వర్తించుకునే క్రమములో కాపాడబడటానికై వారికి ఇవ్వబడిన హామీ ఇది. అందుకనే మార్టిన్ లూథర్ గారు, “దేవునిపై మన విశ్వాసాన్ని దోచుకోవడంలో అపవాది విజయం సాధించకపోతే, వాడు మరో తీవ్రతకు వెళ్లి మనల్ని అతి విశ్వాసం కలిగిన ధైర్యపరులుగా చేయడానికి ప్రయత్నిస్తాడు” అని చెప్పాడు. దేవుణ్ణి ఈ విధంగా శోధించడం విశ్వాసం యొక్క చర్య కాదు. ఇది సందేహానికి నిదర్శనం.

మొదటి శోధన అపనమ్మకాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది; రెండవది, తప్పుడు నమ్మకాన్ని వ్యక్తపరచడానికి ఉద్దేశించబడింది. సైతాను అగ్ని బాణాలను ఆర్పేందుకు నమ్మకమనే డాలును యేసు ఉపయోగించాడు, ఎఫెసీ 6:16-17. క్రైస్థవుని కర్తవ్యం దేవునిపై నమ్మకం ఉంచి ఆయన మాటకు లోబడడమే గాని ఆయనను అద్భుతాలు చేసేలా బలవంతం చెయ్యడం కాదు. మొండి తెగువకు నమ్మకానికి చాలా తేడా ఉంది. యేసు మళ్ళీ లేఖనాన్ని ఉటంకిస్తూ స్పందించాడు. అయితే ఆయన దానిని సరిగ్గా అన్వయించాడు: అందుకు యేసు – ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పాడు. మీరు మస్సాలో చేసినట్లు మీ దేవుడైన యెహోవాను పరీక్షించవద్దు, (ద్వితీయోపదేశకాండము 6:16) అని చెప్పాడు. మస్సా అంటే “పరీక్షించడం”. అక్కడ ఇశ్రాయేలీయులు తమకు నీరు అందించమని కోరుతూ యెహోవాను పరీక్షించారు. ప్రజలు తమకు తమ పశువులకు నీరు లేనందున మోషేను రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. మోషే యెహోవాకు విజ్ఞప్తి చేశాడు. యెహోవా తన కర్రను తీసుకొని హోరేబు వద్ద ఉన్న బండను కొట్టమని ఆదేశించాడు. వెంటనే నీరు బయటకు వచ్చి ప్రజలందరి మరియు వారి జంతువుల దాహాన్ని తీర్చింది (నిర్గమకాండము 17:1–7). మస్సా వద్ద ప్రజలు దేవుడు తమకు వాగ్దానం చేయని అద్భుతాన్ని కోరుతూ ఆయనను పరీక్షించారు. ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం గుండా వారి ప్రయాణంలో ఆయన చేసిన మునుపటి అద్భుతాలన్నీ, దేవుడు వారి అవసరాలను తీర్చగలడని మరియు వాటిని తీరుస్తూనే ఉంటాడని ప్రజలను ఒప్పించి ఉండాలి. వారు దేవుణ్ణి విశ్వసించలేదని వారి డిమాండ్లు చూపించాయి. బదులుగా, వారు దేవుణ్ణి శోధించారు.

వ్రాయబడియున్నదని వానితో చెప్పడం అంటే, నిజ మానవునిగా యేసుకు దేవుని వాక్యం తెలుసు. ఆయన దానిని అర్ధం చేసుకొన్నాడు. ఆయన దాన్ని ప్రేమించాడు, నమ్మాడు, ఏదిఏమైనా దానికే లోబడి ఉండాలని నిర్ణయించుకున్నాడు. బైబులును యెరిగి ఉండి, దాన్ని నమ్మి, ఆచరించడం ఎంత ప్రాముఖ్యమో చెప్పశక్యం కాదు. దేవుని వాక్యాన్ని ఎరుగని వారు సైతాను ప్రేరణలను తరచుగా గుర్తుపట్టలేకపోతున్నారు. ఒకవేళ గుర్తు పట్టినా / సైతానుతో పోరాడదలచుకొన్నా వారి ముఖ్యమైన ఆయుధం వారి చేతుల్లో ఉండదు.

అయినప్పటికీ, ప్రవక్తయైన మలాకీ ద్వారా యెహోవా తనను పరీక్షించమని మనలను ఆహ్వానిస్తున్నాడు, దాదాపు సవాలు చేసాడు. ఆయన మనతో, నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధి లోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, మలాకీ 3:10.

ఈ రెండు పరిస్థితుల మధ్య వ్యత్యాసం, దేవుని స్పష్టమైన ఆజ్ఞ. ఆయన మనల్ని ఉదారంగా ఆయనకు సమర్పించమని ఆజ్ఞాపించాడు. ఆయన మనకు దయతో సమృద్ధిగా ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసాడు. దేవుడు చెప్పినట్లు మనం నమ్మకంగా చేసినప్పుడు మరియు ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ధైర్యంగా ఆయనను ప్రార్థించినప్పుడు, మనం దేవుణ్ణి శోధించడం లేదు. మనం ఆయనపై మరియు ఆయన వాక్యంపై విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాం మరియు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఇది దేవునికి ఇష్టమైనది.

ఈ తేడాను మనం గుర్తుంచుకోవడం ముఖ్యం. దేవుడు అద్భుత రీతిలో మమ్మల్ని రక్షిస్తాడులే అన్న తలంపుతో క్రైస్తవులు అనవసరంగా తమ బుద్ధిహీనత మూలంగా, గర్వం మూలంగా కష్టాల్లో ప్రమాదాల్లో ఇరుక్కోకూడదు. సాతానును బట్టి దేవుణ్ణి శోధించకూడదు.

ఏదిఏమైనా మా జీవితం నిర్ణీత సమయంలో ముగుస్తుందని అప్పటి వరకు దేవుడు మమల్ని కాపాడతాడని మరియు భద్రతను అందిస్తాడని కొందరు క్రైస్తవులు నమ్ముతుంటారు అంటే ఒకని మరణ సమయం దేవునిచే (లేదా విధి ద్వారా) నిర్ణయించబడుతుందని మరియు దానిని మార్చలేమని లేదా ఆలస్యం చేయలేమని ఆ నిర్ణయించిన సమయం వచ్చే వరకు, దేవుడు తమను రక్షిస్తాడని మరియు వారి భద్రతను నిర్ధారిస్తాడని వారు విశ్వసిస్తారు. అది దేవుడిని శోధించడం. అప్పటి వరకు దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా సురక్షితంగా ఉంచుతాడు అని చెప్పడం ద్వారా వారు తమ చర్యలను క్షమించుకుంటారు లేదా సమర్థించుకుంటారు. మనం ఎప్పుడూ విధివాదాన్ని క్రైస్తవ విశ్వాసంతో ముడి పెట్టకూడదు. విధివాదం అంటే ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉండటం మరియు మనం చేసే ఏదీ ఎటువంటి తేడాను కలిగించదు అనే వైఖరి. మన వైఫల్యాలు మరియు తప్పులు ఉన్నప్పటికీ పశ్చాత్తాపపడుతూ, ప్రతిదీ మన మేలు కోసం మరియు దీవెన కోసం జరిగేలా క్రైస్తవ విశ్వాసం దేవుడిని విశ్వసిస్తుంది. మన జీవితాంతం దేవుణ్ణి విశ్వసిస్తూనే, మన సమయాన్ని అర్థం మరియు ఉద్దేశ్యంతో కూడిన బహుమతిగా పరిగణించి, నమ్మకంగా మన సమయాన్ని కాపాడుకోవడానికి కూడా మనం పిలువబడ్డాం. ప్రభువు మనకు కేటాయించిన రోజులు మరియు సంవత్సరాలతో సహా, ఆయన ఆశీర్వాదాలన్నింటినీ సంరక్షించే బాధ్యత ఇందులో ఉంది.

సాతాను రెండు శోధనలు విఫలమైన తర్వాత, వాడు అరణ్యంలో మూడవ శోధనకు వెళ్ళాడు. వాడు యేసుతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకొచ్చాడు. వివరించలేని విధంగా మనకు అర్థం కాని విధంగా, సాతాను యేసును చాలా ఎత్తైన పర్వతానికి తీసుకెళ్లి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి –నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటిని నీకిచ్చెదను అని అన్నాడు. అపవాది ఇక్కడ తన మనస్సులోని రహస్యమైన కోరికను అంటే తనను ఆరాధించాలనే తన రహస్య కోరికను బయటపెట్టాడు. వాడు ఈ యుగ సంబంధమైన దేవత, 2 కొరింథీ 4:4. అందువల్లనే మనుష్యులు తనను గొప్ప చేసి తనకు మ్రొక్కి విధేయత చూపాలని కోరుకొంటున్నాడు.

అయితే రెండవ కీర్తనలో తండ్రి కుమారునికి చేసిన వాగ్దానం గురించి కూడా సాతానుకు తెలుసు: “నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను” (కీర్తన 2:8). అయితే ఇక్కడ సాతాను తండ్రి అయిన దేవుని అధికారాన్ని తనకోసం తీసుకొని యేసు కోసం విషయాలను చాలా సులభతరం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని నటించాడు. ప్రపంచాన్ని విమోచించడానికి యేసు బాధపడి చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన అరణ్యములో ఒకసారి సాతానుకు సాష్టాంగ నమస్కారం చేసి వాణ్ని ఆరాధించాలి, మరెవరికి దాని గురించి కూడా తెలియదు. సాతాను మళ్ళీ అబద్ధం చెబుతున్నాడు. వాడు కోరుకున్నా కూడా తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేడు. సాతాను ప్రతిపాదన మొదటి నుండి చివరి వరకు తెలివైన అబద్ధాలు మాత్రమే. ఈ శోధన యేసుకు సాతాను అందించిన షార్ట్‌కట్ డెడ్ ఎండ్.

అపవాది సందర్భానికి వ్యతిరేకంగా వాడిన దేవుని వాక్యానికి విరుగుడుగా సందర్భానుసారంగా సరిగా అర్ధం వచ్చేలా యేసు మరొక వాక్యాన్ని ఉపయోగించాడు. బైబులును సరిగా అర్ధం చేసుకోవాలంటే వాక్యాన్ని యెరిగి ఉండాలి. యేసు మళ్ళీ ద్వితీయోపదేశకాండము నుండి దేవుని వాక్యాన్ని ఉటంకించాడు: “నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను మాత్రమే సేవించుము” (ద్వితీయోపదేశకాండము 6:13ను సూచిస్తూ). ఇది నిజమైన ఆరాధనను ఎవరికివ్వాలో తెలియజేస్తుంది.

సాతాను అబద్ధాలకు ప్రజలు ఇప్పటికీ పడిపోతూ ఉండటం ఎంతో విషాదకరం. వాడు అప్పుడప్పుడు మనందరినీ తప్పుదారి పట్టిస్తున్నాడు. మనకు మెరుగైన జ్ఞానం ఉన్నప్పటికీ, మనం దేవుని ఆజ్ఞలను ధిక్కరించి వాడి సూచనలను పాటిస్తే మనం మెరుగ్గా, ధనవంతులుగా, సంతోషంగా, మరింత విజయవంతం అవుతామని వాడు మనల్ని ఒప్పిస్తాడు. బహిరంగంగా అలా చేసి, అభివృద్ధి చెందినట్లు కనిపించే వ్యక్తుల వైపు మన దృష్టిని ఆకర్షించడానికి వాడు ఇష్టపడతాడు. కాని మనం వారి శాశ్వత విధి గురించి మరచిపోవాలని వాడు కోరుకుంటున్నాడు. సాతానును నిజంగా ఆరాధించే వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా ఉంది. వాడికి భయంకరమైన రక్తపాత బలులు అర్పించడం, సాతాను చిహ్నాలను ప్రదర్శించడం, తమను తాము సంఘము అని కూడా పిలుచుకోవడం విచారకరం. అట్టివారు క్రీస్తు యేసులో దేవుని కృపను తృణీకరించి, నరకంలో శాశ్వత శిక్షకు వారసులుగా చేసుకుంటున్నారు. ఇది సాధించేందుకు వాడు భూమి మీద మత సంబంధమైన లోక సంబంధమైన ప్రతి వ్యవహారంలోనూ చురుకుగా పనిచేస్తూ మనుష్యులకు అధికారాన్ని, సంపదలను, లోకాశాలను ఎరగా వెయ్యడం ద్వారా వాడు వారిని తన వైపు లాక్కుంటున్నాడు. ఇలాంటివి వాడు ఇవ్వగలడు. ఎందుకంటే వాడు ఆదామును పాపములోనికి లాగినప్పుడు అవన్నీ అతడి హస్తగతమయ్యాయి. భూమిని పాలించడానికి మొదటిగా నియమింపబడిన వ్యక్తి ఆదాము (ఆది 1:27,28). అతడే మానవ జాతికి జనకుడు, ప్రతినిధి. అయితే అతడు భ్రష్టుడై పాపములో పడిపోయినందువల్ల మానవ జాతిని అపవాది చాలా మట్టుకు తన వశం చేసుకోగలిగాడు, లూకా 4:6; యోహాను 12:31; ఎఫెసీ 2:1,2; 2 తిమోతి 2:26. 1 యోహాను 5:19.

అధికారం, సంపద, లోకాశాల కోసం అనేకమంది దేవుని న్యాయ సూత్రాలను విడచి, దేవుని సత్యాన్ని నిరాకరించి, అబద్దాలు, మోసం, అన్యాయంతో కూడిన మార్గాన్ని అనుసరిస్తారు. వీళ్ళలో క్రైస్తవులు కూడా ఉండటం విచారించదగిన విషయం. అలాంటి సాతాను పద్ధతులు మనకు అసహ్యంగా అనిపించొచ్చు. కాని అవి చాలా ప్రమాదకరమని గ్రహించడంలో విఫలమవుతున్నాం. అంతేనా, జాతకాలు, ఊయిజా బోర్డులు, సోదె చెప్పడం ఇలాంటివి ఎన్నో ప్రజలను సాతాను ప్రభావానికి గురి చేస్తున్నాయి మరియు శాశ్వతంగా భయంకరమైన పరిణామాలను కలిగిస్తున్నాయి. “కేవలం వినోదం కోసం” అలాంటి వాటిలో పాల్గొనే క్రైస్తవుడు దేవుణ్ణి శోధించడంలో దోషిగా ఉన్నాడు. కాబట్టి దుష్టుడైన శత్రువు నాపై అధికారం కలిగి ఉండకుండునట్లు నీ పరిశుద్ధ దూతను నాతో ఉండనిమ్ము తండ్రి అని మనం ప్రార్ధించవల్సి ఉన్నాం. అది మన హృదయపూర్వక ప్రార్థన అయితే, మనం యేసు మాదిరిని అనుసరించి, “సాతానా, పొమ్ము!” అని చెప్దాం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని (యాకోబు 4:7) యాకోబు మనకు హామీ కూడా ఇస్తున్నాడు.

అప్పుడు సాతాను వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు. వారు నిస్సందేహంగా ఆయనకు ఆహారం, నీళ్లు తెచ్చి, తండ్రి నుండి వచ్చిన దూతలుగా, యేసుకు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు.

రెండవ ఆదాముయైన యేసును దేవుని నుండి దూరం చేయగల శక్తి సాతానుకు లేదు. ఆయన వానిని జయించాడు. దేవుని పట్ల ఆయనకున్న విధేయత నుండి కాని ఆయన కున్న పవిత్రత నుండి కాని ఆయనను సాతాను పడగొట్టలేక పోయాడు. చివరగా, శోధనలో నమ్మకంగా ఉన్న వ్యక్తిగా, శోధనను జయించి విశ్వాసులకు ఆదర్శంగా నిలిచాడు.

కాని సాతాను అక్కడితో వదిలేయ్యలేదు. దాడి చేయడానికి అవకాశాల కోసం వాడు వెతుకుతూనే ఉన్నాడు. ఉదాహరణకు, యేసు తన శిష్యులతో రాబోయే తన శ్రమ మరణం గురించి మాట్లాడినప్పుడు, పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పాడు (మత్తయి 16:22,23). యేసును తన శత్రువుల చేతుల్లోకి అప్పగించడానికి సాతాను యూదా ఇస్కరియోతులోకి ప్రవేశించాడని కూడా మనకు చెప్పబడింది. యేసును గద్దించడం గురించి మరియు మూడుసార్లు యేసును తిరస్కరించడం గురించి పేతురు పశ్చాత్తాపపడ్డాడు. కాని యూదా క్షమించబడతానా అని నిరాశ చెంది, తన ప్రాణాన్ని తీసుకున్నాడు మరియు నరకంలో శాశ్వత శిక్షకు లోనయ్యాడు. సాతాను యొక్క దుర్మార్గపు అబద్ధాలకు లొంగిపోయే వారందరికీ నరకం విధి.

మనం జీవించి ఉన్నంత కాలం, ముఖ్యంగా మనం మరణించే సమయంలో సాతాను మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. కాని దేవుని వాక్య శక్తితో, ఆత్మ ఖడ్గముతో, మనం వాడ్ని తరిమివేసి, మన రక్షకుడితో శాశ్వతంగా సురక్షితంగా ఉందాం.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl