లూథర్ యొక్క జన్మము (1483) మరియు విద్యాభ్యాసము

కొలంబస్ అమెరికాను కనుగొనుటకు 9 సంవత్సరాల ముందు, 1483లో లూథర్ జర్మనీలోగల ఐస్ లేబన్ అను చిన్న పట్టణమందు జన్మించాడు. అతని తలితండ్రులు పేదవారైయుండియు మార్టిన్ లూథర్ తెలివి గలవాడని యెరిగి అతనిని స్కూలుకు పంపారు. లూథర్ 14 సంవత్సరాల ప్రాయములో చదువు కొనసాగించుటకు ఇల్లు వదిలి వెళ్ళవలసి వచ్చింది. డబ్బులు తక్కువగా ఉన్న పిల్లలవలె  లూథర్ కూడా కొందరు ధనవంతుల ఇండ్లలో పాటలు పాడి తన భోజనమును కొన్నిసార్లు సంపాదించుకొనవలసి వచ్చింది. అయినప్పటికిని అతడు తన విద్యయందు బహు ప్రావీణ్యతను చూపించాడు గనుక అతని అధ్యాపకులు అతనిని కళాశాలకు వెళ్ళమని ప్రోత్సహిం చారు.

ఆ టైములో లూథర్ తండ్రి మార్టిన్ ఖర్చులను చెల్లించుటకు చాలినంత డబ్బును సంబందించాడు. కాబట్టి లూథర్ ఎర్ ఫర్ట్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. లూథర్ న్యాయవాదిగా చదువు కొనసాగించాడు. విద్యార్థిగా తన ప్రావీణ్యతను చూపాడు. అతడు తనను ఎరిగియున్న వారందరియొక్క గౌరవమును సంపాదించుకొని తోటి విద్యార్థుల మన్ననలను పొంది 1505లో ఎమ్.ఎ పట్టభద్రుడయ్యాడు. కాని లూథర్ మాత్రం సంతోషముగా లేడు.

లూథర్ సన్యాసిగా (1505) 

లూథర్ బాలునిగా ఉన్నప్పుడు పరిశుద్దులను ప్రార్ధించవలెనని, రోమన్ కేథలిక్ సంఘమును గౌరవించ వలెనని మరియు సత్కార్యములు చేయవలెనని అతడి తలితండ్రులు అతనికి నేర్పించారు. లూథర్ ఇవ్వన్ని ఎంతో నమ్మకముగా చేయుచున్నను, పాపమును బట్టి దేవుడు మానవునిపై కోపగించుకొను చున్నాడని అతడు ఎరిగి యుండెను గనుక తన పాపములను బట్టి దేవుని యొక్క భయంకరమైన శిక్షను ఎదుర్కొనవలసియున్నదని బాధపడుతూ అతడు ఎల్లప్పుడూ మరణ భయముతో జీవించుచుండెను. అందును బట్టి అతడు తన ఆత్మ కొరకు నెమ్మదిని కనుగొనుటకై క్రైస్తవ మఠములో చేరి క్రైస్తవ సన్యాసి అగుటకు నిర్ణయించు కొన్నాడు.

మరి ఎక్కువగా పరిశుద్ధమైన సన్యాసివలె జీవితమును జీవించుటకు అవసరమైన సమస్త నియమములను మఠమునందు లూథర్ అనుసరించాడు. అతడు కటిక నేలపై పరుండుటచేత, తన శరీరమును కొట్టుకొనుట చేత అతడు తన్ను తాను హింసించుకొన్నాడు. 1507లో అతడు మతాచార్యుడై మొదటిసారిగా దివ్యపూజా బలిని జరిపాడు కాని ఇవేమియు అతడు వెదుకుచున్న నెమ్మదిగల మనస్సును అతనికి ఇవ్వలేకపోయాయి.

విటెన్ బర్గ్ నందు లూథర్ (1508) 

సాగ్జనీని పరిపాలించు “ఎలెక్టర్” క్రొత్తగా విటెన్బర్గ్ నందు స్థాపించిన విశ్వవిద్యాలయము నందు బైబులును భోదించుటకుగాను లూథరును పంపుటకు మఠాధిపతియైన డా. స్టౌఫిట్జ్ నిర్ణయించాడు. ఈ నూతన ఉద్యోగము లూథరుకు బైబులును ఎక్కువగా చదువుటకు ఎక్కువ అవకాశము కల్పించునని, ఆ భోధన లూథరును ఎప్పుడు పనిలో ఉంచును గనుక అతని పాపములను గూర్చి ఆలోచించుటకు అతనికి చాలా తక్కువ సమయముండునని డా. స్టౌఫిట్జ్ తలంచాడు.

లూథరు మఠములో ఉన్నప్పుడు, అతడు వెదుకుచున్న నెమ్మదిని యేసునందు అతడు కనుగొనగలడని డా. స్టౌఫిట్జ్ లూథరుకు చెప్పాడు.  లూథరు వేదాంత పండితునిగా విటెన్బర్గ్ నందు దేవుని వాక్యమును చదువుచుండగా క్రమేణా అది క్రీస్తునందున్న దేవుని ప్రేమను ఎరుగుటకు అతనిని నడిపించింది. బైబులు ద్వారానే చివరిగా తాను వెదుకుచున్న నెమ్మదిని అతడు కనుగొన్నాడు.

లూథరు మంచి భోదకుడు మరియు ఉపాధ్యాయుడు అను ఖ్యాతిని అతడు త్వరగా సంపాదించుకున్నాడు. అనేక ప్రాంతములనుండి విద్యార్థులు అతని యొద్ద చదువుకొనుటకు వచ్చారు. విటెన్బర్గ్ పట్టణ దేవాలయమునందు మార్టిన్ లూథరు ప్రసంగమంటే దానిని ఆలకించటానికి అనేకమంది ప్రజలు వచ్చేడివాళ్ళు. లూథరు ధాటిగా భోదించుట, ప్రసంగించడమే కాకుండా అతడు చెప్పిన క్రొత్త సంగతులు ప్రజలను వినునట్లుగా చేసాయి.

అతడు “పాపక్షమాపణను” ఒకడు తన సత్క్రియలను బట్టి సంపాదించుకొనుటకు వీలుకాదని బదులుగా అది మన రక్షకునిగా మనకొరకు యేసు చేసిన కార్యమునకు ఫలితముగా మనకు దేవుడు అనుగ్రహించిన ఉచిత బహుమతియై యున్నదని కాబట్టే రక్షణ సంపూర్ణముగా క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమేనని అతడు బోధించాడు.  

 లూథరు యొక్క 95 సిద్ధాంతములు (1517)

లూథరు యొక్క ఈ క్రొత్త బోధ నిజానికి, ప్రజలను దేవుని వాక్యము యొక్క సాధారణమైన సత్యమునకు మళ్లించుట మాత్రమే. కాని అది 1517వ సంవత్సరము వరకు ఏమి సంచలనము కలిగించలేదు. ఆ సంవత్సరము ఒక సంఘటన జరిగింది అది దిద్దుబాటుకు నాంది అయ్యింది.

రోమ్ నందు పరిశుద్ధ పేతురు దేవాలయమును నిర్మించుటకుగాను డబ్బు వసూలు చేయుటకు, జర్మనీ దేశమందంతట పాపపరిహార పత్రములు అమ్ముటకు పోపు అనుమతిని ఇచ్చారు. డబ్బు చెల్లించుట ద్వారా పర్గెటరి మార్పిడిలో వారి పాపపు శిక్షను అనుభవించుచున్న ప్రజలను విడుదల చేయునని వాగ్దానము చేయుచున్న ఈ పత్రికలు నిరుపయోగమైన కాగితపు ముక్కలని లూథరు వీటిని అభ్యంతరపెట్టి, పాపపరిహార పత్రముల అమ్మకం దేవుని వాక్యమునకు విరోధమని చూపు 95 సిద్ధాంతములను అతడు లాటిన్ భాషలో వ్రాసి, అక్టోబర్ 31, 1517న దానిని విటెన్ బర్గ్ లోని దేవాలయపు తలుపుకు మేకులతో కోట్టాడు. ఈ దేవాలయపు తలుపు తరచుగా బహిరంగ ప్రకటనలకు వేదికగా వాడబడేడిది.

ఈ సిద్ధాంతములను అతికించుటలో లూథరు యొక్క ఉదేశ్యము, విశ్వవిద్యాలయమందున్న ఎవరైనను తనతో వాదించుటకు అవకాశము కల్పించుటే అందుకే అతడు వాటిని లాటిన్ భాషలో వ్రాసాడు. ఈ 95 సిద్ధాంతములు త్వరితగతిని జర్మన్ భాషలోనికి తర్జుమా చెయ్యబడి, ముద్రింపబడి, జెర్మనీయందంతట మరియు యూరోప్ లో ప్రజలకు అందించబడ్డాయి. అవి ఎక్కడెక్కడైతే వ్యాపింపబడ్డాయో ఆయా ప్రాంతాలలో అవి బహు కలవరాన్ని కలిగించాయి.

చివరగా, పోపు లూథరు ను రోమ్ కు వచ్చి ఆ తప్పుడు బోధలకు జవాబియ్యాలని ఆజ్జ్యపించాడు. అయితే లూథర్ యొక్క పరిపాలకుడు, సాగ్జనీని పరిపాలిస్తున్న ఎలెక్టర్, తన పలుకుబడిని వినియోగించి లూథర్ వ్యాజ్యము జర్మనీలోని సరిచేసుకొనుటకు అవకాశాన్ని కలిగించాడు.

వరమ్స్ మరియు వార్ట్ బెర్గ్ నందలి సభల ఎదుట లూథర్ హాజరు (1521)

1518లో పోపు ప్రతినిధిగా పంపబడిన కార్డినల్ కజేతన్ ముందు హాజరయ్యాడు. కజేతన్ మార్టిన్ లూథర్ యొక్క 95 సిద్ధాంతములను గురించి అతనితో చర్చించలేదు. దానికి బదులుగా, లూథరు తన వ్రాతలన్నీ తప్పులని ఒప్పుకోవాలని చెప్పాడు. తన వ్రాతలు తప్పు అని బైబులు నుండి నిరూపించనిదే తాను వాటిని ఉపసంహరించుకోనని లూథర్ కార్డినల్ కజేతన్ తో చెప్పాడు. ఒక సంవత్సరము తరువాత, జర్మన్ సంఘము యొక్క పండితుడైన డాక్టర్ ఏక్ తో, లూథరు రక్షణ పొందుటకు మనుష్యులు పోపుకు విధేయులు కానక్కరలేదని చెప్పాడు.

ఈ మాటల ఫలితముగా, పోపు పాపల్ బుల్ (బుల్ అను మాటకు “ముద్ర” అని అర్ధం) గా పిలువబడే ఒక అధికార పత్రాన్ని అందరికి పంపిస్తూ, అందులో లూథర్ రోమన్ కాథలిక్ సంఘ సభ్యుడు కాదని అతడు తన వ్రాతలను ఉపసంహరించుకోనని యెడల వాటినన్నిటిని తగులబెట్టాలని వ్రాసాడు. 

1521వ సంవత్సరంలో చక్రవర్తియైన చార్లెస్ వారమ్స్ లో జరుగుతున్న జర్మన్ పరిపాలకుల సభకు లూథరును హాజరు కమ్మని ఆజ్జ్యాపించాడు. ఈ సభ ద్వారా జర్మన్ పరిపాలకులలో ఉన్న మత విభేధములు తొలగిపోతాయి తద్వారా తురుష్కుల దండయాత్రను ఆపడానికి వారందరు తనకు సహాయము చేస్తారని చక్రవర్తి అనుకొన్నాడు. ఆ సభలో అతడు లూథరుతో బైబులు బోధను గూర్చిన వాదనను తాను వినదలుచుకోలేదని కేవలము తన వ్రాతలు తప్పు అని మాత్రమే లూథరు ఒప్పుకోవాలని చెప్పాడు.  

లూథరు రోజంతా ప్రార్ధనలో గడిపి మరుసటి రోజు సభలో నిలువబడి, మాట్లాడుతూ, “నా వ్రాతలన్నీ తప్పు అని బైబులు ప్రకారము నిరూపించనిదే నేను వ్రాసిన వాటిని ఉపసంహరించుకోలేను మరియు ఉపసంహరించుకోను. నా మనఃసాక్షి దేవుని వాక్యంతో ముడివేయబడియున్నది. ఇదే నా నిర్ణయము. మరియొకరీతిగా నేను చేయజాలను, దేవా నాకు సహాయము చెయ్యండి, ఆమెన్” అని చెప్పాడు.

లూథరు యొక్క ధిక్కరింపును బట్టి, చక్రవర్తి అతనిని “చట్ట విరోధిగా” ప్రకటిస్తూ 20 రోజుల తరువాత ఎవరైనా లూథరును చంపవచ్చని డిక్రీ జారీచేశాడు. అయితే ఎలెక్టర్ ఫెడరిక్, లూథరును బలవంతముగా తీసుకొనిపోయి వార్ట్ బర్గ్ లోని ఒక కోటలో రహస్యముగా ఉంచి కాపాడాడు. వార్ట్ బర్గ్ లోని కోటలో లూథరు దాదాపుగా ఒక సంవత్సరము దాగి ఉన్నాడు. ఆ కాలములో లూథరు తన దేశ ప్రజలందరూ దేవుని వాక్యమును చదువులాగున క్రొత్త నిబంధనను అతడు జెర్మనీ భాషలోనికి అనువదించాడు. 

లూథరు విటెన్ బెర్గ్ కు తిరిగి వచ్చుట మరియు అతని మరణము (1546)

చక్రవర్తి అతని సామ్రాజ్యములో ఉన్న ప్రధాన సమస్యలతో బిజీగా ఉండేటట్లుగా దేవుడు అతనిని ఉంచాడు కాబట్టి లూథర్ 1522లో విటెన్ బెర్గ్ కు తిరిగి రాగలిగాడు. దాదాపు లూథర్ 1546లో మరణించక ముందు వరకు దాదాపు 20 సంవత్సరములు, చక్రవర్తికి జర్మనీలో ఉన్న లూథర్ పట్ల ద్రుష్టి పెట్టడానికి వీలు కలుగలేదు. ఆ సమయానికల్లా జర్మనీలో దిద్దుబాటు గట్టిగా నాటబడి చక్రవర్తి దానిని నాశనము చెయ్యకుండునట్లుగా దేవుడు లూథరును అతని అనుచరులను బలపర్చాడు.

లూథరు జీవితములోని చివరి 20 సంవత్సరాలు చూస్తే, అతడు విటెన్ బెర్గ్ విశ్వవిద్యాలయములో భోదిస్తూ పట్టణములోని దేవాలయములో ప్రసంగిస్తూ చాల బిజీగా ఉండటమే కాకుండా అతడు తన అనుచరులతో కలసి పాత క్రొత్త నిబంధనల యొక్క అనువాదమును జర్మన్ భాషలో ప్రచురించాడు. బైబులు నుండి నేర్చుకొన్న సత్యాలను ప్రజలు పాడులాగున అతడు వాటిని కీర్తనల రూపంలో వ్రాసాడు. అతడు అనేకులకు బైబులును గురించి దాని బోధలను గురించి వివరిస్తూ ఉత్తరాలు వ్రాసాడు. బైబులు పుస్తకములకు వ్యాఖ్యానములను మరియు వివిధ మతాంశములపై బైబులు ఏమి చెప్పుచున్నదను వాటిని వందలాది వ్యాసాలుగా వ్రాసాడు. ప్రతి ఒక్కరు బైబులును చదివి అవగాహన  చేసుకొనేలా దానిని మెరుగు పరుచుటకు యెడతెగక శ్రమిస్తూ గడిపాడు.

లూథరు మునుపు కాథలిక్ మఠములో ఉన్న క్యాథరిన్ వాన్ బోరా అనే ఆమెను వివాహము చేసుకొన్నాడు. దేవుడు వారిని 6 పిల్లలతో దీవించాడు.

ఫిబ్రవరి 18, 1546న లూథరు మరణించాడు. అతని మృత దేహము కోటలోని దేవాలయపు ప్రసంగ వేదిక క్రింద సిమెంట్ తొట్టిలో ఉంచబడియున్నది.

లూథర్ మరియు చిన్న ప్రశ్నోత్తరి

లూథరు తరచుగా యౌవనస్థుల యొక్క క్రైస్తవ శిక్షణ విషయములో చాల శ్రద్ధను చూపిస్తూ  యౌవన బిడ్డల కొరకై క్రైస్తవ పాఠశాలలను ఏర్పాటు చెయ్యమని అందుకు సహాయము చెయ్యమని అతడు ప్రజలను బ్రతిమాలు కొనేవాడు. అనేకమంది పాస్టర్లు తలితండ్రులు తమ బిడ్డలకు బైబిలునందలి ముఖ్యమైన బోధలను ఎలా నేర్పించాలో ఎరుగక యుండుటను బట్టే అతడు చిన్న ప్రశ్నోతరిని వ్రాసాడు.

చిన్న ప్రశ్నోతరిని వ్రాయుటలో లూథర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమంటే, యేసునందు విశ్వాసము ద్వారానే రక్షింపబడుదుమని పిల్లలందరు తెలుసుకొని నమ్ముటకు నడిపించుటే. ఈ చిన్న ప్రశ్నోత్తరి సులభముగా ఉండాలని బైబిలులోని ప్రధాన భోధలన్ని అందులో ఇమిడి ఉండాలని అతడు కోరుకున్నాడు. చిన్న ప్రశ్నోత్తరిలోని ఆరు ప్రధానమైన భాగాలు ఏమనగా, పది ఆజ్జ్యలు, అపొస్తలుల విశ్వాస ప్రమాణము, పరిశుద్ధ బాప్తిస్మ సంస్కారము, పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము, తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు, ప్రభువు ప్రార్ధన.            

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl