
పాత నిబంధన పాఠము: నిర్గమకాండము 20:1-17; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 1:22-25; సువార్త పాఠము: యోహాను 2:13-22; కీర్తన 19.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: నిర్గమకాండము 20:1-17
నిర్గమకాండము 20:1-6: 1దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. 2–నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; 3నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహము నయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. 5ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు 6నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనై యున్నాను.
ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో భాగముగా సీనాయి పర్వతము వద్దకు రాగా, ఇశ్రాయేలీయులతో నిబంధనను చేసుకొని అందులో భాగముగా దేవుడు వారికి ప్రత్యక్షమై, పౌర సంబంధమైన, శుద్ధికారణాచార సంబంధమైన, నీతి సంబంధమైన ఆజ్జ్యలను ఆయన ఇక్కడ తెలియజేసియున్నాడు. ఈ రోజు మొదటి ఆజ్జ్యను, ఆజ్జ్యల సారంశామును గూర్చి నేర్చుకొందాం.
నేటి ఈ ఆధునిక ప్రపంచములో జీవిస్తున్న మనమందరం మన జీవితాలలో కొన్నిటికి ప్రధమ స్థానాన్ని ఇస్తూ ఉంటాం తప్ప ప్రాముఖ్యము ప్రధానమైన దేవునికి మన జీవితాలలో ప్రధమ స్థానాన్ని ఇవ్వలేక పోతూ ఉన్నాం. నిజానికి మన జీవితాలలో ఎల్లప్పుడూ దేవుడే ప్రధమ స్థానములో ఉండాలి. మనం ఎక్కడ ఉన్నాం? ఎలా ఉన్నాం? అనేది ప్రాముఖ్యము కాదు కాని అన్ని సమయాలలో దేవుడే మన అందరి జీవితాలలో ప్రధమ స్థానములో ఉండాలి, ఎందుకని? మన విమోచకుడైన దేవునిని మనఅందరి జీవితాలలో ప్రధమ స్థానములో ఉంచుదాం.
మన విమోచకుడైన దేవునిని మనఅందరి జీవితాలలో ప్రధమ స్థానములో ఉంచుదాం
- దేవుడు మన కొరకు చేసియున్న వాటిని జ్ఞ్యాపకం చేసుకొందాం 1,2
- దేవుడు ఇప్పుడు మన నుండి ఆశిస్తున్న వాటిని గుర్తిద్దాo 3,4
- దేవుడు మనకు అనుగ్రహించుచున్న దీవెనను పుచ్చుకొందాం 5,6
1
1,2 వచనాలను చదువుకొందాం: నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఇక్కడ దేవుడైన యెహోవా తన గుర్తింపును తెలియజేస్తూ _ సర్వశక్తి మంతుడను కనికరముగల దేవుడనైన యెహోవానగు నేనే నిన్ను దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని అని చెప్తూవున్నాడు.
దేవుడైన యెహోవా దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి వెలుపలికి తెచ్చాడనే విషయం వాళ్ళకి తెలుసు కదా మళ్ళీ ఎందుకని దేవుడు వారికి గుర్తుచేస్తున్నాడని మనం ఆశ్చర్యపోవొచ్చు. ఐగుప్తు నుండి వాళ్ళు యెట్లు విడిపింపబడియున్నారో వాళ్లలో ఎవరు మర్చిపోగలరు? నిజం చెప్పాలంటే వాళ్లలో ఎవరూ ఆ విషయాన్ని మర్చిపోలేరు. అయితే ఈ విషయాన్ని వాళ్ళకి మళ్ళీ జ్ఞ్యాపకం చెయ్యడానికి దేవుని కొక కారణముంది. అదేంటంటే, ఐగుప్తులో వాళ్ళు మునుపు దాసులుగా ఉండిరను వారి మునుపటి స్థితిని దేవుడు వారికి జ్ఞ్యాపకం చేస్తూ ఉన్నాడు.
ఐగుఫ్తులో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే_ దాసులుగా_ వాళ్ళ జీవితాలు దుర్లభంగా ఉండేవి. అణచివేత అనే ప్రక్రియలో భాగముగా దుర్మార్గముగా అతి క్రూరులైన పాలకుల క్రింద ఎలాంటి హక్కులు లేకుండా నిస్సహాయులైన దాసులుగా వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి స్థితిలోవున్న వారిని ఆ దాసుల గృహమైన ఐగుప్తుదేశము లో నుండి వెలుపలికి రప్పించడమే కాకుండా ఇప్పుడు వారి స్థితిని తాను ఎలా మార్చియున్నాడో అనే విషయాన్ని దేవుడు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. విడిపింపబడుదుమన్న ఆశేలేని ఇశ్రాయేలీయులను యెహోవా తన బాహుబలము చేతే గదా విడిపించియున్నాడు. ఆయనకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఆయన సొత్తయిన ప్రజలుగా ఉండులాగున ఆయన వారి స్థితిని మార్చియున్నాడు. మరి యెహోవా వారికొరకు చేసియున్న దానినిబట్టి, యెహోవా వారినుండి ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలీయులు ఇష్టపూర్వకంగా ప్రేమతో కృతజ్జ్యతతో ఆయనకు విధేయత చూపాలని, ఆ విధేయత లోపలినుండి రావాలని అంటే హృదయాంతరాలలోనుండి రావాలని, అన్ని విషయాలలో దేవునికే మహిమను ఇవ్వవలెనని ఆయన ఆశపడుతూ ఉన్నాడనే విషయాన్ని ఈమాటలు తెలియజేస్తూ ఉన్నాయి.
Application: మన మునుపటి స్థితిలో, మన బ్రతుకులేంత దుర్లభముగా ఉండేవో ఆలోచించండి. అతి క్రూరుడైన పాలకుని క్రింద ఎలాంటి హక్కులు లేకుండా నిస్సహాయులైన దాసులుగా నిరీక్షణలేని జనులుగా ఉండేవారం. పాపమనే గొలుసులతో బంధింపబడి వాడి నుండి తప్పించుకొనే మార్గమేమి కానరాక ఎలాంటి దుస్థితిని అనుభవించియున్నామో మనకు తెలుసు. కాని దేవుడు యేసు ద్వారా మనలను ఆ భయంకరమైన దాస్యత్వమునుండి విడిపించియున్నాడు, విమోచించియున్నాడు. మన పక్షముగా యేసు పాపముతోను సాతానుతోను నరకము యొక్క అన్ని శక్తులతోను ఆయన పోరాడియున్నాడు. ఆ క్రమములో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించవలసి వచ్చినను అప్పగించి జయించిన వానిగా ఉన్నాడు. అందును బట్టి ఆయన ప్రజలముగా ఇష్టపూర్వకంగా ప్రేమతో కృతజ్జ్యతతో ఆయనకు విధేయత చూపాలని ఆ విధేయత లోపలినుండి రావాలని అంటే హృదయాంతరాలలోనుండి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఇష్టపూర్వకంగా ప్రేమతో కృతజ్జ్యతతో ఆయనకు విధేయత తెలియజేస్తూ జీవిధ్ధాం. అన్ని విషయాలలో ఆయనకే ప్రాముఖ్యతను మహిమను ఇద్దాం.
2
3నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహము నయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్తూవున్నాడు అంటే అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమా స్వరూపముగా నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. బహిరంగ విగ్రహారాధన పాపమని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి, అవునా?
విగ్రహారాధన రెండు రకాలు. 1. బహిరంగ విగ్రహారాధన 2. రహస్య విగ్రహారాధన. క్రైస్తవులమైన మనము ఈ ఆజ్జ్యను వినినప్పుడు, మన జీవితాలలో విగ్రహాలు లేవని అనుకోవొచ్చు. కాని మన జీవితాలలో అనేకమైన వాటికి దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తు ఉన్నాం. వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం మరియు వాటిని నమ్ముకొంటు ఉన్నాం. మరి అది విగ్రహారాధన కాదా? అర్ధం కాలేదా?
ప్రజలు నిజమైన దేవునికి ప్రాధాన్యత నివ్వడం కంటే ఎక్కువగా తమ జీవితాలలో డబ్బుకు, ఆస్తికి, అంతస్తుకు, బంగారానికి, వస్తువులకు, కీర్తికి, అధికారానికి, లైంగిక సంబంధాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. ఇవే మనుష్యుల జీవితాలను నిర్ధేషిస్తు నడుపుతూ ఉన్నాయి అంటే ఇవే మనకు ప్రాముఖ్యము. కాబట్టే ప్రతి వాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుచు ఉన్నాడు అని వ్రాయబడియున్నది.
ఉదాహరణకు, దేవునికి కాక ఇతరమైన వాటికీ మనం మన జీవితాలలో ప్రాధాన్యతనిస్తే ఏం పోగొట్టుకుంటామో తెలుసా? లూకా 12:15-21 వచనాలలో ధనవంతుడైన బుద్ధిహీనుడు దేవునికన్నా కూడా తనకొరకు సమస్తమును సమకూర్చుకొనుటకు సిద్ధపడ్డాడు, ఏమైంది? శాశ్వతమైన నరకాన్ని సంపాదించుకున్నాడు, ఇందుకా అతడు శ్రమపడింది? మత్తయి 19:16-22 వచనాలలో ధనవంతుడైన యవ్వనస్తుడు యేసును వెంబడించుట కన్నా తన సంపాదనే ప్రేమిస్తూ నిజదేవుని పిలుపును లెక్క చెయ్యక వెళ్ళిపోయాడు. వీళ్ళు చేసిన తప్పు ఏమిటో తెలుసా, దేవునికన్నా ఈ లోకమైన విషయాలకు తమ జీవితాలలో ప్రధమ స్థానాన్ని ఇవ్వటమే, పాపముగా మారింది. వీళ్ళు రహస్యముగా తమ హృదయాలలో విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, వారి విగ్రహాలు వారి సంపదే. దేవుడు వారిని సంరక్షించున్నాడని వారికి కావలసిన వాటిని ఆయనే వారికి దయచేయుచున్నాడని నమ్మకుండా ఉండటానికి వారి ఐశ్వర్యమే కారణమయ్యింది.
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహము నయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సాగిలపడడం అంటే, గౌరవించడం, లేక నీకంటే గొప్పవాడు లేక శక్తిమంతుడు లేడని చెప్తూ ఒకని ఎదుట సాగిలపడడం అలాగే పూర్తిగా ఒకరికి లొంగి ఉన్నామనే విషయాన్ని సాగిలపడడం ద్వారా కూడా తెలియజేయొచ్చు, పూజించడమంటే, మనం పూజించే వాటికీ మన జీవితాలను నిర్దేశించి నడుపుమని వాటికి మన జీవితాలను అప్పగించుకోవడం అని అర్ధం కూడా వస్తుంది.
బహిరంగ విగ్రహారాధనలో గాని రహస్య విగ్రహారాధనలో గాని క్షయమైన వాటిని గౌరవిస్తూ వాటికంటే గొప్పవి శక్తిమంతమైనవి వేరే ఏవి లేవని చెప్తూ వాటి ఎదుట సాగిలపడుతూ జీవము లేని వాటికి మన జీవితాలను నిర్ధేశించమని మనలను మనం అప్పగించుకొంటూ మన స్వకీయమైన దురాశలు చేత మనకు మనమే మరులు కొల్పబడి వాటిచేత ఈడ్వబడుతూ ఉన్న జ్ఞానులం.
Application: సమస్తమైన వాటిలో దేవునికే ప్రాధాన్యమిస్తూ, ఆయనను అధికముగా ప్రేమిస్తూ, దేవుడు మనలను సంరక్షించుచున్నాడని మనకు కావలసిన వాటిని ఆయనే మనకు దయచేయుచున్నాడని నమ్ముతూ, మాట చేత గాని క్రియచేత గాని, మనమేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేద్దాం. ఆయన మన అందరి కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసియున్నాడో వాటన్నిటిని తలంచుకొని, మన మందరం యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవిద్దాం.
3
5ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు 6నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనై యున్నాను.
నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అని యెహోవా ఎందుకని అంటూ ఉన్నాడు? దీనికి అర్ధం ఏమిటంటే, తనకు రావలసిన మహిమను కాపాడుకొనువాడని మరియు ఆయనకు చెందవలసిన పూజలను పుచ్చుకొనువాడని అర్ధము. అన్నిటిని చేసిన దేవుడు తనకు చెందవలసిన ప్రేమను, పూజలను తాను చేసిన వాటిలో దేనికైనను ఇచ్చుటకు కోరుకోవడం లేదనే విషయాన్ని మరచిపోకండి. ఒకవేళ తనకు ఇవ్వవలసిన ప్రేమను పూజలను మనము ఇవ్వని యెడల తాను ఆ విషయాన్ని తేలికగా తీసుకొననని ఆయన ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు.
అంతేకాదండి, నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుదునని ఆయన చెప్తూ ఉన్నాడు. తండ్రుల దోషమును మూడు నాలుగు తరముల మీదికి రప్పించుదును అను మాటలు అన్యాయముగా కనబడుచున్నవి అంటారా? దేవునిని ఎవరైతే ప్రధమ స్థానము నందు ఉంచరో వాళ్ళు తమ జీవితాలలో తమ పిల్లలు లేదా తమ తర్వాత వచ్చే తరాలను గూర్చి వారికి శ్రద్ధ లేదనేగా అర్ధం. ఉదాహరణకు, భక్తిహీనులైన తల్లిదండ్రులు భక్తిహీనులైన పిల్లలకే జన్మనిస్తారు, ఆ భక్తిహీనులైన తల్లిదండ్రులు వారి పిల్లలు వారి పాపాలకు శిక్ష అనుభవిస్తారని అర్ధం. సౌలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతను రాజుగా నుండకుండ తిరస్కరించియున్నాడు. అతని పిల్లల పిల్లలు ఎంతటి దీవెనను పోగొట్టుకొన్నారో తెలుసా?
దేవునిని ద్వేషించేవారముగా కాకుండా ఆయనను ప్రేమించేవారముగా ఉందాం. మనలో ఉండే పాపపు స్వభావము దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని, చెడును మాత్రమే చేయడానికి ఆసక్తిని చూపెడుతుందని మనకు తెలుసు. కాబట్టే పాపులును శిక్షించుదునన్న దేవుని మాటలను seriousగా తీసుకొందాం. ఆయన కోపానికి భయపడి ఆయన ఆజ్జ్యలకు విరోధముగా ప్రవర్తింపక ఉందాం.
అలాగే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనై యున్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని ఆజ్జ్యలకు లోబడియుండుట మన విధి కానీ మన విధేయతను ఆశీర్వదించుదునను ఆయన వాగ్దానము నిజముగా పొందతగని బహుమానమండి. దేవుని ఈ వాగ్దానమును బట్టి దేవునిని ప్రేమించి ఆయన యందు నమ్మిక యుంచి ఆయన ఆజ్జ్యపించు వాటిని సంతోషముతో చేద్దాం.
ముగింపుగా, మన పాఠాన్నిబట్టి దేవుడు మన జీవితాలలో ప్రధమ స్థానములో ఉండుటకు ఆశపడుతున్నాడనేది స్పష్టం. మన దేవుడు అనేక విధాలుగా మనపట్ల తన మంచితనాన్ని చూపెడుతూ మన జీవితాలలో ప్రధమ స్థానములో ఉండాలనుకొంటున్నాడు. ఆయనను మన మందరం మన మాటలలో ఆలోచనలలో నడతలలో కనపరచవలసి ఉన్నాం. మన జీవితాలకు ఆయనే నిజమైన ప్రభువని మనము ఆయనను స్పష్టముగా చూపెట్టవలసి ఉన్నాం.
చివరిగా ఒక ప్రశ్న మీ హృదయములో, జీవితములో మొదటి స్థానములో ఎవరున్నారు? పరిశీలించుకోండి, విమోచకుడైన కీస్తుకు ప్రధమ స్థానాన్ని ఇవ్వండి. అందుకు ఆయనే మనకందరికీ సహాయము చేయును గాక. ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl