
పాత నిబంధన పాఠము: యిర్మీయా 31:31-34; పత్రిక పాఠము: హెబ్రీయులకు 5:7-9; సువార్త పాఠము: యోహాను 12:20-33; కీర్తన 143.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: యిర్మీయా 31:31-34
యిర్మీయా 31:31–34_ ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టు కొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవావాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును–యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.
మన పాఠములో దేవుడు నేను నా వీలునామాను మార్చి క్రొత్తనిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్తూ ఉన్నాడు. ఆయనకు ఆయన ప్రజలకు మధ్యన క్రొత్త నిబంధనకు కారణమేమై ఉంటుంది? క్రొత్తగా వీలునామా వ్రాయవలసి అవసరం దేవునికేమొచ్చింది. ఈ క్రొత్త వీలునామా ఎలా ఉండబోతూ ఉంది? అది మన మీద ఎలాంటి ప్రభావము చూపబోతు ఉంది? అనే ప్రశ్నలు మనకు రావొచ్చు. అలాగే ఆ ఒడంబడికలో “ప్రాముఖ్యమైనది ఏమై ఉంటుంది” అనే ఆసక్తి మనలో కలగొచ్చు. యెహోవా ఇశ్రాయేలును, యూదాను రెండింటినీ శిక్షించాడు. పాతనిబంధన అంతటిలో ఇక్కడ మాత్రమే క్రొత్తనిబంధన అనే మాట వాడబడి యున్నది.
దేవుని యొక్క వీలునామా ఎలా ఉండబోతుంది? అది మన మీద మన స్వాస్థ్యము మీద ఎలాంటి ప్రభావము చూపబోతూ ఉంది అనే ప్రశ్నలకు జవాబులను తెలుసుకొనేందుకు మన పాఠమును చదువుకొందాం.
దేవుని యొక్క క్రొత్త వీలునామా గురించి చింతించవల్సిన అవసరం లేదు
1. అది దేవుని చేత నిర్ధేశింపబడియున్నది 31,32
2. అది అందరి నిమిత్తమై యున్నది 33 అ
3. అది కృప ద్వారా స్థాపించబడియున్నది 33 ఆ-34
4. దాని ఫలితములు నూతనముగా చెయ్యబడియున్నవి 34 ఇ
1
మన పాఠాన్ని దేవుడు యిర్మీయా అను ప్రవక్త ద్వారా దేవుని ప్రజలు బబులోను చెరకు కొనిపోబడక ముందు బయలు పర్చాడు. ఆ కాలములో దేవునికి వ్యతిరేకముగా బహిరంగంగా తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు మీద దేవుడు తన తీర్పును ప్రకటిస్తూ, ప్రజలు చెరగా పరాయి దేశమునకు కొనిపోబడుదురని ప్రకటింప చేసాడు. తర్వాత, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు అని ప్రకటింపజేసాడు.
ఆయనకు ఆయన ప్రజలకు మధ్య దేవుడు స్థాపింపబోవుచున్న క్రొత్తనిబంధనకు కారణమేంటి? దేవుడు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు నడిపించిన తర్వాత సీనాయి వద్ద దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేసాడు. దానికి ప్రజలందరును ఒప్పుకొన్నారు. నిబంధన అనేది స్వచ్ఛమైన మరియు సరళమైన సంబంధం. ఇది కనీసం రెండు పార్టీల మధ్య బంధాన్ని సృష్టించే నిబద్ధత, ఇందులో సాధారణంగా అంచనాలు, పరిమితులు మరియు నమ్మకం ఉంటాయి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు అనుటకు కారణం నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి, యిదే యెహోవా వాక్కు అని ఆయన చెప్తూ ఉన్నాడు. పాతనిబంధన భంగము చేయబడింది. వారి జీవితముల కొరకైన ఆయన చిత్తాన్ని ఇశ్రాయేలీయులు భంగము చేసుకొనిరని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు తమ జీవితాలలో హృదయాలలో పెనిమిటియైన ఆయనకు ప్రధమ స్థానాన్ని ఇవ్వక ఇతర విషయాలకు ఇవ్వటం విచారింపదగిన విషయం.
ఏవిధముగా ఇశ్రాయేలీయులు నిబంధనను భంగము చేసుకున్నారో పరిశీలిధ్ధాం. నిబంధన అనేది రెండు పార్టీల మధ్య కొత్త పరస్పర సంబంధాన్ని సృష్టిస్తుంది. ఆ సంబంధములో నిబద్ధత ఎంతో అవసరం. అట్లే ఒడంబడిక ప్రభావవంతంగా ఉండటానికి అంతర్గతీకరించబడాలి (ఆ నిబంధను స్వభావంలో భాగం చేసుకోవడం). ఒడంబడికలు ప్రవర్తనపై పరిమితులను ఉంచుతాయి. ఈ మూడు విషయాలను ఉల్లంగిస్తూ వాళ్ళు దేవునితో నిబంధనను భంగము చేసుకొన్నారు. ఆదర్శవంతముగా ఉండాల్సిన సమాజాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అది వారి ఎంపిక.
అందుకనే, ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, అని అనడంలో ఈ వచనం ప్రస్తావించే ఇశ్రాయేలీయులు గతంలో ఎవరు, ఎలా ఉండేవారన్న విషయాన్ని దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరు అనేదానికి, (అపొ. కార్య. 3:25, దేవుడు అబ్రాహాముతో –నీ సంతానమందు భూలోక వంశము లన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు). ఆ నిబంధనా ప్రయోజనాలు వాస్తవానికి అబ్రహం యొక్క శారీరిక, ఆధ్యాత్మిక సంతానానికి లేదా అబ్రహం విశ్వాసాన్ని అనుకరించేవారికి, దేవుని నిజమైన ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడ్డాయి. రెండవది, గతములో సమాజముగా ఐగుప్తులో వ్యవస్థాపక అణచివేతలో వాళ్ళు ఉంటున్నప్పుడు, దేవుడు వారి పూర్వీకులను దాస్యము నుండి విముక్తి చేసి సీనాయి పర్వతంపై వెల్లడి చేయబడిన నిబంధన ద్వారా ఆ సమాజాన్ని రూపొందించడం ద్వారా వారికి ఆయన ఇచ్చిన గుర్తింపును జ్ఞ్యాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహం యొక్క శారీరిక సంతానానికి వారసులైయున్న వారు ఆయన నిబంధనను భంగము చేసుకొన్నారు. ఎన్నోసార్లు ఆయన వారిని క్షమించి చేర్చుకొన్నప్పటికిని వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి విధేయతలో ఉన్న లోపం లేదా వైఫల్యం కారణంగా కాదు, మానవ స్వభావం యొక్క దుష్టత్వము బలహీనతను బట్టి వారు దానిని ఉల్లంఘించారు. ఉల్లంఘన వారి ఉద్దేశపూర్వక పాపాల కారణంగా తరచుగా పశ్చాత్తాపం లేకుండా పునరావృతం చేయబడి, కొనసాగింది. కాబట్టే, హెబ్రీయులకు 8:8-9, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు –వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు, తప్ప ఆయన వారి కిచ్చిన గుర్తింపును ఆ నిబంధనా ప్రయోజనాలను శాశ్వతముగా తొలగిస్తున్నాను అని చెప్పటం లేదు.
నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, ఈ నిబంధన దేవుడు వారు బలహీనమైన మరియు అజ్ఞాన ప్రజలుగా ఉన్నప్పుడు వారితో చేశానని, వారి సంరక్షణను తాను స్వయంగా తీసుకున్నానని మరియు తల్లిదండ్రులు తన బలహీనమైన బిడ్డను చేయి పట్టుకుని నడిపించినట్లుగా వారిని నడిపించానని చెబుతున్నాడు. వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు, క్రొత్త నిబంధన. 1వది, ఇది కొత్తది, ఒక నిబంధనగా పరిగణించబడుతుంది, ఇది సువార్త కాలం వరకు జరగలేదు. 2వది, ఇది కొత్త పద్ధతిలో, మరింత పూర్తిగా స్పష్టంగా వెల్లడైంది. 3వది, ఇది శాశ్వత వాగ్దానాల నెరవేర్పును కలిగి ఉంటుంది. 4వది, ధర్మశాస్త్రం దానిలో భాగంగా ఉండదు. 5వది, అది అన్యులకు మరియు యూదులకు విస్తరించబడింది. 6వది, దాని ప్రచురణకు హాజరైన దైవిక ఆత్మ యొక్క ప్రభావాలు పాత ఒడంబడిక కింద కంటే క్రొత్తనిబంధన క్రింద ఎక్కువగా ఇవ్వబడ్డాయి.
2
అయినప్పటికీ కృపతో కూడిన ఆయన కుటుంబములోనికి మనలను తెచ్చుటకు ఆయనే మొదటి అడుగు వేసి ఇంకను మనందరి రక్షణను గూర్చి ప్రణాళికను వేయడం నిజంగా చాలా గొప్ప విషయం.
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, అని చెప్తూ ఆయన ఈ విషయాన్ని వక్కాణిస్తున్నాడు. ఈ మాటలు ఖచ్చితముగా యూదులకు గ్రుచ్చుకొనే ఉంటాయి అలాగే ఎంతో ఆశ్చర్యాన్ని కూడా కలుగచేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలుగా పిలువబడే 10 గోత్రాలు లేరు. వాళ్ళు క్రీ.పూ. 722లో అస్సిరియా వారిచే చెరపట్టబడి ఎన్నటికీ తిరిగిరాని విధముగా చెరలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ మాటలు పలికించినప్పుడు వాళ్ళు లేరు. కానీ దేవుడు తాను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే అని చెప్పడంలో అర్ధం?
ఎవరీ ఇశ్రాయేలు? బైబిలునందు ఇశ్రాయేలు ప్రజలు అను వ్యక్తీకరణ తరచుగా, బహిరంగంగా తిరుగుబాటు చేయు వారిని గురించి, తమ జీవితాలలో దేవుని చిత్తమును బహిరంగంగా ఎదిరించిన వారిని గురించి తెలియజేయడానికి వాడబడింది. అహాబు యెజెబెలు అను పాలకుల క్రింద ఇశ్రాయేలు ప్రజల యొక్క దుష్టత్వము చాలా అధికమయ్యింది. గనుకనే వారు దేవుని కృపకు వెలుపల నివసించే వారికి ప్రతినిధులయ్యారు. కానీ ఇప్పుడు తన నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు కూడా కలుపబడియున్నారని యెహోవా చెప్పినప్పుడు, ఆయన ప్రేమ క్షమాపణ (కృపకు వెలుపల జీవించే అన్యులను కూడా చేర్చుకొనునని) ప్రతి వారిని హత్తుకొనునని ఆయన అర్ధం. ఈ క్రొత్తనిబంధనలో యెహోవా మనలను కూడా చేర్చియున్నాడు. ఎంతటి ధన్యతను దేవుడు మనకు ఇచ్చియున్నాడో కదా! మన పాపములు మనలను వెంటాడుచుండగా ఇది మనందరికీ ఎంతో నిశ్చయతను కలిగిస్తూ ఉంది. మనము ఆయన పట్ల అపనమ్మకంగా ఉన్నప్పటికినీ ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచూ మనలనందరిని తన వీలునామాలో చేర్చియున్నాడు.
3
వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవావాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును–యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.
యెహోవా ఇక్కడ తన ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుతూ గొప్ప దైవిక శస్త్రచికిత్సను ప్రతిపాదిస్తూ, నేనే వారి హృదయము మీద నేరుగా దాని వ్రాసెదను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు యెహోవావాక్కు ఇదే, అని ఆయన అంటున్నాడు. మనస్సు, హృదయము అంటే మానవ సంకల్పం మరియు తెలివితేటల స్థానాన్ని కలిగి ఉన్న అవయవం. ఆయన ప్రజల యొక్క మనస్సులలో, హృదయముల మీద తన ధర్మవిధిని వ్రాయడం వలన ప్రతి ఒక్కరు ఆయనను ఎలా ఎరుగుదురు?
దేవుడు తన క్రొత్తనిబంధనను స్థాపించినప్పుడు అది క్రియలతో కూడినదిగాక కృపతో కూడినదై యుండుననే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సువార్త కాలంలో దేవుని ధర్మశాస్త్రం రద్దు చేయబడదు. ఎందుకంటే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నాశనం చేయడానికి రాలేదు, దానిని నెరవేర్చడానికి వచ్చాడు: కాని దానిని దేవుని నిజమైన ఇశ్రాయేలు హృదయాలలో తన ఆత్మ ద్వారా వ్రాస్తాడు. వారు దానిని పవిత్రమైనదిగా, న్యాయమైనదిగా మరియు మంచిదిగా ఆమోదించడం ద్వారా మరియు అంతర్గత మనిషిని అనుసరించి దానిలో వారు తీసుకునే ఆనందాన్ని బట్టి వాళ్ళు దానికి విధేయులవుతారు. ఆయన యొక్క క్రొత్తనిబంధనలో ప్రజలు క్రొత్త ఆజ్ఞలను గాని క్రొత్త సూత్రాలను గాని ఇక ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా తన పొరుగువానికి లేక తన సహోదరునికి బోధింపనవసరం లేదని యెహోవా చెప్తున్న విషయమిదే. ఎందుకంటే పరిశుద్దాత్మ వారి హృదయాలలో క్రియను కొనసాగిస్తూ వారిని విశ్వాసముతో దేవుని యొద్దకు నడుపుట మాత్రమే గాక దేవునిని ఏవిధముగా ప్రేమించి ఏవిధముగా పరిచర్యను చేయాలో తెలియజేస్తుంది. దేవుని ప్రజలవలె మనలను చెయ్యడానికి అవసరమైన ప్రతిదానిని తానే చేయుదునని ఆయనే మనకు నిశ్చయతను ఇస్తూవున్నాడు.
పాతనిబంధన కాలములో దేవుడు తన ప్రజల హృదయాలపై తన ధర్మశాస్త్రాన్ని వ్రాయలేదా? వ్రాయబడింది. కాని ఈ కొత్త నిబంధన యొక్క కృప ద్వారా, ఆ కాలములో కూడా అస్పష్టంగా మరియు పాక్షికంగా అది బహిర్గతం చేయబడింది మరియు తెలియజేయబడింది. ఇక్కడ ప్రవక్త యొక్క ప్రధాన ఉద్దేశ్యం ధర్మశాస్త్రము మరియు సువార్త మధ్య వ్యత్యాసాన్ని వ్యక్తపరచడం: ధర్మశాస్త్రం మనిషికి అతని విధిని చూపుతుంది, సువార్త పునరుజ్జివింపచేసే కృపను తెస్తుంది. దీని ద్వారా మనిషి హృదయం మారుతుంది మరియు అతను తన విధిని నిర్వర్తించగలడు. మోషే కాలంలో, మోక్షాన్ని పొందిన వారందరూ ఈ కొత్త నిబంధన ద్వారానే రక్షించబడ్డారు. కాని ఇది అప్పుడు స్పష్టంగా ప్రదర్శించబడలేదు.
వారు మరి ఎన్నడును–యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు, ఈ వ్యక్తీకరణ దైవిక జ్ఞానం యొక్క గొప్ప పెరుగుదలను మాత్రమే సూచిస్తుంది తప్ప పరిచర్య బోధన అవసరం లేదని లేదా క్రీస్తులో సహోదరులు ఒకరికొకరు బోధించాల్సిన అవసరం లేదని కాదు. క్రీస్తే స్వయంగా తన అపొస్తలులను ప్రకటించడానికి పంపియున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
4
నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను. కొత్త నిబంధన యొక్క పునాది పాపాలను ఉచితంగా క్షమించడం (మత్తయి 1:21 పోల్చండి). మన ఈ భూసంబంధమైన జీవిత ముగింపులో యిది మనకు నిశ్చయతగా నుండును గాక.
ముగింపు: పాత మరియు కొత్త నిబంధనలలో రక్షణ మార్గం ఒకటే. క్రీస్తుపై విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడతాడు. పాత నిబంధన కింద ఉన్న విశ్వాసి పాత నిబంధన నెరవేర్పుగా క్రీస్తు వైపు చూసాడు. పాపం చేయడానికి దాని బలహీనతను ప్రభువు అర్థం చేసుకున్నందున, పాత నిబంధన కింద విశ్వాసి క్షమాపణ పొందడానికి ప్రభువు అనేక మార్గాలను అందించాడు. అనేక అర్పణలు మరియు వివిధ బలుల ద్వారా, పశ్చాత్తాపపడిన పాపి దేవునితో సమాధానపరచబడ్డాడని హామీ ఇవ్వబడింది. కొత్త నిబంధన కింద ఉన్న విశ్వాసి క్రీస్తు సాధించిన పనిని తిరిగి చూస్తాడు.
పాత నిబంధన దాని నెరవేర్పుగా క్రీస్తును సూచించింది. కాబట్టి, దాని స్వభావం ద్వారా అది తాత్కాలికమైనది. దాని అనేక కార్యకలాపాలు – ఉదాహరణకు, జంతు బలులు – దాని తాత్కాలిక స్వభావాన్ని నొక్కిచెప్పాయి. సీనాయి పర్వతం వద్ద ప్రకటించబడిన పాత నిబంధన, యూదు ప్రజలను చుట్టుపక్కల ఉన్న అన్యుల నుండి వేరుగా ఉంచడానికి కూడా ఉపయోగపడింది, పాత నిబంధన వారిపై విధించిన నిబంధనల ద్వారా చెక్కుచెదరకుండా సంరక్షించబడిన ఒక ప్రత్యేకమైన దేశం. వాగ్దానం చేయబడిన మెస్సీయ వచ్చే వరకు వారు ఒక ప్రజలుగా ఉంటారని వారి విభజన నిర్ధారిస్తుంది.
పాత నిబంధన యొక్క ఈ ఉద్దేశ్యాన్ని పౌలు గలతీయులు 3:23–25లో ఇలా వివరించాడు: విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము.
పాత నిబంధన యూదులపై అనేక నియమాలను విధించింది. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవరూ రక్షించబడలేరు. వాస్తవానికి, అది ఎప్పుడూ పాత నిబంధన యొక్క ఉద్దేశ్యం కాదు. పౌలు గలతీయులకు 2:15,16 రాసినప్పుడు ఆ సత్యాన్ని నొక్కిచెప్పాడు: మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.
యెరూషలేములో జరిగిన మొదటి సభలో, పేతురు తన తోటి యూదులను విశ్వాసులపై సీనాయిక్ ధర్మశాస్త్ర నిబంధనల భారాన్ని మోపవద్దని వేడుకున్నాడు: “గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను” (అపొస్తలుల కార్యములు 15:10, 11).
పాత నిబంధనకు అనేక విలక్షణమైన గుర్తులు ఉన్నాయి. జీవితాన్ని ఎలా జీవించాలో అది అతి చిన్న వివరాలతో నిర్దేశించింది. యూదుల జీవితంలోని దాదాపు ప్రతి అంశం, ఒకరు తినగల ఆహారం నుండి మృతదేహాలను తాకడం వరకు నియంత్రించబడింది. అత్యంత ముఖ్యమైన నిబంధనలలో రెండు సబ్బాత్ చట్టాలు మరియు సున్నతి ఆచారం. పాత నిబంధనకు రోజురోజుకూ మరియు సంవత్సరం తర్వాత సంవత్సరం అంతులేని జంతు బలులు అవసరం. పాత నిబంధన ఒక నిర్దిష్ట తెగ (లేవీ తెగ) నుండి ఒకే కుటుంబంలో (అహరోను కుటుంబం) సభ్యత్వం ఆధారంగా వంశపారంపర్య యాజకత్వాన్ని స్థాపించింది. ప్రభువు బలిపీఠం వద్ద మరెవరూ సేవ చేయలేరు. పాత నిబంధన యూదులకు మాత్రమే అధికారాలను ఇచ్చింది మరియు వారికి మాత్రమే పరిమితం చేయబడింది.
దీనికి విరుద్ధంగా, కొత్త నిబంధన చాలా భిన్నంగా ఉంటుంది. “ఇది నేను వారి పితరులతో చేసిన నిబంధన లాంటిది కాదు.” దీనిలో పాటించాల్సిన చట్టాలు, నియమాలు లేదా నిబంధనలు లేవు. దీనికి బాహ్య గుర్తు లేదు. ఇది యాజకత్వాన్ని మరియు దేవుడిని సమీపించే హక్కును ఏ ఒక్క సమూహానికి పరిమితం చేయదు. పేతురు క్రైస్తవులందరికీ ఇలా వ్రాశాడు, “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” (1 పేతురు 2:9). ఇది జాతీయతతో సంబంధం లేకుండా అందరినీ నమ్మమని ఆహ్వానిస్తుంది. ఇది జాతి, తెగ మరియు ఇతర సరిహద్దులను పక్కన పెడుతుంది. ఆహ్వానం మొత్తం ప్రపంచానికి. పెంతెకొస్తు దానిని ప్రదర్శించింది. కొత్త నిబంధన అందరినీ ఆత్మతో మరియు సత్యంతో ప్రభువును ఆరాధించమని కోరుతుంది—“వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను.” ఇది మతమార్పిడి యొక్క అద్భుతం. యేసు సమరయ స్త్రీతో ఇలా అన్నాడు, “అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.” (యోహాను 4:23, 24).
కొత్త నిబంధన క్రింద, దేవుణ్ణి “తండ్రీ” అని పిలవడానికి మనల్ని నడిపించిన పరిశుద్ధాత్మ, తన చిత్తానికి మనం ప్రతిస్పందించేటట్లు చెయ్యగలడు, (ఒక పిల్లవాడు సంతోషంగా “నేను చేయగలను! నేను చేస్తాను!” అని చెప్పగలిగేలా చేస్తాడు. సీనాయి పర్వతం నుండి ప్రకటించిన సందేశం చేయలేనిది ఇది. అది చేయగలిగినదంతా “నేను తప్పకుండా చెయ్యాలి!” అని ఒప్పుకునేలా మనల్ని బలవంతం చేయడమే.
దేవుని కొత్త నిబంధన కొత్తది ఎందుకంటే దానిని మధ్యవర్తిత్వం చేసేవాడు మోషే కంటే గొప్పవాడు. పాత నిబంధన కింద ఉన్న యాజకులు ఎద్దుల మరియు మేకల రక్తాన్ని మాత్రమే అర్పించగలరు, ఎందుకంటే రక్తం చిందించకుండా క్షమాపణ లేదు. కాని కొత్త నిబంధన యొక్క మధ్యవర్తి అయిన క్రీస్తు అత్యున్నత బలిని అర్పిస్తాడు. ఆయన ముఖ్యమైన బలిని అర్పిస్తాడు. దేవుడిని సంతోషపెట్టే మరియు పాపం మరియు అపరాధాన్ని తొలగించే బలిని ఒకేసారి అర్పిస్తాడు. ఆయన తనను తాను అర్పించుకుంటాడు. స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా, ఆయన తన రక్తాన్ని చిందించాడు. తన రక్తం చిందించడం ద్వారా పాపాన్ని శాశ్వతంగా తొలగిస్తాడు. తన త్యాగం ద్వారా ఆయన స్వర్గానికి మార్గాన్ని తెరుస్తాడు. ఏదీ ఈ మార్గాన్ని అడ్డుకోదు. “ఇది సమాప్తమైంది” అని క్రీస్తు విజయవంతమైన మాటలతో, ఆలయ తెర పై నుండి క్రిందికి చిరిగిపోయింది, దేవునికి కొత్త మార్గం తెరవబడింది.
ఈ కొత్త నిబంధన సంపూర్ణ రక్షణను ఉచితముగా ప్రకటిస్తుంది. ఇది క్రీస్తులో మరియు క్రీస్తు ద్వారా గెలుచుకున్న రక్షణ. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16).
దేవుడు ఎలా రక్షిస్తాడనే దానిపై ఎటువంటి సందేహం లేదు. క్రీస్తును చూడటం అంటే దేవుని రక్షణను తెలుసుకోవడమే. క్రీస్తు గురించిన ప్రకటన ద్వారా, విని నమ్మిన వారు దేవుని రక్షణను స్వయంగా తెలుసుకుంటారు. బావి వద్ద ఉన్న స్త్రీ నుండి క్రీస్తు గురించిన సందేశాన్ని మొదట విన్న సమరయులు, “మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామని” (యోహాను 4:42) ఒప్పుకున్నారు.
ఈ కొత్త నిబంధన మన బాప్తిసం సమయంలో బాప్తిసం ద్వారా, దేవుడు మనలో ప్రతి ఒక్కరితో ఈ కొత్త నిబంధనను చేస్తాడు. బాప్తిసం ద్వారా ఆయన తన ఆత్మను, మన పాప క్షమాపణను, దానిని నమ్మడానికి విశ్వాసాన్ని ముద్రించి మనకు ఇస్తాడు. మన బాప్తిసంలో దేవుడు మనలో ప్రతి ఒక్కరికి నిరంతరం వాగ్దానం చేస్తున్నాడని మనం వింటాము: “నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.”
కానీ కొత్త నిబంధన యొక్క అద్భుతం అక్కడితో ఆగదు. కృపపై కృపను పోగుచేస్తూ, అంతే అద్భుతంగా మన ప్రభువు మనతో కొత్త నిబంధన భోజనాన్ని పంచుకుంటాడు. ఆ సహవాస భోజనంలో, ఆయన మనల్ని తనవైపుకు లాక్కుంటాడు. ఆయన మనకు అత్యున్నత బహుమతిని ఇస్తాడు: రొట్టెతో, శిలువపై ఇవ్వబడిన ఆయన శరీరంతో; ద్రాక్షారసంతో, సిలువపై పోయబడిన అతని రక్తంతో. ఈ పవిత్ర బహుమతులతో, ఆయన మనకు పాప క్షమాపణను ఇస్తాడు. వాటితో ఆయన మన హృదయాలలో నిలిచి ఉండే అన్ని సందేహాలను తొలగిస్తాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరి వద్దకు వ్యక్తిగతంగా వచ్చి ఇస్తాడు. మనకు ఖచ్చితంగా తెలుసు. మనం ఆయనకు చెందినవారం. మనం ఆయనతో ఒక్కటే. ఆయనదంతా మనది.
మనం ఆయనతో ఐక్యంగా ఉన్నాం. కానీ ఈ బంధం ఇంకా చాలా ముందుకు వెళుతుంది. మనమందరం ఒకే రొట్టె తిని విశ్వాసం ద్వారా ఆయనతో ఒకటిగా ఉన్నాము కాబట్టి, మనం క్రీస్తు శరీరంలో, అంటే చర్చిలో ఒకరితో ఒకరు కలిసి ఉన్నాము. యిర్మీయా క్రీస్తు దినాన్ని చూసి సంతోషించాడు. మనం యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనియున్నాము. ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl