బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు

మత్తయి 25:1-13, 1పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. 2వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. 3బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. 4బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. 5పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. 6అర్ధరాత్రివేళ– ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. 7అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని 8బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. 9అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. 10వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; 11అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి–అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా 12అతడు–మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 13ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.

మనం అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని చదివే ప్రతిసారీ, “ఆయన తీర్పు తీర్చడానికి తిరిగి వస్తున్నాడని” చెప్తాము. ఆ పదబంధంలో రెండు విభిన్న సంఘటనలు ఉన్నాయి: ఆయన వస్తాడు మరియు ఆయన తీర్పు తీరుస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఆయన రాకడను గురించి మాట్లాడుతుంది మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయం తుది తీర్పును గురించి మాట్లాడుతుంది. మొదటగా యేసు తిరిగి వచ్చుచుండగా కనబడే సంకేతాలను గుర్తించాలి, తద్వారా మనం ఆయన రాకడకు సిద్ధంగా ఉండొచ్చు. ఆయన తీర్పులో బుద్ధిలేని కన్యలను బుద్ధిగల కన్యల నుండి, నమ్మకమైన సేవకులను నమ్మకద్రోహ సేవకుల నుండి, గొర్రెలను మేకల నుండి వేరు చేస్తాడు.