అంత్యదిన ప్రవచనాల పై సంక్షిప్త సమీక్ష

దేవుని పవిత్ర వాక్యం వెలుగులో వెయ్యేండ్ల పాలన మరియు ఇతర ఎస్కటలాజికల్ బోధనలను జాగ్రత్తగా పరిశీలిధ్ధాం.

తన మరణానికి ముందు మంగళవారం నాడు యేసు యెరూషలేములోని ఆలయాన్ని చివరిసారిగా సందర్శించాడు. ఆయన నగరం నుండి బయలుదేరి ఒలీవల కొండను అధిరోహించినప్పుడు, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాన్ని దాని సౌందర్యాన్ని ఆయనకు చూపించారు. హేరోదు ది గ్రేట్ 40 సంవత్సరాల క్రితం దాని పునరుద్ధరణ పనులను ప్రారంభించాడు. అవి ఇంకా పూర్తి కాకపోయినా, అది ఒక అద్భుతమైన దృశ్యం.

ఆ అద్భుతమైన దేవాలయం పట్ల తన శిష్యుల గర్వం, త్వరలోనే ఆ ఆలయం పైకి మరియు మొత్తం నగరం పైకి రాబోతున్న దేవుని తీర్పు గురించి వారికి చెప్పేటట్లు యేసును ప్రేరేపించింది. అందుకాయన – మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. అప్పుడు శిష్యులు, “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” (మత్తయి 24:1-3) మాతో చెప్పుమని ఆయనను అడుగగా, యేసు, యెరూషలేము నాశనం, ప్రపంచ ముగింపు మరియు తుది తీర్పు కోసం ఆయన తిరిగి రావడం గురించి వివరించాడు. మత్తయి సువార్త 24 మరియు 25 అధ్యాయాలలో, మార్కు 13 అధ్యాయంలో మరియు లూకా 21 అధ్యాయంలో మన ప్రభువు యొక్క ఎస్కాటోలాజికల్ ప్రవచనాలు ఉపదేశాలు ఉన్నాయి.

ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? అనే శిష్యుల ప్రశ్న యెరూషలేము నాశనాన్ని ప్రపంచ ముగింపుతో ముడిపెడుతుంది. తన జవాబులో యేసు ఈ రెండు సంఘటనల గురించి మాట్లాడాడు. వాస్తవానికి, ఈ రెండు విపత్తులు యేసు మాటలలో చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయి, ఒకే దారాన్ని ఏర్పరచడానికి కలిసి అల్లిన రెండు దారాల వలె వాటిని ఎల్లప్పుడూ స్పష్టంగా గుర్తించలేం.

దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బైబిల్ ప్రవచనం యొక్క గుణ లక్షణంలో ఉంది. ప్రవచనాలు తరచుగా కాల ప్రభావం క్రింద ఉంచబడని సంబంధిత సంఘటనల గురించి మాట్లాడుతాయి. ప్రవచించబడిన సంఘటనలు వందల వేల సంవత్సరాల తేడాతో ఉంటాయని అవి సూచించవు. కాబట్టి వాటిని చదవడం అంటే రెండు పర్వత శిఖరాల మధ్య ఉన్న లోయను చూడకుండా వాటిని దూరం నుండి చూడటం లాంటిది.

ఉదాహరణకు, యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక అను కీర్తనాకారుని (కీర్తన 96:11,13; 98:9), మాటలు క్రీస్తు మొదటి మరియు రెండవ రాకడకు వర్తిస్తాయి. బాప్తిస్మమిచ్చు యోహాను తన పనిని క్రీస్తు పనితో పోల్చుకొంటూ, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాడు, మత్తయి 3:11,12. పెంతెకొస్తు రోజున యేసు పరిశుద్ధాత్మను కుమ్మరించడాన్ని మరియు చివరి తీర్పులో మెస్సీయ చేయబోయే పని యొక్క ముగింపును యోహాను ఒకే ప్రవచనంలో ప్రస్తావించాడు.

యేసు చెప్పిన కొన్ని మాటలు యెరూషలేము నాశనాన్ని మాత్రమే సూచిస్తున్నాయా లేక ప్రపంచాంతం గురించి సూచిస్తున్నాయా లేదా ఈ రెండు సంఘటనలను సూచిస్తున్నాయా? అని నిర్ణయించడానికి ప్రయత్నించడంలో మనకున్న సమస్యకు రెండవ కారణం ఏమిటంటే, యెరూషలేము నాశనంలో జరిగినది ప్రపంచ ముగింపుకు ముందు, చివరి రోజులలో జరిగే సంఘటనలను కూడా సూచిస్తూ ఉంది. కాబట్టి, అసమానమైన విపత్తులు మరియు వర్ణించలేని బాధలు ఈ రెండు సంఘటనలను వర్ణిస్తున్నాయి.

బైబిల్లో ఇంకా నెరవేరని ప్రవచనాలను పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాం. దీనర్ధం, దేవుని వాక్యం అస్పష్టంగా ఉందని కాదు. సమస్య దేవుని వాక్యంలో కాదు, మనలో ఉంది. దేవుని యొక్క ఈ లోతైన రహస్యాలను అర్థం చేసుకునే మన పరిమిత సామర్థ్యంలోనే సమస్య ఉంది. మనం కళ్ళపై కంటిశుక్లాన్ని కలిగి ఉన్నాము. కంటిశుక్లాన్ని కలిగియున్న వారు ప్రకాశవంతమైన మధ్యాహ్నం సూర్యునిలో ఉన్నటువంటి వాటి రూపాన్ని కూడా స్పష్టంగా చూడలేరు. అపొస్తలుడైన పౌలు మన అవగాహన పరిమితమని చెప్తూ, ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాము; మనం పూర్తిగా తెలుసుకునే సమయం వస్తుంది. అప్పుడు పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము (1 కొరింథీయులు 13:12) అని చెప్పాడు.

పైన చెప్పినట్లుగా, యెరూషలేము నాశనం ప్రపంచ ముగింపును కూడా సూచిస్తూవుంది మరియు ఆ ముగింపు ప్రారంభానికి సంకేతమిచ్చింది. యేసుని జీవితంలోని చివరి వారంలో, ఆదివారం నాడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి –నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను (లూకా 19:41-44). రెండు రోజుల తర్వాత ఆయన మళ్ళీ తన శిష్యులతో మాట్లాడుతూ, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి (లూకా 21:20) అని వారిని హెచ్చరించాడు.

ఈ ప్రవచన నెరవేర్పు యొక్క భయానక పరిస్థితులను చరిత్రకారుడైన జోసీఫస్ వివరించాడు. యూదులు రోమ్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, టైటస్ నేతృత్వంలోని రోమన్ సైన్యాలు తిరుగుబాటును అణిచివేయడానికి వేగంగా కదిలాయి. క్రీ. శ. 70వ సంవత్సరంలో వారు యెరూషలేమును ముట్టడించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన శరణార్థులతో నగర జనాభా నిండిపోయింది. ఒక ప్లేగు విజృంభించింది, వేలాది మంది మరణించారు. వందలాది మంది తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కాని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్న రోమన్ సైన్యాధిపతులు రోజుకు ఐదు వందల మందిని పట్టుకుని సిలువ వేశారు. నాశనం చేయబడిన నగర వీధుల్లో ఆకలి చెలరేగింది, తల్లులు తమ సొంత పిల్లలను తిన్నారు.

చివరకు, టైటస్ ఆంటోనియా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆలయానికి నిప్పు పెట్టబడింది. ఆలయం ఉన్న కొండ శవాలతో నిండిపోయింది. దాని వాలుల నుండి రక్తపు నది ప్రవహించింది. పది లక్షలకు పైగా యూదులు ఆకలితో లేదా వ్యాధితో మరణించారు లేదా చంపబడ్డారు. లక్ష మందికి పైగా యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్లబడ్డారు. రోమన్ సైనికులు పొగలు కక్కుతున్న శిథిలాలపై తమ విజయ చిహ్నాలను నాటారు, వారి దేవుళ్లకు బలులు అర్పించారు మరియు వారి చక్రవర్తిని ప్రకటించారు. పవిత్ర స్థలంలో అసహ్యకరమైన విషయం గురించి దానియేలు ప్రవచనం యొక్క భయంకరమైన నెరవేర్పు అలా ఉంది (దానియేలు 9:27; 12: 11), మత్తయి 24:15లో యేసు దీని గురించి ప్రస్తావించాడు (cf. లూకా 21:20), మరియు ప్రజల గురించి యేసు చెప్పిన మాటలు అమలు చేయబడిన తీరు కూడా అంతే భయంకరంగా ఉంది, “వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు” (లూకా 21:24). నేటికీ యూదులు అన్ని దేశాల మధ్య చెల్లాచెదురుగా ఉన్నారు.

కొత్త నిబంధన కాలం అంతటా యేసు ప్రస్తావించిన వివిధ రకాల సంకేతాలు అన్నిటికీ ముగింపు ఆసన్నమైందని హెచ్చరికలుగా పనిచేస్తాయి. ఈ సంకేతాలను మూడు వర్గాలుగా విభజించొచ్చు: ప్రకృతిలో, మానవ సమాజంలో మరియు సంఘములో సంకేతాలు.

ప్రకృతిలో, యేసు ప్రవచనం ప్రకారం, “అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టునులూకా 21:11. cf. మత్తయి 24:7, జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. మార్కు 13:7,8, మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధసమాచారములనుగూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు….. కరవులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. “సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురులూకా 21:25-27. మత్తయి 24:29, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును; మార్కు 13:24, నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు – చదువు వాడు గ్రహించుగాక – యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.

భూకంపాలు, కరువులు, అంటు వ్యాధులు, సూర్య చంద్ర గ్రహణాలు, ఉల్కాపాతాలు, తోకచుక్కలు, సన్ స్పాట్స్, ఉత్తర మరియు దక్షిణ ధ్రువంలో తీవ్రమైన కాంతులు, తుఫానులు, రుతుపవనాలు, భీకరమైన అలలు, సుడిగాలులు మరియు వరదలు – ఈ సంకేతాలన్నీ అన్ని సమయాలలో జరుగుతున్నాయి మరియు అవి శతాబ్దాలుగా జరుగుతున్నాయి. అలాంటి ప్రతి సంఘటన ఈ ప్రపంచం దాని చివరి గంట వైపు వేగంగా పరుగెత్తుతుందని మనకు గుర్తు చేయాలి.

అదనంగా, యేసు మానవ సమాజంలో అంతాన్ని సూచించే సంకేతాలను ప్రస్తావించాడు. యుద్ధాలు, విప్లవాలు, తిరుగుబాట్లు మరియు అల్లర్ల పుకార్లు ఉంటాయి (మత్తయి 24:6,7; మార్కు 13:7,8; లూకా 21:9,10). చివరి రోజుల్లో కష్టాలు, బాధలు, ఆందోళన మరియు భయం ఉంటాయి (మత్తయి 24:21; లూకా 21:26). శాంతిభద్రతలు విచ్ఛిన్నమవుతాయి. మానవులు తమ హృదయాలలో లిఖించబడిన నైతిక చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నందున సామాజిక వ్యవస్థ యొక్క పునాదులే కూలిపోతాయి.

పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఈ వివరాలను జతచేసాడు : “అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించు వారు” (2 తిమోతి 3:1-4). కొందరు తమ దుష్టత్వాన్ని భక్తి ముసుగుతో కప్పి, “పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు” (2 తిమోతి 3:5).

యూదా మనకు తెలియజేసినట్లుగా, అంత్యదినాల్లో ప్రబలమైన భక్తిహీనత కనిపిస్తుందని పూర్వపు పితరుడైన హనోకు ప్రవచించాడు మరియు ఇలా హెచ్చరించాడు, “ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను –ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చుచున్నాడు” (వచనాలు 14, 15). భక్తిహీనత – ఈ వాక్యంలో నాలుగు సార్లు ప్రస్తావించబడిన పదం. అది చివరి కాలాల యొక్క విలక్షణమైన గుర్తు.

యేసు ప్రవచనం ప్రకారం, అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు అనేకులను మోసం చేస్తారు (మత్తయి 24:4,5,11). “మందను విడిచిపెట్టని” “క్రూరమైన తోడేళ్ళు” వస్తాయని పౌలు హెచ్చరించాడు (అపొస్తలుల కార్యములు 20:29). ఈ నకిలీ ప్రవక్తలలో కొందరు ఆశ్చర్యకరమైన సూచనలు మరియు అద్భుతాలు చేస్తారు, తద్వారా ఎన్నికైనవారు కూడా మోసపోయే ప్రమాదంలో ఉంటారు. కానీ దేవుడు తన కృపతో వారిని పడిపోకుండా కాపాడతాడు మరియు వారి కొరకు ఆ చివరి చెడు దినాలను తగ్గిస్తాడు.

మహమ్మద్, జోసెఫ్ స్మిత్ మరియు బ్రిఘం యంగ్, మేరీ బేకర్ ఎడ్డీ, చార్లెస్ రస్సెల్ మరియు జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్, బహూల్లా వంటి స్వయం నియమిత ప్రవక్తలు మరియు అతీంద్రియ ధ్యానం ద్వారా మనశ్శాంతిని మరియు దేవునితో ఐక్యతను వాగ్దానం చేస్తున్న యోగా గురువులు, నేటి ప్రసిద్ధ గురువులు మరియు స్వామీజీలను గుర్తు చేసుకొంటే, వీళ్ళ వల్ల లక్షలాది మంది మోసపోయారు మోసపోతూనే ఉన్నారు. ఈ మోసగాళ్లలో కొందరు అనుచరులను పొందడానికి క్రీస్తు పేరును, బోధలను పెట్టుబడిగా పెట్టుకొంటున్నారు. క్రైస్తవులలోనే అనేకులు అబద్దపు బోధలను తమ స్వలాభము కోసం బోధిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క లేటర్ డే సెయింట్స్ చర్చి గురించి ఆలోచించండి. యెహోవాసాక్షుల మాదిరిగానే చాలామంది తమ బోధనలను బైబిల్ ఆధారంగా చేసుకుంటామని చెప్పుకుంటారు, కాని నిజానికి వీళ్ళు అన్యులే.

ఈ అనేకమైన సంకేతాల గురించి స్పష్టమైన హెచ్చరిక ఉన్నప్పటికీ, చాలా మంది ప్రజలు ఈ సంకేతాలకు తమ కళ్ళను చెవులను మూసుకొని ఉన్నారు. నోవహు కాలంలో మరియు లోతు కాలంలో జరిగినట్లే, ప్రపంచం అంతం అయినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అంతాన్ని సూచించే బాకా ఊదబడే వరకు ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ, పొలాలు నాటుకొంటూ, బిల్డింగ్స్ కట్టుకుంటూ, వస్తువులు కొంటూ, అమ్ముతూ ఉంటారు.

ఈ కార్యకలాపాలన్నీ జీవితంలో ఒక సాధారణ భాగమని, అవి తప్పు కాదని మనకు అనిపించొచ్చు. కాని ఈ మానవ వ్యవహారాలు ప్రజల ఏకైక ఆందోళనగా ఉన్నాయని యేసు చెబుతున్నాడు. వారు ఇప్పుడు ఇక్కడ అనే ఆలోచనతో జీవిస్తున్నారు తప్ప, రాబోయే జీవితం గురించి ఆలోచించటంలేదు. ప్రపంచం అంతం అవుతుందని ఆశించే వారిని చూచి వారు, “ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే” (2 పేతురు 3:4; cf. యూదా 18) అని ఎగతాళి చేస్తారు. మనుష్యకుమారుడు అకస్మాత్తుగా ఆకాశ మేఘాలలో కనిపించినప్పుడు వారికి ఎంత షాకింగ్ గా ఉంటుందో కదా (లూకా 17:26-30; మత్తయి 24:37-39)!

ప్రకృతి రాజ్యంలో మరియు మానవ సమాజంలో హెచ్చరిక సంకేతాలకు జతగా యేసు దృశ్య సంఘములోని ముఖ్యమైన సంకేతాలను జోడించాడు. సంఘములో కూడా, తప్పుడు బోధకులు కనిపిస్తారు. “శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు” అని పౌలు ఎఫెసు పెద్దలను హెచ్చరించాడు (అపొస్తలుల కార్యములు 20:30). అపొస్తలుల కాలంలోనే ఇలాంటి అనేక మంది తప్పుదారి పట్టించేవారు కనిపించారని లేఖనం నుండి మనకు తెలుసు. “చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము” (1 యోహాను 2:18) అని యోహాను కూడా హెచ్చరించాడు.

యోహాను ఇక్కడ అనేకమంది క్రీస్తు విరోధులకు మరియు ఒక ప్రధాన క్రీస్తు విరోధికి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో, దానియేలు క్రీస్తు యొక్క ఈ ప్రత్యర్థి రాక గురించి ప్రవచించాడు. దానియేలు 9:26,27, ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియులేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును; దానియేలు 11:36,37, ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవునిమీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును; అంతట నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు. అయితే, దేవుని ఆలయంలో తనను తాను నిలబెట్టుకుని, తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఈ పాపపు మనిషి గురించి పౌలు మనకు పూర్తి వివరణ ఇచ్చాడు. 2 థెస్సలొనీకయులు 2:2-11, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా? కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. “అంత్యదినాల్లో కొందరు విశ్వాసాన్ని విడిచిపెట్టి, మోసపూరిత ఆత్మలను మరియు దయ్యాలు బోధించిన వాటిని అనుసరిస్తారు” అని తిమోతిని హెచ్చరించినది కూడా పౌలే. 1 తిమోతి 4:1-3, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

సంఘాన్ని ముంచెత్తే హింసలు అంతానికి మరో సంకేతం. ఇవన్నియు జరుగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పెట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. తలిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు; నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు అని యేసు తన శిష్యులను హెచ్చరించాడు, (లూకా 21:12,16,17).

క్రీస్తు విరోధి కుట్రలు, లోకపు మోసపూరితత్వం మరియు హింసలు విస్తృతమైన మతభ్రష్టత్వానికి దారితీస్తాయి. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు, తద్వారా, చాలామంది విశ్వాసం నుండి తొలగిపోతారని యేసు చెప్పాడు, (మత్తయి 24:10). “అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును” (మత్తయి 24:12). అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?, లూకా 18:8.

లోకాంతానికి ముందున్న భయంకరమైన రోజుల వర్ణన నుండి, లోకాంతానికి ముందు స్వర్ణ యుగంలో సంఘము అపూర్వమైన పెరుగుదలను మరియు శక్తిని అనుభవిస్తుందనే వెయ్యేళ్ళ వాదుల భావన ఒక ఖాళీ కల అని స్పష్టమవుతుంది. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును, మత్తయి 24:14, అని యేసు చెప్పాడు. ఈ సూచనను తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. సువార్త వినని వారు ఇంకా చాలా మంది ఉన్నందున అంతం ఇంకా చాలా దూరంలో ఉందని ప్రజలు భావిస్తారు. బైబిల్ ప్రకారం, అపొస్తలుల కాలంలోనే సువార్త భూమి చివరలకు తీసుకువెళ్లబడిందనే వాస్తవాన్ని వారు విస్మరిస్తారు (రోమా 10:18, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్లెను). “ఆకాశం కింద ఉన్న ప్రతి జీవికి ఇది ప్రకటించబడిందని” (కొలొస్సయులు 1:23) పౌలు కొలొస్సయులకు చెప్పాడు.

“జాగ్రత్తగా ఉండుము! సిద్ధంగా ఉండుము!” (2 తిమోతి 4:15) ఇది యేసు పదే పదే ఇస్తున్న హెచ్చరిక (మత్తయి 24:42,44; 25:13). “జాగ్రత్తగా ఉండుము! అప్రమత్తంగా ఉండుము!” అనేది కొత్త నిబంధనలో నిరంతర పల్లవి (అపొస్తలుల కార్యములు 20:31; 1 కొరింథీయులు 16:13; కొరింథీయులు 4:2; 1 థెస్సలొనీకయులు 5:6; 1 పేతురు 4:7; ప్రక. 3:2). పౌలు మరియు ఇతర అపొస్తలులు క్రీస్తు తిరిగి రావడం గురించి వారి స్వంత జీవితకాలంలో నిజమైన అవకాశంగా మాట్లాడారు. ముఖ్యంగా, పౌలు థెస్సలొనీకయులకు, ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము (1 థెస్సలొనీకయులు 4:17) అని చెప్పినప్పుడు వర్తమాన కాలాన్ని ఉపయోగించాడు. “సమయం తక్కువగా ఉంది,” అని అతడు కొరింథీయులకు చెప్పాడు (1 కొరింథీయులు 7:29). “ప్రభువు రాక సమీపించుచున్నది” అని యాకోబు ప్రకటించాడు (యాకోబు 5:8). “యిది కడవరి గడియ” అని యోహాను హెచ్చరించాడు (1 యోహాను 2:18). “అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది” అని పేతురు వ్రాశాడు (1 పేతురు 4:7). “ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును” అని హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత ప్రవచించాడు (హెబ్రీ 10:37). అపొస్తలుల కాలంలో ఇది నిజమైతే, మన కాలంలో ఇది ఎంత నిజమో కదా (రోమా 13:11, మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది)!

ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని లేఖనం పదే పదే హెచ్చరిస్తుంది, (మత్తయి 24:43,41f; లూకా 12:39,40; l థెస్సలొనీక 5:2,4; 2 పేతురు 3:10; ప్రకటన 3:3; 16:15). ఈ సూచన ఇంకా నెరవేరలేదు కాబట్టి ఆ రోజుకు ఇంకా కొంత సమయం మిగిలి ఉందనే ఆలోచన తప్పుడు భద్రతకు దారితీస్తుంది. ఇది రక్షకుని స్పష్టమైన ప్రకటనను పక్కన పెడుతుంది, “మీ ప్రభువు ఏ రోజున వస్తాడో మీకు తెలియదు” (మత్తయి 24:42). పోస్ట్ మిలీనియలిస్టులు చెప్పినట్లుగా, వెయ్యి సంవత్సరాల సార్వత్రిక శాంతి ముగింపులో ఆయన వస్తే, ఆయన రెండవ రాకడ తేదీని సులభంగా లెక్కించొచ్చు లేదా ఆయన తిరిగి వచ్చి భూమిపై తన వెయ్యేళ్ల రాజ్యాన్ని స్థాపించినట్లయితే, ప్రీమిలీనియలిస్టులు నమ్ముతున్నట్లుగా, వెయ్యేళ్ల పాలన ప్రారంభమైన రోజు నుండి వెయ్యి సంవత్సరాల తర్వాత ప్రపంచ ముగింపును ఆశించొచ్చు.

మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును, మత్తయి 24:44. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు, 2 పేతురు 3:9. అయితే, ఆయన ఎన్నుకున్న వారిలో చివరి వ్యక్తి సువార్త విని విశ్వాసానికి వచ్చినప్పుడు, అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు, మత్తయి 24:30. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, ప్రకటన 1:7.

ప్రీమిలీనియలిస్టులు కూడా యేసు రహస్యంగా తిరిగి రావడాన్ని బోధిస్తారు, వారు విశ్వాసులు ఎగువ వాతావరణంలో క్రీస్తును కలవడానికి భూమి నుండి అదృశ్యమవుతారని ఆశిస్తారు.

ఆయన తిరిగి రావడం అందరికీ కనిపిస్తుందని లేఖనం స్పష్టంగా బోధిస్తోంది. శిష్యులు ఆయన ఒలీవ కొండ నుండి మేఘాలపైకి ఎక్కడాన్ని చూసినట్లే, ఆయన తిరిగి వచ్చినప్పుడు అందరూ ఆయనను చూస్తారు (అపొస్తలుల కార్యములు 1:11). కయప మరియు యూదుల మహాసభకు, “మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని” (మత్తయి 26:64) యేసు సాక్ష్యమిచ్చాడు. దేవుని సన్నిధి యొక్క దృశ్య అభివ్యక్తిగా లేఖనంలో తరచుగా మేఘాలు ప్రస్తావించబడ్డాయి (నిర్గమకాండము 13:21; 19:16, 34:5; 40:34; 1 రాజులు 8:10; కీర్తనలు 97:2; యెహెజ్కేలు 1:4; కీర్తన 7:13 మొదలైనవి) ఆయనకు మహిమాన్విత రథాన్ని ఏర్పరుస్తాయి (cf. యెషయా 19:1).

పరలోకపు మహిమతో ఔన్నత్యముతో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆయనను నమ్మని వారందరి హృదయాలలో భయాన్ని రేకెత్తిస్తుంది. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని–సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీదపడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుదురు, ప్రకటన 6:17. దేవుని తీర్పు సమయం వస్తుంది. దేవుని కృపగల రోజులు అయిపోతాయి.

కొంతమంది సహస్రాబ్దివాదుల అంచనాలకు విరుద్ధంగా, క్రీస్తు తిరిగి రావడం ఒకే ఒక్కసారి మాత్రమే ఉంటుంది, అది సహస్రాబ్దిని ప్రారంభించడానికి కాదు మరియు ప్రపంచానికి తీర్పు తీర్చడానికి కాదని హెబ్రీయులు 9:28 చెప్తుంది: ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl