యేసు సిలువపై నిజముగా చనిపోలేదు అనే బోధకు జవాబు
యేసు చావ లేదా?

కీర్తనలు 118:17_ నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఈ మాటలను బట్టి కొందరు యేసు మరణించలేదని వాదిస్తూ అందుకు సపోర్ట్ గా ఈ వచనాన్ని చూపిస్తున్నారు, కరెక్ట్ అంటారా? తప్పంటారా?

లేఖనాలను పరిశీలిద్దాము: యెషయా 53:7, యేసుని సిలువ మరణాన్ని గురించి మాట్లాడుతూ, యేసు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని యెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అనే ప్రవచనం పరిశుద్ధ గురువారం, గుడ్ ఫ్రైడే రోజున యేసుని జీవితములో నెరవేరింది.

అట్లే కీర్తన 22:16, కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు అనే ప్రవచనం గుడ్ ఫ్రైడే రోజున యేసుని జీవితములో నెరవేరింది. ఈ మాటలను రాజైన దావీదు సుమారుగా క్రీ. పూ. 900 లో రాసాడు. చెప్పాలంటే శిలువ వేయడం అప్పటికి ఇంకా కనుగొనబడలేదు.

అట్లే యెషయా 50:6, కొట్టువారికి నా వీపును అప్పగించితిని. వెండ్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని. ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు అనే ప్రవచనం పరిశుద్ధ గురువారం నాడు యేసును కొరడాతో ఎంత తీవ్రముగా కొట్టారో, లేఖనాలను బట్టి మనకు తెలుసు. యేసుని జీవితములో ఈ ప్రవచనం నెరవేరింది.

అట్లే కీర్తన 22:14,15, నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను. నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి. నా బలము యెండిపోయి చిల్లపెంకు వలె ఆయెను. నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది. అప్పుడు నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, కీర్తన 69:21 అనే ప్రవచనాలు కూడా యేసుని జీవితములో నెరవేరాయి.

అంతేనా, నన్ను చూచు వారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించునేమో అందురు, కీర్తన 22:7,8. ఈ ప్రవచనం కూడా యేసుని జీవితములో నెరవేరింది.

యేసు అనుకుంటే సిలువపై నుండి ఆయన క్రిందికి దిగి ఉండొచ్చు, దూతలు ఆయనకు పరిచర్య చేయడానికి వచ్చి ఉండొచ్చు. అందుకు కాదే ఆయన శరీరధారియై ఈ లోకానికి వచ్చింది. కాబట్టే ఆయన సిలువపై నుండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని ప్రార్ధించాడు. ఈ విషయమే కీర్తనలు 109:4 లో నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగపెట్టియున్నారు. అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను అని చెప్పబడింది. ఈ ప్రవచనం కూడా యేసుని జీవితములో నెరవేరింది.

అంతేనా, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు, కీర్తన 22:18 అని కూడా చెప్పబడింది. ఈ ప్రవచనం కూడా యేసుని జీవితములో నెరవేరింది.  

యేసు ఇద్దరు దొంగల మధ్య శిలువ వేయబడ్డాడు. ఈ విషయాన్నే యెషయా 53:12 చెప్తూ, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని చెప్తుంది. ఈ ప్రవచనం కూడా యేసుని జీవితములో నెరవేరింది.

అనేకుల పాపమును భరించుచు, యేసు చనిపోయినప్పుడు ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది. ఆమోసు 8:9లో ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింప జేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును అని చెప్తుంది. ఈ ప్రవచనం కూడా యేసుని జీవితములో నెరవేరింది.

కీర్తన 22:1 నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? కీర్తన 31:5 నా ఆత్మను నీ చేతి కప్పగించుచున్నాను. ఈ ప్రవచనాలు కూడా యేసుని జీవితములో నెరవేరాయి.

ద్వితీయోపదేశకాండము 21:22,23 ప్రకారం మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన యెడల అతని శవము రాత్రివేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. అగత్యముగా ఆ దినమునే వానిని పాతిపెట్టవలెను అను యూదుల చట్టం ప్రకారము యేసు చనిపోకపోతే చీకటి పడక ముందు రోమా సైనికులు యేసుని కాళ్ళను విరుగగొట్టి చనిపోయేటట్లు చేసి ఉండేవాళ్లు. ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును. వాటిలో ఒక్కటి యైనను విరిగిపోదు అని కీర్తన 34:20లో ప్రవచింపబడిన ప్రకారమే జరిగింది.

రోమా సైనికులు యేసు చనిపోయాడా లేదో చెక్ చెయ్యడానికి వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించాడు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రోమా సైనికులు యేసుని ప్రక్కలో బల్లెముతో పొడిచి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. యూదా మతపెద్దలు, నాయకులూ, ప్రధాన యాజకులు, శాస్త్రులు పరిసయ్యులు అందరూ ఆయన మరణించాడనే విషయాన్ని అంగీకరించారు, నిర్ధారించారు. కాబట్టే పిలాతు యేసుని మరణాన్ని గురించి కన్ఫర్మ్ చేసుకొని ఆయనను బరియల్ చెయ్యడానికి అనుమతించినప్పుడు వీళ్ళందరూ అందుకు ఒప్పుకొన్నారు.

ఆనాడు రోమీయులు గోల్గోతా అనెడి కొండ పై దోషులను శిక్షించేవాళ్ళు, వాళ్ళను అక్కడే ఖననం చేసేవాళ్ళు. సిలువ వేయబడిన నేరస్థుల శవాలను తరచుగా ఖననం చేయకుండా సిలువ పైనే వదిలి వేసే వాళ్ళు లేదా గౌరవం లేకుండా సామూహిక సమాధిలోకి విసిరేసే వాళ్ళు. ఎవరు కూడా యేసుని క్లెయిమ్ చెయ్యకపోతే యేసుకు ఏమవుతుంది? ఆయనను “ఆ రాత్రి” 2 దొంగలతో పాటు పారేసే వాళ్ళు, అది దేవుని నిర్ణయము కాదే. యేసు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడుతుందని ధనవంతుని యొద్ద అతడు ఉంచబడతాడను ప్రవచనమైన యెషయా 53:9 ప్రకారం ధనవంతుడైన అరిమతయియ యోసేపు ఆయనను సిలువ పై నుండి క్రిందికి దింపి యూదుల మర్యాద చొప్పుననే ఆయనను బరియల్ చేసాడు. ఈ ప్రవచనం కూడా యేసుని జీవితములో నెరవేరింది.

నీకొదేము యేసు దేహాన్ని బరియల్ చెయ్యడానికి అవసరమైన సుగంధ ద్రవ్యములను తెచ్చాడు. నీకొదేము తెచ్చిన సుగంధద్రవ్యములు డ్రై స్పైసెస్, యేసు దేహానికి శుభ్రమైన ఏక నారబట్టను చుడుతూ ప్రతిపొరలో డ్రై స్పైసెస్ పెడుతూ ఆ దేహాన్ని పూర్తిగా మమ్మిఫై చేసారు అంటే మృత దేహాన్ని ఎండిపో చేసి దానిని సంరక్షించేందుకు డ్రై స్పైసెస్ ను వాళ్ళు వాడి, బరియల్ చేసారు. కీర్తన 16:10 ఈ విషయాన్నే చెప్తూ నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లు పట్టనియ్యవు అని చెప్తుంది. ఈ ప్రవచనం కూడా యేసుని జీవితములో నెరవేరింది.

రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో యేసుని దేహాన్ని ఉంచి, సమాధి ద్వారానికి పెద్దరాయి పొర్లించి వెళ్లి పోగా యేసుని శత్రువులు ఆయన దేహము సమాధిలో పెట్టబడిన తరువాత వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నారు. యేసుని బరియల్ లో వాళ్ళు ఉన్నారు, యేసుని సమాధిని రాతితో మూసివేసినప్పుడు వాళ్ళు ఉన్నారు. ఆ సమాధికి పిలాతు ఆజ్ఞతో కావలి పెట్టారు.

ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిద్దాము : యేసు పరిస్థితి ఎలా ఉంది? యేసు ఎంతగానో గాయపడ్డాడు, ఆయనను కొరడాలతో 39 దెబ్బలు కొట్టడం మూలాన్న (వీపును చీల్చివేయడం మూలాన్న) ఎంతో రక్తం పోయింది. ఆయన ఎంతో శ్రమను సహించాడు. ఆ కాలములో ఎంతో ఘోరాతి ఘోరమైన చెప్పనలవి కాని సిలువశిక్షను ఆయన పొందాడు. ఆయనను పెద్ద పెద్ద చీలలతో సిలువకు కొట్టడం, ముళ్ళతో కిరీటం బట్టి ఉన్న కొద్ది రక్తాన్ని శక్తిని కోల్పోయాడు. ఒకవేళ క్రీస్తు సిలువపై చనిపోకపోతే ఈ విషయాన్ని ఆయన శత్రువులు కన్ఫర్మ్ చేసుకోలేదంటారా?

 ఒకే బట్టతో ఏకండిగా ఆయన దేహాన్ని చూడుతూ ప్రతి పొరలో డ్రై స్పీసీస్ పెడుతూ ఆయనను పూర్తిగా చుట్టేశారు. బట్టతో బంధించేశారు కదా ఆయన కేమి కాలేదని చెప్తున్నామా? దెబ్బల వలన ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చి ఉండాలి. సమాధిలో యేసుకు మెడికల్ అసిస్టెన్స్ ఏమి లేదు. బలహీనుడైన ఆయన సిలువ పై మూర్ఛపోయి మెలకువ వచ్చిన తరువాత కట్లు తెంచుకొని సమాధి ద్వారమున మూయబడిన రాయిని తనకు తానుగా తొలగించుకొని తప్పించుకొన్నాడంటారా? రోమన్ సైనికులు ఆయన తప్పించుకొంటుంటే చూస్తూ ఊరుకొని శిష్యులు ఆయనను ఎత్తుకొని పోయారని వాళ్ళు ఎలా చెప్పగలరు? నేను మరణాన్ని జయించియున్నానని యేసు ఎలా చెప్పుకోగలడు?

వాస్తవానికి, యేసు తన మరణాన్ని కనీసం మూడుసార్లు సువార్తలలో వివిధ సందర్భాలలో (మత్తయి, మార్క్, లూకాలలో) ముందుగానే చెప్పాడు. యోహాను గ్రంధము ఆయన మరణాన్ని గురించి ఇంకా ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.

 యేసు తన మరణాన్ని గురించి మొదటిసారిగా మత్తయి 16:21-23, మార్కు 8:31-32, లూకా 9:21-22లో చెప్పాడు, చూడండి.

యేసు తన మరణాన్ని గురించి రెండవసారిగా మత్తయి 17:22-23, మార్కు 9:30-32, లూకా 9:44-45లో చెప్పాడు, చూడండి.

యేసు తన మరణాన్ని గురించి మూడవసారి మత్తయి 20:17-19, మార్కు 10:32-34, మరియు లూకా 18:31-34లో చెప్పాడు, చూడండి.

ఇప్పుడు చెప్పండి కీర్తనలు 118:17_ క్రీస్తు మరణించలేదని చెప్తుందని వాదిస్తూ కొందరు తప్పుడు భోదలు చేస్తున్నారు. కీర్తనలు 118:17 లో యేసు నేను చావను అని చెప్పటంలో క్రీస్తు అను నేను మరణంలో ఉండిపోను. విజయం మరియు రక్షణ అన్ని దేశాలకు ప్రకటించబడేలా సజీవుడనై తిరిగి లేచి యెహోవా క్రియలు వివరించెదను అనే కదా చెప్తున్నాడు. 

పాత నిబంధన బైబిలులో ఒక భాగమై యుండి, క్రీస్తు రాకడకు ముందు వ్రాయబడి, దేవుని వాగ్ధానమైన రక్షకుని గురించి తెలియజేస్తుంది. మెస్సయ్య వచ్చాడు. ఆయనే తన మరణాన్ని గురించి ప్రవచించాడు. ఆయన ప్రవచనాలన్నింటిని నెరవేర్చాడు. క్రొత్తనిబంధనలో ఈ విషయాలన్ని వ్రాయబడి ఉన్నాయి.

1 కొరింథీయులకు 15:3-8; 12-14, 21_ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను; క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు–మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని యెడల, క్రీస్తు కూడ లేపబడియుండలేదు. మరియు క్రీస్తు లేపబడియుండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను అని బైబులు చెప్తుంది.

 అట్లే 1 పేతురు 1:3-4_ మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను అని బైబులు చెప్తుంది.

 అయినను లేఖనాలను నమ్మక తర్కముతో వాదించే వారిని దేవుని క్షమాపణకు వదిలేద్దామ్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl