థీమ్: యేసే మెస్సయ్య.

మత్తయి సువార్త 1

యేసుని జననం మరియు బాల్యము (1–2 అధ్యాయములు)

యేసుని వంశావళి 1:1–17
1అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. 2అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; 3యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను, 4ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను; 5నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను; 6యెష్షయి రాజైన దావీదును కనెను.

ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. 7సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; 8ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను; 9ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను; 10హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను; 11యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

12 బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; 13జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; 14అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; 15ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; 16యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

17ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదువరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తువరకు పదునాలుగు తరములు.

యేసుని పుట్టుక 1:18—25
18 యేసు క్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత, వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. 19ఆమె భర్తయైన యోసేపు, నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై –దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. 21ఆమె యొక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.

22ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు “ఇమ్మానుయేలను” పేరు పెట్టుదురు 23అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.

24యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని, 25ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

మత్తయి సువార్త 2

జ్ఞానుల రాకడ 2:1-12
1రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, 2“యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.” 3హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు, అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి; 4కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరిని సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. 5-6అందుకు వారు – యూదయ బేత్లెహేములోనే, “ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.”

7 అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని 8 “మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి” వారిని బేత్లెహేమునకు పంపెను. 9వారు రాజు మాట విని, బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమునవారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. 10వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై 11 యింటి లోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 12తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై, వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.

యేసు ఐగుప్తుకు వెళ్లడం 2:13-15
13వారు వెళ్లిన తరువాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని, ఆయనను వెదకబోవుచున్నాడు, గనుక నీవు లేచి, ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టు కొని, ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. 14అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి, 15ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.

హేరోదు శిశువులను చంపించడం 2:16-18
16ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి, బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను. 17అందువలన “రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను, 18రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు; వారు లేనందున, ఓదార్పు పొందనొల్లక యుండెను” అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.

యేసు నజరేతుకు తిరిగి రావడం 2:19-23
19హేరోదు చనిపోయిన తరువాత, ఇదిగో, ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, 20“నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలుదేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని” చెప్పెను. 21అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలుదేశమునకు వచ్చెను. 22అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశమును ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, 23నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను, ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)

యేసుని పరిచర్య ప్రారంభం (3:1—4:11).

మత్తయి సువార్త 3

బాప్తిస్మమిచ్చు యోహాను (3:1–6)
1ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి 2–పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే. 4ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. 5ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, 6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

బాప్తిస్మమిచ్చు యోహాను బోధలు (3:7-12)
7అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి–సర్పసంతానమా, రాబోవు ఉగ్ర తను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 8-9–అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. 10ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 11మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. 12ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

యేసుని బాప్తిస్మము (3:13–17)
13ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. 14అందుకు యోహాను –నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని 15యేసు–ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. 16యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 17మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl