
మూడవ భాగం
తీతు మంచి హితబోధను బోధించాలి (2:1–15)
1నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము.
పౌలు అబద్ధ బోధకులను ఖండించిన తరువాత (1:10-16) తీతును ఉద్దేశిస్తూ, “నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము” అని చెప్పాడు. సున్నతి సంబంధులు, ఇతర తప్పుడు బోధకుల అపవిత్రమైన మరియు విచ్ఛిన్నమైన సిద్ధాంతాలకు భిన్నంగా తీతు “స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి“, (1:9; 1 తిమోతి 1:10). తప్పుడు భోధల నుంచి సత్యాన్ని కాపాడుకోవాలంటే దాన్ని నేర్పించడమే శ్రేష్ఠమైన మార్గం.
సంఘములోని వివిధ తరగతులైన వృద్ధులైన పురుషులకు, వృద్ధ స్త్రీలకు, యువతులకు, యువకులకు మరియు దాసులకు వారి ప్రత్యేక స్వభావాలకు అనుగుణంగా వారికందరికి ప్రత్యేక సూచనలు అవసరం. ఈ అధ్యాయంలో పౌలు తీతుకు సంఘాలలోని వివిధ తరగతులకు ఏమి బోధించాలో బోధిస్తున్నాడు. వారు దేవుని పిల్లలుగా ఎలా జీవించాలో మరియు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. అయితే, పౌలు ఇంస్ట్రుక్షన్స్ ఇవ్వడమే కాకుండా, అలాంటి జీవనానికి కావలసిన శక్తి యొక్క మూలాన్ని, “సమస్త మనుష్యులకు ప్రత్యక్షమైన” “రక్షణకరమైన దేవుని కృప” యొక్క ప్రేరేపిత ప్రభావాన్ని కూడా సూచిస్తూ ఉన్నాడు (2:11).
వృద్దులైన పురుషులు
2ఏలాగనగా వృద్ధులు మితానుభవము (నిగ్రహం) గలవారును, మాన్యులును, స్వస్థబుద్ధి గలవారును (వివేకంతో మెలుగుతూ), విశ్వాస ప్రేమ సహనముల యందు లోపములేని వారునై (శుద్ధంగా) యుండవలెననియు,
తీతు బోధించాల్సిన “వృద్దులైన పురుషులు” సంఘంలో బాధ్యతాయుతమైన స్థానానికి ఎన్నుకోబడిన పెద్దలు కారు. ఇక్కడ అతడు సంఘంలోని వృద్దులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, వారి వయస్సు మరియు పరిణతి కారణంగా నాయకత్వం మరియు ఆదర్శప్రాయమైన క్రైస్తవ ప్రవర్తన కోసం చూడబడ్డారు. వారు యువకులకు సహజమైన ఆదర్శప్రాయులుగా వారి నైతిక మరియు ఆధ్యాత్మిక జీవితాల ద్వారా ఉదాహరణలుగా ఉండాలి.
వృద్ధులు “మితానుభవము గల వారుగా” అంటే నిగ్రహం గలవారుగా ఉండాలి. వృద్దులు వారి ప్రవర్తనలో మాటలలో క్రియలలో తమ్మును తాము జాగ్రత్తగా చూసుకుంటూ, చెడుకు దూరముగా ఉండటం అనేది సంఘములోని వారికి ఆదర్శంగా ఉంటుంది. అట్లే వారు మానసిక నిగ్రహాన్ని కూడా కనపర్చవలసియున్నారు. వారు “గౌరవానికి అర్హులై” పరిణితితో రావాల్సిన గౌరవాన్ని ప్రదర్శించాలి (1 తిమోతి 3:8). వారు యవ్వనస్థుడిగా ఉండాలని కోరుకున్నట్లుగా ప్రవర్తించకూడదు (వారి ప్రవర్తనలో, క్రియలలో, దుస్తులు ధరించడంలో, సంభాషణలో అసభ్యత, చులకనైన భాష, మొదలగునవి వృద్ధులకు చాలా అనుచితమైనవి.) వృద్ధులు శాశ్వతత్వం అంచున మరియు దాని సరిహద్దులలో ఉన్నారు కాబట్టి అన్నింటిపై “స్వీయ నియంత్రణ” కలిగి, వివేకంతో, మంచి మనస్సుతో ఉండాలి (1:8; 1 తిమోతి 3:2). వృద్ధులు ప్రతి సంఘానికి సమతుల్య చక్రంలా ఉండాలి. వారు “స్వస్థబుద్ధిగల వారుగా” ఉండటం నేర్చుకోవాలి, అంటే ఆరోగ్యంగా, (“విశ్వాస ప్రేమ సహనముల యందు”) ఉండాలి. వారు భౌతికంగా బలహీనంగా ఉన్నప్పటికీ, మీద పడిన వయస్సుతో క్షిణిస్తూ ఉన్నప్పటికీ, వారు తమ మనస్సుల్లో ఆరోగ్యంగా ఉండాలి. హితబోధ విషయములో ఇతరులను తప్పుదారి పట్టించకుండా ఉండాలి. క్రీస్తుపై వారి విశ్వాసం సరైనదిగా మరియు నిజమైనదిగా కనిపించాలి. దేవుని పట్ల, క్రీస్తు పట్ల మరియు ఆయన ప్రజల పట్ల వారి ప్రేమ నిజమైనదిగా మరియు నిజాయితీగా ఉండాలి. సహనం దాని పరిపూర్ణమైన పనిని కలిగి ఉండాలి (వయస్సు వల్ల కలిగే శరీర బలహీనతలను భరించడంలో, క్రీస్తు మరియు ఆయన సువార్త కోసం దృఢముగా నిలబడటం మరియు సాక్ష్యమివ్వటంలో, వారి ముందు ఉంచబడిన పరుగు పందెం నుండి బయటపడే విషయములో.)
దేవునిపై, ఆయన బయలు పరచిన సత్యంపై నమ్మకం ఉంచే విశ్వాసం ఉన్న చోట ఆధ్యాత్మిక ఆరోగ్యం లభిస్తుంది. ప్రేమ నిస్వార్థతకు ప్రతిస్పందించేలా ముందుకు సాగుతుంది, పాపభరితమైన ప్రపంచం పట్ల దేవుని ప్రేమ ద్వారా ప్రేరేపించబడుతుంది. సహనం అన్నిటినీ భరించే ప్రేమతో కలిసి ఉంటుంది, ప్రేమగల దేవుడు మన మంచి కోసం ప్రతిదీ పనిచేయడానికి అనుమతిస్తాడని తెలుసుకోవడం చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఈ వర్ణనకు సరిపోయే పెద్దలున్న సంఘం ధన్యమైనది. అనుభవజ్ఞులైన, వివేకవంతులైన, స్వస్థబుద్ధిగల వృద్దుల వైపు నుండి అటువంటి పరిణితి చెందిన, దృఢమైన నాయకత్వంపై ఆధారపడగల పాస్టర్ గారు ధన్యుడు. ఒక పాస్టర్ గారు నమ్మకంగా హితబోధను భోదించినపుడు, దేవుడు అనుగ్రహించే దీవెనలలో ఇది కూడా ఒకటి.
వృద్ధ స్త్రీలు
3-5ఆలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై యుండవలెననియు బోధించుము.
వృద్ధ పురుషుల మాదిరిగానే, వృద్ధ స్త్రీలు కూడా సంఘంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని భర్తీ చేయడానికి బోధించబడాలి. మొదటగా, వారు జీవించే విధానంలో, వారు “గౌరవనీయులుగా” ఉండాలి, అంటే, పవిత్ర వ్యక్తులుగా లేదా విశ్వాసులకు తగిన విధంగా ప్రవర్తించాలి. ఇది వృద్ధ పురుషుల నుండి ఆశించే గౌరవానికి అనుగుణంగా ఉండవచ్చు. వృద్ధ స్త్రీలు “అపవాదులాడకూడదు” (1 తిమోతి 3:11) లేదా “పనికిమాలిన వదంతులు” వ్యాప్తి చేసే వారిగా ఉండకూడదు (1 తిమోతి 5:13).
వృద్ధ పురుషుల మాదిరిగానే, వృద్ధ స్త్రీలు కూడా “మద్యానికి బానిసలు” కాకుండా హెచ్చరించబడ్డారు. వృద్ధ స్త్రీలు నిరుత్సాహం మరియు ఒంటరితనం యొక్క విసుగును అపవాదు కబుర్లుతో మరియు మితిమీరిన మద్యముతో అధిగమించడానికి ప్రయత్నించవచ్చు. అది దైవభక్తికి తగిన “జీవన విధానం” కాదు. వృద్ధ స్త్రీలు తమ తోటి క్రైస్తవులకు నిజంగా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా సేవ చెయ్యొచ్చు. వారు మంచి విషయాలను బోధించవల్సి ఉన్నారు. ఎందుకంటే సంఘములోని కుటుంబాల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన వృద్ధ స్త్రీల నిర్దిష్ట బోధనా పాత్ర చాలా విశిష్టమైనది.
యువతులకు భార్యలుగా మరియు తల్లులుగా శిక్షణ అవసరం. వృద్ధ స్త్రీల కంటే ఎవరు బాగా చేయగలరు? తమ భర్తలను పిల్లలను ప్రేమించడానికి మాట మరియు ఉదాహరణ ద్వారా యువతులకు వృద్ధ స్త్రీలు శిక్షణ ఇవ్వవచ్చు. ప్రేమకు శిక్షణ అవసరం. ప్రేమ కేవలం ఒక భావోద్వేగ భావన మాత్రమే కాదు మరియు ఒక వ్యక్తి నియంత్రణకు మించినది కాదు. ఇది స్వార్థపూరితంగా వ్యక్తిగత సంతృప్తి కోసం వెతకదు. ప్రేమ ఇస్తుంది, త్యాగాలు చేస్తుంది, పనిచేస్తుంది ఈ విషయాలన్నీ వృద్ధ స్త్రీలు అనుభవం నుండి నేర్చుకుని ఉండవచ్చు. అందుకు క్రీస్తు ప్రేమే పరిపూర్ణ ఉదాహరణ మరియు మూలం. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం దీనిని గురించి పరిపూర్ణ వివరణను ఇస్తూ ఉంది. అటువంటి ప్రేమలో శిక్షణ ఉన్నచోట, విడాకుల ఆలోచన తలెత్తదు మరియు దేవుడు ఇచ్చే పిల్లలు అవాంఛనీయంగా ఉండరు. ఇది కుటుంబ జీవిత శిక్షణలో ప్రాథమికమైన, ముఖ్యమైన అంశం.
స్వస్థబుద్ధిగలవారును, ప్రతి వయసువారిలాగే ఇక్కడ వీరికి కూడా “సెన్సిబుల్ గా” (స్వీయ నియంత్రణ” లేదా “వివేకవంతులుగా) ఉండాలని ప్రస్తావించబడింది. మానవ సంబంధాలలో, ప్రజలు ఒక కుటుంబంలా కలిసి జీవిస్తూ ఉంటున్నప్పుడు, అందరూ ఈ ధర్మాన్ని ఆచరించాల్సిన అవసరముంది.
వారు “పవిత్రులుగా” లేదా “సద్గుణాలు కలిగినవారు” గా ఉండాలి. వ్యభిచారం నిషేధంతో కూడిన ఆరవ ఆజ్ఞ కుటుంబాన్ని రక్షిస్తుంది. యువతులు “పవిత్రులు” గా ఉండాలి, అదే వారి జీవిత భాగస్వాములకు కూడా వర్తిస్తుంది. జీవిత భాగస్వాములలో ఎవరైనా మోసం చేయడం వల్ల కుటుంబ ఐక్యత నాశనం అవుతుంది. లైంగిక స్వేచ్ఛా సమాజం వారిని ఆకర్షించే శోధనల నుండి క్రైస్తవులు పారిపోవాలి. కల్మషము యొక్క ప్రాణాంతక ప్రభావాలను ఎవరూ మర్చిపోకూడదు. అవి వివాహాలను నాశనం చేస్తాయి. అవి విశ్వాసాన్ని చంపుతాయి.
యువతులకు “ఇంట్లో బిజీగా ఉండటానికి” ఇంట ఉండి పనిచేసికొనునట్లు శిక్షణ ఇవ్వాలి. హౌస్ మేకర్ గా లేదా గృహిణిగా ఉండటం ఒక గొప్ప పని. ఇంట్లో భార్య మరియు తల్లి ఆరోగ్యకరమైన కుటుంబ జీవితానికి గొప్ప సహకారాన్ని అందించగలరు. ఇంట్లో తన కుటుంబం కోసం భార్య చేసే దానికంటే కుటుంబానికి తీసుకువచ్చే జీతంపై ఎక్కువ విలువ ఇచ్చే సమాజం కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కుటుంబంలో స్త్రీ పాత్ర సమాజం ద్వారా నిర్ణయించబడదు, కాని పురుషుడిని మరియు స్త్రీని సృష్టించి కుటుంబాన్ని స్థాపించిన ప్రభువు ద్వారా నిర్ణయించబడుతుంది. సామెతలు 31:10–31లో “గొప్ప స్వభావం గల భార్య” యొక్క ప్రేరేపిత వర్ణనను చదవండి. ఇది ఆమె ఆహార సంపాదకురాలిగా పనిచేయడాన్ని తోసిపుచ్చదు, కాని గృహిణిగా ఆమె స్థానాన్ని నొక్కి చెబుతుంది.
యువతులు “ప్రేమతో తమ భర్తలకు లోబడి ఉండటానికి” శిక్షణ పొందాలి. “మంచిది” చేయాలనుకునే “దయగల” స్త్రీ “తన భర్తకు లోబడి ఉండాలనే” దేవుని చిత్తాన్ని అనుసరించడం కష్టంగా అనిపించదు. వివాహంలో తన స్థానాన్ని ఆమె ప్రేమగల రక్షకుడు ఆమెకు ఇచ్చిన పాత్రగా ఆమె గుర్తిస్తుంది (ఎఫెసీయులు 5:22, స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. కొలొస్సయులు 3:18, భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువును బట్టి యుక్తమై యున్నది. 1 పేతురు 3:1 అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి), ఇది కుటుంబ ఐక్యత మరియు శ్రేయస్సుకు దోహదపడుతుంది.
ఈ విధంగా శిక్షణ పొందిన యువతులు, “దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించకుండా” ఉండేందుకు గణనీయమైన కృషి చేయగలరు. భక్తిహీనమైన, అన్యమత ప్రపంచం దేవుని వాక్యాన్ని చెడుగా మాట్లాడటానికి ప్రతి అవకాశాన్ని వెతుకుతుంది. ఆయన వాక్యం ప్రకారం జీవించడంలో మనం విఫలమవడం ద్వారా, దుర్మార్గులకు దూషించడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. సువార్తకు హాని కలిగించే పాపుల హృదయాలలో సువార్త పనిని అడ్డుకునే ఏ పనిని చేయకూడదు. భార్యల ప్రేమగల, స్వీయ నియంత్రణ కలిగిన, దయగల, విధేయతగల ప్రవర్తన అవిశ్వాసులైన భర్తలను దేవుని మందలోకి తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించగలదు (1 పేతురు 3:1).
పౌలు యువతుల శిక్షణను తీతుకు కాకుండా, వృద్ధ స్త్రీలకు అప్పగిస్తున్నాడు. అనుభవం సరైన అర్హతలు కలిగిన వృద్ధ స్త్రీలు తీతు కంటే కుటుంబ జీవితం గురించి యువతులకు బాగా బోధించగలరు. ఇందుకు నిర్దిష్ట అనుభవం తలాంతులు ఉండి ప్రత్యేక పరిస్థితులలో బోధించగల సలహాలు ఇవ్వగల సమర్థులైన స్త్రీపురుషులను సంఘం పిలవవచ్చు. యువతులకు సలహా ఇవ్వడం, శిక్షణ ఇవ్వడంలో ఉన్న శోధనలకు తీతును బహిర్గతం చేయాలని కూడా పౌలు కోరుకొంటూ ఉండకపోవచ్చు. ఇతర వయసుల వారికి భోదించే విషయములో పౌలు తీతును బాధ్యునిగా చేసాడు.
యవ్వనులు
6అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని యౌవనపురుషులను హెచ్చరించుము. 7-8 పరపక్ష మందుండు వాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము. నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
అదేవిధంగా, యువకులను స్వీయ నియంత్రణలో ఉండమని హెచ్చరించాలి. అన్ని వయసుల వారు స్వీయ నియంత్రణలో ఉండాలని చెప్పటం మనం ఇప్పటికే గమనించాము. యువకుల విషయంలో పౌలు ప్రస్తావించిన ఏకైక ప్రత్యేక ధర్మం ఇదే. యవ్వన కోరికలు అభిరుచులు సంతృప్తి కోసం ఒత్తిడి చేసే వయస్సులో, స్వీయ నియంత్రణ అత్యంత అవసరం. అన్నింటి కంటే ముఖ్యంగా, యువకులు తమ యవ్వన కోరికలను అనుసరించడంలో వివేకంతో ప్రవర్తించమని హెచ్చరించాలి.
ఈ వయస్సు వారికి “సత్కార్యముల ద్వారా వారికి ఆదర్శంగా ఉండుమని” పౌలు తీతుకు చెప్తున్నాడు. అందువల్ల, అతడు ఏ వయస్సు వారికైనను లేదా లింగం ఏదైనప్పటికీ, సంఘంలోని సభ్యులందరికీ ఒక ఉదాహరణగా ఉంటాడు. ముఖ్యంగా యువకులు, అలవాట్లను స్వభావాన్ని ఏర్పరచుకుంటున్నప్పుడు, అనుకరించడానికి వారు మాదిరి కోసం చూస్తున్నప్పుడు, “సత్కార్యముల విషయములో తమ మాదిరిగా“ ప్రతి విషయంలోనూ వాళ్ళు తీతును చూడొచ్చు.
ఇది తీతుపై బరువైన బాధ్యతను ఉంచుతుంది. అతడు యువకులకు మరియు ఇతరులకు బోధించేటప్పుడు, అతడు “నిజాయితీగా, గౌరవంగా, ఖండించలేని విధంగా పరిపూర్ణమైన మాటలను” మాట్లాడువానిగా ఉండాలి. అతడు తన మాట మీద నిలబడే వ్యక్తి అని, అతడు చెప్పేది నమ్మదగినదని స్పష్టంగా ఉండాలి. అతడు మాట్లాడే విధానం అమర్యాదగా ఉండకూడదు. పవిత్రమైన విషయాలను హాస్యాస్పదంగా మాట్లాడకూడదు, కఠినంగా అధికారికంగా గౌరవంగా ఉండాలి. అతడు చెప్పే దాని గురించి అతడు నిష్కపటంగా ఉండాలి. అతని మాటలు బోధన మరియు అవగాహన యొక్క మంచితనాన్ని అన్ని విధాలుగా ప్రతిబింబించాలి. తీతు తన రక్షకునికి మంచి ప్రతినిధిగా ఉండాలి, తద్వారా ఎవరూ అతనిపై అతని బోధనపై ఆరోపణలు తీసుకురాలేరు. ప్రత్యర్థులు ఉంటారు, కాని తీతు బోధన, ప్రవర్తన యొక్క మంచితనం క్రైస్తవుల గురించి చెడుగా మాట్లాడే ఏ ప్రయత్నానైన ఆపాలి.
మన సంఘ యువతకు, దాని సభ్యులందరికీ ఆదర్శంగా పనిచేసే ఇలాంటి యువ పాస్టర్లు మరియు బోధకులను దేవుడు తన సంఘానికి ప్రసాదించు గాక. వారిని అనుసరించే వారిలో వారు మంచి క్రైస్తవ అలవాట్లను ప్రేరేపించడమే కాకుండా, దేవుని వాక్యమైన సువార్త బాగా ప్రశంసించబడుతుంది. ఇతర యువకులు కూడా పాస్టర్లుగా మారాలని కోరుకోవడంలో తమ పాస్టర్ మాదిరిని అనుసరించడానికి ప్రేరేపించబడతారు. పాస్టర్లపట్ల, దేవుని సేవ పట్ల, దేవుని వాక్యం పట్ల మరియు దేవుని ప్రేమ పట్ల ఆదర్శప్రాయమైన ఉత్సాహం ఇతర యువకులు మహిళలు బోధన మరియు ప్రకటనా పరిచర్యలకు సిద్ధం కావడానికి ప్రేరేపిస్తుంది.
దాసులు
9-10దాసులైనవారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.
రోమన్ సామ్రాజ్యంలో బానిసత్వం సామాజిక నిర్మాణంలో భాగంగా ఉండేది. అందువల్ల పౌలు బానిసలకు మరియు యజమానులకు పదేపదే సూచనలు ఇస్తున్నట్లు మనం చూస్తాము (1 తిమోతి 6:1, 2; 1 కొరింథీయులు 7:20–22; ఎఫెసీయులు 6:5–9; కొలొస్సయులు 3:22–4:1; ఫిలేమోను 16). క్రైస్తవులుగా మారిన క్రేతులోని బానిసల జీవితాలు ఇప్పుడు అన్యమత బానిసల జీవితాల కంటే భిన్నంగా ఉండాలని తీతు నొక్కి చెప్పాలి.
బానిసలు బలవంతపు విధేయతతో శ్రమిస్తారు. తీతు వారికి “ప్రతి విషయంలోనూ తమ యజమానులకు లోబడి ఉండాలని” వారికి వేరే మార్గం లేనప్పుడు మాత్రమే కాదు, అన్ని సమయాల్లో ఇష్టపూర్వకంగా విధేయత చూపాలని నేర్పించాలి. వారి యజమానులు వారిని సంతోషపెట్టినప్పుడు మాత్రమే కాదు (1 పేతురు 2:18) వారు అన్నివేళలా తమ యజమానులను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలని నేర్పించాలి. వారు తమ యజమానులతో ఎదురు మాట్లాడకూడదు, అవిధేయత యొక్క స్ఫూర్తిని ప్రదర్శించకూడదు. క్రేతు ప్రజల గురించి పౌలు వర్ణన నుండి, బానిసల వైపు నుండి చాలా దొంగతనం జరిగి ఉండవచ్చని మనం ఊహించవచ్చు. క్రైస్తవ బానిసలు భిన్నంగా ఉంటూ, వారి యజమానుల నుండి వారు దొంగిలించరని, బదులుగా, వారు “పూర్తిగా నమ్మదగిన వారని” చూపించాలి.
అన్యమత యజమానులు, వారి క్రైస్తవ బానిసలలో ఈ వ్యత్యాసాన్ని గమనించి, క్రైస్తవ బోధన వారి బానిసల వైఖరి మరియు ప్రవర్తనలో చూపిన ఆరోగ్యకరమైన ప్రభావాన్ని చూస్తారు. ఆవిధముగా వారు “అన్ని విధాలుగా మన రక్షకుడైన దేవుని బోధనను ఆకర్షణీయంగా చేస్తారు.” రోమన్ సమాజంలో బానిసల స్థానం తక్కువ స్థాయిలో ఉండవచ్చు, కానీ వారి అన్యమత యజమానులకు సువార్తను ఆకర్షణీయంగా చేయడం వారిని ఏకైక రక్షకుడైన-దేవుని వైపుకు నడిపించడంలో సాధనంగా ఉండటం చాలా గొప్ప విషయం.
పౌలు చెప్పిన ఈ మాటలు అక్షరాలా బానిసలుగా ఉన్నవారికి మాత్రమే కాకుండా, చాలా విస్తృతమైన అనువర్తనాన్ని కలిగి ఉంటాయి. బానిసత్వాన్ని తిరస్కరించే సమాజంలో, ఉన్నతాధికారి ఆదేశాలను పాటించాల్సిన పదవుల్లో పనిచేసే వారు కూడా ఉన్నారు. పని ప్రదేశంలో క్రైస్తవుడు ఇష్టపూర్వకంగా పని చేస్తూ, పూర్తి నిజాయితీ మరియు విశ్వసనీయత కలిగి ఉండాలి.
వివిధ వయసుల వారు తమ క్రైస్తవ మతాన్ని జీవించాలని కోరుతూ, పౌలు క్రైస్తవులుగా వారి జీవితాలు దేవుని వాక్యంపై చూపే ప్రభావాన్ని పదేపదే చూపిస్తున్నాడు. క్రైస్తవులుగా మనం రక్షణ సువార్తకు అవమానం కాకుండా గౌరవాన్ని తీసుకురావాలనుకుంటున్నాము. క్రీస్తు మరియు ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ చెడుకైనా మనం కారణం కావాలని కోరుకోము. మనం పురుషులమైనా, స్త్రీలమైనా, చిన్నవారమైనా, పెద్దవారమైనా, మన జీవితాల్లో క్రీస్తు మహిమపరచబడాలి!
సువార్త ప్రేరణ
11ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై 12మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, 13అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 14ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
“ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప అందరికి ప్రత్యక్షమైయింది.” దేవుని కృప, ఆయన గొప్ప ప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో కృపా సత్య సంపూర్ణునిగా ఈ భూమిపై కనిపించింది, మన మధ్యన నివసించింది. పౌలు ఇక్కడ యేసు మొదటిసారి కనిపించడం గురించి మాట్లాడాడనడంలో సందేహం లేదు. యేసు జన్మించిన, జీవించిన, మరణించిన మరియు పెరిగిన సమయంలో ఆయనను చూడండి, మన రక్షణ కోసం దేవుని కృప ఆక్టివ్ గా ఉండటాన్ని మీరు చూస్తారు. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. క్రీస్తులో రక్షణ లోకానికి, అందరికీ వచ్చింది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి అందరికొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడు (యోహాను 3:16). నమ్మే వారు మాత్రమే ఈ రక్షణ నుండి ప్రయోజనం పొందుతారు, కానీ క్రీస్తులో అది అందరికీ వచ్చింది. క్రీస్తు యేసులో వెల్లడైన దేవుని రక్షణ కృపలో తాను కూడా ఉన్నానని తెలుసుకోవడం ప్రతి పాపికి ఎంత ఓదార్పునిస్తుంది. పాపుల కోసం దేవుడు సాధించిన కృప గురించి 14వ వచనంలో చెప్పబడింది.
క్రీస్తులో దేవుని కృప, భక్తిహీనతకు మరియు ఇహలోక సంబంధమైన దురాశలను/ కోరికలను విసర్జించమని, వాటికి “నో” చెప్పమని మనకు భోదిస్తూ ఉంది. భక్తిహీనతకు మరియు ఇహలోక సంబంధమైన దురాశలకు “నో” చెప్పమని ధర్మశాస్త్రం మనకు బోధించడం లేదా? మన పొరుగువారిని కొట్టడానికి శోధించబడినప్పుడు “నో” చెప్పమని ఐదవ ఆజ్ఞ మనకు బోధించడం లేదా? మాదకద్రవ్యాలు మరియు జీవితాన్ని నాశనం చేసే వాటికి “నో” చెప్పమని ధర్మశాస్త్రం మనకు బోధించడం లేదా? వ్యభిచారం వద్దు అని ఆరవ ఆజ్ఞ మనకు మనకు బోధించడం లేదా? ఏడవ ఆజ్ఞ అన్ని రకాల దొంగతనాలకు “నో” చెప్పమని మనకు బోధించడం లేదా? ఖచ్చితంగా ధర్మశాస్త్రం కూడా భక్తిహీనతకు మరియు ఇహలోక సంబంధమైన దురాశలకు “నో” చెప్పమని మనకు ఆజ్ఞాపిస్తూనే ఉంది. మనం “నో” చెప్పకపోతే ప్రాణాంతకమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరిస్తూ ఉంది. అయితే, అది చేయగలిగేది అంతే. అది అయిష్టంగానే సమ్మతిని తేగలదు తప్ప సంపూర్ణమైన విధేయతను అది తీసుకురాలేదు.
క్రీస్తులో దేవుని కృప, అనగా సువార్త, మనలో మార్పును కలిగించడం ద్వారా, హృదయం నుండి “నో” అని చెప్పడానికి మనల్ని కదిలించడం ద్వారా, “నో” అని మనం చెప్పేలా చేస్తుంది. “నో” అని చెప్పడమే కాకుండా, “ఈ ప్రస్తుత యుగంలో స్వీయ నియంత్రణ, నిజాయితీ మరియు దైవిక జీవితాలను గడపడాన్ని” కూడా మనకు నేర్పుతుంది. క్రీస్తులో దేవుని కృప యొక్క బోధన ధర్మశాస్త్రానికి చాలా భిన్నంగా ఉంటుంది. ధర్మశాస్త్రము మనకు ఏది సరైనదో మరియు ఏది తప్పుదో మాత్రమే చెబుతుంది. అయితే దేవుని కృప దేవునికి ఇష్టమైనది చేయడానికి కారణాన్ని, బలాన్ని, సంకల్పాన్ని అందిస్తుంది. అది ఎంతో ప్రభావవంతమైన బోధన.
లోకములో ప్రస్తుత కాలము అనేది “మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్న సమయం”. మహిమలో ఉండే మన రక్షకుని రెండవ ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూస్తున్నాము. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను జీవితాలు గడపవలసి యున్నాము. దేవుని కృపను పొందేవారిగా మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో మనం గుర్తుంచుకున్నప్పుడు, ఆయన చిత్తం ప్రకారం దేవుని సేవ చేయడానికి మనం కదిలించబడతాము. శుభప్రదమైన నిరీక్షణలో “అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మన కొరకు పరలోకంలో భద్రపర్చబడియున్నది” (1 పేతురు 1:4) అని పేతురు చెప్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు మన ఆశలన్నింటినీ నెరవేర్చడానికి మహిమలో మళ్ళీ కనిపించినప్పుడు, “మన గొప్ప దేవుడు మరియు రక్షకుడైయున్న యేసుక్రీస్తు” మనకు మన శుభప్రదమైన నిరీక్షణను ముగించి మన స్వాస్థ్యమును మనకిచ్చుటకు వచ్చుటను బట్టి మనం ఎంతగానో సంతోషిస్తాం.
మన రక్షణ కోసం “మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు” ఏమి చేసాడో పౌలు ఇప్పుడు మనకు గుర్తు చేస్తున్నాడు, నమ్మండి! మరియు ఆనందించండి! ఆయన “సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, మరియు సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మన కొరకు అర్పించుకొన్నాడు.” విమోచించడానికి ఒక ధర అవసరం. అందుకు యేసు “తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును, నిరపరాధ శ్రమ, మరణమును” ఇచ్చాడు. మన ప్రత్యామ్నాయంగా ఆయన మన కొరకు ధరను చెల్లించాడు. ఫలితంగా విమోచన/ విడుదల. దోషులుగా మనలను ఖండించిన “సమస్త దుష్టత్వము” నుండి మనం విముక్తి పొందాము. ధరను చెల్లించిన వ్యక్తికి చెందిన వారిగా ఉంటున్నాం, కాబట్టే పేతురు “మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” అని (1 పేతురు 2:9) చెప్పాడు. “మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు” అని పౌలు కూడా (1 కొరింథీయులు 6:19, 20) చెప్పాడు. కాబట్టి మనం మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే చెందిన వాళ్ళం. మనం ఆయన ద్వారా విమోచించబడ్డాము కాబట్టి మనం ఆయనకు చెందినవాళ్ళం. అది మనల్ని ప్రత్యేకంగా చేస్తుంది.
ఆయనకు చెందినవారమైన మనం ఇప్పుడు “సత్క్రియలయందాసక్తి కలిగి ఉన్నాము.” యేసు శుద్ధి చేసే రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడ్డాము. ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో మరింత స్వచ్ఛంగా ఉండటానికి ఆసక్తిగా కృషి చేస్తాము. నిజానికి, సువార్త మనల్ని ఇష్టపూర్వకంగా మరియు ఆసక్తితో దేవుడు తన ధర్మశాస్త్రములో కోరుకునేది చేయడానికి ప్రేరేపిస్తుంది. క్రైస్తవ జీవనం కోసం వివిధ సమూహాలకు అతడు ఇచ్చిన సూచనలను మనం పాటించాలంటే సువార్త చాలా అవసరం. క్రైస్తవులుగా మనం చేసే అన్ని మంచిపనులకు సువార్త శక్తి వనరు.
15వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము.
తీతు “సంపూర్ణాధికారముతో ” ప్రోత్సహించాలి మరియు గద్దించాలి. వాక్య పరిచారకుడికి అధికార స్థానం ఉంటుంది. దీని అర్థం పాస్టర్ గారు ఆధిపత్యం చెలాయిస్తూ తాను చెప్పే ప్రతి దానికి విధేయత చూపమని అడగడం కాదు. అతనికి ఉన్న అధికారం దేవుని వాక్యం నుండి వస్తుంది. అతడు మందపై ఆధిపత్యం చెలాయించకూడదు, కాని దానిని తప్పుపట్టలేని దేవుని వాక్యం వైపు నడిపించే అధికారం అతనికి ఉంది. దేవుని వాక్యం యొక్క అధికారం సమర్థించబడేటట్లుగా అతడు చూసుకోవాలి.
పౌలు తీతుతో, “ఎవరూ నిన్ను తృణీకరింపనీయకుము” అని చెబుతున్నాడు, అతడు తనను తాను గౌరవించుకోవాలని కాదు, కాని దేవుడు తన వాక్యాన్ని బోధించడానికి పంపాడు కాబట్టి వాక్య పరిచర్యలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. నిజానికి వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారు, రెట్టింపు సన్మానమునకు పాత్రులైయున్నారు, 1 తిమోతి 5:17.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl