మన లిటుర్జికల్ సంఘాలలో, సంఘారాధనలలో, కుటుంబరాధనలలో, మీటింగ్స్లో, విశ్వాసప్రమాణాన్ని చెప్తూ ఉంటాం. ఈ విశ్వాసప్రమాణాన్ని సంఘముగా, కుటుంబముగా చెప్తూ, మనమేమి నమ్ముతున్నామో చెప్తూ, మన ఐక్యతను తెలియజేస్తూ ఉన్నాం. ఈ అపోస్తులల విశ్వాసప్రమాణము ఎలా వుద్భవించిందో సంఘారాధనలలో ఎలా చోటు దక్కించుకొందో దీని ప్రాధాన్యత ప్రాముఖ్యమేంటో తెలుసుకొందాం. దీని అర్ధాన్ని నేర్చుకొందాం.  

సంప్రదాయము ప్రకారమైతే, అపొస్తలుల విశ్వాసప్రమాణము అనేది 12 మంది అపోస్తులులచే రూపొందించ బడిందని చెప్తూ ఉంటారు. అలాగే మొదటి శతాబ్దములో శ్రమలను బట్టి చెదరిన క్రైస్తవులు చరిత్రాత్మికమైన క్రైస్తవత్వములోనికి తిరిగి రావాలనే ఉదేశ్యముతో ఇది అపొస్తలుల ఐశ్వర్యవంతమైన సిద్ధాంతపరమైన భోధలనుండి, సువార్త సమరోత్సాహము నుండి ఉద్భవించింది అని మరికొందరు చెప్తూ ఉంటారు. అట్లే ఇది బాప్తిస్మము పొందబోయే వ్యక్తులు తమ విశ్వాసమును బహిరంగముగా వ్యక్తపరిచే క్రమములో రూపుదిద్దు కోబడింది అని ఇంకొందరు చెప్తూఉంటారు. ఆదిమ క్రైస్తవ సంఘములో క్రైస్తవత్వాన్ని వెంబడించే వాళ్ళకు లేఖనాలలో ఉన్న ప్రధానమైన నిర్దిష్టమైన సిద్ధాంతాల మీద  తమ విశ్వాసాన్ని కేంద్రీకరించేటట్లు వారికి  సహాయపడే వుద్దేశ్యములో వారికి సామర్ధ్యమును కలుగజేసే క్రమములో రూపుదిధ్డుకోబడిందని అని మరి కొందరు చెప్తూ ఉంటారు.  ఏది అయితేనేమి చరిత్రకు ఆధారముగా ఇది ఆనాటినుండి నేటివరకు భద్రపరచ బడి యున్నది.  

సంఘచరిత్రలో, కొన్ని విషయాలు, విశ్వాసుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసియున్నాయి. అందులో అపొస్తలుల విశ్వాస ప్రమాణము ఒకటని సంఘచరిత్ర చెప్తూ ఉంది. అపొస్తలుల విశ్వాస ప్రమాణమును  క్రీ.శ. నాల్గవ శతాబ్దం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరు ఉపయోగిస్తు ఉన్నారు. ఆదిమ సంఘము ఈ విశ్వాసప్రమాణమును తమ ఆరాధనలో పొందుపర్చి యున్నది. విశ్వాసులు అందరూ ఈ అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని బహిరంగముగా చెప్పేవాళ్ళు. హతసాక్షులు అందరి ఎదుట తమ విశ్వాసపు ఒప్పుకోలుగా (చివరి మాటలుగా) ప్రకటించేవాళ్ళు. 

అపొస్తలుల విశ్వాసప్రమాణము అనేది క్రైస్తవ విశ్వాసమునకు చారిత్రాత్మికమైన మూలరాయి అని చెప్పొచ్చు. అపొస్తలుల విశ్వాసప్రమాణము అనేది (క్రైస్తవులు) విశ్వసిస్తున్న వాటిని గూర్చి తెలియజేస్తున్న ఒక ప్రకటన. సంఘ చరిత్రలో క్రైస్తవ విశ్వాసం యొక్క  చారిత్రాత్మక  సార్వత్రిక సారాంశమే అపోస్తలుల విశ్వాస ప్రమాణం. సంఘము దాని  స్పష్టమైన సంక్షిప్తమైన విశ్వాసముఫై ఆధారపడుతూ, అందరూ కలసి దీనిని ఒప్పుకొంటూ, సత్యాన్ని, లోకానికి ప్రామాణికమైన క్రైస్తవత్వాన్ని దాని విశిష్టతను తెలియజేస్తూ ఉన్నారు.

దీనిలో  “మేము నమ్ముతున్నాము”, అనే మాటలకు దీనిని చెప్పే వారు, వారు ఏవైతే చెప్తున్నారో వాటిని నిజమని అంగీకరిస్తున్నామని, వాటిని నమ్ముతూ వాటిని వెంబడించుటకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, ఇది విశ్వాసం యొక్క ప్రకటన, (అంటే వారు నమ్మేదాన్ని వారు చెబుతున్నారు.)

ఇది ఎంతటి ప్రాముఖ్యమైనదంటే, “రక్షింపబడటానికి నేను ఏమి చేయాలి?” అనే ప్రజలందరి ప్రాముఖ్యమైన ప్రశ్నను బట్టి,  అపొస్తలుల విశ్వాసప్రమాణము, జవాబు చెప్తూ ప్రజలను నిర్దేశిస్తూ మార్గనిర్దేశం చేస్తూ, తాను చెప్తున్న వాటిని సమర్థిస్తూ సత్యాన్ని ప్రకటిస్తూఉంది. కాలానికి అతీతమైన, ఈ బైబిల్ సత్యాలు  చరిత్ర అంతటా క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశంను అందిస్తు ఉన్నాయి.

ఇది అసలు అపొస్తలులచే వ్రాయబడనప్పటికీ, అపొస్తలుల విశ్వాస ప్రమాణములోని ప్రతి పంక్తిని అపొస్తలులు మరియు యేసు యొక్క తొలి శిష్యులు ఆదిమ క్రైస్తవ సంఘములో బోధించారు. క్రీ.శ. 4 శతాబ్దమునుండి క్రైస్తవ సంఘము దీనిని సంఘారాధనలలో లేదా వాక్యము చుట్టూ తాము కూడుకొనిన ప్రతిసారి దీనిని అందరూ కలసి చెప్పేవాళ్ళు, తమ విశ్వాసమును (తాము నమ్ముతున్న వాటిని) బహిరంగముగా దీని ద్వారా ప్రకటించెడివాళ్ళు.  ఈ రోజుకు కూడా లిటర్జికల్ సంఘ ఆరాధనలలో లేక దేవుని వాక్యము చుట్టూ వారు కూడుకొనిన ప్రతిసారి వీళ్ళు దీనిని అందరూ కలసి చెవుతూ తమ విశ్వాసమును బహిరంగముగా ఒప్పుకొంటూ, సార్వత్రిక సంఘములో తమ ఐక్యతను, తెలియజేస్తూ ఉన్నారు.

అపొస్తలుల విశ్వాస ప్రమాణము

భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవునిని నేను నమ్ముచున్నాను.

ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు, పరిశుద్దాత్మ వలన గర్భమున ధరియింపబడి, కన్యయైన మరియ యందు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. ఆయన నరకములోనికి దిగెను. చనిపోయిన వారిలోనుండి మూడవ దినమున ఆయన తిరిగి లేచెను. ఆయన పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి ఆయన వచ్చునని నేను నమ్ముచున్నాను

పరిశుద్దాత్మను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్దుల ఐక్యమును పాపా క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నేను నమ్ముచున్నాను. ఆమెన్.

క్రొత్త నిబంధనలో క్రైస్తవత్వమును గురించి మనం నేర్చుకునే పన్నెండు ప్రాముఖ్యమైన సత్యాలను అపొస్తలుల ప్రమాణము వక్కాణిస్తూ ఉంది, గమనించారా?

మొదటిగా, దేవుడు మన శక్తివంతమైన సృష్టికర్త మాత్రమే కాదు, మనఫై ప్రేమ శ్రద్ధగల తండ్రి కూడా అనే సత్యాన్ని తెలియజేస్తూఉంది.

రెండవదిగా, యేసు క్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడైయున్నాడని మన ప్రభువైయున్నా డనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది.

మూడవదిగా, యేసు అద్భుతమైన రీతిగా పరిశుదాత్మ వలన గర్భమున ధరింపబడియున్నాడని, కన్యయైన మరియ యందు పుట్టాడనే సత్యాన్ని తెలియజేస్తూఉంది.

నాల్గవదిగా, మొదటి శతాబ్దములో యేసు రోమీయుల ద్వారా శ్రమపడి సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి యున్నాడనే సత్యాన్ని తెలియజేస్తూఉంది.

ఐదవదిగా, యేసు మరణము నుండి తిరిగి లేచియున్నాడనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది.

ఆరవదిగా, యేసు పరలోకమునకు ఎక్కియున్నాడని, మహిమపరచబడి యున్నాడనే సత్యాన్ని తెలియజేస్తూఉంది.

ఏడవదిగా, యేసు న్యాయాధిపతిగా తిరిగి వస్తాడనే సత్యాన్ని తెలియజేస్తూఉంది.

ఎనిమిదవదిగా, పరిశుద్దాత్ముడు పరిశుద్ధ త్రిత్వములోని ఒక వ్యక్తి అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది.

తొమ్మిదవదిగా, సంఘము సార్వత్రికమనే సత్యాన్ని తెలియజేస్తూఉంది.

పదవదిగా, క్రైస్తవ సహవాసము/ఐక్యం అనేది అన్ని సమయాలలో అన్ని స్థలంలో ఉంటుంది అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది.

పదకొండవదిగా, మన పాపములు నిజముగా వాస్తవంగా క్రీస్తునందు క్షమింపబడియున్నాయి అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది

పన్నెండవదిగా, చనిపోయిన వారందరు తిరిగి లేపబడతారు. పరలోకము వాస్తవము అనే సత్యాన్ని తెలియజేస్తూఉంది 

ఇవన్ని మనమందరం నమ్ముతున్న సత్యాలే కదండి, మరి ప్రతి ఆదివారన్న దీని విశ్వాసులందరితో కలసి మనమందరం ఒప్పుకొంటూ మనమేమి నమ్ముతున్నామో వాటిని ధైర్యముగా నిశ్చయతతో ప్రకటిద్దాం. మీ సంఘములో అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని వాడుతున్నారా? వాడండి. అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని నేర్చుకోండి, దాని అర్ధములో దానిని అర్ధం చేసుకోండి, విశ్వాసులకు దాని అర్ధములో నేర్పించండి. దేవుడు మీ ప్రయత్నాన్ని సఫలము చేయును గాక.  దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్.