పేరు
ఆదికాండము అనేది బైబిల్లో మొదటి పుస్తకము. మొదట్లో మూలభాషయైన హీబ్రూలో రాసిన పాతనిబంధన గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు సాధారణంగా ప్రతి పుస్తకములో మొదటి మాటను లేక మొదటి రెండు మాటలను ఆ పుస్తకము పేరుగా పిలుచుకొనే వారు. హీబ్రూలో ఆదికాండములోని మొదటి అధ్యయములోని మొదటి మాట “ఆదిలో” అని అర్ధమిచ్చే మాట కాబట్టి యూదులు ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టారు. “ఆది” అనే గ్రీకు పదానికి “మూలం” అని అర్ధం, అది సరైన పేరు.

రచయిత
ఆదికాండములో దాని రచయితకు సంబంధించి ప్రత్యక్ష ప్రస్తావన ఏమి లేదు కాబట్టి ఈ పుస్తక రచయితను “అనామకుడిగా” పరిగణించాలని దీని అర్థం కాదు. మోషే బైబులులోని మొదటి ఐదు పుస్తకాలను రాసాడని యూదుల గట్టి నమ్మకం. ఈ నమ్మకాన్ని దృఢపర్చడానికి బైబులులోనే గట్టి సాక్ష్యాధారాలు వున్నాయి. నిర్గమ కాండము 17:14; 24:4; 34:27; సంఖ్యా 32:2; ద్వితీయోపదేశకాండము 31:19,24-25; యెహోషువ 1:8; 8:30; 1రాజులు 2:3; లూకా 24:44; 1కొరింథీయులకు 9:9 చూడండి. అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తన గురించి రాసాడని అన్నాడు, యోహాను 5:46; 7:19 చూడండి.

ప్రాచీన కాలములో హీబ్రూ ప్రజలు ఆదికాండమును దానిని అనుసరించే నాలుగు పుస్తకాలను ఒక యూనిట్‌గా భావించేవారు. వారు ఈ ఐదు పుస్తకాలను “మోషే తోరా” అని పిలిచెడివారు. తోరా (సాధారణ అర్ధములో “ధర్మశాస్త్రము” అని అనువదించ బడింది) అంటే “సూచన, బోధన” అని అర్ధం. ఈ “మోషే ధర్మశాస్త్రము” సాధారణంగా పెంటాట్యూక్ (“ఐదు పుస్తకాలు”)గా పేర్కొనబడుతున్నాయి. లేఖనాలు ఆదికాండాన్ని ప్రత్యేక పుస్తకంగా పరిగణించవు.

నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండములో, వ్రాయబడిన వాటిలో ఎక్కువ భాగం మోషే జీవితకాలంలోనే జరిగాయి కాబట్టి అతడు ఈ విషయాలను వ్రాయడానికి తన స్వంత వ్యక్తిగత అనుభవాన్ని ఉపయోగించుకొనివుండొచ్చు. అయితే, ఆదికాండములో వ్రాయబడిన సృష్టి వృత్తాంతం నుండి యోసేపు మరణం వరకు, మోషే పుట్టడానికి చాలా కాలం ముందు జరిగిన విషయాలు ఈ మెటీరియల్ న్ని అతడు ఎలా పొందుకొన్నాడు? అనే ప్రశ్న రావొచ్చు. దేవుడు సమస్తమును సృష్టించి నప్పుడు అక్కడ మానవ ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరు లేరు, దైవిక ప్రత్యక్షత ద్వారా మాత్రమే దీనిని గురించి మోషేకు తెలియాలి తప్ప అందుకు వేరే మార్గం లేదు. మోషే పుట్టడానికి చాలా కాలం ముందు జరిగిన విషయాలను దేవుడే మోషేకు తెలియజేసి ఉండొచ్చు. పెంటాట్యూక్ పాత నిబంధన గ్రంథంలో ఒక భాగం, పాత నిబంధన బైబిలులో ఒక భాగం పరిశుద్ధ పౌలు లేఖనాలను (బైబులును) గురించి చెప్తూ, 2 తిమోతి 3:16లో దైవావేశమువలన ప్రతి లేఖనము కలిగియున్నది అని తెలియజేస్తూవున్నాడు. దేవుడు మోషేకు ఆదికాండములోని విషయాలను బయలుపర చినప్పుడు, ఆయన నేరుగా అలా చేశాడా? లేదా మోషేకు డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కూడా ఏమన్నా దొరికి ఉండొచ్చా? ఉదాహరణకు, పూర్వీకుడైన అబ్రాహాము ప్రయాణాలలో అతడు గమనించిన, విన్న, చూసిన, పరిశోధించిన వాటి గురించి వ్రాసి అబ్రాహాము స్వయంగా భద్రపరిచిన రికార్డులను చూసే అవకాశం మోషేకు దొరికి ఉండొచ్చా? అనెడి ఆలోచనతో అలా ప్రశ్నిస్తూ వుంటారు. ఈ ప్రశ్నను బట్టి లూథర్ వ్యాఖ్యానిస్తూ, “అబ్రాహాము, ఆదాము నుండి అతని సమయం వరకు ఒక చిన్న పుస్తకాన్ని లేదా సంక్షిప్త వృత్తాంతాన్ని రచించాడని నేను భావిస్తున్నాను,” మోషే ఈ పుస్తకాన్ని చాలా బాగా ఉపయోగించి ఉండవచ్చు అని అన్నాడు, (లూథర్స్ వర్క్స్, అమెరికన్ ఎడిషన్, వాల్యూం. 4, పేజీ. 308). మోషే అప్పటికే ఉన్న పత్రాలను ఉపయోగించాడా లేదా అనే దాని గురించి ఖచ్చితంగా ఏమీ చెప్పలే నప్పటికీ, బైబిల్ను విశ్వసించే క్రైస్తవుడు ఈ అవకాశాన్ని తిరస్కరించడానికి ఎటువంటి కారణం లేదు. ఎందుకంటే ఐదు వేల మందికి ఆహారం ఇవ్వడానికి ఒక చిన్న పిల్లవాడి భోజనాన్ని ఉపయోగించడం సముచితమని దేవుడు భావించినట్లయితే, తన సత్యాన్ని వెల్లడించేటప్పుడు దేవుడు అంతకు ముందు వ్రాసిన పత్రాలను మోషే ఉపయోగించేటట్లు చేసి ఉండటం కూడా సముచితమే.

ముఖ్యాంశము
ఆదికాండము పెంటాట్యూక్ అని పిలువబడే ఐదు పుస్తకాలలో మొదటిది, ఆదికాండములో ప్రేరేపిత రచయిత సృష్టి ఆవిర్భావం, మానవ జాతి యొక్క మూలం, వివాహం స్థాపన, పాపం యొక్క ప్రారంభం మరియు దాని వికారమైన పరిణామాల యొక్క విషాద వివరాలను, రక్షకుని గురించిన దేవుని మొదటి వాగ్దానంతో ప్రారంభించి, పాపం కలిగించిన నష్టాన్ని తొలగించే దేవుని కనికర కార్యం యొక్క మూలాన్ని, పాపభరిత ప్రపంచంపై దేవుని మొదటి తీర్పు, మొదటి సువార్త ప్రకటన, మెస్సియానిక్ ప్రవచనాలను ముందుకు తీసుకొని వెళ్లేందుకు ఎంపిక చేయబడిన జాతిప్రారంభం (అధ్యాయాలు 12-50) దేవుని ప్రత్యేక ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మూలాన్ని కూడా గ్రంథస్థము చేసియున్నది.

ప్రాముఖ్యమైన ఈ ప్రారంభల పుస్తకం పురాతన ప్రపంచం యొక్క సాధారణ చరిత్రగా ఉద్దేశించబడలేదు. ఆదికాండము యొక్క నిర్దిష్ట ఉద్దేశ్యం దేవుని రక్షణ కార్యాన్ని గుర్తించడం. దేవుని అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ చరిత్రలో ఆదికాండము అనేది మొదటి అధ్యాయం, దీనిని మనం ఆయన రక్షణ ప్రణాళిక అని పిలుస్తాము. ఆదికాండము దేవుని విమోచన కార్యాన్ని ఎలా వివరిస్తుందో గమనించడం ఎంతో ఆసక్తికరంగాను మరియు బోధనాత్మకంగా ఉంది- సిద్ధాంతాలను రూపొందించడం ద్వారా కాకుండా వ్యక్తుల జీవిత చరిత్రలను వివరించడం ద్వారా. ఈ ప్రజల జీవితాలలో, దేవుడు తన ధర్మశాస్త్రం యొక్క సందేశంతో మరియు ఆయన తన ప్రేమ యొక్క సందేశంతో పనిచేయడాన్ని మనం చూడొచ్చు.

నిర్మాణం
ఆదికాండము యొక్క విశిష్ట నిర్మాణాన్ని మోషే పది విభాగాలలో ఏర్పాటు చేసుకున్నాడని గుర్తుంచుకోవడం ఎంతగానో సహాయపడుతుంది. ఈ పది విభాగాలు చిన్న చిన్న చరిత్రలు. ఇవి ఆది నుండి దేవుడు విశ్వాసుల సమాజాన్ని స్థాపించడంలో ఎంత ఆసక్తిగా ఉన్నాడో మరియు చురుకుగా ఉన్నాడో (ఆయన జోక్యాన్ని) తెలియ జేస్తూవున్నాయి. ఈ పది విభాగాలలో తొమ్మిది చరిత్రలు వ్యక్తుల పేరు మీద ఉన్నాయి; మొదటిది భూమ్యాకాశ ములకు సంబందించిన చరిత్ర (2:4). అట్లే ప్రతి విభాగములో, వ్యక్తి యొక్క ప్రారంభము లేదా విషయము యొక్క మూలం గురించి చెప్పబడలేదు కాని దాని తదుపరి చరిత్ర ఎల్లప్పుడూ దేవుని గొప్ప రక్షణ ప్రణాళికను గూర్చి పేర్కొంటూవుంది. పది విభాగాల సంక్షిప్త చరిత్ర:

  1. సృష్టి మరియు మొదటి జీవుల మొదటి స్థితి యొక్క వృత్తాంతం (1:1–4:26): దేవుని పరిపూర్ణ సృష్టిపై చెడు దాడి చేసినప్పుడు ఏమి జరిగిందో వివరిస్తూ ఉంది. సాతాను ప్రలోభాల ద్వారా ఆదాము హవ్వలు దేవుని ప్రేమను అనుమానించేలా మరియు ఆయన మంచి సంకల్పానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా నడిపించబడ్డారు, తద్వారా మానవ కుటుంబంపై మరణాన్ని శాపాన్ని తెచ్చారు. కైనైట్ల చరిత్ర (అధ్యాయం 4) ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత చెడు ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో చూపిస్తూ ఉంది. అయితే, స్వచ్ఛమైన కృపలో, దేవుడు తన సృష్టిని పునరుద్ధరించడానికి సిద్ధమయ్యాడు. రక్షకుడు (స్త్రీ సంతానం) సాతాను శక్తిని నాశనం చేస్తాడని వాని బందీలను విడిపిస్తాడని ఆయన వాగ్దానం గూర్చి తెలియజేస్తూవుంది.
  2. ఆదాము యొక్క వృత్తాంతం (5:1–6:8): ఆదాము నుండి నోవహు వరకు వాగ్దానం చేయబడిన మెస్సీయ యొక్క పూర్వీకులను గూర్చి తెలియజేస్తూ ఉంది. ఇది చరిత్ర అని, జానపద పురాణం కాదని లూకా 3:36–38 నిర్ధారిస్తుంది. ఈ విభాగములో ఒక ప్రముఖ థీమ్ మరణం. దేవునితో నడిచిన వ్యక్తి మినహా ఇక్కడ పేరున్న ప్రతి ఒక్కరూ మరణించారు. ఈ వృత్తాంతం యొక్క విషాద ముగింపులో, సేత్ వారసులు కైనైట్‌లతో క్రమంగా ఎలా చేరారు మరియు దేవుడు విశ్వవ్యాప్త తీర్పును ఎలా ప్రకటించవలసి వచ్చింది? నోవహు మాత్రమే దేవునికి నమ్మకంగా ఉండేందుకు అనుగ్రహాన్ని పొందాడు వంటి వాటిని గురించి తెలియజేస్తూవుంది.
  3. నోవహు వృత్తాంతం (6:9–9:29): ప్రపంచవ్యాప్త జలప్రళయం ద్వారా ఓడ వెలుపల ఉన్న సమస్త ప్రాణులను నాశనం చేయటం, ప్రభువు నోవహు మరియు అతని కుటుంబం ద్వారా మెస్సియానిక్ లైన్ ని దయతో సంరక్షించటం. పాపం మీద మరియు కఠినమైన అవిశ్వాసంపై దేవుని తీర్పును తెచ్చిన అదే వరదనీరు ఓడను మరియు దానిలోని విలువైన సరుకును మరణం మరియు నాశనానికి మించి పైకి లేపటం. జలప్రళయం తర్వాత ప్రభువు నోవహును ఉపయోగించి మెస్సియానిక్ లైన్ ని షేము ద్వారా కొనసాగుతుందని ప్రకటించడం గూర్చి తెలియజేస్తూ ఉంది.
  4. నోవహు కుమారుల వృత్తాంతం (10:1–11:9) నోవహు యొక్క ముగ్గురు కుమారుల ద్వారా మానవ జాతి తిరిగి వృద్ధి పొందుట. వీళ్ళు బాబెల్ వద్ద చెదరగొట్టబడడం. దేవుని నామాన్ని మహిమపరచడానికి బదులు వారు మళ్లీ తమ స్వంత మహిమను కోరుకొంటూ దేవుని తీర్పు క్రిందకి రావడం గూర్చి తెలియ జేస్తూ ఉంది.
  5. షేము యొక్క వృత్తాంతం (11:10-26) మనకు మెస్సీయ యొక్క పూర్వీకులను అందిస్తుంది, రక్షకుని పూర్వీకులను షేము యొక్క వంశం నుండి అబ్రాహాము తండ్రి అయిన తేరా వరకు క్లుప్తంగా తెలియ జేస్తూ వుంది. ఈ మొదటి ఐదు వృత్తాంతాలు పురాతన ప్రపంచంలో దేవుని రక్షణ కార్యకలాపం యొక్క ప్రారంభ చరిత్రను గురించి తెలియజేస్తూవున్నాయి. ఐదు ఖాతాల రెండవ సెట్ పితరుల మధ్య దేవుని రక్షణ కార్యమును గురించి తెలియజేస్తూవున్నాయి.
  6. తెరహు యొక్క వృత్తాంతం (11:27–25:11), ఆదికాండములో దాదాపు నాలుగింట ఒక వంతును కలిగి ఉన్న పొడవైన వృతాంతములలో ఒకటి. మానవ జాతి సువార్తను విడిచిపెట్టిన తర్వాత (6:5-7; 11:1-9) ప్రజలు ఎలా ఉండేవారో చెప్తూవుంది. పాపుల పట్ల దేవునికున్న ప్రేమను ఆయన ఏ రీతిగా ముందుకు తీసుకొనివెళ్లాడో తెలియజేస్తూవుంది. ఆయన తెరహు కుటుంబానికి చెందిన అబ్రామును తన ప్రత్యేక దేశమైన ఇశ్రాయేలుకు తండ్రిగా ఎంచుకున్నాడు. దేవుడు అబ్రామును విగ్రహారాధన చేసే సంస్కృతి నుండి బయటకు పిలిచాడు మరియు దేవుని వాగ్దానాన్ని పూర్తిగా విశ్వసించేలా అతనికి శిక్షణ ఇచ్చాడు. ఈ విశ్వాసం ద్వారా అబ్రాము “విశ్వాసులకు తండ్రి” అయ్యాడు.
  7. ఇష్మాయేలు వృత్తాంతం (25:12–18) మోషే యొక్క పది వృత్తాంతాలలో ఇది చాలా చిన్నది, ఎందుకంటే బానిస అమ్మాయి ద్వారా అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేల్ వంశస్థులు పాత నిబంధన చరిత్రలో దేవుడు ఎంచుకున్న లైన్ కాదు. ఇష్మాయేలు నుండి 12 మంది గిరిజన పాలకులు వస్తారను దేవుని వాగ్దానాన్ని ఆయన ఎలా నిలబెట్టుకున్నాడో ఈ ఆరు వచనాలు తెలియజేస్తూవున్నాయి. దేవుడు తన వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుంటాడు.

దేవుని వాక్యాన్ని వ్యాఖ్యాన రూపములో దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.