అంశము: క్రైస్తవులముగా మనం ఆదివారాన్నే ప్రభువును ఎందుకని ఆరాధిస్తాం?

పాతనిబంధనలో విశ్రాంతి దినమును పాటించమని యూదులు ఆదేశించబడ్డారు. కొత్తనిబంధనలో యూదులు, యేసు అపొస్తలులు విశ్రాంతిదినమును పాటించడం మనం చూస్తాము, మరి మనం శనివారమున కాకుండ ఆదివారన్న ఎందుకని ఆరాధిస్తూ వున్నాము? అని కొంతమందికి సందేహం రావొచ్చు.

మొదటిగా, పాతనిబంధనలోని 10 ఆజ్ఞలలో 9 మాత్రమే కొత్త నిబంధనలో మరల చెప్పబడ్డాయి. మత్తయి 19:18 యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము, అనే అయిదు ఆజ్ఞలను గురించి చెప్పాడు. రోమా.13: 9, ఆశింపవద్దు అని చెప్తూవుంది. ఆశింపవద్దు అనే మాటలలో దేవునిని సరిగా ఎలా ఆరాధించాలి అనే విషయం కూడా ఇమిడియున్నది అంటే ఆశింపవద్దు అనే మాటలలో మొదటి మూడు ఆజ్జ్యలు సంక్షిప్తముగా ఇమిడి ఉన్నాయి. పునరుద్ఘాటించబడనిది విశ్రాంతిదినము గురించి మాత్రమే, విశ్రాంతిదినమును గురించి యేసు మాట్లాడుతూ, మత్తయి 12:8లో కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడని చెప్పాడు _ యేసు ఒక సబ్బాతు రోజున ఈ మాటలు చెప్పాడు, గుర్తుందా, పంట చేలలో పడి వాళ్ళు వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగారు, పరిసయ్యుల ప్రకారం, ఎవరైనా చెట్టునుండి వెన్ను త్రుంచితే, వారు కోతకు పాల్పడుతున్నట్టు. వెన్నునుండి గింజలను వేరు చేయడమంటే వాళ్ళు నూర్పిడికి పాల్పడుతున్నట్టు. గింజలలో పొట్టును ఊదడమంటే, వారు చెరుగుతున్నట్టు. వాళ్ళు గింజలను నోటిలో వేసికొని మింగితే, వారు దానిని నిల్వ చేస్తున్నట్లు. బహుశా వారు గింజలను నమిలితే  వాళ్ళు వాటిని పిండి కొడుతున్నట్టు. ఈ కారణాలను బట్టి శిష్యులు దోషులని పరిసయ్యులు ఆరోపిస్తున్నారు. విశ్రాంతిదినమునకు నిజమైన అర్ధం ఇదా?

మార్కు2:27, ఏమని చెప్తూవుందంటే, విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు, అంటే విశ్రాంతి దినము దేవుని కృపకు అర్హమైన సాధనంగా సృష్టించబడలేదని, దేవుడు మనిషికి ఇచ్చిన బహుమతి -విశ్రాంతి దినం అని అర్ధం. మరోలా చెప్పాలంటే, దేవుడు సబ్బాతును తన ప్రజల కొరకైన విశ్రాంతి దినముగా స్థాపించాడు, కారణం మనం మర్త్యులము. మన ఆత్మలు మరియు శరీరాలు పుంజుకోవడానికి పునర్జీవింపబడుటకుగాను మనకు విశ్రాంతి కావాలి, అలాగే దేవునిపై దృష్టి పెట్టడానికి సమయం కావాలి గనుకనే సబ్బాతు ఇవ్వబడింది. దేవుడు తన వాక్యంతో తన బిడ్డలను ప్రత్యేక మార్గంలో సందర్శించే రోజండి అది. మనము దేవునిని గౌరవిస్తూ, ఆయనను ప్రేమిస్తూ ఆయన ఉపదేశములను గాని ఆయన వాక్యమును గాని అలక్ష్యము చెయ్యక పరిశుద్ధముగా నెంచి సంతోషముతో విని నేర్చుకొనుటకుగాను ఇవ్వబడిన రోజు విశ్రాంతి దినమండి.

కాని పరిసయ్యులు విశ్రాంతిదినముకు అనేకమైన ఆజ్జ్యలను కట్టుబాట్లను ఆచారాలను కలిపి మనిషిని విశ్రాంతి దినముకు కట్టుబానిసగా చేసారు, స్వనీతిక్రియగా మార్చేశారు. యూదులు తమ ప్రవర్తన, ప్రభుత్వం మరియు పాపక్షమాపణ విషయములో దేవుని రిక్వైర్మెంట్స్ ని సంతృప్తి పరచే క్రమములో  వారి moral, legal, and sacrificial సిస్టంలో భాగంగా సబ్బాత్‌ని పాటించడం ప్రాముఖ్యమైన అంశముగా తీసుకొన్నారు. సబ్బాత్ను ఆ కోణంలో వాళ్ళు ధర్మశాస్త్రములో ఒక భాగంగా తీసుకొన్నారు. దేవునికి అనుగ్రహపాత్రులుగా ఉండే క్రమములో ప్రతిఒక్కరు సబ్బాతును పాటించాలని ఒకవేళ ఎవరైనా సబ్బాతును పాటించకపోతే, ఆ వ్యక్తి పాపంలో ఉన్నవానిగా ఎంచి శిక్షించేవాళ్ళు, ఈ విషయాన్ని ద్వితీయోపదేశకాండము 13:1-11; సంఖ్యాకాండము 35:31; లేవీయకాండము 20: 2 నందు చూడొచ్చు.

విశ్రాంతి దినము దాని నిబంధనలు రాబోయే విమోచకున్ని ఇశ్రాయేలుకు సూచించడానికి ఉద్దేశించబడ్డాయి. ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చిన ఆయన ఇప్పుడు వారిమధ్యనే ఉన్నాడు. కాబట్టే విశ్రాంతిదినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువైయున్నాడని యేసు వారితో చెప్పాడు. ఈ మాటలు విశ్రాంతి దినమున తన శిష్యులు చేయుచున్న పనికి తన తండ్రియొక్క పూర్తి ఆమోదం ఉందనే కదా తెలియజేస్తూవున్నాయి. అలాగే విశ్రాంతి దినమునకు ప్రభువైయున్న ఆయన తన శిష్యులు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించటాన్ని అనుమతించనని చెప్తూవుండటమే కాకుండా, దేవునితో నిజమైన సంబంధం అనేది ప్రత్యేకమైన నియమాలు నిబంధనలఫై  ఆధారపడి ఉండదని, విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నవాడు, మనకోసం అన్నివిషయాలను నెరవేర్చిన వానిని అగీకరించడంపై ఆధారపడివుంటుందని ఆయన చెప్తూవున్నాడు. ఇది చాల స్పష్టముగా ఉంది, అవునా.

యేసు ప్రాయశ్చిత్తంతో, మనం ఇకపై ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కామని రోమా 6: 14 తెలియజేస్తూవుంది. సబ్బాతు యేసులో నెరవేరింది. ఆయన మన విశ్రాంతియైయున్నాడు. మనం ధర్మశాస్త్రానికి దాని విధులకు ఇక కట్టుబడి లేము. సబ్బాతును పాటించాల్సిన అవసరం ఇక మనకు లేదు. ఉంది అని మీరు అనుకుంటే, మీరు ఇంకా ధర్మశాస్త్రము క్రిందనే ఉన్నట్లు, కృప క్రింద కాదు. 

ఏడవ రోజైన సబ్బాతు ఇకపై అవసరం లేదని చెప్పేందుకు కొత్త నిబంధనలో అనేక ఆధారాలు ఉన్నాయి: రోమా 14:5-6 వచనాలు, ఒకడు ఒక దినముకంటె మరియొకదినము మంచిదినమని యెంచుచున్నాడు; మరి యొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుట మాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు అని చెప్తూవున్నాయి. పౌలు రోమాలో ఉన్న క్రైస్తవులైన యూదులు మరియు క్రైస్తవులైన అన్యజనులు ఇద్దరినీ ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వీరిరువురి మధ్యనున్న సాధారణ లక్షణం, క్రీస్తులో వారి విశ్వాసమే. ఇద్దరూ తమ రక్షణ కోసం వారి ఏకైక నీరీక్షణగా క్రీస్తుని నమ్మారు. దేవుని ముందు సంపూర్ణంగా ఐక్యంగా ఉన్నారు. కాని వారిలో, సంస్కృతిపరముగా జాతుల పరముగా అలవాట్ల ప్రకారముగా ఎన్నో బేధాలు ఉన్నాయి. ఈ తేడాలు వారి మధ్య నిజమైన ఆధ్యాత్మిక ఐక్యతకు అడ్డంకి కాదు, కాని సాధారణ, రోజువారీ సంఘ జీవితం విషయంలో, ఈ తేడాలు అడ్రస్ చెయ్యబడాలి మరియు పరిష్కరించబడాలి. లేకపోతే కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది. ఎన్నో సమస్యలు వస్తాయి. సంఘమనే వ్యవస్థ కుప్పకూలి పోతుంది, మనుగడను కోల్పోతుంది. సంఘము అంటే విభిన్న జాతుల సమ్మిళితమైన విశ్వాసుల సమూహము. అందుకనే పౌలు ఇక్కడ క్రైస్తవులైన యూదులు మరియు క్రైస్తవులైన అన్యజనులు మధ్యనున్న సంస్కృతికపరమైన తేడాలను గురించి మాట్లాడుతూ, ఈ విషయాలను ఇక్కడ అడ్రస్ చేస్తూ అపోస్తులునిగా పరిష్కారాన్ని సూచిస్తూ ఉన్నాడు. అందులో సబ్బాతు ఒకటి. యూదులు శతాబ్దాలుగా శుద్ధికారణాచార సంబంధమైన ఆచారాల క్రింద ఉన్నారు. ఆహారానియమాల క్రింద వున్నారు, సబ్బాతును పాటించెడి వాళ్ళు. కాని దేవుడు యేసుక్రీస్తులో సబ్బాతు విశ్రాంతిని పంపినప్పుడు ఇవన్నీ మారిపోయాయి. ఈ విషయాన్నే పౌలు తెలియజేస్తూ, సబ్బాతు విషయములో, సంక్షిప్తముగా, వ్యక్తులు దేవుని కోసం ఏ రోజును ఆచరిస్తారనే దాని గురించి ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు అని చెప్తూవున్నాడు. ఒకవేళ ఏడవ రోజైన సబ్బాతు తప్పనిసరి అయితే, మరొక రోజును ఆరాధనా దినముగా ఎంచుకొనే ఆప్షన్ విశ్వాసికి ఉండదు. అప్పుడు పౌలు ఇలా చెప్పి ఉండడు వేరేలా చెప్తూ, క్రైస్తవులైన వారికి కూడా సబ్బాతు తప్పనిసరి అని చెప్పి ఉండేవాడు, అవునా. క్రీస్తునందలి విశ్వాసులు తమ విశ్రాంతి దినముగా ప్రభువుదినముగా మరొకదినాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛను ఇప్పుడు కలిగియున్నారు. అందులో భాగముగా ప్రభువు పునరుత్థానానికి గుర్తింపుగా ఆరాధనను ఆదివారమునకు మార్చుకొన్నారు.

ఇప్పుడు కొలొస్సయులకు 2:16-17 వచనాలు చూధ్ధాం, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్తూవున్నాయి. ఇక్కడ తప్పుడు బోధకులు కొలొస్సియన్ విశ్వాసులను కొన్నిటి విషయములలో కట్టుబానిసలుగా చెయ్యడానికి  ప్రయత్నిస్తుండగా, అపొస్తలుడు వారి మోసపూరితమైన ఫిలాసఫీని క్రీస్తు సమర్థతతో ఎలా ఖండిస్తున్నాడో చూడండి. ఈ తప్పుడు బోధకులు వారి తప్పుడు బోధలు ఏంచెప్తున్నాయంటే, సంపూర్ణమైన రక్షణకు క్రైస్థవునిగా మారిన ప్రతి క్రైస్తవుడు సున్నతి చేయించుకోవాలని, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని శుద్ధికారణాచారమైన ఎన్నో అలవాట్లను వెంబడించాలని అప్పుడే సంపూర్ణముగా రక్షింపబడతారని చెప్తున్నాయి. కారణం, ప్రతి మానవుని పాపపు హృదయంలో ఒక ఆధ్యాత్మికమైన అహంకారం దాగి ఉంటూ, ఆధ్యాత్మికమైన విషయాలలో తను పూర్తిగా నిస్సహాయుడనని తన స్వంత రక్షణకు ఏమీ చేయలేని అసమర్థుడనని ఒప్పుకోవడానికి తిరస్కరించడమే. దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి మరియు తమ్మును తాము రక్షించుకోవడానికి సహాయం చేసుకొనే క్రమములో పాపియైన మానవుడు తను కొంత చేయగలనని అనుకొంటూ మానవ అహంకారంను బట్టి మొండిగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ అహంకారం పాపులను దేవుని ధర్మశాస్త్రము యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని విస్మరించేటట్లు చెయ్యటమే కాకుండా ధర్మశాస్త్రాన్ని రక్షణకు మార్గంగా భావించేటట్లు చేసి నడిపిస్తుంది. ఇది మనుష్యులను వారి వికృతమైన పాపాత్మకమైన ఆలోచనా విధానంలో నడిపిస్తూ, వారి స్వంత ఆజ్జ్యలు, నియమాలు మరియు పథకాలను ఏర్పాటు చేసుకొనేలా చేస్తూ, వారి స్వంత ఆజ్జ్యలు నియమాలను పాటించడం వారిని మంచి వ్యక్తులుగా చేసి, దేవుని మెప్పుకు పాత్రులుగా చేస్తుందని ఊహించుకుంటుంది.

పాతనిబంధన కాలములో యెహోవా బాధపడుతూ, ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు. వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి, అని యెషయా 29:13 లో తెలియజేస్తూవుండటం విచారించదగిన విషయం.

ఆహారం, పండుగలు, వేడుకలు మరియు సబ్బాత్‌లకు సంబంధించిన ఆజ్జ్యలను దేవుడు రక్షణకు మార్గాలుగా ఇవ్వలేదు. ఏ పాపి కూడా ఏ ఆజ్జ్యను సంపూర్ణముగా నెరవేర్చి తనను తాను రక్షించుకోలేడు. అవి నీడలుగా, రాబోయే రక్షకుని ఛాయలుగా ఇవ్వబడ్డాయి. అంటే, సూర్యుడు ఒక వ్యక్తి వెనుక ఉంటే, ఆ వ్యక్తి నీడ చాల దూరం పడుతుందిగా. మరియు ఆ వ్యక్తి నీడ అతడు వస్తున్నాడని తెలియజేస్తూవుంటుంది. పాత నిబంధన ఆజ్జ్యలన్ని ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప రక్షకుడు వస్తున్నాడనే వాగ్దానాన్నిగుర్తుచేస్తూవున్నాయి. మరియు రక్షకుని రాక కోసం వారిని మరింత ఆసక్తికరంగా చేయడానికి ఇవి ఉద్దేశించబడ్డాయి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని వాక్యము చెప్తూవుంది. విశ్రాంతిదినము ఒక నీడగా నిర్వచించబడింది, వాస్తవికత యేసు. యేసు మన మన శరీరాత్మలకు నిజ విశ్రాంతియైయున్నాడు.

అపొస్తలుల కార్యములు 20:7_ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను అని చెప్తూవుంది. వారంలో మొదటి రోజు ఆదివారం, ఈ రోజున ప్రజలు ఆరాధనకు కూడుకొన్నారని, కమ్యూనియన్ పుచ్చుకొన్నారని మరియు ప్రసంగాన్ని ఆలకించారాన్ని చెప్తూ ఉంది. అర్ధరాత్రివరకు అని లూకా చెప్పడంలో అతని ఉదేశ్యము, యూదులకు సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు ఒక రోజు. ఇక్కడ లూకా యూదుల రోజుల వ్యవస్థను వాడలేదు. అతడు రోమన్ వ్యవస్థను ఉపయోగించాడు: రోమనులు ఒక రోజును అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు తీసుకొనేవాళ్ళు. ఇక్కడ లూకా ఏమి చెప్తున్నాడంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను అని చెప్తూవున్నాడు. క్లియర్ కదండి.

1 కొరింథీయులకు 16:1-2 పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్రతివారం మొదటిరోజు సంఘము కలుసుకోవాలని మరియు డబ్బును పక్కన పెట్టాలని పౌలు నిర్దేశిస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ గమనించండి. అది దశమభాగం అని అనిపిస్తుంది. కాబట్టి, సంఘము ఆరాధనకు కూడుకొనే రోజు ఆదివారమని అర్ధమవుతూ ఉంది. ఇది సంఘము ఏర్పాటు చేసిన అధికారిక ఆరాధన దినమా? మీరే నిర్ణయించండి.

ప్రకటన 1:10-11_ ప్రభువు దినమందు ఆత్మవశుడనైయుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము–నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని. ప్రకటన 1:10 లోని “లార్డ్స్ డే” ”ప్రభువు దినము” అనే మాటకు వాడబడిన పదము, విశేషణము. దీని adjective construction యేమని చెప్తుందంటే,  ప్రభువుదినము మాములుగా సంఘము ఆరాధనకు కూడుకొనే రోజని తెలియజేస్తూవుంది. 2 వ శతాబ్దం ప్రారంభంలో (ఇగ్నేషియస్, మెగ్నీషియన్‌లకు వ్రాసిన పత్రికలో 1. 67) ఈ పదాన్ని చూడొచ్చు. రెండవ శతాబ్దంలో “ఆదివారం” ను సూచించడానికి ఉపయోగిoచిన ఈ మాటనే ఈ రోజు చాలా సంఘాలు, “లార్డ్స్ డే” అనే పదాన్ని ఆదివారన్న సంఘము కూడుకొనే రోజు అనే అర్ధములో  ఉపయోగిస్తూవున్నాయి.

ఇప్పటివరకు మనం చుసిన వాక్యభాగాలన్ని మనం శనివారన్నే ఆరాధనకు కలుసుకోవాలనే అవసరం లేదని మీకు చూపించడానికి ఇవి తగినంత సాక్ష్యాధారాలను అందిస్తున్నాయని నేను ఆశిస్తున్నాను.

ఏదేమైనా, రోమా14:1-12 ప్రకారము మనం ఏ రోజున ప్రభువును ఆరాధించాలని కోరుకొంటామో ఆ రోజున ఆయనను ఆరాధించుకొనే స్వేచ్ఛను ఇస్తూ ఉంది. ఈ విషయములో ఎవడును తీర్పు తీర్చకూడదని బైబులు చెప్తూవుంది. మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారము కామని రోమా 6: 14 చాల స్పష్టముగా తెలియజేస్తూవుంది. కాబట్టి ప్రభువును ఆయన పునరుత్థాన దినమున ఆరాధించడం తప్పు కానే కాదు. Amen.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.