క్రైస్తవుల రహస్య పునరుత్థానం ఉంటుందని గాని లేదా భూమిపై సజీవంగా ఉన్న క్రైస్తవులు అంత్యదినానికి ముందు ఈ లోకం నుండి పరలోకానికి ఎత్తబడతారని గాని (తరలించబడతారని) బైబులు బోధించటం లేదు. ఎత్తబడుటను విశ్వసించే వాళ్ళు తాము చెప్పేదానికి సపోర్ట్ గా 1థెస్సలొనీకయులు 4:13-18 ని చూపిస్తారు, అయితే, బైబిల్‌లోని ఆ విభాగం చివరి రోజున ఏమి జరుగుతుందో వివరిస్తుంది తప్ప ఎత్తబడుటను గురించి తెలియ జేయటం లేదు.

1 థెస్సలొనీకయులు 4:13-18 చదువుకొందాం, సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

చివరి రోజున, యేసు ఈ ప్రపంచానికి ప్రత్యక్షంగా తిరిగి వస్తాడని, చనిపోయినవారిని లేపుతాడని ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమిపై ఇంకా జీవించి ఉన్న క్రైస్తవులను తన వద్దకు సమీకరించుకుంటాడని బైబులు బోధిస్తూ వుంది. ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము (1 థెస్సలొనీక యులు 4:17) అనేది అంత్య దినాన్న జరగబోయే దానిని గురించి తెలియజేస్తూవుందే తప్ప అంత్యదినానికి ముందు జరిగే విషయాన్ని గురించి ఇది తెలియజేయటం లేదు. అంత్య దినాన్న జరిగే సంఘటనల నుండి ఈ సంఘటనను తీసివేయడానికి స్క్రిప్చర్ యొక్క ఈ భాగంలో ఆ  సందర్భం ఏమీ లేదు.

చివరి రోజు గురించి బైబిల్ ఏమి చెప్తుంది అనే దాని గురించి మరిన్ని విషయాలను తెలుసుకొందాం:

యేసు తిరిగి రావడం మరియు తీర్పు:

  • మరణం నుండి లేచి తండ్రి కుడిపార్శ్వానికి అధిరోహించిన నిజదేవుడు నిజమానవుడు అయిన యేసు మళ్లీ వస్తాడని బైబులు చెప్తూవుంది. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి, అపొస్తలుల కార్యములు 1:11).
  • యేసు తిరిగి వచ్చే సమయాన్ని ఎవరూ ఖచ్చితంగా తెలుసుకోలేరని బైబులు చెప్తూవుంది.  ఈ జ్ఞానం పరలోకంలోని దేవదూతలకు కూడా లేదు. అయితే ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు, మత్తయి 24:36). అయితే, ఆయన రాకడను తెలుపు కొన్ని సూచనలను ఆయన తన విశ్వాసులకు తెలియజేసియున్నాడు, (యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడ కుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింప బడును; అటుతరువాత అంతము వచ్చును మత్తయి 24:4-14). ఆ రోజు అకస్మాత్తుగా వారిపైకి రాకుండా విశ్వాసులందరు అప్రమత్తంగా ఉండాలని మెలకువగా ఉండాలని ఆయన వారిని హెచ్చరించాడు. (మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను, లూకా 21:34).  
  • యేసు తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచం అంతం అవుతుందని బైబులు చెప్తూవుంది. (అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును, 2 పేతురు 3:10-13).
  • యేసు తిరిగి వచ్చినప్పుడు భూమి అంతటా ఆయన స్వరం వినిపించినప్పుడు, చనిపోయిన వారందరూ లేస్తారు, వారి ఆత్మలు వారి శరీరాలతో తిరిగి కలపబడతాయని బైబులు చెప్తూవుంది, (దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలమువచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానము నకును బయటికి వచ్చెదరు, యోహాను 5:28,29). ఇంకా జీవించివున్న వారితో కలిసి, పునరుత్థానం చేయబడిన వారు ఆయన తీర్పులో నిలబడతారు. అవిశ్వాసులు నరకంలో నిత్యత్వానికి శిక్ష విధించ బడతారు. విశ్వాసం ద్వారా క్రీస్తు రక్తంలో శుద్ధి చేయబడిన వారు మహిమపరచ బడతారు మరియు పరలోకంలో దేవుని ఆశీర్వాద సన్నిధిలో యేసుతో పాటు శాశ్వతంగా జీవిస్తారు, (సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును, ఫిలిప్పీయులు 3:21).
  • క్రీస్తు వెయ్యేండ్ల పాలన అనే బోధను నేను తిరస్కరిస్తూవున్నాను. ఈ బోధకు (మిలియనియమ్) గ్రంధ ఆధారం ఏమి లేదు. ఈ బోధ క్రైస్తవులు తమ భూసంబంధమైన క్రీస్తు రాజ్యంపై ఆశలు పెట్టుకునేలా తప్పుగా దారితీస్తుంది, (యేసు–నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబం ధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను, యోహాను 18:36). తీర్పు దినానికి ముందు క్రైస్తవులు భూమి నుండి భౌతికంగా తీసివేయబడతారు లేదా పైకి ఎత్తబడతారు అనే వాదన లేఖన విరుద్ధము. అలాగే చివరి రోజుల్లో యూదులందరూ మతమార్పిడి చేయబడతారని చెప్పడం  కూడా లేఖన విరుద్ధము.
  • అంత్య కాలంలో ఇంకా అంత్య క్రీస్తు వస్తాడనే బోధ తప్పు. లేఖనాలలో చెప్పబడిన ఈ విరోధి యొక్క లక్షణాలు పాపసీలో ఇప్పుడు నెరవేరుతున్నాయి. (ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా? కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును, 2 థెస్సలొనీకయులు 2:4-10).
  • కొందరు శారీరక పునరుత్థానం లేదని చెప్తూవున్నారు, వారి భోదన తప్పు. మరికొందరు నరకం యొక్క వాస్తవికతను మరియు శాశ్వతత్వం యొక్క వాస్తవికతను త్రోసిపుచ్చుతూ వున్నారు, వారి వాదనలు కూడా తప్పే. (మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును, హెబ్రీయులు 9:27) అను ఈ లేఖనాన్ని బట్టి మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇతర శరీరాలలో (పునర్జన్మ) భూమికి తిరిగి వస్తాయనే బోధను కూడా నేను తిరస్కరిస్తూవున్నాను.
  • యేసు తిరిగి రావడం ,తీర్పు గురించి బైబులు బోధించేది ఇదే. ఈ విషయాలను నేను నమ్ముతున్నాను, బోధిస్తాను మరియు ఒప్పుకుంటున్నాను.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.