పాత నిబంధన పాఠము: యెషయా 49:1-6; పత్రిక పాఠము: అపొస్తలుల కార్యములు 16:25-34; సువార్త పాఠము: మార్కు 1:4-11; కీర్తన 2.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: యెషయ 49:1-6

1ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను. 2నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు. 3ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచు కొనెదను అని ఆయన నాతో చెప్పెను. 4అయినను–వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియులేకుండ నా బలమును వృథాగా వ్యయపరచియున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది. 5యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు 6–నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను.

మన పాఠము ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతూ వుంది? యెషయా 45వ అధ్యాయంలో మాట్లాడుతున్న పర్షియన్ రాజైన సైరస్ కావొచ్చా? లేదా ఎవరైనా ఇతర ప్రవక్తలను గురించి మాట్లాడుతూ ఉందా? అయితే భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించియున్నాను అనే మాటలు వీరెవరూ కాదని చెప్తూవున్నాయి. ఇక్కడ వివరణకు మెస్సీయ తప్ప మరెవరు సరిపోతారు? ఈ మాటలు మెస్సయ్యను ఉద్దేశించినవే. ఈ మెస్సయ్యను బట్టి దేవునికున్న ఉద్దేశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మరి మీ జీవితాన్ని గురించి దేవునికున్న ఉద్దేశ్యమేమిటో మీరు చెప్పగలరా?

తండ్రి నా జీవితములో మీ ఉద్దేశ్యమేమిటో నాకు తెలియజేయుము అని ఎప్పుడన్నా ప్రార్దించారా? ఆయన మీకు బయలు పరచిన దానిని భద్రము చేసుకున్నారా? ఆ ఉద్దేశ్యమును మీ జీవిత పర్యంతము నెరవేర్చుటకు బ్రతుకుతున్నారా? ఆయన ఉద్దేశ్యము కొరకు మీరు పని చేస్తూవుంటే మీ జీవితాన్ని ఆయనే నడిపిస్తాడు. కాని మనలో చాల మంది మా కర్మ ఇంతేనండి అది విధి లిఖితమన్నట్లుగా బ్రతికేస్తూ ఉన్నాం.

కాని మీరు దేవుని నిత్య సంకల్పంలో ఎన్నుకోబడియున్నారని, దేవుని ఆత్మ చేత మీరు ఇక్కడ ఇప్పుడు సువార్త ద్వారా పిలువబడియున్నారని మర్చిపోతూ వున్నారు. మీ పట్ల దేవునికొక ఉద్దేశ్యముంది అనే విషయాన్ని మరొకసారి ఈ పాఠము ద్వారా దేవుడు మీకు జ్ఞాపకం చెయ్యాలనుకొంటున్నాడు.

దేవుడు ప్రజలందరి జీవితాలను గూర్చి ఒక ప్రాముఖ్యమైన స్పష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మన పాఠము చాల స్పష్టముగా తెలియజేస్తూవుంది. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు మంచి చెయ్యాలనే ఒక సద్దుద్దేశ్యాన్ని కలిగి ఉన్నాడు. కాని ప్రజలే దేవుని ఉద్దేశాన్నిచూడలేక, ఆ ఉద్దేశ్యాన్ని తెలుసుకోలేక ఇబ్బందులు పడుతూ, వారి జీవితాలను బట్టి, మా కర్మ అండీ అని బాధపడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మన పాఠము మీ అందరి జీవితములు అద్భుతఃకరమైన రీతిగా ఆశ్చర్యపరచే రీతిలో మారగలవని తెలియజేస్తూ ఉంది. అద్భుతఃకరమైన రీతిగా ఆశ్చర్యపరచే రీతిలో మీ జీవితాలు మారాలని మీరు ఆశపడుతుంటే, మీ పట్ల దేవునికి మంచి ఉదేశ్యమే ఉందనే విషయాన్ని మరచిపోకండి. మన పాఠములో, ఆ మంచి ఉద్దేశ్యమును అందరూ పుచ్చుకొనులాగున అందరికి వర్తింపజేయుటకై  దేవుడు తన కుమారుని లోకమునకు పరిచయము చేస్తూ ఉన్నాడు. తన కుమారుని ద్వారా మీ జీవితము ఎలా మారగలదో అలాగే మీ జీవితమును గురించి దేవునికున్న ఉద్దేశ్యము ఏమిటో మన పాఠమును చదివి తెలుసుకొందాం.

మీ జీవితాన్ని గురించి దేవునికున్న ఉద్దేశ్యము

  1. మీరు రక్షింపబడాలనేది దేవుని ఉద్దేశ్యము 1-3
  2. దేవుని విశ్వవ్యాప్తమైన ఉద్దేశ్యములో మీరు కూడా భాగమవ్వాలనేది దేవుని ఉద్దేశ్యము 4-6

1

యెషయ 49:1-3 ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి యున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు. ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచు కొనెదను అని ఆయన నాతో చెప్పెను.

 మొదటి వచనాన్ని చదువుకొందాం: ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి. మన పాఠములో మాట్లాడుతున్న దేవుడు, లోకములోని ప్రజలందరూ ఆయన మాటలకు చెవి యొగ్గాలని చెప్తూ ఉన్నాడు. నా మాట వినుడి, అంటే, నా మాటలను నిర్లక్షంగా తీసుకోకండి, నా మాటలను అలక్ష్యము చెయ్యకండి, నా మాటలను పెడ చెవిని పెట్టకండి, అనే కదా అర్ధం. అలాగే  నేను చెప్పబోయేది చాల చాల ప్రాముఖ్యము, నా మాటలకు చెవినియ్యమని, ఆలకించుమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, దేవుడు వినమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే అది యేదో చాల ప్రాముఖ్యమైన విషయమై ఉంటుంది.

నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను _ పిలుపు అనేది ఎన్నికను తెలియజేస్తూవుంది. ఎన్నిక అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఆ పనిని పూర్తి చేయుటకు ఎన్నిక చెయ్యబడియున్నారని (ప్రత్యేకింపబడి యున్నారని) చెప్తూ వుంది. ఎన్నిక, ప్రత్యేకింపబడుటే, కాదండి ఆ పని కొరకు యీతడు మాత్రమే నియమింప బడియున్నాడని చెప్తూ అతని యాజ్యమానాన్ని కూడా తెలియజేస్తూవుంది.

ఉదాహరణగా, క్రీస్తునే తీసుకోండి, యేసు, దేవుని చేత ఎన్నిక చెయ్యబడియున్నాడని, మానవాళి రక్షణ/మోక్షము అను పని నిమిత్తమై అత్యుత్తమమైన వానిగా ప్రత్యేకింపబడియున్నాడని, ఆ పనిని ఎలా పూర్తి చెయ్యాలో ఒక ప్రణాలికను కలిగియున్నా డని, ఆ పని నిమిత్తమై నిర్దేశింపబడియున్నాడని, ఆ పని కొరకు అతడు మాత్రమే నియమింపబడియున్నాడని (ఇంకెవ్వరు లేరని) ఆ పనిలో సంపూర్ణ యాజమాన్య బాధ్యత ఆయనకే ఇవ్వబడియున్నదని ఆయన దానిని సంపూర్తిచేసియున్నాడని కదా.

ఆయన ఈ రోజు మిమ్మల్ని జ్ఞాపకము చేసికొనియుండుటను బట్టి ఈ రోజు మీరు ఆయన రాజ్యములోనికి ఆయన కుటుంబ ము లోనికి సభ్యులుగా ఉండుటకు పిలువబడియున్నారు, ప్రత్యేకింపబడియున్నారు. ఇది మీ ఎన్నికను మీ ప్రత్యేకతను దేవుని కుటుంబములోనికి తీసుకోబడియుండుటను దేవుని పిల్లలుగా మీకున్న దీవెనలను గురించి కదా చెప్తూ ఉంది. నీ తల్లి నిన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నీ పేరును జ్ఞాపకము చేసుకొంటూవున్నాడు. ఈ ధన్యతలో మీ పట్ల దేవుని కున్న ఉధ్దేశానికి చోటివ్వండి.

నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు_  ఇప్పుడు యెహోవా తన కుమారుని ద్వారా మాట్లాడ టానికి ఎంచు కున్నాడు, ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు తన నోటి మాటతో సర్వమును సృజించాడు, దేవుడు తన నోటి మాటతో సర్వమును నాశనము చెయ్యగలడు. అలాంటి సర్వశక్తిగల దేవుడు, తన కుమారుని నోటిని “వాడిగల ఖడ్గముగా“, “పదునైన కత్తిలాగా” చేసియున్నాడు అని అంటున్నాడు. ఎందుకలా? ఆయుధాలు ప్రాణాలు తీస్తాయి కదా. ఇక్కడ దేవునికి మరేదో ఉద్దేశ్యమున్నదని స్పష్టముగా మనకు అర్ధమౌతు వుంది.

ఖడ్గము బైబిలులో _దేవుని తీర్పుకు, దేవుని ప్రతీకారమునకు, దేవుని విజయమునకు, దేవుని మాటలకు, సాదృశ్యముగా వున్నది.  హెబ్రీ. 4:12లో దేవుని వాక్యము రెండంచులుగల ఖడ్గము వంటిదని చెప్పబడి యున్నది, అట్లే కీర్తన 38:2లో నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి అని చెప్పబడి వున్నది. పాత నిబంధనలో దేవుని వాక్యము బాణములుగాను క్రొత్త నిబంధనలో వాడిగల ఖడ్గముగాను చెప్పబడింది. ఖడ్గము దగ్గర ఉన్నవాటిని ఎదుర్కొనుటకు ఉపయోగిస్తారు_ క్లోజ్ ఎన్కౌంటర్స్_ బాణములు దూరములో ఉన్న లక్ష్యాలను ఛేదించుటకు ఉపయోగిస్తారు.    

ఈ ఆయుధముల ఉద్దేశ్యము పాపమును బయలుపరచి, ఖండించుట మరియు అవిశ్వాసమును గద్దించుట. అంటే ఒక వ్యక్తి తన శారీరిక ఆత్మీయమైన జీవితములో ఎలా వున్నాడో, ఏమై యున్నాడో చూపించుచు దేవుని తీర్పును మీకు మీ కుటుంబ సభ్యులకు ఇతరులకు స్పష్టముగా తెలియజేయుటే ఆ ఆయుధముల ఉద్దేశ్యము. ఉదాహరణకు, నోవహు 120 yrs దేవుని ఈ ఉద్దేశ్యాన్ని నెరవేర్చి తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ఇతరులను రక్షించుటకు ఎంతగానో ప్రయాసపడి యున్నాడు. దేవునికి తెలుసుగదా ఎవరు నోవహు మాటలను లక్ష్యపెట్టరని వెంటనే నాశనము చేసేసి ఉండొచ్చుగా. 120 yrs ఆగడమెందుకు? దేవుని ఉదేశ్యములో 8 మంది, లక్షలాది మంది మధ్యలో 120 yrs క్లోజ్ ఎన్కౌంటర్స్ లో, దూరములో ఉన్న లక్ష్యమును సాధించి చిరస్థాయిగా చరిత్రలో దేవుని గ్రంధములో నిలిచిపోయారు.

వారికి ధైర్యము నిచ్చినది దేవుని “వాడిగల ఖడ్గము“. దేవుడు ప్రతి రోజు మూడు పూటలా నోవహు దగ్గరికి ఇతరుల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ వారికి దర్శనమిస్తూ బలపర్చినట్లుగా బైబులు చెప్పటం లేదు. వారికి అనుగ్రహింపబడిన వాడిగల ఖడ్గమే వారికి ధైర్యాన్ని ఇచ్చింది. దేవుని వాక్యము దాని పరిపూర్ణతలో_దాని బలములో_ దాని పదునులో_ నిరంతరం మనకు మన తోటివారికి రక్షణగా మనతోనే ఉండాలి. ఖడ్గములో ఇతరమైన వాటిని కలిపితే అది బలహీనం అవుతుంది, మొద్దుబారితే దానిని ఉపయోగించడంలో ప్రయాసము అధికమవుతుంది. దానిని ఉపయోగించడం తెలియకపోతే ప్రయోజనముండదు. నిరంతరం నీ క్లోజ్ ఎన్కౌంటర్స్ ని, నీ లక్ష్యాలను ఛేదించుటకు అప్రమత్తతో సాధన చేస్తూ నీకును, నీతోటి వారికిని ధైర్యము నిస్తూ వున్నావా? జీవగ్రంధములో ఉండటానికి ప్రయాసపడుతూ ఉన్నావా? పరిశీలించుకో. నీ దేవుని చిత్తము మీరు చిర స్థాయిగా ఉండాలనేది. మీకును మీ కుటుంబ సభ్యులకు మీరు దీవెనకరముగా ఉండాలని దేవుడు కోరుకొంటూ వున్నాడు.

తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు _యెహోవా తన కుమారుని తన చేతి నీడలో దాచి ఉంచాడు, కాలము పరిపూర్ణమై నప్పుడు ఆయనను పంపించడం కొరకు. కాలము పరిపూర్ణమైనప్పుడు అనేకులకు దీవెనకరముగా ఉండులాగున బయలు పర్చాడు. ఆ విషయమే  ఇక్కడ ప్రవచింపబడి యున్నది. ఈ రోజు ఆయన నిన్నును అనేకులకు మాదిరిగా దీవెనకరముగా ఉండేందుకు పిలచియున్నాడు బయలుపర్చ బడియున్నావు.

నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు_ సమర్ధవంతంగా మరియు ప్రభావవంతం గా ఒక ఉద్దేశ్యము కొరకు, మానవాళి రక్షణ కొరకు. మిమ్మల్ని కూడా సమర్ధవంతంగా మరియు ప్రభావవంతంగా ఒక ఉద్దేశ్య ము కొరకు, ఈ యుగములో, ఈ తరములో, ఈ దేశములో, ఈ రాష్ట్రములో, ఈ ప్రాంతములో నీ పొలిమేరలను స్థిరపరచి నిన్ను కొందరి కొరకు బయలుపరచియున్నాడు.

నీలో నన్ను మహిమపరచు కొనెదను_  దేవుని చిత్తాన్ని ఎవరైతే స్పష్టముగా గుర్తిస్తారో వారి మధ్యలో దేవుని చిత్తము బహిరం గపరచబడుట మొదలుపెడుతుంది. నీలో ఆయన నన్ను నేను మహిమపరచుకొనెదను అంటూవున్నాడు.

యేసుని పంపించడంలో  దేవుడు ఎంతటి స్పష్టమైన ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాడో చూడండి. ఈ 5 విషయాలు  దేవుని లోతైన ప్రణాలికను మనకు స్పష్టముగా చూపెడుతుంటే, మనపట్ల  దేవునికి స్పష్టమైన ప్లాన్ లేదని మీరు అనుకోగలరా? ఆయన మీ పట్ల కూడా అంతే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని కలిగియున్నాడు, నమ్మండి.        

2

4అయినను–వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియులేకుండ నా బలమును వృథాగా వ్యయపరచియున్నా నను కొంటిని.

ఇటువంటి గొప్ప అద్భుతమైన దేవుని ఉద్దేశ్యము సులభముగా విజయవంతము కాలేదు. అది ఎంతో కఠినమైన ప్రయాసల మధ్యలో రక్తపాతంతో ముగిసినట్లుగా కనబడుతుంది. మెస్సీయ తన మహిమగల శక్తిని, ఘనతను పక్కన పెట్టి రావడం వ్యర్థముగా కనబడొచ్చు. ఈ దేవుని ప్రణాళిక కొరకు దేవుని కుమారుడు, తనను తాను అర్పించుకున్నాడు, మరణానికి విధేయుడయ్యాడు. మూడేళ్ల పరిచర్య తరువాత, అన్ని బోధలు, అన్ని అద్భుతాల తరువాత, మరణం మాత్రమే అతనికి దొరికినట్లు కనిపిస్తూవుంది. అన్ని మానవ దృక్కోణాల నుండి, మెస్సీయ విఫలమయ్యాడు. ఆయనను ఉంచిన సమాధిని సీల్ వెయ్యండి. సీల్ వేయబడిన ఆ సమాధిని మన గెలుపుగా ప్రకటించుకుందామని ఆయన శత్రువులు అనుకొన్నారు. ఆయన గెలిచాడు, మరణమునుండి, సమాధి నుండి.

దేవుని ప్రతి సేవకుని సేవ కూడా విఫలమైనట్లుగానే కనబడుతుంది. దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, కాని ఫలితమేమి లేనట్లుగా కనిపించుటను బట్టి నిరుత్సాహపడుతూ ఉన్నారా? దాని ప్రకారము జీవిస్తూ ఉన్నాము, కాని ఎటు చూసినను ప్రయాసే అని ఏడుస్తూ వున్నారా? వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమే మియులేకుండ నా బలమును వృథాగా వ్యయపరచి యున్నానను కొంటూవున్నారా? మీ శత్రువులు మీ ఓటమిని వారి గెలుపు గా ప్రకటించుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారా?

నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది_ దేవుడు తన కొడుకు పనిని ఆశీర్వదిస్తాడు. ప్రపంచంలో నిజమైన మతంగా మొదటి స్థానంలో ఉంది. నమ్మకమైన సేవకు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. సేవకుడి సేవ ఫలిస్తుంది. నీ నమ్మకత్వానికి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. నువ్వు ఓడిపోవు.

5యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను. తనను ఈ మిషన్ (దేవుని ప్రజలను దేవునియొద్దకు తెచ్చుటకు) కొరకు ఎన్నుకున్నందుకు, ఆ ఘనతను ఆయనకు ఇచ్చినందుకు దేవుని కుమారుడు తండ్రికి తన కృతజ్జతల ను తెలియజేస్తూ, గొప్పగా అనుభూతిజెందుతూ, ఈ మిషన్లో నా దేవుడు నాకు బలమాయెను అని చెప్తూవున్నాడు. ఆయన తన తండ్రి ఉద్దేశ్యమును బట్టి, ఆయన సంకల్పము కొరకు, ఆయన సంతోషము కొరకు యెంతటి తిరస్కారము, శత్రుత్వము ఎదుర్కొన్నాడో తెలుసా, ఎన్ని వందల మైళ్ళు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ తిరిగాడో తెలుసా? ఏమి తిన్నాడో ఏమి త్రాగాడో, ఎక్కడ ఉన్నాడో, నిరంతరము ప్రేమతో దేవుని బలముతో నిర్బలునిగా ఉండటం గొప్ప విషయం.

ఈ రోజు నీ బలము కూడా నీ దేవుడే. ఉదాహరణకు: దావీదు గొల్యాతు.

కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడు టకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు 6–నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లు ను ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంత ముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

దేవుడు తన కుమారుని పంపిన కారణాలను మరొకసారి ఆయన గుర్తుచేస్తూవున్నాడు. ఆయన పని ఇశ్రాయేలీయులను, దేవుని ప్రజలను దేవుని దగ్గరకు తేవడమే. యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చటం. అలాగే ఆయన 1వచనములో ఆహ్వానిస్తున్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి వెలుగుగా ఉండటం. ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటే, ఆయన టాస్క్. ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ప్రజలందరిని బట్టి దేవుడు శ్రద్ధ తీసుకొంటున్న ట్లుగా మనము కూడా ప్రజలపట్ల శ్రద్ధను కలిగివుందాం. యూదుల కొరకు మాత్రమే యేసు వచ్చి ఉంటే అది చాల చిన్న విషయము. ఎందుకంటే వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్లేవారు. మిగతావాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి అది చిన్న విషయ మవుతుంది. దేవుడు భూదిగంతముల ప్రజలందరి కొరకు యేసును రక్షకునిగా నిర్ణయించియున్నాడు. ఆయన విశ్వవ్యాప్తమైన ఉద్దేశ్యములో మనము కూడా భాగమవుదాం. ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.