పాత నిబంధన పాఠము: 1 సమూయేలు 3:1-10; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 6:12-20; సువార్త పాఠము: యోహాను 1:43-51; కీర్తన 67.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: 1 సమూయేలు 3:1-10

1బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు. 2ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొనియుండగాను 3దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొనియుండగాను 4యెహోవా సమూయేలును పిలిచెను. అతడు–చిత్తమండి నేనున్నానని చెప్పి 5ఏలీదగ్గరకు పోయి–నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు–నేను పిలువలేదు, పోయి పండు కొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. 6యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. 7సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు. 8యెహోవా మూడవమారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి 9–నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడల–యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. 10తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా–సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలు– నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ యిమ్మనెను.      

పాత నిబంధన చదివిన ఎవరికైనా దేవుడు తరచూ తన ప్రజలతో నేరుగా మాట్లాడేవాడని తెలుసు. ఆయన ఏదెను తోటలో   ఆదాము హవ్వలతో మాట్లాడాడు (ఆదికాండము 3); జలప్రళయమును గురించి నోవహును వ్యక్తిగతంగా హెచ్చరించాడు, అబ్రాహాముతో పలు సందర్భాల్లో మాట్లాడాడు, అలాగే కాలుతున్న పొద మధ్యలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు మనం చదువుకున్న పాఠములో, దేవుడైన యెహోవా సమూయేలుతో కూడా మాట్లాడాడు.

ఈ రోజులలో దేవుడు ఎందుకని ప్రజలతో వ్యక్తిగతముగా మాట్లాడడం లేదు? మన వైపు నుండి ఏమన్నా తప్పు జరుగుతు వుందా? మాట్లాడకుండా బిగుసుకొని కూర్చుని ఉన్న దేవునిని మాట్లాడేటట్లు చెయ్యడానికి ఎవరు ఎందుకని ప్రయత్నం చెయ్యడం లేదు? అని చాలామంది ప్రశ్నిస్తూ వుంటారు. ఆ విధముగా ప్రశ్నించే వాళ్ళతో నేను చెప్పేదేంటో తెలుసా_ దేవుడు మాట్లాడుతున్నాడు కాని ఎవరు వినడం లేదనే విషయం మీకు తెలుసా? పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములు గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1: 1-2 వచనాలు తెలియజేస్తూవున్నాయి.

దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు దానిలో ఎలాంటి సందేహము లేదు. దేవుడు అందరితో ప్రతిరోజు మాట్లా డుతూనే వున్నాడు. కాని సమస్య ఏమిటంటే ప్రజలే వినడం లేదు. దేవుని స్వరమును వినాలనే ఆతృత కలిగిన చెవులను ప్రజలు కలిగిలేరు. కాబట్టే దేవుడు మాట్లాడుతుండగా అది దేవుని స్వరము అని గుర్తుపట్టలేక పోతూ ఉన్నారు.

దేవుని స్వరాన్ని ఆలకించగలుగుతున్నామా?

  1. ఎందుకని దేవుని స్వరాన్ని గుర్తించలేకపోతున్నాం. 1-7
  2. దేవుని స్వరాన్ని వినుటకు సిద్ధముగా ఉండవలసి ఉన్నాం. 8,9
  3. దేవుడు చెప్పే దానిని స్వీకరించవలసి ఉన్నాం. 10

1

ఎందుకని దేవుని స్వరమును గుర్తించలేక పోతున్నాం? మన పాఠము ఇశ్రాయేలు చరిత్రలో ఉన్న కొన్ని చీకటి రోజులకు సంబంధించినది_ అంటే ఇశ్రాయేలీయులు ఆత్మీయముగా చీకటి రోజులలో ఉన్న కాలానికి సంబంధించినది. మన పాఠము యొక్క మొదటి వచనము ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ, 1బాలుడైన సమూయేలు ఏలీ యెదుట యెహోవాకు పరి చర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు అని చెప్తూవుంది.

ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, అరుదు, అనే మాటకు, ఆ దినములలో  ప్రజలకు దేవుని ప్రత్యక్ష త తరుచుగా తటస్థించుటలేదని, దేవుని ప్రత్యక్షత ప్రజలకు తటస్థించునట్లు ప్రజలు దేవుని పట్ల నమ్మకముగా లేరు, ప్రజ లకు దేవుడంటే పెద్దగా ఆసక్తి కూడా లేదు. అలాగే దేవుని చిత్తమును ప్రత్యక్ష పరచుటకు ఎవరూ లేరనే విషయాన్ని, వారి కివ్వబడియున్న చిన్న ప్రత్యక్షతకు ఇశ్రాయేలీయులు విలువ ఇయ్యకుండా పట్టించుకోకుండా ఉన్న రోజులవి అని అర్ధం. 

ఈ రోజులలో మనకు ప్రత్యక్షపరచబడియున్న దేవుని వాక్యానికి మనం కూడా విలువ ఇయ్యకుండా, పట్టించు కోకుండా, మనలను మనము హెచ్చించుకొంటూ, దేవుడు నాతో ప్రత్యక్షంగా మాట్లాడాలి నేను నమ్ముతాను అని బుద్ధిహీనముగా ఎందరో మాట్లాడుతుండుటను మనము ఆలకిస్తూవున్నాము. ప్రజలు  తాము చేసే అనైతిక కార్యములనుబట్టి  దేవునికి దూరముగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. పశ్చత్తాపము గాని, మారుమనస్సు గాని లేవు, నిజం చెప్పాలంటే ప్రజలకు ప్రత్యక్షపరచబడియున్న దేవుని వాక్యానికి విలువ ఇయ్యకుండా, పట్టించుకోకుండా ఉన్న రోజులివి.

ఆ కాలములో ఇశ్రాయేలీయులకు ఏలీ ప్రధాన యాజకునిగా ఉన్నాడు. దేవుని ప్రజల యొక్క ఆత్మీయ అవసరతలలో అతడు ప్రజలకు సహాయపడుతూ ఉండేవాడు. ఆతని ఇద్దరు కుమారులైన హొప్ని ఫీనెహాసులు తమ తండ్రికి మారుగా దేవాలయ సంరక్షణను తీసుకొన్నారు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి అని బైబులు చెప్తూవుంది. వాళ్ళు, ప్రజలు అర్పణలను ప్రభువు కొరకు తెచ్చినపుడు వాటిలో శ్రేష్ఠమైన వాటిని వాళ్ళు తీసుకొని మిగతా వాటిని దేవునికి చెల్లించేటట్లు వాళ్ళు ప్రజలను అనుమతించే వాళ్ళు. వాళ్ళు చాల అనైతికులు (వ్యభిచారకులు) కూడా. వాళ్ళు బహిరంగముగా అనైతిక కార్యములను చెయ్యడమే కాకుండా ఇతరులను కూడా పాపములోనికి నడిపారు.

ఇది కూడా దేవుని వాక్యము వారికి అరుదుగా తటస్థించుటకు ఒక కారణము. ఇక్కడ ఏలి చేసిన పొరపాటుల నుండి కూడా మనము కొన్ని పాఠాలను నేర్చుకోవలసి ఉన్నాం. ఏలి పిల్లలు దేవుని యందు భయభక్తులలో పెరగలేదు. ఏలి పిల్లలు తండ్రి పేరును హోదాను తమ అనైతిక కార్యములకు వాడుకొన్నారు. వాళ్ళు గద్ధింప బడినను లెక్కచెయ్యలేదు. ఏలి కూడా వారిని కఠినముగా గద్దించలేదు. హొప్ని ఫీనెహాసులు దేవునికి విరోధముగా పాపమును చేసి మరణమును తెచ్చుకొన్నారు, తమ కుటుంబ తరములలోని వారందరి మీదకి దేవుని శాపమును తెచ్చారు అనే విషయాన్ని మరచిపోకండి.

దేవుని వాక్యము వారికి అరుదుగా తటస్థించెను, అను మాటలను, మరోలా చెప్పాలంటే, ఎవరితోనైనా మాట్లాడే టప్పుడు, వారు వినకపోతే, మాట్లాడడం మానేస్తాం. వారి కర్మకు వారిని వదిలేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇశ్రాయేలీయులు దేవుని మాటలను ఆలకించడం మానేశారు, దేవుడు వారితో మాట్లాడడం మానేసాడు. 

2-7 వచనాలు, యెరూషలేముకు ఉత్తరాన 20మైళ్ళ దూరములో ఉన్నషిలోహు మందిరములో ప్రధాన యాజకుడైన ఏలి నిర్దేశకత్వములో 12 సంవత్సరముల బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తూ శిక్షణ పొందుతూ ఉన్నాడు. ఆ బాలుడు దేవునికి బలిగా అర్పింపబోయే జంతువులను కడిగేవాడు. మందస మును కాసేవాడు, దేవాలయపు ద్వారములు తెరిచేవాడు, మూసేవాడు. దీపపు వత్తులను బాగు చెయ్యడం, దీపాలలో నూనెను పొయ్యడం. దేవాలయములో ఉన్న ఇంకా చిన్న చిన్న పనులను చేసేవాడు. దేవాలయ ములో అతని పరిచర్య సమూయేలు ఒక విశ్వాసి అని తెలియజేస్తూ ఉంది. సమూయేలు అప్పటికి యెహోవా ను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. 

Question: ఈ రోజులలో మందిర పరిచర్యలో భాగముగా_ మందిరాన్ని ఊడ్చే విషయములో అనేకులు సిగ్గు పడుతున్నారు. ఒక్క విషయం, దేవునిని ఆరాధించడానికి వచ్చిన వారి పాదధూళిని ఎత్తి పారవేయడం ధన్యతా కాదా? ఆలోచించండి.

ఒక రోజు ఉదయాన్నే, తెల్లవారకముందే, అతని పేరు పిలువబడడం సమూయేలును నిద్రనుండి మేల్కొల్పింది. సమూయే లు ఇంతకు మునుపు దేవుని స్వరాన్ని ప్రత్యక్షంగా వినలేదు, కాబట్టి నిద్ర లేచిన సమూయేలు ఏలి తనను పిలిచాడను కొన్నాడు. ఏలి దగ్గరకు వెళ్లి పిలిచారేమండి అని అడిగాడు, అందుకు ఏలి నేను పిలువలేదు పోయి పండుకొనుమని చెప్పాడు. ఇలా మూడుసార్లు జరిగింది. మూడుసార్లు తరువాత ఏలి యెహోవా ఆ బాలునిని పిలచుచున్నాడని గుర్తుపట్టాడు.

మరి మన సంగతేంటి? దేవుని బిడ్డలుగా దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఆయన స్వరాన్ని మనం గుర్తు పడుతున్నామా? మన అలక్ష్యము, నిర్లక్షం వలన దేవుని స్వరము మనకు వినబడుతున్నను మనం పట్టించు కోకుండా ఉన్నామా? అసలు దేవుని స్వరాన్నే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నామా? 

కొన్నిసార్లు నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్దిస్తూ ఉంటాము, మన సమస్యకు పరిష్కారము వరకే, ఆ ప్రార్ధన. దేవుడు వాక్యము ద్వారా మనతో ఉన్నాడు, ప్రతి క్షణం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుతాం, అది మన జీవితాల లోని బలహీనతలను, పాపాన్ని చూపి గద్ధించింది అనుకోండి మారుటకు మనం ఒప్పుకోము. నేను చేసేది తప్పని నేను అనుకోవడం లేదు, మార్చుకోవడానికి నాకు కారణమేమి కనబడటం లేదు, అని అనుకొంటూ ఈ వాక్యము నాకు కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తాం. ఈ స్వభావము మనలను దేవునికి టచ్లో లేకుండా చేస్తూవుంది, కాబట్టి మనం ఆయన స్వరాన్ని గుర్తు పట్టలేకున్నాం.

ఒక ప్రశ్న, మనము ఏకీభవించని ఒక వాక్య భాగాన్ని ఒక బ్రదర్ మనకు చూపెట్టాడనుకోండి, ఏకీభవిస్తామా, ఏకీభవించం. వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం ఆయన స్వరాన్ని వెంటనే గుర్తుపట్ట లేకున్నాం, లేదంటే ఏలి వలే ఆలస్యముగా గుర్తుపడుతూ ఉన్నాం. 

చదువువచ్చిన వారైనా, చదువురాని వారైనా, పిల్లలైనా పెద్దలైనా కొందరి స్వరాలను ఫోన్లో గుర్తుపట్టి మాట్లాడు తుంటాం, అవునా అదే రీతిగా మీతో మాట్లాడుతూవున్న మీ దేవుని స్వరాన్ని మీరు ప్రతి రోజు గుర్తుపట్టవలసి యున్నారు కదా.  

2

మన పాఠము దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం గుర్తుపట్టలేక పోతున్నాం అని చెప్తూవుంది. నిజమైన దేవుని బిడ్డ దేవుని స్వరమును గుర్తుపట్టే చెవులను కలిగిఉంటాడు. దేవుని స్వరమును ఊరికినే గుర్తిస్తే సరి పోతుందా? మన పాఠము ఏమి చెప్తుందో చూద్దాం,

8,9 వచనాలు_8యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి 9–నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడల–యెహోవా, నీ దాసుడు ఆలకించు చున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.

మన పాఠములో ఏలి సమూయేలుకు ఇచ్చిన సూచనలు అద్భుతం. ఏలి దేవునికి నమ్మకమైన సేవకునిగా లేడు. అతని కుటుంబము యొక్క ఆత్మీయ అవసరతలను అతడు పట్టించుకోలేదు. కాని దేవుడు సమూయేలును పిలచుచున్నాడని ఏలి గుర్తుపట్టినప్పుడు అతడు సరియైన పనినే చేసాడు.

ఆ చిన్న బాలునితో దేవుడు మాట్లాడడం అన్యాయము అని ఏలి సణుగుకొలేదు. అటువంటి ఆలోచన అతనికి లేదు. బదులు గా దేవుడు మరొకసారి నిన్ను పిలిస్తే, యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుకు నేర్పించాడు. ఇంతకంటే మంచి సలహా ఏమన్నా ఉందా?

సమూయేలుకు దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఏలికి తెలియదు. ఏలిని కాదని సమూయేలుతో మాట్లాడడం ఏలికి అవమానం. కాని దేవుడు నీతో ఏమి చెప్పినను వినుటకు సిద్ధముగా ఉండుమని ఏలి సమూయేలుకు చెప్పాడు. అప్పటివకు దేవుడు తన పితరులతో మాట్లాడాడని కధలుగా వినియున్న సమూయేలు ఇప్పుడు తాను ముమ్మారు దేవుని స్వరమును వినియున్నానని తన గురువు గారి ద్వారా తెలుసుకొనగానే, భయపడి ఉండొచ్చు, ఏలి ఏమి చెప్తున్నాడంటే, సమూయేలు దేవుడు నీతో మాట్లాడబో తున్నాడు, ఆయన మళ్ళి నిన్ను పిలుస్తాడు, సిద్ధముగా వుండు. ఈసారి ఆయన నీ పేరును పిలవ గానే,  యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని చెప్పాడు. అంతేగాని సమూయేలు పద నేను నీతో ఉంటాను, దేవుడు పిలిస్తే మాట్లాడదాం అని ఏలి అనలేదు. ఏలి దేవుడు సమూయేలును పిలుస్తున్నాడని గుర్తుపట్ట గానే, దేవుడు సమూయేలును ఎన్నుకొన్నాడని ఏలికి అర్ధమయ్యింది. సమూయేలు దేవుని ప్రజలకు కొత్త నాయకునిగా ఎన్నుకోబడ్డాడని అర్ధం అయ్యింది. కాబట్టే ఎన్నుకోబడిన క్రొత్త నాయకునితో ఏలి, యెహోవా, నీ దాసుడు ఆలకించుచు న్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని చెప్పాడు. తన పిల్లల విషయములో తప్పిపోయిన ఏలి సమూయేలు విషయానికి వచ్చేటప్ప టికి సమూయేలును చక్కగా నాయకత్వపు పిలుపును అందుకోవడానికి సిద్ధపరచడం గొప్ప విషయం.

ప్రియమైన దేవుని బిడ్డ ఒక క్రైస్తవ ప్రోత్సాహకునిగా దేవునిచేత పరిచర్య కొరకు ఎన్నుకోబడిన వారిని మీ అనుభవముతో, తలాంతులతో ప్రోత్సహించండి.

దేవుడు తనతో మాట్లాడబోతున్నాడు అని తెలుసుకొన్న సమూయేలు ఎంత జాగ్రత్తగా భయభక్తులతో ఉండి ఉంటాడో కదా, ఇప్పుడు ఏలి నుండి తిరిగి తన స్థలము దగ్గరకు వెళ్లిన సమూయేలు, దేవుని ప్రత్యక్షతను పొందుకోబోతున్న ఆ గడియ కొరకు సిద్దపడి శ్రద్ధగల చెవులు, శ్రద్ధగల/గౌరవప్రదమైన వైఖరితో, ఎదురు చూస్తున్నాడు. దేవుడు చెప్పబోయే దానిని స్వీకరించుటకు, అది ఏదైనా కావొచ్చు.

దేవుని వాక్యమును ఆలకించుటకు సమీపించు దేవుని బిడ్డ యొక్క వైఖరి కూడా ఇలానే ఉండాలి. అతడు ప్రభువు దేనినైతే ప్రత్యక్షపరచబోవుచున్నాడో దానిని స్వీకరించుటకు అతడు సన్నధ్ధుడై యుండాలి. గద్ధింపయితే సరిదిద్దుకోవడానికి, మార్చు కోవడానికి సన్నధ్ధులమై ఉండాలి. దీవెనైతే స్వీకరించడానికి, దేవుని చిత్తములో ఒదిగిపోవడానికి సన్నధ్ధులమై ఉండాలి. ఇది అంత సులభము కాదు. మన పాఠములోని ఇశ్రాయేలీయుల వైఖరి, హొప్ని ఫీనెహాసుల స్వభావాలు, ఏలి పాత్ర, ఈ పాత్రల స్వభావములు వాళ్ళు చేసిన పొరపాట్లు మనం కూడా చేస్తూ ఉన్నాం. అలా చెయ్యటం ద్వారా మనకు కలుగుతున్న నష్టాన్ని దేవుడు మన పాఠము ద్వారా మనకు బయలుపరచి మనలను గద్ధిస్తూవుంటే సరిదిద్దుకోవలసి ఉన్నాం. దేవుని ప్రత్యక్షతను పొందుకోబోతున్న ఆ గడియ కొరకు సిద్దపడి ఎదురు చూస్తు దేవుడు చెప్పబోయే దానిని ఆలకించుటకు సిద్ధముగా ఉందాం, అది ఏదైనా కావొచ్చు. దేవుని పక్షమున దేవుని బిడ్డగా ఉంటే క్రీస్తు ద్వారా నిత్య జీవము, లేదంటే నరకమే.     

3

దేవుని స్వరాన్ని గుర్తించే దేవుని బిడ్డ ఆయన చెప్పే దానిని స్వీకరిస్తాడు. 10 వచనాన్ని చదువుకొందాం: 10తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా–సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలు–నీ దాసుడు ఆలకించుచు న్నాడు ఆజ్ఞయిమ్మనెను. ఈ మాటలలో సమూయేలు ఏమి చెప్తున్నాడో తెలుసా, దేవా చెప్పండి, మీరు చెప్పినట్లు నేను చేస్తాను అని చెప్తున్నాడు. అది ఏదైనా సరే.

సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ సమయాన్ని పోగొట్టుకొకూడదు అనుకోని, నన్ను దీవించు, నాకు ఈది ఇయ్యు అది ఇయ్యు అని అడగలేదు. ఈ ధన్యత మళ్ళి నాకు రాదేమో అని అనుకోని, తన ఇష్టాలను బట్టి దేవునిని ఏమి కోరుకో లేదు. దేవా ఆజ్ఞ ఇవ్వండి, అంటే దేవా నన్ను ఏమి చెయ్యమంటారో చెప్పండి నేను అలా చేస్తాను, అది ఎంత కష్టమైనను అని సమూయేలు చెప్పాడు. మనమైతే ఇలా చెప్ప గలమా? చెప్పలేము. ఇప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమైతే, నువ్వు ఇలా చెప్పగలవా? 

దేవుడు మాట్లాడుతుండగా దేవుని బిడ్డలైన వాళ్ళు ఎలా స్పందించాలో, సమూయేలు మన పాఠములో మనకు స్పష్టముగా తెలియచేస్తూవున్నాడు. ఈ రోజులలో దేవుడు తన వాక్యము ద్వారా మనతోను లోకముతోను మాట్లాడుతుండగా, దేవుని నీతి శాస్త్రమును బట్టి మనుషులందరూ పాపులని దేవుని ఉగ్రతకు పాత్రులని, నరకమునకు శిక్షార్హులమని తెలియజేస్తూ తన కుమారుడైన క్రీస్తు ద్వారా క్షమాపణను పుచ్చుకొనవలెనని అందరిని ఆహ్వానిస్తూ క్షమాపణను పుచ్చుకొనిన వారందరు క్రీస్తును బట్టి నిత్యజీవమునకు వారసులని తెలియజేస్తూ అందుకు తగ్గట్లుగా అనుదినమును మనమందరము దేవుని వాక్యమును బట్టి సరిచూసుకొంటూ మార్చుకోవలెనని చెప్తూవుండగా, సమూయేలు వలే నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మని చెప్ధ్ధాం. దేవుడు మనకు చెప్తున్నట్లుగా చేద్దాం, ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.