పాత నిబంధన పాఠము: యోనా 3:1-5,10; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 7:29-31; సువార్త పాఠము: మార్కు 1:14-20; కీర్తన 62.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: యోనా 3:1-5,10

యోనా 3:1-5,10_1అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 2–నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. 3కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవునిదృష్టికి గొప్పదై మూడుదినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము. 4యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు–ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగు నని ప్రకటనచేయగా 5నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాస ముంచి ఉపవాసదినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. 10ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.

యోనా గురించి ఎవరినైనా అడిగామనుకోండి, వెంటనే యోనా ఒక పెద్ద చేప అని కథ చెప్పేస్తారు, అంత సుపరిచితమైనది యోనా కథ. ఇది కాకుండా యోనా గురించి ప్రత్యేకంగా ఏమన్నా చెప్తారా? దేవుని వాక్యాన్ని తన శత్రువులకు ప్రకటిoచడానికి ఇష్టపడని ఒక ప్రవక్త, యోనా, కదా? దేవుడు ఒక పని అప్పగించి వెళ్ళమంటే తప్పించుకొని పారిపోతున్న ప్రవక్త అవిధేయుని గా కనబడుతున్నాడు. ఇంకా అవివేకముగా దేవుని నుండి పారిపోవాలనుకొన్నాడు. యోనా తన సొంత అభిప్రాయాలను సొంత దృక్పదాన్నికలిగి ఉన్నాడు, దేవునిని ప్రశ్నించే తత్వాన్ని దేవునితో విభేదించే తత్వాన్ని తొందరగా కోపాన్ని వ్యక్తపరిచే తత్వాన్ని మనం యోనాలో చూడొచ్చు. ఇలాంటి ప్రవక్తను దేవుడు తాను పంపాలనుకొన్న చోటికి పంపడమే కాకుండా, ఆ ప్రజలను గురించి అప్పటికే ఒక సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండి అతి క్రూరులైన ఈ ప్రజలకు దేవుని క్షమాపణను ప్రకటించుటకు ఇష్టపడని వ్యక్తిని, ఆ ప్రజల దగ్గరకు పంపి అతని ద్వారా నీనెవె పట్టణ ప్రజలను పశ్చత్తాపము నకు నడిపియున్నాడు.

నినెవె విషయానికి వస్తే, నినెవె అస్సిరియన్ సామ్రాజ్యానికి రాజధాని. క్రీస్తుకు ఎనిమిది శతాబ్దాల ముందు, అస్సిరియన్ సామ్రాజ్యం మధ్యప్రాచ్యంలో ఆధిపత్య శక్తిగా ఉండేది. యోనా కాలంలో అస్సిరియన్ సామ్రాజ్యం పొరుగు దేశాలను  జయించి, విస్తరిస్తు ఉన్నారు. చరిత్ర అస్సిరియన్లు అతి క్రూరులు అని చెప్తూవుంది. అస్సిరియన్లు వారి గొప్ప ప్రభుత్వ వ్యవస్థతో లేదా వారి ఉన్నతమైన సంస్కృతితో వాళ్ళు విస్తరించలేదు. వాళ్ళ క్రూరత్వమును బట్టి వాళ్ళు ప్రసిద్ది చెందారు, విస్తరించారు. వాళ్ళు తమ శత్రువులను, వారు జయించిన ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపేసేవాళ్ళు, వాళ్ళ చర్మాలను వలి చేసేవాళ్ళు. కొందరిని వికలాంగులుగా మార్చేవాళ్ళు. తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించిన దేశద్రోహులకు వారు చేసిన భయంకరమైన విషయాలు చరిత్ర పుస్తకాలలో నమోదు చేయబడియున్నాయి. ఈ అస్సీరియన్లు ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నారు. ఇలాంటి అతి క్రూరమైన ప్రజల దగ్గరకు వెళ్లి వారి మధ్యలో సేవ చెయ్యమంటే మీరు వెళ్తారా? 

సర్వ లోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనే ఆజ్జ్య మనకందరకూ ఇవ్వబడింది. ఈ ఆజ్జ్యను బట్టి మనం మన శత్రువులకు మిత్రులకు ప్రతిఒక్కరికి దేవుని వాక్యమును ప్రకటించవలసి ఉన్నాం. కాని యోనా వలె ప్రజలఫై మన కున్న సొంత నిర్ణయము దృక్పధమును బట్టి దేవుని క్షమాపణను ప్రకటించు టకు ఇష్టపడక, మేము చెప్తే వినరండి, మేమేమి యోనా కాదు, అద్భుతము జరగడానికి అని చెప్తుంటాము? ఇలా చెప్పడంలో నేను నీ పనిని ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న కూడా ఉందండి. అసలు మనము దేవుని పనిని ఎందుకు చెయ్యవలసి ఉన్నామో తెలుసుకొందాం.

దేవుడు మనకు ఒక పని చెప్పాడు, ఆ పనిని మనము ఎందుకని చెయ్యవలసి ఉన్నాం?

  1. దేవుడు మనకు ఆజ్జ్యాపించి ఉన్నాడు కాబట్టి, ఆయన చెప్పిన పనిని చెయ్యవలసి ఉన్నాం. 1,2
  2. దేవుడు ప్రకటించుమని చెప్పిన దేవుని ప్రేమను, తీర్పును ప్రకటించవలసి ఉన్నాం. 3-5
  3. దేవుని క్షమాపణను వెదుకునట్లు ప్రజలను ప్రోత్సహిద్దాం. 10

1

మన పాఠములోని 1 వచనాన్ని చదువుకొందాం: అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా, ఈ మాటలు ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తూవున్నాయి. అట్లే అసౌకర్యాన్ని కూడా కలిగిస్తున్నాయి.

అంటే మొదటిమారు యెహోవా యోనాతో మాట్లాడియున్నాడని ఇప్పుడు రెండవమారు మాట్లాడుతున్నాడని అర్ధం. మొదటి మారు యెహోవా యోనాతో నీవు నీనెవెకు వెళ్లి సువార్తను బోధించుమని చెప్పాడు. దానికి యోనా ఏ విధముగా స్పందించాడో మనకు తెలుసు. యోనా దేవుడు చెప్పినట్లు చెయ్యకుండా తప్పించు కోవడమే పరిష్కారమనుకొని నీనెవెకు వెళ్లకుండా తర్కిషుకు వెళ్లే ఓడ ఎక్కాడు. ఆ ప్రయాణములో తనతో ఉన్నవారందరి మీదికి ఒక భయంకరమైన అనుభవాన్ని తెచ్చాడు, అతి త్రీవ్రమైన తూఫాను రూపములో. అప్పుడు యోనా తప్పించుకోవడం పరిష్కారము కాదు అని తెలుసు కొన్నాడు. చేసిన తప్పుకు ప్రతిఫలంగా తనను సముద్రములో పడవేయమని అతడు అడిగినప్పుడు వాళ్ళు యోనాను సముద్రములో పడ వేయడం, ఒక పెద్ద చేప యోనాను మింగివేయడం, మూడు రోజుల తర్వాత ఆ చేప యోనాను నీనెవె ఒడ్డున కక్కి వేయడం మనకు తెలుసు. దేవుడు ఒక పనిని చెప్పినప్పుడు నో చెప్పకుండా తప్పించుకోవడమే పరిష్కార మనుకొన్నాడు యోనా. అందును బట్టి ఒక కఠినమైన పాఠాన్ని నేర్చుకొన్నాడు, పాఠము ముగిసిన వెంటనే యోనా ఎక్కడ ఉన్నాడో తెలుసా, నీనెవె ఒడ్డున. రెండవసారి యెహోవా యోనాకు అవకాశమిస్తూ, అంటే రెండవసారి యోనానే తిరిగి ఆ పనికి నియమిస్తూ, మొదటి సారి చెప్పిన మాటలనే మళ్ళీ చెప్పాడు.

యోనా నువ్వే కరెక్ట్, నీనెవె పట్టణములో నా పని చెయ్యడానికి నువ్వు కరెక్ట్ కాదు, లేకపోతే ఈ పాపులైన ప్రజలు నీ మాటలు వినరు నువ్వు వీరి మధ్యలో పనిచేయ వద్దులే అని చెప్పలేదండి. నీవు లేచి నీనెవె మహాపురము నకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము అని చెప్పాడు. దేవుడు కాదు అనే జవాబును ఏ మాత్రం తీసుకోడని మనము తప్పించుకోవాలనుకొన్నను దేవుడు ఒప్పుకోడని, మనము ఆయనతో వాదులాడినను ఆయన వినడని, ఆయన తన మనసును ఏ మాత్రమును మార్చుకోడని ఈ వచనము తెలియజేస్తూ వుంది. అంతేగాని నా పని చెయ్యమని నిన్ను వత్తిడి చేసివుండకూడదు అని దేవుడు యోనాతో చెప్తాడని అనుకోన్నారా? ఇక్కడ దేవుడు మళ్ళీ స్పష్టముగా ఆ రోజులలో క్రూరత్వానికి చిహ్నంగా ఉండే నీనెవెకు నీవు లేచి వెళ్ళుమని చెప్తూ అక్కడికి వెళ్లి ఏమి చెయ్యాలో కూడా తెలియజేస్తూ నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యి అని యోనాకు దేవుడు ఆజ్జ్యపించాడు.

ఈ రోజు మీరు లేచి వెళ్ళండి ప్రకటన చెయ్యండి అనేది మన దేవుడు మనకు ఇచ్చిన ఆజ్జ్య. మనకు నిర్ణయ కాలమును మన నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచిన దేవుడు, ఆ పొలిమేరలలో ఉన్న వారందరికి సువార్తను ప్రకటించు మని మనకు చెప్తూ ఉన్నాడు. రక్షణను గూర్చిన వర్తమానాన్ని ఇతరులతో పంచుకోవడం దేవుని చిత్తమై యున్నది. ప్రజల దోషములు దేవుని దృష్టికి ఘోరముగా ఉన్నాయని వాటిని బట్టి మనుష్యులకు దుర్గతి కలుగుతుందని మనం కూడా ప్రకటించాలనేదే దేవుని చిత్తము.

కాని మనమేమో దేవుని చిత్తమును ప్రకటించుటకు బదులుగా సాకులు చెప్తూ ఉన్నాము. సువార్తను ప్రకటిం చడం వలన కలిగే ఇబ్బందులను బట్టి తప్పించుకొంటూవున్నాము. ఈ సాకులు, తప్పించుకోవడములో కొన్ని ప్రశ్నలు వున్నాయి _ఎప్పుడైనా ఆలోచించారా?

మనం దేవునితో ఏమి చెప్తున్నామంటే, ఈ పనికి నేను కరెక్ట్ కాదు వేరొకరిని చూసుకోండి, ఈ పని నాకు రాదు నేను చెయ్యను. నా టైంనిగాని ధనాన్నిగాని శ్రమనుగాని ఇవ్వలేను వీళ్ళందరికీ నేను ఎందుకని సువార్తను చెప్పాలి? నాకు ఇష్టం లేదంతే అని చెప్తూ ఉన్నాము? మంచిదంటారా? యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను అని మన పాఠము చెప్తున్నట్లుగా మనము కూడా దేవుని చిత్తమును ప్రకటించుటకు ఆయన మనకు తెలియజేసిన సమాచారమును  ప్రజలకు ప్రకటిద్దాం. 

2

నీనెవె ఇశ్రాయేలుకు 600 మైళ్ళ దూరాన్న ఉంది. ఇప్పుడు యోనా లేచి యెహోవా మాటకు విధేయుడై భూమార్గాన్న ప్రయాణిస్తూ నీనెవెకు వెళ్ళాడు.  (25 రోజులు ప్రయాణము).

యోనా విధేయతను బట్టి ఒక్క క్షణము ఆలోచిద్దాం. గొప్పతుపానులో ఓడలో క్రింద నిద్రపోతున్న యోనాను నిద్రలేపి పైకి తెచ్చారు. అప్పుడు యోనా నన్నుబట్టే యీ గొప్పతుపాను మీ మీదికి వచ్చిందని నాకు అర్ధమ య్యింది; నన్నుఎత్తి సముద్ర ములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పాడు, గుర్తుందా? అలా కాకుండా, యోనానే సముద్రములోనికి గెంతి ఉండొచ్చుకదా. గెంత లేదే? అంటే తూఫాను ద్వారా యోనా గద్దిoపబడినప్పుడు, అతడు తన అవిధేయత అనే పాపమును బట్టి పశ్చాత్తప్తుడై, ఈ పాపమును బట్టి అందుకు శిక్షగా నన్ను సముద్రములోనికి పడవేయుడి, మిగతాది నా దేవుని చిత్తము, అని దృఢచిత్తముతో తన విధేయతను నిబద్ధతను తెలియజేసి ఉన్నాడు. అదే నిబద్దతతో విధేయు డై యోనా నీనెవెకు వెళ్ళాడు. ఇక్కడ విధేయత అంటే _ ఎలాంటి సంకోచం, ధిక్కరించడం, పారిపోయే ఆలోచన లేకుండా యోనా నీనెవెకు వెళ్ల్లాడు. అంటే, తనను క్షమించిన దేవుని దయను బట్టి, కృతజ్జ్యతతో, అతనికి ప్రభువుపై గల నమ్మకాన్ని యెహోవా పునరుద్ధరించినందుకు గాను తేలికపాటి హృదయపూర్వక హృదయంతో నీనెవె వైపు నడచివుంటాడని నేను అనుకుంటున్నాను.

నీనెవె పట్టణము దేవునిదృష్టికి గొప్పదై మూడుదినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము. నీనెవె మహాపురము_ ఆ రోజులలో 500000 ప్రజలు ఈ పట్టణములో వుండే వాళ్ళు. 100 అడుగుల కోట గోడలు, దానిపై 3 రథాలు వెళ్ళేవి, ఆ రోజులలో అది సూపర్ పవర్ కాబట్టి మహా సేన ఆ పట్టణములో ఉండేది. ప్రజలు దానిని సురక్షితమని అనుకునే వాళ్ళు.  నీనెవె పట్టణాన్ని ఈనాటి న్యూయార్క్ లేక లండన్ మహా నగరాలతో పోల్చ వచ్చు. దీని గొప్పతన్నాని ఊహించుకోండి.

యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతదూరము సంచరించుచు–ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని (దేవుని తీర్పును నాశనాన్ని) ప్రకటన చేసాడు. ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునను మాటలలో సువార్త ఉంది ధర్మశాస్త్రము ఉంది. ఇక నలువది దినములకు అనేది సువార్త. నాశనము అనేది ధర్మశాస్త్రము. యోనా నాశనము అనే మాట ద్వారా వారిని హెచ్చరించడమే కాకుండా ఆ నాశనమును తప్పించుకోమని చెప్తూ మీకు 40 రోజులు మాత్రమే ఉన్నాయని వారిని ప్రోత్సహించాడు

ఈ 40 రోజులు మీకు కృపాకాలమని ప్రజలు వారి జీవితములను, జీవిత విధానములను, సామజిక అంశములను, రాజకీయ, పాలనా పద్దతులను, వైవిధ్యమైన అంశములను బట్టి పరిశీలించుకుని పశ్చత్తాపపడి క్షమాపణ కొరకు యెహోవాను ఆశ్రయించుడి అని యోనా ప్రజలను హెచ్చరించాడు. లేని యెడల నాశనము అని చెప్తున్నాడు.

నాశనము అనే మాట ద్వారా యోనా ఏమి చెప్తున్నాడంటే, అతడు దేవుని ధర్మశాస్త్రాన్ని సరళంగా సూటిగా ఎలాంటి పరిమితులు లేకుండ ప్రకటించాడు. దేవుడు పాపాన్ని సహించడు తన కోపముతో శాశ్వతమైన తీర్పుతో శిక్షిస్తాడు అని తెలియజేసాడు. ధర్మశాస్త్రము యొక్క త్రీవ్రతను గ్రహించినప్పుడే పాపి నిజముగా పాపమును బట్టి దుఃఖిస్తూ పశ్చాత్తాపపడి క్షమాపణను వెదుకుతాడు.  ధర్మశాస్త్రము ఎలాంటి ప్రభావమును చూపెట్టిందంటే _నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొన్నారు. ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునను చిన్న ప్రసంగానికి 500000 మంది పశ్చాత్తాపపడ్డారు. ఇలాంటి అద్భుతానికి పరిశుద్దాత్ముడే కారణమని చెపొచ్చు. దేవుని దయకు స్పష్టమైన సాక్ష్యాన్ని చూడండి.  

ఇక్కడ మనము గమనించవలసిన మరొక విషయము_ నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముం చారు తప్ప యోనాను నమ్మలేదు. అంటే వాళ్ళు యోనాను దేవుని నోటి బురగా మాత్రమే గుర్తించారు. అలాగే  యోనా ప్రజలను తన వైపుకు త్రిప్పుకోలేదండి. యోనా తాను ప్రకటిస్తున్న మాటలను మాత్రమే హైలైట్ చేసాడు. గొప్ప ప్రసంగికునిగా యోనా ఎలాంటి క్రెడిట్ పొందలేడు.

అదే సమాచారాన్ని ఈ రోజు మనము కూడా ప్రకటించవలసియున్నాము. రాబోవుచున్న భయంకరమైన భయానకమైన తీర్పును గురించి ప్రజలను హెచ్చరించవలసియున్నాము. వారి పాపములలో కొనసాగుతున్న వారి మీదకి రాబోవుచున్న దేవుని ఉగ్రతను గూర్చి దేవుని తీర్పును గురించి ప్రజలను హెచ్చరించవలసి న్నాము. కానీ మనం హెచ్చరించం? ఎందుకంటే ఇలాంటి కఠినమైన మాటలు ప్రజలను ఉద్రిక్తపరచి కోపోద్రేకులనుగా చేస్తాయని ప్రజలను గాయపరచి ప్రజలను మననుండి దూరము చేస్తాయని అనుకొంటాము. ఎవరు ఇలాంటి మాటలను వినడానికి కోరుకోరు. ప్రకటించడానికి మనము కూడా కోరుకోము. మరి మీరు ప్రకటించకపోతే ప్రజలు పాపము క్రిందే ఉంటారు, వాళ్ళ జీవితాలను మార్చుకోరు, దేవుని ఉగ్రత క్రిందకు వస్తారు. రక్షకుని గురించి వాళ్లకు తెలియదు, ఆలోచించండి.

హెచ్చరించడమంటే_ ఒకడు రోడ్డు మీద నడుచుకొని వెళ్తూవుండగా, వెనుకనుండి స్పీడుగా ఒక కారు వస్తువుందనుకోండి. అప్పుడు మనం అతనిని ఎలా హెచ్చరిస్తాం? అతడు ఎవరన్నది పట్టించుకోకుండా గట్టిగా కేకవేసి అతనిని హెచ్చరిస్తాం ఆలా ప్రజలను దేవుని తీర్పుతో హెచ్చరించవలసియున్నాము.

3

ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.

తీర్పును గూర్చిన వర్తమానము ప్రజలను తీవ్రముగా నొచ్చుకొనేటట్లు చెయ్యడమే కాకుండా తాము పాపులమని దేవుని కృప అవసరమని గుర్తించేటట్లు చేసింది. వాళ్ళు మారుమనస్సు పొంది దేవుని వైపు తిరిగారు. వారి క్రియలను, వాళ్ళు తమ చెడు నడతలను మానుకొన్నారు. దేవుని సందేశాన్ని నమ్ముతూ, వారి అంతర్గత విశ్వాసానికి బాహ్య రుజువుగా తమ చెడు నడతలను మానుకున్నారు.

దేవుడు పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను. దేవుడు పశ్చాత్తాపపడ తాడా? 

దేవునికి పాపము లేదు, దేవుడు తప్పు చెయ్యడు. దేవుడు మనసు మార్చుకొంటాడా? బైబులు ఏమి చెప్తుందో చూద్దాం. సంఖ్యాకాండము 23:19 _ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? 1సమూయేలు 15:29_  మరియు ఇశ్రాయేలీయు లకు ఆధారమైనవాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు, అని చెప్తూ వుంది. 

మరి దేవుడు పశ్చాత్తప్తుడై అను మాటకు అర్థమేంటి? హీబ్రూ భాషలో పశ్చాత్తాపము అను మాటకు, దేవునికి సంబంధించి, 1. జాలి లేదా కరుణను కలిగివుండడం. 2. ఒకరి చర్యలను క్షమించడం, బాధపడటం, 3. ఓదార్చటం.  హీబ్రూ భాషలో పశ్చాత్తాపము అను మాటకు, మనుష్యులకు సంబంధించి, తిరిగి రావడం, లేదా వెన్నక్కి తిరగడం. దేవుడు పశ్చాత్తప్తుడై అను మాట మీకు అర్ధమయ్యిందనుకుంటున్నాను. దేవునిని చక్కగా  అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, ఇక్కడ మనిషి చర్యలలా దేవుని చర్యలను గురించి మాట్లాడుతున్నాడు తప్ప మరొక రకంగా కాదు.

యోనా వంటి ఫలితము వస్తాదని తెలిస్తేనే మనము దేవునిని గురించి మాట్లాడతాం. మనము కూడా అదే దేవునిని కలిగి యున్నాము. యెహెజ్కేలు 18:23, దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనుష్యులందరు సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని దేవుడు ఆశపడుతూవున్నాడు. దేవుని మాటలు నిరర్ధకముగా వెనుకకు మరలవని దేవుడు చెప్తూవున్నాడు. ఇక్కడ యోనా చూచినట్లుగా ఫలితాన్ని మీరు వెంటనే చూడలేకపోవచ్చు. మీ జీవితకాల మంతటిలో కూడా చూడలేక పోవొచ్చు. కాని ఆయన మాటలు జీవము గల మాటలు. 

దేవుని పని చెయ్యకుండా ఇంకను మనకు అడ్డుగా వున్నవి ఏంటి? ఎలాంటి సాకులు వద్దు, మన ప్రభువు మనకు ఇచ్చిన ఆజ్జ్యను ప్రకటించుటకు వర్తమానమును మనము కలిగియున్నాము. మన శ్రమలను ఆయన ఆశీర్వదిస్తాడను వాగ్దానాన్ని కూడా కలిగియున్నాము. క్రీస్తు యేసునందు ఉన్న దేవుని ప్రేమ మన ప్రభువు యొక్క కృపను గూర్చి ధైర్యమును కలిగించి ఆశీర్వదింపబడిన దేవుని మిషనరీలుగా మీఅందరిని చేయును గాక, ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.