పాత నిబంధన పాఠము: ద్వితీయోపదేశకాండము 18:15-20; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 8:1-13; సువార్త పాఠము: మార్కు 1:21-28; కీర్తన 1.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: ద్వితీయోపదేశకాండము 18:15-20

ద్వితీయోపదేశకాండము 18:15-20_ 15హోరేబులో ఆ సమాజదినమున నీవు–నేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, 16ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీమధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు విన వలెను. 17మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; 18వారి సహోదరులలో నుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించు నది యావత్తును అతడు వారితో చెప్పును. 19అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణచేసెదను. 20అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.

ఈ ఉదయం మన ముందు ఉన్న పాఠము ప్రవక్తయొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యతను గురించి చెప్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులతో నేరుగా మాట్లాడాలని ఇశ్రాయేలీయులు కోరుకోలేదు. అది చాలా భయపెట్టే విషయం. దేవుడు వారితో మాట్లాడగా విని వాళ్ళు భయపడ్డారు కాబట్టే వాళ్ళు దేవునికి వాళ్లకు మధ్యన ఒక మధ్యవర్తి ఉంటే బాగుంటుందనుకొని వాళ్ళు మోషేతో ఏమన్నారంటే, మోషే గారు మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇకను వినినయెడల చనిపోదుము. మీరే మా పక్షాన్న దేవుని దగ్గరకు వెళ్ళండి. ఆయనతో మీరు మాట్లాడండి. మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినండి. తిరిగి వచ్చి దేవుడు మాతో ఏమి చెప్పమన్నాడో మాకు చెప్పండి. మేము విని దాని గైకొందుమని చెప్పారు. దేవుడు అందుకు అంగీకరించాడు. ప్రవక్త యొక్క కార్యాలయం ఇక్కడే స్థాపించ బడింది. మోషే ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడగా మోషే ఆ మాటలను తీసుకొని వచ్చి ప్రజలకు దేవుడేం చెప్పమని చెప్పాడో ఉన్నది ఉన్నట్లుగా తెలియపర్చేవాడు. అట్లే ప్రజల మాటలను తిరిగి యెహోవాకు తెలియ చేసేవాడు. ప్రజలు కోరుకున్నది కూడా అదే.

నేటి మన పాఠము నిజమైన దేవుని ప్రవక్తలను గుర్తుపట్టేందుకు అవసరమైన కొన్ని గురుతులను చెప్తూఉంది. అవేంటో తెలుసుకొందాం.    

అంశము: ఒక ప్రవక్తను మనము ఎలా గుర్తుపట్టగలం?

  1. అతడు దేవుని చేత పంపబడి ఉండాలి, 15-18a
  2. అతడు ఖచ్చితముగా దేవుని మాటలనే చెప్పాలి, 19-22

1

ఇశ్రాయేలీయుల మనసులలో ఉన్న ఒక ప్రశ్నకు మోషే ఈ విధముగా జవాబు చెప్తున్నాడు,15-18 వచనాలను చదువుకుందాం: 15హోరేబులో ఆ సమాజదినమున నీవు–నేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, 16ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీమధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు విన వలెను. 17మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;౹ 18వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను.

మోషే వృద్దుడైపోయాడు, అట్లే అతడు వాగ్దాన దేశములోనికి ప్రవేశింపకూడదని దేవుని చేత ఆజ్ఞ్యాపింప బడ్డాడు. మోషే ఆ వాగ్దాన దేశపు బోర్డర్లో ఉండిపోతున్నాడు. అక్కడినుండి ప్రజలు మోషే లేకుండా ముందుకు వెళ్ళవలసి ఉన్నారు.

కాబట్టి ప్రజలు ఇప్పుడు మాకు మార్గదర్శిగా ఎవరుంటారు, మేము పాపము చేసినపుడు మా పక్షమున దేవుని దగ్గరకు ఎవరు వెళ్తారు? మా ఆత్మీయ అవసరతలను ఎవరు తీరుస్తారు? అని మధనపడుతూ సతమతమవుతూ ఉన్నారు.

దేవుని ధర్మశాస్త్రమును పుచ్చుకొనుటకు సమాజముగా ఇశ్రాయేలీయులు కూడుకొనిన రోజున దేవుని మహిమను మహత్వమును చూసిన ఇశ్రాయేలీయులు భయపడ్డారు. తమ పాప స్వభావమును బట్టి తమ అనర్హతను బట్టి అయోగ్యతను బట్టి భయపడి మోషేను వారి పక్షమున దేవుని దగ్గరకు వెళ్ళమని అడిగారు. గుర్తుంచుకోండి మనుష్యుల పాపము వారి అనర్హత అయోగ్యత దేవుని సన్నిధానంలో వారిని నిలబడ నివ్వదు.

అంతే కాదండి మరొక సమస్య కూడా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ప్రవేశింపబోచున్న క్రొత్తభూమిలో తప్పుడు ప్రవక్తలు, నిషేధించబడిన కళలను అభ్యసించే వారు ఉన్నారు, ఇదే అధ్యాయములో 18: 9-14 వచనాలలో వీటన్నిటిని గురించి చెప్పబడి ఉంది తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారి మధ్యలో జీవించబోవుచుండగా,  తప్పుడు ప్రవక్తలతో నిషేధించబడిన కళలను అభ్యసించే వారి మధ్యలో ఇశ్రాయేలీయులు దేవుని సందేశాన్ని ఎలా ఎవరి నుండి ఎదురుచూడొచ్చొ? వారిని ఎవరు పంపిస్తారు? లేదా ఇశ్రాయేలీయులు ప్రవక్తలను ఎన్నుకోవాలా? తప్పుడు ప్రవక్తలు నిషేధించబడిన కళలను ప్రదర్శించే వాళ్ళ మధ్యలో నిజమైన ప్రవక్తలను ఎలా గురుతు పట్టాలి? ప్రవక్తల సందేశానికి ప్రామాణికమేంటి? అనే ప్రశ్నలకు నేటి మన పాఠము జవాబునిస్తూ ఉంది. 15-18 వచనాలు అప్పటి ప్రజల ప్రశ్నలకు జవాబును ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో దేవునికి మనుష్యులకు మధ్యన అన్ని తరములలో ఉన్న వారందరి కొరకు శాశ్వత కాలముండు శాశ్వత ప్రవక్తను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాయి.

నీ దేవుడైన యెహోవా నీమధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును అను మోషే మాటలు ఏమి తెలియజేస్తూ ఉన్నాయంటే, మోషే తరువాత, ఇశ్రాయేలీయులు దిశానిర్దేశనం లేకుండా విడిచిపెట్టబడరని, ప్రజలు చింతించనవసరం లేదని మోషే తరువాత మోషే వంటి ప్రవక్తను దేవుడు పంపిస్తాడని అతడు  మోషేలా నమ్మకముగా ఆశీర్వాదకరముగా పరిచర్యను చేస్తాడని మోషే వారికి చెప్తూ ఉన్నాడు.

నావంటి ప్రవక్తను_ అంటే మన పాఠము ప్రత్యేకముగా అతడెలా ఉంటాడో చెప్పటం లేదు. నావంటి అంటే, ఈ ప్రవక్త కూడా దేవునిచేత పిలువబడతాడని, పిలుపుకు నమ్మకముగా ఉంటాడని, మోషేలా దేవుని మాటలను చెప్పింది చెప్పినట్లుగా  ప్రకటిస్తాడని అలాగే ఆ దేవుని మాటలకు ఇశ్రాయేలీయులు విధేయత చూపేలా ప్రోత్సహిస్తాడని అర్ధం.

ఈ మాటలలో ఒక హెచ్చరిక కూడా ఉంది. మోషే ఈ మాటల ద్వారా, ఇశ్రాయేలీయులారా మీరు ఒక ప్రవక్తను నిర్ణయించుకోకండీ, ఎన్నుకోకండి. వ్యక్తులారా మీకై మీరు ప్రవక్తలుగా ప్రత్యేకపరచుకోకండి. ఎందుకంటే ఇది దేవుని పని, దేవుడే తన ప్రవక్తను ఏర్పరచుకొంటాడు, మీ కొరకు పుట్టిస్తాడు అని చెప్తున్నాడు, అలాగే నీ మధ్య ను _ అంటే యెహోవా పుట్టించే ప్రవక్త నిబంధనా జనుల మధ్య నుండే వస్తాడు తప్ప అన్యులనుండి కాదని మోషే స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా ప్రవక్త స్వయముగా దేవుని చేత పంపబడిన వాడై యుండవలెనని మోషే తెలియజేస్తూ ఉన్నాడు.

ఎందుకనో తెలుసా? ప్రవక్తలు దేవుని సేవకులై యున్నారు, దేవుని వార్తాహరులైయున్నారు, దేవుని ప్రజలకు కావలివారై యున్నారు, కాబట్టి వీరిని దేవుడే ఏర్పరచుకోవలసియున్నాడని మోషే తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్త తన క్రియలు, స్వభావము, ప్రవర్తనలో దేవుని ధర్మశాస్త్రమును తెలియజేస్తూ దేవుని సేవకునిగా దేవుని ధర్మశాస్త్రము ద్వారా ప్రజలను గద్దిస్తూ, దేవుని వార్తాహరునిగా దేవుని ప్రత్యక్షతలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు కాపలాదారునిగా వారిని నిత్యము గమనిస్తూ మెలకువతో ఉండాలి. అట్లే ప్రజలను దేవునికి సమర్పిం చుకోమని చెప్తూ ఆయనను వెంబడించుమని ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రతి విషయము దేవునికి రిపోర్ట్ చెయ్యాలి. నిత్యము ప్రజల తరఫున దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి. కఠినములైనను దేవుని మాటలను ప్రజలకు తూచా తప్పకుండ తెలియజేయాలి. కాబట్టే ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి అని బైబులు చెప్తూఉంది. అందుకేనేమో సంప్రదాయము ప్రవక్తలను దేవునిని మోసేవారిగా అభివర్ణించింది. అంటే ఒకసారి పైకి ఎత్తుకున్న దేవునిని వీళ్ళు ఎట్టి పరిస్థితులలో క్రింద పెట్టకూడదు, మోస్తూనే ఉండాలి. ఇది సులభమైన పని కాదు. 

ఏ ప్రవక్త, సేవకుడు తాను సాతాను ద్వారా పంపబడియున్నానని చెప్పడు. మనమే ఇప్పుడు మాట్లాడుకున్న గుర్తుల ద్వారా తెలుసుకోవలసి ఉన్నాం.

దేవుడు తన కుమారుని ప్రవక్తగా మన వద్దకు పంపినప్పుడు, ఆయన అనేక గురుతులు ద్వారా చాల స్పష్టముగా ఆయనను గురించి తెలియజేసి ఉన్నాడు. ఆయన పని చెప్పబడింది, నిర్ధేశింపబడిన ఆయన లక్ష్యము వివరించబడింది, ఆయనను గూర్చిన ప్రతి విషయము ఆయన ప్రత్యేకతలు ప్రతిదీ కూడా దేవుడు స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు.

మరి ఈ రోజులలో ఆయన తన సంఘము ద్వారా సేవకులను తన పనికి పిలుచుకొంటూవున్నాడు. విశ్వాసులు ద్వారా తన చిత్తమును బయలుపరుస్తూ వున్నాడు. కాబట్టి పరిచర్యలో ఉన్న వ్యక్తి దేవుని సంఘము ద్వారా పిలువబడి యున్నాడా లేదా అనే విషయాన్ని చూడవలసి ఉన్నాం. ఇలాంటి పిలుపు లేకుండా ఈ రోజులలో అనేకులు తమ్మును తాము ప్రవక్తలుగా పిలుచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూవుంది, భయమేస్తూవుంది. ఎందుకంటే, యోహాను సువార్త 10:1లో గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు అని బైబులు స్పష్టముగా చెప్తూ ఉంది. అట్లే ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? అని రోమా 10:15 చెప్తూ ఉంది, అంటే దేవుని చేత పంపబడని వారు, పిలుపు లేని వాళ్ళు భోదించకూడదు అని దేవుని వాక్యము చాల స్పష్టముగా చెప్తూ ఉంది. 

కాబట్టి, ఆనాటి ఇశ్రాయేలీయులకు ఈనాటి విశ్వాసులైన మనకు ప్రవక్తలను నిజ సేవకులను వారి క్రియలు, స్వభావము, ప్రవర్తనలో దేవుని వాక్యము ప్రతిఫలించుచుండుటను బట్టి, వారి గుర్తులను బట్టి, వారి పిలుపును బట్టి గుర్తించండి అని మోషే మన పాఠము ద్వారా చెప్తూ ఉన్నాడు.  

2

18b అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. 19 అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణచేసెదను. 20 అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. 21 మరియు –ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనిన యెడల, 22 ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయినయెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు.

అట్లే యెహోవా తాను ఎవరినైతే ప్రవక్తగా పంపునో అతని నోట ఆయన తన మాటలను ఉంచునని మన పాఠము చాల స్పష్టముగా తెలియజేస్తూఉంది.  అంటే ప్రవక్త తన స్వంత అభిప్రాయములను చెప్పకూడదని తన జ్ఞానమును బట్టి మాట్లాడకూడదని అతడు దేవుని నోటి బూరగ మాత్రమే ఉంటాడని మన పాఠము స్పష్టముగా చెప్తూఉంది. అంతే కాదండి ప్రవక్త ద్వారా తాను చెప్పు దానిని విననొల్లని వారిని పిలిచి లెక్క అడుగుదునని యెహోవా చెప్పుచున్నాడు.

ద్వితీయోపదేశకాండము 13: 1,2 వచనాలలో ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచకక్రియ నైనను మహత్కార్యమునైనను చేసి 2నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన యెడల (శోధించిన యెడల) అతని మాటలను వినకూడదు అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపింపబడింది. ఇక్కడేమో ప్రవక్త ద్వారా తాను చెప్పు దానిని విననొల్లని వారిని పిలిచి లెక్క అడుగుదునని యెహోవా చెప్పుచున్నాడు. ఈ మాటలకు అర్థమేమిటి?

సూచక క్రియలు అద్భుతాలు ఒక ప్రవక్త  లేదా బోధకుడి భోదలు నిజమైనవని అనుటకు రుజువు కాదు. ఫరో యొక్క ఇంద్రజాలికులు యెహోవా మోషేకు ఇచ్చిన కొన్ని సూచనలను అనుకరించారు (నిర్గమకాండము 7:11, 22; 8: 7). అబద్ధపు ప్రవక్తలు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరని యేసు కూడా చెప్పాడు. (మత్తయి 24:24) కాబట్టి సూచక క్రియలు అద్భుతాలు ఒక ప్రవక్త, బోధకుడి భోదలు నిజమైనవని అనుటకు రుజువు కాదు జ్ఞాపకం పెట్టుకోండి.

ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన దానిని వినకపోవడమంటే ఆయనను అలక్ష్యము చెయ్యటం, నిర్లక్షం చెయ్య టం, అవిధేయత చూపడం, దేవునిని పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను ప్రేమించక పోవడం. అప్పుడు దేవునికి  విధేయులుగా ఉంటున్నట్లా లేక దేవుడు ఉండి కూడా వద్దకుని ఆయనకు అవిధేయులుగా ఉంటున్నట్లా? దేవుడు చెప్పిన దానిని వినకపోవడమంటే మనము కావాలనే కదా ఇలా చేస్తున్నాము కాబట్టే విచారణకు అర్హులం. కాబట్టే నేను విచారణ చేసెదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. భక్తిపరులంగా మన వేషాన్ని దేవుడు బయలు చేసి విచారణ చేస్తానని అంటున్నాడు. కాబట్టి  ప్రవక్త/ నిజ దేవుని సేవకుల యొక్క బోధ బైబులుతో ఏకీభవిస్తున్నాయా? లేదా అని మనం సరి చూసుకోవలసి ఉన్నాం.

21మరియు –ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనినయెడల, 22 ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయినయెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు అను మాటలు ప్రవక్త కచ్చితంగా సరియైన దానినే చెప్పాలి అని తెలియజేస్తూఉన్నాయి. ఈ మాటలు ప్రవక్త లేక దేవుని సేవకుడు మాట్లాడేవి నిజాలే, అందులో తప్పులేవి ఉండవు అని చెప్తున్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రవక్తలు దేవుని సేవకులు జాతకాలు చెప్పరు. 99 రైట్ చెప్పి ఒక్కటి తప్పు చెప్పిన వాళ్ళు ప్రవక్తలు కారు. ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను అబద్ధ ప్రవక్తలు అబద్ధ సేవకులు కనబరచెదరు అని నేను చెప్పటం లేదండి యేసే చెప్తున్నాడని జ్జ్యపాకం పెట్టుకోండి.

దేవునికి మనుష్యులకు మధ్యన అన్ని తరములలో ఉన్న వారందరి కొరకు శాశ్వత కాలముండు శాశ్వత ప్రవక్తను దేవుడు పంపియున్నాడు. ఆయన పేరే యేసు. ఆయన ద్వారా దేవుని యొద్దకు చేరే మార్గము అందరికొరకు తెరువబడియున్నది. మనము దేవుని సన్నిధానంలో దేవుని ముందు నిలబడుటకు ఇక భయపడనక్కర లేదు. ప్రతిఒక్కరు దేవుని సన్నిధానము లోనికి తమ విన్నపములను యేసు ద్వారా తీసుకొని వెళ్ళవచ్చు. ఆయన ద్వారా దేవుడు మీ విన్నపములకు జవాబును ఇస్తాడు. యేసు ద్వారా మీరు దేవునిని చేరినప్పుడు క్రీస్తుని బట్టి భయపడటానికి కారణం లేదు. అన్ని తరములలో ప్రజలందరికొరకు దేవుడు పంపియున్న యేసుని బట్టి దేవుడు మీఅందరికి నిశ్చయతను దయచేయును గాక. ఆమెన్. 

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.