పాత నిబంధన పాఠము: యోబు 7:1-7; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 9:16-23; సువార్త పాఠము: మార్కు 1:29-39; కీర్తన 103.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: యోబు 7:1-7

యోబు కధ మనకందరికీ బాగా తెలుసు. దేవుడు యోబును ఎంతగానో దీవించియున్నాడు. బైబులు యోబును గురించి చెప్తూ యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించిన వాడు అని సాక్ష్యమిస్తు ఉంది. దేవుడు యోబును గురించి చెప్తున్న మాటలను బట్టి, సాతాను, యోబు విషయములో దేవునిని సవాలు చెయ్యాలనుకున్నాడు. వాడు దేవుని దగ్గరకు వెళ్లి, దేవా మీరు యోబును ఎంతగానో ఆశీర్వదించియున్నారు కాబట్టే యోబు కృతజ్జ్యతగా మీయందు నమ్మికయుంచి యున్నాడు. మీ ఆశీర్వాదాలను తొలగించండి యోబుకు మీపై విశ్వాసము పోతుంది అని ఆరోపించాడు. దేవుడు సాతానును అనుమతించాడు. భయంకరమైన కష్టాలను సాతాను యోబు జీవితములోనికి తెచ్చాడు. అప్పుడు యోబు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదని బైబులు చెప్తూ ఉంది. అట్లే దేవుని పట్ల యోబుకున్న వైఖరి మారలేదు, అలాగే ఉంది. అప్పుడు రెండవసారి సాతాను దేవుని దగ్గరకు వెళ్లి దేవా మీరు యోబుకు మంచి ఆరోగ్యమిచ్చియున్నారు కాబట్టి అతడు మీ యందు నమ్మికయుంచి యున్నాడు. అతని ఆరోగ్యాన్ని ప్రమాదములో పెట్టండి. అతడు మిమ్మల్ని విడిచి పెట్టక పోతే చూడండి అని చెప్పగా దేవుడు యోబు ఆరోగ్యాన్ని సాతాను పాడుచేయుటకు అనుమతించి యున్నాడు. కాని దేవుని పట్ల యోబుకున్న వైఖరి మారలేదు, అలాగే ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యోబు‌కు ఇవేవీ తెలియదు. ఆ కష్టములో యోబు పోరాడుతూ, తాను నేర్చుకొనిన పాఠాలను మనకు తెలియజేస్తూవున్నాడు. అతని అనుభవాల నుండి, అతని మాటలలో ఉన్న వాస్తవాలను అతని ప్రార్ధనను నేర్చుకొందాం. మన పాఠము యొక్క ముఖ్య ఉద్దేశ్యముగా ప్రభువా నన్ను జ్జ్యపాకము చేసికొనుము, అను అంశమును ధ్యానించుకొందాం: 

ప్రభువా నన్ను జ్జ్యపాకము చేసికొనుము

  1. నేను దురదృష్టవంతుడను కాబట్టే ప్రభువా నన్ను జ్జ్యపాకము చేసికొనుము
  2. నేను దుర్బలుడను కాబట్టే ప్రభువా నన్ను జ్జ్యపాకము చేసికొనుము

1

యోబు 7:1-7_ 1భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? 2నీడను మిగుల నపేక్షించు దాసునివలెను కూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను 3ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి. 4నేను పండుకొనునప్పుడెల్ల –ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. 5నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడి యున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. 6నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి. 7నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.

ప్రశ్నతో యోబు మన పాఠాన్ని ప్రారంభిస్తూ, భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా? అని ప్రశ్నిస్తు వున్నాడు ఈ ప్రశ్నను గురించి ఆలోచిద్దాం. భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా? అంటే ఈ భూమి మీద జీవిస్తున్న క్షయులైన మనుష్యులు నిర్ణయింపబడిన తమ ఆయుర్దార్థములో (ప్రతి క్షణము) యుద్దము లోనే వున్నారని యోబు చెప్తూ వున్నాడు.

యుద్దానికి ఒక ఉద్దేశ్యముంటుంది. యుద్దానికి ఒక లక్ష్యముంటుంది. ఈ యుద్దములో మీ లక్ష్యము ఏంటి? మిమల్ని నిర్దేశిస్తున్న వాని ఉద్దేశ్యము ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? యుద్ధములోనికి ప్రవేశించియున్న మనం ఆ యుద్దములో ఎప్పుడైనా సరే శారీరికంగా గాయపడొచ్చు, మరణించవచ్చు, ప్రమాదములో పడొచ్చు, మరుక్షణములో మనకేమి జరుగబోతుందో మనకు తెలియదు. మన స్వాధీనములో లేని ఎన్నింటినో మనం చెయ్యవలసి ఉన్నాం. మనచుట్టూవున్న వాటి మీద మనకు ఎలాంటి అధికారము లేదు, అంతేనా ఏవి కూడా మనవి కావు. మన క్షణము వరకు మనం పోరాడవలసి ఉన్నాం. మనది కాని క్షణాన్న మనం మరణిస్తాం.

యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించిన వాడు అని దేవుడు చెప్తుంటే సాతాను లేదు ప్రభువా అతడు నా వాడు కావాలంటే నేను నిరూపిస్తా అని చెప్పి సాతాను యోబు జీవితాన్ని అతలాకుతలం చేసాడు. ఆ యుద్దములో యోబు ఆశ్రయదుర్గమైన యెహోవాను ఆశ్రయించాడు. నన్ను జ్జ్యపాకము చేసికొనుము ప్రభువా అనే ప్రార్ధనే ఆ యుద్దములో యోబుకు ఆయుధమ య్యింది. ఈ రోజు మీరు చేస్తున్న ఈ యుద్దములో మీరు కూడా యిదే ఆయుధాన్ని ఉపయోగించండి. ఈ ప్రార్ధనే మీ ఆయుధం కావాలి. ఈ బ్రతుకు పోరాటంలో ఎందరో తమ్మును తాము నమ్ముకొంటూ, అందులో భాగముగా వారి ఆయుధాలుగా, వారి నోటిని  బలమును బలగమును డబ్బును స్థితిని హొదను మరి ఎన్నింటినో నమ్ముకొంటున్నారు. అవేమి అక్కరలేదని తెలుసుకోండి. యోబు వీటిని గురించి మాట్లాడటం లేదు వీటిని ప్రదర్శించలేదు. తాను చేస్తున్న బ్రతుకు పోరాటంలో దేవుని పట్ల యోబుకున్న వైఖరి మారలేదు, అలాగే ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ దేవుని పట్ల మీ వైఖరి కూడా మారకూడదు.

అంతేనా భూమిమీద మనుష్యుల దినములు కూలివాని దినములవంటివి కావా? చెప్పండి అని అంటూ ఉన్నాడు. ఈ మాటలకు, ఆ యుద్దములో ఉన్న వారి దినములు కూలివాని దినములవంటివి కావా? అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే యుద్దానికి మనుష్యులు (సైన్యం) కావాలి. ఆ రోజులలో సైనికులుగా కొందరిని (కూలికి) కుదుర్చుకునే వాళ్ళు. కూలికి వీళ్ళు తమ ప్రాణాలను తమ అదృష్టాన్ని వాళ్ళ యజమానుల చేతులలో పెట్టి రోజంతా కఠినముగా యుద్ధము చెయ్యవలసి యున్నారు. వీరి అదృష్టం వీరిని కూలికి పెట్టుకున్న వారి చేతులలో ఉంటుంది. వీళ్ళు కూలికి కుదిరారు కాబట్టి మాములు సైనికుని కన్నా ఎక్కువగా కష్టపడవలసియున్నారు శ్రమపడి వలసియున్నారు. ఇంకా అధ్వానమైన విషయము ఏంటో తెలుసా, బానిసయైన కూలివానికి వేతనం కూడా ఉండదు. అతడు తన యజమానికి, యజమాని ఇష్టాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాడు. బానిసకు వేతనం ఉండదు కాబట్టి వాడు కష్టపడి పనిచేస్తూనేవుండాలి శ్రమపడుతూనే ఉండాలి.    

దాసులైన పనివాళ్ళు కష్టపడి పనిచేస్తూ శ్రమపడుతూ ఆ పనిలో వాళ్ళు నీడను మిగుల నపేక్షిస్తూవుంటారు. అదే వాళ్ళకి దొరికే వేతనం. అదే వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించేది. అలాంటి చిన్న సంతోషము కొరకు యోబు ఎదురు చూస్తూ వున్నానని చెప్తూవున్నాడు. పాపము ఈ లోకమునకు తెచ్చిన దుస్థితిని యోబు ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడో చూడండి. పనిచేసిన తర్వాత ఆ రోజు చివరిలో కూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలె నేను ఉన్నప్పటికినీ అటువంటి ఆశ లేని నెలలను నేను చూడవలసివచ్చెను అని అంటూ, అందుకు కారణాన్ని తెలియజేస్తూ, ఆయాసముతోకూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి అను మాటల ద్వారా వివరణను ఇస్తూ ఉన్నాడు. నియమింపబడియున్నవి_ అను మాటకు అర్ధం_ ఆదాము హవ్వలు పాపము చేసి తమ పైకి శాపమును తెచ్చుకొనుటే గాక మనుష్యులందరు పైకి తెచ్చారు. ఆ కారణముగా పాపమును బట్టి కష్టాలు భాదలు అందరి జీవితములో ఒక భాగమై ఉన్నాయి. నియమింపబడెను అను మాటలలో ఈ భావము నిక్షిప్తమై ఉన్నది. పాపమును బట్టి అందరికి సంప్రాప్తమైయున్న కష్టము భాదలు రోగాలు నా జీవితములో కూడా ఉన్నాయని వాటికీ నేనేమి అతీతుడను కాను అని చెప్తూ ఉదాహరణగా తన శారీరిక పరిస్థితిని 5వ వచనంలో వివరిస్తూ పాపము మనిషి జీవితాన్ని ఎంత దుర్లభము చేసిందో వివరణాత్మకంగా చెప్తూ తన ఆరోగ్య పరిస్థితిని పేర్కొన్నాడు. కాబట్టే ఒక విశ్వాసిగా అంత కష్టములొ కూడా  యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు చెప్పగలిగాడు.

6,7 వచనాలు యోబు జీవితములో సంతోషాన్ని తెచ్చేవిగాని ఇచ్చేవి గాని ఏవి లేవని అట్లే అతని జీవితము వడిగా గతించి పోవుచున్నదని దానిని బట్టి నేను ఏమి చెయ్యలేకున్నానని యోబు చెప్తూ ఉన్నాడు. అంతేకాదండి  నిరీక్షణ ఉంచుటకు ఈ లోకములో ఏది లేదు కాబట్టే నా దినములు నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి అని కూడా యోబు చెప్తూ నేను దురదృష్టవంతుడను కాబట్టే ప్రభువా నన్ను జ్జ్యపాకము చేసికొనుము, అని ప్రార్థిస్తూ ఉన్నాడు.

1-7 వచనాలను మనకు అన్వయించుకొందాం:  మనమందరం కూడా పాపమును బట్టి యుద్దములో ఉన్నాం. ప్రతి రోజు పోరాడుతూనే ఉన్నాం, ఈ యుద్దములో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, ఎవరు ఎటువైపు నుండి మన మీద పడతారో, ప్రమాదం ఎటునుంచి మనమీదకి వస్తుందో తెలియదు. అంతేనా ఈ యుద్ధము దాని తంత్రములో భాగముగా కష్టాలు, కన్నీరు, అసమాధానకరమైన పరిస్థితులు, రోగాలు, నిందలు, భాదలు, ఇబ్బందులు, ఇలా ఎన్నింటినో ఎదుర్కొంటూ ఉన్నాం. ఇవన్నీ మనకు నిరాశను కలిగిస్తూ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడం అంత సులభము కాదు. వీటిని బట్టి మనం కూడా ఎన్నోసార్లు చనిపోతే బాగుణ్ణు అని అనుకున్నాం తప్ప పాపము ఇంత దుర్లభమైనదని ప్రతి కష్టానికి రోగానికి కారణమని దానిని నిందించకున్నాం? నీవున్న స్థితిలోనే నీ దేవుడైన నీ సృష్టి కర్తను ఆశ్రయించు. నీ బ్రతుకు పోరాటానికి అర్ధం తెలుసుకో.  

1-7 వచనాలలో నేర్చుకోవలసిన రెండు విషయాలున్నాయి_ అందరి జీవితాలలో సద్దినములు దుర్దినములు ఉంటాయని యోబు కధ చెప్తూవుంది. అయితే సాతాను మాత్రం దేవుని బిడ్డల జీవితాలలో సద్దినములు మాత్రమే ఉంటాయని, సద్దినములకు వాళ్ళు అర్హులని చెప్తూ వాళ్ళను వేరొక సువార్త లోనికి డైవర్ట్ చెయ్యడానికి వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు, జ్ఞాపకముంచుకోండి. కొందరు వాళ్ళు చేసిన పాపాలకు శిక్షగా కష్టాలను బాధలను అనుభవిస్తూవున్నామని అనుకొంటూ ఉంటారు. ఇటువంటి ఆలోచన లేక అబద్ధము సాతాను నుండే వస్తుంది. మనము చేసిన పాపములను బట్టి ఈ కష్టాలు మనం అనుభవిస్తూ వున్నామని ఈ కష్టాలను అనుభవించడం ద్వారా అవి తొలగిపోతాయని అనుకోవడం లేఖనానుసారము తప్పు. శ్రమపడుట ద్వారా మనము మన పాపాలను తొలగించుకోలేము. ఇటువంటి ఆలోచన క్రీస్తు యొక్క అర్పణ అవసరం లేదని చెప్తూ వుంది.

2

రెండవదిగా నేను దుర్బలుడను కాబట్టే ప్రభువా నన్ను జ్జ్యపాకము చేసికొనుము అని ప్రార్థిస్తూ బలమైన విశ్వాసమును నాకు  దయచేయుము తండ్రి అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన బహుమానంగా అనుగ్రహించు విశ్వాసం మాత్రమే తనలోనున్న నిరాశను తొలగించగలదు కాబట్టి.

ఇంత గొప్ప కష్టములొ నిరాశలో శ్రమలలో యోబు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? దేవునితో. ఇది చాల ప్రాముఖ్యమైన విషయము, జ్ఞాపకముంచుకోండి. కష్టాల ద్వారా ప్రజలను దేవుని నుండి తరిమి వేయడానికి అపవాది కష్టమును నిరాశను శ్రమలను ఉపయోగించుటకు కోరుకొంటాడు, కాని కష్టము నిరాశ శ్రమలు ఆయన బిడ్డలను ఆయనకు ఇంకా దగ్గర చెయ్యాలి తప్పితే వాటికి భయపడి ఆయనకు దూరం కాకూడదు.

మన దృష్టిని దేవుని పై ఉంచినప్పుడు దేవుడు ఎలా పని చేస్తున్నాడో అయన వాగ్దానాలను దేవుడు ఎలా నిలబెట్టుకొంటు న్నాడో మనం చూడగలం. మనము దేవుని వాగ్దానాలను చూసినప్పుడు, విశ్వాసం నిరాశను ఎలా తొలగిస్తుందో చూడొచ్చు. తప్ప నిరాశ ప్రేరేపిస్తున్న రీతిగా దేవునితో మాట్లాడకూడదు, నిరాశలో కృంగిపోకూడదు 7వ వచనంలో నా కన్ను ఇకను మేలు చూడదు అను మాటలు యోబు తాను మరణించ బోతున్నానని ఇకపై దేవుణ్ణి చూడలేనని దేవుడు తనను చూడలేడని అనుకొంటున్నాడు. మరణం నన్ను పెరుక్కొని పోతుంది గనుక ఇక తాను దేవునిని చూడలేడని అనుకొంటున్నాడు. నిరాశ అతనిని మాటలను ఎలా ప్రేరేపిస్తుందో చూడండి.

ఒక విశ్వాసి తీవ్ర వేదనకు గురైనప్పుడు, అతడు దేవుణ్ణి త్యజించాల్సిన అవసరం లేదు లేదా ఆయనను నిందించాల్సిన అవసరం లేదు, దేవునిని ప్రశ్నించండి కాని దేవునిని తృణీకరించకండి అని యోబు మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. యోబు అలా చేయటానికి దగ్గరగా వచ్చినప్పటికి, సాతాను ఎదురు చూచినట్లుగా యోబు దేవుణ్ణి త్యజించలేదు, నిందించ లేదు, తృణీకరించలేదు, దేవునికి దూరం కాలేదు.

 (3: 11-12, 16, 20) మనం ఎందుకు బాధపడుతున్నామో దేవునిని అడగడం తప్పుకాదని యోబు కథ నేర్పుతూ ఉంది. అట్లే మనం ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి (13:22; 19: 7; 31:15) దేవుడు జవాబు చెప్పాలని కోరడం తప్పు. ఒకరి బాధను దేవుడు వివరించాలని పట్టుబట్టడం సరికాదు ఎందుకంటే అది మనిషిని దేవునికి పైన ఉంచుతుంది మరియు దేవుని ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది.

సమస్తమును దేవుని నియంత్రణలో ఉన్నప్పటికినీ దేవుని బిడ్డలకు కష్టాలు ఎందుకు వస్తున్నాయని మనం ప్రశ్నిస్తూ వుంటాం. అలాగే దేవుడు సాతానును యోబు జీవితములోనికి అనుమతించడానికి దేవునికి ఇతర కారణాలు ఉండొచ్చు లేవని మనమెలా చెప్పగలం? యోబు ఈ అనుభవాల ద్వారా ఎదగాలని దేవుడు ఆశ పడ్డాడు.  చివరికి యోబు మరియు దేవునిపై అతనికున్న విశ్వాసం నిరూపించబడ్డాయి, దేవుడు మహిమ పరచబడ్డాడు.

ఈ పాపపు లోకములో కష్టాలు బాధలు సాధారణమే. యోబు పట్ల దేవునికొక ఉదేశ్యమున్నదని యోబుకు అర్ధం కాలేదు కాబట్టే యోబు దేవునిని ప్రశ్నించాడు. మనం కూడా కష్టాలు గుండా వెళ్తూ వున్నాం, అవి ఎందుకో మనకు అర్ధం కావు. కష్టాలు బాధలు రోగాలవల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి_ తెలుసా! మొదటిగా, 

  1. కష్టాలు బాధలు అనేవి కొన్నిసార్లు మనలను దేవునివైపు త్రిప్పడానికి దేవుని లౌడ్ స్పీకర్లుగా పని చేస్తుంటాయి.
  2. మరికొన్ని సమయాల్లో మనలను శుద్ధిచెయ్యడానికి బలపరచడానికి దేవుడు కష్టాలను బాధలను మన జీవితాలలోనికి  అనుమతిస్తూ ఉండొచ్చు.
  3. దేవుడు, కష్టాలు బాధలు ద్వారా, మనలను ఆయనతో సన్నిహిత సంబంధంలోకి పిలుస్తూ ఉండొచ్చు. 
  4. కొన్నిసార్లు దేవుడు మనలను ప్రపంచానికి సాక్షులుగా తీర్చిదిద్దడానికి సాక్ష్యమివ్వటానికి కష్టాలు బాధలను మన జీవితాలలోనికి అనుమతించివుండొచ్చు.
  5. దేవుని కృపగల ఉద్దేశ్యము నెరవేర్చబడుటకు కొన్నిసార్లు దేవుడు మన జీవితాలలోనికి కష్టాలను బాధలను అనుమతించి వుండొచ్చు.
  6. కొన్నిసార్లు దేవుడు మహిమ పర్చబడుటకు కష్టాలను బాధలను మన జీవితాలలోనికి అనుమతించి వుండొచ్చు.
  7. కొన్నిసార్లు మనము ఇతరులను ఓదార్చేందుకు సాధనములుగా ఉండేందుకై మన జీవితాలలోనికి కష్టాలను బాధలను దేవుడు అనుమతించివుండొచ్చు.

కష్టాలను బాధలను అర్ధం చేసుకోవడం కష్టం. మనమైతే మాకే ఎందుకు కష్టాలు అని అనుకొంటూ ఉంటాం. మీరు కష్టాలలో భాధలలో ఉంటూవుండగా, మీ దేవుడు పరలోకములో కూర్చుని కష్టాలలో భాధలలో ఉన్న మిమల్ని చూస్తూ ఊరకనే వుంటాడని మీరు అనుకుంటున్నారా? 

బాప్తీస్మం ద్వారా మీరు దేవునితో జతపర్చబడియున్నారని దేవునితో మీరు నిబంధనలో ఉన్నారనే విషయాన్ని తృణీకరించ కండి. ఈ కృపగల జీవపు నీళ్ల ద్వారా దేవుడు శాశ్వత జీవమును మీలోనికి ఊదియున్నాడనే విషయాన్ని మర్చిపోకండి. దేవుని బహుమానంగా దేవుడు సువార్త ద్వారా మీకు విశ్వాసాన్ని అనుగ్రహించియున్నాడనే విషయాన్ని జ్జ్యపకముంచుకోండి. దేవుని ఉద్దేశములో మలచుకోండి. దేవుని ఉద్దేశ్యములో ఒదిగిపోండి.

యోబు జీవితంలో కలవరపెట్టే సంఘటనలు దేవుని వాక్యంలో శాశ్వతత్వం కొరకు నమోదు చేయబడ్డాయి. భవిష్యత్ తరాల దేవుని ప్రజలు యోబును చూసి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి ఇవన్నీ గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి. యోబులో దేవుడు సృష్టించిన విశ్వాసాన్ని సాతాను నాశనం చేయలేకపోయాడు. యోబు విషయములో తాను చేసిన ఆరోపణలలో నిజం లేదని సాతాను చివరకు ఒప్పుకున్నాడు. మీ జీవితం ఎంత అనిశ్చితంగా మీకు అనిపించినా, ఒక్క విషయము మరచి పోకండి, సాతాను మీ రక్షకుడైన యేసు చేతిలో నుండి మిమల్ని బయటకు తీయలేడు అని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. అట్లే యేసులో మీకున్న విశ్వాసం మీలోనున్న నిరాశను తొలగించగలదనే విషయాన్నీ మరచిపోకండి.

ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని దేవుని వైపు తిరుగుటకు దేవుడు మిమ్మల్నందరిని నడిపించునుగాక. దేవుడు మీ కష్టములను బాధలను తీసివేసి ఆయన తన మహిమార్థమై మిమ్మల్నందరిని ఆశీర్వదించును గాక. ఆమెన్.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.