అన్యజనుల వ్యర్థమైన కుట్ర దేవుని రాజు యొక్క సురక్షితమైన పాలన
కీర్తన 2 అత్యంత ముఖ్యమైన మెస్సియానిక్ కీర్తనలలో ఒకటి. ఈ కీర్తనలో దావీదు మెస్సీయ రాజ్యము పట్ల ఈ లోక పాలకుల యొక్క వ్యర్థమైన ప్రతిఘటనను వివరించాడు.

అన్యజనుల వ్యర్థమైన కుట్ర 2:1-6
1అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? 2–మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు 3 భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయు చున్నారు.4 ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. 5 ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండకోపముచేత వారిని తల్లడింప జేయును 6–నేను నా పరిశుద్ధపర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.

దేవుని అభిషిక్త రాజుకు విరోధముగా భూరాజులు నిలువబడుటను చూచి కీర్తనాకారుడు ఇంతకంటే మూర్ఖత్వం లేదావెర్రితనం ఏమన్నావుంటుందా? అని ఆశ్చర్యపోతూవున్నాడు. ఎన్నో విషయాలలో  ఏకీభవించని ఈ దుష్ట లోక పాలకులు దేవుని పాలనను వ్యతిరేకించే విషయములో మాత్రం ఏకీభవిస్తూ వున్నారు. యేసు మరణానికి దారితీసిన ఆయన పై జరిగిన కుట్ర దేవుని రాజుకు వ్యతిరేకంగా జరిగిన పన్నాగానికి ప్రధాన ఉదాహరణ అని అపొస్తలుల కార్యములు 4:27 చెప్తూవుంది (నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి). పిలాతు హేరోదులు ఒకరినొకరు ద్వేషించుకున్నారు, కాని వారు యేసు విచారణలో సహకరించుకొన్నారు. పరిసయ్యులు సద్దూకయ్యులు బద్ధ శత్రువులు, కాని వారు యేసు మరణించాలి అనే విషయములో ఏకీభవించారు.

దేవుని పాలనను తృణీకరించడానికి ఎన్నో వ్యర్థమైన ప్రయత్నాలు చరిత్ర అంతటా కొనసాగుతూనే ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. “పాపసీ” (పోపు సంబంధీకులు) సంఘములో సత్యము వెల్లడికాకుండా ఉంచేందుకు ప్రయత్నించారు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు తమ దేశాలలో ఉన్న సంఘాన్ని ధ్వంసం చేసేందుకు కృషి చేస్తూవున్నాయి. ఇటువంటి ప్రయత్నాలన్నీ వ్యర్ధము, నిష్ఫలమైయున్నవి. బదులుగా, ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తూవున్నను సువార్త ప్రతి జనము నుండి దేవుడు ఎన్నుకున్న వారిని ప్రోగుచేస్తూ ముందుకు పోతూనే ఉంది.

కొన్నిసార్లు పైన పేర్కొన్న రక్తపాత హింసల కంటే దేవుని రాజుపై తిరుగుబాటు తక్కువ హింసాత్మకంగా ఉండొచ్చు. నేడు ప్రజలు దేవుని ధర్మశాస్త్రమును తృణీకరించినప్పుడల్లా, దేవుని చిత్తాన్ని ధిక్కరించే జీవనశైలిని అవలంబించినప్పుడల్లా దేవుని కట్లును తెంచుకోవడానికిప్రయత్నిస్తూ ఉన్నారు. సంఘ నాయకులు దేవుని వాక్యం ద్వారా తమ బోధలు నిర్ధేశింపబడుటను నిరాకరించినప్పుడల్లా దేవుని పాశములను పారవేస్తూవున్నారు”. తమ స్వంత ప్రయత్నాల ద్వారా దేవుణ్ణి సంతృప్తి పరచగలమని భావించే స్వనీతిపరులు వారిని నిత్యజీవానికి నడిపించే ఏకైక రక్షకుడును రాజైన మెస్సీయ పాలనను తిరస్కరిస్తూ వున్నారు.

దేవునిపాలనను తప్పించుకోవడానికి చేసే ఈ అన్ని ప్రయత్నాలలో బాధాకరమైన విషయమేమిటంటే, దేవుని వాక్యానికి విధేయత చూపడాన్ని వీరు బానిసత్వంగా భావించడం. నిజానికి అది అతిగొప్ప స్వేచ్ఛయై యున్నది. ఈ తిరుగుబాటుదారుల విషయములో మరింత విషాదకరమైన అంశమేమిటంటే, ఆ  తిరుగుబాటు అంతా ఖాయంగా విఫలమవడం. దేవుని కృప ద్వారా పరిపాలింపబడుటకు తిరస్కరించు వారు ఆయన తీర్పు తీర్చ వచ్చినప్పుడు ఆయన ఉగ్రతతో పాలించబడతారు.

అభిషక్తుడు, మెస్సయ్యా, క్రీస్తు అనే మూడు పదాలకు అర్ధం ఒక్కటే. ఈ మూడు పదాలు ఒకడు దేవునిచేత యాజకునిగా లేక రాజుగా తన ధర్మమును నిర్వర్తించుటకు నూనెతో అభిషేకింపబడడాన్ని సూచిస్తూవున్నాయి. “అభిషిక్తుడు” అనే బిరుదు పాత నిబంధన ప్రధాన యాజకులు లేదా రాజులలో ఎవరికైనా వర్తించవచ్చు. అయితే, ఈ కీర్తనలో ప్రభువు అభిషిక్తుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఇది కీర్తనలోని తదుపరి భాగంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ వచనాలలో తండ్రియైన దేవుడు తనతో చేసిన కట్టడను మెస్సీయ స్వయంగా వివరిస్తూవున్నాడు.

దేవుని రాజు యొక్క సురక్షితమైన పాలన (7-12)
7కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను–నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని యున్నాను. 8నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. 9 ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. 10కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి. 11భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి. 12ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరు ధన్యులు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.