కీర్తనల గ్రంధములోని కీర్తనలన్ని ఆలయ సేవల్లో ఉపయోగించడానికి ఉద్దేశించిన దావీదు కీర్తనల సమాహారం. దావీదు జీవితకాలంలో ఈ సమీకరణ జరిగివుండొచ్చు. 1, 2, 10, 33 కీర్తనలు మినహా ఈ పుస్తకంలోని అన్ని కీర్తనలు వాటి శీర్షికలలో దావీదుకు ఆపాదించబడ్డాయి. 1, 2, 10 మరియు 33 అను నాలుగు కీర్తనలు కూడా దావీదువే కావచ్చు. ఈ కీర్తనలలో దాదాపు సగభాగం సంగీత దర్శకునికి సంబోధించబడ్డాయి, ఇది ఆ కీర్తనలు ఆలయ ఆరాధన ఉపయోగార్ధమై సమర్పించబడ్డాయని స్పష్టముగా తెలియజేస్తూ ఉంది.

1, 2 కీర్తనలు కీర్తనల గ్రంధాన్ని పరిచయం చేస్తూవున్నాయి. ఈ రెండు కీర్తనలు ముఖ్యమైన రెండు విషయాల్ని తెలియజేస్తూవున్నాయి: దేవుని వాక్యం పట్ల విశ్వాసి యొక్క వైఖరిని మరియు దేవుని మెస్సీయ పట్ల విశ్వాసి యొక్క వైఖరిని గురించి తెలియజేస్తూవున్నాయి. 1వ కీర్తన దేవుని వాక్యాన్ని పాటించే వ్యక్తిపై ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది. 2వ కీర్తన దేవుని మెస్సీయను విశ్వసించే వ్యక్తిపై ఆశీర్వాదంతో ముగుస్తుంది. ఈ రెండు ఆశీర్వాదాలు ఈ రెండు కీర్తనలను ఒక యూనిట్‌గా చేర్చాయి, కాబట్టే ఇవి కీర్తనల గ్రంథానికి చక్కని పరిచయ కీర్తనలుగా వ్యవహరిస్తూవున్నాయి.

ఈ రెండు కీర్తనల రచన గురించి సమాచారం లేదు. 1వ కీర్తన డేవిడిక్ కీర్తన అయి ఉండవచ్చు, కీర్తనల గ్రంథానికి పరిచయ కీర్తనగా ఎంపిక చేయబడి ఉండొచ్చు లేదా ప్రత్యేకంగా వేరొకరిచే దీని కోసం వ్రాయబడి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, అపొస్తలుల కార్యములు 4:25 కీర్తన 2ని దావీదుకు ఆపాదించినందున, దానితో జతచేయబడిన 1వ కీర్తన కూడా దావీదుదే అని మనం చెప్పటం సంభావ్యంగా ఉంటుంది.

కీర్తన 1

ఈ మొదటి కీర్తన అనేది, ప్రార్థన స్తుతులతో దేవుని పవిత్ర ప్రాంగణములోనికి ప్రవేశించడానికి ఏర్పరచిన గేట్‌వే అని చెప్పొచ్చు. లూథర్ గారు చెప్పినట్లుగా, కీర్తనల గ్రంధము, సంక్షిప్తీకరించబడిన బైబిల్ అయితే, ప్రారంభ ఆరు కీర్తనలు దేవునితో ఐశ్వర్యవంతమైన సహవాసమును ఎలా కలిగియుండగలమో చెప్పే ఒక పోర్టల్ అని చెప్పొచ్చు. ప్రవేశ ద్వారం మీద ఉన్న శాసనం “ధన్యుడు”. ఇది ఇక్కడ కోరుకునే వారికి “గొప్ప విలువైన ముత్యంను” వాగ్దానం చేస్తూవుంది. కీర్తనలలో నివసించే వారందరికీ వారి సంతోషానికి కొదువేమి ఉండదు. ఎటువంటి పరిమితులు లేవు. ఆశీర్వదించబడండి అనే ఆహ్వానం అందరికి – వాళ్ళు ఎవరైనా, ఏమైనా ఎక్కడ ఉన్నా – చెందుతుంది. అది అందించే ఆనందం అపరిమితమైనది అది పరిస్థితుల వల్ల ప్రభావితం కాదు.

ఆనందం అనేది దేవుడు అనుగ్రహించే వరం. దానిని అంగీకరించి, సానుకూలంగా జీవించేవారు ఉన్నారు దానికి ప్రతికూలంగా జీవించేవారు ఉన్నారు. ధన్యులు దేవున్ని కించపరిచి అపహాస్యం చేసే మనుష్యుల జీవన విధానానికి దూరంగా ఉంటారు (1) వారు ఆనందంతో ఆలోచిస్తారు. సూచనల కోసం దేవుడు తెలియజేసిన వాటిని అలసిపోకుండా రిహార్సల్ చేస్తారు (2) వాక్య ఆధారితమై వాక్యంతో లంగరు వేయబడిన వారి జీవితాలు అచంచలమైన స్థిరత్వంలో దృఢమైన మూలాన్ని కలిగి సంతృప్తిని కలిగి ఉంటాయి. (3) దురదృష్టవశాత్తూ అలాంటి ఆశీర్వాద జీవితాలను గడపడానికి నిరాకరించే వారు కూడా ఉన్నారు. వారు ఆనందిస్తున్నట్లు కనిపించే ఏ ఆనందమైనా భ్రమే. అనివార్యంగా అది దేవుని తీర్పు తుఫానులో విచ్ఛిన్నమవుతుంది. ఇందులో దుర్మార్గులు గాలికి చెదరగొట్టు పొట్టువలె కొట్టుకుపోతారు (4-5). ప్రత్యామ్నాయాలు లేవు, మినహాయింపులు లేవు. మనుష్యులు నీతిమంతులుగా ధన్యులుగా ఉండాలి లేదా వారు దుర్మార్గులుగా నశించిపోతారు (6).

ధన్యత దాని లక్షణాలు మరింత స్పష్టంగా కీర్తనల గ్రంథములోని ఇతర కీర్తనలలో కనిపిస్తాయి. ధన్యత (1) అనేది దేవుని చొరవను తెలియజేస్తూవుంది (65:4 నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు); (2) అది దేవుని క్షమాపణ ద్వారా సాధ్యమవుతుంది (32:1,2 తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు); (3) ఎప్పటికీ విఫలం కాని దేవుని శక్తి ద్వారా హామీ ఇవ్వబడింది (2:12 ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు; 34:8 ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు; 40:4 గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు; 146:5f ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు); (4) దేవుని నిబద్ధత నుండి పెరుగుతుంది (84:5 నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు; 84:12, సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మిక యుంచువారు ధన్యులు; 112:1 యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించు వాడు ధన్యుడు; 128:1 యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరు ధన్యులు); (5) దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయడంలో నెరవేర్పును పొందుతుంది (41:1,2 బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును; 106:3 న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు; 119:1,2 యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు); (6) దేవుణ్ణి స్తుతించడంలో వ్యక్తమవుతుంది (84: 4 నీ మందిరమునందు నివసించువారు ధన్యులువారు నిత్యము నిన్ను స్తుతించుదురు); (7) బాధాకరమైన రోజులలో కూడా దేవుని మంచితనంపై నిర్మలమైన విశ్వాసం (94:12 యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు); (8) కుటుంబ సర్కిల్‌లో భాగస్వామ్యం చేయబడింది మొత్తం దేశానికి విస్తరించబడుతుంది (127:5వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు; 33:12 యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు; 89:15 శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు; 144:15 ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు); (9) ఆయన కున్న కారణాన్ని బట్టి శత్రువులపై దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు (137:8-9పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టువాడు ధన్యుడు).

దేవుని వాక్యపు ఇరు పార్శములు

దైవభక్తిగల వారి మార్గం ఆశీర్వాదానికి నడిపిస్తుంది (1-3)

1దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక 2యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకువాడక తనకాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.

ఈ పై మూడు వచనాలు దేవునియందు భయభక్తులు కలిగిన వారికుండే మూడు గుణ లక్షణాలైన పాపమును అడ్డగించుట, దేవుని వాక్యాన్ని ప్రేమించుట, విశ్వాస ఫలాల్ని ఫలియించుట అను వాటిని గూర్చి తెలియజేస్తున్నాయి.

దుష్టులు” అంటే దేవుని ధర్మశాస్త్రానికి అవిధేయత చూపే వ్యక్తులు మరియు నిజ దేవుని ఆరాధన నుండి నిబంధనా సమాజము నుండి మినహాయించుకొన్న వారు. “పాపులు” అంటే అలవాటుగా పాపం చేసే వ్యక్తులు (అలవాటుగా దేవుని ఆజ్ఞలను అతిక్రమించే వారు).అపహాసకులు” అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బలంగా వెక్కిరించే వాళ్ళు దాని విలువలను అపహాస్యము చేసేవాళ్ళు. అపహాసకత్వము దేవుని ధర్మశాస్త్రాన్ని వెక్కిరిస్తూ దాని విలువలను అపహాస్యము చేస్తూ వారి స్వంత ఇష్టాలను నెరవేర్చుకొనేటట్లు అది మనుష్యులను ప్రేరేపిస్తుంది. ఇతరులు అది చూసి వారిని అనుసరించేటట్లు ప్రోత్సహిస్తుంది. అనుకరణ మైత్రికి దారితీస్తుంది. మైత్రి సమీకరణకు దారితీస్తూ, బహిరంగంగా మనుష్యులు దేవుని వాక్యాన్ని గేలి చేసేటట్లు దేవుణ్ణి ఆయన వాక్యాన్ని అపహాస్యం చేస్తుంది.

దుష్టులు అంటే భక్తిహీనులు. ఇక్కడ దుష్టులు అనే మాట సాధారణమైనది అనీతిమంతులందరికి వర్తిస్తూ వుంది. అట్లే “నడక” అనే పదం లేఖనాలలో జీవన విధానాన్ని లేదా ప్రవర్తనను సూచించడానికి ఉపయోగించ బడింది. కీర్తనలు 15:2 యథార్థమైన ప్రవర్తన గలిగిఅనే మాటలను 1 రాజులు 9:4తోపోల్చిచూసినట్లైతే, “నీ తండ్రియైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృదయుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించినయెడల అనే మాటలలో ఈ విషయం మనకు అర్ధమవుతువుంది, ద్వితీయోపదేశకాండము 19:9; 28:9; కీర్తన 81:12-13; యెషయా 33:15.

దుష్టుల ఆలోచనచొప్పున నడువక అను మాటలకు, దేవునియందు భయభక్తులు కలిగినవారు దుష్టుల సలహాను అనుసరించరని, 2 సమూయేలు 16:20; వారి ఉద్దేశాలను లేదా వారి ప్రణాళికలను అమలు చేయరని, యెషయా 19:3; తమ జీవితాన్ని వారి అభిప్రాయాలు మరియు సూచనల ప్రకారం రూపొందించుకోరని, వారి ప్రణాళికలు మరియు జీవిత ఉద్దేశాలలో వాళ్ళు వాటి నుండి స్వతంత్రంగా ఉంటారని, వాళ్ళు అవిశ్వాస లోకపు తప్పుడు విలువలచే పాలింపబడుటకు అంగీకరించరని అంటే అనీతిమంతుల, భక్తిహీనుల పద్ధతులు, ఆచారాలు, కట్టుబాట్లు, ఆలోచనలనుండి తాము జీవించవలసిన మార్గం గురించి వారి నుండి సలహా తీసుకోరని, ఒకరి జీవిత విధానాన్ని దైవభక్తి లేని వైపు మళ్లించే ఎలాంటి ఆలోచనను తీసుకోరని, వారి మార్గదర్శక ప్రభావాన్ని తమ జీవితాలలో నిరోధిస్తారని, వాళ్ళు మార్గనిర్దేశం కొరకు యెహోవా ధర్మశాస్త్రాన్ని మాత్రమే ఆశ్రయిస్తారని అర్ధం.

పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అను 1 యోహాను 3:4 వచనాన్ని బట్టి పాపులు అను మాటకు అర్ధం మార్క్ మిస్ అయిన వారు (గురి తప్పిన వారు) అంటే సరియైన మార్గం నుండి తప్పు చేసే వారు. ఇది “భక్తిహీనులు” అని చెప్పబడిన పూర్వపదం కంటే విబిన్నమైనదిగా ఉంటూ విధుల నుండి తొలగిపోయే వారిని గురించి, యెరిగి యెరిగి బాధ్యతలను ఉల్లంఘించే వారిని గురించి మాట్లాడుతూ వుంది (నిషేధించబడిన పరిమితులను దాటడం, ఉల్లంఘించడం). అతని హృదయంలోని పాపానికి బాహ్యముగా అతిక్రమణ జోడించబడటం. పాపుల మార్గమున నిలువక అంటే వారితో ఉండాలనే కోరికను వ్యక్తీకరించడం వారితో సహవాసం చెలిమి చేయాలని కోరుకొంటూ వారి మార్గాలలో నిలబడివుండటం. నిలబడటం అనేది ఒక పాత్ర యొక్క స్థితిని తెలియజేస్తూవుంది అంటే స్టాండ్ తీసుకోవడం (నిర్ణయంతో స్థిరముగా తెలిసి తెలిసి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం).

అపహాసకులు అనే పదానికి అర్థం వెక్కిరించేవారు, అపహాస్యం చేసేవారు, ధర్మాన్ని మరియు మతాన్ని ధిక్కారం మరియు అవహేళనతో చూసేవారు (సామెతలు 1:22; సామెతలు 3:34; సామెతలు 9:7-8; సామెతలు 13:1; సామెతలు 15:12). ఈ మాట దుర్మార్గపు చివరి దశ అయిన దుర్మార్గపు పాత్ర యొక్క పరిపూర్ణతను సూచిస్తూ వుంది, దేవునిని ఆయన వాక్యాన్ని అపహాస్యం చేసేవారు సమావేశమయ్యే చోట కూర్చుండక, కూర్చుండటం అంటే అతను వారిలో ఒకడుగా అవ్వటం, ఉదేశ్యపూర్వకముగా వారితో సహవాసం చేయటం.

దేవునియందు భయభక్తులు కలిగినవారు దేవుని వాక్యము చేత మాత్రమే నడిపింపబడుటకు ఆశపడతారు. రోమీయులకు వ్రాసిన పత్రిక 12:12లో పౌలు “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి” అని హెచ్చరించుచున్నట్లుగానే మన ఆలోచనను ఏదైతే రూపొందిస్తుందో అది త్వరలోనే మన చర్యలను కూడా రూపొందిస్తుంది కాబట్టి ఈ మొదటి కీర్తన క్రైస్తవులు తమ విలువలను మరియు లక్ష్యాలను ప్రపంచంలోని పాపపు ప్రమాణాల నుండి పొందకూడదని హెచ్చరిస్తూ ఉంది.

ఇక్కడ, ఈ వచనములో వాడబడిన నామవాచకాలు (దుష్టులు, పాపులు, అపహాసకులు) మరియు క్రియలు (నడువక, నిలువక, కూర్చుండక) అనేవి ఒక పాత్ర యొక్క వరుస దశలను సూచిస్తూ వున్నాయి. నడువక, నిలువక, మరియు కూర్చుండక అను ఈ మూడు క్రియలు దేవునియందు భయభక్తులు లేని వారి ప్రభావము మెల్లిమెల్లిగా క్రైస్తవుల జీవితలలోనికి చొచ్చుకొని పోకుండునట్లు వారిని హెచ్చరిస్తూ వున్నాయి. నడువక నిలువక కూర్చుండక అనే మాటలను అర్ధం చేసుకోవడానికి దేవునియందు భయభక్తులు లేని వారు, దేవుని నుండి మనలను దూరం చేసే వాటి ప్రక్కన నడుస్తున్నట్లుగా ఊహించుకోండి. వారు/ అవి వారి సాన్నిహిత్యాన్ని మనము ఆస్వాదించేటట్లు చెయ్యడమే కాకుండా దేవుని యందలి భయభక్తులలోనికి పోకుండా మొదటిగా మనలను నిలువరిస్తాయి. రెండవదిగా, పాపము వాని హృదయములో కూర్చుండుటను బట్టి వానికి వారితో స్వచ్ఛందంగా నిలబడాలనిపిస్తుంది, వారితో వాటితో వుండాలని అనిపిస్తుంది. మూడవదిగా, ఆ పై వారితో సహవాసం చేయడం లేదా వారి మధ్య క్రమంగా కూర్చోవడం ద్వారా శాశ్వతంగా వారిలో ఒకరిగా మారడం అనే ఉద్దేశపూర్వక స్థిరమైన ఉద్దేశ్యాన్ని గమనించమని ఇవి హెచ్చరిస్తూవున్నాయి.  

దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటే వారి విలువలను అంగీకరించకపోవటం అని అర్ధం. పాపుల మార్గమున నిలువక అంటే వారితో కలసి ఉండక వారి పాపపు క్రియలలో చేరకపోవటం అని అర్ధం. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటే వారితో కలసి ఉండకపోవటం అని అర్ధం. మారుమనస్సు లేని వారి జీవిత శైలితోను మరియు తెగింపుతో కూడిన వారి అవిధేయతతోను మనము జతకూడ కూడదు, వారిలో ఒకనివలె ఉండకూడదు అని ఈ మూడు క్రియలు హెచ్చరిస్తూ వున్నాయి.

మన చుట్టూ ఉన్న లోకములోని దైవభీతి లేని వారి లక్షణాలను మనం చూచినప్పుడు, -ఆశించుట, మేటీరియలిజం, లైంగిక సంభందమైన కరప్షన్, కుటుంబం పట్ల నిర్లక్ష్యం, హింస మరియు యుద్ధములవంటి వాటి వ్యాప్తిని చూసినప్పుడు -అవి మన జీవితాలలో వేళ్లూనక మునుపే మనము వాటి ప్రభావాన్ని తప్పకుండ ప్రతిఘటించాలనే విషయాన్ని గ్రహించవలసి యున్నాము. ఒకవేళ వాటిని మన జీవితాల్లోకి అనుమతిస్తే అవి చాల త్వరగా మన జీవితాలలో నాటబడి వేళ్లూనుకొని స్థిరపడతాయి. చివరగా, అవి మనలో కూర్చుని తమ్మును తాము తయారు చేసుకుంటాయి. ఒకప్పుడు మనల్ని భయభ్రాంతులకు గురిచేసిన ఆలోచనలు క్రియలతో మనం సౌకర్యవంతముగా ఎదుగుతాం. ఇలా జరిగినప్పుడు, మన చుట్టూ ఉన్న లోకములోని వారికంటే మనమేమి భిన్నంగా ఉండము.

క్రైస్తవులు వారంలో ఒక గంట దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చి మిగిలిన 167 గంటలు తమ శరీర అవసరాలను తీర్చుకోవడానికి మరియు ప్రాపంచిక వినోదాన్ని ఆస్వాదించడానికి కేటాయిస్తే అవిశ్వాస ప్రపంచపు విలువలను ఎదిరించగలరని ఆశించలేరు. దేవుని వాక్యము ద్వారా మన జీవితము పరిపూర్ణముగా రూపింపబడుటకు మనము కోరుకొన్నట్లైతే, మన ఆదివారం ఆరాధన సమయం కంటే ఎక్కువగా దేవునితో సమయము గడపవలసియున్నాము. అట్లే సహా క్రైస్తవులతో బైబిలును క్రమానుసారముగా ధ్యానించడం కూడా అవసరం. క్రమమైన కుటుంబ ఆరాధనలు మరియు వ్యక్తిగత బైబిలు అధ్యయనం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించవలసి యున్నాము. ఎందుకంటే, దైనందిన జీవితాలలో మనం శోధనను ఎదుర్కొన్నప్పుడు లేదా నిర్ణయాలను తీసుకోవలసి వచ్చినప్పుడు దేవుని వాక్య సత్యాలను గుర్తుంచుకుని వాటిని అన్వయించుకునే అలవాటును మనం పెంపొందించుకోవలసి యున్నాము. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని పఠించుటలో దివారాత్రులు దానిని ధ్యానించుటలో గొప్ప ఆనందాన్ని మరియు సంతృప్తిని కనుగొంటారు. వాళ్ళు సమాజంలో మరియు ఇతరమైన వాటిలో తమ ఆనందాన్ని కనుగొనడానికి బదులుగా దానిని దేవుని సత్యంలో కనుగొంటారు.

లేఖనాలలో ధర్మశాస్త్రం అనే మాట దేవుని నిర్ధేశకత్వమును, ప్రవర్తనను లేదా ఆలోచనను నియంత్రించడానికి ఉద్దేశించిన దేవుని సాధారణ నియమములను, దేవుని అధికారిక హెచ్చరికలను, దేవుని ఆజ్ఞలను తెలియజేయటానికి వివిధ సందర్భాలలో వాడబడింది. దేవుని ఆజ్ఞలను సూచించడానికి మనం తరచుగా ధర్మశాస్త్రం అనే పదాన్ని ఉపయోగిస్తాము, అందులో ఆయన మనకు ఏమి చేయాలో చెప్తూవున్నాడు. అయితే ఈ కీర్తనలో అనేకమైన ఇతర బైబులు భాగాలలో, “ప్రభువు యొక్క ధర్మశాస్త్రం” అనే పదమునకు అప్పటివరకు దేవుడు వెల్లడి చేసినదంతా అని, బైబులంతా (దేవుని వాక్యమంతటిని) అని అర్ధం చేసుకోవాలి అనగా ధర్మశాస్త్రం  మరియు సువార్త అను రెండింటిని గూర్చి ఇది తెలియజేస్తూవుంది. ఇక్కడ ధర్మశాస్త్రం అనే హీబ్రూ పదానికి అర్ధం ఏంటంటే, “ఉపదేశము” లేదా “బోధ (సూచన)” అని అర్థం. ఒక నిజమైన భక్తుడు భగవంతుడు వెల్లడించిన సత్యాలలో తన అత్యధిక ఆనందాన్ని పొందుతాడు. ఇది తరచుగా నిజమైన భక్తి యొక్క లక్షణంగా సూచించబడుతుంది, కీర్తన 19:10 పోల్చండి; కీర్తన 119:97, కీర్తన 119:99. అట్లే ధర్మశాస్త్రము అనేది ఒక అద్దం, అది దేవుని చిత్తాన్ని ఆయనను సంతోషపెట్టు వాటిని నిశ్చయంగా చూపిస్తూనే ఉంటుంది. విశ్వాసులు నిరంతరం ఈ అద్దాన్ని చూసుకొంటూ శ్రద్ధగా తమ్మును తాము పరిశీలించుకొనులాగున ప్రోత్సహించబడాలి.

పునరుద్ధరణ స్ఫూర్తి విశ్వాసులలో ఈ రకమైన సుముఖతను కలిగిస్తుంది. విశ్వాసులు సువార్తలో వారి గొప్ప ఆనందాన్ని కనుగొంటారు, ఇది వారి పాపముల కొరకైన దేవుని క్షమాపణను గురించి చెప్తూవుంది. అయితే విశ్వాసులు తమలో పరిశుద్ధాత్మ సృష్టించిన కొత్త విశ్వాస స్ఫూర్తితో ప్రేరేపించబడినప్పుడు, వారు దేవుని ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలలో మరియు లేఖనాలలోని ఇతర భాగాలలో క్లుప్తీకరించబడిన దేవుని ధర్మశాస్త్రము నందు కూడా ఆనందిస్తారు. వారు తమ రక్షకుడిని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయాలని కోరుకుంటారు. వాళ్ళు మొదటి నుండి చివరి వరకు దేవుని వాక్యమంతటిలో ఆనందిస్తారు. యెహోషువ 1:8,9 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల జేసికొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.

దివారాత్రము దానిని ధ్యానించడం అంటే, () తన మనస్సును క్రమశిక్షణలో ఉంచడం ద్వారా ఉద్దేశపూర్వకంగా దైవిక సత్యాన్ని ధ్యానించే అలవాటును ఏర్పరుచుకోవడం దీన్ని అలవాటుగా చేయడం. (బి) ఇలా చేయడానికి సమయాన్ని తీసుకోవడం. ప్రతిరోజు దేవుని సత్యాలను ధానించడం ద్వారా జీవితం యొక్క అదుపు నుండి వైదొలిగి తన ఆత్మను రిఫ్రెష్ చేసుకోవడం. దేవునితో ఆయన సత్యాలతో బాగా పరిచయం పెంచుకోవడం. శాశ్వతమైన వాస్తవాలకు సంబంధించిన సత్యాలను మరింత నేరుగా తన స్వంత ఆత్మపైకి తీసుకురావడం. (సి) పగటిపూట ఒకనికి లభించే విశ్రాంతి క్షణాలలో దేవుని సత్యాలను ధ్యానించడం ద్వారా అతడు జీవితంలోని శ్రమలు మరియు ఆ శ్రమల మధ్య నెమ్మదిని మరియు ఆదరణను పొందుతాడు. (డి) కీర్తనలు 63:4, 5 నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది. కీర్తనలు 119:54,55 యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణచేయుచున్నాను.

ఇలాంటి వ్యక్తి నీటికాలువల యోరను నాటబడినవాడై ఆకువాడక తనకాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. బీడు భూమిలో ఉన్న చెట్టు నీటికాలువల యోరను నాటబడిన చెట్టుకు విరుద్ధంగా ఉంటుంది. నీటికాలువల యోరను నాటబడినది, దాని వ్రేళ్ళు జలాశయాల లోతుల వరకు చేరుకుంటాయి. అక్కడ దానికి అంతులేని శక్తి మరియు శక్తి సరఫరా దొరుకుతుంది, అది తన ఫలాలను అందజేస్తుంది. యెహోవా శక్తిలో లోతుగా ఉన్న విశ్వాసం ఫలితంగా, పైన ఉన్న గొప్ప తోటమాలి ఆశలను ఒకడు ఎప్పుడూ నిరాశపరచడు, లూకా 13:7; అతని ఆకు వాడిపోదు, శత్రుత్వం లేదా ప్రతికూలత యొక్క కరువు ద్వారా అది ఏమాత్రము ప్రభావితం కాదు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ బలంగా ఉంటుంది. అంటే అతడు అనుకూలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయబడి, శ్రద్ధతో సాగు చేయబడినవాడై వర్ధిల్లుటను ఇది తెలియజేస్తూవుంది. విశ్వాసులు సువార్తచే ప్రేరేపించబడినప్పుడు మరియు దేవుని ధర్మశాస్త్రముచే నిర్దేశింపబడినప్పుడు, వారు విశ్వాస ఫలాలను ఫలిస్తారు, అంటే దేవునిని సంతోష పెట్టె క్రియలను చేస్తారు. క్రైస్తవులు తమ జీవితాల్లో చేసే మంచి పనులను తరచుగా ఫలాలు అని పిలుస్తారు. ఎందుకంటే,  చెట్టు యొక్క కొమ్మ చెట్టు యొక్క ప్రధాన కాండానికి జోడించబడి ఉంటేనే ఫలాలను ఇస్తుంది. ఒక క్రైస్తవుడు సజీవ విశ్వాసం ద్వారా క్రీస్తుతో అనుసంధానించబడి ఉంటేనే మంచి పనులను చేయగలడు. ఒక చెట్టుకు సమృద్ధిగా నీరు ఉంటేనే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. అట్లే ఒక క్రైస్తవుని విశ్వాసానికి దేవుని వాక్యం ద్వారా “నీటిని” అందించితేనే మంచి పనులు చేయగలడు. చెట్టు అనేది దేవుడు దానికి ఇచ్చిన స్వభావాన్ని బట్టి ఫలాలను ఇచ్చే ఒక జీవి. ఆరోగ్యకరమైన ఆపిల్ చెట్టు ఆరోగ్యకరమైన ఆపిల్ పండ్లను ఫలిస్తుంది, ద్రాక్ష తీగ ద్రాక్ష పండ్లను ఫలిస్తుంది. క్రీస్తులో ఒక విశ్వాసి యొక్క నూతన స్వభావమే క్రీస్తువంటి పనులను చెయ్యగలదు.

దేవుని వాక్యం ద్వారా ఎవరైతే తమ జీవితాలను నిర్దేశించుకొంటారో, వాళ్ళు భక్తిహీనుల మార్గానికి దూరంగా ఉంటారు మరియు విశ్వాస ఫలాలను ఫలిస్తారు, ధన్యులుగా వుంటారు. ధన్యులు అంటే దేవుని నుండి మాత్రమే వచ్చే సంతోషకరమైన మరియు ప్రతిఫలదాయకమైన జీవితాన్ని ఆస్వాదించే వారని అర్ధం. కీర్తనలో ధన్యుడు అనే పదానికి ఆనందించేవాడు అని అర్ధం. దీని అర్ధాన్ని గ్రహించడానికి ఈ వచనాలు చూడండి, కీర్తన 2:12; 32:1,2; 40:4; 41:1,2; 65:4; 84:4-5; 94:12; 106:3; 119:1,2; 128:1.

ఫలమిచ్చు చెట్టువలె ఉండును అను మాటలకు, ఈ లోక దీవెనలతో సమృద్ధిగా ఉంటారని అర్ధం కాదు. ఈ దీవెనలు ఆత్మలో చాలా లోతులలో దాచబడి వున్నాయి, మీరు వాటిని విశ్వాసంతో గట్టిగా పట్టుకోకపోతే, మీరు దానిని దురదృష్టము అని పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాతాను దేవుని వాక్యాన్ని ద్వేషించినట్లే, వాడు దానిని బోధించే వారిని మరియు వినేవారిని కూడా ద్వేషిస్తాడు; వాడు లోకములోని శక్తుల సహాయంతో వారిని హింసిస్తాడు. విశ్వాసులు నాశనము చెయ్యబడినప్పుడు వారు వృద్ధి చెందడం, వారిని క్షిణింపచేసినప్పుడు వారి సంఖ్య పెరగడం, వారిని  అణచివేసినప్పుడు వారు విజయం సాధించడం, వారిని త్రోసివేసినప్పుడు వారు నిలద్రొక్కుకోవడం, వారు ఓడిపోయినప్పుడు వారు విజయం సాధించడం ఇవన్నీ దురదృష్టం యొక్క ఔన్నత్యం ఫలింపబడటం యొక్క ఔన్నత్యంగా మారుతుంది. దేవుడు తన పరిశుద్దులను హెచ్చిస్తాడను ఆదరణను కలుగజేస్తూవుంది.

దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు కొన్నిసార్లు జ్ఞానవంతం కాని ప్రణాళికలను రూపొందించొచ్చు అందువల్ల అతడు తన సంపదను కోల్పోవచ్చు, వాణిజ్యపరమైన కష్టాల్లో, యుద్ధ సమయాల్లో, కరువు, తెగుళ్ళలో, విపత్తులలో ఉండొచ్చు. ఇతర వ్యక్తుల మోసం మరియు నిజాయితీ లేని కారణంగా నష్టపోవచ్చు. కానీ భక్తితో కూడిన జీవితం శ్రేయస్సుతో పాటు నిరంతరం ఆనందాన్ని ఇస్తుంది, కాబట్టే 1 తిమోతికి 4:8 దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని చెప్తూవుంది. పాపక్షమాపణ ద్వారా వచ్చు సమాధానము నిజ సంతోషమై యున్నది. దేవుని వాక్యప్రకారము జీవించు స్వేచ్ఛను స్వీకరించుటయే నిజమైన సంతోషము. నిత్యత్వమంతయు దేవునితో జీవించుచు ఆ మహిమను ఆనందించుటయే నిజమైన సంతోషము. దేవుని వాక్యమునందు సంతోషించు వారందరి కొరకు ఈ ఆశీర్వాదము వేచియున్నది.

ఈ కీర్తన 1వ వచనం, భక్తిహీనమైన విలువలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నప్పటికి, ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ కీర్తన ఒక వాగ్దానం హెచ్చరిక కాదు.

భక్తిహీనుల మార్గం నాశనానికి దారి తీస్తుంది (4-5)

4దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. 5కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.

నీతిమంతులు దుష్టుల ఆలోచనచొప్పున నడువరు పాపుల మార్గమున నిలువరు అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండరు. వారు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారు. వారు నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టులా ఉంటారు. దుష్టులు ఆలాగున నుండక అనే మాటలు భక్తిహీనుల లక్షణాలను తెలియ జేస్తూవున్నాయి.

గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు_ భక్తిహీనులు నీతిమంతుల నుండి భిన్నంగా ఉంటారు. ఎండిపోయిన పనికిరాని చంచలమైన అనిశ్చలతతో స్థిరత్వం లేకుండా, ప్రతి గాలికి ఎగిసి, దేవుని అసంతృప్తి యొక్క శ్వాస ద్వారా భూమి యొక్క ముఖం నుండి చెదరగొట్టబడు పొట్టువలె ఉంటారు. ఎందుకంటే వారి ప్రస్తుత ఆనందానికి స్థిరమైన పునాది లేదు కాబట్టి  గాలి ముందు ఊటలా ఎగిరిపోతారు అదృశ్యమవుతారు. 35:5; యెషయా 17:13; మత్తయి 29:5; 3:12.

న్యాయవిమర్శలో దుష్టులు (భక్తిహీనులు) నిలువరు_ న్యాయమూర్తిచే నిర్దోషిగా ప్రకటించబడి ఆయనచే ఆమోదించబడిన వారిలో వారు కనిపించరు. వాళ్ళు నిజదేవునిని విశ్వసింపని వారు కాబట్టి వాళ్ళు తీర్పు దాక నిలువరు. విచారణకు నిలబడాలంటే దేనిని ఆధారము చేసుకొని నిలబడాలి (యెహోవా ధర్మశాస్త్రాన్నా సత్క్రియలనా మనఃసాక్షినా ఈ లోకపు కట్టుబాట్లు ఆచారాలు సంస్కృతి ఆలోచనలు). కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులు నిలువరు.

నీతిమంతుల సభలో పాపులును (గురి తప్పిన వాళ్ళు) నిలువరు_ వారు నీతిమంతుల భాగాన్ని పంచుకోలేరు, వారు నీతిమంతులకు చెందినవారిగా పరిగణింపబడరు. నీతిమంతులు ఉండే చోటులలో వారికి చోటు ఉండదు. కాబట్టి వాళ్ళు అక్కడ నిలబడలేరు.

గోధుమలు గురుగులు ఒకే పొలంలో పెరుగుతాయి. మంచి మరియు చెడు చేపలు ఒకే వలలో గ్రహించబడతాయి; మంచివారు (విశ్వాసులు) చెడ్డవారు (అవిశ్వాసులు) సమాజములో వున్నారు  దృశ్య సంఘములో కూడా ఉన్నారు. కోత వచ్చును, దేవదూతలు ముందుకు వస్తారు, నీతిమంతులలో నుండి దుష్టులను వేరు చేస్తారు (గురుగులు పోగుచేయబడి కాల్చుటకు కట్టలుగా కట్టబడును; వల ఒడ్డుకు లాగబడును, మంచి చేపలను పాత్రలలో పోగుచేయగా, చెడ్డవి పారవేయబడును).

6నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును: న్యాయాధిపతి అయిన యెహోవాకు తన స్నేహితులు గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. దుష్టులు నీతిమంతులతో తీర్పులో నిలబడకపోవడానికి ఇది ఒక కారణం. ఆయనను ప్రేమించే వారు మాత్రమే అప్పుడు నిలబడగలరు. తీర్పులో భక్తిపరులుగా ఆయన ముందు ఎవరు నటించలేరు. ఆయన అనుగ్రహము కొరకు ఏ ఒక్కరు ఆయనను బలవంతము చెయ్యలేరు. ఎవ్వరూ తన మార్గాన్ని బలవంతంగా తనకు అనుకూలంగా మార్చుకోలేరు. నీతిమంతుల ప్రతిఫలాన్ని ఎవరూ క్లెయిమ్ చేయలేరు. భగవంతుని అనుగ్రహానికి మరియు పరలోకపు ప్రతిఫలానికి ఎవరూ ఎలాంటి ప్రలోభాలు చెయ్యలేరు. మనిషి తీర్పు తీర్చు విషయములో మోసపోవచ్చు, కాని దేవునిని ఏఒక్కరు మోసపుచ్చలేరు, ఎందుకంటే, 2 తిమోతికి 2:19 ప్రభువు తనవారిని ఎరుగును.

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును” అని చెప్పినప్పుడు, “మార్గం” అనే పదం నీతిమంతుల పూర్తి జీవితాన్ని గురించి మాట్లాడుతూవుంది. కాబట్టే ఆయన నీతిమంతులను సరిగ్గా తీర్పు తీర్చగలడు (ఆయన తన ప్రజలందరినీ సంపూర్ణంగా ఎరిగినందున, ఆయన వారిని మరియు వారి ప్రవర్తనను మాటలను క్రియలను తలంపులను ఆమోదిస్తాడు, ప్రేమిస్తాడు మరియు ఆనందిస్తాడు, అందువల్ల వారికి ప్రతిఫలం ఇస్తాడు).

భక్తిహీనుల మార్గం గురించి సానుకూలంగా ఏమీ చెప్పలేము. వారు దేవుని వాక్యాన్ని పట్టించుకోరు. వారు దేవునితో వుండరు కాబట్టి ఫలింపరు. వారు ఏ ఆశీర్వాదాన్ని పొందరు. రైతు తన ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు ఊడిపోయే గడ్డిలాగా వారి విజయాలు దేవునికి విలువలేనివి. భక్తిహీనులు ఆయనకు తెలియదు.

తీర్పు రోజున, ఒక రైతు మంచి ధాన్యాన్ని తన గాదెలో పోగుచేసినట్లుగా దేవుడు విశ్వాసులను వారి పరలోకపు గృహంలోకి చేర్చుతాడు, అయితే భక్తిహీనులు దేవుని సన్నిధి నుండి పొట్టులాగా ఎగిరిపోతారు. భక్తిహీనులు దేవుని తీర్పును ఆమోదించరు. వారు స్వర్గంలో ఉన్న అతని పరిశుద్ధుల సమావేశంలో చేరరు. తీర్పు రోజున, క్రీస్తుపై విశ్వాసం ద్వారా తన పిల్లలైన వారందరి మార్గాన్ని తాను ఆమోదిస్తున్నానని ప్రభువు ప్రకటిస్తాడు, దేవునికి వ్యతిరేకంగా దుష్టుల తిరుగుబాటు ముగుస్తుంది మరియు వారు అతని ఉనికి నుండి శాశ్వతంగా మినహాయించబడతారు, (2:12; 7:11; 9,7,8; 11:6; 21:8,9; 94:1,2; 96:13; 119:84). ఇప్పుడైతే దేవుని ప్రజల సభల్లో దుర్మార్గులు కూడా కలసిపోయి ఉండవచ్చు (మత్తయి13:24-30; ప్రకటన2:14-16, 20-25; 3:1-4). అయితే దేవుడు న్యాయాధిపతిగా కూర్చున్న వేళ వారక్కడ ఇక నిలవలేరు (మత్తయి25:41-46; 2 థెస్సలొనీకయులకు 1:6-10; ప్రకటన 21:22-27).

ప్రజలు ప్రయాణించగల రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి: నిత్యజీవానికి దారితీసే రహదారి (దేవునికి విధేయత) మరియు నరకానికి దారితీసే తిరుగుబాటు రహదారి. నరకానికి దారితీసే తిరుగుబాటు రహదారిలో దేవుని ఉగ్రతకు శాశ్వత వారసులుగా దాని గమ్యమైన నరకాన్ని చేరి కటికచీకటిలో ఆరని అగ్నిలో శాశ్వత కాలము శ్రమపడాల్సి వుంటుంది. ఈ అత్యంత భయానకమైన విధి నుండి వారిలో ఎవ్వరు మినహాయించ బడరు. నిత్యజీవానికి దారితీసే రహదారిలో దేవుని ప్రేమకు శాశ్వత వారసులుగా దాని గమ్యమైన శాశ్వత సంతోష స్థలమైన పరలోకానికి చేరుకొంటాం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మన గమ్యం ఖచ్చితంగా ఉండేలా కృపా సాధనాలు మనలను నిరంతరం ఈ మార్గములో నిర్ధేశిస్తువున్నాయి. ఇతర ప్రత్యామ్నాయాలు లేవు. మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తున్నారని నిర్ధారించుకోవడం కంటే జీవితంలో ఏదీ ముఖ్యమైనది కాదు, ఆలోచించండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.