యెషయా 45:22-25

పాత నిబంధన పాఠము: యెషయా 45:20-25; పత్రిక పాఠము: కొలొస్సి 3:12-17; సువార్త పాఠము: లూకా 2: 25-40; కీర్తన 111.

క్రిస్మస్కు మీరు మీ ఇంట్లో వాళ్ళకి బహుమతులు ఇచ్చి ఉంటారు కదా, అయితే మీరు ఇచ్చిన బహుమతులు కాకుండా, వేరే బహుమతి ఏదైనా వాళ్ళకి ఇచ్చివుంటే బాగుణ్ణు, వాళ్ళు ఇంకా ఎంతో సంతోషించి ఉంటారు, అని మీకు అనిపించిందా? ఎలాంటి బహుమతి అయితే మీ కుటుంబసభ్యులందరికి అమితానందం కలిగిస్తుందని మీరు అనుకొంటున్నారు. ఈ లోక రీతిగా మన కుటుంబ సభ్యులందరికి  శాశ్వతమైన సంతోషాన్ని కలిగించే బహుమానమేమైనా ఉందంటారా?

మన పాఠములో యెషయా క్రైస్తవులందరికి ఒక మంచి బహుమానమున్నదని చెప్తూ మనము దానిని గుర్తించాలని అశపడుతున్నాడు. ఈ ఉదయకాలమున మనము వెనుకకు తిరిగి ప్రవక్త ద్వారా మరల ఒకసారి క్రిస్మస్ ను చూధ్ధాం. ఆ క్రిస్మస్ లో సువార్తగా, సమాధానముగా, రక్షణగా బయలుపరచబడియున్న దేవుని కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, యెషయా మన పాఠములో చెప్తున్న విషయమదే. యేసు చాల మంచి క్రిస్మస్  బహుమానమైయున్నాడు  అని యెషయా చెప్తున్నాడు. ఆ విషయాన్ని అతడు ఎలా చెప్పగలుగు చున్నాడో పరిశిలిద్దాం.

మంచి క్రిస్మస్ బహుమానము యేసే

  1. యేసు అందరి కొరకు ఉద్దేశింపబడియున్నాడు. 22
  2. 2. నీతి బలములు ఇచ్చు దేవుని బహుమానమైయున్నాడు. 23-24

1

22భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందుడి అనేది అందరికి ఇవ్వబడిన ఒక సార్వత్రికమైన ఆహ్వానము. భూదిగంతముల వరకు ఉన్న ప్రతిఒక్కరు ఇందులో చేర్చబడియున్నారు. ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ప్రతిఒక్కరిని  ఆహ్వానిస్తూ _ నావైపు చూచి రక్షణ పొందుడి అని అంటూవున్నాడు అంటే రండి ప్రకటింపబడుతున్న జీవమును అంగీకరించండి అని పిలుస్తున్నాడు. ఈ పిలుపులో నేను మిమ్మల్ని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాను అనే అర్ధము కూడా వుంది. ఆయన నిర్ణయం ఆయన చొరవ ఆయన చర్యలో ఆయనే భూదిగంతముల వరకు ఉన్న ప్రతిఒక్కరిని  రక్షణకు ఆహ్వానించు చున్నాడు. కులము, రంగు, జాతి చూడకుండా ఆయన వైపు చూచి రక్షణ పొందు ప్రతి ఒక్కరికి పరలోకములో స్థానమిచ్చుదునని ఆయన తెలియజేస్తూవున్నాడు. ప్రకటింపబడుతున్న జీవమును అందరూ పట్టుకోవాలన్నదే ఆయన స్థిరమైన ఉద్దేశము.

ఇశ్రాయేలీయులు అన్యులను తక్కువుగా చూసేవాళ్ళు. హేళన చేస్తూ వారితో పొత్తు పెట్టుకునేవారు కాదు. ఎలాంటి సంబంధాలను నెరిపేవారు కారు. కానీ ఇప్పుడు వారి దేవుడే భూదిగంతముల వరకు ఉన్న ప్రతిఒక్కరిని నా వైపు చూడండి అని అంటూవున్నాడు. ఆయన భూదిగంతముల వరకు ఉన్న ప్రతిఒక్కరిని సంభోదించడమే కాకుండా తన ప్రజలకు ఇచ్చెడి ప్రేమగల ఆహ్వానమునే అందరికి ఇస్తూ  యూదులు మాటలాడుటకు కూడా ఇష్టపడని ప్రజలతో తాను వారికి కూడా దేవునిగా ఉండుటకు ఇష్టపడుతున్నానని తెలియజేస్తూవున్నాడు. అంతేనా తాను క్షమించువాడనని, ప్రేమకలిగి రక్షించువాడనని తాను మొదటిగా ఏర్పరచుకొనిన ప్రజలతో పాటు అందరికిని మోక్షము ప్రసాదించుటకు ఇష్టపడుతున్నానని ఈ ఆహ్వానము ద్వారా ఆయన తెలియజేస్తూవున్నాడు. 

ప్రజలు దేవునికి ఇష్టము లేని పాపము అవిశ్వాసము నిత్యశిక్షకు నడుపు మార్గము వైపు చూస్తూవున్నారు కాబట్టే నావైపు చూచి చూడండి అని అంటున్నాడు. ఆయన ప్రజలను మీ పాపపు మార్గమునుండి మళ్లుకొని విశ్వాసములో నన్ను చూడమని అడుగుతూ అలా మీరు చూస్తే రక్షణ పొందుదురని ఆయన చెప్తూవున్నాడు. నావైపు చూచి రక్షణ పొందుడిఅను మాటలకు అర్ధం ఏమిటంటే,  నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని ఆయన చెప్తున్నాడు. అంతర్లీనంగా ఈ మాటలకు ఉన్న భావము ఏమిటంటే _ ఆయన వాగ్దానములను ఆయన నెరవేర్చుకొను దేవుడని, తన వ్యవహారములలో ఆయన నీతిమంతుడని, తన ధర్మశాస్త్రమును పాలనా యొక్క గౌరవమును కాపాడుకొనువాడని, పాపమును అసహ్యించుకొనువాడని, కనికరయుతుడని, దయగలవాడని, క్షమించువాడని, తెలియజేస్తూవున్నాయి.  ఇవన్నీ కూడా ఆయనపై  ప్రజలకు విశ్వాసము కలిగించేవే_ రక్షణ కొరకు ఆయన వైపు చూచే అవకాశము అందరికి ఇవ్వబడియుండుటను బట్టి అందరు సంతోషించవలసి యున్నాము.

నావైపు చూడండి అనే మాటకు _ సహాయముకొరకు నావైపు ద్రుష్టి పెట్టండి అని అర్ధం. సహాయముకొరకు అను మాటలలో అంతర్లీనంగా మన నిస్సహాయత దాగివుంది గమనించారా_ ఒకడు నీళ్లలో పడిపోయాడను కోండి వాడు మునిగిపోతున్నప్పుడు తనకు సహాయపడు వాటిమీద దృష్టిని ఉంచుతాడు కదా అలా.  నావైపు చూచి రక్షణ పొందుడి అంటే మన పాపము, నిస్సహాయతలను బట్టి నమ్మకంతో దేవుని వైపు చూడటం. ఆయన మాత్రమే రక్షించగలడని దృఢముగా నమ్మటం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా రక్షకుడైన దేవునిని దృఢముగా నమ్మడం మీ మోక్షం యొక్క సౌలబ్యాన్ని కూడా చూపిస్తూవుంది, చూడండి.

సహాయం కొరకు దేవునిని చూడటం కంటే సులభమైనది ఏమన్నా ఉందా? రక్షణ కొరకు ఆయనను చూడమని చెప్పడం కంటే సహేతుకమైనది ఏమన్నా ఉందా? నిజ దేవుడు నావైపు చూడండి రక్షణ పొందుడి అని పిలవడంలో తప్పేముంది? కాని ప్రజలు రక్షింపబడుటకు, మోక్షం కొరకు ఆయనను చూడాలనుకోవటం లేదు. నిశ్చయంగా పాపమును బట్టి మరణిస్తున్న, శిధిలమైయున్న నిస్సహాయుడైన పాపి మోక్షానికి దేవుని వైపు చూసేంత సులభమైన పని చేయలేకపోతే, తప్పెవరిది? (మోక్షము) నుండి వాడు తనను తాను మినహాయించుకొంటున్నాడు. వాడు తన నిర్ణయమును బట్టి నరకమును కోరుకొంటూ దానిని కష్టపడి కొనుకుంటున్నాడు.

ఎవరైతే దేవుని ఆహ్వానాన్ని అందుకొని ఆయన వైపు చూచి రక్షణ పొందుకొన్నారో వాళ్ళు దేవుని రక్షణ అయిన క్రీస్తుని చూస్తూవున్నారు. ఆ క్రీస్తు దేవునిచే మీకు మీ కుటుంబానికి ఈవ్వబడిన మంచి బహుమానమై ఉన్నాడు.  ఈయన యూదులకు మాత్రమే కాదు మీకు నాకు భూదిగంత నివాసులందరికి దేవునిచే ఇవ్వబడిన మంచి బహుమానమై ఉన్నాడు.

ఆఫ్రికా దేశపు కరువుకు సంబంధించిన ఎన్నో ఫొటోస్ మనము చూసివుంటాం. బక్కచిక్కిన పిల్లలు, కడుపువుబ్బిన్న పిల్లలు, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు, దీనంగా, దైన్యముగా, గుంతలు పడిన కళ్ళతో, చూస్తున్న వారి ఫొటోస్ చూసే ఉంటాం. భాధ పడతాం, ఏదైనా సహాయం చెయ్యాలనుకొంటాం. ఎవరైనా వారం రోజులలో చనిపోతారని మనకు తెలిస్తే వాళ్లకు ఏదైనా చెయ్యాలని ఆరాటపడతాం, వాళ్ళు నవ్వుతు సంతోషముగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఒక ప్రశ్న అడుగుతాను. మన కళ్ళ ముందు రోజూ ఎన్నో ఆత్మలు చచ్చిపోతున్నాయి. ఏం చేస్తున్నాం?

ఆయన తప్ప ఏ దేవుడును లేడు. రక్షణ కొరకు దేవుడైన క్రీస్తు తప్ప ఆయన ద్వారా తప్ప ఎవడును రక్షింపబడడు అని దేవుడు చెప్తున్నాడు. ప్రజలు ఆయన వైపు చూచి ఆయన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచవలసియున్నారు. లేకపోతే నిత్య నాశనమునకు ఖండింపబడియున్నారు. ఆ నిత్య నాశనము ఎదుట రోజూ ఖండింపబడి దానిలో పడుతున్న కోట్లాది ఆత్మల విషయములో వారికి సహాయపడదాం. వారు ఎంతటి దైన్యమైన పరిస్థితులలో పడిపోతూ ఉన్నారో, ఎలాంటి గాయములతో వున్నారో, పాపము శరీరము సాతాను యొక్క వెన్నుపోటును బట్టి ఏమిచేయలేక నిస్సహాయతలో కూలిపోతున్న వారి ఫొటోస్ ఏ వార్త పత్రికలు ప్రచురించవు/ ప్రచురించలేవు. మేలుకో. యేసు క్రిస్మస్  మంచి బహుమానమైయున్నాడు, ఆయన అందరికి రక్షకుడైయున్నాడు, ఆయన రక్షించు ప్రేమ భూదిగంతముల వరకు ఉన్నది

ఈ దేవుని ఆహ్వానము కృపతో కూడిన దేవుని ఆహ్వానమైయున్నది. మనల్ని మనం రక్షించుకోలేము. కాబట్టి దేవుడే రక్షించాడు. కాబట్టి ప్రజలు దేవుని వైపు తిరిగి, ఆయనను నమ్మినప్పుడు, వాళ్ళు దేవుని చేత రక్షింప బడతారు. ఈ ఆహ్వానం భూమి అంతటా విస్తరించి ఉంది. ఇది దేవుని పాత నిబంధన ఇజ్రాయెల్ లేదా యూదా ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. ఈ మాటలు ఆయన అందరికి ఉద్దేశింపబడినవాడని తెలియజేస్తూ ఉన్నాయి.

2

23నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.

మోకాలు వంగుట అనేది ఒక వ్యక్తిని ఘనపరచుటను అతని అధికారమును ఒప్పుకొనుటను అతనికి లోబడుటను తెలియజేస్తూవుంది.  నా యెదుట ప్రతి మోకాలు వంగునని దేవుడు చెప్తున్నప్పుడు తనకే ఘనతను మహిమను ఇచ్చి తన చిత్తమునకు లోబడమని దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన ప్రమాణము ఇది ఎంతో త్రీవ్రమైన విషయమని ప్రాముఖ్యమైనదని తెలియజేస్తూవుంది.

అలాగే అంత్య దినమందు దీని సంపూర్ణతను మనం చూడగలం. యేసు తన మహిమతో తాను తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది. ఆయనను ద్వేషించిన శత్రువులు ఆయన ఎదుట మోకరిల్లుతారు. ఆయనను ఘనపరుస్తారు. అంటే ఆయన మహాత్యమును చూసిన వారు, భయముతో గౌరవముతో ఆయన ఎదుట మోకరిల్లుతారు.

మనం ఆయన గొప్ప ప్రేమను రుచి చూచి యున్నాము కాబట్టి ఇప్పుడే ఆయనను ఘనపరుస్తూ ఆయన ఎదుట మోకరిల్లుదాం. ఆయనను  సేవిస్తూ ఆయనకే మహిమను ఘనతను ఇద్దాం. ఆయనను గౌరవిద్దాం.  

24 యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు.

యెహోవాయందే_ ఎవరైతే యెహోవా నందు నమ్మిక ఉంచుతారో వాళ్ళు యెహోవానందు  నీతిని బలమును కనుగొంటారని అర్ధం. 

యేసుని కార్యమును బట్టి _నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను అని దేవుడే  ప్రకటించియున్నాడు ఈ మాటలు యెషయా 43:25 లో గ్రంథస్థము చేయబడియున్నాయి. అంటే, యెహోవాయే అన్ని పాపాలను తొలగించి, ఇప్పటివరకు జీవించిన లేదా జీవించబోయే ప్రతి మానవుడు పాపపు పరిణామాల నుండి విముక్తి పొందాడని తెలియ జేస్తున్నాయి. లోకమంతటి కొరకైనా ఈ గొప్ప బహుమతి  నమ్మిన ప్రతి ఒక్కరికి  వ్యక్తిగత బహుమానంగా ఇవ్వబడియున్నది.

ఇది “యెహోవాయందే” కనబడుతుంది, ఇంకెవ్వరిలోను మరెక్కడా కనబడదు. ఎందుకంటే   బైబిల్లో వుండే దేవుడు మాత్రమే లోకములో వుండే జనులందరి కొరకు వారి క్షమాపణ కొరకు ధరను  చెల్లించియున్నాడు. పాప క్షమాపణ కొరకు దేవుడు సొంత కుమారుని బలి ఇవ్వడం  మరే మతం ప్రకటించడంలేదు. “దేవుని కుమారుడైన యేసుని రక్తం మాత్రమే అన్ని పాపముల నుండి మనలను పవిత్రపరచుచున్నదని”(1 యోహాను 1: 7) నందు దేవుడు తెలియజేస్తూవున్నాడు. ఆ సందేశాన్ని ధృవీకరించడానికే దేవుడు ఇక్కడ ప్రమాణం చేసాడు. ఆయన కన్నా గొప్పవాడు, ఉన్నతమైన వాడు ఎవడు లేడు కాబట్టే ఆయన తన మీద తానే ఒట్టుపెట్టుకొంటూ, నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను అని అంటూవున్నాడు.  అంటే  తాను ప్రకటించినది, చెప్పినది నిజమని, ఆ మాటలను తాను ఉపసంహరించుకోనని స్వయంగా ఆయనే ప్రమాణం చేసాడు. అంటే దేవుని వాగ్దానములైన విమోచన, విముక్తి శాశ్వతంగా ఉంటాయని  మరియు అవి భూమి ఫై వుండే అందరి కొరకు అన్ని తరాల కొరకు ఉద్దేశించబడి వున్నాయని ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి.

యెహోవాయందే నీతి +బలము ఉన్నవని_ జనులు నన్ను గూర్చి చెప్పుదురు అని చెప్తున్నాడు. అంటే జనులు తమలో (వాళ్లలో) నీతిని బలమును కనుగొనలేరని యెహోవానందు మాత్రమే కనుగొనగలరని దీని అర్ధం. యెహోవాయందే నీతి బలములున్నవని మనం ఎలా కనుగొన్నామో చెప్పండి. పరిశుద్దాత్ముడు సువార్త ద్వారా మనలను పిలిచి తన వరములవలన వెలిగించి నిజమైన విశ్వాసిగా తండ్రి కుమార పరిశుద్దాత్మను విశ్వసించునట్లుగా చేసియున్నాడు వారిలో నీతి బలములను కనుగొనుటకు ఆయనే మనకు సహాయపడియున్నాడు. ఆయనే వాటిని మనకు దయచేసియున్నాడు/ దయచేస్తూవున్నాడు. ఆయన నీతి బలములను పుచ్చుకోవడానికి నిరాకరించే వారు _ నిరాకరించడం అంటే_ తమ పాపములను తమతో ఉంచుకొనుటకు ఇష్టపడటం _ క్రీస్తు నీతిని వద్దనుకోవటం. గుర్తుపెట్టుకోండి, ఒక రోజు అందరూ ఆయన యొద్దకు రావలసి వున్నారు అప్పుడు సిగ్గుపడతారు. అయితే దేవుడు జనులకోసం సిద్ధం చేసిన నీతిని విశ్వసించి, స్వీకరించే వారందరూ “నీతిమంతులుగా ఉంటారు మరియు ఆనందిస్తారు.” కృప ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడియున్నారు. ఆ నీతిలో వాళ్ళు  ఆనందిస్తారు.  మనం వారిలో కూడా ఉంటాం/ ఉన్నాం. హల్లెలూయా!

నావైపు చూచి రక్షణ పొందుడిఅను మాటలకు  నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని ఆయన చెప్పుటను ఆలకించియున్నాం. నీతిపరుడనగు దేవుడను, రక్షించు వాడను నేనే అను మాటలకు సారాంశమును నెరవేర్పును యేసు నందు కనుగొనగలం. ఆయనను విశ్వసించిన వారందరు క్రీస్తు నుండి నీతిని పుచ్చుకొంటూ వున్నారు. క్రీస్తు నీతి మనకు క్రెడిట్ చేయబడుతూవుంది.   క్రీస్తును విశ్వసించియున్న మనము ఆయన నీతిని బట్టి ఇప్పుడు పరిశుద్దులముగా దేవునికి అంగీకారయోగ్యులముగా వున్నాం.

అలాగే మనము ఆయన నుండి బలమును కూడా పొందుకొంటున్నాము. బలము అనే మాటను ఇశ్రాయేలీయులు ఎలా అర్ధం చేసుకున్నారో ఒక్క క్షణము ఆలోచిధ్ధాం. ఇశ్రాయేలీయులు చెర పట్టబడి యున్నారు. ఆ చెరలో వారి శత్రువును ఓడించే బలము వారికి లేదు, వారిని ఓడించలేరు కూడా. కాని వారి రక్షుకుడైన దేవుడే వారి కొరకు ఆ శత్రువును ఓడించియున్నాడని వాళ్ళు అర్ధం చేసుకొని ఉండివుంటారు. అదే విధముగా మన రక్షకుడైన యేసు మనము ఎన్నటికీ ఓడించలేని  సాతానును ఓడించియున్నాడని మనము కూడా తెలుసుకోవలసి వున్నాం. మనము బలహీనులముగా ఉన్న చోట యేసు బలముగా వున్నాడు. మనకు మనముగా సాధించలేని దానిని ఆయన మన కొరకు సాధించియున్నాడు.

యెషయా మాటలను ఆలకించుచున్న మనం యేసు నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను ఆయనేనని అర్ధం చేసుకొందాం. క్రిస్మస్ ను అర్ధం చేసుకోకుండా దానిని మరొక విధముగా మార్చివేయడం ద్వారా, దాని యందున్న దేవుని ఉద్దేశాన్ని నిర్లక్ష్యం చేస్తూవున్నాం. యేసులో మనము నీతిని బలమును కలిగి యున్నా మని మరచిపోకండి. ఆయన యెదుటనే సర్వ జనములు సమకూర్చబడుదురు. ఆయనమీద కోపపడిన వారందరు సిగ్గుపడుదురు.

ఈ క్రిస్మసుకు మనం తీసుకొన్న బహుమతులన్నీ పరిపూర్ణమైనవి కావు. యేసు మాత్రమే పరిపూర్ణమైన బహుమానమై యున్నాడు. ఎందుకంటె అయోగ్య పాపులమైన మన అందరి కొరకు ఆయన వచ్చియున్నాడు. ఆయన పాపమును సాతానును జయించి మనకు తన నీతిని ఇస్తూవున్నాడు మరియు మన జీవితాలకు సంతోషాన్ని ఇస్తూవున్నాడు. ఆ సంతోషమే ఆయనను ఘనపరచుటకు స్తుతించుటకు సేవించుటకు మరియు లోబడుటకు మనలను నడిపించుచున్నది. ఆమేన్.