పాత నిబంధన పాఠము: యెషయా 52:7-10, 16; పత్రిక పాఠము: హెబ్రీ 1:1-9; సువార్త పాఠము: యోహాను 1:1-14; కీర్తన 98.
ప్రసంగ పాఠము: యెషయా 52:7-10
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ఎన్నో సంవత్సరాలనుండి మనం క్రిస్మస్ను (మన రక్షకుని యొక్క జన్మ దినాన్ని) పండుగగా జరుపు కుంటున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మ దినం_ పండుగ, స్టార్స్ , లైటింగ్స్, డెకొరేషన్స్, క్రొత్త బట్టలు, పిండివంటలు, విందు భోజనాలు, కేక్ కటింగ్, చర్చి సర్వీసెస్, కెరోల్స్, బహుమతులు, కుటుంబములు కలుసుకోవడం. మరి అసలు క్రిస్మస్ అంటే ఏమిటో యేసుకు 600 సంవత్సరాలకు ముందు జీవించిన, దేవుని ప్రవక్త అయిన యెషయాను అడుగుదాం_ ఆతని మాటల ద్వారా నిజమైన క్రిస్మస్ లోని గొప్పతనాన్ని పరిశీలిద్దాం. మన పాఠాన్ని ధ్యానించుకొందాం.
నిజమైన క్రిస్మస్ లోని గొప్పతనమును తెలుసుకొందాం
- రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు గొప్పవి 7,8
- విడుదల విమోచనను గూర్చి పాటలు పాడు స్వరములు గొప్పవి. 9,10
- దేవుని కనికరమును శక్తిని బయలుపరచు దేవుని బాహువులు గొప్పవి, 10
1
7సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నవి.
గుర్తింపును కోల్పోయి, వాగ్దాన దేశమును పోగొట్టుకొని, వారి స్థితిని మార్చి వారితో నిబంధన చేసుకొనిన దేవుని విశ్వాస్యతను దూరం చేసుకొని, వారి పాపములకు శిక్షగా పరాయి దేశములో చెరలో, నిరీక్షణ, ఆశ లేక, నిస్సహాయతలో, నిరాశలో ఉన్న జనుల ముందుకు ఒకడు పరిగెత్తుకొంటూ వస్తూ, మీ అందరికి, శుభవార్త! మీకు విడుదల, నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పుటను ఊహించుకోండి. యెషయా తన ప్రజలను దేవుడు కృపలో విమోచించడం గురించి ఇక్కడ ప్రవచిస్తూ వున్నాడు. ఈ వచనాలలో, అతడు విడుదల ఇప్పుడే సంభవించినట్లుగా మాట్లాడుతున్నాడు. సందేశకులు శుభవార్తతో ముందుకు సాగారు. వారి పాదాలు గొప్ప శుభవార్తతో ఉన్నాయి. ఆ శుభవార్తలో ఉన్న సంతోషం, మొదటిగా క్షమింపబడియున్నామని వినటం, రెండవది చెరనుండి విడుదల, సొంత ఊరుకు, సొంత ప్రజల దగ్గరకు, సొంత దేశానికి వెళ్తామనే ఆనందం.
ఆ శుభవార్తను తెచ్చినవాడు ప్రజలందరికి చాల అందంగా కనిపిస్తాడు, పాదాలనుండి తలవరకు. మనం ఆ శుభవార్తను ప్రకటిస్తున్న అతని నోటికి ప్రాధాన్యమిస్తాం, కాని ఆ శుభవార్తను మోస్తూ వారి దగ్గఱకు ఆ శుభవార్తను తెచ్చిన అతని కాళ్లకు మనం ప్రాధాన్యమివ్వం. కాని ఇక్కడ ప్రవక్త సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నవి, అని యెషయా చెప్తూ ఉన్నాడు.
మొదటిగా, శుభవార్తను ప్రచురించుచున్నవాడు అంతటను అందరికిని ప్రచురించుటకు ప్రత్యేకముగా ఈ పని నిమిత్తమై పంపబడియున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. అతడు రాత్రి అనక పగలు అనక, వర్షమనక ఎండనక చలి అనక నిబద్ధతతో తనకు ఇవ్వబడిన పనిని తనకు ఇవ్వబడిన పరిధిలో పూర్తి చేయుటకు కాలినడకన ప్రజలందరికి ప్రచురించవలసియున్నాడు. ఇది ఎంతో కష్టము, ప్రయాసముతో కూడుకొనిన పని. కాబట్టే రోమా 10:15 ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది అని చెప్తూవుంది. మూడు పదాలు వారి సందేశం యొక్క కంటెంట్‌ను గురించి ఇక్కడ తెలియజేస్తూవున్నాయి: సమాధానము, సువర్తమానము మరియు రక్షణ సమాచారం.
ఆనాడు చెరలో ఉన్నఇశ్రాయేలీయులకు సంతోషాన్నిచ్చే వార్త ఏమన్నా ఉంది అంటే అది వారి విడుదలే. ఇశ్రాయేలీయులు, వారి పాపమును బట్టి వారి దేవునినుండి దూరమయ్యారు. ఇప్పుడు మన పాఠములో ఇశ్రాయేలీయుల దగ్గరకు పరిగెత్తుకొంటూ వచ్చిన దేవుని దూత వారికి ప్రకటించిన శుభవార్త, సమాధానము.
ఇక్కడ సమాధానము అంటే, దేవుని ప్రజల చుట్టూవున్న దేశాలతో శత్రుత్వమ్ము ముగియడాన్ని ఇది సూచించడం లేదు. ఈ సమాధానానికి చాలా లోతైన అర్థం ఉంది. దేవుడు తన ప్రజలకు మరియు తనకు మధ్య ఏర్పరచుకున్న సమాధానమది. ఇది, దేవుని ప్రజలకు దేవునికి మధ్యన సమాధానాన్ని యెహోవాయే పురుద్దరించియున్నాడు అని తెలియజేస్తూవుంది. అంటే దేవుడు వారిని క్షమించడం, అంగీకరించడం, చేర్చుకోవడం. ఈ సమాధానము భూమిపై తన కార్యము ద్వారా దానిని సాధించడానికి రాబోతున్న మెసయ్యను బట్టి యెహోవాయే పురుద్దరించియున్నాడు. దేవుడు ఇకపై తన ప్రజల పట్ల కోపంతో రగిలిపోడు. దేవుడు మరియు అతని ప్రజల మధ్య మంచి పరిస్థితి ఉండటానికి దేవుడే వారి పాపాన్ని మెస్సయ్యను బట్టి తొలగించాడు అని తెలియజేస్తూవుంది. ఈ శుభవార్తను దేవుని నుండి వారి దగ్గరకు తెచ్చిన వాని పాదములు ఎంతో సుందరములు అని మన పాఠము చెప్పుచున్నది.
కాబట్టే సమాధానకర్తయైన యేసుని జన్మములో, లూకా 2:14లో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని పరలోక సైన్య సమూహము ప్రకటించుటను మనం ఆలకించియున్నాము. యోహాను 14:27, శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడ నియ్యకుడి, వెరవనియ్యకుడి అని యేసు చెప్తూవున్నాడు.
వారి పాపమును బట్టి ఇశ్రాయేలీయులు వారి దేవునినుండి దూరమయ్యారు _ అంటే, పాపమును బట్టి పాపమునకు దాసులయ్యారని_ అపవాదికి దగ్గరై అపవాది సంబందులయ్యారనేగా_ అంటే, వారి స్వాభావికమైన పాపమును బట్టి వారు ఆత్మీయ దాస్యములో, అపవాది అధికారము క్రింద ఉన్నారు. పాపము దేవుని నుండి వారిని దూరపరచి యుండటమే కాకుండా స్థిరముగా వారిని స్వాధీనపర్చుకొనియున్నది (నిర్బంధ చెర). వాళ్ళు పరాధీనులై యున్నారు. ఇప్పుడు మన పాఠములో ఇశ్రాయేలీయుల దగ్గరకు పరిగెత్తుకొంటూ వచ్చిన దేవుని దూత వారికి ప్రకటించిన శుభవార్త, విడుదల.
కీర్తనలు 100:5 యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. ఈ శుభవార్తను దేవుని నుండి వారి దగ్గరకు తెచ్చిన వాని పాదములు ఎంతో సుందరములు అని మన పాఠము చెప్పుచున్నది.
వారి పాపమును బట్టి ఇశ్రాయేలీయులు వారి దేవునినుండి దూరమయ్యారు_ అంటే, పాపమును బట్టి వాళ్ళు ఆత్మీయముగా మృతులయ్యారనేగా_ ఇప్పుడు మన పాఠములో ఇశ్రాయేలీయుల దగ్గరకు పరిగెత్తుకొంటూ వచ్చిన దేవుని దూత వారికి ప్రకటించిన శుభవార్త _ రక్షణ సమాచారం.
వారి దోష రుణమునకు బదులుగా వాళ్ళు దేవుని కృపను రెండింతలుగా దేవుని నుండి వాళ్ళు పొందుకొని యున్నారు అని వారికి ప్రకటింపబడింది_ అది ఆయన నిర్ణయము, ఆయన చొరవ, ఆయన చర్యను బట్టి, యెహోవా ప్రేమ కృపలను బట్టి ఆ కృప సంపూర్ణతను బట్టి, అంటే_ శరీరధారిగా రాబోవు ఆ కృపాసత్య సంపూర్ణుడైన మెస్సయ్యను బట్టి వారి దోష రుణమంతా కొట్టివేయబడియున్నదను నిశ్చయతను బట్టి వాళ్ళు అత్యానంద భరితులైయ్యారు. ఈ శుభవార్తను దేవుని నుండి వారి దగ్గరకు తెచ్చిన వాని పాదములు ఎంతో సుందరములు అని మన పాఠము చెప్పుచున్నది.
ఆ వర్తమాణికుడు వారికి ప్రకటించిన ప్రచురించిన సువార్తను బట్టి వాళ్ళు అత్యానందభరితులైయ్యారు, ఆ సువర్తమానము వారికి నిజమైన సంతోషమును తెచ్చింది. వాళ్ళు నిజముగా క్రిస్మసును ఘనముగా జరుపుకొన్నారు. నిజంగా సువార్తను తీసుకొని పరిగెత్తుచున్న వాని పాదములు ఎంతో సుందరమైనవి కదా. ఈ రోజు మనము ఇదే భావములో క్రిస్మస్ను జరుపుకొంటున్నామా?
నీ దేవుడు ఏలుచున్నాడనే మాటలు_ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇశ్రాయేలీయులు వారి పాపమును బట్టి వారి దేవునినుండి దూరమైనప్పుడు, వారిని పాలించుటకు దేవుడు ఇతరులను అనుమతించియున్నాడు. ఇప్పుడు ఆయనే బబులోనియనులను అంతం చేసి తిరిగి తన ప్రజలను వెనుకకు రప్పించుచున్నాడు. ఇది ప్రతిదీ దేవుని నియంత్రణలోనే ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూవుంది.
మీ పాపములను బట్టి మీరు దేవునికి దగ్గరగా వున్నారా లేక దేవునికి దూరముగా ఉన్నారా? చూసుకోండి. పాపమును బట్టి పాపమునకు దాసులముగా ఉంటారని_ అపవాదికి దగ్గరై అపవాది సంబంధులముగా వుంటారనే విషయాన్ని తెలుసుకోండి, పాపమును బట్టి దాని నిర్బంధ చెరలో శిక్షకు పాత్రులముగా దేవుని ఉగ్రతకు లోనుకాబడి యున్నామని గ్రహించండి. పాపమును బట్టి ఆత్మీయముగా మృతులముగా ఉన్నామా లేదా క్రీస్తుని బట్టి జీవించి యున్నామా పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. మీ పరిస్థితులు మీ స్వాధీనములో లేవని మీరను కొంటున్నారా? మీ స్థితికి పరిస్థితికి కారణము మీ పాపమనే విషయం మరచిపోకండి. ఇప్పుడు మీకును దేవుని సువార్త రక్షణ సమాచారం సమాధానము ప్రకటింపబడియున్నది_ మీ పాపములకు దేవుని క్షమాపణ, విడుదల, జీవము, క్రీస్తుని బట్టి మీకును ప్రకటింపబడుతూవున్నది. సంతోషించుడి, ఉల్లసించుడి. మీ రక్షకుడు మీ కొరకు నేడు పుట్టియున్నాడు. నిజంగా ఈ సువార్తను మన దగ్గరకు తెచ్చే వారి పాదములు ఎంతో గొప్పవి కదా.
2
8ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు. 9యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూషలేమును విమోచించెను.
7వ వచనంలో ప్రజల దగ్గరకు పరిగెడుతూ వారి బానిసత్వము ముగిసిందను శుభవార్తను ప్రకటించిన ఒక వర్థమాణికున్ని చూసాం. ఇప్పుడు అదే దృశ్యాన్ని మరొక కోణం నుండి చూద్దాం_ కావలివారు పట్టణపు గోడలపై నిలుచుండి ఒక వర్థమాణికుడు పరిగెడుతూ ప్రచురించుచున్నది విని దానిని వాళ్ళు తిరిగి ప్రచురించుటను 8వ వచనములోని మాటలు తెలియజేస్తున్నాయి.
ఈ వచనములో ఆసక్తికరమైన విషయమేమిటంటే, బబులోనీయులు ఇశ్రాయేలుపై దండెత్తినప్పుడు వాళ్ళు ఆ పట్టణాన్ని నాశనము చేసారు. రాతి మీద రాయి ఉండకుండా కూలద్రోశారు. పాడుచేయబడిన యెరూషలేముతో (అక్కడవున్న రాళ్ళూ రప్పలతో) దాని కావలివారు పలుకుచు, ఆ రాళ్లను ఉద్దేశిస్తూ, దేవుడు తన మాటను నిలుపుకొని తన ప్రజలను విమోచించి వారిని తిరిగి తీసుకొని వస్తున్నాడు అని సంతోషముతో పాటలు పాడుచున్నారు.
రాళ్ళూ పాడుతాయ? రాళ్ళూ పాడుతాయని మన మెప్పుడు వినలేదు. కానీ రాళ్ళూ పాటలు పాడుటకు మనతో చేరుతాయని యెషయా మనకు చెప్తున్నాడు. కాబట్టే యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూషలేమును విమోచించెను అని యెషయా అంటూవున్నాడు.
ఇశ్రాయేలీయులకు ప్రకటింపబడిన సమాధానమును బట్టి, తిరిగి దేవుని బిడ్డలుగా దేవుని సంబంధులుగా వారికివ్వబడిన ప్రత్యేకతను బట్టి, నిర్బంధ చెర నుండి విడిపింపబడుటను బట్టి, వారికి అందించబడియున్న సువార్తను ఆలకించిన కావలివారు సంతోషముతో పాడైన పట్టణముతో మాట్లాడుటే కాకుండా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పాటలుకూడా పాడుతున్నారు, ఎందుకనో తెలుసా? అంతర్లీనంగా ఇక్కడ మరొక విషయముంది. ఏంటంటే వారి దేవుడు తిరిగి వారి మధ్యకు రాబోతున్నాడు. వారి మధ్య ఉండబోతున్నాడు. వారికివ్వబడిన మెస్సయ్య కు చెందిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. అది వారి సంతోషము.
దేవుడు మనకు ప్రకటించియున్న సమాధానమును బట్టి, మనలను దేవుని బిడ్డలుగా దేవుని సంబంధులుగా చేసుకొని యుండుటను బట్టి ప్రత్యేకతను బట్టి, పాపమనే నిర్బంధ చెర నుండి విడిపించియుండుటను బట్టి, విమోచించి యుండుటను బట్టి మనము కూడా మన దేవునిని స్తుతిద్దాం. ఈ సంతోషమునకు మించినది ఏదన్నా ఉందా? నేడు మీ దేవుడు మీ మధ్యకు వచ్చియున్నాడు. సంతోషించుడి, ఉల్లసించుడి. మీ రక్షకుడు మీ కొరకు నేడు పుట్టియున్నాడు. మన కివ్వబడియున్న వాగ్దానమును బట్టి ఆయన తిరిగి మన మధ్యకు రాబోవుచున్నాడు, తీర్పరిగా, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తపడండి.
3
10 సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచియున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.
యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచియున్నాడు అనే యెషయా మాటకు అర్ధం ఏమిటనేది ఒక్క క్షణం ఆలోచిధ్ధాం. అతడు ఉపయోగించిన మాటకు వెనుకనున్న దృశ్యం -యెషయా కాలములో ప్రజలు సమాధానాన్ని కలిగి ఉంటే వాళ్ళు పొడుగు చేతుల పొడుగు అంగీనీ ధరించేవాళ్ళు. వాళ్ళ చేతులు కనబడేవి కాదు. అదే వాళ్ళు పొలములో పనిచేయవలసి వచ్చినప్పుడు కాని లేదా పనిచేసేటప్పుడు కాని లేదా యుద్దానికి కాని పొట్టి చేతులు కలిగిన అంగీని ధరించెడివాళ్ళు. వాళ్ళ చేతులు కనబడేవి. దేవుడు తన పరిశుద్ధ బాహువును బయలుపరచి వున్నాడు, అనే మాటలు అర్ధమయ్యాయా?
ఆసక్తికరమైన విషయమేమిటంటే, సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలు పరచియున్నాడు అను యెషయా మాటలలో ఉన్న ఆసక్తికరమైన విషయమేమిటో చెప్పండి_ తాను ఎన్నుకొనిన ప్రజల పక్షముగానే కాకుండా, సమస్త ప్రజల పక్షమున (అంటే, ఇశ్రాయేలీయులకు, విశ్వాసులకు, అన్యులకు,) యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచివున్నాడు.
అంతేనా భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు అని యెషయా చెప్తూఉన్నాడు. అంటే, దేవుడు తన ప్రజలను రక్షించెనని భూదిగంత నివాసులందరు తెలుసుకొంటారని యెషయా చెప్తున్నాడు. యెషయా ప్రవచనం నిజం. భూదిగంత నివాసులందరు అంటే భూమి మీద ఉన్న వారందరు, వాళ్లలో మనం కూడా ఉన్నాం. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా సమస్త జనులను విడిపించుటకు యుద్ధము చేసియున్నాడు. కల్వరికొండఫై సిలువలో ఆయన యుద్ధము చేసియున్నాడు, మనలనందరిని విడిపించడానికి, విమోచించడానికి, విడుదలనివ్వటానికి. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచియున్నారు. దేవుడు మనకు నీతిని సంపాదించుటకు తన పరిశుద్ధ బాహువును బయలుపరచి యున్నాడు. దేవుని యొక్క శక్తిని కనికరమును బయలుపరచిన దేవుని బాహువులు నిజముగా గొప్పవి అని ఒప్పుకొందాం. ఆయనను ఆశ్రయిధ్ధాం, ఆయనను సమీపిధ్ధాం. ఆయనను నమ్ముదాం. ఆయనే మన విమోచకుడు, విడుదలనాయకుడు, మన రక్షణ కర్త, సమాధానాధిపతి.
ఈ సంతోషకరమైన వార్తను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. మీ రక్షకుడు మీ కొరకు నేడు పుట్టియున్నాడు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకొందాం. మనలను విడిపించిన, విమోచించిన, విడుదల అనుగ్రహించిన మన క్రీస్తునకు స్తుతులను చెల్లిద్దాం. ఆమేన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.