క్రీస్తు పునరుత్థానం“లో సాక్ష్యులుగా స్త్రీలే ఎందుకు?

“క్రీస్తు పునరుత్థానం”లో సాక్ష్యులుగా దేవుడు తన శిష్యులను కాకుండా స్త్రీలనే ఎందుకని అనుమతించి యున్నాడు?

క్రీస్తు పునరుత్థానం” అనే ప్రత్యేకమైన ఆనాటి ఎడిషన్లో మత్తయి మార్కు లూకా యోహాను అను న్యూస్ రిపోర్టర్స్ యొక్క ప్రామాణికమైన వినదగిన ఒక సాక్ష్యమును బట్టి దేవుడు స్త్రీలను యేసుని సమాధి దగ్గరకు మొదటిగా ఎందుకని అనుమతించియున్నాడు? అనే ప్రశ్నకు జవాబును తెలుసుకొందాం.

శిష్యులు కాకుండా కొందరు స్త్రీలు ఆదివారాన్న తెల్లవారుచుండగా యేసుని సమాధివద్దకు ఎందుకని వచ్చియున్నారు? అనే ప్రశ్నకు మనమందరం యూదుల నాయకులు శిష్యులను కూడా అరెస్టు చేసి వారికి కూడా మరణశిక్ష వేసి చంపే అవకాశం ఉన్నందున, శిష్యులు వాళ్ళకి భయపడి దాక్కోవటం మూలాన్న వాళ్ళు మొదటిగా సమాధి యొద్దకు రాలేక పోయారని చెప్తాo.

క్రీస్తు మూడవరోజున లేస్తాడని శిష్యులుగానీ, స్త్రీలుగానీ ఊహించలేదనేది నమ్మలేదనేది కూడా స్పష్టమే. అందుకనే శిష్యులు సమాధి యొద్దకు రాలేదేమో అని కూడా చెప్తాo.

ప్రధానయాజకులకు పరిసయ్యులకు ఆయన మూడవదినాన్న లేస్తానని చెప్పిన మాట జ్జ్యపాకం వుంది. వాళ్ళు కూడా యేసు లేస్తాడని నమ్మలేదు కాకపోతే ఆయన శిష్యులు ఆయనను ఎత్తుకొనిపోయి ఆయన లేచియున్నాడని ప్రచారము చేస్తారని అనుకోని 3రోజుల వరకు సమాధిని భద్రము చేసియున్నారు. శిష్యులు యేసుదేహాన్ని దొంగిలించారని యూదుల నాయకులు ఒక అబద్దాన్ని ప్రచారంలోనికి తెస్తారనే విషయం దేవునికి ముందే తెలుసు. ఆ రోజులలో ఈ అబద్ధాన్ని యూదా మతనాయకులు ఎంత వైరల్ చేసారంటే, మత్తయి తన సువార్తను వ్రాసిన టైంలో కూడా అంటే పునరుత్థానానికి 20 సంవత్సరాల తర్వాత కూడా ఇది ప్రచారంలో ఉంది అనే విషయాన్ని మత్తయి 28:15 వచనము ద్వారా మనం తెలుసుకోవచ్చు (అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది).

శిష్యులు సమాధికి మొదటగా వచ్చినట్లైతే, ఇది “శిష్యులు యేసుదేహాన్ని దొంగిలించారనే” అబద్ధానికి మరింత బలం ఇస్తుంది. కాబట్టి శిష్యులు సమాధివద్దకు వచ్చిన వారిలో మొదటి వారుగా ఉండకూడదనేది దేవుని ప్రణాళికలో భాగం కావొచ్చేమో.

ప్రధానయాజకులు పరిసయ్యులు శిష్యులకు చాలా క్రెడిట్ ఇచ్చారండి. నిజం చెప్పాలంటే యేసు మరణం యొక్క షాక్ శిష్యులను స్తంభింపజేసింది. వాళ్ళు యేసుని బట్టి దుఃఖిస్తూ వున్నారు. శిష్యులు యేసు దేహమును దొంగిలించడానికి అవసరమైన శారీరకమైన మానసికమైన దారుడ్యాన్ని కలిగిలేరు. యేసు శరీరాన్ని దొంగిలించడానికి శిష్యులకు ఎటువంటి కారణం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆయన పునరుత్థానం గురించి, ఆయన బోధలను గురించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదనే విషయం బహుస్పష్టం. అందువల్లే ఆయన లేస్తారని కూడా వాళ్ళు అనుకోలేదు. ఆయన లేచాడనే స్త్రీల మాటలు శిష్యుల దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడ్డాయి గనుక శిష్యులు వారి మాటలు నమ్మలేదు అని లూకా 24:11 వచనము చెప్తూవుంది. కాబట్టే శిష్యులు సమాధి యొద్దకు స్త్రీలతో పాటు రాలేదు.

స్త్రీలు ఆదివారాన్న తెల్లవారుచుండగా యేసుని సమాధివద్దకు ఎందుకని వచ్చియున్నారు? అనే ప్రశ్నకు మార్కు 16:1 వచనము ప్రకారము విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు, యోహన్నయు, వారితోకూడ ఉన్న యితర స్త్రీలును ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరని, లూకా 24:1 వ వచనము ప్రకారము ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చిరని బైబులు చెప్తూవుంది. సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చిరను మాటలలో స్త్రీలకు కూడా యేసు లేస్తాడనే నమ్మకం ఏమాత్రము లేదనే విషయం అర్ధంఔతూ వుంది. మరి యోహాను 19:39,40 వచనాలు నీకొదేము బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి అని చెప్తూ వుంది కదా.

మరి స్త్రీలు సమాధి వద్దకు అభిషేక సుగంధద్రవ్యాలను ఎందుకు తెచ్చారు అనే అనే డౌట్ మనకు రావొచ్చు.

యేసుని బరియల్ చేసినవాళ్లు యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు యేసుని దేహమునకు పూసియున్నారనే విషయాన్ని ఎవరు స్త్రీలకు చెప్పియుండక పోవచ్చు అని మనం అనుకోవచ్చు. కాని మత్తయి సువార్త 27:61 మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి అనే వచనము యేసుని బరియల్ లో మగ్దలేనే మరియయు, వేరొక మరియయు చివరిదాకా వున్నారని చెప్తూ ఉంది దీనినిబట్టి నీకొదేము తెచ్చిన సుగంధద్రవ్యములను యేసుని బరియల్ చేసిన వాళ్ల్లు  యూదులు పాతిపెట్టు మర్యాదచొప్పున ఆ సుగంధద్రవ్యములను యేసుని దేహమునకు పూసి యున్నారనే విషయం స్త్రీలకు తెలుసని మనకు అర్ధంఔతూవుంది. 

రోమన్ ఆచారం ప్రకారం సిలువవేయబడిన వారి మృతదేహాలను రాబందులు ఇతర పక్షులు మాంసాహార జంతువులు తినివేసేవరకు అవి రోజుల తరబడి శిలువపై ఉంచబడేవి.

యూదులు పాతిపెట్టు మర్యాదచొప్పున అంటే ఏంటంటే, యూదుల ఆచారం ప్రకారం ద్వితీయోపదేశ కాండము 21:22,23 ప్రకారం మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడ దీసిన యెడల అతని శవము రాత్రివేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. అగత్యముగా ఆ దినమునే వానిని పాతిపెట్టవలెను అను ప్రకారము యేసుని మ్రానుమీది నుండి దింపి అగత్యముగా ఆ దినమునే రాత్రి కాకమునుపే యూదులు పాతిపెట్టు మర్యాదచొప్పున యేసుని బరియల్ చేసియున్నారు.

యేసుని దేహాన్ని నారబట్టతో చుట్టడానికి ముందు ఆయన దేహాన్ని శుభ్రముగా కడగడానికి ఆ సమాధి దగ్గర ఏమైనా సౌకర్యాలు ఉన్నాయో లేదో అనేది మనకు తెలియదు. కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటం, సిలువ గాయాలతో యేసుని దేహము రక్తముతో నిండి దయనీయముగా ఉంది. కాబట్టి యేసుని దేహాన్ని శుభ్రముగా కడగడానికి అక్కడ నీరు లేనప్పటికి ఆయన దేహాముపై రక్తాన్ని శుభ్రం చెయ్యకుండా యేసేపు నీకొదేములు ఆయనకు నారబట్ట చుట్టి ఉంటారని అనుకోకూడదు. అంటే వాళ్ళు యూదుల మతాచారం ప్రకారం యేసుని దేహాన్ని శుభ్రముగా క్లీన్ చేసివుంటారు. ఆవిధముగా యూదులు పాతిపెట్టు మర్యాదచొప్పున యేసుని బరియల్ చేసియున్నారు. యూదుల ఆచారం ప్రకారం మృతదేహాన్ని శుభ్రమైన క్రొత్తదైన తెల్లని నారబట్టతో చుట్టవలసి వున్నారు తప్ప మృత దేహానికి పట్టు వస్త్రాలను గాని ఖరీదైన వస్త్రాలను గాని చుట్టకూడదు వాటిని కప్పకూడదు రాజులైనా సరే. అలాగే మృత దేహాలను సుగంధ ద్రవ్యాలతో సమాధి చెయ్యడం యూదుల ఆచారం.

యూదుల ఈ ఆచారం ప్రకారం వాళ్ళు యేసుని దేహాన్ని శుభ్రముగా క్లీన్ చేసిన తరువాత శుభ్రమైన క్రొత్తదైన తెల్లని నారబట్టను ఉపయోగించారని ఆ శుభ్రమైన క్రొత్తదైన నారబట్టతో యేసుని కాళ్ళు చేతులకు విడివిడిగా చుట్టి తరువాత ఆయన దేహం మొత్తం కలిపి చుడుతూ శుభ్రమైన క్రొత్తదైన నారబట్ట యొక్క ప్రతి పొరలో నీకొదేము తెచ్చిన బోళముతో కలిపిన అగరును ఉంచుతూ యేసుని దేహమంతటికి నారబట్టలు చుట్టారు. తరువాత తల ప్రత్యేకముగా గుడ్డతో చుట్టబడింది. బోళముతో కలిపిన అగరు అంటే ఇవి డ్రై స్పైసెస్ అంటే ఇవి పొడిరూపంలో ఉన్న సుగంధద్రవ్యాలు. ఇవి గాయాలను ఎండిపోజేసి రక్తం ఆవిరయ్యేటట్లు చెయ్యడమే కాకుండా దేహమునుండి స్రావాలు స్రవించకుండా కాపాడే నిమిత్తము వాళ్ళు బోళముతో కలిపిన అగరును శుభ్రమైన క్రొత్తదైన నారబట్ట యొక్క ప్రతిపొరలో పూశారు. ఆవిధముగా యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున యేసుని బరియల్ చేసియున్నారు. ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడని సమాధిలో యేసును ఉంచటం యేసుకు ఇవ్వబడిన మర్యాదను గౌరవాన్ని తెలియజేస్తూవుంది.

సమాధి చెయ్యడం యూదుల పద్ధతి. యేసు సమాధి తన సొంత ప్రజల పద్ధతిలో జరిగింది. అతని స్నేహితులు అదెట్లు జరిగిందో చూశారు. ఆవిధముగా యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున యేసుని బరియల్ చేసియున్నారు.

క్రీస్తుకు బెస్ట్  ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్న యేసేపు నీకొదేములు ఖచ్చితంగా యేసుని దేహానికి ది బెస్ట్ ఇచ్చే వుంటారు. అట్లే ఆయన బరియల్ యెషయా 53:9 ప్రకారము అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను అను ప్రవచనము యొక్క నెరవేర్పని కూడా చెప్పొచ్చు.

మార్కు16:1-3; లూకా24:1 వచనాలను బట్టి విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు, యోహన్నయు, వారితోకూడ ఉన్న యితర స్త్రీలును ఆయనకు పూయ వలెనని సుగంధ ద్రవ్యములు కొనిరని (ఆస్త్రీలు) ఆ సుగంధద్రవ్యములను సిద్ధపరచిరని వారు ఆదివారమున పెందలకడ లేచి తాము సిద్ధ పరచిన సుగంధద్రవ్యములను తీసికొని బయలుదేరి తెల్లవారుచుండగా సమాధి యొద్దకు వచ్చిరని అర్ధం ఔతూవుంది. అట్లే మత్తయి 28:1వ వచనంలో (ఆ స్త్రీలు) సమాధిని చూడవచ్చిరి అని తెలియజేస్తూవున్నాడు.

ఆనాటి ఆచారము ప్రకారము యూదులలో ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వారి దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో స్త్రీలు ఎంబామింగ్ చేసేవాళ్ళు అంటే అభిషేకించే వాళ్ళు. పురుషులు ఆ దేహాన్ని బరియల్ చేసే వాళ్ళు. కాని ఇక్కడ ఆయన బరియల్ త్వరితగతిన జరిగింది. స్త్రీలకు ఎంబామింగ్ చేసేందుకు అంతగా టైం లేదు. కాబట్టే యేసుని గౌరవార్థము స్త్రీలు ఆయన శరీరాన్ని మరింత ఉద్దేశపూర్వకంగా ఎంబామ్ చెయ్యాలనే ఉదేశ్యముతో వాళ్ళు విశ్రాంతి దినము అయ్యిపోగానే సుగంధద్రవ్యములు కొన్నారని సిధ్ధాపర్చారని వాటిని పట్టుకొని సమాధి దగ్గరకు వచ్చారని బైబులు చెప్తూ వుంది.

3 రోజుల తరువాత యేసు ఉన్న సమాధిని స్త్రీలు ఓపెన్ చేసి ఆయనకు సుగంధ ద్రవ్యములు పూసే ఆచారం యూదులలో ఉందా? యూదా మతాచారం అందుకు ఒప్పుకొంటుందా? అసలు సంభవమేనా? అందుకనేనా వాళ్ళు వేకువనే వచ్చింది? అనే ప్రశ్నలకు, వారికి ప్రభువుపై గల ప్రేమపూర్వక మైన భక్తికి ప్రతీకాత్మక వ్యక్తీకరణను తెలియజెయ్యడానికి స్త్రీలు సమాధియొద్దకు వచ్చిరని బైబులు చెప్తూ వుంది. అంటే, ఈ రోజులలో సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనమెలా పువ్వులు తీసుకొని వెళ్తామో అలాగే ఆనాడు స్త్రీలు సమాధి యొద్దకు సుగంధ ద్రవ్యములను తీసుకొని వెళ్లారు. క్రీస్తు మీద ప్రేమతో భక్తితో గౌరవముతో మర్యాదతో సుగంధ ద్రవ్యములను తీసుకొని వెళ్లారు తప్ప అనాలోచితముగా కాదు అనేదే దీని ఉద్దేశ్యము.

మార్కు 16:2,3 వచనాలు వాళ్ళు ఆదివారమున పెందలకడ (లేచి బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధిద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు ప్రశ్నించు కొనిరని చెప్తూవుంది. సమాధి దగ్గర సైనికుల ఉనికి గురించి స్త్రీలకేమి తెలియదని వాళ్ళు ఆ సమాధి దగ్గరకు వచ్చే వరకు వాళ్ళకెలాంటి సమస్యలు ఎదురుకాలేదని తెలుస్తూవుంది. కాని వారికి ఆందోళన కలిగిస్తున్న విషయమేమిటంటే సమాధిని మూసిన రాయి, దీనిని దొర్లించాలంటే 3 లేక 4 పురుషులు అవసరం. స్త్రీలు దానిని దొర్లించటం అసాధ్యం. ఆ సమాధి ద్వారమును మూసిన ఆ పెద్ద రాయిని ఎలా దొర్లించాలో వారికొరకు ఎవరు దానిని దొర్లిస్తారో వారికి తెలియదు. అలాంటి సమయంలో ఏ ఒక్క పురుషుని సహాయంలేకుండా సమాధి దగ్గరకు వెళ్లడంలో వారి ధైర్యమును నిర్భయతని చూడండి. వాళ్ళు యేసుతో నడిచిన స్త్రీలు. ఆ రాయి ఆయనవైపు వెళ్ళకుండా వాళ్ళని నిరోధించలేక పోయింది. ఇది వారికి ఆయనపై గల బలమైన ప్రేమను భక్తిని తెలియజేస్తూ ఉంది.

లూకా 24:2-6 వచనాలు స్త్రీలు అక్కడికి వెళ్ళేటప్పటికి సమాధిముందర ఉండిన రాయి దొరలింపబడి యుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసుదేహము వారికి కనబడ లేదు. ఇందునుగూర్చి వారికేమియు తోచక యుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి అని చెప్తూ, వారు భయపడి ముఖములను నేలమోపి యుండగా వాళ్ళు ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువవేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడండి అని చెప్పిరని చెప్తూవున్నాయి.

సిలువ వేయబడి రోమా ప్రభుత్వముతో చనిపోయాడని నిర్ధ్ధారింపబడి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ప్రభుత్వ ముద్రతో వున్న సమాధిలో పెట్టబడి కావలిలో ఉంచబడిన యేసు లేచియున్నాడని, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడండి, నిర్ధారింపబడండి అని పరలోకపు జీవులు యేసుని గూర్చి నిర్ధారించడం స్త్రీలకు ఇవ్వబడిన ఎంతటి ధన్యతో కదా.

 క్రీస్తు పునరుత్థానం కథను శిష్యులు అళ్ళి వుంటే, క్రీస్తు పునరుత్థానంనకు మొదటి సాక్ష్యులుగా వాళ్ళు పురుషులనే ఎన్నుకొని ఉండేవాళ్ళు తప్ప స్త్రీలను పేర్కోనియుండెవాళ్ళు కాదు.

అట్లే కొత్తనిబంధన కాలంలో స్త్రీల సాక్ష్యాలను చట్టబద్ధమైనవిగా పరిగణించేవాళ్ళు కాదు. క్రీస్తు పునరుత్థానం లో స్త్రీలే ప్రధాన పాత్రధారులు. కాని వారి క్రీస్తు పునరుత్థాన సాక్ష్యాన్ని శిష్యులు నమ్మారా, లేదే.

ఏదిఏమైనా స్త్రీ సంతానమైన క్రీస్తు సాతాను తలను నలుగగొట్టియున్నాడని మరణపు ముల్లును విరచి యున్నాడనే విషయాన్ని స్త్రీకే మొదటిగా తెలియజేయబడుట, ఆయన లేచియున్నాడు అనే వార్త మొదటిగా స్త్రీకే తెలియ జేయబడుట, పునరుత్థాణుడైన యేసు మొదటిగా స్త్రీకే దర్శనమివ్వడం దేవుడు వారికిచ్చిన ధన్యతను గురించి తెలియ జేస్తూవుంది.

కాబట్టే కొందరు “క్రీస్తు పునరుత్థానం దాని విశ్వసనీయతను” స్త్రీల సాక్ష్యం ధృవీకరించటానికి దేవుడు వీరిని మొదటిగా తన కుమారుని సమాధి యొద్దకు అనుమతించియుండొచ్చు అని చెప్తారు.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.