ఈ రోజు అనేకులు, క్రైస్తవులు ఎప్పుడు పాపులం క్షమించుమని ప్రార్ధిస్తూవుంటారు అని హేళనగా మాట్లాడటం చూస్తుంటే వారి అవివేకాన్ని బట్టి జాలి వేస్తుంది. లోకములోని ప్రతి మతము మరణము తర్వాత తీర్పు ఉందని, మరణము తర్వాత మరొక జీవితము ఉందని చెప్తూవుంది. కాని ఈ లోకములో పాపము ఎందుకుందో చెప్తూవుందా? ప్రతి ఒక్కరు ఎందుకని మరణిస్తూ వున్నారో చెప్తూ ఉందా? లేదు.

మరణమంటే, శరీరములోని భాగాలు శారీరిక విధులను నెరవేర్చడంలో ఫెయిల్ అవ్వడం. శరీరము మృతతుల్యమవ్వటం రోమా 4:19; గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి, ప్రకటన 20:12.

(ప్రతిఒక్కరం) అపరాధములచేతను పాపములచేతను (జన్మ కర్మ పాపములచేతను) చచ్చిన (వారముగా ఉంటూ), వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున నడుచు (కొంటూవున్నాము). వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు, స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యున్నామని, ఎఫెసీయులకు 2:1-3, బైబులు చెప్తూవుంది. మనలను గురించి దేవుడు, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే (నిర్జీవుడవు) ప్రకటన 3:1, అని చెప్తూవున్నాడు. మరి నిర్జీవ క్రియలను విడిచి మనస్సాక్షిని ఎలా శుద్ధి చేసుకోగలం? హెబ్రీ 9:14. పాపమువలన వచ్చు జీతము మరణమని, రోమా 6:23 మరియు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెనని రోమా 5:12, బైబులు చెప్తూవుంది. మరి ఈ పాపము యొక్క అధికారమునుండి ఎలా విడిపించుకోగలం? శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, రోమా 6: 12,13 అని బైబులు చెప్తూవుంది. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? దేవుని (రూల్ బుక్ నుండి) న్యాయపు గ్రంథము నుండి ఎవరు మనలను తప్పింపగలరు? రోమా 7:4. ఈ క్రమములో, దీనిని తప్పించుకొనుటకు ఈ జీవితములో అవాస్తవమైన వాటిలో విశ్వాసముంచుట మృతమని యాకోబు 2:17,19, బైబులు చెప్తూవుంది. హెబ్రీయులకు 9:27, మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ప్రసంగి 9:10, మరణము భూసంబంధమైన జీవితాన్ని ముగిస్తుంది. అపొ. కార్య. 24:15, నీతిమంతులకును అనీతిమంతులకును తీర్పు కొరకు పునరుత్థానము వుంది. హెబ్రీయులకు 9:27 ఆ తరువాత తీర్పు జరుగును.

సహజ మరణము ఇలా వర్ణించబడింది
ఆదికాండము 3: 19, నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆదికాండము 25: 8, ప్రాణము విడిచి మృతి బొందుట; అపొ. కార్య. 5:10, ప్రాణము విడుచుట. 2 కొరింథీ 5:1, గుడారము నుండి తొలగించుటగా, (భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను); 2 కొరింథీ 5: 2-4, మరణము తర్వాత దిగంబరులుముగా ఉంటామని బైబులు చెప్తూవుంది. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు, ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగి వేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము. యోహాను 11:11-14, మరణమును నిద్రగా; ఫిలిప్పీ 1:23, మరణమును వెడలిపోవుట అని బైబులు చెప్తూవుంది.

యెహెజ్కేలు 33: 11, కాగా వారితో ఇట్లనుము–నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతో షము కలుగును. కాబట్టి మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

క్రైస్తవులు తమను పాపమునుండి మరణమునుండి అపవాది యొక్క అధికారమును నుండి విడిపించిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుతూ కనికరము కొరకు వేడుకొంటూ ఆయనను సమీపిస్తు వున్నారు. ఎఫెసీయులకు 1:7, దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. గలతీయులకు 3:13, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క (దేవుని రూల్ బుక్ యొక్క) శాపమునుండి విమోచించెను; హెబ్రీయులకు 9:14 నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును.

ప్రజలు తాము స్వాభావికంగా పాపులమని అపవిత్రులమని మర్చిపోతే, వారిని నరకం నుండి బయటకు తీసిన క్రీస్తుని ఖరీదైన రక్షణను గురించి మర్చిపోతున్నారు. సాతానును వారి ఇతర ఆధ్యాత్మిక శత్రువులను గురించి మర్చిపోతున్నారు. వారి ఆధ్యాత్మిక రక్షణ కవచాన్ని ధరించడానికి మరియు వారి ఆధ్యాత్మిక ఆయుధాలను తీయడానికి మర్చిపోతున్నారు. కాబట్టి దేవా, పాపినైన నన్ను కరుణించుమని క్రైస్తవులు ప్రార్దించడంలో తప్పు లేదు.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫల మియ్య లేదు. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవా యందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు, కీర్తనలు 103:1-4; 8-19.

క్రీస్తును విశ్వసింపని వారు, నీతిమంతుడును పరిశుద్దుడైన దేవుడంటే భయములేకుండా నీవు మాలో ఉంచిన మనఃసాక్షిని బట్టి, నీ న్యాయపు గ్రంధమునుబట్టి, మా క్రియలనుబట్టి, మా సంస్కృతినిబట్టి, మా సమాజమునుబట్టి మా కట్టుబాట్లనుబట్టి మా ధర్మమునుబట్టి మమ్ములను తీర్పు తీర్చుము అని ధైర్యముతో దేవునిని సమీపిస్తూవున్నారు. అంతే తేడా, ఆలోచించండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.