
జల ప్రళయానికి ఎలాంటి సాక్ష్యం ఉంది?
మనం ఆదికాండములో చదివినట్లుగా, భూమి ఒకప్పుడు మహా జల ప్రళయాన్ని చవిచూసిందనడానికి ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్కృతులలో ప్రపంచ వ్యాప్త జల ప్రళయాన్ని గురించి 270 కంటే ఎక్కువ ఇతిహాసాలను డాక్టర్ డువాన్ గిష్ గుర్తించారు. ఈ కథలు, అనేక వివరాలతో విభిన్నంగా ఉన్నప్పటికీ, ఇవన్నీ ప్రపంచం నీటి ద్వారా నాశనం చేయబడిందని, కొద్దిమంది మాత్రమే ఓడ ద్వారా ఈ జల ప్రళయము నుండి రక్షించబడ్డారని చెప్తున్నాయి.
అన్ని లెజెండ్స్‌లో ఉన్నట్లుగా, ఈ కథలన్నీ వారి పూర్వీకులు అనుభవించిన వాస్తవ సంఘటనపై ఆధారపడి ఉండొచ్చని నిర్ధారించడం సహేతుకం. ఖచ్చితంగా నోవహు పిల్లలు తమ జలప్రళయ అనుభవాలను వారి పిల్లలు మనవళ్లకు అందజేసి ఉంటారు. మౌఖిక ఖాతాలు తరం నుండి తరానికి అందజేయబడ్డాయి. చివరికి వారి నుండి వచ్చిన వివిధ వ్యక్తుల ద్వారా అవి వ్రాయబడ్డాయి. అందుకు చాలా టైం పట్టింది. ఇన్ఫర్మేషన్ లోని ఖచ్చితత్వము కూడా మార్పు చెందింది. కథలు విభిన్నమైన వివరాలతో క్రొత్తగా పుట్టుకొచ్చాయి.
ఇటీవలి సంవత్సరాలలో నల్ల సముద్రం ప్రాంతంలో విస్తృతమైన భౌగోళిక పరిశోధనలు జరిగాయి. దీని ఫలితంగా ఆదికాండములోని జల ప్రళయం ఇతర పురాతన జల ప్రళయ కథలు పురాతన కాలంలో ఆ ప్రాంతంలో జరిగిన ఒక గొప్ప స్థానిక వరద నుండి ఉద్భవించాయనే సిద్ధాంతం ఏర్పడింది. తత్ఫలితంగా, జల ప్రళయ వృత్తాంతంపై పరిశోధన చేసిన ఎంతో మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఆ వృత్తాంతం అంతటా ఉపయోగించిన “భూమి” అనే హీబ్రూ పదం మొత్తం భూమిని కాకుండా కొంత భూ భాగాన్ని మాత్రమే సూచిస్తుందని వాదిస్తున్నారు. ఈ కారణంగా, నోవహు జలప్రళయం కేవలం స్థానిక లేదా ప్రాంతీయ వ్యవహారమని కొందరు నమ్ముతున్నారు. ఈ సిద్ధాంతం లేఖనాలతో ఏకీభవించటం లేదు. దేవుని ప్రణాళిక మొత్తం భూమిని నీటితో నాశనం చేయాలనేది, దానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే కాదు (ఆదికాండము 6:13-17). నీరు ఎత్తైన పర్వతాలను కూడా కప్పేటట్లు పెరిగింది (ఆదికాండము 7:19). స్థానిక వరదలకు ఆస్కారం లేదు అది అసంభవం. స్థానిక వరద సిద్ధాంతం కూడా అసంబద్ధమైనది, ఎందుకంటే నోవహు యొక్క వరద కేవలం స్థానికంగా ఉంటే, నోవహు, అతని కుటుంబం జంతువులు మనుగడ కోసం చేయాల్సిందల్లా సురక్షితమైన ఎతైన ప్రదేశానికి తరలిపోవడమే.
ఆదికాండములోని జల ప్రళయ వృత్తాంతం అంతటా “భూమి” అనే ఈ పదం భూమి అంతటిని అని సూచించడానికి వాడబడిందా లేదా కొంతభాగాన్ని సూచించడానికి వాడబడిందా అనేది తెలుసుకోవడం తెలివైన పని. ఆదికాండము 6వ అధ్యాయం ఏమి చెప్తుందో చూధ్ధాం : నరులు భూమిమీద విస్తరింప ఆరంభించారు (వచనం 1). నెఫీలులను వారు భూమిపై ఉన్నారు (వచనం 4). భూమిపై మానవ జాతి దుష్టత్వం ఎంత గొప్పగా మారిందో ప్రభువు చూశాడు (వచనం 5). భూమిపై తాను మానవులను చేసినందుకు ప్రభువు చింతించాడు (వచనం 6). ఇప్పుడు భూమి దేవుని దృష్టిలో చెడిపోయి హింసతో నిండిపోయింది. భూమి ఎంత చెడిపోయిందో దేవుడు చూశాడు. భూమిపై ఉన్న ప్రజలందరూ తమ మార్గాలను చెరిపి వేసుకొన్నారు (వచనం 11-12). సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండిపోయింది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితో కూడ నాశనము చేయబోతున్నాను (వచనం 13). నేను భూమి పైకి జల ప్రళయం రప్పించి ఆకాశం క్రింద ఉన్న జీవులన్నింటినీ, దానిలో జీవ శ్వాస ఉన్న ప్రతి జీవిని నాశనం చేయబోతున్నాను. భూమిపై ఉన్న ప్రతిదీ చనిపోతుంది (వచనం 17). అలాగే “ఆకాశం క్రింద ఉన్న ప్రతిదీ” మరియు “సమస్త ప్రజలు” వంటి పదబంధాలను పరిశీలిస్తే, ఆదికాండము 6వ అధ్యాయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా వరదను తీసుకురాబోతున్నాడని స్పష్టముగా అర్ధమవుతుంది.
జల ప్రళయం ఆకాశం క్రిందనున్న గొప్ప పర్వతాలన్నింటినీ (ఆదికాండము 7:19) ముంచివేసిందని పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతాలనీ మునిగిపోయాయని (ఆదికాండము 7:20) మనకు చెప్పబడిన వాస్తవం, నోవహు తనను తన కుటుంబాన్ని, పక్షులను, భూమిపై ఉన్న జంతువులన్నింటినీ రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించవలసి వచ్చిందనే వాస్తవం, నోవహు దూర దేశానికి పారిపోకుండా 120 సంవత్సరాలు ఓడను నిర్మించాడని చెప్పబడిన వాస్తవం ఇవన్నీ ఇది ప్రపంచవ్యాప్త జలప్రళయం అని సూచిస్తున్నాయి. బైబిలులోని మిగిలిన భాగాలలో కనిపించే సాక్ష్యం కూడా దీనికి మద్దతు ఇస్తుంది (కీర్తన 104:5-9; మత్తయి 24:36-39; లూకా 17:26,27; హెబ్రీ 11:7; 2 పేతురు 2:4-9). లేఖనాలను స్పష్టంగా చదవడం ఈ సూచనల చుట్టూ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవడం వలన ఆదికాండములోని వరద ప్రపంచవ్యాప్త వరద అని సహజంగానే నమ్మొచ్చు.
జలప్రళయం క్రీ.పూ. 600వ సంవత్సరం, 2వ నెల, 17వ రోజు ప్రారంభమయ్యిందని ఆదికాండము 7:11 చెప్తుంది. నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను, ఆదికాండము 7:24. ఈ ఖచ్చితమైన డేటింగ్ వరద ఎంతకాలం కొనసాగిందో ఖచ్చితంగా నిర్ణయించడానికి మనకు సహాయపడుతుంది.
సృష్టి వృత్తాంతంలో, జంతువుల యొక్క ఐదు విభిన్న వర్గాలు జాబితా చేయబడ్డాయి (ఆదికాండము 1:21–25): సముద్ర జీవులు, అడవి జంతువులు, పశువులు (పెంపుడు జంతువులు), నేలపై పాకేవి మరియు పక్షులు. ఈ ఐదు వర్గాలలో నాలుగు ఓడలో ఉన్నట్లు ప్రస్తావించబడ్డాయి. ఉభయచరాలతో సహా సముద్ర జీవులు ఓడకు బయట ఉన్నాయి.
తన పిల్లలను కాపాడటానికి ఇతరులకు ప్రవేశాన్ని నిరోధించడానికి ప్రేమ యొక్క ప్రత్యేక చర్యగా, రక్షకుడైన యెహోవా ఓడ తలుపును మూసివేసాడు.
ఆదికాండము 7:11 లోని మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. మహాగాధ జలములు, ఆకాశపు తూములు అను పదాలు సృష్టి శాస్త్రవేత్తలకు జల ప్రళయ వృత్తాంతంలో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నాయి. భూమిపై ప్రబలంగా దాదాపు ఒక సంవత్సరం పాటు జరిగిన భౌగోళిక ప్రభావాల యొక్క అనేక వివరణలకు ఇవి కేంద్రంగా ఉన్నాయి. చాలా మంది ఈ పదాలు గొప్ప భౌగోళిక మార్పులను అందించాయని చెప్తారు. దేవుడు నిర్ణయించిన సమయానికి, జల ప్రళయ జలాలు భూమిపైకి వచ్చాయి. మహా అగాధ జలాల ఊటలు విడువబడ్డాయి, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. మొదటి మూలం ఏమిటో మనకు తెలుసు. రెండవ దాని గురించి మనకు అంత ఖచ్చితంగా తెలియదు.
మహాగాధ జలముల ఊటలన్ని భారీ కుదుపుల పరంపరలో తెరుచుకున్నాయి. భూమి క్రింద ఉన్న భారీ నీటి జలాశయాలు అన్ని ఉపరితల జలాలు సృష్టికర్త వాటి కోసం నిర్దేశించిన సరిహద్దులను దాటి భూమిని ముంచెత్తాయి. ఇది వరద నీటిలో ఎక్కువ భాగాన్ని అందించి ఉండొచ్చు. భూమి అట్టడుగు పొరలలో ఉన్న నీరు భూమిని చీల్చుకొని బయటికి వచ్చే క్రమములో అవి అగ్ని పర్వత కార్యకలాపాలను తప్పకుండా ఆక్టివేట్ చేసి ఉంటాయి. ఇటీవలి పరిశోధన ప్రకారం, భూమి పొరలలో రెండవదైన మాంటిల్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతం గుండా ప్రయాణించే భూకంప తరంగాల మందగమనాన్ని గుర్తించడానికి పరిశోధకులు భూకంపాల నుండి భూకంప డేటాను పరిశీలిస్తుండగా, అది భారీ నీటి ఉనికిని గురించి తెలియజేసింది. భూమి ఉపరితల మహాసముద్రాల కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉన్న ఒక భారీ సముద్రం భూమి యొక్క రెండవ పొరయైన మాంటిల్‌లో భూమి ఉపరితలం క్రింద దాదాపు 700 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూగర్భ జలసంపద రింగ్‌వుడైట్ అనే రాతిలో చిక్కుకొని ఉంది. ఇది నీలి ఖనిజం, ఇది నీటిని ప్రత్యేకమైన, అధిక పీడన స్థితిలో నిల్వ చేస్తుంది. ఇది సాంప్రదాయ కోణంలో ద్రవ సముద్రం కాదు, రింగ్‌వుడైట్ యొక్క స్ఫటికాకార నిర్మాణంలో నిల్వ చేయబడిన అతి పెద్దదైన నీటి జలాశయం. ఈ సముద్రం భూమి యొక్క మాంటిల్ లోపల, ప్రత్యేకంగా మాంటిల్ ట్రాన్సిషన్ జోన్ అని పిలువబడే ప్రాంతంలో ఉంది. అధిక పీడన ఖనిజమైన రింగ్‌వుడైట్, దానిలో నీటిని నిల్వ చేయగలదు అది ఈ విశాలమైన భూగర్భ సముద్రానికి ఒక యంత్రాంగాన్ని అందించే స్ఫటిక నిర్మాణం. మాంటిల్ లోపల నీటి ఉనికి టెక్టోనిక్ ప్లేట్ల ప్రవర్తనను శిలాద్రవం ఏర్పడటాన్ని ప్రభావితం చేస్తుంది.
వరద సమయంలో అగ్నిపర్వత కార్యకలాపాలు నిజంగా జరిగాయని అనుకునేలా చేసే ఏదైనా పదం ఈ జల ప్రళయ వృత్తాంతంలో ఉంది అనుకొంటే అది “తెరుచుకున్నాయి” అను క్రియ తెలియజేస్తూవుంది. “మహా అగాధం”తో ముడిపడి ఉన్న జలాలను ఇక్కడ వరద వృత్తాంతంలో ఉపయోగించడాన్ని బట్టి మోషే దేవుని ఒక రకమైన అద్భుతమైన భౌగోళిక కార్యకలాపాలను సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. దీని ద్వారా గొప్ప అగాధం యొక్క ఊటలు భూమిని ముంచెత్తుతాయి. భూమి యొక్క ఈ భౌగోళిక విచ్ఛిత్తి దానితో పాటు అగ్నిపర్వత కార్యకలాపాలను కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. జల ప్రళయం సమయంలో జరిగిన ప్రక్రియలకు శాస్త్రీయ వివరణ, వ్యక్తిగత సిద్ధాంతాలకు మద్దతుగా ఈ పదాల యొక్క సరళమైన అర్థంలో భౌగోళిక ప్రక్రియలను సరిపోల్చడంలో మనం ఇబ్బంది పడకూడదు. మోషే మనకు ఇచ్చే వివరాలలో ప్రధాన విషయం ఏమిటంటే, దేవుడు మొదటగా ఉపయోగించిన విధ్వంసక శక్తి నీరు. దాని శక్తి దాని ఫలితంగా సంభవించిన ఇతర విషయాలు ద్వితీయమైనవి.
వరద నీటి రెండవ మూలాన్ని నిర్వచించడం చాలా కష్టం. “ఆకాశపు తూములు” మేఘ జలాలుగా భావించడం సాధ్యమే. ఇక్కడ ఆకాశం నుండి వర్షం పడటం నేడు మనకు తెలిసిన అదే జల సంబంధ ప్రక్రియల ఫలితమా? లేదా ప్రజలు ఇంతకు ముందు అనుభవించని కొత్త విషయమా? ఆదికాండము 2:4-6.
లేఖనాలు చెప్తున్న దానిని బట్టి ఇక్కడ భూమిపై మొదటిసారిగా వర్షం కురిసిందని చెప్పొచ్చు. ఆదికాండము 2:6; 2:10. జల ప్రళయం తర్వాత (ఆదికాండము 9:13-15) వరకు మేఘాల ఉనికి గురించి బైబిల్ ప్రస్తావించలేదు. జల ప్రళయం తర్వాత ఇంద్రధనస్సు ఒక కొత్త విషయంగా చెప్పబడిందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే (ఆదికాండము 9:13-17), ఆదికాండములోని ఈ ఆధారాన్ని బట్టి, ఆకాశపు తూములు విప్పబడటం భూమిపై వర్షం కురిసిన మొదటి సందర్భం అని వాదించొచ్చు.
సృష్టి సమయం నుండి జలప్రళయం సమయం వరకు ప్రపంచం వేరే జలసంబంధ వ్యవస్థను కలిగి ఉంది. జల ప్రళయానికి ముందు ప్రపంచంలోని జలసంబంధ వ్యవస్థ భూమిని పారదర్శక నీటి ఆవిరి వలె ఆవరించి ఉండేది. భూమిని ఆవరించి ఉన్న ఈ ఆవిరి పందిరి మూడవ రోజున సృష్టించబడిన మొక్కలకు అవసరమైన నీటిని తేమను అందించి ఉండేది. అదే సమయంలో నాల్గవ రోజున సృష్టించబడిన సూర్య చంద్ర నక్షత్రముల కాంతిని భూమికి చేరుకునేలా చేసేది. భూమిని ఆవరించి ఉన్న ఈ వాతావరణ ఆవిరి యొక్క భారీ ద్రవ్యరాశి మంచు రూపంలో ఉండొచ్చు. వరదకు ముందు భూమిని ఆవరించి ఉన్న ఒక అపారమైన ఆవిరి వాతావరణం ఉండేదని రుజువయ్యింది. ఆ సందర్భంలో, జల ప్రళయం సమయంలో, దేవుడు ఆ విస్తారమైన ఆవిరిని నీటిగా విడుదల చేశాడు (ఆ వ్యవస్థ భూమిపై కూలిపోయింది). తద్వారా దాదాపు ఆరు వారాల పాటు ఆకాశం నుండి వర్షం పడింది. ఈ నిరంతరాయంగా కురిసిన వర్షం దిగువ నుండి వచ్చే నీటికి జోడించబడింది. భూమిపైకి మహా జల ప్రళయాన్ని తీసుకువచ్చింది.
అటువంటి నీటి ఆవిరి పందిరి యొక్క గ్రీన్‌హౌస్ ప్రభావం వల్ల భూమిపై ఉష్ణోగ్రత అలాగే వాతావరణంలో అంత పెద్ద మొత్తంలో నీటి బరువు ఏర్పడి భూమికి అనేక ప్రయోజనాలను ఒనగూరుస్తూ దీర్ఘకాల యుగాలకు ప్రయోజనకరమైనదిగా భూమిని మార్చి ఉండొచ్చు. ఈ జలసంబంధ వ్యవస్థ క్రిందే నేడు మనం నివశిస్తున్నాం.
ఆదికాండము 7:24 మరియు ఆదికాండము 8:3 ప్రకారం, రెండు నీటి వనరులు 150 రోజుల ముగింపులో మూసివేయబడ్డాయి. ఆదికాండము 7:24, నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి. ఆదికాండము 8:3, అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి. ఈ రెండు భాగాలకు మరియు 40 రోజుల వ్యవధి గురించి మాట్లాడే ఆదికాండము 7:12 కు మధ్య సంఘర్షణను గమనించండి. 40 రోజుల తర్వాత నీరు గరిష్ట స్థాయికి చేరుకుందని అడపాదడపా వర్షాలు వరద స్థాయిలో నీటి మట్టాన్ని మరో 110 రోజులు కొనసాగించాయని నిర్ధారించొచ్చు.
భారీ నీటి ద్రవ్యరాశి, ఉప్పొంగే అలలు, రాళ్లను, పెకిలించబడిన చెట్లను మోసుకెళ్లి, దాదాపు అర్ధ సంవత్సరం పాటు భూమిని చీల్చి వేసి, ఉప్పొంగాయి. దీనికి తోడు, భూమి అంతర్భాగం విడిపోయి ఉండొచ్చు. బహుశా భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా, నీరు మరియు భూభాగాలను పూర్తిగా తిరిగి అమర్చడం జరిగింది. ఎత్తైన పర్వతాలను కూడా కప్పి ఉంచిన ఈ భారీ నీటి పొర యొక్క అపారమైన బరువు క్రింద ఉన్న ప్రతి దాన్ని అది కుదించి ఉండొచ్చు.
జల ప్రళయం వల్ల రెండు తక్షణ ఫలితాలు వచ్చాయి. మొదటిది, ఆదికాండము 7:19-23, ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి. నీరు పర్వతాల కన్నా పదిహేను మూరల ఎత్తు లేచి వాటిని కప్పివేశాయి. పక్షులు, పశువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు. పొడి నేలమీద ఉన్న వాటన్నిటిలో, నాసికారంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి. మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండాా నాశనం అయ్యాయి.
వరద నీటి రెండవ ప్రభావం మొదటి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది. మనం సాధారణంగా వరదను ఒక విధ్వంసక చర్యగా భావిస్తాం. ఇప్పుడు, ఖచ్చితంగా చెప్పాలంటే, అది అదే. కాని ఇక్కడ అది అంతకంటే ఎక్కువ. కాని దీనిని ఒక అద్భుతమైన శక్తివంతమైన విమోచన చర్యగా చూడొచ్చు. బిలియన్ల కొద్ది అవిశ్వాసులను ముంచివేసిన నీరు, విలువైన సరుకుతో ఉన్న ఓడను మరణం విధ్వంసం నుండి పైకి లేపి పట్టుకొంది.
జలప్రళయం యొక్క వృత్తాంతం కొత్త నిబంధన పేజీలలో కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. క్రీస్తు దీనిని ప్రపంచ ముగింపుకు ఒక ఉదాహరణగా ఉపయోగించాడు (మత్తయి 24:37–39; లూకా 17:26, 27). తీర్పు దినానికి దారితీసే రోజులు మోసపూరితంగా నోవాహు రోజుల్లా ఉంటాయని వరద తీర్పు వచ్చినట్లే దేవుని గొప్ప తీర్పు ఊహించని విధంగా వస్తుందని చెప్పాడు. క్రీస్తు అపొస్తలులు వరదను కూడా బాప్తిసం యొక్క ఒక రూపంగా వర్ణించారు (1 పేతురు 3:20, 21; రోమీయులు 6:4).
అగాధజలాల ఊటలు, ఆకాశపు తూములు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది. అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి, ఆదికాండము 8:2,3.
ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి, ఆదికాండము 8:13. రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది, ఆదికాండము 8:14.
నీళ్లు ఒక్కసారిగా తగ్గిపోలేదు, క్రమంగా నిరంతరాయంగా తగ్గుతూ వచ్చాయి. అవి భూమి యొక్క అవక్షేప పొరల ఏర్పాటుకు సంబంధించిన అనేక సిద్ధాంతాలకు ఆధారం. భూమి యొక్క అవక్షేప పొర అంతటా పొరలుగా కనిపించే వివిధ రకాల రాళ్ళు భూమి యొక్క క్రస్ట్ యొక్క అసలు విచ్ఛిన్నానికి మాత్రమే కాకుండా వరద ప్రారంభంలో మరియు వరద కాలం అంతటా నీటి కదలికకు సాక్ష్యాలుగా ఉన్నాయి.
తగ్గుతూ వస్తున్న నీళ్లు వివిధ దశలలో వివిధ రకాల అవక్షేపాలను ఏర్పర్చాయి. వివిధ ప్రాంతాలలో మట్టి పొరలలోని వైవిధ్యాలు, ప్రవాహాల కారణంగా ఆ ప్రాంతాలలో కొట్టుకుపోయిన అవక్షేప రకం కారణంగా ఏర్పడ్డాయి. ప్రధాన స్రవంతి ఆధునిక భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అవి పెద్ద, ప్రాంతీయ వరదలను మాత్రమే సూచిస్తున్నాయని, బహుశా అవి మంచు పర్వతాలు కరగటం వలన ఏర్పడిన వరదలు కావచ్చునని వాదిస్తున్నారు. అయితే, నీరు తగ్గుతున్న కొద్దీ, పెద్ద పెద్ద నీటి మడుగులు ఒకదానికొకటి వేరు చేయబడి, ప్రతి ప్రాంతంలో గొప్ప స్థానిక వరదలను కలుగచేసి ఉండొచ్చు.
భూమి క్రస్ట్ యొక్క బయటి భాగం రాతిపొరలతో సంబంధాన్ని కలిగివుంది. ఈ రాతి పొరలు నీటి ద్వారా వరుసగా అవక్షేపాలుగా వేయబడ్డాయని అందువల్ల వాటిని అవక్షేపణ పొరలుగా సూచిస్తారనడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయి. దిగువ పొరలు మొదట వేయబడినట్లు ఎగువ పొరలు చివరిగా వేయబడినట్లు సహేతుకంగా భావించబడుతుంది. భూమి లోతైన పొరలలో కేంబ్రియన్, కార్బోనిఫెరస్ మరియు పెర్మియన్ స్ట్రాటాలు నోవహు వరద ద్వారా ఏర్పడిన అవక్షేపాలు. గ్రేట్ అన్‌కన్ఫార్మిటీ అని పిలువబడే ప్రీ-కేంబ్రియన్ స్ట్రాటా నుండి వాటిని వేరు చేసే గొప్ప కోతకు ఆధారాలు.
జల ప్రళయానికి నేటి శిలాజాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. సముద్రం నుండి దూరంగా ఉన్న పర్వత ప్రాంతాలలో అనేక సముద్ర శిలాజాలు కనుగొనబడ్డాయి. వరద నీరు ఒకప్పుడు పర్వతాలను కప్పివేసి, అక్కడి జంతువులను శిలాజాలుగా మార్చిందని అవి సూచిస్తున్నాయి. భూమిపై చాలా శిలాజాలు ఉన్నాయంటే, ప్రపంచ జలప్రళయము వంటి పెద్ద విపత్తు సంభవించి ఉంటుందని అవి సూచిస్తున్నాయి. ఎందుకంటే జీవులు అకస్మాత్తుగా ఖననం చేయబడి ఉండాలి. ఆ క్రమములో వాటి శిలాజ అవశేషాలను అవి రాళ్లలో వదిలివేసాయి. మాములుగా జంతువులు చనిపోయి ఉంటే, అవి నేలపై పడుకుని ఉండేవి. స్కావెంజర్లు వాటి అవశేషాలను తినేందుకు వచ్చి ఉండేవి వాటిని తినేసి ఉండేవి. సంపూర్ణ శిలాజాలుగా అవి మారె అవకాశము ఉండేది కాదు. వాటి అవశేషాలు శిలాజాలుగా మారడానికి చాలా కాలం ముందే అవి మరణించి ఉంటాయి. భూమి అంతటా ఇన్ని శిలాజాలు ఎలా ఏర్పడ్డాయో నోవహు వరద చాలా సులభంగా వివరిస్తుంది.
గ్లోబల్ వరదకు సంబంధించిన ఇతర సాక్ష్యాలు భూమి పొరలు కోతకు గురికాకుండా వాటి మధ్య అకస్మాత్తుగా వివిధ రాతి పొరలు వేయబడటం గ్లోబల్ వరదను సూచిస్తున్నాయి. ప్రామాణిక పరిణామ సిద్ధాంతాల ప్రకారం, మనం చూసే పొరలు (గ్రాండ్ కాన్యన్‌లో వంటివి) ప్రతి పొర మధ్య గ్లోబల్ వరదకు సంబంధించిన సాక్ష్యముంది. అయితే, పొరల మధ్య కోతకు ఎటువంటి ఆధారాలు లేవు. ఆదికాండము వర్ణించినట్లుగా, నోవహు జలప్రళయం వాటిని చాల తక్కువ వ్యవధిలో వేసింది. అగ్ని పర్వత విస్ఫోటనంపై పరిశోధన జరిపిన డాక్టర్ స్టీవెన్ ఆస్టిన్ చాలా తక్కువ సమయంలో పాత భౌగోళిక లక్షణాలను ఎలా మార్చవచ్చొ వివరణాత్మకంగా వివరించాడు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl