ప్రథమ భాగము
ప్రారంభ శుభాకాంక్షలు (1:1–4)

1దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, 2-4నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను. తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.

సహజంగానే పౌలు ఈ లేఖను తీతు కోసం మాత్రమే వ్రాయలేదు, అతడు చదవడానికి మరియు అందరికొరకు భద్రము చేయడానికి వ్రాసియున్నాడు. ఇది తీతు కోసమే అయితే, తన గురించి మరియు తన పరిచర్య గురించి సుదీర్ఘమైన సంభాషణ అవసరం లేదు. తీతు క్రేతులో పరిచర్య చేస్తూవున్నాడు, పౌలు అక్కడ కొద్దికాలం మాత్రమే ఉన్నాడు, కాబట్టే రచయిత తాను “దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడును” అని వారికి గుర్తుచేస్తున్నాడు.

ఇక్కడ పౌలు తనను “దేవుని దాసుడును” అని పరిచయము చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. దాసుడు అనే మాట బానిసత్వం, మరణం నుండి రక్షింపబడియుండటాన్ని తెలియజేస్తూవుంది. ఈ చిత్రాన్ని మనకు వర్తింపజేసుకొంటే, దాసుడు అనే మాట దేవుని రక్షణ కృపకు కూడా వర్తిస్తుంది. దేవునికి దాసునిగా ఆయనకు లోబడి ఉండటం పౌలుకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. తాను దేవునికి దాసునిగా గుర్తించబడటంలో సంపూర్ణంగా సంతోషించుచున్నానని కూడా ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి. దాసుడు అనే మాట వారి బాధ్యతలను నిర్దేశించుకోవడంలో వారికి సహాయపడుతూ ఇష్టపూర్వకంగా సేవ చేసేందుకు వారిని ప్రేరేపించింది. అట్లే “దేవుని దాసుడు”అంటే దేవుడు తప్ప మరెవ్వరి నుండి ఆజ్ఞలు తీసుకోనివాడు అని అర్ధం. పౌలు చిత్తము దేవుని చిత్తానికి లోబడి ఉంది. దేవుడు ఏమైతే భోదించమని చెప్పాడో, వ్రాయమని చెప్పాడో పౌలు వాటినే బోధించాడు మరియు వ్రాసాడు. పౌలు పత్రికలను చదివేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా, చాలా ముఖ్యం.

అదనంగా, పౌలు తనను తాను “యేసుక్రీస్తు అపొస్తలుడనని” పిలుచుకున్నాడు, అతడు స్వయంగా యేసు ద్వారా “పంపబడ్డాడు”. దమస్కుకు వెళ్లే మార్గంలో, యేసు అతనిని ఎదుర్కొన్నాడు, దమస్కులోనికి నడిపించాడు, అక్కడ అననీయ అను ఒక శిష్యుడు అతన్ని కలుసుకున్నాడు, “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు” అని దేవుడు అననీయకు పౌలును గురించి వెల్లడించాడు, (అపొ. కార్య. 9:15). సంఘానికి శిరస్సైన యేసు, తన పన్నెండు మంది శిష్యులను పంపినట్లుగా పౌలును కూడా ఆయన పంపియున్నాడు.

దేవుడు ఏర్పరచుకొనిన వారు విశ్వసించడానికి, దైవభక్తిని పెంపొందించే సత్యమును గురించి తెలుసుకోవటానికి వారికి సహాయపడుట కొరకై పౌలు పంపబడ్డాడు. విశ్వాసం, సత్యమును గురించిన జ్ఞానం మరియు దైవభక్తి అనేవి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. “వినని వానిని ఎట్లు విశ్వసించుదురు?” రోమా 10:14. “విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును“, యాకోబు 2:17. దైవభక్తి అనేది క్రియ ద్వారా చూపించే విశ్వాసం.

క్రైస్తవుల యొక్క మొత్తం విశ్వాసం మరియు భక్తి జీవితం, “నిత్యజీవమును గూర్చిన నిరీక్షణపై” నిర్మించబడుతుంది. అవిశ్వాసి యొక్క ఆశలు ఈ జీవితకాలముమట్టుకు మాత్రమే సంబంధించినవిగా ఉంటాయి. అతడు సులభమైన జీవితం, సంపద, గౌరవం, ఆహ్లాదకరమైన పదవీ విరమణ కోసం ఆశిస్తున్నాడు. అయితే “ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము“, అని 1 కొరింథీయులకు 15:19 చెప్తూవుంది. పాపపు లోకంలో సుదీర్ఘమైన మరియు మెరుగైన జీవితం కోసం క్రీస్తు మనలను విమోచించలేదు. ఇక్కడ ఇప్పుడు మనం అనుభవించే దానికంటే జీవితంలో ఇంకా చాలా ఉంది: అక్కడ క్రైస్తవుని నిరీక్షణయైన నిత్య జీవముంది.

ఈ నిరీక్షణ ఒక కల కాదు. అది “అబద్ధమాడనేరని దేవుడు” ద్వారా వాగ్దానం చేయబడింది. సాతాను అబద్ధమునకు జనకుడునై యున్నాడు (యోహాను 8:44), వాడు అబద్ధపు వాగ్దానాలు చేస్తాడు. దేవుని వాగ్దానాలు నిజమైనవి, నిశ్చయమైనవి మరియు ఖచ్చితమైనవి. కాలక్రమేణా, అవి రద్దు చేయబడవు కాని నెరవేరుతాయి. రక్షకునిగా తన ప్రియమైన కుమారుని ద్వారా తాను ఎన్నుకున్న వారిని ఆశీర్వదించబడిన నిత్యత్వానికి తీసుకురావాలని దేవుడు తన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడే, “అనాదికాలమందే” వాటిని వాగ్దానము చేసాడు.

తన వాగ్దానాలను నెరవేర్చడంలో, దేవుడు తన స్వంత సమయ షెడ్యూల్‌ను ఉపయోగిస్తాడు. “అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను“, గలతీయులకు 4:4. తన కుమారుని సందేశం ఎవరి ద్వారా బోధించబడాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడు. “యిప్పుడు (తన నిర్ణీత కాలంలో) మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన ద్వారా ఆయన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను“, పౌలు దేవునిచే ఎంపిక చేయబడిన సేవకుడు మరియు అపొస్తలుడు, అతనికి ఒక సందేశం అప్పగింపబడింది మరియు అతడు ఒక దైవిక ఆజ్ఞ క్రింద పనిచేస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు కంటే ఎవ్వరూ దేవుని వాక్యాన్ని విస్తృతంగా మరియు స్పష్టంగా బోధించలేదు. క్రేతు ప్రజలు పౌలు వారి మధ్య ఏమి బోధించాడో, విశ్వాస విషయములో అతని నిజమైన కుమారుడైన తీతు ఏమి బోధిస్తున్నాడో మరియు వారు ఈ లేఖలో చదివినది నిజంగా దేవుని వాక్యమని, క్రీస్తులో దేవుని వాగ్దానాలు మరియు నెరవేర్పు యొక్క ప్రత్యక్షత అని, దేవుని సాధికార దూత ద్వారా ప్రకటించబడుతున్న విషయాన్ని తెలుసుకోవలసియున్నారు.

5నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. 6ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. 7ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందా రహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక, 8అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునైయుండి, 9తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.

10అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు. 11వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు. 12వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను–క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు. 13-14ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. 15పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి. 16దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయు లును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.  

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.