పరిశుద్ధ లేఖనాల ఆధారముగా పరిశుద్ధ త్రిత్వమును నేను నమ్ముచున్నాను. మన దేవుడైన యెహోవా అద్వితీ యుడగు యెహోవా అను ద్వితీయోపదేశ కాండము 6:4 లేఖనమును బట్టి; మరియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుమను 1 కొరింథీయులకు 8:4 లేఖనమును బట్టి, ఏకైక నిజ దేవుడు, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను మత్తయి 28:19 లేఖనమును బట్టి, బైబిలులో దేవుడు తనను తండ్రి కుమారుడు పరిశుద్దాత్మునిగా బయలుపరచుకొనియున్నాడని, మరియు ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అను కొలొస్సయులకు 2:9 లేఖనమును బట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా, ముగ్గురు ఒక్కరిగా ఒకే ఒక దైవికమైన అంతఃస్తత్వమును కలిగియున్నారని, శక్తిలో, నిత్యత్వములో, మహిమలో మిగిలిన గుణాలక్షణాలలో సమానులని, వీరిలో ప్రతి వ్యక్తి ఒకే దైవికమైన అంతఃస్తత్వమును సంపూర్ణముగా కలిగియున్నారని గనుకనే ఆయన త్రిత్వ దేవునిగా పిలువబడుతూ వున్నాడని నమ్ముతున్నాను.

ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అను వచనంలో దేవుడు అనే మాటకు అక్కడ హీబ్రూలో “ఎలోహిం” అనే మాట వాడబడింది. ఈ మాట బహువచనం, పులింగము.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను అను యోహాను 3:16-18 లేఖనమును బట్టి మరియు ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అను 1 కొరింథీయులకు 12:3 లేఖనమును బట్టి త్రిత్వ దేవుడు మానవుని పట్ల కనికరము చూపు దేవుడై యున్నాడని మరియు దేవుడే మన సృష్టికర్త విమోచకుడు మనలను పరిశుద్ధపరచువాడునై యున్నాడని నేను నమ్ము చున్నాను.

కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు అను 1 యోహాను 2:23 లేఖనమును బట్టి మరియు యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు అను యోహాను 14:6 లేఖనమును బట్టి వీరిలో ఏఒక్కరిని కాదన్నను లక్ష్యపెట్టక పోయినను ముగ్గురిని తిరస్కరించినట్లే. త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించు వారిని క్రైస్తవ సంఘానికి బయటనున్న వారిగా పరిగణిస్తాను. యునిటేరియనిజంను నేను నమ్మను. ఇది మన దేశములో అనేక శాఖల లోనికి చొచ్చుకెళ్లి ప్రబలంగా వ్యాపిస్తూ అనేకులను ప్రభావితము చేస్తూ వుంది.

పతనము మొదలుకొని, దేవుని నిత్య కుమారుని నమ్మితే తప్ప, దేవునిలో ఉన్న”తండ్రియైన దేవుణ్ణి” ఎవరు నమ్మలేడు. ఆ నిత్య దేవుని కుమారుడు శరీరధారియై మనకు ప్రతిగా తండ్రియైన దేవునిని సంపూర్ణముగా సంతృప్తిపరచుట ద్వారా మనలను తండ్రియైన దేవునితో సమాధానపరచియున్నాడు. 1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు అని తెలియజేస్తూవుంది. రోమా 15:13, కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

టెర్టులియన్ (155-200 CE) లాటిన్ పదం ‘ట్రినిటీ’ని ఉపయోగించిన మొదటి వ్యక్తి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.