దిద్దుబాటు కొరకైన అవసరత

క్రీ.శ. మొదటి 500 సంవత్సరముల వరకు క్రైస్తవ సంఘము శ్రమలు మరియు అబద్దబోధకుల దాడులకు బదులుగా ప్రబలుచు వ్యాపించుచుండెను మరియు క్రైస్తవ సంఘమునకు హానికరమైన రెండు విషయములు క్రీ.శ. రమారమి 600 సంవత్సరములలో సంభవించెను: అందు మొదటిది మహమ్మదీయ దండయాత్ర, రెండవది రోమ్ నందలి బిషప్ స్థానము యొక్క ఆధిక్యత హెచ్చగుట.

ఈ దండయాత్రలో మహమ్మదీయ సేనలు ఉత్తర ఆఫ్రికా, పాలస్తీనా, సిరియా, ఆసియా మైనరు ప్రాంతములను జయించి ఆ ప్రాంతములోనున్న క్రైస్తవ సంఘములన్నిటిని నాశనము చేసెను.

పశ్చిమ ఐరోపాలో రోమ్ నందలి బిషప్ క్రైస్తవ సంఘమునకు నాయకుడయ్యాడు. అతడు స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మరియు ఇటలీ దేశములందున్న సంఘమునకు నాయకుడయ్యాడు. అతడు పోపుగా గుర్తింపబడి, రాజులతో కూడా ప్రతి ఒక్కరిని ఏలుటకు క్రీస్తుచే నియమింపబడితినని చెప్పుకొనెను. క్రీస్తును సేవించుటకు పోపు తన అధికారమును వినియోగించక అందుకు బదులుగా, క్రీస్తుకు వ్యతిరేకమగు సిద్ధాంతములను ప్రవేశపెట్టాడు. అందు ఒకటి పర్గెటరి అనునది మరొకటి రక్షణ విశ్వాసము వలన మాత్రమే గాక సత్క్రియల ద్వారా కూడా అని చెప్పుట. వాటికీ జతగా దేవుని కృప తన ద్వారాను తాను నియమించిన బిషప్ లు మరియు ప్రీస్ట్ లు ద్వారానే కలుగునని నమ్ముటకు అతడు ప్రజలను నడిపించెను. కొందరు మనుష్యులు పోపు బోధించుచున్న భోదలు బైబులు ప్రకారము తప్పు అని చూపగా, తన అనుమతి లేనిదే బైబులును చదివిన యెడల వారి శిక్షార్హులగుదురని అతడు ఆజ్జ్యను ఇచ్చెను. 

మహమ్మదీయ దండయాత్ర ఫలితముగాను మరియు పోపు అధికారము పెరుగుటచేతను సువార్త సత్యము దాదాపుగా అదృశ్యమాయెను. రక్షణను గూర్చిన సత్యమును తిరిగి బయటకు తెచ్చుటకును మరియు బైబులును తగిన స్థానములో స్థిరపరచుటకును దిద్దుబాటు అవసరమాయెను. దేవుడు ఈ దిద్దుబాటును తీసికొనివచ్చుటకు లూథర్ ను ఉపయోగించుకున్నాడు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.