మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వము లోని ముగ్గురు వ్యక్తులలో పరిశుధ్ధాత్ముడు ఒకరని నేను నమ్ముతున్నాను.
పరిశుధ్ధాత్ముడు దేవుడై యున్నాడు. అపొస్తలుల కార్యములు 5:3-5 అప్పుడు పేతురు –అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.
పరిశుధ్ధాత్ముడు తండ్రితోను కుమారునితోను సమానుడై యున్నాడు. 2 కొరింథీయులకు 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక. పౌలు తన పత్రికలన్నింటినీ ఆశీర్వాదంతో ముగించాడు. అయితే, త్రిత్వానికి చెందిన ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావించిన ఏకైక పత్రిక ఇది. పౌలు ఇక్కడ త్రిత్వానికి చెందిన ప్రతి వ్యక్తి యొక్క పనిని ఒక పదంతో సంక్షిప్తపరచియున్నాడు. యేసు యొక్క పనిని సంక్షిప్తముగా చెప్పడానికి పౌలు ఇక్కడ ఉపయోగించిన పదం “కృప“. ఈ లేఖలో పౌలు యేసు యొక్క కృపను గూర్చి చెప్తూ: “మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను” (2 కొరింథీయులకు 8:9) అని తెలియజేస్తూవున్నాడు. తండ్రియైన దేవుని యొక్క పనిని సంక్షిప్తముగా చెప్పడానికి పౌలు ఇక్కడ ఉపయోగించిన పదం “ప్రేమ“. ఈ తండ్రియైన దేవుని యొక్క ప్రేమను గూర్చి పౌలు చెప్తూ: రోమా 5:8లో “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచు చున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని తెలియజేస్తూ వున్నాడు. పరిశుధ్ధాత్ముని యొక్క పనిని సంక్షిప్తముగా చెప్పడానికి పౌలు ఇక్కడ ఉపయోగించిన పదం “సహవాసము“. పరిశుధ్ధాత్ముని యొక్క సహవాసమును గూర్చి పౌలు చెప్తూ: (1 కొరింథీయులకు 12:3 ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను) అను మాటల ద్వారా ఆత్మయే మనలను యేసుతో సహవాసంలోకి మరియు తద్వారా ఒకరితో ఒకరి సహవాసంలోకి తీసుకు వస్తూవుంది. సువార్త ద్వారా పనిచేసే ఆత్మయే కొరింథీయులను అన్యమతం నుండి బయటకు తీసుకువచ్చి, వారిని క్రైస్తవ సహవాసంగా ఏర్పరచింది మరియు ఆ సహవాసాన్ని కొనసాగించగలిగేది ఆత్మ మాత్రమేనని పౌలు తెలియజేస్తూవున్నాడు.
ఆయన దేవునికి మాత్రమే చెందియున్న పేర్లను గుణలక్షణములను కలిగియున్నాడు. కీర్తనలు 139:7,8 నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమున కెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నరకంలోని ప్రజలు దేవుని దయగల ఉనికిని అనుభవించనప్పటికీ, నరకంలో ఉన్నవారు కూడా నరకానికి యజమాని సాతాను కాదని ప్రభువు అని గుర్తిస్తారు. ఆయన అంతటను వున్నాడు. యోబు 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఆదికాండము 1:1-3; యోహాను 1:1-3లో పరిశుద్ద్ద త్రిత్వము యొక్క ముగ్గురు వ్యక్తులు సృష్టి పనిలో ఆక్టివ్ గా వున్నారని తెలియజేస్తూవున్నాయి. ప్రత్యేకంగా ఈ వచనంలో ఎలీహు పరిశుద్ధాత్మ సృష్టి పనిలో చురుకుగా ఉన్నట్లు వక్కాణిస్తూవున్నాడు. ఈ వచనంలో “శ్వాసము” అనే మాట “ఆత్మ“ని ఉద్దేశించి చెప్పబడింది.
పరిశుధ్ధాత్ముడు సువార్త ద్వారా మన హృదయాలలో విశ్వాసమును కలుగజేస్తాడు. తీతుకు 3:4-7 మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. 5వ వచనంలో పౌలు సువర్తనంతటిని సంక్షిప్తముగా సంగ్రహపరచియున్నాడు. పౌలు ప్రకటిస్తూవున్న సువార్త రక్షణకు సంబంధించిన సందేశం. ఇక్కడ తండ్రిని “మన రక్షకుడు” అని పిలవడం గమనార్హమైనది. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా “మన రక్షకుడు” అని పేర్కొనబడియున్నాడు. మరియు పరిశుద్ధాత్మ “యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెనని పేర్కొనబడి యున్నాడు. సువార్త యొక్క దేవుడు, రక్షించే దేవుడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ – ఏకైక నిజమైన దేవుడై యున్నాడు.
పాపి “రక్షణ” అనే దేవుని ఈ అద్భుతమైన బహుమతిని ఎలా పొందుకోగలడు? “అందుకు యేసు నీకొదేముతో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా ననెను“, యోహాను 3:3. ఒక వ్యక్తి మళ్లీ ఎలా పుట్టగలడు అని అయోమయంలో ఉన్న నీకొదేముతో, “యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యోహాను 3:5). పౌలు తీతుకు వ్రాస్తూ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను (తీతుకు 3:5) అని తెలియజేస్తూ వున్నాడు. ఇది పరిశుద్ధ బాప్తిస్మములో జరిగే “వాషింగ్” (స్నానము), దీని ద్వారా మన పాపాలు కడిగివేయబడతాయి, (అపొస్తలుల కార్యములు 22:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను). మనలను రక్షించే “వాష్”. (1 పేతురు 3:21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే). “క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు” (గలతీ3:27). బాప్తిస్మము మనల్ని క్రీస్తుతో విశ్వాస-సంబంధంలోకి తీసుకువస్తుంది. ఇది పునర్జన్మ, ఆధ్యాత్మిక జీవితాన్ని తెస్తుంది. విశ్వాసం ద్వారా దేవుడు మనలో కలిగించిన పునర్జన్మ “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను” (2 కొరింథీయులు 5:17). ఇదంతా పరిశుద్ధాత్మ యొక్క పని, దేవుడు “మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనపై సమృద్ధి గా కుమ్మరించాడు.” యేసు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేశాడు (యోహాను 15:26; 16:7; అపొస్తలుల కార్యములు 1:5). ఆయన పెంతెకొస్తు రోజున దీన్ని చేసాడు మరియు బాప్తిస్మములో, ప్రభువు రాత్రి భోజనంలో, నిజానికి, సువార్త ప్రకటింపబడినప్పుడల్లా చేస్తూనే ఉంటాడు.ఎఫెసీయులకు 3:15-19 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ఆయన మనలను విశ్వాసము నందుంచి సత్క్రియలు చెయ్యడానికి మనలను పురికొల్పుతాడు. గలతీ 5:24-25 ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు. మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.