సృష్టి ప్రారంభములోనే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మానవుల హృదయాలలో లిఖించియున్నాడని నేను నమ్ముతున్నాను. మానవుని మనఃసాక్షి ఆ ధర్మశాస్త్రమును గురించి సాక్ష్యమిస్తూవుంది (దీనిని స్వాభావికమైన ధర్మశాస్త్రము అని అంటారు). దేవుని ధర్మశాస్త్రమునకు సాక్ష్యముగా ప్రతి వానిలో ఒక స్వరముగా ఉండులాగున ప్రతి వ్యక్తికి దేవుడు మనఃసాక్షిని యిచ్చియున్నాడు. రోమా 2:14,15, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని గూర్చిన జ్ఞ్యానము పాపమునుబట్టి మానవుని హృదయములో కలుషితమయ్యింది. జనులు విస్తరించుట ఆరంభమైనప్పుడు ఒకని మనఃసాక్షి పాపమును బట్టి మొద్దుబారుటచే అతడు పాపము చేయునపుడు అది అతనిని ఏ మాత్రమును బాధించకపోవుటను బట్టి (మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, రోమా1;21,22; వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి, ఎఫెసీ 4:18,19) అట్లే ఒకని మనఃసాక్షి దేవుని వాక్యము పాపమని చెప్పని దానిని కూడా పాపమని వానికి చెప్తూ వుండుటను బట్టి (రోమా 14:2) ఒకని మనఃసాక్షి సంపూర్ణముగా ఆధారపడ తగినది కాకుండా పోయింది. అలాంటి పరిస్థితులలో ప్రజలందరూ దేవుని చిత్తమేమైయున్నదో పరిపూర్ణముగా  యెరుగునట్లు దేవుడు తన ధర్మశాస్త్రమును బైబులు నందు లిఖియింపజేయుట ద్వారా దానిని రెండవసారి నిర్దిష్టమైన రీతిలో దయచేసాడు (దీనినే లిఖియింపబడిన ధర్మశాస్త్రము అని అంటారు).

ద్వితీయోపదేశకాండము 10:4 ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలనుమునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను. మత్తయి 5:48 పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును (ప్రతిఒక్కరును) పరిపూర్ణులుగా (ఉండులాగున) ధర్మశాస్త్రము దయచేయబడింది. దేవుని ధర్మశాస్త్రము మన మాటలలో తలంపులలో క్రియలలో పరిపూర్ణతను కోరుతూ వుంది. పాపము చేయువారందరిని ధర్మశాస్త్రము ఖండిస్తూ వుంది.

రోమా 7:7-24 కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని (ఆజ్ఞ ద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము నకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసికొని (ఆజ్ఞ ద్వారా) నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయు చున్నాను. ఇచ్ఛయింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిచేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడు చున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

యాకోబు 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల (తొట్రిల్లిన యెడల), ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. కాబట్టి ఏఒక్కరు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా నెరవేర్చి రక్షింపబడలేరు. రోమా 3:20 ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

దేవుని ధర్మశాస్త్రము మన పాపాల్ని మనకు చూపెట్టడానికి సహాయపడుతూ పాపాన్ని బట్టి వచ్చు దేవుని కోపాన్ని బట్టి మనలను హెచ్చరిస్తూ మన క్రైస్తవ జీవితములో మనలను నడిపిస్తూవుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేత తమ నడతలను శుద్దిపరచుకోవలసియున్నారు కీర్తన 119:9.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.